జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Tuesday, September 7, 2010

ఆకాశవాణిలో రెంటాల!

కవి -రచయిత రెంటాల గోపాలకృష్ణ తెలుగు పాఠకలోకానికి సుపరిచితులే. మొన్న సెప్టెంబర్ 5వ తేదీ ఆయన 90వ జయంతి . ఆ సందర్భంగా మద్రాసు ఆకాశవాణి కేంద్రం 'రెంటాల జీవితం - రచనలు' పేరిట ఓ ప్రసంగం ప్రసారం చేసినట్లు మునుపటి టపాలో చెప్పుకున్నాం. ఆ ప్రసంగం రికార్డింగు...ఈ దిగువన ఆడియో లింకులో....! అవధరించండి!!

Monday, September 6, 2010

అవిశ్రాంత అక్షర తపస్వి



(ఓ బెజవాడ కవి - రచయిత జీవితం -2)


(ఫోటోలో - రెంటాలకు పేరు తెచ్చిన అనువాదాల్లో ఒకటైన 'యమకూపం' నవల ముఖచిత్రం)

రఘువంశం నుంచి రష్యన్ సాహిత్యం దాకా రెంటాల గోపాలకృష్ణ స్పృశించని అంశం లేదు. రష్యన్ నాటకకర్త గొగోల్ రాసిన ప్రఖ్యాత నాటకం ‘ఇన్ స్పెక్టర్ జనరల్’ ను అనుసరిస్తూ, రెంటాల అదే పేరుతో నాటకం రాశారు. ఆ నాటకం బహుళ ప్రజాదరణ పొందింది. ‘ఇన్ స్పెక్టర్ జనరల్’, ‘అంతా పెద్దలే’ లాంటి ఆయన నాటకాలు రాష్ట్ర, రాష్ట్రేతర ప్రాంతాలలో వందలాది ప్రదర్శనలకు నోచుకున్నాయి. నాటక రంగంలో చేసిన విశేష కృషితో రెంటాలకు ప్రజా నాట్యమండలి, ఆంధ్ర ఆర్ట్స్ థియేటర్ లతో పాటు అనేక ఇతర ఔత్సాహిక నాటక సమాజాలతో అనుబంధం ఏర్పడింది.

నాటి నుంచి ఆయన అనేక గీతాలు, నాటికలు, కథలు, అనువాదాలు రాసి ప్రచురించారు. కవిగా, రచయితగా, నాటకకర్తగా, అనువాదకుడిగా, విమర్శకుడిగా సాహితీ రంగస్థలిపై ఆయన బహుపాత్ర పోషణ చేస్తూ వచ్చారు. ‘శిక్ష’, ‘అంతా పెద్దలే’, ‘రజని’, ‘కర్ణభారం’, ‘మగువ మాంచాల’, ‘రాణీ రుద్రమదేవి’, ‘మాయమబ్బులు’.... ఇలా ఎన్నో రంగస్థల నాటికలు, నాటకాలు, రేడియో నాటకాలు ఆయన కలం నుంచి వెలువడ్డాయి.

ఆరు పదుల నిరంతర సాహితీ సేద్యం

రష్యన్, ఆంగ్ల సాహిత్యాలను తేటతెలుగులో అందించడానికి రెంటాల చేసిన కృషి ఎన్నదగినది. లియో టాల్ స్టాయ్ రాసిన బృహన్నవల ‘వార్ అండ్ పీస్’ రష్యన్ సాహిత్యంలో సుప్రసిద్ధమైనది, సుదీర్ఘమైనది. జార్ చక్రవర్తులను గురించి తెలిపే ఈ నవలా రాజంలో దాదాపు 500 పైచిలుకు పాత్రలున్నాయి. ఈ బృహత్తర రచనను బెల్లంకొండ రామదాసుతో కలసి రెంటాల అనువదించారు. తెలుగు పాఠకులకు ‘యుద్ధము - శాంతి’ పేరిట సులభశైలిలో అందించారు. ఇక, రెంటాల స్వతంత్రంగా విశ్వవిఖ్యాత టాల్ స్టాయ్ నవల ‘అన్నా కెరినినా’ను సరళంగా తెలుగులోకి అనువదించారు. మేలెన్నికగన్న అనువాదంగా ఆ రచన సాహితీవేత్తల ప్రశంసలను అందుకుంది.

అలాగే, అలెగ్జాండర్ కుప్రిన్ రాసిన ‘యమా ది పిట్’ను ‘యమకూపం’గా తెనుగు చేశారు. మాక్సిమ్ గోర్కీ నవల ‘ది మ్యాన్ హు వజ్ ఎఫ్రైడ్’ను ‘భయస్థుడు’గా అనువదించారు. నోబెల్ బహుమతి గ్రహీత నట్ హామ్సన్ రచన ‘హంగర్’ను ‘ఆకలి’గా రెంటాల అందించారు. తెలుగు సాహితీలోకానికి రష్యన్ సాహిత్యామృతాన్ని పంచారు. రవీంద్రనాథ్ టాగోర్, లూయీ చార్లెస్ రాయర్, రష్యన్ రచయితలు అలెగ్జాండర్ పుష్కిన్, చకోవ్ స్కీ, ఫ్రెంచ్ రచయితలు ఆనటోల్ ఫ్రాన్స్, విక్టర్ హ్యూగో, మపాసా - ఇలా ఎంతో మంది ప్రసిద్ధుల రచనలను రెంటాల తెలుగులో అందించారు. అనువాద సాహిత్యాన్ని సుసంపన్నం చేశారు.

బాలల అకాడమీ అవార్డుల నిర్ణేతల దృష్టికి రాలేదేమో కానీ, ఏ తెలుగు ప్రచురణాలయానికి వెళ్ళినా, ‘బాలజ్యోతి’ లాంటి బాల సాహిత్య పత్రికలను తిరగేసినా, రెంటాల బాల సాహిత్యంలో చేసిన అవిరళ కృషి స్పష్టంగా కనిపిస్తుంది. లియో టాల్ స్టాయ్ బాల సాహిత్యాన్నంతటినీ రెంటాల తెనిగించారు. భారత, రామాయణ, భాగవతాదుల నుంచి ‘భట్టి విక్రమార్క కథల’ దాకా, ‘కాశ్మీర గాథల’ నుంచి ‘ఈసఫ్ కథలు’, ‘గ్రీకు గాథల’ దాకా విస్తారమైన సాహిత్యాన్ని సరళమైన వచనంలో చెప్పారు. అరటిపండు ఒలిచి నోటిలో పెట్టినంత సులభరీతిలో పిల్లలకు అందించారు. పెద్దలను సైతం అలరించారు.

ఇక, వాల్మీకి, వ్యాస ప్రణీతాలైన రామాయణ, భారత, భాగవతాలను సంస్కృత మూలాన్ని అనుసరిస్తూ సంపూర్ణంగా తెనిగించారు. అయ్యలరాజు నారాయణామాత్యుని ‘హంస వింశతి’, జయదేవుని ‘గీత గోవిందమ్’, లీలాశుక యోగీంద్రుని ‘శ్రీకృష్ణ కర్ణామృతమ్’, భర్తృహరి విరచిత ‘సుభాషిత త్రిశతి’ మొదలైనవన్నీ ‘స్వాతి’ సాహిత్య మాసపత్రికలో ధారావాహికంగా ప్రచురితమయ్యాయి.

నాలుగు పురుషార్థాలైన ధర్మ, అర్థ, కామ, మోక్షాలలో కామానికి సంబంధించినంత వరకు వాత్స్యాయనుడిదే మొదటి మాటా, చివరి మాటా. అలాంటి వాత్స్యాయనుడు రాసిన ప్రసిద్ధ ప్రాచీన శాస్త్రీయ గ్రంథం - ‘వాత్స్యాయన కామసూత్రాలు’. దాన్ని యశోధరుని ‘జయమంగళ’ వ్యాఖ్యానుసారం మూల శ్లోకాలతో సహా పామరులకు సైతం అర్థమయ్యే రీతిలో రెంటాల తెనిగించారు. సరళమైన తెలుగు వచన రచనా శైలిలో రసహృదయులైన పాఠకులకు అందించారు. శభాష్ అనిపించుకున్నారు. ఈ రచన అప్పట్లో ‘ఆంధ్రజ్యోతి’ వారపత్రికలో ధారావాహికంగా ప్రచురితమైంది. అంతేకాకుండా, తరువాత పుస్తకరూపంలో వచ్చి, అతి స్వల్పకాలంలోనే దాదాపు డజను ముద్రణలకు నోచుకొంది. పండితుల, పామరుల ప్రశంసలకు పాత్రమైంది.

అవార్డులు - రివార్డులు

పదహారో ఏట తొలి పుస్తకం ‘రాజ్యశ్రీ’తో మొదలుపెట్టి 75వ ఏట మరణించే వరకు మొత్తం 60 ఏళ్ళ పాటు రెంటాల అలుపెరగకుండా రచనలు చేస్తూ వచ్చారు. అలా ఆరు పదుల సుదీర్ఘ కాలం పాటు సాహిత్య వ్యవసాయ క్షేత్రంలో నిర్విరామంగా కృషి చేసి, బంగారు పంటలు పండించారు. రెంటాల రచనలు రాశిలోనూ, వాసిలోనూ ఎక్కువే. దాదాపు 200 పుస్తకాలు ఆయన రాయగా, అందులో 170 దాకా గ్రంథ రూపంలో ప్రచురితం కావడం విశేషం.

ఆయన గ్రంథాలు అశేష ఆంధ్ర పాఠకుల ఆదరాభిమానాలను చూరగొన్నాయి. పలు రచనలు పదే పదే ముద్రితమై, బహుళ ప్రచారం పొందాయి. వారణాసి విశ్వవిద్యాలయం లాంటి రాష్ట్రేతర పుస్తక భాండాగారాలలో సైతం స్థానం సంపాదించుకున్నాయి. రెంటాల రచనలను పలు విశ్వవిద్యాలయాలు పాఠ్యాంశాలుగా ప్రవేశపెట్టాయి. ఆయన వచన రచన ‘పల్నాటి వీరచరిత్ర’ను బెంగుళూరు విశ్వవిద్యాలయం వారు కన్నడంలోకి అనువదించి, ప్రచురించారు.

రెంటాల గోపాలకృష్ణ స్వస్థలం గుంటూరు జిల్లా పల్నాడు తాలూకా రెంటాల గ్రామమైనా, 1943 ప్రాంతం నుంచి ఆయన బెజవాడలోనే ఉంటూ వచ్చారు. స్వర్గస్థులయ్యే వరకు ఆ నగరాన్ని తన సాహితీ క్షేత్రంగా మలుచుకున్నారు. అలా విజయవాడతో ఆయనది 52 ఏళ్ళ బంధం. పుట్టి పెరిగిన నరసరావుపేట పరిసర ప్రాంతాలతో అనుబంధాన్నీ, ఆత్మీయతనూ కొనసాగిస్తూనే, విజయవాడ కార్యస్థానంగా ఆయన బహుముఖ ప్రజ్ఞ ప్రదర్శించారు.

ఈ పండిత పాత్రికేయుడు అనేక అవార్డులు, సన్మానాలు అందుకున్నారు. ఆంధ్ర నాటక పరిషత్ అవార్డు (1979లో), నెల్లూరు నెఫ్జా నాటక కళాపరిషత్ అవార్డు (1981లో) రెంటాలను వరించాయి. ఉత్తమ సినీ విమర్శకుడిగా వంశీ ఆర్ట్ థియేటర్స్ వారి చేత ‘దాసరి నారాయణరావు స్వర్ణపతకా’న్ని (1987లో) అందుకున్నారు. ఘంటసాల అకాడమీ, విజయవాడ వారిచే ఉత్తమ జర్నలిస్టు అవార్డు (1990 -91లో) పొందారు. కన్నుమూయడానికి సుమారుగా రెండు నెలల ముందు 1995లో ‘క్రాంతి’ ఉత్తమ జర్నలిస్టు అవార్డు రెంటాలకు లభించింది.

ఆశయాలు, ఆకాంక్షలు, బాధలు, వేదనలు. బాధామయ జగత్తును దర్శించి, దరిద్రంలోనే శాంతినీ, అంధకారంలోనే వెలుగునూ కవిత్వం ద్వారా, సాహితీ వ్యాసంగం ద్వారా రెంటాల అన్వేషించారు. ఒకవైపు సాహిత్యంలో అన్వేషణ, మరోవైపు జీవన సమరం. ఇలా రెంటాల అవిశ్రాంత పోరాటం సాగించారు. అవినీతి రాజకీయాలపై అస్త్రసంధానం చేస్తూ, ‘‘...దించండి తెర, దించండి తెర / చాలు చాలు ఈ విషాద సారంగధర... ’’ అంటూ, 1995 జూలై 18వ తేదీ మంగళవారం తెల్లవారుజామున మూడు గంటల పది నిమిషాలకు విజయవాడలో కన్నుమూశారు. నిరాడంబరుడు, నిగర్వి, సహృదయుడు, సాహితీమూర్తి రెంటాల గోపాలకృష్ణ భౌతికంగా మన మధ్య లేరు. కానీ, చేసిన శతాధిక రచనల ద్వారా సాహితీ జగాన ఆయన చిరంజీవి!!

భర్తృహరి చెప్పినట్లు,

‘‘ జయన్తి తే సుకృతినో రససిద్ధాః కవీశ్వరాః
నాస్తి తేషాం యశః కాయే జరా మరణజం భయం’’

Sunday, September 5, 2010

60 ఏళ్ళ సాహితీ సేద్యం, 200 పుస్తకాలు: ఓ బెజవాడ కవి - రచయిత జీవితం



(ఇవాళ ప్రముఖ కవి - రచయిత కీర్తిశేషులు రెంటాల గోపాలకృష్ణ గారి 90వ జయంతి. ఆ సందర్భంగా ఈ తరం సామాన్య శ్రోతలకు రెంటాలను స్థూలంగా పరిచయం చేయాలనే ఉద్దేశంతో, నిన్న సెప్టెంబర్ 4న ఆకాశవాణి మద్రాసు కేంద్రం 'రెంటాల జీవితం - రచనలు' పేరిట ప్రసంగం ప్రసారం చేసింది. ఆ ప్రసంగ వ్యాసం ఇది. జన్మనివ్వడమే కాక, సాహితీ సంస్కారాన్ని పంచి, పెంచిన ఆ అక్షర మూర్తికి అశ్రునివాళి అర్పిస్తూ....)

‘‘లోకంలో శోకించే పతితుల ప్రాణాలన్నీ / నా పాటల వృక్షంపై / పక్షులుగా విశ్రమించు’’ - అంటారు కవి - రచయిత రెంటాల. ఆధునిక తెలుగు సాహిత్యంలో, పత్రికా రంగంలో రెంటాల ( 1920 – 1995 ) పేరు విననివారు ఉండరు. కవిగా, నాటక కర్తగా, రచయితగా, విమర్శకుడిగా, జర్నలిస్టుగా, వక్తగా ఆయన లబ్ధ ప్రతిష్ఠులు. జనంలో ‘రెంటాల’గా ప్రసిద్ధులైన ఆయన పూర్తి పేరు - రెంటాల గోపాలకృష్ణ.

పుట్టుపూర్వోత్తరాలు


తెలుగునాట తొలితరం అభ్యుదయ కవితా వైతాళికులలో రెంటాల గోపాలకృష్ణ ఒకరు. ఆయన 1920వ సంవత్సరం సెప్టెంబర్ 5వ తేదీ, కృష్ణాష్టమి నాడు గుంటూరు జిల్లా పల్నాడు తాలూకా రెంటాల గ్రామంలో జన్మించారు. పాండిత్యం, ప్రతిభ గల కుటుంబం వారిది. చిన్నప్పటి నుంచీ రెంటాలలో సాహిత్య సృజనాభిలాష ఎక్కువ. వివిధ గ్రంథాలు, పురాణాలు, శాస్త్రాలను అధ్యయనం చేశారు. సమకాలీన సాహిత్య, సామాజిక, రాజకీయ ధోరణులకు ఆయన స్పందించేవారు.

నరసరావుపేట - నవ్యకళాపరిషత్ - నయాగరా

స్కూలు ఫైనల్ లో ఉండగానే 1936లో పదహేరేళ్ళ ప్రాయంలో 'రాజ్యశ్రీ’ అనే చారిత్రక నవలను రాశారు. మిత్రుల సాయంతో 1939లో ప్రచురించి, సంచలనం రేపారు. ఈ చారిత్రక నవలకు ప్రముఖ పండితులు, చరిత్ర శాస్త్ర అధ్యాపకులు శ్రీమారేమండ రామారావు ముందుమాట రాశారు. పాఠశాల ప్రాంగణంలో ఉండగానే రెంటాల ఛందస్సును క్షుణ్ణంగా నేర్చుకొని, వివిధ వృత్తాలు, గీతాలలో పద్యరచన చేశారు. 1937లో స్కూల్ ఫైనల్ వరకు నరసరావుపేటలోని మునిసిపల్ హైస్కూల్ లో చదువుకున్నారు. ఆనాడే ఏల్చూరి సుబ్రహ్మణ్యం, అనిసెట్టి సుబ్బారావు, బెల్లంకొండ రామదాసు, కుందుర్తి ఆంజనేయులు, గంగినేని వెంకటేశ్వరరావు లాంటి సాహితీ మిత్రుల సాహచర్యం రెంటాలకు సిద్ధించింది. ప్రముఖ కవి - ప్రధానోపాధ్యాయుడు శ్రీనాయని సుబ్బారావు శిష్యరికం అబ్బాయి. తరువాత గుంటూరులోని కళాశాలలో బి.ఏ. (తెలుగు సాహిత్యం) చదువుకున్నారు.

కళాశాలలో చదువుకుంటూనే ఈ సాహితీ మిత్రులంతా కలసి, నరసరావుపేటలో 'నవ్యకళాపరిషత్’ అనే కవిత్వ, సాహితీ చర్చ వేదికను ప్రారంభించారు. ఆ రోజుల్లోనే సాహితీ చర్చలు జరుపుతూ, నవ్యకవితా ధోరణికి నాంది పలికారు. 1943లో రెంటాల విజయవాడ వచ్చి స్థిరపడ్డారు. మార్క్సిజమ్ అధ్యయనం, శ్రీశ్రీతో సన్నిహితత్వం, అభ్యుదయ సాహిత్యోద్యమం - వీటితో ఆయన రచనల్లో నూతన దృష్టి మొదలైంది. 1943లో ఆంధ్ర అభ్యుదయ రచయితల ప్రథమ మహాసభ జరిగాక వెలువడిన తొలి అభ్యుదయ కావ్యం ‘నయాగరా’. అభ్యుదయ కవితా ఉద్యమానికి మేనిఫెస్టోగా చెప్పదగిన ‘నయాగరా' కవితా సంపుటి ప్రచురణలో రెంటాల సహాయకుడిగా పాలుపంచుకొన్నారు. ఏల్చూరి, కుందుర్తి, బెల్లంకొండలకు చేదోడువాదోడుగా ఉన్నారు. అలా ‘నయాగరా' కవి మిత్ర బృందంలో ముఖ్యుడిగా నిలిచారు. మిత్రులతో కలసి తొలినాళ్ళలోనే అభ్యుదయ రచయితల సంఘంలో చేరి, ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా కొనసాగారు.

అభ్యుదయ కవిగా 'సంఘర్షణ', 'సర్పయాగం'

1950లలోనే 'సంఘర్షణ', 'సర్పయాగం'మొదలైన స్వీయ కవితా సంపుటాలను రెంటాల వెలువరించారు. అభ్యుదయ కవిత్వానికీ, శ్రామిక జన ప్రబోధ సాహిత్యానికీ, ఆనాటి నిజామ్ వ్యతిరేక తెలంగాణా సాయుధ పోరాటానికీ ప్రతీకగా కవితా సృజన సాగించారు. "పగలేయి నిజాం కోట / ఎగరేయి ఎర్రబావుటా / విశ్వరూపం దాల్చి / విప్లవాణువు పేల్చి / విలయ నేత్రం కాల్చి / విషకిరీటం కూల్చి / పగలేయి నిజాం కోట / ఎగరేయి ఎర్రబావుటా...." అని నిరంకుశ నిజామ్ ప్రభువుపై కవితా ఖడ్గమెత్తారు. "అమ్మా! ఉమా! రుమా! హిరోషిమా! / విలపించకు, పలవించకు! / విలపిస్తూ, పలవిస్తూ / తపియించకు, శపియించకు! / రాబోయే యుగానికి / నీవేలే మొదటి రోజు! / రాబోయే రికార్డుకు నీదేలే మొదటి పేజీ!...." అంటూ రెండో ప్రపంచ యుద్ధ బీభత్సాన్ని వర్ణించారు. తీసుకున్న అంశం ఏదైనా రెంటాల తనదైన గొంతుకను వినిపించారు. శ్రీశ్రీ సైతం ఈ కవిత్వానికి ముగ్ధుడై, అభినందించారు. భారత పర్యటనకు వచ్చిన జపనీస్ శాంతి సంఘానికి శ్రీశ్రీ అప్పటికప్పుడు రెంటాల కవిత హిరోషిమాకు ఆంగ్లానువాదం చేసి, వినిపించారు. జపనీయులు సైతం రెంటాలను అభినందనలతో ముంచెత్తారు. రెంటాల రాసిన పలు కవితలను ప్రముఖ కవి ఆలూరి బైరాగి లాంటి వారు హిందీలోకి కూడా అనువదించారు.

అలాగే, 'కల్పన' కవితా సంపుటికి సంపాదకులలో ముఖ్యుడిగా రెంటాల వ్యవహరించారు. ఆ సంపుటి వెలుగు చూడడంలో అత్యంత కీలకపాత్ర పోషించారు. భావ కవిత్వం, నవ్య కవిత్వాలకు ముద్దుకృష్ణ 'వైతాళికులు' లాగా, అభ్యుదయ ప్రగతిశీలవాద కవిత్వానికి 'కల్పన' కవితా సంపుటి జయపతాకగా నిలిచింది. ఆనాటి ప్రముఖ అభ్యుదయ కవులందరి కవితల సంకలమైన'కల్పన'ను ఆనాటి ప్రభుత్వం నిషేధించింది.

పాత్రికేయ జీవితం

ఉదరపోషణార్థం ఉద్యోగం చేయడం తప్పనిసరైనా, సాహిత్యాభిలాష కారణంగా రైల్వే, తదితర ప్రభుత్వ ఉద్యోగాలను రెంటాల కాలదన్నారు. 1942 ప్రాంతంలో కొంతకాలం చల్లా జగన్నాథం గారి సంపాదకత్వంలోని 'దేశాభిమాని' పత్రికలో గుంటూరులో పనిచేశారు. చదలవాడ పిచ్చయ్య గారి సంపాదకత్వాన వెలువడిన 'నవభారతి' మాసపత్రికలో మరికొంతకాలం కర్తవ్యనిర్వహణ చేశారు. అనంతరం 1960 ప్రాంతంలో అవసరాల సూర్యారావు, బెల్లంకొండ రామదాసు లాంటి మిత్ర రచయితలతో కలసి నీలంరాజు వెంకట శేషయ్య గారి సంపాదకత్వంలో వెలువడుతున్న 'ఆంధ్రప్రభ' దినపత్రికలో ఉపసంపాదకత్వ బాధ్యతలు చేపట్టారు. ఆనాటి నుంచి దాదాపు మూడు దశాబ్దాల పాటు అదే సంస్థలో వివిధ స్థాయుల్లో ఉద్యోగ నిర్వహణ చేశారు. 'ఆంధ్రప్రభ' దినపత్రిక సంపాదక మండలి సభ్యుడిగా గురుతర బాధ్యతలు నిర్వహించారు.

పాత్రికేయ వృత్తిలో ఉంటూనే, 'పంచకల్యాణి - దొంగల రాణి', 'కథానాయకురాలు' లాంటి కొన్ని చలనచిత్రాలకు రెంటాల మాటలు, పాటలు సమకూర్చారు. 'ఆంధ్రప్రభ'దినపత్రికలో సినీ విశేషాల వారం వారీ అనుబంధం 'చిత్రప్రభ'కు నిరంతరాయంగా సంపాదకత్వ బాధ్యతలు నిర్వహించారు. కొత్త సినిమాలపై వారం వారం ఆయన రాసే సమీక్షలు పాఠకులకు ఆసక్తికరమయ్యాయి. సుప్రసిద్ధ సినీ విమర్శకుడిగా ఆయనకు పేరు తెచ్చాయి. సినీ - సాంస్కృతిక రాజధానిగా వెలిగిన విజయవాడలో అప్పట్లో జరిగే సినిమా సమావేశాలు, కార్యక్రమాల్లో గురుపీఠం రెంటాల గారిదే.

పత్రికా రచనలో భాగంగా ఆయన సాంస్కృతిక, జ్యోతిష, కళా రంగాలపై ఎన్నో వ్యాసాలు, సమీక్షలు రాశారు. ఆయన రాసిన సంపాదకీయాలు కూడా కోకొల్లలు. యాంత్రికంగా, గడియారం వంక చూసుకుంటూ మొక్కుబడిగా పనిచేసే చాలామంది జర్నలిస్టులకు రెంటాల భిన్నమైన వారు. నిబద్ధతతో, నిర్దేశిత పని గంటల సమయానికి అతీతంగా నిరంతరం శ్రమించేవారు. తనదైన శైలిలో దగ్గరుండి ఎడిషన్ వర్కును పూర్తి చేయించేవారు. జర్నలిస్టుగా రెంటాలకున్న ఆ విశిష్ట గుణం ఆ తరం పాత్రికేయులకు సుపరిచితం.

పత్రికా రచనను చేపట్టినప్పటికీ, రెంటాల తన సాహితీ సేద్యాన్ని ఏనాడూ ఆపలేదు. 'అభ్యుదయ', 'మాతృభూమి', 'సోవియట్ భూమి', 'ఆనందవాణి', 'విజయవాణి', 'విజయప్రభ', 'నగారా' లాంటి ఆనాటి ప్రముఖ పత్రికలలోనూ, 'ఆంధ్రప్రభ' సచిత్ర వారపత్రిక, 'ఆంధ్రజ్యోతి' దిన, వార పత్రికల్లోనూ, 'స్వాతి' వార, మాసపత్రికల్లోనూ, 'బాలజ్యోతి' పిల్లల మాసపత్రికలోనూ రెంటాల రచనలు, ధారావాహికలు అనేకం ప్రచురితమయ్యాయి.

(మిగతా భాగం మరికాసేపట్లో....)

Saturday, September 4, 2010

ఆర్భాటంగా సాగిన సౌందర్య పెళ్ళి




(మొదటి ఫోటోలో - సాంప్రదాయిక వివాహ దుస్తుల్లో రజనీ కాంత్ చిన్న కూతురు సౌందర్య, పెళ్ళి కొడుకు అశ్విన్ రామ్ కుమార్;
రెండో ఫోటోలో - కూతురు అల్లుడుతో రజనీ కాంత్)

...........................

పెద్దింటి పెళ్ళిళ్ళు ఎలా ఉంటాయో చెప్పడానికి సినీ నటుడు రజనీకాంత్ ఇంట జరిగిన వివాహం తాజా ఉదాహరణ. రజనీకాంత్ చిన్న కుమార్తె సౌందర్య వివాహం ఇవాళ సెప్టెంబర్ 3 శుక్రవారం నాడు మద్రాసులో జరిగింది. రజనీకాంత్ అంతటి వాడు స్వయానా వచ్చి, ఫోన్ చేసి పెళ్ళికి పిలిస్తే రాని వాళ్ళు ఎవరుంటారు. అందుకే, ఎగ్మూరులో పెళ్ళి జరిగిన రాణీ మెయ్యమ్మై కల్యాణ మండపం మొత్తం అతిథులతో నిండిపోయింది. సినీ, రాజకీయ రంగ ప్రముఖులతో కళకళ లాడింది. స్టాన్ ఫోర్డ్ లో చదువుకున్న యువ తమిళ వ్యాపారవేత్త అశ్విన్ రామ్ కుమార్ తో రజనీకాంత్ చిన్న కూతురు సౌందర్య వివాహం సాంప్రదాయిక తమిళ బ్రాహ్మణ పద్ధతిలో జరిగింది.

చిత్ర నిర్మాత - ఓఖర్ స్టూడియో మేనేజింగ్ డైరెక్టరైన సౌందర్య ఇప్పటికే తన తండ్రి రజనీకాంత్ ను ప్రధాన పాత్రగా చేసుకొని సుల్తాన్ - ది వారియర్ పేరిట ఓ యానిమేషన్ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఆ సినిమా దాదాపు చివరి దశకు వచ్చిన తరుణంలో ఇప్పుడు సౌందర్యకు పెళ్ళయింది. సౌందర్య పెళ్ళికి నటుడు కమలహాసన్, దర్శకులు బాలచందర్, మణిరత్నం, సుహాసిని, కేంద్ర హోమ్ మంత్రి చిదంబరం, తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి తదితరులు హాజరయ్యారు. మన తెలుగు మెగాస్టార్ చిరంజీవి, హీరో వెంకటేష్, రాధిక, తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కూడా పెళ్ళికి హాజరైనవారిలో ఉన్నారు.

పెళ్ళికూతురు సౌందర్య ఆకుపచ్చ, ఎరుపు రంగుల తొమ్మిది గజాల పట్టుచీరల్లో మెరిసిపోయారు. ఆమె ధరించిన ఆభరణాలు సాంప్రదాయికంగా, వివాహ సందర్భానికి తగ్గట్లు ఉన్నాయి. పెళ్ళి భోజనం కూడా సంప్రదాయ సిద్ధంగా అరటి ఆకుల్లో బంతి భోజనాల పద్ధతిలో సాగింది. బిస్బేళీ బాత్, మైసూరు రసం లాంటి కర్నాటక తరహా వంటకాలతో సహా మొత్తం 26 వంటకాలతో భోజనం వడ్డించారు. గురు, శుక్రవారాలు రెండు రోజులూ సౌందర్య పెళ్ళి రిసెప్షన్, పెళ్ళితో రజనీకాంత్ ఇంటిలోనే కాక తమిళ మీడియాలోనూ సందడే సందడి. ఆకాశమంత పందిరి, భూదేవంత అరుగుగా సాగిన సౌందర్య పెళ్ళి కొద్దికాలం పాటు తమిళనాట గుర్తుండిపోయే ఘటనే. సౌందర్య వైవాహిక జీవితం సుఖ సంతోషాలతో సాగాలని కోరుకుందాం.

పి.ఎస్. - విశేషం ఏమిటంటే, ఇంత హడావిడి సాగుతున్నా రజనీ కాంత్ మాత్రం చెరగని చిరునవ్వుతో, వచ్చిన ప్రతి ఒక్క అతిథినీ సాదరంగా స్వాగతించడం. పేరు పేరునా పలకరించడం. పెళ్ళి సమయంలో సాగే పూజ, కన్యాదాన మంత్రాల సమయంలో కూడా రజనీకాంత్ చాలా శ్రద్ధగా, భక్తిగా, సగటు ఆడపిల్ల తండ్రిలా వ్యవహరించడం చూసిన ఎవరికైనా ముచ్చట కలిగిస్తుంది. ఎంత పెద్దింటి వివాహమైనా, సెంటిమెంట్లు మాత్రం అందరికీ ఒకటే కదూ!

Friday, September 3, 2010

రజనీకాంత్ కుమార్తె పెళ్ళి హడావిడి



(ఫోటో వివరం....... పెళ్ళి రిసెప్షన్ లో (ఎడమ నుంచి కుడికి) రజనీకాంత్ సతీమణి లత, శ్రీదేవి భర్త బోనీ కపూర్, రజనీకాంత్, కొత్త పెళ్ళికూతురు సౌందర్య, పెళ్ళికొడుకు అశ్విన్, శ్రీదేవి, మహేశ్వరి)
.........................................................

ఓ వారం రోజులుగా మద్రాసు సినిమా వర్గాలలో ఒకటే హడావిడి. సమాచార, ప్రసార సాధనాల వారి సంగతి అయితే, ఇక చెప్పనక్కర లేదు. సెప్టెంబర్ 3వ తేదీ, శుక్రవారం నాటికి ఎలా, ఏం చేయాలన్నది ప్రతి ఒక్కరూ చర్చించుకుంటున్నారు. ఈ హడావిడి అంతటికీ కారణం - రజనీకాంత్ కుమార్తె సౌందర్య పెళ్ళి. దేశం నలుమూలల నుంచి సినీ ప్రముఖులు, దక్షిణాదికి చెందిన రాజకీయ, సామాజిక ప్రముఖులు హాజరయ్యే పెళ్ళి కావడంతో సహజంగానే అందరి దృష్టి ఈ కార్యక్రమం మీద నిలిచింది. ఈ పెళ్ళి సంరంభాన్ని పాఠకులకూ, ప్రేక్షకులకూ వివరంగా అందించాలన్నది మీడియా తాపత్రయం.

దాదాపు గడచిన పక్షం రోజులకు పైగా రజనీకాంత్ స్వయంగా ఎంతోమంది పెద్దల ఇంటికి వెళ్ళి, శుభలేఖలు పంచుతూ వచ్చారు. ఆ సంగతులు, ఫోటోలు మీడియా అందిస్తూనే వచ్చింది. తండ్రి ఓ పక్క శుభలేఖల పంపిణీ హడావిడిలో ఉంటే, మరోపక్క ఆయన కుమార్తె సౌందర్య షాపింగులతోనూ, కట్టుకున్న కొత్త ఇంట్లో కాపురానికి కావాల్సిన వస్తువుల కొనుగోలుతోనూ బిజీగా గడిపారు.

ఈ పెళ్ళి సంరంభాన్ని ఎలా కవర్ చేయాలా అని మీడియా అంతా రకరకాలుగా ఆలోచించింది. కొన్ని చానళ్ళు లైవ్ కవరేజీలకు కూడా సిద్ధమయ్యాయి. తీరా, రజనీ కాంత్ వర్గీయులు మాత్రం సున్నితంగానే నో చెప్పారు. దాంతో, సౌందర్య పెళ్ళికి ఏ రంగు దుస్తులు కట్టుకున్నారో, ఎలాంటి ఆభరణాలు ధరించారో దగ్గరగా చూసి మరీ వివరించాలనుకున్నవాళ్ళకు కొంత ఆశాభంగమే కలిగింది. ముగ్గురు నలుగురు తమిళ విలేఖరులు, వార్తా చానళ్ళ ప్రతినిధులు నిన్నంత ఆఫీసులో దీని మీదే చర్చించుకోవడం చూశా.

ఇది ఇలా ఉండగా, నిన్న సెప్టెంబర్ 2వ తేదీ గురువారం సౌందర్య పెళ్ళి రిసెప్షన్ మద్రాసులోనే ఘనంగా జరిగింది. సినీ ప్రముఖులు శ్రీదేవి, ఆమె భర్త బోనీ కపూర్, శ్రీదేవి కజిన్ - సినీ నటి మహేశ్వరి, బాలీవుడ్ నుంచి అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యారాయ్, దర్శకులు బాలచందర్, తదితర సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు దానికి హాజరయ్యారు. ఆ రిసెప్షన్ ఫోటో ఈ టపాలో! సౌందర్య పెళ్ళి వివరాలు, ఫోటో తదుపరి టపాలో! ఆల్ ది బెస్ట్ సౌందర్య!

Thursday, September 2, 2010

భలే మంచిరోజు: నాటి మేటి తారల ఈనాటి కలయిక





ఫోటో వివరాలు -
1. (అందరి కన్నా వెనక వరుసలో) ముఖేశ్, శంకర్, భానుచందర్, అంబిక, శోభన
2. (వెనక నుంచి 2వ వరుసలో) రాధిక, సుమలత, ...., కార్తీక్, ప్రభు, మోహన్, అంబరీశ్, రాధ, ప్రతాప్ పోతన్, లిస్సీ ప్రియదర్శన్, సురేశ్, సుహాసినీ మణిరత్నం
3. (వెనక నుంచి 3వ వరుసలో) అర్జున్, శరత్ కుమార్, మోహన్ లాల్, చిరంజీవి, వెంకటేశ్
4. (ముందు వరుసలో) ఖుష్బూ, పూర్ణిమా భాగ్యరాజ్, రమ్యకృష్ణ, రజనీకాంత్, నరేశ్


..............................................


చిన్నప్పుడు కలసి తిరిగిన వాళ్ళం, కలసి చదివిన వాళ్ళం, కలసి ఎదిగినవాళ్ళం, కొండొకచో కలహించుకున్న వాళ్ళం మళ్ళీ చాలా ఏళ్ళకు కలిస్తే..... ఎంత మధురమైన ఆలోచన. ఇలా పాత స్కూల్ మేట్లు, కాలేజ్ మేట్లు కలుసుకోవడం, ఆ పాత రోజులు గుర్తు చేసుకోవడం ఇటీవలి కాలంలో జరుగుతున్నాయి. అలాంటి గెట్ టుగెదర్ కార్యక్రమాల వార్తలు తరచూ వింటూనే ఉన్నాం. పేపర్లలో, టీవీల్లో చూస్తూనే ఉన్నాం.

సినిమా వాళ్ళు మాత్రం తక్కువ తిన్నారా. వాళ్ళు కూడా ఇప్పుడు అదే బాట పట్టారు. 1980లలో ప్రముఖ తారలుగా వెలిగినవాళ్ళలో చాలామంది మొన్న ఆగస్టు 29న మద్రాసులో కలుసుకున్నారు. నిజానికి, ఆ నటీనటులు ఇలా కలుసుకోవడం వరుసగా ఇది రెండో ఏడాది. వాళ్ళు తామందరి మధ్య ఉన్న స్నేహ సౌహార్దాలనూ, ఐకమత్యాన్నీ వెల్లడించుకోవడానికి దీన్ని ఓ సందర్భం చేసుకుంటున్నారు.

క్రితం ఏడాది లానే ఈ సారి ఈ రెండో సమావేశాన్ని కూడా నటి - దర్శకురాలు సుహాసినీ మణిరత్నం నిర్వహించారు. మరో నటి లిసీ ప్రియదర్శన్ ఆతిథ్యమిచ్చారు. విశేషం ఏమిటంటే, ఈ సారి మన తెలుగు హీరోలు చిరంజీవి, వెంకటేశ్ కూడా ఈ ఆత్మీయ కలయికలో భాగమయ్యారు. అలాగే, మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, తమిళ హీరో శరత్ కుమార్, తెలుగులోనూ తరచూ కనిపించే తమిళ -కన్నడ నటుడు అర్జున్ కూడా ఈ సారి వచ్చి కలిశారు. ఓ పక్క రెండో కూతురు సౌందర్య పెళ్ళి పనులతో హడావిడిగా ఉన్నా సరే, ఈ సారి కూడా రజనీకాంత్ ఈ మిత్రుల కలయికలో పాలుపంచుకోవడం విశేషం. అన్నట్లు ఏటేటా జరపాలనుకుంటున్న ఈ కలయికకు 'ఎవర్ గ్రీన్ ఎయిటీస్' అని పేరు పెట్టుకున్నారు.

రజనీకాంత్, చిరంజీవి, మోహన్ లాల్, వెంకటేశ్, అంబరీశ్, అర్జున్, శరత్ కుమార్, ప్రభు, కార్తీక్, మోహన్, ప్రతాప్ పోతన్, ముఖేశ్, శంకర్ లు పాల్గొన్నారు. మన భానుచందర్, ఇప్పుడు ఎక్కువగా టీవీ సీరియల్స్ లో వస్తున్న తెలుగు సినీ నటుడు సురేశ్, తండ్రి పాత్రలకు ఎదిగిన అప్పటి కామెడీ హీరో నరేశ్, తెలుగు కుర్రకారును ఆకట్టుకున్న రాధ, ఆమె అక్కయ్య అంబిక, రాధిక, సుహాసిని, సుమలత, శోభన, రమ్యకృష్ణ, ఖుష్బూ, రేవతి, పూర్ణిమా భాగ్యరాజ్, నదియా, లిస్సీ - ఇలా ఆ కలయికలో పాలుపంచుకొన్నవారందరూ మనకు బాగా తెలిసిన తారలే.

ఏటా ఇలా ఏటా ఒక రోజు కలసి, తమ పాత సంగతులన్నీ కలబోసుకోవాలని వాళ్ళు నిర్ణయించుకున్నారు. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక - ఇలా దక్షిణాది సినీ పరిశ్రమలకు చెందిన వారంతా ఓ చోట కలవడం విశేషమే. ఈ 1980ల బ్యాచ్ నటీనటులంతా ఇక నుంచి ఏటా ఒక్కో రాష్ట్రంలో కలుసుకోవాలని తీర్మానించుకున్నారు. అంతేకాకుండా, ఇలా సినీ నటులు మాత్రమే కలసి ఓ క్లబ్ లాగా ఏర్పడడం ప్రపంచంలోనే ఇదే మొదటిసారని (?) కూడా వీళ్ళు గొప్పగా చెబుతున్నారు.

ఆ మాట ఎలా ఉన్నా, వీళ్ళ కలయికను చూసిన తరువాత నా మటుకు నాకు మళ్ళీ విజయవాడ వెళ్ళాలనిపించింది. నా స్కూల్ మేట్లనూ, కాలేజ్ మేట్లనూ మరోసారి కలుసుకోవాలనిపించింది. ఇలాగే, ఏటా కలుసుకొనేలా ఓ ప్రణాళిక వేయాలనిపించింది. "ఆనాటి ఆ స్నేహమానంద గీతం... ఆ జ్ఞాపకాలన్ని మధురాతి మధురం...." అంటూ పాడుకోవాలనిపించింది. వృత్తి ఉద్యోగాల కోసం భౌగోళికంగా దూరమైన వాళ్ళం, ఒత్తిడిలో మునిగిపోయినవాళ్ళం మళ్ళీ దగ్గర కావడానికి ఇలాంటి కలయికలు తరచూ అవసరమే. కాదంటారా.