జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Tuesday, January 18, 2011

సినిమాను గట్టెక్కించలేని సాంకేతిక నైపుణ్యం(విజువల్సు విందు, కథ చెప్పగనేమందు... - పార్ట్ 2)

అనగనగా ఓ ధీరుడు సినిమాకు ప్రధాన బలమంతా - సాంకేతిక నిపుణుల కృషే. సౌందర్ రాజన్ అందించిన ఛాయాగ్రహణం బాగుంది. లొకేషన్లను కనువిందుగా చూపారు. చాలా రోజులకు తెలుగు తెర మీద వస్తున్న ఈ ఫ్యాంటసీ సినిమా అంతా ఓ చందమామ కథలా తెరపై సాగిపోయేందుకు ఉపయోగించిన కలర్ స్కీమ్ బాగుంది.

సాంకేతిక విభాగాల విశేష శ్రమ

సినిమాలోని అత్యధిక భాగం దృశ్యాలు, వాడిన దుస్తుల రంగులు, నేపథ్యం - అన్నీ కంటిని చీకాకుపరచకుండా హాయి నిచ్చేవిగా ఒదిగాయి. ఈ విషయంలో ఆర్ట్, మేకప్, కాస్ట్యూమ్స్ విభాగం వాళ్ళ పనితనం కూడా చెప్పుకోవాలి. కళా దర్శకత్వం (భూపేష్ ఆర్. భూపతి) సంగతికే వస్తే - ఆ సెట్లు, మౌల్డులు, వగైరా వా..వ్ అనిపిస్తాయి. ఇక, సినిమాలోని సర్ప కేశాలు, కాకాసురులు, సర్పిణి విన్యాసాలు - వగైరాల విజువల్ ఎఫెక్ట్ లు నిర్దుష్టంగా ఉండడం చిత్రానికి వన్నె తెచ్చింది.

సినిమా మొదట్లో, చివర్లో రవి శంకర్ (హీరో సాయికుమార్ తమ్ముడు, వదల బొమ్మాళీ వదల... లాంటి డైలాగులతో డబ్బింగ్ లో కింగ్) చేత వ్యాఖ్యానం ఇప్పించారు. అయితే, స్వరం ఎంత బాగున్నా, సినిమా కథలో అంతర్గతంగా ఉన్న గందరగోళాలు, దానికి తోడు ఎఫెక్టివ్ గా లేని డైలాగులతో ఆ వ్యాఖ్యానం ఆశించిన ఫలితాలను ఇవ్వలేకపోయింది. అలాగే, ఈ సినిమాకు పాటల్లో కూడా గొప్పగా ఏమీ లేవు. ఉన్నంతలో ‘చందమామలా అందగాడినే...’, మునుపే విన్నట్లున్న రిథమ్ తో ‘నిన్ను చూడని...’ మాత్రం బాగున్నాయి. ఈ సినిమాకు కీరవాణి, కోటి, మిక్కీ జె. మేయర్, సలీమ్ - సులేమాన్ మర్చెంట్ లు అయిదుగురు సంగీత దర్శకులు. కాగా, సలీమ్ - సులేమాన్ మర్చెంట్ లు నేపథ్య సంగీతం సమకూర్చారు.

సినిమాలో కొన్ని లోటుపాట్లు

అయితే, ఇంతటి సాంకేతిక కృషి కూడా సినిమాలో ప్రేక్షకుల్ని పూర్తిగా లీనం చేయలేకపోయింది. సినిమా చూస్తుంటే, కథలోని చాలా లోటుపాట్లు ప్రేక్షకుల మనసుకు వీర లెవల్లో గంట కొడుతుంటాయి.

-- అసలు ఈ సినిమాలో ఐరేంద్రి మొదలు ఆమె దగ్గర సైన్యంలో ఉన్నవాళ్ళంతా మనుషులో, దెయ్యాలో, మంత్రగాళ్ళో చాలా సేపటి వరకు అర్థం కాదు.

-- చిన్నారి మోక్షకు కథానాయకుడైన యోధ ఆశ్రమంలో ఉన్నప్పటి నుంచి చిరకాలంగా తెలుసు కదా. అలాంటప్పుడు దైవశక్తులున్న ఆ అమ్మాయి, హీరోకు చాలా ముందుగానే కళ్ళు రప్పించవచ్చు. అలా ఎందుకు చేయదో అర్థం కాదు. ఆ తరువాత అగర్తకు ప్రయాణం ప్రారంభించాక మాత్రం హీరోయిన్ లేని లోకాన్ని తాను చూడదలుచుకోలేదనడం వల్లే హీరోకు ఆ అమ్మాయి కళ్ళు రప్పించలేదన్నట్లుగా చూపారు.

-- ఇక ఐరేంద్రి ఫ్లాష్ బ్యాక్ ఏమిటో, అంగరాజ్యంలోని ఆ అగర్త వాసులు ఆమెను అలా సజీవంగా ఎందుకు దహనం చేశారో అర్థం కాదు. అకసాత్తుగా ఆ సన్నివేశం తెర మీదకు వచ్చి, అంతే అర్ధంతరంగా వెళ్ళిపోతుంది.

-- దుష్టశక్తుల నుంచి పసిపాపలను కాపాడుతుందని చెబుతూ వచ్చిన మోక్ష ఆఖరికి వచ్చేసరికి ఆ పని ఏ మేరకు, ఎలా చేసిందో అర్థం కాదు - ఒక్క విలన్ ను అనంతాకాశంలో విలీనం చేయడం తప్ప.

-- అన్నిటి కన్నా ముఖ్యంగా ఎంతటి ఫ్యాంటసీ కథ అయినా, దీని కంటూ ఓ కాలం, స్థలం ఉండాలి కదా. సినిమా నేపథ్యం కానీ, సంభాషణలు కానీ, ఆ వ్యవహారం కానీ అవేవీ అంతుబట్టనివ్వవు.

-- పైగా, సినిమాలో కొన్నిచోట్ల వినిపించే ‘మాకు సమయం బొక్క’ (హీరో), ‘జప్ఫా గాడు’ (బ్రహ్మానందం) లాంటి డైలాగులు సమకాలీన సినిమాలను తలపిస్తూ, ప్రాచీన కథాకాలమనే ఫ్లేవర్ ను కూడా వీలైనంత చెడగొట్టాయి. (మాటలు - శశి రాజసింహ, సహ రచన - రాహుల్ కోడా).

-- ఇక, జిలేబీగా ఆడా మగా కాని తరహా పాత్రలో అలీ మాటలు, చేష్టలు, హీరోకీ - అతనికీ మధ్య జరిగే సంభాషణలు చిన్న పిల్లల వాల్ట్ డిస్నీ చిత్రానికి తగినట్లు లేవు.

ఈ సినిమాకు రచన, దర్శకత్వ బాధ్యతలు ప్రకాశ్ కోవెలమూడి (ప్రముఖ దర్శకుడు కె.ఎస్. ప్రకాశరావుకు మనుమడు) చేపట్టారు. వాల్ట్ డిస్నీతో కలసి కె. రాఘవేంద్రరావు బి.ఏ. ఈ చిత్రాన్ని సమర్పించడమే కాక, తండ్రిగా తనయుడి దర్శకత్వానికి క్రియేటివ్ సూపర్ విజన్ బాధ్యతలు నిర్వహించారు. కానీ అవేవీ ఈ చిత్ర కథ, కథనం, పాత్రల స్వభావ చిత్రణలో కావలసిన నాటకీయతను రప్పించలేకపోయాయి. గందరగోళం లేకుండా కథను సాఫీగా చెప్పలేకపోయాయి. ఇక, కళ్ళెదుటే కనిపిస్తున్న దృశ్యానికి కూడా కొన్ని చోట్ల పాత్రలతో చెప్పించిన డైలాగులు, వాటి ప్రవర్తన చూస్తే - రంగస్థల నాటికలు గుర్తొస్తాయి.

ఈ ఎనిమిది రీళ్ళ యు (యూనివర్సల్ ) సర్టిఫికెట్ సినిమాలో గంట సేపు సాగే ప్రథమార్ధం ఫరవాలేదల్లే ఉందే అనిపిస్తుంది. కానీ, ద్వితీయార్ధం సాగే రెండో గంట మాత్రం చీకాకు పరుస్తుంది. అతిగా చొచ్చుకువచ్చే పాటలు అందుకు అదనం.

మొత్తం మీద, రకరకాల రంగు రంగుల రేఖాచిత్రాలతో సినిమా ముందొచ్చే టైటిల్స్, ఆఖరున వచ్చే టైటిల్స్ చూస్తే - ఈ సినిమాకు తెర వెనుక ఎంత శ్రమ, ఎందరి కృషి ఉందో అర్థమవుతుంది. అంతమంది టెక్నీషియన్లు కష్టపడబట్టే, చిత్రం సాంకేతికంగా, విజువల్ గా గొప్పగా తయారైందని అనిపిస్తుంది. తెలుగు సినిమాల్లో ఈ తరహా స్థాయిని ఊహించడమే కష్టమైన రోజుల్లో, వాటిని తెరపై చూపి(సి)నందుకు గర్వించవచ్చు. అయితే, ఎంతటి సాంకేతిక విన్యాసమైనా, ఎన్ని స్పెషల్ ఎఫెక్టులైనా కథలో, కథనంలో పట్టు లేకపోతే, ఎలా నిష్ప్రయోజనమవుతాయో ఈ సినిమా చూసి గ్రహించవచ్చు.

కొసమెరుపు --

సినిమా చూసి తిరిగొస్తూ ఉంటే, నా ముందే నడుస్తున్న ఓ సగటు ప్రేక్షకులిద్దరు మాట్లాడుకుంటూ వెళుతున్నారు. ఒక మిత్రుడు తన వెంటే ఉన్న రెండో మిత్రుడితో, ‘‘ఆ మధ్య ఆయిరత్తిల్ వరువన్ (తెలుగులో గత ఏడాది వచ్చిన యుగానికొక్కడుకు తమిళ మాతృక) చూశాం. ఇప్పుడిది చూశాం. రెంటికీ కథ గందరగోళంగా ఉంది. అర్థం కాలేదురా’’ అంటున్నాడు. దానికి ఆ రెండో మిత్రుడు - ‘‘కనీసం అది తమిళం కాబట్టి, అర్థం కాలేదంటే అర్థం ఉందిరా. కానీ, ఇది తెలుగే కదరా’’ అని బదులిచ్చాడు. దీని భావమేమి రాఘవేంద్రా? అందుకే ఒక్క మాటలో అనగనగా ఓ ధీరుడు - విజువల్స్ విందు! కథ చెప్పగనేమందు...!?

0 వ్యాఖ్యలు: