జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Wednesday, February 6, 2013

తెలుగు సినిమా 82వ పుట్టినరోజు


భక్త ప్రహ్లాదమన తొలి సినిమా. తెలుగు సినిమా వృక్షానికి విత్తనం వేసిన సినిమా. భక్త ప్రహ్లాదవిడుదలై నేటికి 81 ఏళ్లు నిండి, 82లోకి ఎంటరవుతోంది. నిన్న మొన్నటి వరకూ ఈ సినిమా విడుదల విషయంలో ఓ సందిగ్ధావస్థ ఉంది. దాదాపుగా అంతా 1931 సెప్టెంబరు 15నే తెలుగు సినిమా పుట్టిన్రోజుగా పరిగణించేవారు. సీనియర్ పాత్రికేయుడు, సినీ పరిశోధకుడు రెంటాల జయదేవ ఎంతో పరిశోధన జరిపి భక్త ప్రహ్లాద’ 1932 ఫిబ్రవరి 6న విడుదలైందని కొన్ని ఆధారాల ద్వారా నిరూపించారు. హెచ్.ఎం.రెడ్డి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. 


18
వేల రూపాయల పెట్టుబడితో 18 రోజుల్లో సినిమా నిర్మాణం పూర్తి చేశారు. 9,762 అడుగుల నిడివిగల 10 రీళ్ల ఈ చిత్రం 1932 జనవరి 22న బొంబాయిలో సెన్సారింగ్ జరుపుకుంది. ఈ సినిమాను మొదట బొంబాయిలోని కృష్ణా సినిమా థియేటర్‌లో ఫిబ్రవరి 6న విడుదల చేశారు. బొంబాయిలో రెండు వారాలు ఆడిన తర్వాత విజయవాడ (శ్రీ మారుతి సినిమాహాలు), రాజమండ్రి (శ్రీకృష్ణా సినిమాహాలు)ల్లో విడుదలైంది. అటుపై మద్రాసులో ఏప్రిల్ 2న విడుదలైనపుడు మాత్రం బాగా హంగామా చేశారు. నాటకాలకు బాగా అలవాటు పడిన అప్పటి ప్రేక్షకులకు తెరమీద బొమ్మలు కదలడమే ఓ వింత అనుకుంటే, ఈ బొమ్మలు మాట్లాడ్డం మరో విడ్డూరంగా అనిపించింది. 

ఈ సినిమా నిర్మాణం కోసం హెచ్.ఎం.రెడ్డి ఎంతో ప్రయాసపడ్డారు. సురభి నాటక కంపెనీవారితోనే ఇందులో ఎక్కువ వేషాలు వేయించారు. మునిపల్లె సుబ్బయ్య, సురభి కమలాభాయి, సింధూరి కృష్ణారావు తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. ఎల్వీప్రసాద్ మొద్దబ్బాయిగా నటించారు. టైటిల్ రోల్ చేసిన కృష్ణారావునే మన తొలి తెలుగు కథానాయకునిగా చెప్పుకోవాలి. 

కృష్ణా ఫిలింస్ పతాకంపై తయారైన ఈ సినిమాకి హెచ్.ఆర్.పద్మనాభశాస్త్రి సంగీతం అందించగా, చందాల కేశవదాసు సాహిత్యం సమకూర్చారు. భక్త ప్రహ్లాదప్రేక్షకాదరణ చూసి చాలామంది చిత్ర నిర్మాణం వైపు మొగ్గు చూపారు. మన  దురదృష్టమో, అశ్రద్ధో ఈ సినిమా చూద్దామంటే ప్రింట్ కూడా అలభ్యం. ఒకటి, రెండు స్టిల్స్, పోస్టర్లే మనకు మిగిలిన జ్ఞాపకాలు. సినిమాను ప్రేమించే ప్రతి ఒక్కరూ భక్త ప్రహ్లాదను ఒక్కసారైనా స్మరించుకోవాల్సిందే.

 

(6 ఫిబ్రవరి 2013, బుధవారం నాటి సాక్షి దినపత్రిక, సినిమా పేజీలో ప్రచురితం)

1 వ్యాఖ్యలు:

నవజీవన్ said...

"భక్త ప్రహ్లాద " చిత్రం మీద మంచి సమాచారం అందించారు ..ధన్యవాదాలు