జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Friday, June 10, 2016

ఉరేసుకున్న ఫొటో

సూసైడ్ విన్నాం! సెల్ఫీ విన్నాం! మరి... సెల్ఫీసైడ్?
 సెల్ఫీల మోజుతో జాగ్రత్తపడకపోతే, అది సెల్ఫీసైడే!
 అంటే ఫోటోతో ఉరేసుకోవడమే 
అమ్మాయిలు అమాయకంగా ప్రేమలో పడి... 
లేకపోతే స్నేహం అనుకొని... 
అదీ కాకపోతే పరిచయం అనుకొని... 
ఫోటోలు, సెల్ఫీలు దిగి... పంచుకొంటే, 
వాటిని బ్లాక్‌మెయిలింగ్ కోసం వాడుతున్న‘బ్లాక్‌షీప్స్’ ఎన్నో!
 అమ్మాయిలూ! జాగ్రత్త!
సెల్ఫీలు క్యారెక్టర్‌ని చంపేస్తున్నాయి!
 డోన్ట్ కమిట్ ‘సెల్ఫీసైడ్’!

ఒకప్పుడు ఆటోగ్రాఫ్... ఆ తరువాత ఫోటోగ్రాఫ్... మరి ఇప్పుడు? స్మార్ట్‌ఫోన్‌లో సెల్ఫీ!

గౌరవప్రదంగా చెప్పాలంటే, సామాన్యుల నుంచి సెలబ్రిటీల దాకా ఇవాళ ప్రతి ఒక్కరికీ ఫ్యాషన్. లోతుగా ఆలోచించి చూస్తే - ప్రతి ఒక్కరూ ఇరుక్కుపోతున్న, తప్పించుకోలేకపోతున్న తీవ్రమైన వ్యసనం. తీసుకున్న సెల్ఫీని మరుక్షణమే సోషల్ మీడియాలో పెట్టుకోవాలని జనం తాపత్రయపడుతున్నారు. ఈ సెల్ఫీల వ్యవహారంతో మిగిలిన ఇబ్బందుల మాట ఎలా ఉన్నా, అమ్మాయిలు మాత్రం అమాయకంగా బలి అవుతున్నారు. కొందరు సైబర్ నేరగాళ్ళ చేతిలో ఆయుధంగా మారిన సెల్ఫీలకు బలవుతున్నారు.  

స్నేహం, ప్రేమ, పెళ్ళి పేరుతో కొందరు ప్రబుద్ధులు - అమ్మాయిల్ని నమ్మించి, వాళ్ళతో సన్నిహితంగా మెలుగుతున్నారు. ఫోటోలు తీసుకుంటున్నారు. తీరా ఎక్కడో బెడిసికొట్టాక, ఆ ఫోటోలను నెట్‌లో పెడతామంటూ బ్లాక్‌మెయిల్ చేస్తున్నారు. ఇలాంటి సైబర్ నేరగాళ్ళ సంఖ్య ఇప్పుడు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతోంది. తాజాగా వెలుగులోకి వచ్చిన సంఘటనలే అందుకు ఉదాహరణ.

సెల్ఫ్ గోల్!
హైదరాబాద్‌లోని సఫిల్‌గూడాకు చెందిన 32 ఏళ్ళ నిజాముద్దీన్ హైదర్ ఇలాంటి సైబర్ నేరానికే పాల్పడ్డాడు. అయిదేళ్ళ క్రితం ఉద్యోగం కోసం ఓ ఇంటర్వ్యూకు వచ్చిన అమ్మాయితో పరిచయం చేసుకున్నాడు. ఎం.బి.ఏ. చదివిన ఆ అమ్మాయితో స్నేహం చేశాడు. అనాథనంటూ సినిమా కష్టాలన్నీ చెప్పుకొని సానుభూతి చూరగొన్నాడు. రోజులు గడిచేకొద్దీ వాళ్ళ పరిచయం కాస్తా స్నేహం పరిధి దాటి, చాలా ముందుకు వెళ్ళింది. త్వరలోనే పెళ్ళి చేసుకుంటానని ఆ అమ్మాయికి మనోడు మాయ మాటలు చెప్పాడు.

అలా రెండేళ్ళు గడిచిపోయాయి. ఆ సమయంలో ఆ అమాయకురాలు ఈ మేకవన్నె పులితో సన్నిహితంగా మెలుగుతూ, అతని ఫోన్‌లో చాలా సెల్ఫీలు దిగింది. తీరా నిజాముద్దీన్‌కు అప్పటికే పెళ్ళి అయిపోయిందని ఆమెకు ఆలస్యంగా అర్థమైంది. దాంతో, అతగాడిని దూరం పెట్టింది. కానీ, కలసి తీసుకున్న సెల్ఫీలను అడ్డం పెట్టుకొని, ఆమెను నిజాముద్దీన్ బ్లాక్‌మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. ఇంటర్నెట్‌లో పెడతానంటూ బెదిరించసాగాడు. చివరకు బాధితురాలు సైబర్ క్రైమ్ పోలీసుల్ని ఆశ్రయించింది. సైబర్ నేరగాడు నిజాముద్దీన్‌ను ఈ ఏప్రిల్ ఆఖరులో పోలీసులు అరెస్ట్ చేశారు.

సైబర్ నేరాల్లో మరో వికృత కోణం - సోషల్ మీడియాలో తప్పుడు ఐడెంటిటీతో చేస్తున్న మోసపూరిత స్నేహాలు. హైదరాబాద్‌లోని భోలానగర్‌కు చెందిన అబ్దుల్ మజీద్ చేసింది అదే. 21 ఏళ్ళ ఈ ఇంజనీరింగ్ విద్యార్థి ఫేస్‌బుక్ ద్వారా ఏకంగా కొన్ని వందల మంది అమ్మాయిలతో స్నేహం చేశాడు. తాను కూడా అమ్మాయినే అని ఫేక్ ఐడెంటిటీతో నమ్మించాడు. తోటి కాలేజ్ స్టూడెంట్ అనుకున్న అమ్మాయిలందరూ అతని వలలో పడ్డారు. ఎంతగా మోసపోయారంటే, చివరకు తమ తల్లితండ్రులతో చెప్పని విషయాలు కూడా ‘ఆమెనని మోసం చేసిన అతని’తో పంచుకున్నారు. మద్యపానం, పొగతాగడం దగ్గర నుంచి చివరకు తమ బాయ్‌ఫ్రెండ్స్, లైంగిక ప్రాధాన్యాల దాకా అన్నీ చెప్పుకొన్నారు.

అలా వాళ్ళ దగ్గర చనువు సంపాదించిన మజీద్ వాళ్ళ నుంచి అర్ధనగ్న సెల్ఫీలు కూడా తెప్పించుకున్నాడు. ఆ తరువాత ఆ సెల్ఫీల బూచి చూపెట్టి, భయపెట్టసాగాడు. ఆన్‌లైన్‌లో పెట్టేస్తానంటూ బెదిరించసాగాడు. ఈ వ్యవహారం చివరకు సైబర్ పోలీసులకు చేరింది. కొన్ని వందల మంది టీనేజ్ అమ్మాయిల అర్ధనగ్న సెల్ఫీలు, ఫోటోలను ఈ ప్రబుద్ధుడు సేకరించినట్లు తేలింది. గతంలో ఏడు నెలల కాలంలో రెండుసార్లు అరెస్టయిన మజీద్‌పై తాజాగా పీడీ చట్టం కింద చర్య చేపట్టారు.

ప్రేమికుడే బ్లాక్‌మెయిలర్!
ఇవాళ సమాజంలో అమ్మాయిలపై పెరుగుతున్న సైబర్ వేధింపులకు ఈ తాజా సంఘటనలు మచ్చుకు ఒకటి రెండు మాత్రమే! అసభ్యంగా కానీ, బెదిరింపు ధోరణిలో కానీ ఆడవారికి మెయిల్స్, మెసేజ్‌లు పెట్టడం సైబర్ నేరాల విభాగంలోనే, మహిళలపై సాగుతున్న దౌర్జన్యాల కిందకు వస్తాయి. అలాగే, ప్రైవేట్, అశ్లీల సమాచారాన్ని, ఫోటోలను ఆన్‌లైన్‌లో కానీ, అశ్లీల సైబర్ ప్రపంచంలో కానీ పోస్ట్ చేయడం, సర్క్యులేట్ చేయడం కూడా! స్త్రీల విషయంలో ఈ రెండు రకాల నేరాలు ఇటీవల పెరుగుతున్నాయి.

నిజం చెప్పాలంటే - సన్నిహితంగా ఉంటూ తీసుకున్న సెల్ఫీలు, వీడియోలు, వీడియో ఛాట్‌లు ఇప్పుడు స్త్రీల బ్లాక్‌మెయిలింగ్‌కు ప్రధాన అస్త్రంగా మారుతున్నాయి. నూటికి దాదాపు 30 కేసుల్లో - ఇలా మాజీ లవర్స్, మోసగాళ్ళు ఒకప్పటి ఫోటోలు, వీడియోలతో బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడుతున్నారని పోలీసులు చెబుతున్నారు.
 విచిత్రం ఏమిటంటే, ఫిర్యాదులైతే చేస్తున్నారు కానీ, బాధితుల్లో నూటికి 90 మంది ఈ విషయాన్ని ఎఫ్.ఐ.ఆర్. దాకా తీసుకువెళ్ళడం లేదు.

విషయం వీధికెక్కకుండా, ఆ మోసగాళ్ళ చేతి నుంచి ఆ ఫోటోలు, వీడియోలను డిలీట్ చేయడం మీదే దృష్టి పెడుతున్నారు. అవి ఏవీ ఆన్‌లైన్‌లోకి రాకుండా ఉండేలా చూడాలని మాత్రమే తాపత్రయపడుతున్నారు. అమెరికాలోని ఫ్లోరిడా స్టేట్ యూనివర్సిటీ పరిశోధకులు ఆ మధ్య జరిపిన సర్వేలలో కూడా సెల్ఫీలకూ, మనుషుల మధ్య అనుబంధాల్లో ఉన్న సమస్యలకూ అవినాభావ సంబంధం ఉందని తేల్చాయి.

అదే పనిగా సెల్ఫీలు తీసుకోవడం, వాటిని పోస్ట్ చేయడం వల్ల అనుబంధాలు దెబ్బతింటాయని ‘సైబర్ సైకాలజీ, బిహేవియర్ అండ్ సోషల్ నెట్‌వర్కింగ్ జర్నల్’ సైతం పేర్కొంది.  మొత్తం మీద సెల్ఫీలతో ఉపయోగాల మాటెలా ఉన్నా, సమస్యలు చాలానే బయటపడుతున్నాయి. అమ్మాయిలూ! తస్మాత్ జాగ్రత్త! డోన్ట్ కమిట్ సెల్ఫీసైడ్!

- రెంటాల జయదేవ
............................................

తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ!  నూటికి 90 నమోదు కావట్లేదు!
‘సైబర్ నేరాలు’ జరిగినప్పుడు 2000 నాటి ‘ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం’ కింద, భారతీయ శిక్షాస్మృతి (ఐ.పి.సి) కింద ఎక్కువ భాగం అరెస్టులు జరుగుతున్నాయి. పెరిగిపోతున్న పట్టణీకరణ, ఇంటర్నెట్ వ్యాప్తి వల్ల ప్రధానంగా నగరాల్లో, పట్టణాల్లో సైబర్ క్రైమ్ రేటు ఎక్కువగా ఉంటోంది. అయితే, నేరాల సంఖ్య వేలు, లక్షల్లో ఉన్నా, కేసుల నమోదవడం మాత్రం తక్కువే. మోసాలు, లైంగిక వేధింపులు, అప్రతిష్ఠ పాలు చేయడం లాంటి వ్యవహారాల్లో నూటికి 90 నేరాల్లో జనం వీధికెక్కడానికి ఇష్టపడడం లేదని సమాచారం. దాంతో, కేసులు నమోదు కావడం లేదు.

‘జాతీయ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో’ (ఎన్.సి.ఆర్.బి) సమాచారం మేరకు - కేవలం నమోదైన కేసుల లెక్కే చూసినా- 2010 నుంచి 2013 మధ్య కేవలం మూడేళ్ళ కాలంలో సైబర్ నేరాలు 350 శాతం పెరిగాయి. 2010లో కేవలం 966 సైబర్ నేరాల కేసులు నమోదైతే, 2013 కల్లా ఆ కేసుల సంఖ్య ఏకంగా 4,356కు చేరింది. భారతదేశం మొత్తం మీద గమనిస్తే - ఐ.టి, ఐ.టి సంబంధ పరిశ్రమలకు సంబంధించి 70 శాతానికి పైగా ఆదాయం తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక, మహారాష్ట్రల నుంచి వస్తుంది. అందుకు తగ్గట్లే, ఈ రాష్ట్రాల్లోనే ఐ.టి. చట్టం కింద అత్యధిక సంఖ్యలో సైబర్ నేరాలు నమోదు అవుతున్నాయి.
................................................

నెట్ సౌకర్యంతో పాటే... నేరాలూ...
ప్రస్తుతం సగటు సైబర్ క్రైమ్ రేటు ప్రపంచవ్యాప్తంగా 32 శాతం కాగా, భారతదేశంలో 16 శాతమే. అయితే, ప్రపంచ ఇంటర్నెట్ విపణిలో మన భారతీయ మార్కెట్ ఏటా 37 శాతం మేర పెరుగుతోంది. వచ్చే 2017 నాటికల్లా మన దేశంలో 50 కోట్ల మంది దాకా ఇంటర్నెట్ వినియోగదారులు ఉంటారని అంచనా. ఆ దెబ్బతో మనం అమెరికాను మించిపోయి, ప్రపంచంలో చైనా తరువాత నెట్ వినియోగదారుల సంఖ్యలో రెండో అతి పెద్ద దేశంగా అవతరిస్తామన్న మాట! ఆ లెక్కన సైబర్ నేరాల రేటు కూడా బాగా పెరగనుంది. ఈ నేరాల్లో భాగమైన లైంగిక వేధింపుల లాంటివి పక్కనపెట్టి, కేవలం ఆర్థిక నేరాల విషయం చూసినా, మనదేశంలోని ప్రతి నాలుగు సంస్థల్లో ఒకటి ఈ సైబర్ ఆర్థిక నేరాల బారిన పడుతోంది.
...................................................


సైబర్ భూతం బారినపడకుండా ఉండాలంటే...
♦ మీ వ్యక్తిగత సమాచారాన్ని ‘సోషల్ మీడియా ఛాట్’లలో వెల్లడించకండి.
♦ ప్రెమ మోజులో అవతలి వ్యక్తుల్ని అతిగా నమ్మి, వాళ్ళతో చనువుగా ఉంటూ, సెల్ఫీలు దిగడం ఎప్పటికైనా ఇబ్బందే!
♦ పిల్లలు కానీ, యువతీ యువకులు కానీ తల్లితండ్రులకు తెలియకుండా తమ ఫోటోలను ఆన్‌లైన్‌లో పోస్ట్ చేయకపోవడమే బెటర్.
♦ ఈ డిజిటల్ యుగంలో ఏ ఫోటో, ఏ వీడియో ఎక్కడ నుంచి ఎక్కడకు వెళుతుందో ఎవరూ చెప్పలేరు. కాబట్టి, మహిళలు తమ సన్నిహితులైనవారితో సహా ఎవరినీ తమ ప్రైవేట్ ఫోటోలు, వీడియోలను రికార్డు చేయనివ్వకూడదు.
♦ అపరిచితులు ఎవరితోనూ ‘సన్నిహితంగా’ ఛాటింగ్ చేయకండి. ప్రైవేట్ ఫోటోలను ఎవరితోనూ షేర్ చేయకండి.
♦ అపరిచితులతో మామూలు ఫోటోలు కూడా పంచుకోవద్దు. వారు దాన్ని ‘మార్ఫింగ్’ చేసి, బ్లాక్‌మెయిలింగ్ చేసే ముప్పు ఎక్కువ.
.......................................................
- రెంటాల జయదేవ
............................................

 Sakshi | Updated: June 06, 2016 23:08 (IST)

(Published in 'Sakshi' daily, Family page on 7th June 2016, Tuesday)


Thursday, March 10, 2016

ఎందరో మహానుభావుల కృషే కారణం.... (తెలుగు సినిమా జన్మదినోత్సవO)


ఎందరో మహానుభావుల కృషే కారణం 













‘‘ఎందరో మహానుభావుల కృషి వల్ల మనమిలా తెలుగు సినిమా తల్లి పండుగను ఆనందంగా జరుపుకోగలుగుతున్నాం. ఇప్పటి తరం కూడా ఈ వేడుకను జరపడం సంతోషకరమ’న్నారు అలనాటి ప్రముఖ నటి జమున.

 తొలి తెలుగు సినిమా ‘భక్తప్రహ్లాద’ ప్రేక్షకుల ముందుకొచ్చి ఈ నెల ఆరో తేదీకి 84 సంవత్సరాలయింది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో తెలుగు సినిమా జన్మదినోత్సవాన్ని తెలుగు చిత్ర పరిశ్రమ జరుపుకొంది. అందరూ కలిసి కేక్‌ను కోసి ఆనందాన్ని పంచుకున్నారు. 

అనంతరం జమున మాట్లాడుతూ ‘‘నిర్మాతలందరూ గర్వించదగ్గ నిర్మాత కె.రాఘవ. నేను నటిని కావడానికి కారణం ‘కీలుగుర్రం’. హెచ్‌.ఎం.రెడ్డి, కె.వి.రెడ్డి, తాతినేని ప్రకాశరావు వంటి ఎందరో ప్రముఖ దర్శకులు మమ్మల్ని తీర్చిదిద్దారు. ఇది చాలా అదృష్టం. ఇప్పటి తరంలోనూ గొప్ప దర్శకులున్నారు. వీరంతా వారి బాటలో నడుస్తూ ఇప్పడున్న సాంకేతికతను ఉపయోగించుకుని మరింత పురోగతిని సాధించాల’’న్నారు. 

తొలి తరం నటి కృష్ణవేణి మాట్లాడుతూ ‘‘ 1935లో సి.పుల్లయ్య రూపొందించిన ‘సతీ అనసూయ’లో నటించా. అందులో నా పారితోషికం ఆరు వందల రూపాయలు. ఆ తర్వాత నటిగా ఎన్నో చిత్రాల్లో నటించాను. పలు చిత్రాలు నిర్మించాను. అయితే నేను నిర్మించిన ‘కీలుగుర్రం’లో రాక్షసి వేషం వేయమని అంజలీదేవిని అడిగితే నేను పాట పాడితే వేస్తానని షరతు పెట్టి నటించింది. ఆ సినిమా ఆరోజుల్లోనే రూ.40 లక్షలు రాబట్టింది. అలనాటి జ్ఞాపకాలను ఈ వేడుకలో పంచుకోవడం ఆనందంగా ఉంద’’న్నారు. 

కోడి రామకృష్ణ మాట్లాడుతూ ‘‘మనమిలా ఈ వేడుక చేసుకోవడం ఓ జీవితసాఫల్యంగా భావిస్తున్నాను. ఈ వేడుకను మరింత ఘనంగా జరపలేదని అనుకోవద్దు. ఎందుకంటే తెలుగు సినిమా తల్లికి నిత్యమూ పండుగే. ఆనాటి మహానుభావులు సాధించినదానితో పోల్చుకుంటే మనం చేయాల్సింది ఇంకా చాలా ఉందనిపిస్తుంది. నాకు సినిమా భిక్ష పెట్టింది రాఘవగారే’’అని అన్నారు. 

‘‘ఈ వేడుకకు కారణమైన ఎందరో మహానుభావులను తలచుకుంటుంటే శరీరం పులకరించిపోతోంది. అనిర్వచనీయ అనుభూతిని పొందుతున్నామ’’న్నారు ఎస్వీ కృష్ణారెడ్డి. 

రామ్‌ రావిపల్లి చెబుతూ ‘‘తొలి తెలుగు సినిమా ‘భక్త ప్రహ్లాద’. హెచ్‌.ఎం.రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం 1931 సెప్టెంబరు 15న పుట్టిందనే ప్రచారం ఉంది. తెలుగు సినిమా పుట్టింది 1932 ఫిబ్రవరి 6 అనీ, దర్శకుడు హెచ్‌.ఎం.రెడ్డి అనీ, ఆ సినిమా తొలి టికెట్‌, పోస్టర్‌, కలెక్షన్‌ నివేదికలతో సహా నిరూపించిన రెంటాల జయదేవ్‌ కారణంగానే ఇప్పడీ వేడుకను ఈ రోజున జరుపుకున్నామ’’న్నారు. 

ఈ వేదికపై తొలితరం సినిమా ప్రముఖుల్ని సన్మానించారు. కార్యక్రమంలో తొలి నేపథ్య గాయని రావు బాలసరస్వతి, గీతాంజలి, నిర్మాత కె.రాఘవ, కె.ఎస్‌.రావు, రావి కొండలరావు, కాకరాల, రెంటాల జయదేవ్‌, అచ్చిరెడ్డి, కాశీ విశ్వనాథ్‌, సాగర్‌, రామసత్యనారాయణ, బాబ్జీ, సాయి వెంక‌ట్‌ తదితరులు పాల్గొన్నారు.






















(Published in 'Eenadu' daily, Cinema Page, 8th Feb 2016, Monday)
......................................

Thursday, February 11, 2016

అందుకే ఇన్నాళ్లు గుర్తింపుతో ఉన్నాం - సీనియర్‌ నటి జమున




‘‘గడిచిన రోజులు ఎంతో మంచివి. హెచ.ఎమ్‌. రెడ్డి, బి.ఎన,రెడ్డి, కె.వి.రెడ్డి, తాతినేని ప్రకాశరావు వంటి దర్శకులు నాలాంటి వారిని నాయికలుగా తీర్చిదిద్ది, వైవిధ్యమైన పాత్రలిచ్చి ప్రొత్సహించారు కాబట్టే తెలుగు పరిశ్రమలో ఇన్నాళ్లు మంచి గుర్తింపుతో ఉండగలిగాం. అలనాటి దర్శకులను స్ఫూర్తిగా తీసుకుంటే ఇప్పుడొస్తున్న యువ దర్శకులు కూడా ఉన్నత స్థాయికి చేరుకుంటారు’’ అని సీనియర్‌ నటి జమున అన్నారు.

 తెలుగు సినిమా పుట్టినరోజు వేడుక కళామంజూష కల్చరల్‌ అకాడమీ ఆధ్వర్యంలో ఆదివారం ప్రసాద్‌ ప్రివ్యూ థియేటర్‌లో జరిగింది. ఈ సందర్భంగా సీనియర్‌ నటీమణులు కృష్ణవేణి, జమున, గీతాంజలి, ప్రతాప్‌ ఆర్ట్స్‌ అధినేత కె. రాఘవ, గాయని రావు బాలసరస్వతి, రావి కొండలరావు, కాకరాల వెంకట సత్యనారాయణ, రెంటాల జయదేవలను జ్ఞాపికలతో సత్కరించారు. 

‘‘1935లో ‘సతీ అనసూయ’తో నన్ను బాలనటిగా పరిచయం చేసిన సి.పులయ్యగారిని ఎప్పటికీ మరువలేను. నటిగా, నిర్మాతగా సినీ పరిశ్రమలో నాకెన్నో మంచి అనుభవాలున్నాయి’’ అంటూ కృష్ణవేణి అలనాటి జ్ఞాపకాల్ని గుర్తు చేసుకున్నారు. 

‘‘చాలామంది మన సినిమా పుట్టినరోజును మరచిపోయాం అనుకుంటారు. పరిశ్రమకు చెందిన ఎవరొకరి జన్మదిన వేడుక ప్రతిరోజు జరుగుతూనే ఉంటుంది. అలా చూస్తే నిత్యం తెలుగు పరిశ్రమ పుట్టినరోజు వేడుక జరుపుకుంటునట్లే’’ అని కోడి రామకృష్ణ అన్నారు. 

‘‘తెలుగు పరిశ్రమ స్థాయి ఎంతో పెరిగింది. మున్ముందు ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను’’ అని కె. రాఘవ తెలిపారు. 

ఎస్వీ కృష్ణారెడ్డి,, కె. అచ్చిరెడ్డి, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, సాయివెంకట్‌, బాబ్జీ, రావిపల్లి రాంబాబు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.





















(Published in 'Andhra Jyothy' daily, Cinema Page, 8th Feb 2016, Monday)
.................................

సిగ్గుపడాలా? గర్వపడాలా!? (తెలుగు సినిమా తల్లి జన్మదినోత్సవ వేడుకలు)




chitram...
మొట్టమొదటి తెలుగు టాకీ సినిమా భక్తప్రహ్లాద ప్రదర్శితమై 84 ఏళ్లయన సందర్భంలో పాత తరానికి చిరు సన్మానం. చిత్రంలో అచ్చిరెడ్డి, రాఘవ, రామారావు, జయదేవ, కృష్ణవేణమ్మ, రావు బాలసరస్వతి, జమున, గీతాంజలి, రావికొండలరావు


......................................










వందస్తుల ఆకాశ హార్మ్యానికైనా
-పునాది ఒక్కటే ఉంటుంది.
80 ఏళ్ల జీవిత ప్రయాణమైనా
-పుట్టుకనుంచే మొదలవుతుంది.
మనిషికైనా మహాక్రతువుకైనా.. విధ్వంసానికైనా వినోదాలకైనా -ఒక మొదలుంటుంది. అది తెలియకుండానే తెలుగు సినిమాకు 84 ఏళ్లు వచ్చేశాయి. పేగు తెంచుకున్న బిడ్డ -ప్రపంచంలోకి రాగానే ఆ అద్భుత ఘడియలను తడిమి తడిమి వెతుక్కుంటాం. ఎంతోమంది బిడ్డలకు జన్మనిచ్చి, కళాకారులుగా గుర్తింపునిచ్చిన తెలుగు సినీ కళామతల్లి -ఆవిర్భావ ఘడియల్ని మాత్రం చరిత్ర పేజీల్లో నిక్షిప్తం చేయలేకపోయాం. దాని నీడన బతికేస్తూనే -మొదలును నరికేసే ప్రయత్నం మాత్రం
దిగ్విజయంగా చేసేస్తున్నాం.

మంచో చెడో, తెలిసో తెలియకో, దొరికిన ఆధారాలు నిజమో కాదోనన్న శంకలు పెట్టుకోకుండా చిన్నదో పెద్దదో -్ఫబ్రవరి 6న హైదరాబాద్‌లో కొందరు ఔత్సాహికులు చిన్న మహత్కార్యం నిర్వహించారు. పొరుగు రాష్ట్రం రికార్డుల్లో నిక్షిప్తమైవున్న ‘్భక్త ప్రహ్లాద’ ప్రదర్శిత తేదీని గుర్తు చేసుకున్నారు. అదే తెలుగు సినిమా ‘డేట్ ఆఫ్ బర్త్’ అన్న ఆనవాళ్లను ఆనవాయితీ చేసే సదుద్దేశంతో -ఆనందంగా వేడుక జరుపుకున్నారు. పదేళ్ల ప్రయత్నంతో ఆ తేదీని ఒకరు వెలికితీస్తే, వందేళ్ల సినిమాకు ఇంత అన్యాయం చేశామా? అన్న సిగ్గుతో కొందరు కనీసం చిన్న పండగైనా చేశారు. అసలా తేదీని ఎవరు నిర్థారించారు? తెలుగు సినిమా జన్మదినంగా ఆ రోజునే ఎందుకు జరుపుకోవాలన్న -అనుమానాలు అక్కడెవరికీ రాలేదు. నిజానికి రాకూడదు కూడా. ఎందుకంటే -అసలు లేనిదానికంటే తెలిసిన తేదీని ‘సినిమా బర్త్ డే’ అనుకుని సెలబ్రేషన్ చేయడం ఉత్తమం కనుక.

ఇంతకాలం మూలాలను గాలికి వదిలేసుకున్నందుకు సిగ్గుపడాలా? ఇప్పటికైనా తెలివి తెచ్చుకుని చిన్న ప్రయత్నంగా వెలికితీసిన ‘డేట్ ఆఫ్ బర్త్’ను అతి చిన్నగానైనా సెలబ్రేట్ చేసుకున్నందుకు గర్వపడాలా? అన్నది -సినిమాను నమ్ముకున్నోళ్ల, సినిమాను అమ్ముకుంటున్నోళ్ల, సినిమాను అభిమానించి ఆరాధించేవాళ్ల ఆత్మసాక్షిమీద ఆధారపడి ఉంటుంది.

ఎవరెస్ట్ ఎత్తాలనుకుంటే అత్యాశగానీ, ఎక్కాలనుకోవడంలో తప్పులేదుగా. నిన్న జరిగింది అలాంటి ప్రయత్నమే. తెలుగు సినిమాను ప్రత్యేకంగా ఉద్దరించాల్సిన పని లేదు. కనీసం -దాని పుట్టుకను గాలికొదిలేయకుండా నిక్షిప్తం చేసుకోవడం, పండుగ చేసుకోవడం మాత్రం చారిత్రక అవసరం. అందుకు -ఇచ్చకాలు చెప్పే గొప్ప స్టార్లు ఎంతవరకూ సహకరిస్తారో చూద్దాం.
ప్రపంచ సినిమా ప్రారంభమైనప్పుడే -తెలుగు సినిమా అంకురార్పణకు ఆలోచనా బీజం పడింది. మూకీ సినిమాగా ఆరంభమైంది. అయితే మూకీకి -్భషతో సంబంధం లేదు కనుక వాటిని విడిచిపెట్టాలి. మూకీ నుంచి మొదలైన అడుగులు టాకీకి చేరడంతో -తొలి తెలుగు టాకీ సినిమాగా భక్తప్రహ్లాద విడుదలైంది. నిజానికి ఆ సినిమా విడుదల రోజే -తెలుగు సినిమా డేట్ ఆఫ్ బర్త్. ఆ రోజు ఎప్పుడు? అన్నది కొనే్నళ్ల వరకూ అంతుచిక్కనిదే.
**

టాకీలు వచ్చిన తరువాత -సినిమా నిర్మాణంలో మునిగిపోయిన ముందుతరం చరిత్రను నమోదును చేయడం తెలుగు పరిశ్రమ మర్చిపోయింది. షూటింగ్‌ల్లో మునిగిపోయి గొప్ప చిత్రాలను రూపొందించారే తప్ప, చరిత్రను నిక్షిప్తం చేసుకోవాలన్న ఆలోచనకు రాలేకపోయారు. తొలి తెలుగు చిత్రం తొలిసారి తెరపై ఎప్పుడు ఆవిష్కృతమైందో ఎవరికీ తెలియని పరిస్థితి. ఆ విషయాన్ని నిర్ధారించుకోడానికి 80ఏళ్లు పట్టింది. డేట్ ఆఫ్ బర్త్‌ను సెలబ్రేట్ చేసుకోవడానికి మరో నాలుగేళ్ల కాలం గడిచింది. తొలి తెలుగు టాకీ సినిమా భక్త ప్రహ్లాద తెరపై తొలిసారి ఫిబ్రవరి 6, 1932లో ప్రదర్శించారన్న విషయాన్ని ఔత్సాహిక జర్నలిస్ట్ రెంటాల జయదేవ నాలుగేళ్ల క్రితమే నిరూపించాడు. అయినా పరిశ్రమ పెద్దలకు అదేమంత గొప్ప విషయం అనిపించలేదు. తెలుగు సినిమా తల్లి జన్మదినోత్సవ వేడుకలు జరుపుకోడానికి ఒక మొదలు దొరికిందన్న ఆనందం కలగలేదు.
**

సినిమా అనేది వినోదాన్ని పంచే వేడుక. స్వర్గయుగం నుంచీ ఎన్నో సినిమా వేడుకలు జరిగాయి. పరిశ్రమలోనూ, ప్రతి చిత్రంలోనూ, సినిమా విడుదలకు, వందరోజుల ప్రదర్శనకు.. ఇలా చిన్న కారణాలకూ పెద్ద వేడుకలే చేశారు. చేస్తూ వస్తున్నారు. ఆ వేడుకలు శృతిమించి స్టార్ హీరోల బర్త్‌డేలు, ఆడియో విడుదలలు, టీజర్లు, ఫస్ట్ పిక్ విడుదలలూ ఇలా వేడుకలు జరుగుతూనే ఉన్నాయి. చివరకు -స్టార్ హీరో సోషల్ మీడియా ఫాలోవర్స్ లక్షదాటినా, మేకోవర్ స్టిల్‌కు మిలియన్ లైకులొచ్చినా -పండుగలు చేస్తూనే ఉన్నారు. వీటన్నింటికీ మూలమైన -సినిమా పుట్టుకను మాత్రం పట్టించుకున్న వాళ్లు లేరు. బిడ్డ పుడితే జన్మనక్షత్రం, రాసిఫలం చూసుకుని ఉన్నతమైన భవిష్యత్ కోసం జాతకం రాయించుకుంటాంగానీ, -ఇంతమంది బిడ్డలకు కళా జన్మనిచ్చిన తెలుగు సినిమా పుట్టినరోజు జరుపుకోవడానికి తీరికలేనంత బిజీ అయిపోవడం నిజంగా దురదృష్టం. ఇప్పటి వరకూ పుట్టిన తేదీ తెలీదు కనుక జరపలేదు అనుకోవచ్చు, తెలిసిన తరువాతైనా ఏదీ పండుగ. ఎక్కడ వేడుక?
**
1932లో మాట్లాడే సినిమా మొదలైంది కనుక ఇప్పటికి 84 ఏళ్ల తెలుగు సినిమా అంటున్నాం. బాల్యం నుంచీ ఎయే దశలో ఏయే ఆనందం పొందుతామో -అలాగే తెలుగు సినిమా కూడా వనె్నచినె్నలు పోయి, దెబ్బలు తగిలించుకుని, ముళ్లనుదాటుకుని, కొన్ని సందర్భాల్లో పూలపై నడుస్తూ.. మొత్తానికి ఉన్నతమైన దశకు చేరకుంది. కష్టనష్టాలకు, సుఖానందాలకు నిలువెత్తు సాక్ష్యంగా ఇప్పటికీ -అప్పటి తరం నిలిచే ఉంది. వాళ్లను కదిలిస్తే కథలుగా చెప్తారు కూడా. కానీ కదిలించేది ఎవరు? చరిత్రను నిక్షిప్తం చేసేది ఎవరు?.
**
ఫిబ్రవరి 6, 2016.
పరిశ్రమను ప్రేమించే కొందరు వ్యక్తులు తెలుగు సినిమా తల్లి బర్త్‌డేను సెలబ్రేట్ చేశారు. కళామంజూష పేరిట ఏర్పాటు చేసిన సాంస్కృతి సంస్థ తరఫున దర్శకుడు బాబ్జీ, రామ్ రావిపల్లి, తుమ్మలపల్లి రామసత్యనారాయణ లాంటివాళ్లు అందులో పాలుపంచుకున్నారు. నిజానికిది -చిరు ప్రయత్నమే. కానీ -తెలుగు సినిమా చరిత్రలోని మొదటి అంకాన్ని రికార్డు చేసుకోవాలన్న చారిత్రక అవసరాన్ని గుర్తు చేసే చేదు నిజం. తెలుగు సినిమా పుట్టుపూర్వోత్తరాల గురించి వచ్చే తరాలు తెలుసుకోవాలంటే -ఇప్పుడు మనం వాటిని రికార్డు చేసి తీరాలన్న సంకల్పం వాళ్లది. అదృష్టంకొద్దీ ఇప్పటికీవున్న అప్పటి ఉద్ధండ నటీనటులు, దర్శకులు చెప్పే విషయాలను భద్రపర్చాలన్న సంకల్పం వాళ్లది. అప్పటి చరిత్ర మూలాల్ని కనుక్కోడానికైనా -ఇలాంటి చిరు ప్రయత్నాలు మొదలెట్టాలన్న కర్తవ్యాన్ని గుర్తు చేసే వేడుకది.
**
అందాల కలల ప్రపంచానికి సంబంధించిన తొలి అడుగు కనుక్కున్నారన్నది ఇక్కడ ప్రధానం కాదు. కానీ- ఈ ప్రయత్నం నుంచే అనేక చారిత్రక కోణాలు తెలుసుకునే ద్వారాలు తెరుచుకుంటాయి. అప్పటి సినిమా నిర్మాణ విశేషాల చరిత్ర అందుబాటులోకి వస్తుంది. ప్రస్తుతం తెలుగు సినిమా తొలి ప్రదర్శన తేదీని హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్‌లో ‘బర్త్ డే’గా నిర్వహించారు. ఇందులో తొలి నాళ్లల్లో కథానాయికగా నటించి, అనేక చిత్రాలను శోభనాచల స్టూడియో ద్వారా రూపొందించి అనేక మంది లెజెండ్స్‌ను పరిశ్రమకు పరిచయం చేసిన సి కృష్ణవేణి, తొలితరం నేపథ్యగాయని రావు బాలసరస్వతి, శతాధిక వృద్ధుడైనా ఇప్పటికీ మంచి కథ దొరికితే సినిమా తీస్తానంటున్న ప్రతాప్ ఆర్ట్స్ కె రాఘవతోపాటు అలనాటి నటీమణులు జమున, గీతాంజలి, నటులు కాకరాల, రావి కొండలరావు, కెఎస్ రావు లాంటి వాళ్ళను సత్కరించుకుని పండుగ చేసుకున్నారు. వాళ్ల అనుభవాలను తెలుసుకుని ఆనందించారు. ఈ ప్రయత్నం చల్లారిపోకుండా, తడారిపోకుండా సినీ పరిశ్రమలోని పెద్దలు నడుంకట్టాలి. అప్పుడే తెలుగు చిత్ర పరిశ్రమకు సరైన రికార్డు లేదని బాధపడుతూ సిగ్గుపడే పరిస్థితికి ఫుల్‌స్టాప్ పెట్టినవాళ్లం అవుతాం. కేవలం తళుకు బెళుకు చిత్రాలు చూపడమే కాదు, పరిశ్రమ చరిత్రనూ చెప్పేవాళ్లం అవుతాం. ఎవరో ఒకరు పూనుకుంటారులే అనుకోకుండా -పరిశ్రమ మనకు అన్నం పెట్టిందన్న నిజమైన అభిమానం ఉన్న వాళ్లంతా తరువాతి ‘బర్త్‌డే’లు పెద్ద ఎత్తున నిర్వహించడానికి పూనుకోవాలి. మూడుపువ్వులు ఆరుకాయల చరిత్రను లిఖించే సంప్రదాయాన్ని శాశ్వతంగా కొనసాగించాలి.
..............................................
జాతకం ఎలా?

ఎంతో ఆనందాన్ని, వినోదాన్ని పంచే తెలుగు సినిమా ఇటీవలి కాలంలో ఎందుకు వెలవెలబోతోందన్న ప్రశ్న -ఓ ఔత్సాహిక వ్యక్తికి కలిగిందట. జాతకం చెప్పమని జ్యోతిష్యుడు దగ్గరకెళ్తే -అందుకు పుట్టిన తేదీ కావాలని కోరాడట. అధ్యయనాలు, అష్టకష్టాల తరువాత ఒక తేదీని నిర్థారించుకున్న ఆ వ్యక్తి -తెలుగు సినిమా పుట్టిన తేదీని మళ్లీ జ్యోతిష్యుడికి చూపించాడట. మీ పరిశ్రమలో సిఎం అయిన నటుడున్నాడా? అని ప్రశ్నించాడట జ్యోతిష్యుడు. ఉన్నాడని సమాధానమిచ్చాడు ఔత్సాహికుడు. తన పాటతో అలరించిన గంధర్వ గాయకుడు ఉన్నాడా? అన్న ప్రశ్నకు ఘంటశాల పేరు చెప్పాడట. పరిశ్రమకు అంతర్జాతీయఖ్యాతి తెచ్చిన రెండు కళ్లలాంటి నటులున్నారా? అన్న ప్రశ్నించాడట పుట్టిన రోజుతో జాతకాన్ని చూస్తూ జ్యోతిష్యుడు. ఎన్టీఆర్, ఎన్నాఆర్‌ల పేర్లు చెప్పాడట ఔత్సాహికుడు. అయితే, ఇదే మీ తెలుగు సినీ కళామతల్లి పుట్టిన రోజయ్యా! అంటూ నిర్థారించాడట జ్యోతిష్యుడు. ఆ రోజునే మనమిప్పుడు సెలబ్రేట్ చేసుకున్నాం.
-ఎస్వీ కృష్ణారెడ్డి
.................................
ఎగతాళితో ప్రేరణ
నేను చెన్నయ్‌లో ఉన్నప్పుడు ఓ తమిళ పాత్రికేయుడు చేసిన ఎగతాళి తెలుగు సినిమా బర్త్ డేట్‌ను కనుక్కోవడానికి ప్రేరణ అయ్యింది. అన్ని రకాల ఆధారాలతో తమిళ సినిమాకు చరిత్రవుంది, మీకు లేదా? అంటూ ఎగతాళిగా ప్రశ్నించినపుడు జవాబు కోసం వెతకడం ప్రారంభించాను. ఢిల్లీ, కోల్‌కతా, హైదరాబాద్, చెన్నయ్, ముంబయి ప్రాంతాల్లో తిరిగి పదేళ్లు చేసిన కృషికి -చిన్న ఫలితం దొరికింది. అది -తొలి తెలుగు టాకీ సినిమా భక్త ప్రహ్లాదను శ్రీ కృష్ణ ఫిలిమ్స్ పతాకంపై బొంబాయికి చెందిన నిర్మాతలు రూపొందించారు. ముంబయి గెజిట్‌లో విడుదల చేసిన సెన్సార్ సర్ట్ఫికెట్‌ను పరిశీలిస్తే -అది ఫిబ్రవరి 6, 1932న విడుదలైందని అర్థమైంది. ఆ తేదీనే తొలి తెలుగు సినిమా ప్రదర్శన తేదీగా పరిగణించాలి.

- రెంటాల జయదేవ్
...............................
ఆమే.. అన్నం పెట్టింది!
తొలి నాళ్లల్లో నేను శోభనాచల స్టూడియోలో రికార్డింగ్ అసిస్టెంట్‌గా ఉండేవాడిని. షూటింగ్ కోసం కృష్ణవేణమ్మ నృత్యాన్ని సాధన చేస్తూ, రికార్డు చేసిన పాటను ప్రొజెక్టర్‌లో వెనక్కితిప్పి మళ్లీ మళ్లీ వినిపించమనేవారు. ప్రొజెక్టర్‌ను వెనక్కు తిప్పి పాటను వినిపించేవాళ్లం. సాంకేతికంగా సౌలభ్యం లేకున్నా, అంత కష్టాన్ని అప్పట్లో భరిస్తూ నిబద్ధతగా సాధన చేసేవారు. మీర్జాపురం రాజావారు మాటిమాటికీ ప్రొజెక్టర్‌ను వెనక్కు తిప్పుతున్నానంటూ ఉద్యోగంలోనుంచి తీసేస్తానన్నారు. అప్పుడు కృష్ణవేణమ్మ నేను రిహార్సల్స్ చేస్తున్నందువల్ల మళ్లీ మళ్లీ ప్రొజెక్టర్‌ను వెనక్కు తిప్పి పాట పెట్టమన్నానని చెప్పడంతో నా ఉద్యోగం నిలబడింది. నాకు ప్రమోషన్ కూడా ఇచ్చారు. కళాకారులను బిడ్డల్లా చూసుకునే రోజులవి. అందుకే స్వర్ణయుగంగా ఇప్పటికీ భావిస్తుంటాం.
- కెఎస్ రావు
.....................................
థ్రిల్లింగ్‌గా వుంది

తెలుగు సినిమా పుట్టిన రోజు ఉత్సవంలో పాల్గొనడం థ్రిల్‌గా ఉంది. వేలంటైన్స్, హీరోల హ్యాపీ బర్త్‌డేలు సెలబ్రేట్ చేసుకుంటున్న మనకి సినిమా బర్త్ డే సెలబ్రేట్ చేసుకోవడానికి ఒక డేట్ దొరికినందుకు గర్వించాలి. స్వర్ణయుగం సినీ కాలానికి ఆనవాళ్లుగా ఉన్న కృష్ణవేణమ్మ, జమున, గీతాంజలి వంటి వారిని సన్మానించుకోవడం మనల్ని మనం గౌరవించుకోడవమే.
- కాశీ విశ్వనాథ్

- Article written by Sarayu Sekhar
.......................................












































.......................................
...........................

తెలుగు సినిమా పుట్టినరోజు వేడుకలు


తెలుగు సినిమా పుట్టినరోజు వేడుకలు  [Held on 06-Feb-2016- Saturday at Prasad Labs, Hyderabad]

http://www.tv5news.in/newsdetails.aspx?ID=37622&SID=73&Title=Telugu%20cinema%20birthday%20celebrations


http://www.tv5news.in/WatchVideo.aspx?ID=37622&SID=73&Title=Telugu%20cinema%20birthday%20celebrations


(Telecasted in TV5 news channel on 7th Feb 2016, Sunday)
.............................................

Tuesday, January 19, 2016

ప్రేక్షకుల...తెలివి మీద ప్రేమతో... ‘నాన్నకు ప్రేమతో...’ ('నాన్నకు ప్రేమతో' మూవీ రివ్యూ)

ప్రేక్షకుల...తెలివి మీద ప్రేమతో...

తారాగణం: జూనియర్ ఎన్టీయార్, రకుల్ ప్రీత్‌సింగ్, కెమేరా: విజయ్ కె. చక్రవర్తి,
 సంగీతం: దేవిశ్రీప్రసాద్, నిర్మాత: బి.వి. ఎస్.ఎన్. ప్రసాద్,
 కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: బి. సుకుమార్

నవలలు సినిమాలుగా రావడం చాలా తెలుసు కానీ, సినిమాయే నవలలాగా
 ఉండే సందర్భాలు చాలా తక్కువ. ‘నాన్నకు ప్రేమతో...’ సినిమా చూస్తుంటే,
 గతంలో చదివిన యండమూరి వీరేంద్రనాథ్ తరహా రచయితల కమర్షియల్
 నవలలు, వాటిలోని తెలివైన వ్యూహాలు గుర్తుకొస్తాయి. ఇరవయ్యేళ్ళ క్రితం
 తన తండ్రిని మోసం చేసి, బిలియనీర్‌ని కాస్తా మధ్యతరగతి మనిషిగా
 మార్చేసిన విలన్ మీద పగ తీర్చుకోవడం హీరో లక్ష్యం. ఆ విలన్‌ను
 రోడ్డుపైకి ఈడ్చేయడం కోసం అచ్చంగా మళ్ళీ తెలివైన ఆ విలన్
 స్వభావాన్నీ, గుణాన్నే హీరో అతి తెలివిగా అనుసరిస్తాడు.

అభి (చిన్న ఎన్టీయార్) తండ్రి (రాజేంద్రప్రసాద్) ఒకప్పటి బిలియనీర్
 రమేశ్‌చంద్రప్రసాద్ . కానీ, కృష్ణమూర్తి (జగపతి బాబు) మోసంతో
 రోడ్డునపడతాడు. జనం తరిమితే, పారిపోయి, సుబ్రమ ణ్యంగా పేరు,
 రూపు మార్చుకొని బతుకుతాడు. పిల్లల్ని పెంచి, ముసలివాడవుతాడు. 
ఇక మరో నెలరోజుల్లో ప్రాణం పోయే తీవ్రవ్యాధితో మంచం మీద ఉన్న 
ఆ తండ్రి ఆ సంగతి తన కొడుకులకి చెప్పి, ప్రతీకారేచ్ఛ వెల్లడిస్తాడు. 
అన్నలు (రాజీవ్ కనకాల, అవసరాల శ్రీనివాస్) కాదన్నా, తమ్ముడు 
అభి రంగంలోకి దిగుతాడు. మరో ముగ్గురి సాయంతో, కృష్ణమూర్తి 
కూతుర్ని (రకుల్) ప్రేమలో పడేస్తాడు. తర్వాత బ్రెయిన్ గేవ్‌ులో 
విలన్‌పై చివరకు హీరో ఎలా విజయం సాధించి, తండ్రి పగ తీర్చాడనేది సినిమా.

ఫస్టాఫ్‌లో లవ్‌ట్రాక్ వ్యవహారం సరదాగా అనిపిస్తుంది. సెకం డాఫ్
 కీలక ఘట్టం. కానీ, తొలి పావుగంటలోనే విషయమంతా విప్పేసి,
 రెండుమ్ముప్పావు గంటలు సుదీర్ఘంగా హాలులో కూర్చో పెట్టడం 
కత్తి మీద సామే. అనేక లోపాల మధ్యనే ఆ ప్రయత్నం చేశారు.
 హీరోగా 25వ చిత్రంగా ఈ స్క్రిప్ట్‌నెంచుకోవడంలో, పాత్ర పోషణలో 
చిన్న ఎన్టీయార్ తన మూస నుంచి బయటకు రావాలని 
శ్రమించినట్లర్థమవుతుంది. గెటప్ శ్రద్ధా కనిపిస్తుంది. డ్యాన్‌‌సల్లో
 హుషారు సరేసరి! అతి మాస్ యాక్షన్ ఇమేజ్‌కు కొద్దిగా పక్కకు
 జరగడం బాక్సాఫీస్ రీత్యా అయినా కాకున్నా లాంగ్ కెరీర్‌లో 
ఆయనకు అవసరమైన మార్పే! తెలుగులో సొంతంగా డబ్బింగ్
 చెప్పుకున్న పంజాబీ రకుల్ ప్రీత్ సింగ్ ఎన్నారైగా నప్పింది.
 కాస్ట్యూవ్‌ు్స వగైరా పాత్రకు తగ్గట్లున్నాయి.

 ప్రత్యేకంగా చెప్పాల్సింది తెలివైన విలన్ కృష్ణమూర్తి పాత్రలో 
ట్రిమ్ గా, సూపర్ ఫిట్‌నెస్‌తో కనిపించిన జగపతిబాబు నటన. 
విలనైనా ఆ క్యారెక్టరైజేషన్‌లోని తెలివికి ప్రేమలో పడతాం.
 రాజేంద్రప్రసాద్ కనిపించేది కాసేపే. అదీ ఎక్కువగా మంచానికి 
పరిమితమయ్యే! ఆ స్టేజ్‌లో, అందులోనూ క్లైమాక్స్‌లో డైలాగైనా
 లేకుండా కేవలం ముఖంలో చూపే భావం ఆయన సీనియారిటీకి
 మచ్చుతునక. మిగిలినవన్నీ సహాయపాత్రలే.

లండన్ నేపథ్యంలో ఎక్కువగా నడిచే ఈ సినిమాకు ఆయువుపట్టు - 
నిర్మాణ విలువలు, కెమేరా వర్‌‌క, సంగీతం. దేవిశ్రీ ప్రసాద్ రాసి,
 చిన్న ఎన్టీయార్‌తో పాడించిన ‘ఐ వాంట్ టు ఫాలో ఫాలో’
 కొన్నాళ్ళు యువతరం ఫాలో అయ్యే పాట. భావోద్విగ్న
 సన్నివేశాల్లో రీరికార్డింగ్ మెరుపులూ ఆకట్టుకుంటాయి. 
అయితే ‘నాన్నకు ప్రేమతో’ అనే టైటిల్ రిజిస్టర్ చేసుకొని, 
ఆ అంశం చుట్టూ సినిమా తీస్తున్నప్పుడు, సెంటిమెంటల్ సీన్లకు
 మరింత ప్రాధాన్యమివ్వాల్సింది. అలాగే, హీరోయిన్‌ను చిన్నప్పటి 
నుంచి వెంటాడుతున్న కల తాలూకు అంశాన్ని హీరో ఛేదిస్తాడు.
 కానీ, జీవితంలో కీలకమైన ఆ సంగతి వెల్లడయ్యాక హీరోయిన్ పాత్ర 
తెరపై హఠాత్తుగా కనిపించడం మానేసింది. అంత చేసిన హీరో వెంట
 హీరోయిన్ నడిచిందా? తండ్రితో ఆమె బాంధవ్యమెలా మారింది 
లాంటి ప్రశ్నలకు తెరపై సమాధానాలు వెతకకూడదు.

పాత్రలు, పాత్ర చిత్రణ, కథను చెప్పిన విధానం చూస్తే... ప్రేక్షకుల 
తెలివితేటలు, అవగాహన మీద అతి ప్రేమతో దర్శక - రచయిత 
ఈ సినిమా తీశారనిపిస్తుంది. పూర్వాశ్రమంలో కాలేజ్‌లో లెక్కల 
లెక్చరరైన సుకుమార్ ఏవేవో లెక్కలు వేసుకొని ఈ సినిమా
 తీయలేదనీ అర్థమవుతుంది. ‘బటర్‌ఫై్ల ఎఫెక్ట్’ లాంటి అంశాలు, 
ఈస్ట్రోజెన్ లెవల్స్ లాంటి ప్రస్తావనలు సులభంగా అర్థమయ్యేలా
 చేయాలని పడిన తపన చూస్తే పాఠం విడమర్చి చెప్పారన్న
 భావన కలుగుతుంది.

ఎక్కడో తీర్చుకోలేకపోయిన నొప్పుల్ని మరెక్కడో తీర్చుకోవడానికి
 చూడడం మానవ నైజం. అందుకే, ఒక ఎమోషన్‌ను మరొకచోట 
చూపిస్తుంటాం. ‘నాన్నకు ప్రేమతో’ సినిమాలో ఇదొక ప్రధానమైన
 పాయింట్. నిజజీవితంలో తండ్రి మరణవేళ ఎదురైన కొన్ని 
ఎమో షన్‌‌సను తెరపై చూపేందుకు సుకుమార్ ప్రయత్నించారు. 
‘ఆర్య’, ‘1’ లాంటి సినిమాల్లో లాగే ఎక్స్‌ట్రీవ్‌ు ఆలోచనలు, 
కథలో ఇంటెలిజెన్స్, స్క్రీన్‌ప్లేలో కొత్తదనం మామూలే. ఈసారి
 స్ట్రెయిట్ నేరేషన్ స్క్రీన్‌ప్లేను ఆయన అనుసరించినా, ఆ మార్‌‌క 
చెరిగిపోలేదు. అందుకే, పాత్రల మధ్య ఇంటెలిజెన్స్‌తో మొత్తం 
నడిచే ఈ సినిమా కొండొకచో ప్రేక్షకుడి మెదడుకీ పనిపెడుతుంది.
 డైలాగులు, ఘట్టాల్లో కొన్ని పదేపదే చూడా లనిపిస్తే, మరికొన్ని
 చూడాల్సొస్తాయి. ప్రేక్షకులు ఆ శ్రమకు ఎంతమేర
 సిద్ధపడతారన్నదాన్ని బట్టి, వారి బాక్సాఫీస్ ప్రేమ వర్షిస్తుంది.

మొత్తం మీద అజ్ఞాతంలోని హీరో... విలన్ ఇంట్లో హీరో దాగుడుమూతలు... 
హీరో చేతిలో విలన్ బకరా... ఆల్రెడీ పెళ్ళి ఫిక్సయిన హీరోయిన్‌ను
 ఒప్పించి మరీ పెళ్ళిచేసుకోవడాలు - ఇలా వచ్చిన సినిమాలే
 కొత్తగా వస్తున్నరోజులివి. ఈ టైమ్‌లో కొత్తదనం కోరుకొంటున్నవారికి 
పాతకాలపు రివెంజ్ ఫార్ములా కథనే ఇంటెలిజెంట్ గేమ్‌గా, 
కొత్త పద్ధతిలో చెప్పడానికి చేసిన ప్రయత్నం ఈ సినిమాలో 
కనిపిస్తుంది. కొన్నిచోట్ల బుర్రకు పదును, ఇంకొన్నిచోట్ల వేడి
 తెప్పిస్తుంది. టైటిల్స్ నుంచి కొత్తదనం మాత్రం కాదనలే మనిపిస్తుంది.

అన్నట్లు, హాలులోంచి బయటకొస్తుంటే ఒక పెద్ద మనిషి,
 ‘ఇంతకీ సినిమా ఎలా ఉంది’ అని అడిగిన ఫ్రెండ్‌తో సినిమాలో 
జగపతిబాబు అన్నట్లే ‘గుర్తుపెట్టుకో! మళ్ళీ చెబుతా!’ ననడం 
వినిపించింది. హీరో చాలాసార్లన్నట్లు యాంగిల్ మార్చి కూర్చొని
చూస్తే మరోలా ఉండే ఈ సినిమా.. చూసిన ‘ఎమోషన్‌ను 
అక్కడికక్కడే తీర్చేసుకోలేం!’ ఎంతైనా జీరో ఎమోషన్‌‌స... 
జీరో ఎనిమీస్ సూత్రం చెప్పినంత ఈజీ కాదుగా!

- రెంటాల జయదేవ

(Published in 'Sakshi' daily, 15th Jan 2016, Friday, Family Page 2)
...................................................