జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Wednesday, September 30, 2015

‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ - కొత్త సినిమా గురూ!

అమ్మకానికి చాలా వస్తువులుంటాయి. దాదాపు అన్నీ డిస్కౌంట్ మీదే దొరుకుతాయి. కాంపిటీషన్ పెరిగేకొద్దీ డిస్కౌంట్ పెరుగుతుంది.కుర్ర హీరోల్లో కాంపిటీషన్ భేషుగ్గా ఉంది.అయినా, సుబ్రమణ్యం సేల్ వితౌట్ డిస్కౌంట్ నడుస్తోంది. మేనమామల పోలికని కొందరు... మెగాస్టార్ మూవ్‌మెంట్లని ఇంకొందరు... బాక్సాఫీస్‌కి బాగా పనికొస్తాడని అందరూ... మూడో సినిమాకు మూడ్ సెట్టయింది! శుక్రవారం కంటే ముందే సాయిధరమ్ తేజ్ సోల్డ్!!
చిత్రం: సుబ్రమణ్యం ఫర్ సేల్
పాటలు: భువనచంద్ర, చంద్రబోస్, వనమాలి, భాస్కరభట్ల
సంగీతం: మిక్కీ జె. మేయర్
 కెమెరా: సి. రామ్‌ప్రసాద్
ఎడిటింగ్: గౌతంరాజు
స్క్రీన్‌ప్లే: రమేశ్‌రెడ్డి, సతీశ్ వేగేశ్న, తోట ప్రసాద్
ప్రొడక్షన్ డిజైనర్: హర్షిత్
సహ నిర్మాతలు: శిరీష్ - లక్ష్మణ్
నిర్మాత: ‘దిల్’ రాజు
 కథ-మాటలు-దర్శకత్వం: హరీష్‌శంకర్
నిడివి: 154 నిమిషాలు

సినీ ప్రపంచంలో కథలు పది పన్నెండే అన్నది ఒక సూత్రీకరణ. ‘కొత్త కథలంటూ ఉండవు. ఒక పాయింట్ తీసుకొని పాత కథనే కొత్తగా చెప్పాల’న్నది సినీజనం నమ్మే బాక్సాఫీస్ సూత్రం. ఈ రెంటినీ అర్థం చేసుకోవడమే కాక, ఇప్పటి ట్రెండ్‌లో ఎంటర్‌టైనింగ్‌గా సినిమా తీయాలని చేసిన ప్రయత్నం - ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’.

 ఎవడీ సుబ్రమణ్యం? ఏమా కథ?
 తల్లీతండ్రీ లేని పిల్ల సీత (రెజీనా). పెదనాన్న, బాబాయ్‌ల ప్రేమతో పెరుగుతుంది. ఫేస్‌బుక్‌లో మూడేళ్ళుగా చాటింగ్ చేస్తున్న అమెరికా అబ్బాయితో ప్రేమలో పడుతుంది. ఇంట్లోవాళ్ళు ఇష్టం లేని పెళ్ళి చేస్తున్నారంటూ, అతనితో పెళ్ళి, అమెరికాలో చదువంటూ పారిపోతుంది. ఇక, అమెరికాలో సుబ్రమణ్యం (సాయిధరమ్‌తేజ్)ది వేరే కథ. ప్రతి క్షణాన్నీ డాలర్‌గా మార్చాలని రకరకాల జాబ్స్ చేస్తుంటాడు. అమెరికాలో హీరో, హీరోయిన్లిద్దరూ తారసపడతారు. ఆమెను అమెరికా రప్పించిన ప్రేమికుడు మోసగాడన్న విషయం తెలిశాక, హీరో ఆమెను కాపాడతాడు. అలా దగ్గరైన వాళ్ళిద్దరూ డబ్బు కోసం ఒక చోట భార్యాభర్తలుగా నటించి, ‘బెస్ట్ కపుల్’ ప్రైజ్ కూడా కొట్టేస్తారు.
 కజిన్ సిస్టర్ పెళ్ళికని హీరోయిన్, సవతి చెల్లి పెళ్ళికని హీరో ఇండియాకొస్తారు. హీరోయిన్ వెంట వాళ్ళింటికి హీరో కూడా వెళతాడు. అక్కడ వారిద్దరినీ అందరూ భార్యాభర్తలనుకుంటారు. వీళ్ళు కూడా తప్పనిసరై, అదే నాటకం ఆడతారు. మరోపక్క హీరోను చూసి ‘సుబ్రమణ్యం తిరిగొచ్చాడు’ అంటూ కొందరు విలన్లు వెంట పడతారు. విలన్ చెల్లితో పెళ్ళికి ఒప్పుకొని, తీరా అనుకోని పరిస్థితుల్లో హీరో అమెరికా పారిపోయాడన్నది ఫ్లాష్‌బ్యాక్. హీరో వారి నుంచి ఎలా బయటపడ్డాడు? హీరోయిన్, హీరోల పెళ్ళి ఎలా అయిందన్నది మిగతా కథ.   

 బోలెడన్ని సీన్లు... పాత్రలు...
 మూడు పాటలు, ఆరు సీన్లుగా సినిమా ఫస్టాఫ్ సుదీర్ఘంగా నడిచినట్లనిపించినా, సెకండాఫ్ వినోదం ఎక్కువ పంచుతుంది. ఈ సినిమాలో లేనిది లేదు. కోట శ్రీనివాసరావు, జీవా, సప్తగిరి, ‘ప్రభాస్’ శీను - ఇలా ప్రముఖులు చేసిన ఒకటి, రెండు సీన్ల పాత్రలున్నాయి. ఒకటికి నాలుగు పెళ్ళి సీన్లున్నాయి. పీటల మీద పెళ్ళిళ్ళు ఆఖరు క్షణంలో ఆగిపోవడాలున్నాయి. ఒకరిని ప్రేమిస్తూ, వేరొకరితో పెళ్ళికి సిద్ధపడడమనే త్యాగాలుంటాయి. పెళ్ళి కాని వ్యక్తులు పెళ్ళయినంత ఫీలింగిచ్చే చీటింగ్ డ్రామా ఉంది. ఒకరికి ముగ్గురు విలన్లుంటారు. ‘చంటిపిల్ల తప్పిపోతే వెతుక్కోవాలి. ఎదిగినపిల్ల పారిపోతే మర్చిపోవాలి’ లాంటి జీవితసూత్రాలు ఒకదాని వెంట మరొకటొచ్చి పడిపోతుంటాయి. ఎప్పటికప్పుడు మనసు మార్చుకొని మాట మార్చే పాత్రలుంటాయి. ఇలా చాలా ఐటమ్సున్నాయి.

 హుషారైన నటన... ఉత్సాహంగా డ్యాన్సులు...
మొదలైంది మొదటైనా, రిలీజ్‌లో రెండోదిగా మారిన ‘రేయ్’ చిత్రం నుంచే ‘సుప్రీమ్ హీరో’ బిరుదాంకితుడైన నటుడు సాయిధరమ్ తేజ్. ముచ్చటైన ఈ మూడో సినిమాలోనూ హీరోయిజమ్‌పై డిపెండయ్యారు. రూపురేఖల్లోనే కాదు, హావభావాల్లోనూ తన ‘మెగా’ మేన మామల నుంచి ఈ కొత్త హీరో చాలానే పుణికిపుచ్చుకున్నారు. తెరపై అది తరచూ తొంగిచూస్తుంటుంది. సన్నివేశాల్లో హుషారుగా, డ్యాన్సుల్లో ఎనర్జిటిక్‌గా చేశారు.

‘సీత... సీత ఇక్కడ... అంత ఈజీ కాదు...’ అనే కథానాయిక పాత్రలో రెజీనా అందంగా ఉంది. ఆ పాత్ర రూపకల్పనతో పోలిస్తే ఆమె ఆకర్షణే సినిమా అంతటా కొంత నిలకడైన విషయం. రావు రమేశ్ విలక్షణ మాట తీరుతో విలనిజమ్ చూపారు. మరో విలన్‌కి చెల్లెలుగా నటి ఆదా శర్మ ఇంట్లో ఏసీ రిపేరింగ్‌కు వచ్చే మెకానిక్‌తో లవ్‌లో పడే పాత్రలో కనిపిస్తారు. చంచల స్వభావమున్న ఈ చిన్న పాత్ర ఆమె కెరీర్ కన్నా కథకే కీలకం. విదేశాల్లో స్థిరపడ్డ ఒకప్పటి విలన్ ప్రదీప్‌శక్తి రెస్టారెంట్ ఓనర్‌గా చాలాకాలానికి కనిపించారు.

 సెకండాఫ్‌లో... కామెడీ రిలీఫ్
 పెళ్ళి, మొగుడుకు సంబంధించి సాగే ఈ కన్‌ఫ్యూజన్ డ్రామాలో రిలీఫ్ - బ్రహ్మానందం పోషించిన చింతకాయ్ పాత్ర. వంట రాకపోయినా చేయి తిరిగిన వంటవాడిలా బిల్డప్ ఇస్తూ, అమెరికాకు వచ్చే ఆ పాత్రలో బ్రహ్మానందం నటన, అతని అంతరాత్మ చేసే విన్యాసం నవ్విస్తాయి. రౌడీ గ్యాంగ్ ‘ఫిష్’ వెంకట్ బృందం చేసే చేష్టలు వినోదం పంచుతాయి. ఈ చిత్రంలో ‘జమ్.. పంకజమ్.. మిఠాయి పంకజమ్’ (ఓనర్ భార్య-బ్రహ్మానందం ట్రాక్), ‘మొహం మొగ్గలా ఉండడం’, లైంగిక చర్యను సంకేతిస్తూ ‘కారులో యోగా’ లాంటి డైలాగుల్ని వినిపిస్తారు. ‘(శోభనంగదిలో) నువ్వు అరిస్తే మంచి మేటరున్న మొగుడు దొరికాడనుకుంటారు’ అని హీరోయిన్ గురించి హీరోతో అనిపిస్తారు.

 కొత్తగా రేకెత్తే... పాత జ్ఞాపకాలు
 సాంకేతిక విభాగాల్లో - ఛేజింగుల్లో కెమేరా వర్క్, టాప్ యాంగిల్ షాట్స్, హైవే ఫైట్ (ఫైట్ మాస్టర్ రామ్ - లక్ష్మణ్) లాంటివి ప్రత్యేకించి గుర్తుంటాయి. హీరో ఒక్కడికే కాక చాలా భాగం సీన్లకీ బోలెడంత బిల్డప్ ఇచ్చిన వైనం సినిమాలో కనిపిస్తుంది. కానీ, బ్రహ్మాండం బద్దలవుతుందనుకొనే ప్రతి సీనూ, బద్దలు చేస్తుందనుకున్న ప్రతి పాత్రా మళ్ళీ మామూలుగా మారిపోతూ, ప్రేక్షకుల ఊహకందకుండా తిరుగుతాయి. ఒక రకంగా ఇది ప్లస్సే అయినా, మోసపోయాననే ఫీలింగ్ ప్రేక్షకుడికి కలిగితేనే చిక్కు. ఇక, చివరకొచ్చేసరికి ఉడికీ ఉడకని సెంటిమెంట్, సగటు సీరియల్ తరహా క్లైమాక్స్ ఎదురవుతాయి. మొత్తానికి, దర్శకుడు చెప్పినట్లే, ఈ సినిమా గతంలో వచ్చిన అనేక చిత్రాల ప్యాట్రన్‌లో నడిచే కలగూర గంప. ‘మొగుడు కావాలి’, ‘బావగారూ బాగున్నారా’ నుంచి ఎన్టీయార్ ‘బృందావనం’ దాకా చాలా సిన్మాలు, సీన్లు గుర్తొస్తాయి. ‘గువ్వా గోరింకతో...’ రీమిక్స్ కొన్నేళ్ళ వెనక్కి తీసుకువెళుతుంది.  వెరసి, పాత వెండితెర జ్ఞాపకాలనే కొత్తగా అమెరికా బ్యాక్‌డ్రాప్‌తో కళ్ళ ముందుకు తెచ్చే కమర్షియల్ ఎంటర్‌టైనర్ - ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’.   

 - రెంటాల జయదేవ

(Published in 'Sakshi' daily, 25th Sep 2015, Friday)
..................................................

సూర్య సినిమాకు తప్పు చేశా! - నిర్మాత లగడపాటి శ్రీధర్‌

ఆయన సిల్వర్‌స్పూన్‌తో పుట్టారు. సిల్వర్‌స్క్రీన్ గురించి కలగన్నారు. పదేళ్ళ క్రితం నిర్మాతయ్యారు. లగడపాటి శ్రీధర్‌గా పేరు సంపాదించుకున్నారు. ఏం సంపాదించినా అన్నీ సినిమాల వల్లే కాబట్టి, చుట్టూ ఉన్నవాళ్ళను ‘సినిమాల’తోనే సంతోషపెట్టాలనుకొన్నారు. శుక్రవారం ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ...’తో రానున్నారు. ఈ సందర్భంగా ఇవాళ్టి బర్త్‌డే బాయ్ శ్రీధర్‌తో కాసేపు...

 * వరుసగా కన్నడం నుంచి రీమేక్ చేస్తున్నారేం?
 బడ్జెట్ పరిమితులున్న చోట, తప్పనిసరై క్రియేటివిటీ వెల్లివిరుస్తుంది. కన్నడంలో అదే జరుగుతోంది. నన్నడిగితే, మన చిన్న సినిమాలకు కన్నడ చిత్రాలే నమూనా లాంటివి. వాటిని గనక తెలుగుకు తగ్గట్లు రీ-ప్యాకేజ్ చేసుకొని, ఇంప్రూవ్ చేసుకుంటే, మంచి చిన్న సినిమాలు వస్తాయి. అందుకే, ‘పోటు గాడు’, తాజాగా ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ...’ లాంటివి చేయగలిగా.

* కానీ, చిన్న సినిమాల్ని ప్రేక్షకులు ఆదరిస్తారంటారా?
 ప్రొడక్షన్ వ్యాల్యూస్, పబ్లిసిటీతో సహా 5 కోట్లలో సినిమా తీస్తే కానీ, ప్రేక్షకుల్ని ఆకర్షించే చిన్న సినిమా రాదు. అలాంటి ప్రయత్నమే ప్రేమ ఇతివృత్తంగా తీసుకొని తీస్తున్న ‘కృష్ణమ్మ...’ ప్రేమకు ఒక గైడ్‌లా ఉంటుంది. స్కూలు మొదలు కెరీర్ దాకా పన్నెండేళ్ళ ప్రేమ ప్రయాణాన్ని చూపెట్టాం.

 * డిజిటల్ ఏజ్‌లో స్వచ్ఛమైన ప్రేమను కోరేవారు, చూసేవారు ఉంటారా?
 ఇందులో టైమ్‌పాస్ లవ్, టైమ్‌లెస్ లవ్ - రెండూ చూపించాం. జీవితంలో చాంపియన్ కావాలంటే, సిన్సియర్ ప్రేమే అవసరమని చెప్పాం.

 * బయట ఎమోషనల్‌గా ఉండే మీరు, ప్రేమ కథలు తీయడం...?
 (మధ్యలోనే అందుకుంటూ...) కుటుంబ విలువల మీద నాకు ఆసక్తి ఎక్కువ. సిన్సియర్ ప్రేమను చూపిస్తూ, కన్నడంలో చంద్రు తీసిన ‘ప్రేమ్ కహానీ’, ‘తాజ్‌మహల్’, ‘చార్మినార్’ మూడూ వసూళ్ళ వర్షం కురిపించాయి. ‘తాజ్‌మహల్’ను ‘పోటుగాడు’గా తీశా. ఇప్పుడు ఇది చేశా.

 * డెరైక్షన్, కెమేరా, సంగీతం- వీటికి కన్నడ టీమ్‌నే వాడారేం?
 చాలా రీమేక్స్‌లో ఒరిజినల్‌లో ఉన్న ఫ్లేవర్ మిస్సయిందని అనుకుంటూ ఉంటాం. అందుకే, ‘చార్మినార్’ దర్శకుడు (చంద్రు), కెమేరామన్ (కె.ఎస్. చంద్రశేఖర్), సంగీత దర్శకుడు (హరి) ముగ్గురినీ తీసుకున్నా.

* మీ జోక్యం ఎక్కువనేనా స్టార్స్‌తో సినిమా తీయలేదు?
 స్టార్స్ కోసం సినిమాలు తీయలేను. సినిమాను ప్రేమిస్తా. చేస్తున్న పని ప్రతి సెకనూ ఆస్వాదిస్తా. టీమ్ సక్సెసే నా సక్సెస్ అనీ, ప్రేక్షకుల వినోదానికి బాధ్యుడిగా నిలవాలనీ భావిస్తా. అవన్నీ తెలిసినవాళ్ళే నాతో చేయడానికి ముందుకొస్తారు. కాంబినేషన్స్‌తో డబ్బులు పెట్టి కూర్చోవడం ఇష్టం లేదు. అందుకే, నాకెప్పుడూ నిద్ర లేని రాత్రుల్లేవు.

 * మరి, సూర్య ‘సికిందర్’ను డబ్ చేసిన విషయం...?
 (మధ్యలోనే...) వేరేవాళ్ళ మాట నమ్మి, చూడకుండానే రిలీజ్ చేసేశా. అది నేను చేసిన తప్పు. అలా మళ్ళీ చేయను.

* నిర్మాతగా ఈ పదేళ్ళలో ఆర్థికంగా పోగొట్టుకున్నదే ఎక్కువేమో?
 నో రిగ్రెట్స్! కాకపోతే, ఛాన్సిచ్చి చూద్దామని ‘అండర్ డాగ్స్’ మీద తరచూ పందెం కాశాను. పాఠాలు నేర్చుకున్నా. ఇప్పుడిక దీన్ని బిజినెస్‌గానే చేయాలనుకుంటున్నా. ఇకపై మంచి రేసుగుర్రాలపైనే పందెం కాస్తా.

* మీ అబ్బాయి కూడా సినిమాల్లోకి వచ్చి, నటిస్తున్నట్లున్నాడు!
 మా అబ్బాయి విక్రమ్ (9వ తరగతి)కి నటుడు కావాలని ఆశ. దర్శకుడు సురేందర్‌రెడ్డి ‘రేసుగుర్రం’లో పరిచయం చేశారు. ‘కృష్ణమ్మ...’లో చిన్నప్పటి ఎపిసోడ్‌లో వాడు నటించాడు. అందరూ రకరకాల స్టార్స్ అని పేరు పెట్టుకుంటుంటే, వాడు ‘గ్లోబల్ స్టార్’ అని పెట్టుకున్నాడు (నవ్వు).

* మీ రాబోయే సినిమాలు?
 తమిళ సూపర్‌హిట్ ‘గోలీసోడా’ హక్కులు కొన్నా. అన్నీ కుదిరితే, ఆ రీమేక్ చేయాల్సిందిగా ‘అతనొక్కడే’ కథా చర్చల రోజుల నుంచి మాకు సన్నిహితుడైన దర్శకుడు సురేందర్‌రెడ్డిని రిక్వెస్ట్ చేస్తున్నా. చూద్దాం.

* ఏమిటీ అన్నీ రీమేక్‌లేనా? అవి సేఫ్ అనా? సొంత కథలు చేయరా?
 మూడు నాలుగు మించి కొత్త కథలెవరూ చెప్పలేరు. మొదట నేనూ కొత్త ఐడియాలతో వచ్చా. ఇప్పుడు రీమేక్‌లు చేస్తున్నా. అది సొంత కథా, రీమేకా అని కాదు - జనానికి కావాల్సినవి, నచ్చేవి ఇవ్వాలనుకుంటున్నా.

* మీ డ్రీమ్ ‘స్టైల్ -2’ ఏమైంది?
 స్క్రిప్ట్ సిద్ధం. అద్భుతంగా నాట్యం చేసే అమ్మాయి చుట్టూ తిరిగే కథ. అలాంటి నటి కోసం చూస్తున్నా. వేటూరి గారు చివరి రోజుల్లో బెడ్ మీద ఉంటూనే, ‘స్టైల్ -2’ కోసం రెండు అద్భుతమైన పాటలు రాశారు. ఎప్పటికైనా ఈ సినిమా తీసి, ఆయనకు అంకితమిస్తా.     
  - రెంటాల

(Published in 'Sakshi' daily, 14th June 2014)
...................................................

Wednesday, August 26, 2015

yaddanapudi-sulochana-rani-honoured-with-malathi-chandur-puraskar


Sunday, July 5, 2015

అడగరు కాబట్టే... అది గాసిప్ అయింది! - నిర్మాత ‘దిల్’ రాజు

తొలి చిత్రాన్నే ఇంటిపేరుగా మార్చుకొని, ఈ ఏప్రిల్‌తో పన్నెండేళ్ళు పూర్తి చేసుకున్న నిర్మాత - ‘దిల్’ రాజు. చిన్న సినిమాలతో మొదలై పెద్ద సినిమాలు చేసి, పట్టిందల్లా బంగారమైన రోజులు, చేతులు కాల్చుకున్న అనుభవాలు - రెండూ చవిచూశారాయన. ‘కేరింత’ అనే చిన్న సినిమాతో శుక్రవారం జనం ముందుకొస్తున్న ఈ సినీ ప్రేమికుడితో...

* చాలారోజులకి చిన్న సినిమాతో ‘కేరింత’ కొడుతున్నారే!
 (నవ్వేస్తూ...) ‘కొత్త బంగారు లోకం’ తర్వాత చాలాకాలానికి  మంచి స్క్రిప్టు దొరికింది. కొత్తవాళ్ళతో చేశాం. హీరో హీరోయిన్లు సుమంత్ అశ్విన్, శ్రీదివ్యలను పక్కనపెడితే, ఇద్దరబ్బాయిలు, ముగ్గురమ్మాయిలను ఈ సినిమాతో పరిచయం చేస్తున్నాం. ఏడాది పాటు స్క్రిప్టు మీద వర్క్ చేసి, అందులోని బెస్ట్ వెర్షన్‌ను ఇప్పుడు సినిమాగా అందిస్తున్నాం. వినోదంతో పాటు, చిన్న చిన్న భావోద్వేగాలతో కూడిన క్షణాలను తెరపై అందిస్తున్నాం. ‘ఆర్య, బొమ్మరిల్లు, కొత్త బంగారు లోకం’ తరువాత నా బ్యానర్‌లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిల్మ్స్.

 * మొత్తానికి, పెద్దవి వదిలేసి, మళ్ళీ చిన్న సినిమాల మీద పడ్డారు?
 2008 వరకు నేనూ వర్ధమాన హీరోలతో సినిమాలు తీసినవాణ్ణే. ఆ తరువాత ‘మిస్టర్ పర్‌ఫెక్ట్’, ‘బృందావనం’, ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘ఎవడు’-ఇలా వరుసగా పెద్ద సినిమాలు అనుకోకుండా సెట్ అవుతూ వచ్చాయి. రెండేళ్ళ నుంచి మంచి ఫీల్‌గుడ్ చిన్న సినిమా చేయాలనుకుంటున్నా. దాని ఫలితమే ఈ ‘కేరింత’. యూత్‌కీ, ఫ్యామిలీలకూ పట్టే ఇది చిన్న సినిమాగా మొదలైనా అందర్నీ ఆకర్షించి పెద్ద సినిమా అవుతుందని నమ్మకం.

 * ఆ మధ్య ఆర్థిక నష్టాల్లో ఉండి, నిర్మాణం తగ్గించారని విన్నాం!
 అదేమీ లేదు. ఏ నిర్మాతకైనా గడ్డుకాలం సహజమే. ఏ ప్రాజెక్ట్‌నైనా దగ్గరుండి జాగ్రత్తగా చూసుకోకపోతే, నష్టపోయేది నిర్మాత, డిస్ట్రిబ్యూటర్‌లే. నిజానికి, నిర్మాణంలో నేను పెద్ద నష్టపోయిందేమీ లేదు. అయితే, మారుతున్న నిర్మాణ పరిస్థితుల్నీ, అభిరుచుల్నీ ఆగి, అబ్జర్వ్ చేయ్యాలనుకున్నా. అందుకే, ఏణ్ణర్ధంగా ప్రొడక్షన్‌లో స్లో అయ్యా. అలా మొదలైందే ‘కేరింత’ సినిమా.

 * ఇదే టైమ్‌లో డిస్ట్రిబ్యూషన్‌పై శ్రద్ధ పెట్టినట్లున్నారు!
 అవును. ఈ మధ్య చాలా సినిమాలే డిస్ట్రిబ్యూట్ చేస్తూ వచ్చా. ఈ ఏడాది ‘పటాస్, సన్నాఫ్ సత్యమూర్తి, గంగ’ - ఇలా చాలా చేశా. ఆ రంగంలో ఈ ఏడాది నాకు బాగుంది.

* కానీ, వసూళ్ళ సమ్మర్ సీజన్ ఈసారి వేస్టయిందే! నూటికి నూరుపాళ్ళు మనం ఈ సమ్మర్‌ను సరిగ్గా ఉపయోగించుకోలేదు. కేవలం పెట్టుబడిని వెనక్కి తెచ్చిన బ్రేక్ ఈవెన్ సినిమాలే వచ్చాయి. ‘ఓ.కె. బంగారం’, ‘గంగ’ లాంటి డబ్బింగ్ సినిమాలే ఆడాయి. ప్రతి ఏటా సమ్మర్‌లో బాక్సాఫీస్ హిట్స్ వస్తాయి. కానీ, ఈసారి అలాంటి అద్భుతాలేమీ జరగలేదు. సినిమాల రిలీజ్‌లలో ప్లానింగ్ లేకపోవడం, ముందుగా అనుకున్న ‘రుద్రమదేవి’, ‘బాహుబలి’, ‘కిక్2’ చిత్రాలు ఆలస్యమై రిలీజ్ కాకపోవడంతో ఇబ్బంది అయిపోయింది.

 * సినిమాకు రిలీజ్ టైమ్ ఎంత కీలకమంటారు?
 ఎంత మంచి సినిమా అయినా సరైన టైమ్‌కి రిలీజ్ చేయడం ముఖ్యం. రైట్ టైమ్‌లో రిలీజ్ చేస్తేనే హిట్లు, లాభాలు వస్తాయి.

 * ‘బాహుబలి’, ‘రుద్రమదేవి’కి నైజామ్‌లో మీరే డిస్ట్రిబ్యూటర్‌గా!
 అవును. నేను తీయలేని చారిత్రక సినిమాలు, భారీ సినిమాలను ఇలా కొని, డిస్ట్రిబ్యూట్ చేసి, తృప్తి పడుతుంటా. ఈ రెండు సినిమాలపై చాలా అంచనాలున్నాయి. రెండూ వేర్వేరు తరహా సినిమాలు. చరిత్రను మార్చకుండా కథను కథలా తీయాల్సిన సినిమా ‘రుద్రమదేవి’. కొన్ని ఎపిసోడ్స్ చూశా. బాగుంది. ఇమాజినేషన్‌కు పరాకాష్ఠ ‘బాహుబలి’. అది మన తెలుగు సినీసీమ విస్తృతినీ, మార్కెట్‌నూ, ప్రేక్షకుల ఆలోచననూ మారుస్తుందని నా నమ్మకం.

* మీరెక్కువగా యూత్‌ఫుల్ సినిమాలు నిర్మించడానికి కారణం?
 సినిమాకు మున్ముందుగా వచ్చేది - యూత్, మాస్. నేను పెరిగిన వాతావరణం వల్ల కావచ్చు. నాకు మాస్ మీద పట్టు లేదు. పైగా, లాజిక్‌లు లేకపోయినా మాస్‌కు పట్టే కథలు నేను ఊహించలేను. అందుకే, నాకు పట్టున్న యూత్‌ఫుల్ సినిమాలు ఎక్కువగా చేస్తా. మాస్ మీద పట్టున్న దర్శకులు తమ స్క్రిప్ట్ మీద నమ్మకంతో వచ్చినప్పుడు, వాళ్ళను నమ్మి మాస్ సినిమాలు తీశా.

* సినిమా గురించి ఇంత తెలుసు. దర్శకత్వం వహించాలని లేదా?
 (నవ్వుతూ...) లేదు. డెరైక్టరైతే, మనం తీస్తున్న ప్రాజెక్ట్‌ను బాగా ప్రేమించేసి, తీస్తున్నదే అద్భుతం అనుకుంటాం. అలా అనుకోకపోతే, సినిమా తీయలేం. దాంతో, జడ్జిమెంట్ పోతుంది. అలా కాకుండా, ఒక మామూలు ప్రేక్షకుడిలా ఉంటూ, ఆడియన్స్‌కు ఏం కావాలనేది గమనిస్తూ, నిర్మాతగా కొనసాగడమే నాకిష్టం. స్క్రిప్టు దశ నుంచి రిలీజైన సినిమా మంచిదని ప్రేక్షకులకు తెలియజెప్పి, వాళ్ళను హాళ్ళకు రప్పించే పోస్ట్ రిలీజ్ పబ్లిసిటీ దాకా అన్నింటినీ బాధ్యతగల నిర్మాత చూసుకోవాలి. అన్నింటిలో ఇన్‌వాల్వ్ అయి, యూనిట్‌తో కలసి ప్రయాణిస్తేనే నిర్మాత బాగుంటాడు.

* కానీ సిండికేట్లు, ‘ఆ నలుగురు’... ఇలా మీలోనే యూనిటీ లేదు!
 (గంభీరంగా...) నిర్మాతల్లో ఎప్పుడూ ఐకమత్యం ఉండదు.     ఆ మాటకొస్తే, క్రియేటివ్, కాంపిటీటివ్ ఫీల్డ్ దేనిలోనైనా అనైక్యత సహజం. కానీ, నిజంగా సినిమాలు తీస్తున్న పాతికమందో, యాభై మందో నిర్మాతలంతా ఒక తాటి మీదకొస్తే అద్భుతాలు చేయచ్చు. అందరి మధ్య ఐక్యత తేవాలని ఈ తరంలో మేము ప్రయత్నిస్తున్నాం. మార్పు రావడానికి టైమ్ పడుతుంది. ఓర్పు కావాలి.

* నిర్మాతగా ఈ 12 ఏళ్ళలో ఎందుకొచ్చిందీ ఖర్మ అనిపించలేదా?
 లేనే లేదు. నిర్మాతగా సినిమాకు సంబంధించి ‘ఏ’ టు ‘జడ్’ అన్నీ చూసుకోవాలనుకొనే వ్యక్తిగా సక్సెస్, ఫెయిల్యూర్లకు అతీతంగా సినిమాను నేను ప్రేమించాను. అది తగ్గలేదు. తగ్గదు.

* ఐనా మీపై విమర్శలు, గాసిప్‌లొచ్చాయి. అప్పటి మానసిక స్థితి?
 (సాలోచనగా...) చూడండి. నాకు తెలియకుండానే మంచి సినిమాలు తీశా. గుర్తింపు వచ్చింది. అయితే, మంచితో పాటూ చెడూ వస్తుంది. ఈ రంగంలోని అందరినీ తృప్తి పరచలేం కదా! అందుకే, విమర్శలూ వస్తాయి. నాది తప్పని అనిపిస్తే, నేనే ఫోన్ చేసి, సారీ చెబుతా. ఇక, సినిమా, రాజకీయాలు, క్రీడా రంగాల్లో గాసిప్‌లు తప్పవు. టైమ్‌పాస్ కోసం ఎవరెవరో ఏవేవో రాస్తుంటారు. దాని బదులు నాకే ఫోన్ చేసి అడిగితే, వాస్తవం చెబుతా కదా! అలా అడగరు కాబట్టే, అది గాసిప్ అయింది.

 - రెంటాల జయదేవ

(Published in 'sakshi' daily, 11th June 2015, Thursday)
...................................................

Saturday, June 27, 2015

'రాక్షసుడు' సినిమా రివ్యూ

చిత్రం - 'రాక్షసుడు', తారాగణం - సూర్య, నయనతార, ప్రేమ్‌జీ అమరన్, సముద్రకణి, పార్తీబన్, కథ - స్క్రీన్‌ప్లే అసిస్టెంట్ - డి.ఎస్. కన్మణి, మాటలు - శశాంక్ వెన్నెలకంటి, పాటలు - వెన్నెలకంటి, చంద్రబోస్, శ్రీమణి, రాకేందు మౌళి, కెమేరా - ఆర్.డి. రాజశేఖర్, ఎడిటింగ్ - ప్రవీణ్ కె.ఎల్, నిర్మాతలు - కె.ఇ. జ్ఞానవేల్ రాజా, ఎం.ఎస్.ఆర్, మిర్యాల రాజాబాబు (కృష్ణారెడ్డి), దర్శకత్వం - వెంకట్ ప్రభు
 .................................
'రాక్షసుడు' రివ్యూ
హాలీవుడ్ సినిమాలు బాగుంటాయి. వీలుంటే, అనుకరించడానికి మరీ బాగుంటాయి. వాటిని ఎవరు తొందరగా, ఎంత మన నేటివిటీకి దగ్గరగా, కాపీ కొట్టిన విషయం కనపడకుండా ఎలా పని కానిచ్చారన్నది కీలకం. ఇంటర్నెట్‌లు, స్మార్ట్‌ఫోన్‌లు, ఫేస్‌బుక్‌లు, ట్విట్టర్‌ల తరంలో ఇది చాలా ఇంపార్టెంట్. కానీ, వెంకట్ ప్రభు దర్శకత్వంలో వచ్చిన సూర్య తాజా సినిమా ఆ సంగతి సరిగ్గా అంచనా వేయలేకపోయినట్లుంది. హాలీవుడ్ చిత్రాలు 'ఘోస్ట్ టౌన్' 'ఘోస్ట్ బస్టర్స్' లాంటి అనేక చిత్రాల కిచిడీగా ఈ చిత్రం తయారైందని సినీప్రియులు సీన్స్ వారీగా చెబుతున్నారు.

విచిత్రం ఏమిటంటే, ఇటీవలే తెలుగులో వచ్చిన 'వారధి' చిత్రం కాన్సెప్ట్ కూడా అచ్చంగా ఇదే. చనిపోయిన వ్యక్తుల ఆత్మలు తమ తీరని కోరికలను హీరో ద్వారా తీర్చుకోవడమనే ఈ కాన్సెప్ట్‌ను అచ్చంగా ఒక చోట నుంచే రెండు భాషల్లోని ఇద్దరు వేర్వేరు దర్శకులూ 'స్ఫూర్తి'గా తీసుకున్నారని సంతృప్తిపడాలి. ఆ విషయంలో ఒక చిన్న తెలుగు చిత్రం, మరో భారీ తమిళ హీరో సినిమా కన్నా ముందే వచ్చేసిందని సంబరపడాలి.

కథ ఏమిటంటే...
మాసు అని అందరూ పిలిచే మధుసూదన్ (సూర్య) అనాథగా పెరిగిన వ్యక్తి. చిన్నప్పటి నుంచీ అతనికో ఫ్రెండ్ (ప్రేమ్‌జీ అమరన్). వీళ్ళిద్దరూ కలసి, జట్టుగా దొంగతనాలు చేస్తూ ఉంటారు. ప్రేమించిన నర్సు మాలిని (నయనతార)కి ఉద్యోగం కోసం మూడున్నర లక్షలు కావాలంటే, భారీ దొంగతనం ప్లాన్ చేస్తారు. డబ్బు కొట్టేసి, పారిపోతున్న సమయంలో పెద్ద యాక్సిడెంట్. అందులో ఫ్రెండ్ చనిపోతాడు కానీ, మృత్యువు అంచుల దాకా వెళ్ళిన హీరో ప్రాణాలతో బయటపడతాడు. ఈ అనుకోని ప్రమాదం తరువాత హీరోకు ఒక అతీతమైన శక్తి లాంటిది వస్తుంది. చనిపోయిన ఫ్రెండ్‌తో సహా అనేక ఇతర ఆత్మలు కనిపిస్తుంటాయి. తమ కోరికలను తీర్చడానికి హీరోను సాయం అడుగుతుంటాయి. హీరో ఆ ఆత్మలతో కలసి చేసే కామెడీ పనులతో కొంత సినిమా నడుస్తుంది.

ఇంతలో అచ్చం హీరో లాగానే ఉండే బిజినెస్ మ్యాగ్నెట్ శివకుమార్ (సూర్య) ఆత్మ కనిపిస్తుంది. ఆ ఆత్మ, హీరోతో ఒకర్ని హత్య కూడా చేయిస్తుంది. అసలింతకీ ఆ ఆత్మ ఎవరు? దానికీ, హీరోకూ ఉన్న సంబంధం ఏమిటి? అన్ని ఆత్మలూ మామూలు కోరికలు కోరుతుంటే, ఈ ఆత్మ హత్యల దాకా ఎందుకు వెళుతోంది లాంటివన్నీ సెకండాఫ్‌లో వచ్చే ఫ్లాష్‌బ్యాక్, దాని పర్యవసానాలతో తెలుస్తుంది.

ఎలా చేశారంటే...
హీరో సూర్య ఇటు అల్లరి చిల్లరి దొంగగా, అటు ఆత్మగా ఏకకాలంలో బాగా చేశారు. కానీ, పాత్ర చిత్రణల్లోనూ, కథనంలోనూ ఉన్న లోపాల వల్ల సినిమాను తన భుజాలపై మొత్తం మోయలేకపోయారు. నయనతారది గెస్ట్‌రోల్‌కు ఎక్కువ... హీరోయిన్‌కు తక్కువ తరహా పాత్ర. సినిమాలో చాలా సేపు ఆమె లేకుండానే జరిగిపోతుంటుంది. అడపా దడపా నేనున్నానంటూ తెరపైకి వచ్చి, మెరిసి మాయమవుతుంది. సినిమా అయిపోయాక, రోలింగ్ టైటిల్స్‌లో కానీ, సూర్య, నయనతారల మధ్య మాస్ మెచ్చే గ్రూప్ సాంగ్ ప్రత్యక్షం కాదు.

హీరో మిత్రుడి వేషంలో దర్శకుడు వెంకట్ ప్రభు సోదరుడు ప్రేమ్‌జీ అమరన్ (ఇద్దరూ ఇళయరాజా తమ్ముడైన సంగీత దర్శకుడు గంగై అమరన్ కుమారులు) కాసేపు నవ్వించడానికి ప్రయత్నించారు కానీ, సక్సెస్ కాలేదు. ఆయన బాడీ లాంగ్వేజ్ వగైరా తమిళానికి సెట్ అయినట్లుగా తెలుగులో కుదరలేదు. తమిళంలోని నేటివిటీ నిండిన డైలాగుల పస తెలుగులో తర్జుమా కాదు... కాలేదు కూడా! వెరసి, తమిళ బోర్డులు తెలుగులోకి మార్చి చూపించినా, డబ్బింగ్ సినిమా చూస్తున్న ఫీలింగే మిగులుతుంది. ఒకప్పటి తమిళ హీరో పార్తీబన్ తన భారీ కాయంతో పోలీసు అధికారిగా కనిపించారు. దర్శక - నటుడు సముద్రకణి విలన్ రాధాకృష్ణ పాత్రలో బాగున్నారు.

ఎలా ఉందంటే...
శశాంక్ వెన్నెలకంటికి అనువాద రచయితగా ఇది 200వ సినిమా. జననం... మరణం... అంటూ జీవితం తాలూకు ఫిలాసఫీని చెబుతూ సెకండాఫ్‌లో వచ్చే పాట సాహిత్యపరంగా బాగుందనిపిస్తుంది. కెమేరా పనితనం, ముఖ్యంగా ఫ్లాష్‌బ్యాక్ ఘట్టాల్లో కనిపిస్తుంది. యాక్షన్ పార్ట్, ఇతర విషయాల్లో నిర్మాణ విలువలు బాగున్నాయి. కథలో పెద్ద దమ్ము లేకపోవడం, ఆత్మల కోరికలు తీర్చే ఘట్టాలను ప్రేక్షకుణ్ణి ఆసక్తిగా కూర్చోబెట్టేలా చెప్పలేకపోవడం మైనస్. ఆ మేరకు రచన, దర్శకత్వాలను నిందించాలి.

ఫస్టాఫ్ అంతా పాత్రల పరిచయానికీ, ఆత్మల విషయం అర్థమయ్యేలా చేయడానికీ సరిపోయింది. ద్వితీయార్ధంలోనే ప్రధాన కథ నడుస్తుంది. హీరో తండ్రి ఫ్లాష్‌బ్యాక్ ఘట్టం పట్టుగా నడుస్తుంది. కానీ, అప్పటికే రిలీఫ్ లేకుండా సుదీర్ఘమైన సినిమా చూసేసిన ఫీలింగ్ ప్రేక్షకులకు కలుగుతుంది. చివరకొచ్చేసరికి, రొటీన్‌గా తండ్రి పగను కొడుకు తీర్చుకున్న ఫార్ములా చట్రంలో సినిమా ముగుస్తుంది. తండ్రినీ, తల్లినీ (ప్రణీత) చంపినవాళ్ళపై కొడుకు పగతీర్చుకోవడమనే రెవెంజ్ ఫార్ములాకు, ఆత్మల నేపథ్యం జోడించిన విసుగెత్తించే ప్రయత్నంగా 'రాక్షసుడు' మిగిలింది. మొత్తం మీద, హాలీవుడ్‌లో కాకపోయినా, కనీసం తెలుగు తెరపై 'వారధి' ద్వారా ఇప్పటికే చూసేసిన ఈ ఆత్మల కోరికలు తీర్చే కాన్సెప్ట్‌ను పెద్ద హీరో, కాస్తంత భారీ నిర్మాణ విలువలు, టెక్నికల్ అంశాలతో చూడాలనుకుంటే తెరపై రెండున్నర గంటల పైగా 'రాక్షసుడు'ను భరించవచ్చు.

 - రెంటాల జయదేవ

(Published in 'Sakshi' Website, 30th May 2015, Saturday)
.................................

Sunday, June 14, 2015

డబ్బు, టైమ్... ‘దండగ చేస్కో’! (సినిమా రివ్యూ : పండగ చేస్కో)

చిత్రం - పండగ చేస్కో, తారాగణం - రామ్, రకుల్ ప్రీత్ సింగ్, సోనాల్ చౌహాన్, బ్రహ్మానందం,
కథ - వెలిగొండ శ్రీనివాస్, స్క్రీన్‌ప్లే - మాటలు - కోన వెంకట్,
రచనా సహకారం - అనిల్ రావిపూడి,  కెమేరా - సమీర్ రెడ్డి,
నిర్మాత - పరుచూరి కిరీటి, స్క్రీన్‌ప్లే - దర్శకత్వం - గోపీచంద్ మలినేని

సినిమా రివ్యూ : పండగ చేస్కో

ఒక సగటు తెలుగు సినిమాలో ఉండేవి ఏమిటి? విడిపోయిన కుటుంబాలు... తెగిపోయిన బంధాలు... ఆ ఫ్యామిలీలను కలపడానికి హీరో పడే శ్రమ, అందుకు హీరోయిన్‌తో సాగించే ప్రేమ... వాటి మధ్యలో ఒక విలన్ బృందపు వేట! దీనికి బ్యాక్‌డ్రాప్ - పెళ్ళి వారి ఇంటి నేపథ్యం. ఇలాంటి కథలు ఎన్ని వందలు తెరపై చూశామని బుర్ర బద్దలుకోనక్కర లేదు. గతంలో అలాంటివి చూడకుండా తప్పించుకున్నవారెవరైనా ఉంటే, వారి కోసం తాజాగా అటువంటి మరో సినిమా వచ్చింది. అది చూసి, ‘పండగ చేస్కో’వచ్చు.

కథ ఏమిటంటే...
ఎక్కడో పోర్చుగల్‌లో కార్తీక్ పోతినేని (రామ్). వీడియో గేమ్స్ మీద పట్టుతో వాటినే డెవలప్ చేసి, పెద్ద కంపెనీ పెట్టి, కోట్లు గడించిన యువతరం వ్యాపారవేత్త. తల్లితండ్రులు (పవిత్రా లోకేశ్, రావు రమేశ్), చెల్లెలు, బావ ఉంటారు. పెళ్ళి చేసుకోవాలని అనుకుంటున్న తరుణంలో అతనికి అనుష్క (సోనాల్ చౌహాన్) అనే మరో బడా పారిశ్రామికవేత్త తగులుతుంది. ఫలానా వయసులోగా భారతీయ సంతతి వ్యక్తిని ఎవరినైనా పెళ్ళిచేసుకోకపోతే, వేల కోట్ల ఆస్తి మొత్తం వేరొకరికి వెళ్ళిపోతుందని ఆమె తండ్రి వీలునామా రాసిన సంగతి ఆమెకు ఆలస్యంగా తెలుస్తుంది. ముప్ఫై రోజులే గడువు ఉండడంతో, వరుడి కోసం వెతుకుతున్న ఆమె కార్తీక్‌ను పెళ్ళాడాలనుకుంటుంది.
     
మరోపక్క, బొబ్బిలిలో ఉండే హీరోయిన్ దివ్య (రకుల్ ప్రీత్ సింగ్). ఆమె తల్లి, తండ్రి (‘మిర్చి’ సంపత్) విడిపోతారు. తల్లి, మేనమామ (సాయికుమార్) దగ్గర పెరుగుతుంటుంది. పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే తండ్రికీ, మేనమామకూ మధ్య నలిగిపోతుంటుంది. లాభం లేదని వేరే ఊరికి వచ్చేస్తుంది. కాలుష్యానికి కారణమవుతోందంటూ హీరో గారి ఫ్యాక్టరీ మీద కేసు వేసి, మూయించే పరిస్థితి తెస్తుంది. ఇండియాలోని ఈ ఫ్యాక్టరీ కోసం పోర్చుగల్ నుంచి పెళ్ళి పనులు కూడా పక్కన పడేసి, మరీ వస్తాడు హీరో.
     
హీరో ఇక్కడ కొచ్చాక, ఈ హీరోయిన్‌ను ప్రేమలో పడేయడానికి ప్రయత్నిస్తాడు. అదేమంటే, అసలు తాను పెళ్ళి చేసుకోవాలనుకున్నది ఈ హీరోయిన్‌నే అంటాడు. కావాలని తానే కేసు వేయించానంటూ ట్విస్ట్ ఇస్తాడు. ఇదేమిటని మనం విస్తుపోవడంతో ఫస్టాఫ్ ముగిసి, ఇంటర్వెల్ కార్డు పడుతుంది.  ఇక, సెకండాఫ్ అంతా... హీరో ఎవరు? అతనికీ హీరోయిన్ తండ్రికీ ఉన్న బంధం ఏమిటి? హీరోయిన్ తండ్రికీ, మేనమామకూ మధ్య వైరానికి కారణం ఏమిటి? లాంటి ప్రశ్నలకు సమాధానం వస్తుంది. ఇంతలో పోర్చుగల్‌లో హీరో పెళ్ళి మాట ఇచ్చిన బిజినెస్ మ్యాగ్నెట్ ఇండియాకు దిగుతుంది. ఈ గందరగోళాల మధ్య ఏం జరిగింది, విడిపోయిన కుటుంబాలు ఎలా కలిశాయన్నది మిగతా సినిమా.

 ఎలా ఉందంటే...
 తరచూ పవన్ కల్యాణ్‌ను అనుసరిస్తున్నట్లు అనిపించే రామ్ ఈసారీ అలానే అనిపించారు. ఈసారి ‘అత్తారింటికి దారేది’ తరహా కథ, క్లైమాక్స్‌ను అనుసరించారని అనిపిస్తుంది. కాకపోతే, ఉన్నంతలో ఆయన మంచి ఎనర్జీతో నటించారు. డ్యాన్సులు చేశారు. ఫైట్లూ అంతే. కాకపోతే, ఏ పాటా గుర్తుండదు. హీరోయిన్ రకుల్ ప్రీత్‌సింగ్ చూడడానికి బాగుందే తప్ప, ఆ పాత్రకు ఒక నిర్దిష్ట ప్రయోజనం, పరిధి కనిపించవు. సోనాలీ చౌహాన్ పనికొచ్చిందల్లా... బికినీలో గ్లామరస్‌గా కనిపించే పాటకే! అందరికీ ఉచితంగా సలహాలిచ్చే ‘వీకెండ్ వెంకటరావు’ పాత్రలో బ్రహ్మానందం కాసేపు నవ్విస్తారు. కానీ, సెకండాఫ్‌లో ఆ పాత్రను మరీ చౌకబారుగా మార్చేశారని అనిపిస్తుంది. వెయ్యి సినిమాలు చేసేసిన తరువాత ‘పద్మశ్రీ’ బ్రహ్మానందం లాంటి ఆలోచనాపరుడు ఇలాంటి పాత్రలు చేయకపోతే మాత్రం వచ్చే నష్టం ఏమిటనిపిస్తుంది!
     
రౌడీ శంకరన్నగా అభిమన్యు సింగ్ సో సోగా ఉన్నా, అతని మేనమామ పాత్రలో జయప్రకాశ్‌రెడ్డి డైలాగ్స్, టైమింగ్ కొంత నవ్విస్తాయి. తీరా ఆ పాత్రలు కూడా అర్ధంతరంగా ఆగిపోతాయి. మళ్ళీ ఆఖరు క్షణంలో దర్శక, రచయితలకు గుర్తొచ్చినప్పుడు తెర పైన కనిపిస్తాయి. ఈ సినిమాకు సంగీతం - తమన్‌ది. అయితే, తమన్ బాణీలు కేవలం డప్పులు, దరువుల మోత అంటూ ఒక పాటలో సాహిత్యం ఉండడం తమన్ నిజాయతీకి నిదర్శనం అనుకోవాలేమో! ఇండియాలో తీసి, పోర్చుగల్ బ్యాక్‌డ్రాప్‌తో మిక్స్ చేసిన సి.జి. సీన్లు తెలిసిపోతుంటాయి. ఒకటి, రెండు పాటల చిత్రీకరణ, కెమేరా వర్క్, నిర్మాణ విలువలు మాత్రం బాగున్నాయి.
     
ముగ్గురు రచయితలు రచనలో చేయి పెట్టిన ఈ సినిమాకు స్క్రీన్‌ప్లే క్రెడిట్ కూడా ఒక రచయితకూ, దర్శకుడికీ కట్టబెట్టారు. ఇంతా చేసి, కథ, కథనం మాత్రం ‘ఢీ’, ‘రెఢీ’, ‘కలిసుందాం రా’, ‘బృందావనం’, ‘అత్తారింటికి దారేది’ లాంటి సవాలక్ష చిత్రాల్లోని సీన్లకు పేలవమైన అనుసరణే. ఇన్ని సినిమాల రీమిక్స్ అయిన ఈ సరికొత్త వెండితెర వంటకంలో ద్వంద్వార్థపు మాటలు, సీన్లు, వెకిలి చేష్టలు మాత్రం అదనం. ఫస్టాఫ్ కొంత బోర్ అనుకుంటే, సెకండాఫ్‌ను వినోదం పేరుతో అశ్లీలం నింపడం చీకాకు అనిపిస్తుంది.

పాతికేళ్ళుగా సంసారం చేయని భార్యాభర్తలు, పెళ్ళికాకుండానే ప్రేమలో హద్దులు దాటాలని చూసే యువకులు, అప్పుడెప్పుడో పెళ్ళి కాక ముందే తల్లి అయిన ఒక స్త్రీ ఫ్లాష్‌బ్యాక్, బాస్‌నే పడగొట్టాలని రాత్రిళ్ళు గదుల వెంట తిరిగే కమెడియన్ - ఇలా అంతా కేవలం ‘సెక్స్’ చుట్టూ తిరుగుతున్నట్లు కథ నడిపారు. ‘పండగ చేస్కో’ లాంటి ఫ్యామిలీ టైటిల్‌కూ, కథా నేపథ్యానికీ, ఈ ప్రవర్తనకూ సరిపడుతుందా, లేదా అన్న ఆలోచన కూడా దర్శక, నిర్మాతలు, రచయితలు చేసినట్లు కనిపించదు.
     
ఇక, సినిమా కథ, కథనంలో లోపాలు సవాలక్ష. అప్పటిదాకా హాస్టల్‌లో చదువుకున్నట్లున్న హీరోయిన్ ఎక్కడో వేరే ఊరికి వెళ్ళినట్లు చెప్పారు. ఆ తరువాత అక్కడ చాలా కాలంగా ‘గ్రీన్ ఆర్మీ’ పేరిట పచ్చదనం పరిరక్షణకు పనిచేస్తున్నట్లు చూపారు. ఆమె స్టూడెంటా? యాక్టివిస్టా? లాంటి డౌట్లు వస్తాయి. అలాగే మేనమామ కూతురిని పెళ్ళాడాలని అనుకున్న హీరో, మరి పోర్చుగల్‌లో బిజినెస్ మ్యాగ్నెట్ (సోనాలీ చౌహాన్)ను పెళ్ళాడతానని ఎందుకు అన్నట్లు? అనిపిస్తుంది. కానీ, అవన్నీ అప్పటికప్పుడు సినిమాటిక్ స్క్రీన్‌ప్లే రచయితలు తీసుకున్న కన్వీనియన్స్ అనుకొని సర్దుకుపోవడం మినహా సగటు ప్రేక్షకుడు చేయగలిగింది ఏమీ లేదు.
     
వెరసి, కొన్ని కట్స్‌తో చివరకు ‘యు ఏ’ సర్టిఫికెట్ అందుకున్న ఈ 2 గంటల 42 నిమిషాల సినిమాలో కట్ చేయాల్సిన సీన్లు చాలానే కనిపిస్తాయి. ‘ఏ’ సినిమాకు ‘యు ఏ’ఎలా దక్కిందా అన్న ఆశ్చర్యమూ కలుగుతుంది. వెరసి... బోలెడంత టైమ్, కాసింత డబ్బు దండగ చేస్కోవాలంటే మాత్రం ‘పండగ చేస్కో’ మన తెలుగు ప్రేక్షకులకు వచ్చిన లేటెస్ట్ ఆప్షన్.

 - రెంటాల జయదేవ

(Published in 'Sakshi' website, 29th May 2015, Friday)
.............................