జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Tuesday, October 12, 2010

‘నంది’లో మోసం జరిగిందా ? ‘మగధీర’లోది ఉత్తమ నటనేనా ?

మన ఆంధ్ర్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారు తెలుగు సినిమాలకు ఏటేటా ఇచ్చే నంది అవార్డులు వివాదాస్పదం కావడం, విమర్శలు రావడం కొత్తేమీ కాదు. 2009వ సంవత్సరానికి గాను ఈ మధ్యే ప్రకటించిన అవార్డులు కూడా అందుకు మినహాయింపు కాలేదు. మిగిలినవాటి మాటెలా ఉన్నా ఉత్తమ నటుడు అవార్డుకు దాసరి నారాయణరావు ('మేస్త్రీ' చిత్రం)ను ఎంపిక చేయడంపై కొన్ని వర్గాల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి.

'మగధీర' చిత్రం ఏకంగా 9 అవార్డులు గెలుచున్నా అందులోని హీరో రామ్ చరణ్ తేజ్ ను ఉత్తమ నటుడిగా తీర్మానించకుండా, ప్రత్యేక జ్యూరీ అవార్డుతో సరిపెట్టారేమిటని ఆ వర్గంలోని వారు నిలదీస్తున్నారు. దీని వెనుక దాసరి కుట్ర ఉందనేది వారి వాదన. దానిపై ఇప్పటికే మాటకు మాట సమాచార సాధనాల్లో వస్తూనే ఉంది.

ఇది ఇలా ఉండగా, గడచిన పక్షం రోజులుగా విదేశాల్లో ఉన్న పి.ఆర్.పి. అధ్యక్షుడు చిరంజీవి సొంతగడ్డకు తిరిగొచ్చారు. ఆయన వచ్చీరాగానే, సహజంగానే విలేఖరులు ఈ నంది అవార్డుల ప్రశ్న అడిగారు. దానికి చిరంజీవి మాత్రం చాలా కూల్ గా, జనరంజకత్వం కోసం 'మగధీర' చిత్రం తీశామనీ, ఆ చిత్రం తెలుగులో బాక్సాఫీసు రికార్డులన్నిటినీ బద్దలు కొట్టిందనీ పేర్కొన్నారు. నంది అవార్డు కన్నా ఈ ప్రజాదరణే ముఖ్యమైనదని వ్యాఖ్యానించారు. త్వరలో నటించనున్న 150 వ చిత్రానికి తగ్గట్లుగా ఒళ్ళు తగ్గించుకోవడం కోసం విదేశాలకు వెళ్ళిన చిరంజీవి మొత్తానికి లౌక్యంగా జవాబిచ్చి తప్పించుకున్నారు.

అవార్డు ఎంపిక సరైనదే అని కానీ, కాదని కానీ నేను అదాటున ఓ నిర్ణయానికి వచ్చేయ దలుచుకోలేదు. తెర వెనుక ఏం జరిగిందన్నది తెలిస్తే కానీ, ఓ నిర్ణయానికి రాలేం. అయితే, ఒకటి మాత్రం నిజం. నా మటుకు నన్ను అడిగితే, 'మగధీర' జనాదరణ పొందిన చిత్రం. సాంకేతికంగా చక్కగా రూపొందించిన చిత్రం. అయితే, అన్ని రకాల సాంకేతిక విభాగాలకూ పేరు వచ్చి, సినిమాకు అవార్డులొచ్చినంత మాత్రాన అందులో నటించిన వ్యక్తి సైతం ఉత్తమ నటుడు కావాలని నియమం ఎక్కడైనా ఉందా. లేదు కదా.

పైగా, 'మగధీర'లో రామ్ చరణ్ తేజ్ నటన తొలి చిత్రం 'చిరుత' కన్నా మెరుగ్గా ఉందే తప్ప, ఉత్తమ నటుడికి సరిపడా మెరుగైందా అంటే ఆలోచించాల్సిందే. వివిధ విభాగాల కృషితో సినిమా ఉత్తమంగా నిలబడడం వేరు. ఉత్తమ నటన వేరు. ఆ రెంటినీ కలిపి చూస్తేనే కన్ ఫ్యూజన్. ఆ సంగతి మనవాళ్ళు గ్రహించాలి. లేదంటే, ఇలాంటి విమర్శలే వస్తాయి. ఇలా అన్నంత మాత్రాన నేనేదో దాసరి "మేస్త్రీ" ఎంపికను ఏకపక్షంగా సమర్థిస్తున్నానని పొరపాటు పడకండి. ఏమైనా, ఇప్పటికి మాత్రం - కొవ్వు కరిగించుకొని, ఒళ్ళు తగ్గి వచ్చిన చిరు తన 150వ చిత్రంలో ఉత్తమ నటన చూపుతారేమో ఎదురుచూడాలి. అభిమానులమంతా దాని కోసమే నిరీక్షిస్తున్నాం.

Saturday, October 9, 2010

ఖలేజా: సరదా డైలాగుల జోరు - సవ్యంగా సాగని కథనమే బేజారు!


(‘‘ఖలేజా: కథాంశం మంచిదే... కథనమే.... ’’- పార్ట్ 2)

నిజానికి, మహేశ్ - త్రివిక్రమ్ ల కాంబినేషన్ లోని ‘ఖలేజా’ చిత్ర కథకు తీసుకున్న ‘దైవం మానుష రూపేణ’ అన్న అంశం మంచిదే. సాటి మనిషిని కాపాడాలంటే, దేవుడు కానక్కర లేదు. మంచి మనసున్న మనిషిలోనే దేవుడుంటాడు. తన కోసం కాక, సాటి వారి బాగు కోసం ఆ మనసుతో ఆలోచిస్తే, అనుకున్నదల్లా అవుతుంది. అప్పుడలా ఆ మనిషే దేవుడన్నది ఈ సినిమాలో చెప్పదలుచుకున్న సారాంశంగా కనిపిస్తుంది.

బాగోగులు ఏమిటంటే...

ఈ విషయాన్నే వీలైనంత వినోదాత్మకంగా చెప్పాలని దర్శక - రచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రయత్నించారు (ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం - అన్నీ ఆయనవే). అంతవరకు బాగానే ఉంది. అందుకే, ఈ సినిమాలో హీరో పాత్రచిత్రణ, ప్రవర్తన, హీరోయిన్ తో ఎదురయ్యే సంఘటనలు, చుట్టుపక్కలి పాత్రలు - అన్నీ వినోదమే కేంద్రంగా నడుస్తుంటాయి. అది వినోదానికి బాగా ఉపకరించినా, విషయానికి వచ్చే సరికి - చివర కాసేపు తప్ప, మిగిలిన చోట్ల కూడా సీరియస్ విషయం కూడా సరదా బాటలో పడి గాడి తప్పినట్లనిపిస్తుంది.

అలాగే, మనిషిలోని దేవుడి తత్త్వాన్ని ప్రభావశీలంగా చెప్పాలని రెండు, మూడు సన్నివేశాల్లో ప్రయత్నించారు (ఉదాహరణకు, హీరో తన కోసం 10 రూపాయలు అడిగితే ఎవరూ ఇవ్వరు కానీ, మరొకరి కోసం 10 అడిగితే 100 రూపాయలు రావడం లాంటివి). కానీ, అవి విజువల్ గా ఆశించిన ఇంప్యాక్ట్ ఇవ్వలేదు. ఫలితంగా ఆ వాదనతో ప్రేక్షకులు కన్విన్స్ కావడం కొద్దిగా కష్టమే.

పాత్రలు - పాత్రధారుల పనితనం ఎలా ఉందంటే...

అందంలో, అభినయంలో ఎప్పుడూ మార్కులు పడే మహేశ్ ఎప్పటిలానే చక్కగా నటించారు. కష్టపడి ఫైట్లు చేశారు. ఎప్పుడూ హుందాగా, తక్కువ మాటలు, ఎక్కువ భావప్రకటన ధోరణిలో వెళ్ళే మహేశ్ ఈ సినిమాలో ఎన్నడూ లేనంత ఎక్కువగా మాట్లాడతారు. ఈ మధ్య కాలంలో మహేశ్ ఇంతగా డైలాగులు చెప్పిన సినిమా బహుశా ఇదే కావచ్చు.

దర్శక - రచయిత సృష్టించిన ఈ తరహా పాత్ర కోసం త్రివిక్రమ్ సారథ్యంలో మహేశ్ తన శారీరక భాషను సమర్థంగా మార్చుకున్నారు. పూర్తి వినోదభరితమైన పాత్రచిత్రణతో మహేశ్ ను తెరపై ఇలా చూపడం ఇదే మొదటిసారి. ఈ రకం నటన అటు మహేశ్ కూ, ఇటు ఆయన అభిమానులకూ కొత్త అనుభవమే. కానీ, ఆ పాత్రే అటు హాస్యం, ఇటు రౌద్రం, మధ్యలో ప్రేమ - అన్నీ చూపెడుతూ వస్తుంది. దాంతో, కథను నడిపే భారమంతా ఆ పాత్ర మీదే పడింది.

ఐరన్ లెగ్ అమ్మాయి పాత్ర హీరోయిన్ అనూష్కది. ఫస్టాఫ్ కామెడీకీ, సినిమాలో పాటలకీ పనికొచ్చే పాత్ర. అంత వరకూ ఆమె ఓ.కె. ఉపాసనతో జోస్యం చెప్పగల ఊళ్ళోని పెద్దాయన పాత్రలో రావు రమేశ్ నటన, వాచికం బాగున్నాయి. ఇదే ఛాయలతో ఉండే పాత్రను ఆయన గతంలో మగధీర (2009)లో బాగా పండించిన సంగతి తెలిసిందే. సిద్ధయ్య పాత్రలో షఫీ బాగా చేశారు. కానీ, మాటి మాటికీ అతనితో హర హర మహాదేవ్ అని పలికించడం కొన్ని చోట్ల అవసరాన్ని మించిపోయిందేమో అనిపిస్తుంది.

జెమినీ టీవీలో కార్యక్రమాల డైరెక్టర్ బాబ్జీగా సునీల్, చెట్లు - కాయల గురించి పరిశోధన చేసే టామ్ క్రూజ్ గా అలీ, లాయర్ మిరియం గా బ్రహ్మానందం సినిమాలో వినోదం పంచుతారు. అయితే, ‘మర్యాద రామన్న’ బిజీలోనో ఏమో, సినిమా సగమైనా కాక ముందే సునీల్ పాత్రను ముగించాల్సి వచ్చినట్లుంది. లాయర్ మిరియంగా బ్రహ్మానందాన్ని కూడా మూడు, నాలుగు సీన్లకే పరిమితం చేశారు. సినిమా మూడొంతులు అయిన దగ్గర నుంచీ క్లైమాక్స్ ముందు వరకు కనిపించేది ఒక్క అలీయే. కానీ, అతనికీ, హీరోకూ అంత సన్నిహిత సంబంధం ఎందుకో, హీరోతో కలసి అతనెందుకు చివరి దాకా తిరుగుతాడో తెలియదు. కమెడియన్ ఎం.ఎస్. నారాయణ ఒకే సీన్ లో మెరిసి మాయమవడాన్ని బట్టి చూస్తే, చిత్రీకరణ ముగిశాక ఎడిటింగ్ కత్తెరకు బాగానే పని పడ్డట్లు అర్థమవుతుంది.

విలన్ ప్రకాశ్ రాజ్ కూడా క్లైమాక్స్ లో గొంతు చించుకు అరవడం, భయం నటించడం తప్ప చేసిందేమీ లేదు. పైగా, రూపురేఖల్లో చాలా తేడా వచ్చిన ప్రకాశ్ రాజ్ మునుపటి ఆకర్షణను కోల్పోయారు. ఆయనను చూడడం కూడా ఇబ్బందిగానే అనిపిస్తుంది. తనికెళ్ళ భరణి, సుబ్బరాజు, కోట శ్రీనివాసరావు, ధర్మవరపు తదితరుల పాత్రలన్నీ ప్యాడింగ్ కే తప్ప, పెద్దగా చేసేదేమీ లేదు.

సినిమాను నిలబెట్టే డైలాగులు ఏవంటే...

ఈ సినిమాలో ప్రధానంగా చెప్పుకోదగ్గవి కూడా త్రివిక్రమ్ శైలి సంభాషణలే. కొన్ని చోట్ల డైలాగ్స్ బాగా పేలాయి. అయితే, మరికొన్ని చోట్ల అర్థమయ్యీ కాకుండా వేగంగా చెవులు దాటి వెళ్ళిపోతాయి. ‘మీ పేరు’ అని హీరోయిన్ అడిగితే - ‘జెమినీ టి.వి’ అనీ, ‘ఏం చేస్తుంటారు’ అంటే - ‘బాబ్జీ’ అనీ సునీల్ తో డైలాగ్స్ చెప్పించడం మీడియా మనుషుల ఖంగాళీతనానికి త్రివిక్రమ్ మార్కు చురక. ‘‘8,950కి రౌండ్ ఫిగర్ 9 వేలు కదా’’ అని హీరోయిన్ అంటే, ‘‘10000లో రౌండ్లు ఎక్కువ కదండీ’’ అని హీరో చెప్పడం లాంటివి బాగా నవ్విస్తాయి. ‘‘వినపడక అడుగుతున్నావా, లేక అర్థం కాక అడుగుతున్నావా’’ అని హీరో అంటే, ‘‘కాదు. తెలియక అడుగుతున్నాను సార్’’ అని బ్రహ్మానందం అనడం ఫక్కున నవ్వు తెప్పిస్తుంది.

గ్రామాన్ని కాపాడే దేవుడు ఎలా ఉంటాడో పెద్దాయన వర్ణించే ఘట్టంలో ‘‘...నేల ఒళ్ళు విరుచుకుంటుంది సిద్ధా. గాలి హోరుమంటుంది...’’, ‘‘...ఎవడు చూస్తే భయం చస్తుందో, ఎవణ్ణి చూస్తే ధైర్యం వస్తుందో...’’ లాంటి డైలాగులు సన్నివేశంలో గాఢతను పెంచాయి. ‘‘నీ నవ్వు వరం. నీ కోపం శాపం. నీ మాట శాసనం’’ అంటూ దేవుడిగా కొలిచే హీరో గురించి సిద్ధ చెప్పే మాటలు తూటాల్లా దూసుకుపోతాయి. ‘‘అద్భుతం జరిగేటప్పుడు ఎవరూ గుర్తించరు. అద్భుతం జరిగిపోయాక ఎవరూ గుర్తించాల్సిన అవసరం లేదు’’ (హీరోతో రావు రమేశ్) లాంటి కొన్ని భావస్ఫోరకమైన సంభాషణలూ ఉన్నాయి.

అలాగే, ఎప్పుడూ మరింత క్లాస్ టచ్ తో నడిచే త్రివిక్రమ్ సంభాషణలు ఈ సినిమాలో కొన్నిచోట్ల ఎందుకనో కిందకు దిగి, మాస్ రంగును పులుముకున్నాయి. హీరో పోషించినది ట్యాక్సీ డ్రైవర్ పాత్ర కావడం అందుకు కారణమని సరిపెట్టుకోవాలేమో. మొత్తం మీద డైలాగ్ కామెడీ మీద ఎక్కువగానే ఆధారపడ్డారు. జల్సా చిత్రంలో లాగానే, ఇందులో కూడా హీరో, కమెడియన్ల మద్యపాన హాస్య సన్నివేశాన్ని త్రివిక్రమ్ మళ్ళీ పెట్టారు.

సాంకేతిక విభాగాల శ్రమ ఏమిటంటే...

పాటల సంగతికొస్తే - తెరపై కన్నా విన్నప్పుడే బాగున్నాయి. పైగా, ఒకటి రెండు మినహా మిగిలినవన్నీ కథాగమనానికి అడ్డంగా వచ్చి, విసిగిస్తాయి. ‘‘ఆరు పాటలు సిద్ధం చేసుకున్నారు కదా అని, ఎక్కడబడితే అక్కడ అతికించేయడమేనా’’ అని ఓ సగటు ప్రేక్షకుడు వాపోయాడు. విన్నప్పుడు బాగున్న ‘పిలిచే పెదవుల పైన...’ పాట కూడా సినిమాలో చరణాలకొచ్చేసరికి మెరుపు కోల్పోయింది. రాజు సుందరం నృత్య దర్శకత్వం వహించిన ‘ఓం నమో శివ రుద్రాయ...’ పాటలోని సాహిత్య గాంభీర్యం కూడా దృశ్యాల్లో అడపా దడపా వస్తూ, పోవడమే తప్ప, నిలకడగా కనిపించదు. పాటల నృత్యపరికల్పన (రాజు సుందరం, ప్రేమ్ రక్షిత్ వగైరా) ఫరవా లేదే తప్ప, చిరస్మరణీయం కాలేకపోయింది.

అయితే, చిత్ర నిర్మాణ విలువలు, విజువల్స్ పరంగా మాత్రం సినిమాకు వంక పెట్టలేం. చూస్తున్నంత సేపు తెర నిండుగా, కనువిందుగా దృశ్యాలున్నాయి. కెమేరా (యశ్ భట్ తో పాటు 'అతడు' చిత్ర ఫేమ్ కె.వి. గుహన్, 'హమ్ తుమ్' చిత్ర ఫేమ్ సునీల్ పటేల్ కూడా పనిచేశారు), ఎడిటింగ్ (శ్రీకర్ ప్రసాద్), ఫైట్లు (పీటర్ హెయిన్స్, రామ్ - లక్ష్మణ్), సౌండ్ మిక్సింగ్ (సౌండ్ ఇంజనీర్ పి. మధుసూదన రెడ్డి)అన్నీ బాగున్నాయి. ముఖ్యంగా రాజస్థాన్ లోని దృశ్యాలు బాగా వచ్చాయి. గ్రాఫిక్స్ (పిక్స్ లాయిడ్ సంస్థ)కూడా ఎక్కువగానే వాడారు. అయితే, హీరో పరిచయ ఘట్టంలో మహేశ్ చేతిలో కనిపించే పాము గ్రాఫిక్స్ మాత్రం బొమ్మ పాము కన్నా ఘోరంగా ఉంది.

చిత్ర ప్రారంభం, ఇంటర్వెల్ ఘట్టం లాంటివి బాగున్నాయి. కొన్ని చోట్ల దర్శకుడి ముద్రా ప్రత్యేకంగా కనిపిస్తుంది. మొత్తం మీద చూస్తే మాత్రం - తీసుకున్న ఇతివృత్తాన్ని బలంగా చెప్పేలా కథనాన్ని నడిపించ లేదని అనిపిస్తుంది. కాలక్షేపానికి సినిమా ఫరవాలేదని అనిపించినా, కథలోని ఆత్మ మాత్రం కనిపించీ, కనపించకుండా తచ్చట్లాడుతుంటుంది. అందుకే ఈ సినిమా మీద ప్రేక్షకులందరూ ఏకాభిప్రాయం వ్యక్తం చేయలేకపోతున్నారేమో అనిపిస్తుంది. ఏతావతా, త్రివిక్రమ్ గత చిత్రాలతో పోలిస్తే - ‘ఖలేజా’ యావరేజే.

కొసమెరుపు - అన్నట్లు ఈ సినిమా పేరు వట్టి ‘ఖలేజా’ కాదు. ‘మహేశ్ ఖలేజా’. అదేమిటంటారా. ఈ 16 రీళ్ళ 2.45 – 2.50 గంటల సినిమాస్కోప్ చిత్రం ఆ పేరు మీదే సెన్సారైంది. బహుశా, ‘ఖలేజా’ టైటిల్ ఎవరిదన్న దాని మీద వివాదం జరుగుతుండడంతో, ఎందుకైనా మంచిది లెమ్మని ముందుచూపుతో ‘మహేశ్ ఖలేజా’ అని పేరు నమోదు చేసి, ఆ పేరుతోనే సెన్సార్ చేయించినట్లున్నారు. ఫలితంగా, రికార్డుల సృష్టి ఆశ లేని ఈ సినిమా పేరు రికార్డు పుస్తకాల్లో మాత్రం - ‘మహేశ్ ఖలేజా’.

Friday, October 8, 2010

‘ఖలేజా’: కథాంశం మంచిదే... కథనమే....


ఏ సినిమా ఎవరికి ఎందుకు నచ్చుతుందో, ఎందుకు నచ్చదో చెప్పడం అంత సులభం కాదు. అయితే, సమూహ వీక్షక అనుభవమైన సినిమా - చూసేవారిలో ఉమ్మడిగా ఓ అనుభూతిని కలిగించాలి. ఆ అనుభూతి ఎంత బలమైనదైతే, ఎంత సామూహికమైనదైతే జనం అభిప్రాయం కూడా అంత బలంగా, అంత ఉమ్మడిగా ఉంటుంది. అలా కానప్పుడు ఎవరి అనుభూతి వారిది. ఎవరి అభిప్రాయం వారిది. ఓ సినిమా గురించి భిన్నాభిప్రాయాలు వచ్చేది అలాంటి సందర్భంలోనే. ‘ఖలేజా’ అందుకు తాజా ఉదాహరణ.

కథ ఏమిటంటే...

దాదాపు రెండేళ్ళ పైగా సెట్స్ పై ఉన్న ‘ఖలేజా’లో అంశం చిన్నది. దాని వివరణ 16 రీళ్ళ పెద్దది. ఆంధ్రప్రదేశ్ లోని పాలి అనే ఓ గ్రామంలో జనం కారణం ఏమీ లేకుండానే పిట్టలు రాలినట్లు రాలిపోతుంటారు. ఆ నెలలో 20 మంది మట్టి కలిసిపోతారు. ఆ గ్రామాన్ని కాపాడాలంటే - 28 ఏళ్ళ క్రితం పుష్యమీ నక్షత్రంలో పుట్టిన ఫలానా లాంటి యువకుడి వల్ల అవుతుందని ఉపాసకుడైన ఆ ఊరి పెద్దాయన (రావు రమేశ్) చెబుతాడు. మండలం (48) రోజుల్లో ఆ యువకుణ్ణి తెమ్మని సిద్ధుణ్ణి పంపిస్తాడు.

హైదరాబాద్ లో ట్యాక్సీ డ్రైవర్ అయిన జి. సీతారామరాజు అలియాస్ రాజు (మహేశ్) ఓ పని మీద రాజస్థాన్ వస్తాడు. కనుచూపు మేరలో మనిషి కనిపించక, ఊరు వెతుక్కుంటూ అక్కడికే కథానాయిక సుభాషిణి (అనూష్క) వస్తుంది. హీరో ఆ ఊరు రావడానికీ, ఆమె కూడా అనుకోని పరిస్థితుల్లో ఆ ఊరులో తప్పిపోవడానికీ చిన్న చిన్న ఫ్లాష్ బ్యాక్ లింకులుంటాయి.

ఆమెను కూడా తీసుకొని తెలుగు నేలకు తిరిగి వద్దామని హీరో యత్నిస్తున్న సమయంలో దుండగుల చేతిలో తీవ్రంగా గాయపడతాడు. అదే క్రమంలో తమ గ్రామాన్ని కాపాడే దేవుడు ఆ హీరోయే అని పంచభూతాల సంకేతాలతో సిద్ధుడు గ్రహిస్తాడు. అక్కడికి సరిగ్గా మండలం పూర్తవుతుంది. ఫస్టాఫ్ ముగుస్తుంది.

ఆ హీరోనూ, హీరోయిన్ నూ తన వెంట గ్రామానికి తీసుకెళ్ళి, కాపాడతాడు సిద్ధుడు. తేరుకున్న హీరోను ఊరి జనమంతా దేవుడు అంటూ ఉంటారు. తాను దేవుణ్ణి కాదు మొర్రో అంటూ ఉంటాడు హీరో. అలా కథ ముందుకు వెళ్ళి, ఆ గ్రామానికి పట్టిన పీడ ఏమిటి, ఆ గ్రామాన్ని సమూలంగా తుడిచిపెట్టేయడం వల్ల ఎవరికి వచ్చే లాభం ఏమిటి, మధ్యలో ఈ రాజస్థాన్ పిట్టకథేమిటి - లాంటి అంశాలన్నీ ఒక్కొక్కటిగా ద్వితీయార్ధంలో ప్రేక్షకుల ముందుకు వస్తాయి. ఆఖరికి చెడు మీద మంచి విజయంతో కథ ముగుస్తుంది.

కథాకథనం ఎలా సాగిందంటే...

ప్రథమార్ధంలో జరిగే కథ కొంచెమే అయినా, మున్ముందు కథలో వచ్చే ఘట్టాలకు లీడ్స్ కనిపిస్తాయి. సరదా సంభాషణలు, సన్నివేశాల సమాహారంగా సినిమా నడుస్తుంది. అసలు కథంతా ద్వితీయార్ధంలోనే. అయితే, అందులో అసలు పాయింట్ ఆఖరికి కానీ రాదు. జనం చనిపోతుండడానికి కారణం, కారకులు, దానికి హీరో పరిష్కార ప్రయత్నం సినిమా చివరి మూడు నాలుగు రీళ్ళలో కానీ చెప్పరు.

దాంతో, చివరి వరకు అసలు కథేమిటన్నదానిలో సస్పెన్స్ కన్నా అర్థం కావడం లేదన్న కన్ ఫ్యూజనే ప్రేక్షకులకు ఎక్కువుంటుంది. దేవుడనే జనం, దేవుణ్ణి కాదనే హీరోల మధ్య చర్చతోనే చాలా సేపు గడిచిపోయినట్లనిపిస్తుంది. సమస్యను పరిష్కరించడానికి తానుగా ముందుకొచ్చే నాయక పాత్రల సినీ కథలకు అలవాటు పడ్డ జనసామాన్యానికి ఇది విచిత్రమనిపిస్తుంది. సమస్యను పరిష్కరించాల్సిన హీరోయే దానికి దూరంగా పారిపోవడం ఏమిటని ఓ చిన్న అసంతృప్తి కలుగుతుంది. ముఖ్యంగా టైటిల్స్ కు ముందు వచ్చే ఘట్టం మిస్ అయితే, కథానేపథ్యం అర్థం కావడం మరింత కష్టమవుతుంది.

సమస్యే తప్ప, సమస్యకు కారకులైన జి.కే. వాళ్ళ (ప్రకాశ్ రాజ్ వగైరా)తో హీరో ముఖాముఖి పోరాటం ఒకే ఒక్కసారి, అదీ క్లైమాక్స్ లో కానీ రాదు. దాంతో, మంచి, చెడుల మధ్య ఘర్షణలో మంచి ఎలా గెలిచిందనే ఉత్కంఠభరిత ప్రయాణం చప్పగా ముగిసిపోయినట్లు అనిపిస్తే అది ప్రేక్షకుల తప్పు కాదు.

(మిగతా భాగం ఇంకాసేపట్లో...)

‘ఖలేజా’లో ఆనవాయితీ తప్పింది

సినిమా విడుదలైనా, ఆ సినిమా ప్రత్యక్షంగా చూసేదాకా కథ, కథనాల గురించి తెలుసుకోకపోవడం నా అలవాటు. కథ, అవతలి వాళ్ళ అభిప్రాయం తెలిసిపోతే, ముందుగానే ఓ మూస అభిప్రాయంతో వెళ్ళి సినిమాను చూసే ప్రమాదం ఉంది. దానివల్ల మన సొంత అభిప్రాయాలు, ఆలోచనలపై వాటి ప్రభావం పడే ఇబ్బంది ఉంది. ముఖ్యంగా ఆ సినిమా గురించి మనం ఏదైనా రాయాల్సి వచ్చినప్పుడు అదీ మరీ ఇబ్బంది. తప్పో, ఒప్పో - అది నా సొంత అభిప్రాయం. అయితే, అనుకోకుండా ఈసారి ఆ ఆనవాయితీ తప్పింది.

‘రోబో’ వాణిజ్య హంగామా నడుమ వస్తున్న చిత్రంగా ‘ఖలేజా’ మీద అందరి లాగే ఆఫీసులోనూ ఆసక్తి హెచ్చింది. ‘ఖలేజా’ విడుదలైన రోజున ఆఫీసు పనిలో ఉండగా, అందులో భాగంగా ఓ ఉద్యోగి వచ్చి, సినిమా గురించి నెగటివ్ వార్తను నలుగురితో చెప్పాడు. అసలు సంగతి కనుక్కోమన్న ఆఫీసు మిత్రుల పోరుతో, మరో మిత్రుడికి తప్పనిసరై ఫోన్ చేశా. కథ కాకపోయినా, సినిమా రిజల్ట్ పై అతని అభిప్రాయం అడిగి, విన్నా.

ఏ సినిమా వచ్చినా, ఆ యా కులాలు, ప్రాంతాలను బట్టి ఇలాంటి దుష్ప్రచారాలు జరగడం తెలుగు పరిశ్రమలో చాలా కాలంగా ఉన్న జాడ్యం. కళను కులంతో ముడిపెట్టి మాట్లాడే, చూసే అలాంటి జనాభా మీద జాలి పడడం తప్ప, చేయగలిగిందేమీ లేదు.

‘ఖలేజా’ మీద ప్రచారం కూడా అలాంటిదేనా? లేక నిజంగానే సినిమా తేడాగా ఉందా? ఏమో! రాత్రి సినిమాకు వెళ్ళినప్పుడు చూడాలి అనుకున్నా. అలాగే, ‘దైవం మానుష రూపేణ’ అనే ఇతివృత్తం చుట్టూ కథ తిరుగుతుందని అప్పటికే తెలియడం వల్ల అనుకోకుండానే ఓ ముందస్తు అభిప్రాయంతో సినిమాకు వెళ్ళా.

('ఖలేజా' పై రివ్యూ మరికాసేపట్లో...)

Thursday, October 7, 2010

చూసిన కొద్దీ చూడాలనిపిస్తుంది! త్రీ ఛీర్స్ టు త్రివిక్రమ్ ఖలేజా!!



గడచిన పదిహేను, ఇరవై రోజుల్లో టీవీలో రెండు హిట్ సినిమాలు కొద్దిగా, కొద్దిగా చూశా. యాదృచ్ఛికంగా రెండూ దర్శక - రచయిత ‘త్రివిక్రమ్’ శ్రీనివాస్ రూపకల్పనలే. ఒకటి - మహేశ్ బాబు నటించిన ‘అతడు’. రెండోది - పవన్ కల్యాణ్ నటించిన ‘జల్సా’. సెలవు రోజున మధ్యాహ్నం పూటో, రాత్రో ఇంటిలోనే ఉండి భోజనం చేస్తున్నప్పుడు టీవీ చానళ్ళు తిప్పడం నాకు అలవాటు. ఇంటిల్లపాదీ కూర్చొని, అన్నం తింటూ, ఆ కాసేపు టీవీ చానల్ ధర్మమా అని ఆ సినిమాలు చూశాము.

నిజానికి, ఆ రెండు సినిమాలూ నేను గతంలో థియేటర్లో చూసినవే, పత్రికల్లో రాసినవే. టీవీలో కూడా అడపా దడపా అదాటున కాసేపు కనిపించినవే. అయినా, సన్నివేశాల్లోని గాఢత నన్ను మరోసారి చూసేలా చేసింది. ఇంట్లో వాళ్ళు కూడా ఇప్పటికి ఏ పదో సారో అయినా సరే, గుడ్లప్పగించి చూస్తూ, సినిమాలోని సెంటిమెంట్, హాస్యాలను ఆస్వాదించడం గమనించాను.

ఉన్నమాట చెప్పాలంటే, ‘అతడు’ కానీ, ‘జల్సా’ కానీ మొదటిసారి చూస్తున్నప్పుడు ఫరవాలేదు బాగానే ఉన్నాయని అనిపించాయే తప్ప, ‘ఆహా, ఓహో’ అనో, పదే పదే చూసి ఆనందించగలమనో అనిపించలేదు. కానీ, తీరా ఇప్పుడు అందుకు భిన్నమైన అనుభవం ఎదురవుతుండేసరికి, నేను గతుక్కుమన్నాను. నేనే కాదు, నా లాగానే మా ఇంట్లోనూ, బయట చాలా మంది ఆ సినిమాలనూ, అందులోని దృశ్యాలనూ పదే పదే చూసి ఆనందించడం నన్ను ఆలోచనలోకి నెట్టింది.

ఒక సృజనాత్మక కృషి పదే పదే ఆస్వాదయోగ్యం అవుతుండడానికి కారణం ఏమై ఉంటుంది? ఆ కృషిని ఆ స్థితికి తీసుకువెళ్ళడానికి రూపకర్త పాటించిన పద్ధతి ఏమిటి? దీనికీ ఏదైనా ఫార్ములా ఉందా? ఇలా ఎన్నో ప్రశ్నలు.

ఈ ప్రశ్నలకు నాకొచ్చిన సమాధానమేమిటంటే - ఒక సన్నివేశాన్ని ఎన్నో రకాలుగా తెరపై చూపవచ్చు. చూసిన తక్షణమే ప్రేక్షకుడి నరనరాల్లోకీ అది ఎక్కేసేలా, ఒక విధమైన కిక్ వచ్చేలా చిత్రీకరించడం ఒక పద్ధతి. దీని వల్ల ప్రేక్షకుల్ని, ప్రధానంగా మాస్ ను ఆకర్షించవచ్చు. చూడగానే అబ్బో అనిపించవచ్చు. సర్వసాధారణంగా మాస్ చిత్రాల దర్శకులు అనుసరించే పద్ధతి ఇది. కానీ, ఆ ప్రభావం, ఫలితం ఆ క్షణానికే, ఆ కొద్ది రోజులకే. ఆ తరువాత ఆ ఘట్టాన్ని మళ్ళీ మళ్ళీ చూడాలని అనిపించదు. చూసినా తొలి సందర్శన నాటి కిక్ రాదు.

అలా లౌడ్ గానో, క్రూడ్ గానో కాకుండా అదే ఘట్టాన్ని వివిధ పాత్రల మధ్య సంఘర్షణగా, సున్నితమైన పద్ధతిలో తెరకెక్కించవచ్చు. ఆ రకంగా ఒక సన్నివేశాన్ని సంస్కారవంతమైన ధోరణిలో వేర్వేరు స్తరాలుగా చూపితే కలిగే ప్రభావం దీర్ఘకాలికమైనది. ఆ ఒక్క క్షణానికే కాకుండా, చూసిన ఒక్కొక్కసారీ ఆ సన్నివేశంలోని ఒక్కొక్క పొర ప్రేక్షకుడికి తెలిసి వస్తుంటుంది.

ఆ లోతులు అర్థమవుతున్న కొద్దీ సన్నివేశంలోని గాఢత పెరుగుతుంది. అందుకే, ప్రేక్షకుడికి తెలిసిన ఘట్టమే అయినా, ఆ సన్నివేశాలు చూసినకొద్దీ చూడబుద్ధేస్తుంటాయి. త్రివిక్రమ్ తన చిత్రాల రచనలో, దర్శకత్వంలో ఉపయోగించే విధానం ఇదే. అందుకే, పాత్రలకూ, ప్రేక్షకులకూ మధ్య సమతూకపు డిగ్నిటీని కాపాడే ఆ చిత్రాల్లోని ఘట్టాలు చిరస్మరణీయం కాగలుగుతున్నాయి. అయితే, అలా తీయడానికి దర్శకుడికి అక్షరాలా ఖలేజా కావాలి. త్రివిక్రమ్ కు అది ఉంది.

అందుకే, మొదటి సారి కన్నా రెండోసారి, రెండోసారి కన్నా మూడోసారి - అతని చిత్రాలు బాగుంటాయి. ఒక్క ముక్కలో చెప్పమంటే, త్రివిక్రమ్ సినిమాలు మంచి వైన్ లాంటివి. పాత బడిన కొద్దీ రుచి, విలువ పెరగడం ఫ్రెంచ్ మద్యమైన వైన్ స్వభావం. ఆ లక్షణం త్రివిక్రమ్ రచన, దర్శకత్వాల్లో వచ్చిన అధిక భాగం సినిమాల్లో గమనించవచ్చు. అదే ఆయనను సమకాలీన రచయితలు, దర్శకుల్లో ప్రత్యేక స్థానంలో నిలిపింది.

కావాలంటే, 'అతడు', 'జల్సా' లాంటి సినిమాలు మరోసారి చూడండి. మీరూ నా మాటలతో ఏకీభవిస్తారు. మళ్ళీ మళ్ళీ చూడాలనిపించడం, చదివిన కొద్దీ చదవాలనిపించడం - ఇదే కదా కాలానికి అతీతంగా నిలిచే ఉత్తమ సృజనకు ప్రాథమిక లక్షణం. త్రీ ఛీర్స్ టు త్రివిక్రమ్.... ఆల్ ది బెస్ట్ టు ఖలేజా!

Wednesday, October 6, 2010

అవునా, మైనా...! ఇది సినిమాయేనా!?



తెలుగు సినిమా వస్తే చాలు, ఏ మాత్రం వీలున్నా వదలకుండా చూడడం ఓ బలహీనత. అది నాకు మరీ ఎక్కువ. అందుకే, వంశీ దర్శకత్వం వహించిన 'సరదాగా కాసేపు...' సినిమా ఊళ్ళోకి వచ్చిందని తెలిసి,వెళ్ళకుండా ఉండలేకపోయా. తెలుగునాట విడుదలైన తరువాతఇన్నాళ్ళకు కానీ, ఈ చిత్రరాజం (!) మా ఊరికి రాలేదు.

ఆంధ్రదేశంతో పాటు ఏకకాలంలో మా ఊరికి రాలేదేమని విచారిస్తూ, మిత్రులతో కలసి కాసేపు నవ్వుకుందామని ఈ సినిమాకు వెళ్ళాను. అయితే, మాకు నవ్వు రావడం మాట అటుంచి, ఏడుపొచ్చిందంటే నమ్మండి. టికెట్ కు పెట్టిన ఖర్చుకు కనీసపు గిట్టుబాటు కూడా లేదు. బుద్ధీ బుర్రా ఉన్నాయని అనుకొనే వంశీ లాంటి దర్శకుడి నుంచి ఇంత అవకతవక సినిమా రావడం మరింత బాధ కలిగించింది.

అసలీ సినిమాకూ, ఆ పేరుకూ సంబంధం కళ్ళజోడు పెట్టుకొన్నా కనిపించదు. సినిమా నిండా శబ్దకాలుష్యం. సినిమా చూస్తున్నామా, లేక డ్రామాకు వచ్చామా, లేదంటే టీవీ సీరియల్ చూస్తున్నామా అని మనకే అనుమానం వచ్చేస్తుంది. ఈ సినిమాలో కెమేరా మొదలు ఎడిటింగ్, సంగీతం (రీ-రికార్డింగ్, మిక్సింగ్) - ఇలా అన్ని విభాగాల్లో బోలెడన్ని తప్పులు కనిపిస్తాయి.

ప్రముఖ దర్శకుడు రేలంగి నరసింహారావు అందించిన మూలకథకు విస్తరణ ఈ చిత్రం. వేమూరి సత్యనారాయణ స్ర్కిప్టు కో-ఆర్డినేటర్ గా పనిచేస్తే, పడాల శివ సుబ్రహ్మణ్యం మాటలు రాశారు. స్క్రీన్ ప్లే, దర్శకత్వం వంశీ కృత్యాలు.

అమెరికా నుంచి అమ్మానాన్నల దగ్గరకు వచ్చిన ఓ అబ్బాయి ('అష్టాచెమ్మా' చిత్ర ఫేమ్ అవసరాల శ్రీనివాస్) ఆంధ్రాలో పెళ్ళిచూపుల కోసం వెళతాడు. చేసుకొనే అమ్మాయి (మధురిమ) వాళ్ళ ఇంట్లో కొద్దిరోజులుండి, ఆమె ప్రవర్తన తెలుసుకోవాలనుకుంటాడు.

పెళ్ళికొడుకుగా వెళితే, అసలు విషయం రాబట్టలేమని, తన వెంట వచ్చే డ్రైవర్ (రంగబాబుగా - 'అల్లరి' నరేశ్)కు పెళ్ళికొడుకుగా, తాను డ్రైవర్ గా బయలుదేరతాడు. ఆ సంగతి పెళ్ళికూతురు వాళ్ళకు తెలిసిపోతుంది. అందుకని డ్రైవర్ గా వస్తున్నదే తమ కాబోయే అల్లుడని వాళ్ళు ఫిక్సయిపోతారు.

ఇంతలో దోవలో వచ్చిన ఇబ్బందులతో పెళ్ళికొడుకు, డ్రైవర్ తమ మారువేషాలు తీసేసి, మామూలుగా మారిపోతారు. ఆ సంగతి తెలియని పెళ్ళికూతురు తరఫు వాళ్ళు అసలు డ్రైవర్ ను పట్టుకొని, తమ కాబోయే అల్లుడనుకుంటారు. ఆ తరువాత జరిగే తమాషా సంఘటనలే మిగిలిన సినిమా.

ఈ సినిమాలో పాత్రలు, వాటి ప్రవర్తన - అంతా అతి. హీరోయిన్ గా వేసిన మరాఠీ అమ్మాయి మధురిమ అందం సంగతి దేవుడెరుగు, కనీసం ఆకర్షణీయంగా కూడా లేదు. హీరోయిన్ తొలిసారి తెరపై కనిపించినప్పుడు నేపథ్యంలో నుంచి ఓ కవితాత్మక గీత ఖండిక వస్తుంది. నిజం చెప్పాలంటే - హీరోయిన్ కన్నా ఆ కవితా ఖండికే బాగుంది.

వినోదభరిత చిత్రాలకు పేరున్న వంశీకి ఇప్పుడు ఆ ‘టచ్’ పోయిందేమో అనిపిస్తుంది - ఈ ‘సరదాగా కాసేపు’ కాసేపైనా చూస్తే! (చూడగలిగితే!!) సినిమాలో పేర్లు పడుతుండగానే సినిమా జాతకం అర్థమైపోతుంది. అప్పుడే విమానాశ్రయానికి చేరుకున్న అవసరాల శ్రీనివాస్ డైలాగులకు రీ-రికార్డింగు పరమ ఘోరం.

మాటలు, వగైరా ఒకదాని మీద మరొకటి పడిపోతుంటాయి. ఇదంతా ఎడిటింగ్ మహిమో, మిక్సింగ్ మహిమో వంశీకే తెలియాలి. సినిమా షూటింగులో లేని డైలాగులను కూడా డబ్బింగ్ దశలో కలిపి, అక్కడికక్కడ అనిపించారని సీను చూస్తే తెలిసిపోతుంటుంది.

అలాగే ఈ సినిమాకు ఏ రకమైన వెధవ కెమేరా యాంగిల్ వాడారో, ఏమో కానీ, దృశ్యాలన్నీ పూర్తిగా రూపురేఖలు మారిపోయి కనిపిస్తుంటాయి (కెమేరామన్- లోకి). తెరపై ఆ డిస్టార్టెడ్ ఇమేజెస్ బాగా లేకపోగా, చూసే ప్రేక్షకులకు చీకాకు తెప్పిస్తాయి.

సినిమాలో వచ్చే టైటిల్ సాంగ్ లో అసలు బాణీ కన్నా, పాఁవ్, పాఁవ్ అనే శబ్దాలే ఎక్కువగా ఉన్నాయి. '...ఊహలో నాయకా...' అనే పాట చూస్తే, ఇత్తడి - స్టీలు బిందెలు, వంటింటి సామాన్లను తెరపై నింపేసి, తాను మరో రాఘవేంద్రరావునని వంశీ అనిపించుకున్నారు. '...తెల్లనవ్వు, మల్లె పువ్వు...' పాట ఒకటీ కొంత బాగున్న అనుభూతిని కలిగిస్తుంది.

కథ ఉందని కాక, వినోదభరిత చిత్రాల విజయంతో జోరు మీదున్న అల్లరి నరేశ్ డేట్లున్నాయి కదా అని వంశీ - అల్లరి నరేశ్ ల కాంబినేషన్ల లెక్కలు చూసి ఈ సినిమా తీసినట్లుంది. వంశీ అలవాటుపడిపోయిన అక్రమ సంబంధాల కామెడీనీ, గుంపుల కొద్దీ పాత్రల మధ్య డైలాగు కామెడీనీ, ఒకే రకంగా వినిపించే బాణీల వరుసనూ వంశీ మార్చుకోకపోతే, కష్టమే. ఆయన కూడా గుంపు కవాతు నృత్యాల పాటలు తీయడం విచిత్రం. మొత్తం మీద ఈ సినిమా బాగుందని చెప్పాలంటే - అందుకు తగిన సన్నివేశాలు ఏవేమిటని ఏరుకోవడం ఎంత వంశీ అభిమానులకైనా కష్టమే!