జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Wednesday, August 6, 2014

కాస్త... ముందుకు! మరికాస్త... వెనక్కు!! (సినిమా రివ్యూ: ‘రన్ రాజా రన్’)

తారాగణం: శర్వానంద్, శీరత్ కపూర్, ఎడిటింగ్: మధు, నిర్మాతలు: ప్రమోద్ ఉప్పలపాటి, వంశీకృష్ణారెడ్డి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సుజీత్
..........................................................
కొత్త దర్శకులు, కొత్త తరం కథకులు వస్తున్నప్పుడు వెండితెర కొత్తగా వెలుగులీనే అవకాశం ఉంటుందని చిన్న ఆశ ఉంటుంది. వాళ్ళ సినిమా వస్తోందంటే, కొత్తదనం కోరుకొనేవారికి ఎదురుచూపులుంటాయి. లఘు చిత్రాల ద్వారా మొదలుపెట్టి ఫీచర్ ఫిల్మ్‌కు ఎదిగిన దర్శకుడు సుజీత్ ‘రన్ రాజా రన్’ విషయంలోనూ అదే జరిగింది.

కథ ఏమిటంటే... రాజా (శర్వానంద్) ఓ కూరగాయల వ్యాపారి కొడుకు. నగర పోలీస్ కమిషనర్ దిలీప్ (సంపత్‌రాజ్) కూతురు ప్రియ (శీరత్ కపూర్)ను ప్రేమిస్తాడు. మరోపక్క నగరంలో వరుసగా జరుగుతున్న ప్రముఖుల కిడ్నాప్‌లు జరుగుతుంటాయి. ఆ కిడ్నాప్‌ల గుట్టు ఛేదించడానికి కమిషనర్ కుస్తీ పడుతుంటాడు. అతని కూతుర్ని ప్రేమించానంటూ వెళ్ళిన హీరోకు కమిషనర్ ఓ కిడ్నాప్ డ్రామా పని అప్పజెపుతాడు. హీరోయిన్‌నే కిడ్నాప్ చేస్తాడు హీరో. ఆ తరువాత కథేమిటన్నది రకరకాల ట్విస్టుల మధ్య సాగే సినిమా.

ఎక్కువగా వినోదాత్మక ఫక్కీలో నడపాలని దర్శకుడు బలవంతాన ప్రయత్నించిన ఈ సినిమాలో హీరో శర్వానంద్ చూడడానికి బాగున్నాడు. అయితే, కొన్నిచోట్ల హెయిర్‌స్టైల్‌లో, హావభావాల్లో తమిళ సూర్యను అనుసరించినట్లు అర్థమైపోతుంటుంది. ఇక, హీరోయిన్ శీరత్ కపూర్ కొత్తమ్మాయి. అభినయంతో పాటు అందమూ తక్కువే. అభినయం తక్కువైనా కథ రీత్యా అడివి శేషుది మరో ముఖ్యపాత్ర. కమిషనర్‌గా సంపత్‌రాజ్, హీరో తండ్రిగా వి. జయప్రకాశ్ అలవాటైన తమిళ ప్రాంతీయ సినీశైలిలో ఫరవాలేదనిపిస్తారు.


ఎలా ఉందంటే... తమిళ, తెలుగు ద్విభాషా చిత్రంగా విడుదల చేయాలనో ఏమో అక్కడి నటులనూ తీసుకున్నారు. వీలున్నప్పుడల్లా హాలులో రజనీకాంత్ నామస్మరణ వినిపిస్తుంది. తమిళ హీరో కార్తి తదితరుల పోస్టర్లూ కనిపిస్తాయి. తమిళ ఫక్కీ సినీ కథన ధోరణి సరేసరి. మది ఛాయాగ్రహణం, గిబ్రాన్ సంగీతం కొత్తగా అనిపిస్తాయి. ముఖ్యంగా పాటల చిత్రీకరణ బాగుంది. ఇప్పటికే పాపులరైన ‘అనగనగనగా అమ్మాయుందిరా’ పాట (రచన శ్రీమణి) చిత్రీకరణ, విలక్షణమైన గొంతు (గోల్డ్ దేవరాజ్)తో పాడించిన తీరు ఆకట్టుకుంటాయి. రామజోగయ్య రాసిన మెలోడీ ‘వద్దంటూనే’ గాయని చిన్మయి గొంతులో వినడానికీ, తెరపై చూడడానికీ బాగుంది. పాటల్లో గొంతులు కొత్తగా అనిపిస్తాయి. అక్కడక్కడ డైలాగ్‌‌స నవ్విస్తాయి.

కాస్త...కాలక్షేపం! చాలా... కాలహరణం! ప్రథమార్ధం కాలహరణంగా నడిచే సినిమా, సెకండాఫ్‌లో ఫక్తు కాలక్షేపంగా ఫరవాలేదనిపిస్తుంది. కానీ, చివరకొచ్చేసరికి ఆ భావన కూడా బలంగా నిలబడదు. దర్శకుడి అనుభవ రాహిత్యం వల్లనో, లేక అది వినోదమని భ్రమపడడం వల్లనో ఏమో, కథకు అక్కరలేని సన్నివేశాలు కూడా సినిమాలోకి తరచూ చొచ్చుకు వచ్చేస్తుంటాయి. వాటిని స్క్రిప్టు దశలో కాకపోయినా, ఎడిటింగ్ టేబుల్ మీదైనా కత్తిరించుకోవాల్సింది. పోలీసు కమిషనర్, మంత్రి, ఎమ్మెల్యే - ఇలా అందరూ బఫూన్ల లాగా వ్యవహరిస్తారు.

ప్రత్యర్థిని అడ్డుకొనేందుకు ఈ వీరశూరసేనులు చేసిందేమీ కనిపించదు. దాంతో, కథలో పాత్రల మధ్య ఆసక్తికరమైన సంఘర్షణ ఏదీ లేకుండా పోయింది. చిత్ర నిర్మాణ విలువలు గణనీయంగానే ఉన్న సినిమా ఇది. రొమాంటిక్ కథగా మొదలై సమాంతరంగా సస్పెన్స్‌ను కొనసాగించి, చివరకొచ్చేసరికి రొటీన్ పగ- ప్రతీకారాల వ్యవహారంగా తేల్చేయడంతో ఈ కథ ఓ పట్టాన సంతృప్తినివ్వదు. కూరగాయలమ్మే వాడి కొడుకు ఇంత ఆధునికంగా ఉన్నాడేమిటి, ఫలానా పాత్ర ఫలానాలా ప్రవర్తిస్తోందేమిటి లాంటి సందేహాలొస్తాయి. చివరలో వాటన్నిటికీ లాజిక్‌లు చెప్పడానికి దర్శకుడు ప్రయత్నించినా అప్పటికే ఆలస్యమైపోయింది. కొత్తదనం కోసం మరీ విపరీతమైన ట్విస్టులు పెట్టేస్తే ఇబ్బందేనని కథ, కథనం తేల్చేస్తాయి. వెరసి, బాగోగులు రెండూ ఉన్న ఈ చిత్రం జనాన్ని పరిగెత్తించేది ఎటువైపో?

బలాలు:  కథను వినూత్నంగా చెప్పాలన్న ప్రయత్నం  శర్వానంద్ నటన  కొత్తగా ధ్వనించే గిబ్రాన్ సంగీతం, గాయకుల గొంతు   మది కెమేరా పనితనం, పాటల చిత్రీకరణ

బలహీనతలు:  సాగదీత కథనశైలి  గందరగోళపెట్టే అతి ట్విస్టులు, ఆఖరికి రోలింగ్ టైటిల్స్‌లోనూ సా...గిన కథ  ఆఖరుకు పగ, ప్రతీకారాల కథగా మిగలడం  పాత్రలు ఎప్పుడుపడితే అప్పుడొచ్చి, వెళ్ళిపోతుండే సీన్లు  మొద్దుబారిన ఎడిటింగ్ కత్తెర  హీరోయిన్

 - రెంటాల జయదేవ

(Published in "Sakshi' daily, 2nd Aug 2014, Saturday)
......................................

Tuesday, August 5, 2014

మాయ ----- కొద్దిసేపే ‘మాయ’ (సినిమా రివ్యూ)

తారాగణం: హర్షవర్ధన్ రాణే, అవంతికా మిశ్రా, కెమేరా: బాల్‌రెడ్డి, నిర్మాతలు: ఎం.వి.కె. రెడ్డి, ‘మధుర’ శ్రీధర్, రచన,దర్శకత్వం: నీలకంఠ
......................................


విభిన్నమైన కథలు, వాటిని విచిత్రంగా నడిపిస్తూ తెరపై చూపే శైలి హాలీవుడ్ చిత్రాలకు అలవాటే. కానీ, అలాంటి దోవలో ప్రయాణించడం తెలుగు తెరపై అరుదు. అలాంటి అరుదైనయత్నం చేయడానికి సిద్ధపడినప్పుడు, ప్రేక్షకుడికి ఆశ్చర్యమో, ఆనందమో కలగాలి. అలాకాక, కేవలం ఇంగ్లీష్ చిత్రాల అనుసరణే వరకే ఆ ప్రయోగశీలతను పరిమితం చేస్తే, ఇబ్బంది. ఈ నేపథ్యంలో నుంచి ‘మాయ’ను చూడాలి.

కథలోకి వస్తే... జరగబోయేది ముందే తెలిస్తే..? అలాంటి దృష్టి ఎవరికైనా ఉంటే..? మేఘన (అవంతికా మిశ్రా)కు చిన్నప్పటి నుంచి అతీంద్రియ దృష్టి (ఎక్స్‌ట్రా సెన్సరీ పర్‌సెప్షన్ - ఇ.ఎస్.పి) ఉంటుంది. చిన్నప్పుడు ఓ దుర్ఘటనలో అమ్మ ప్రాణాలు కోల్పోనుందన్న సంగతి కూడా చిన్నప్పుడే తెలిసిన అమ్మాయి ఆమె. పెద్దయ్యాక ‘టీవీ 21’లో రిపోర్టర్‌గా సామాజిక అంశాలపై పోరాటం చేస్తుంటుంది. ఆమె జీవితంలోకి ఫ్యాషన్ డిజైనర్ సిద్ధార్థ వర్మ అలియాస్ సిద్ధూ (హర్షవర్ధన్ రాణే) ప్రవేశిస్తాడు. వారిద్దరి మధ్య ప్రేమ మొదలవుతుంది. ఇంతలో అతనికి కాబోయే భార్యనంటూ మేఘన చిన్నప్పటి ఫ్రెండ్ పూజ (సుష్మా రాజ్) ప్రవేశిస్తుంది. పూజ జీవితంలో జరగబోయే ఓ ఘటన మేఘన ఇ.ఎస్.పికి ముందే అందుతుంది. సిద్ధూకు ఓ భయంకరమైన గతం ఉందని తెలుస్తుంది. అప్పుడేమైందన్నది మిగతా కథ.

ఎలా చేశారంటే... కాస్తంత నెగటివ్ టచ్ ఉన్న పాత్రలకు ఇప్పుడిక హర్షవర్ధన్ రాణే కొత్త చిరునామాగా మారాడనుకోవచ్చు. ముగ్గురు కొత్త నాయికలూ చూడడానికైతే బాగానే ఉన్నారు. అంతకు మించి ఆశిస్తే కష్టం. సస్పెన్స్‌తో నిండిన ఈ థ్రిల్లర్‌కి సంగీతం, కెమేరా వర్క్, సౌండ్ ఎఫెక్ట్‌లు ప్రాణం పెట్టాయి. సందర్భోచిత గీతాలు కొన్ని పెట్టారు కానీ, అందులో ఒకటి రెండైతే నిడివినీ, ప్రేక్షకుల అసహనాన్నీ పెంచడానికే ఉపకరించాయి.

ఏ సీనుకు ఆ సీనే... ఆసక్తికరమైన ప్రారంభ దృశ్యంతో వెండితెరపై ‘మాయ’ మొదలవుతుంది. అక్కడ చిన్నారి మేఘన పాత్రధారితో చేయించిన అభినయం, సౌండ్ ఎఫెక్ట్‌లు బాగున్నాయి. అలా ఆసక్తికరమైన అనుభవం కోసం మొదలైన ప్రేక్షకుల జర్నీ కాసేపటికే ఇది ప్యాసింజర్ బండిలో ప్రయాణంగా మారుతుంది. అప్పుడే ప్రథమార్ధం అయిపోయిందా అనిపించే ఈ సినిమా ఆ తరువాత క్రమంగా గాడి తప్పుతుంది. ఆ తరువాత మళ్ళీ మునుపటి ‘మాయ’ కనిపించే ఘట్టాలు తక్కువే. దర్శక, రచయిత ఏ సీను రాసుకున్నప్పుడు ఆ సీనుకు తగ్గట్లు పాత్రలు ప్రవర్తిస్తూ ఉంటాయి.


సిద్ధూ పాత్ర లాంటివి పాజిటివ్, నెగటివ్‌లకు రెంటికీ కాకుండా పోయాయి. అప్పటి దాకా జరగబోయేది  తెలుస్తున్న నాయికకు ఉన్నట్టుండి, జరిగిపోయిన సంఘటన తెలియడమనేది నప్పని విషయం. కథ నడిపించడం కోసం దర్శక, రచయిత తనకు తాను కల్పించుకున్న ఓ వెసులుబాటు. అలాగే, ఎన్నో ఏళ్ళ క్రితం చిన్నప్పటి ఫ్రెండైన కథానాయికను పూజ పాత్ర చటుక్కున ఎలా గుర్తించేస్తుందని అడగకండి. ఇక, ద్వితీయార్ధంలో ఫ్యాషన్ షో ఎపిసోడ్ దగ్గర ‘ఢిల్లీ, రాత్రి వేళ...’ అంటూ వేసిన లొకేషన్ ఇండికేషన్ టైటిల్ మరింత గందరగోళం రేపింది.

కథ ఆ క్షణానికి జరుగుతున్నది ఢిల్లీలోనా, హైదరాబాద్‌లోనా అన్నది అర్థం కాదు. సిద్ధూ పాత్ర, పోలీసు అధికారి కలసి చివరలో వెతుకులాట, ‘చంపడం మినహా మరో మార్గం లేద’నుకోవడం లాంటి వాటికి కథలో సరైన భూమిక లేదు. చివరలో నాయిక పాత్ర ద్వారా వేరొకరి ద్వారా సస్పెన్స్ ముడిని విప్పించడం తృప్తినివ్వదు. వెరసి, మూడు ముఖ్య పాత్రలు, వారి వారి కోణాల నుంచి కథ నడవడమనే అంశం బాగుందనిపించినా, రెండు గంటల సినిమా చూశాక, అర్ధాకలితో బయటకొచ్చిన భావనే మిగులుతుంది.

బలాలు:  విలక్షణమైన కథాంశం.  సౌండ్ ఎఫెక్ట్‌లు  తెరపై సినిమాను రిచ్‌గా కనిపించేలా చూపిన నాణ్యమైన నిర్మాణం

బలహీనతలు:  అతి నిదా...నంగా సాగే చిత్ర కథనం  అందరూ కొత్త ముఖాలే కావడం  ఆకట్టుకోని హీరోయిన్ నటన  ఖంగాళీగా సాగే ద్వితీయార్ధం.

 - రెంటాల జయదేవ

(Published in 'Sakshi' daily, 2nd Aug 2014, Saturday)
.........................

Monday, August 4, 2014

పెళ్లంటే... దేవిశ్రీ ప్రసాద్ ‘ఆ.. ఊ..’ అంటాడు! - తండ్రి, సినీ రచయిత జి. సత్యమూర్తి

దేవిశ్రీ ప్రసాద్... దేవి... డీఎస్పీ... ఆప్యాయంగా ఒక్కొక్కరు ఒక్కొ రకంగా పిలిచే ఆయన... సమకాలీన సినీ సంగీత ప్రపంచంలో ఒక ఉత్తుంగ తరంగం. టీనేజ్‌లోనే సంగీత దర్శకుడై, ఈ పదిహేనేళ్ళలో తెలుగు, తమిళ, హిందీ చిత్రసీమలన్నిటిలో తనదైన ప్రత్యేక ముద్ర వేసిన ప్రతిభావంతుడు. ఎంత ఎదిగినా ఇప్పటికీ అమ్మానాన్న అంటే గౌరవం.తమ్ముడు, చెల్లెలంటే తరగని అనురాగం దేవిశ్రీ సొంతం. ఇవాళ ఈ సంగీత సంచలనం పుట్టినరోజు. ఈ సందర్భంగా ఇంట్లో ఆ మ్యూజిక్ మెజీషియన్ ప్రేమానురాగాల గురించి తండ్రి, సినీ రచయిత జి. సత్యమూర్తి మనోభావ సంచలనం...
 
మా అబ్బాయి దేవిశ్రీ ప్రసాద్‌కు చిన్నప్పటి నుంచి సంగీతమంటే బాగా ఆసక్తి. చిన్నప్పుడు ఇంట్లోనే గాజు గ్లాసులు అవి తీసుకొని వాటి మీద శబ్దాలు చేస్తూ, వాటిని క్యాసెట్ రికార్డర్‌లో రికార్డ్ చేసేవాడు. ఆ శబ్దాలన్నిటినీ కలిపి, వాడికి వాడే ట్యూన్లు సిద్ధం చేసుకొని, క్యాసెట్ ప్లేయర్‌లో పెట్టి వినిపించేవాడు. మా ఆవిడ శిరోమణి వాళ్ళ తాతగారు డాక్టర్ చిన వెంకన్న గాయకులు. అలాగే, మా అత్త గారు అంటే, దేవిశ్రీ వాళ్ళ అమ్మమ్మ దేవీ మీనాక్షి కూడా మంచి శాస్త్రీయ సంగీత గాయని. ఇక, మా నాన్న గారు డాక్టర్ సూర్యనారాయణ మంచి గిటార్ ప్లేయర్. నేను కూడా పాడేవాణ్ణి. గిటార్ వాయించేవాణ్ణి. రాయడం, స్వరాలు కూర్చడం లాంటివన్నీ చేసేవాణ్ణి. మాదేమో రామచంద్రాపురం దగ్గర వెదురుపాక. మా అత్తగారి ఊరు అమలాపురంలో ఇంటి దగ్గర ఎప్పుడూ ఆ రకమైన సంగీత వాతావరణమే. మా అత్త గారు, నేను అక్కాతమ్ముళ్ళ లాగా కూర్చొని పాటలు పాడుకొనే వాళ్ళం. మా రెండు వైపు కుటుంబాల నుంచి సంగీతం మా వాడికి వారసత్వంగా వచ్చిందనిపిస్తూ ఉంటుంది. మా అత్తగారి పేరులోని ‘దేవి’, మా మామ గారైన ప్రసాదరావు పేరులోని ‘ప్రసాద్ తీసుకొని, వాడికి ‘దేవిశ్రీ ప్రసాద్’ అని పేరు పెట్టా.

పది నెలల వయసులోనే పాట

గమ్మత్తై విషయం ఏమిటంటే, మా వాడికి పది నెలల వయసులోనే మాటలు వచ్చేశాయి. ఆశ్చర్యంగా అనిపించవచ్చు కానీ, మాటలే కాదు, పాటలు కూడా పాడేవాడు. అప్పట్లో ‘మన ఊరి పాండవులు’ సినిమా వచ్చింది. ఆ సినిమాలోని పాటలు పాడేవాడు. అలాగే, ఊళ్ళో గ్రామ్‌ఫోన్‌లో పాటలు విని, డ్యాన్సులు చేసేవాడు. సంగీతం మీద వాడి ఆసక్తి చూసి, వాడి ఉత్సాహాన్ని మేమెప్పుడూ కాదనలేదు.

చిన్నప్పటి నుంచే వాడికి సంగీత దర్శకుణ్ణి కావాలని కోరిక. ఆరో తరగతిలో ఉండగానే, పెద్దయ్యాక ఏమవుతావని స్కూల్లో అడిగితే, ‘మ్యూజిక్ డెరైక్టర్‌ని అవుతా’ అని చెప్పాడు. చిన్నప్పుడు మా పిల్లలు ముగ్గురూ (దేవిశ్రీ, సాగర్, పద్మిని) ఇంటి దగ్గరే ఒక ఆవిడ దగ్గర కర్ణాటక సంగీతంలో ప్రాథమిక పాఠాలు నేర్చుకున్నారు. అప్పట్లో ‘మాండొలిన్’ శ్రీనివాస్ గారు మా ఇంటికి దగ్గరలో ఉండేవారు. దేవిశ్రీ సంగీతాసక్తి చూసి, ఆయన దగ్గరకు మా ఆవిడ తీసుకువెళ్ళింది. దేవిశ్రీకి ఆయన మాండొలిన్ వాద్యం నేర్పారు. కీ-బోర్‌‌డలు, గిటార్‌తో సహా మిగతావన్నీ గురువులు లేకుండా వాడు సొంతంగా నేర్చుకున్నవే. మా వాడు మద్రాసులో హబీబుల్లా రోడ్‌లో వెంకట సుబ్బారావు స్కూలులో ప్లస్ 2 దాకా చదివాడు. ఆటలు, పాటలు - ఇలా అన్నింటిలో వాడు ముందుండేవాడు. పెయింటింగ్‌‌స ఎక్కువగా వేసేవాడు. ఎన్నో ప్రైజులొచ్చాయి. స్కూల్ పీపుల్స్ లీడర్ కూడా వాడే.

వాడు ఏది చేసినా కరెక్టే...

చిన్నప్పటి నుంచి వాడు ఏ విషయంలోనైనా సరే చాలా ఫోకస్డ్‌గా ఉండేవాడు. వాడికి నచ్చితేనే ఏదైనా చేస్తాడు. నచ్చకపోతే చేయడు. వాడు ఏం చేసినా, అది కరెక్ట్‌గా చేస్తాడని తల్లితండ్రులమైన మాకు తెలుసు.  అందుకే, వాడికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చాం. వాణ్ణి సొంతంగా నిర్ణయాలు తీసుకో నిచ్చాం. ఇంట్లో నా గది, వాడి గది పక్కపక్కనే. నిర్మాత ఎం.ఎస్. రాజు గారు మా ఇంటికి వచ్చినప్పుడు వాడి గదిలో నుంచి సంగీత వాద్యాల శబ్దాలు విని, వాడి దగ్గరకు వెళ్ళి ఒక సందర్భానికి ట్యూన్ అడిగారు. రెండు రోజుల్లో వాడిచ్చిన ట్యూన్ విని, ‘మీ అబ్బాయిని మ్యూజిక్ డెరైక్టర్‌ని చేస్తున్నా’ అన్నారు. దేవిశ్రీ అప్పుడే ప్లస్ 2 పరీక్షలయ్యాయి. తరువాత చదువు కోసం చూస్తుండగా, ఇది జరిగింది. ‘అంత చిన్నవాడికి అంతటి బాధ్యతా’ అని నేను అంటే, ‘మరేం ఫరవాలేద’ని రాజు గారు తొలి అవకాశమిచ్చారు. అలా వాడు ‘దేవి’ చిత్రంతో టీనేజ్‌లోనే సంగీత దర్శకుడై, సక్సెస్ సాధించాడు. ఇవాళ దేశమంతటా పేరు సంపాదించాడు.

మాటలను తిరగేసి రాయడం, తిరగేసి పలకడం లాంటి తమాషాలు చేసేవాడు. ‘కొత్తగా పదాలు సృష్టించాలిగా’ అనేవాడు. ఇప్పటికీ ఏదైనా పాట రాస్తే ముందుగా నాకే చూపిస్తాడు. అయితే, తాను రాశానని ముందుగా చెప్పడు. ‘ఇది వినండి’ అంటూ వినిపిస్తాడు. వాడి శైలి గ్రహించి, ‘ఇది నువ్వే రాశావు కదా’ అంటే, అప్పుడు అవునంటాడు.

వాడు ఇంత వాడవుతాడని మేమూ ఊహించలేదు. కానీ, ఇంత పేరొచ్చినా, ఇప్పటికీ ఇంట్లో అల్లరి చేస్తూ, అందరితో సరదాగా ఉంటాడు. సామాన్యుడిలా ప్రవర్తిస్తాడు. ఇంట్లో పనిచేసే వాళ్ళ దగ్గర నుంచి ఎవరినీ నొప్పించడు. బాధ పెట్టేలా మాట్లాడడు. ఇక, కుటుంబం పట్ల వాడికి ఉన్న ఆప్యాయత, అక్కర మాటల్లో చెప్పలేం. సొంతాని కంటూ ఏమీ చూసుకోడు. మాకు ఏదో చెయ్యాలనుకుంటుంటాడు. ఏదైనా సరే ముందుగా అమ్మానాన్నలమైన మాకే చెబుతాడు. అందరికీ చెప్పాలి, చెందాలి అనుకున్నప్పుడు, తమ్ముడు, చెల్లెలొచ్చేదాకా ఆగి, అప్పుడు పెదవి విప్పుతాడు.

అన్నీ సర్‌ప్రైజ్‌లే...
 
వాడు మాకు ఇచ్చిన కానుకలు అన్నీ ఇన్నీ కావు. ఏది చేసినా, అన్నీ సర్‌ప్రైజ్‌లే. గత ఏడాది మే 24న నా పుట్టిన రోజుకు సర్‌ప్రైజింగ్ గిఫ్ట్ ఇచ్చాడు. 23వ తేదీ అర్ధరాత్రి నాతో కేక్ కట్ చేయించి, కొత్త కారు ఇంట్లోకి తెచ్చాడు. చూస్తే, ఒక కొత్త ఇన్నోవా కొని, నాకు సౌకర్యంగా లోపల లాంజ్‌లాగా ఉండేలా దాన్ని ప్రత్యేకంగా డిజైన్ చేయించాడు. మొన్న మార్చి 12తో దేవిశ్రీ తొలి సినిమా విడుదలై 15 ఏళ్ళయింది. అప్పుడు నా కోసం మా అల్లుడైన ఆర్కిటెక్ట్ వివేక్‌తో ప్రత్యేకంగా మ్యూజికల్ సింబల్స్ డిజైన్ వేయించుకొని, సరిగ్గా అలాగే ఉండేలా నగల షాపుకు వెళ్ళి  బ్రేస్‌లెట్ చేయించాడు. నాకేమో అలాంటి సింబల్స్‌తోనే వజ్రాల గాజులు చేయించాడు. మా దగ్గర తప్ప ఎవరి దగ్గరా అలాంటివి ఉండకూడదని అలా ప్రత్యేకంగా డిజైన్ చేయించాడు. అలాంటి పనులు చేసి, మమ్మల్ని సంతోషపెడుతుం టాడు. ప్రతి విషయంలో దేవిశ్రీకి పక్కనే తమ్ముడు సాగర్ ఉండాల్సిందే. అలాగే, చెల్లెలు పద్మిని అంటే వాడికి ప్రాణం. దాని మాట వాడికి వేదవాక్కు. వాళ్ళ ముగ్గురూ ఒక జట్టు.

దేవిశ్రీ బావ లాగానే చెల్లెలు కూడా ఆర్కిటెక్టే. యూర ప్‌కు చెందిన ఒక సంస్థకు ఇండియాలో హెడ్ ఆఫ్ డిజైన్‌గా పనిచేస్తోంది. చిన్నప్పుడు దేవిశ్రీకి ఫోటోలు తీయడం, పాటల వీడియోలు చిత్రీకరించడమంటే మహా ఇష్టం. చెల్లెలికి పరీక్షలున్నా సరే వినకుండా, దానితో రకరకాల దుస్తులు వేయించి, ఫోటోలు తీసేవాడు. పిల్లలు ముగ్గురూ కలసి కూర్చొంటే, ఇవాళ్టికీ రోజూ సందడే. వాడికి ఎప్పుడూ ప్రత్యేకంగా పుట్టినరోజులు పండుగలా చేసుకోవడం పెద్దగా ఇష్టం ఉండదు. ‘విడిగా బర్‌‌తడే సెలబ్రేట్ చేసుకోవడం ఎందుకు? రోజూ అమ్మా నాన్న, పిల్లలం కలిసి నవ్వుకుంటూ, కబుర్లు చెప్పుకుంటూ ఉంటే, ఇంట్లో పండగేగా’ అని వాళ్ళ చెల్లెలితో అంటాడు.

తినడు... పడుకోడు...

సంగీత దర్శకుడిగా ఇంత పేరొచ్చినా, దేవిశ్రీ రిలాక్సవడు. వాడికి ఒకటే పనిపిచ్చి. ఇప్పటికీ రాత్రీ పగలూ కష్టపడతాడు. అది చూస్తుంటే, వాళ్ళ అమ్మకు చాలా కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా సరిగ్గా తిననే తినడు. నిద్రా తక్కువే. మేడ పైన ఉన్న స్టూడియోకు వెళ్ళి, చెల్లెలు పద్మిని బలవంతాన కిందకు తీసుకువస్తే, అప్పుడొస్తాడు. కష్టపడి ఏదైనా తినిపించడానికి వాళ్ళ అమ్మ రాత్రి చాలాసేపు మెలకువగానే ఉంటుంది. ‘వాడు పడుకొని, కంటి నిండా నిద్రపోయి ఎన్నేళ్ళయిందో’ అని బాధపడుతుంటుంది.

ఈ జూలై 5 నుంచి ఆగస్టు 9 దాకా దేవిశ్రీ, సాగర్‌లు అమెరికా, కెనడాల్లో సంగీత ప్రదర్శనలిస్తూ బిజీగా ఉన్నారు. ఈ పుట్టినరోజు నాడు దేవిశ్రీ న్యూజెర్సీలో ప్రోగ్రావ్‌ు చేస్తున్నాడు. అంతదూరంలో ఉన్నా ఇవాళ్టికీ రోజూ మాతో ఫోన్‌లో మాట్లాడతాడు. మా యోగక్షేమాలు కనుక్కుంటూ ఉంటాడు. అసలు తొలిసారిగా తానే సొంతంగా చేస్తున్న ఈ అమెరికా పర్యటనకు మా ఇద్దరినీ, చెల్లెలినీ, బావనూ కూడా తీసుకువెళ్లాలని అనుకున్నాడు. బలవంతపెట్టాడు కూడా. కానీ, వేరే పనులతో మేమే వద్దని చెప్పాం.

దేవిశ్రీకి పెళ్ళి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కానీ, వాడే వాయిదా వేస్తున్నాడు. ‘నువ్వు పెళ్ళి చేసుకోవడమే మాకు నువ్విచ్చే కానుక. మా సంతోషం కోసం ఇదెందుకు చేయవు’ అని అడుగుతుంటాం. ఆ మాట అడిగితే, ‘ఆ.., ఊ...’ అని మాట మార్చేస్తాడు. పెళ్ళి మాటెత్తవద్దంటాడు. ఆ ముచ్చట తీరితే, మాకు సంతోషంగా ఉంటుంది. ఏమైనా, అలాంటి పిల్లాడు మా బిడ్డగా పుట్టడం మా అదృష్టం. దేవుడిచ్చిన వరం.

సంభాషణ: రెంటాల జయదేవ

(Published in 'Sakshi' daily, 2nd Aug 2014, Saturday)
.....................................

Saturday, August 2, 2014

నా నలభై ఏడో ఏట చెంప ఛెళ్లుమనిపించారు! - నిర్మాత అల్లు అరవింద్

అల్లు రామలింగయ్య... ఆ పేరు తలచుకోగానే... ఎన్నో పాత్రలు... మరెన్నో సినిమాలు కళ్ళ ముందు గిర్రున రీళ్ళు తిరుగుతాయి. ఆ నాటి ‘మాయాబజార్’ నుంచి ఆ మధ్య వచ్చిన ‘జై’ దాకా...  అల్లు... తెలుగుతెరపై నవ్వుల విరిజల్లు. ‘ముత్యాల ముగ్గు’, ‘శంకరాభరణం’, ‘సప్తపది’... ఇలా ప్రతి సినిమాలో ఆయన పాత్ర ఓ కొలికిపూస. మరి, నిజజీవితంలో ఆయన ఎలా ఉండేవారు? పిల్లలతో ఎలా మెలిగేవారు? వారికి ఆయన నేర్పిన పాఠాలేమిటి? నటుడిగా ఆయన ఫిలాసఫీ ఏమిటి? ఇవాళ అల్లు రామలింగయ్య పదో వర్ధంతి సందర్భంగా... తండ్రిగా, నటుడిగా, హోమియో డాక్టర్‌గా... అంతకుమించి మంచి మనిషిగా అల్లులోని అనేక కోణాలపై ఆయన కుమారుడు, ప్రసిద్ధ నిర్మాత అల్లు అరవింద్ ఫోకస్ లైట్...
 
మా నాన్న అల్లు రామలింగయ్య గారు మన కళ్ళెదుట భౌతికంగా లేరన్న మాటే కానీ, ఇవాళ్టికీ కనీసం అయిదారు సార్లయినా తలుచుకోనిదే, ఏదో ఒక సందర్భంలో ఆయనను గుర్తు తెచ్చుకోనిదే నాకు రోజు గడవదు. నిజానికి ఆయన భౌతికంగా లేని ఈ పదేళ్ళలో నేను ఆయనను మిస్ అయిన క్షణం లేదు. ప్రతి విషయంలో ఆయన నా వెంటే ఉన్నారని నా భావన. అందుకే, ‘గీతా ఆర్ట్స్’ పతాకంపై మేము నిర్మిస్తున్న సినిమాలన్నిటికీ ఇప్పటికీ ‘అల్లు రామలింగయ్య సమర్పించు’ అని టైటిల్స్‌లో వేస్తుంటా.

జీవించడం నేర్పిన గురువు

నాకు వ్యక్తిగతంగా ఎవరూ గురువులు లేరు. కానీ, గురుపూర్ణిమ వచ్చిందంటే నేను ఇద్దరినే తలుచుకుంటూ ఉంటా. ఆ ఇద్దరూ ఎవరంటే - ఒకరు మా నాన్న గారు. రెండో వ్యక్తి - మా కుటుంబానికి సన్నిహితులు, సలహాదారైన నిర్మాత డి.వి.ఎస్. రాజు గారు. నా వ్యక్తిగత, సినిమా జీవితం మీద నాన్న గారు వేసిన ప్రభావం అంతటిది. నా దస్తూరీ ఇవాళ్టికీ చాలా బాగుంటుంది. దానికి కారణం మా నాన్న గారే! నా హ్యాండ్ రైటింగ్ బాగుండాలని తెలుగు, ఇంగ్లీషు కాపీ రైటింగ్ పుస్తకాలు తెచ్చి రోజూ నాలుగేసి పేజీల చొప్పున రాసి, చూపించమనేవారు. ఇలా ప్రతి చిన్న విషయంలో ఆయన గెడైన్‌‌స, ఇచ్చిన శిక్షణ నన్నివాళ ఇలా తీర్చిదిద్దాయి.

తండ్రిగా ఆయనది ఓ ప్రత్యేక పద్ధతి. ఆడపిల్లల పెంపకంలో సగటు మధ్యతరగతివాడిగా స్ట్రిక్ట్‌గా ఉండేవారు. అదే సమయంలో పిల్లలకు జీవితం నేర్పాలనే ఉద్దేశంతో పధ్నాలుగు, పదిహేనేళ్ళ వయసు వచ్చినప్పటి నుంచి నన్ను ఓ కొడుకులా కాకుండా, స్నేహితుడిలా చూశారు. పదహారేళ్ళ వయసు నుంచే నన్ను చివరకు ఆడిటర్ దగ్గరకు కూడా తీసుకువెళ్ళేవారు. అలాగే, కుటుంబ రాబడి, ఖర్చు, ఆదా, ఎక్కడ ఎలా మదుపు చేయాలనే విషయాల్లోనూ నన్ను ఇన్‌వాల్వ్ చేసేవారు. అప్పట్లో ‘అవేవీ తెలియక, ఇదేమిట్రా బాబూ.. మనకెందుకీ గొడవ’ అనుకొనేవాణ్ణి. కానీ, ఇవాళ మా కుటుంబంలో కానీ, చిరంజీవి గారి కుటుంబంలో కానీ ఎవరికీ పన్ను బకాయిలు, ట్యాక్స్ సమస్యలు ఏమీ లేకుండా ఉన్నాయంటే, ఆర్థిక అంశాలన్నీ జాగ్రత్తగా దగ్గరుండి చూసుకోగలుగుతున్నానంటే దానికి కారణం ఆ ట్రైనింగే! అలాగే, మా చెల్లెళ్ళ పెళ్ళి సంబంధాల దగ్గర నుంచి అన్ని విషయాలూ చిన్నవాడినైన నాతో ఆయన చర్చించేవారు. (నవ్వుతూ...) అలా చిన్నప్పుడే నాకు పెద్దరికం వచ్చేలా చేశారు. అందుకే, ఇవాళ్టికీ మా సిస్టర్స్‌కు నేను అన్నలా కాక, నాన్న గారి తరువాత నాన్న గారిలా కనబడుతుంటాను.  చిన్నప్పటి నుంచి ఆయన నన్ను కూర్చోబెట్టి ఎన్నో చెప్పేవారు. వస్తుతః లోలోపల నేను కొంత దూకుడు! అలాంటి నేనివాళ ఎప్పుడూ తొందరపడి మాట్లాడను. ఎవరి మీదా నోరు పారేసుకోను. అది కూడా నాన్న గారి చలవే. ‘పెదవి దాటిన మాట - తనకు రాజు. కానీ, పెదవి దాటని మాటకు తానే రాజు’ అని ఆయన ఎప్పుడూ చెబుతూ ఉండేవారు. నాన్న గారు చెప్పిన సామెత నా మీద ముద్ర వేసింది.

అరుదైన హస్తవాసి

మా నాన్నగారు వాళ్ళు అయిదుగురు అన్నదమ్ములు. వాళ్ళలో మూడో ఆయన మా నాన్న గారు. సినిమాల్లో వేషాల కోసం పాలకొల్లు నుంచి మద్రాసు వచ్చినప్పుడు ఆయన కష్టాలు పడిన తొలి రోజులు నాకు గుర్తే. సంపాదన లేక, సరిపోక ఊళ్ళోని మా పెదనాన్న గారి దగ్గర నుంచి డబ్బులు తెప్పించుకొని, ఇల్లు గడిపిన సంగతులు నాకు తెలుసు. నటుడిగా పేరు, డబ్బు సంపాదించినా ఆ రోజుల్ని ఆయన మర్చిపోలేదు. కమ్యూనిస్టు భావాలున్న ఆయనలో మానవత్వం ఎక్కువ. సినిమాల్లోకి రాక ముందు హోమియోపతి వైద్యం ఆయన వృత్తి. ఆయన హస్తవాసి మంచిదని ఎంతోమందికి నమ్మకం. సినిమాల్లో స్థిరపడ్డాక అందరికీ ఉచితంగా మందులిస్తూ, హాబీగా కొనసాగించారు. ఎన్టీఆర్‌కి ఫ్రాక్చరైతే, ఏయన్నార్ గారి కాలులో చిన్న ఇబ్బంది వస్తే నాన్న గారు హోమియో వైద్యం చేశారు. ఎన్టీయార్ గారి భార్య బసవ తారకం గారికి నాన్న గారు నమ్మకమైన ఫ్యామిలీ డాక్టర్. (నవ్వుతూ...) నన్ను కూడా హోమియోపతి నేర్చుకోమనేవారు. కానీ, అది నాకు ఎక్కలేదు. ఆయన సేకరించి, చదువుకొన్న ఎన్నో హోమియోపతి పుస్తకాలు మా ఇంట్లో ఉన్నాయి. ఆయన గుర్తుగా వాటిని భద్రంగా దాచాం.

ఆయన కోరిక తీరింది...         

మా ఇంట్లో మేము అయిదుగురం. మా అక్క నవభారతి. నేను, మా చెల్లెళ్ళు వసంతలక్ష్మి (డాక్టర్ వెంకటేశ్వరరావు గారి భార్య), సురేఖ (చిరంజీవి గారి భార్య), చనిపోయిన మా తమ్ముడు వెంకటేశ్. మా తమ్ముడిలో మంచి ఫీచర్లున్నాయని, వాణ్ణి సినీ నటుణ్ణి చేయాలని నాన్న గారికి ఉండేది. కానీ, అనుకోకుండా జరిగిన రైలు ప్రమాదంలో వాడు చనిపోయాడు. మా అబ్బాయి బన్నీ (అల్లు అర్జున్) స్టారవడంతో మా తమ్ముడు వెంకటేశ్‌కు రావాల్సినదంతా బన్నీకొచ్చిందనీ, నటుడిగా తన వారసత్వం కొనసాగాలన్న కోరిక తీరిందనీ సంతోషించారు.

వృత్తికి అడ్డు కాని వ్యక్తిగత విషాదం

మా తమ్ముడు చనిపోయినప్పుడు నాన్న గారు ఎంతో బాధపడ్డప్పటికీ, తన పర్సనల్ ఫిలాసఫీ ద్వారా దృఢంగా నిలబడ్డారు. వాడు చనిపోయిన నాలుగో రోజునో, అయిదో రోజునో ఆయనకు షూటింగ్ ఉంది. అది బాపు గారి సినిమా అనుకుంటా. షూటింగ్ క్యాన్సిల్ చేద్దామా అని వాళ్ళు అడిగారు. కానీ, అదేమీ వద్దని, మనసును రాయి చేసుకొని షూటింగ్‌కు వెళ్ళిపోయారు నాన్న గారు. అక్కడ సన్నివేశం కూడా విషాద సన్నివేశం. గ్లిజరిన్ ఇస్తామన్నారట. కానీ, నాన్న గారు అక్కర్లేదని, గ్లిజరిన్ లేకుండానే ఆ సన్నివేశంలో కన్నీళ్ళు పెట్టుకొని, ఆ సన్నివేశం పండించారు. వ్యక్తిగత విషాదాన్ని పక్కనపెట్టి, వృత్తి పట్ల నిబద్ధత చూపే ఆయన ‘దృఢ వ్యక్తిత్వాని’కి ఇదో ఉదాహరణ.

తీపి జ్ఞాపకం... తరగని ఆస్తి...     

వ్యక్తిగా ఆయనలో నచ్చే అతి గొప్ప విషయం ఏమిటంటే, ఆయన చాలా ప్రజాస్వామికంగా ఉండడం, అందరికీ స్వేచ్ఛనివ్వడం. అయితే, పట్టరాని కోపం వచ్చినప్పుడు ఒక్కోసారి ఒక తండ్రిగా నన్ను తిట్టేవారు, కొట్టేవారు కూడా! ఆయనతో నాకు ఓ చిత్రమైన తీపి జ్ఞాపకం ఉంది. ఆయన నన్ను ఆఖరు సారిగా కొట్టింది ఎప్పుడో తెలుసా? నా 47వ ఏట! ఒకరోజు నేను కారు నడుపుతుంటే, ఆయన పక్కన కూర్చొని ఉన్నారు. ఇంటి లోపలకు కారుతో అడుగు పెడుతున్నప్పుడు నేను అనుకోకుండా సడెన్ బ్రేక్ వేశాను. సీట్ బెల్టులు లేని ఆ రోజుల్లో ఆయన తల వెళ్ళి, ముందుకు కొట్టుకుంది. అంతే... ఒక్కసారిగా కోపం వచ్చి, ‘ఎవడ్రా నీకు డ్రైవింగ్ నేర్పింది’ అంటూ చెంప ఛెళ్ళుమనిపించారు. కొంపతీసి ఇది మా ఆవిడ కానీ చూసిందేమో అని టెన్షన్ పడ్డా. బాల్కనీ వైపు చూస్తే మా ఆవిడ కనపడలేదు. హమ్మయ్య చూడలేదనుకున్నా. తీరా, ఇంట్లోకి వెళ్ళాక ఎందుకు కొట్టారంటూ అడిగేసరికి గతుక్కుమన్నా. (నవ్వులు...) ఆ క్షణం కొద్దిగా ఇబ్బంది అనిపించినా, ఇప్పుడు తలుచుకుంటే అది మా నాన్న గారు నాకిచ్చిన అత్యంత తీపి జ్ఞాపకం అనిపిస్తుంటుంది. నాకు ఎంత వయసు వచ్చినా, ఎంత ఎత్తుకు ఎదిగినా నన్ను ఓ చిన్న పిల్లాడిగా, తండ్రి మీద గౌరవమున్న కొడుకుగానే చూసిన ఓ తండ్రి తాలూకు ప్రేమ, క్రమశిక్షణ అది.

నటుడిగా నాన్న గారు వెయ్యికి పైగా చిత్రాల్లో నటించారు. నాన్న గారికి ‘పద్మశ్రీ’ వచ్చినప్పుడు నేను ‘ప్రతిబంధ్’ షూటింగ్‌లో హైదరాబాద్‌లో ఉన్నా. విషయం తెలిసి, మద్రాసులో ఇంటికి ఫోన్ చేశా. కళ్ళలో నీళ్ళు తిరుగుతుండగా, ‘నాన్న గారూ! ఇన్నాళ్ళూ మీరు మాకిచ్చిన ఆస్తులైన ఇళ్ళు, పొలాలు, డబ్బు అమ్ముకోవచ్చు. కానీ, ఎప్పటికీ అమ్మలేని ఆస్తిగా ‘పద్మశ్రీ’ గౌరవాన్ని మాకు ఇచ్చారు’ అన్నాను. ఆ మాటకు ఆయన ఎంత ఆనందించారో!

చెరిగిపోని నవ్వు... చెదిరిపోని నువ్వు...

అప్పటికప్పుడు అక్కడికక్కడ ఛలోక్తులు విసరడం ఆయనకు అలవాటు. ఒకసారి ఆయన కాలికి చిన్న దెబ్బ తగిలి, బెణికింది. దానికి చిన్న బ్యాండేజ్ కట్టారు. ఆ రోజున నాతో పాటు మా ఇంటికి వచ్చిన నా ఫ్రెండ్ శ్రీనివాసరావు అది చూస్తూనే, ‘ఏమిటి సార్... ఆ కట్టు...’ అంటూ గావుకేక పెట్టాడు. అంతే. ‘ఏనుగు తొక్కిందిలే’ అన్నారు నాన్న గారు. (నవ్వులు) అదేమిటంటూ విస్తుపోవడం మా ఫ్రెండ్ వంతు అయింది. అప్పుడు మా నాన్న గారు, ‘నువ్వు అంతగా రియాక్ట్ అయినప్పుడు, ‘ఏదో కాలు కొద్దిగా బెణికిందిలే’ అని చెబితే డిజప్పాయింట్ అవుతావు.

అందుకని, ఏనుగు తొక్కిందని చెప్పా’ అని నవ్వించారు. అలాగే, చనిపోవడానికి ఆరు నెలల ముందు హైదరాబాద్ కె.బి.ఆర్. పార్క్‌కు వెళ్ళారాయన. అక్కడ ఆయన కూర్చొని ఉంటే, తెలిసినవాళ్ళు ఎదురై పలకరించి, ‘వాకింగ్‌కు వచ్చారా’ అని అడిగారు. దానికి నాన్న గారు ‘అవునండీ! కానీ, నేను పెద్దోణ్ణి. నడవలేను కదా! అందుకే, కుర్రాణ్ణి పెట్టా. వాడు నడుస్తున్నాడు’ అని చటుక్కున బదులిచ్చారు (నవ్వులు...)  సినిమాలు, నటన, ఇలాంటి ఛలోక్తులు చూసి చాలామంది ఆయన వట్టి హాస్యజీవి అనుకుంటారు.

కానీ, జీవితంలో ఆయన చాలా సీరియస్ మనిషి. ఫిలసాఫికల్ థింకర్. ఆయనకు వివేకానంద స్వామి, రామకృష్ణ పరమహంస అంటే మహా ఇష్టం. వాళ్ళ పుస్తకాలెన్నో ఆయన చదివేవారు. అలాగే, వేస్తున్న వేషం తనకు లొంగే వరకు నటుడిగా ఆయన తృప్తిపడేవారు కాదు. వేస్తున్నది కమెడియన్ పాత్ర అయినా సరే, పూర్తి కథ, సన్నివేశం పూర్వాపరాలు తెలుసుకొని, పాత్రను అవగాహన చేసుకొనేవారు. అలా పాత్రను మనసుకు ఎక్కించుకొనేవరకు దర్శకులనూ, కో-డెరైక్టర్‌నీ వివరాలు అడుగుతూనే ఉండేవారు. ఒక్కసారి ఆ పాత్రను లొంగదీసుకున్న తరువాత అద్భుతంగా నటించేవారు.

అందుకే, ఆయన నటన అంత సహజంగా ఉండేది. చిరంజీవి, రజనీకాంత్, అమితాబ్ - ఇలా ఏ భాషలో చూసినా హాస్యం పండించగలిగినవారే పెద్ద హీరోలయ్యారు. ఉన్నత స్థాయికి వెళ్ళారు. అందుకే, నా దృష్టిలో హీరోయిజమ్ అంటే హాస్యమే. అలాంటి హాస్యాన్ని ప్రాణానికి ప్రాణంగా భావించి, తెరపై నవ్వులు విరబూయించిన నాన్న గారి లాంటి వారందరూ నా దృష్టిలో చిరకాలం గుర్తుండే హీరోలు.  

సంభాషణ: రెంటాల జయదేవ

దర్శకులు కె.విశ్వనాథ్, బాపు అంటే నాన్న గారికి ఎంతో గౌరవం. దాసరి, రాఘవేంద్రరావులంటే మహా ఇష్టం. అలాంటి దర్శకుల చిత్రాల్లో నటించాలని ఆయన తపించేవారు. ముఖ్యంగా, విశ్వనాథ్, బాపుల చిత్రాల్లో తాను తప్పకుండా ఉండాలనుకొనేవారు. తనకు పాత్ర ఉండదేమోనని తెగ బెంగపడేవారు. వాళ్ళ సినిమాలంటే, ఇక పారితోషికం, ఇతర విషయాలేవీ పట్టించుకొనేవారు కూడా కాదు. చివరి దాకా అదే పాటించారు. అలాంటి పాత్రలెన్నో పోషించబట్టే, కన్నుమూసి ఇప్పటికి పదేళ్ళయినా ఆయన చిరంజీవిగా ప్రేక్షకుల హృదయాల్లో మిగిలారు.

(Published in 'Sakshi' daily, 31st July 2014, Thursday)
...............................

Thursday, July 31, 2014

" 'శంకరశాస్త్రి' పుణ్యమా అని నేను, అన్నయ్య ఎనిమిదేళ్లు మాట్లాడుకోలేదు..!" - నటుడు జె.వి. రమణమూర్తి

జె.వి. సోమయాజులుది నిండైన విగ్రహం... ఖంగుమని వినిపించే స్వరం...
 తమ్ముడు రమణమూర్తితో కలసి ఆయన ప్రాణం పోసిన నాటక పాత్రలనేకం...
 కానీ, ఒక్క సినిమా, ఒకే ఒక్క పాత్ర ఆయన జీవితాన్నే మార్చేశాయి. ‘శంకరాభరణం’ శంకరశాస్త్రిగా చెరగని ముద్ర వేసిన సోమయాజులు ‘కన్యాశుల్కం’కీ, తమ్ముడికీ
 కొన్నేళ్ళు ఎందుకు దూరమయ్యారు? ఎన్నో ఏళ్ళు కలసి నటించినా, తమ్ముణ్ణి
 ఎందుకు మెచ్చుకోలేదు? ఇవాళ సోమయాజులు జన్మదినం సందర్భంగా
 నిజజీవిత శంకరశాస్త్రి జ్ఞాపకాల కిటికీని 81 ఏళ్ళ తమ్ముడు తెరిచారు.

 
మాది శ్రీకాకుళం జిల్లా లుకులామ్ అగ్రహారం. మా తాత గారు జొన్నలగడ్డ సుబ్రహ్మణ్య సోమయాజి. మా నాన్న గారు జె.వి. శివరామమూర్తి ఆ రోజుల్లో ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్. మా అమ్మా నాన్నలకు మేము అయిదుగురం అబ్బాయిలం, ఒక అమ్మాయి. జె.వి. సోమయాజులు రెండో సంతానమైతే, నేను నాలుగో సంతానం. అన్నయ్య పూర్తి పేరు - జొన్నలగడ్డ వెంకటసుబ్రహ్మణ్య సోమయాజులు. మేమంతా ఉమ్మడి కుటుంబంగా ఉండేవాళ్ళం. చిన్నప్పటి నుంచి మేమిద్దరం అన్నదమ్ముల లాగా కాకుండా, మంచి స్నేహితుల లాగా ఉండేవాళ్ళం. ఒకరినొకరం ‘ఒరేయ్’ అంటూ, పేర్లతోనే పిలుచుకొనేవాళ్ళం.

రంగస్థలంపై తొలి రోజుల్లో...

మా అన్నయ్య సోమయాజులు, నేను, నా తరువాతి వాడైన జె.వి. శ్రీరామ్మూర్తి - మేమంతా రంగస్థల పక్షులం. స్కూలు, కాలేజ్ రోజుల నుంచే అందుకు భూమిక ఏర్పడింది. నాటకం పేరు గుర్తు లేదు కానీ, కాలేజీ రోజుల్లో వితంతువైన బోడెమ్మ వేషం వేశాడు అన్నయ్య. అది ఆయన తొలి నటనానుభవం. తర్వాత పెద్ద బ్యాచ్‌ను వదిలేసి, మా పిల్లకుంకల బ్యాచ్‌లో సభ్యుడయ్యాడు. అప్పటి నుంచి నేను, అన్నయ్య కలసి మా ‘కవిరాజు మెమోరియల్ క్లబ్’ పక్షాన ఆత్రేయ ‘ఎన్జీఓ’, కవిరాజు ‘దొంగాటకం’, ప్రఖ్య శ్రీరామ్మూర్తి ‘కాళరాత్రి’ - ఇలా ఎన్నెన్నో పట్టుదలగా, ఉత్సాహంగా ఆడేవాళ్ళం! డెరైక్టర్‌గా నాటకంలో ముఖ్యమైన పాత్ర అన్నయ్యకిచ్చేవాణ్ణి. మిగిలినవాళ్ళకు తగిన పాత్రలు ఇచ్చేసి, అందరూ వదిలేసిన పాత్ర నేను వేసేవాణ్ణి. అదీ పద్ధతి. నాటకంలో పాత్రపోషణ ఎలా ఉండాలనే దాని మీద మా అన్నయ్యకూ, నాకూ వాదనలు జరిగిన సందర్భాలున్నాయి. వాడి దగ్గర సుగుణం ఏమిటంటే, ఒకసారి డెరైక్టర్ చెప్పాక, దాన్ని అర్థం చేసుకొని చెప్పినట్లు చేసేసేవాడు.

ఏళ్ళ తరబడి ‘కన్యాశుల్కం’ జైత్రయాత్ర

ఊళ్ళో నాటకాలు వేస్తున్న తొలి రోజుల నాటికే సోమయాజులు ప్రభుత్వాఫీసులో క్లర్క్. పొద్దుటి నుంచీ సాయంత్రం దాకా ఆఫీసులో ఉండేవాడు కాబట్టి, రిహార్సల్స్ కష్టంగా ఉండేది. అందుకే, వాడు అన్నం తింటున్నప్పుడు కూడా పక్కనే ఉండి స్క్రిప్టు చదివి వినిపించేవాణ్ణి. అవన్నీ గుర్తుపెట్టుకొనేవాడు. అన్నదమ్ములం నాటకాలు వేస్తుంటే, మా అమ్మ చూసి, ఎంతో ఆనందించేది. గురజాడ అప్పారావు ‘కన్యాశుల్కం’ చేపట్టినప్పుడు కీలకమైన రామప్ప పంతులు వేషం మా అన్నయ్యకిచ్చి, నేను గిరీశం వేషం కట్టాను. తొలిసారిగా విజయనగరంలో 1953 ఏప్రిల్ 20న ‘కన్యాశుల్కం’ వేశాం. ఆ రోజు మొదలు 1995 సెప్టెంబర్ 22న ఆఖరు ప్రదర్శన దాకా 42 ఏళ్ళ పాటు ‘నటరాజ కళాసమితి’ బృందంగా ‘కన్యాశుల్కం’ కొన్ని వందల ప్రదర్శనలు ఇచ్చాం. దేశమంతటా మాకు అఖండ కీర్తి వచ్చింది. నటుడిగా వాడిలో ఉన్న పెద్ద బలం - ఆత్మవిశ్వాసం. పాత్ర స్వభావం ఆకళింపు చేసుకున్నాక, దాన్ని మరెవ్వరూ చేయలేరన్నంతగా చేసేసేవాడు. ఇద్దరం కలసి నాటకాలు వేస్తున్నప్పుడు పరిషత్ పోటీల్లో చాలాసార్లు ఉత్తమ నటుడి విషయంలో నాకూ, వాడికీ మధ్య పోటీ టై అయ్యేది.

ఫ్లాప్‌తో... సినీ రంగ ప్రవేశం

1957లో నేను సినిమాల్లోకి వెళ్ళాను. ఎల్వీ ప్రసాద్ మేనల్లుడు కె.బి. తిలక్ ‘ఎం.ఎల్.ఎ’ చిత్రంతో ప్రేక్షకులకు దగ్గరయ్యా. తరువాత 22 ఏళ్ళకు దర్శకుడు యోగి ‘రారా కృష్ణయ్యా!’ ద్వారా వైజాగ్‌లో డిప్యూటీ కలెక్టర్‌గా ఉన్న అన్నయ్యను తెరపైకి తెచ్చాడు. మొదట వేయనని పట్టుబట్టినా, నా చీటీ చూసి, స్క్రిప్టు చదివి, నా సలహా మేరకు అన్నయ్య ఒప్పుకున్నాడు. తీరా, సినిమా ఫ్లాపైంది.

ఆ తరువాత సినిమాల్లోనూ, సమాజంలోనూ మా అన్నయ్యను రాత్రికి రాత్రి మార్చేసిన సినిమా - ‘శంకరాభరణం’. ఆ స్క్రిప్టు ప్రకారం ‘శంకరాభరణం’ శంకరశాస్త్రి పాత్రకు తెలిసిన ముఖాలు పనికిరావు, కొత్తవాళ్ళు కావాలి. అలాగని కథను పండించాలంటే కొత్తవాళ్ళయితే కుదరదు, అనుభవం ఉండాలి. ఏం చేయాలని విశ్వనాథ్ ఆలోచిస్తున్నప్పుడు, ఆయనకు మా అన్నయ్య పేరు చెప్పారు యోగి. ‘రారా కృష్ణయ్య’ ఫ్లాపవడంతో, అన్నయ్య ఇష్టపడలేదు. కానీ, ‘ఈ సినిమా చేస్తే అఖండ కీర్తి వస్తుంద’ంటూ స్క్రిప్టు తెలిసిన నేను అన్నయ్యను అతి కష్టం మీద ఒప్పించి, మద్రాసుకు రప్పించాల్సి వచ్చింది. మొదట వద్దు వద్దన్నా చివరకు అంగీకరించాడు. ‘శంకరాభరణం’ (1980 ఫిబ్రవరి 2న) విడుదలై, ఇంటింటా పాటలు మారుమోగేసరికి రాత్రికి రాత్రి స్టారైపోయాడు.
 
మనిషిని మార్చేసిన ‘శంకరాభరణం’

వాడు ఇంట్లో కూడా అచ్చం శంకరశాస్త్రి తరహాలోనే ఉండేవాడు. మొదటి నుంచీ వాడికి మహా రాజసం. అవతలవాళ్ళు పది మాటలు మాట్లాడితే, ఒక మాట ‘ఊ’, ‘ఆ’ అనేవాడు. ఇంట్లో పిల్లలను కఠినమైన క్రమశిక్షణతో పెంచాడు. అవన్నీ ఆ పాత్రకు సరిపోయాయి. అందుకే, ఓ సారి మా వదిన నాతో, ‘రమణా! శంకరశాస్త్రి అంటూ జనం మీ అన్నయ్య వెంట వెర్రెత్తిపోయి, చచ్చిపోతున్నారు గానీ, ఏవిటి చేశాడోయ్ అక్కడ! రోజూ ఇంట్లో మనం చూసే భాగోతమే కదా!’ అని అంది నవ్వుతూ. ఒక్కమాటలో చెప్పాలంటే, పాత్రను మా వాడు పోషించలేదు. నిజజీవితంలోలా ప్రవర్తించాడు.

అయితే, ఒకరకంగా చూస్తే - ఆ సినిమా, పాత్ర సోమయాజులుకు ఎంత పేరు తెచ్చాయో, నటుడిగా అంత చెరుపూ చేశాయని తరువాత తరువాత నాకు అనిపించింది. అంతటి అఖండ కీర్తితో సహజంగానే ఎవరికైనా దర్పం వస్తుంది. చుట్టూ భజనపరులు తయారయ్యారు. తరువాత కొద్దికాలానికి మునుపెప్పుడో ఒప్పుకున్న ‘కన్యాశుల్కం’ నాటక ప్రదర్శన చేయాల్సి వచ్చింది. కానీ, ‘ఇంత పేరొచ్చాక, ఇప్పుడు ‘కన్యాశుల్కం’ రామప్ప పంతులు పాత్ర చేయలేను. జనం నన్ను ఆ పాత్రలో అంగీకరించరు’ అన్నాడు సోమయాజులు. దాంతో, నాకు కోపం వచ్చింది. ‘నాటకం కన్నా, పాత్ర కన్నా నటుడు గొప్పవాడేమీ కాదు. ఏ వేషం నీకు గుర్తింపు తెచ్చి, నిన్ను నటుడిగా తీర్చిదిద్దిందో అది వేయనంటున్నావు. నీ లాంటివాడితో కలసి మళ్ళీ రంగస్థలం ఎక్కను’ అని చెప్పేశాను. అలా శంకరశాస్త్రి పాత్ర పుణ్యమా అని దాదాపు తొమ్మిదేళ్ళు నాకూ, వాడికీ మధ్య రాకపోకలు, మాటలు లేవు. కానీ, చివరకు ‘కన్యాశుల్క’మే మళ్ళీ మమ్మల్ని కలిపింది. ఆ నాటకం నూరేళ్ళ పండుగకు విజయనగరం వాళ్ళు మళ్ళీ మా బృందంతో ప్రదర్శన వేయించాలని పట్టుబట్టి, మమ్మల్ని కలిపారు. గురజాడ వారు తొలిసారిగా ప్రదర్శించిన విజయనగరం కోటలోనే ఆ నాటక ప్రదర్శన దిగ్విజయంగా వేశాం. ఆ నూరేళ్ళ ఉత్సవ సందర్భంగా ఆ ఒక్క ఏడాదిలోనే దేశమంతటా మళ్ళీ కొన్ని పదుల ప్రదర్శనలిచ్చాం! గొడవ కాకముందైతేనేం, తరువాత అయితేనేం... మా అన్నయ్య, నేను - ఇద్దరం కలసి తెరపై నటించాం. కలిసి నటించినా, మాట్లాడుకున్నా ఎందుకనో నాకూ, వాడికీ మధ్య మునుపటి సద్భావం పోయింది. ముభావంగానే ఉండేవాడు. కానీ, (గద్గదికంగా...) అప్పటికీ, ఇప్పటికీ వాడంటే నాకు ప్రేమ, గౌరవమే.



















అరుదైన నిజాయతీ... అపూర్వ గౌరవం...

 మా అన్నయ్యలోని మరో గొప్పతనం ఏమిటంటే, క్లర్క్‌గా మొదలైనవాడు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌గా ఎదిగాడు. ఎవరైనా వచ్చి ఏ సాయం అడిగినా, తన అధికార పరిధిలో చేయగలిగినదంతా చేసేవాడు. వాళ్ళ ఇల్లు నిలబెట్టేవాడు. కానీ, ఏనాడూ ఒక్క రూపాయి లంచం తీసుకోలేదు. ‘శంకరాభరణం’ తరువాత వాడి ఉద్యోగం కూడా ఇబ్బందుల్లో పడింది. ప్రభుత్వ అనుమతి తీసుకోకుండా నటించి, పారితోషికం తీసుకున్నాడని గిట్టనివాళ్ళు పిటిషన్లు పెట్టారు. ముఖ్యమంత్రి చెన్నారెడ్డి ‘శంకరాభరణం’ సినిమా తెప్పించుకొని, చూసి, ‘మన రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌కు ఇంత గౌరవం తెచ్చినవాణ్ణి మనం గౌరవించుకోవాలి’ అన్నారు. ఆ వెంటనే మన తెలుగునాట తొలిసారిగా కల్చరల్ ఎఫైర్స్ అనే శాఖను సృష్టించి, దానికి డెరైక్టర్‌గా సోమయాజులును నియమించారు. అలాగే, ‘కళాకారుడైన ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా సినిమాల్లో నటించి, పారితోషికం అందుకోవచ్చు. దానికి అనుమతి అవసరం లేదు’ అని కూడా ప్రత్యేక ఉత్తర్వు జారీ చేశారు. గమ్మత్తేమిటంటే, అసలు ‘శంకరాభరణం’కి అన్నయ్యకు దక్కిన పారితోషికం కేవలం రూ. 6 వేలు. అదీ సినిమా విడుదలై, అఖండ విజయం సాధించాక ఓ ఏడాది గడచిన తరువాత! ‘శంకరాభరణం’ తరువాత ‘త్యాగయ్య’, ‘సప్తపది’, ‘వంశవృక్షం’ - ఇలా అనేక సినిమాల్లో అన్నయ్య నటించినా, శంకరశాస్త్రి లాంటి చిరస్మరణీయ పాత్ర మరొకటి కనపడలేదు. ఆ పాత్ర ఒక స్టార్‌ను సృష్టించింది. కానీ, అదే పాత్రతో వచ్చిపడ్డ ఇమేజ్ ఒక మంచి నటుణ్ణి మింగేసింది.

- సంభాషణ: రెంటాల జయదేవ

(Published in 'Sakshi' daily, 30 July 2013, Wednesday)
.................................

Wednesday, July 30, 2014

" ’ జ్ఞానపీఠ్’ నాకు వస్తుందని నేను కూడా అనుకోలేదు" - సి. నారాయణరెడ్డి (ప్రత్యేక భటి)


తెలుగులో విశ్వనాథ, మీరు (‘విశ్వంభర’-1988), రావూరి భరద్వాజ - మీ ముగ్గురికే ప్రతిష్ఠాత్మక ‘జ్ఞానపీఠ్’ దక్కింది. ఇతర భాషలతో పోలిస్తే తరచూ ఈ గౌరవం మనకు రావడం లేదేం?     
 అసలు నాకు వస్తుందని నేను కూడా అనుకోలేదు. అయితే, ‘విశ్వంభర’కు వచ్చింది. రావాల్సిన దానికి వచ్చింది. అది నాకు తృప్తినిచ్చింది. జ్ఞానపీఠం వచ్చిన ‘విశ్వంభర’, దాని భూమిక, ‘మట్టీ - మనిషి - ఆకాశం’ కావ్యం గురించి చెప్పాలంటే అదో పెద్ద కథ.
   
మీ రోజుల్లో తెలంగాణ కవులు, రచయితలు, సినీ జీవుల మీద సాహిత్య, సినీ రంగాల్లో  వివక్ష ఉండేదా? సాహిత్య, సినీరంగాల్లో అది కనిపించేదా? మీకెప్పుడైనా అనుభవమైందా?

 లేదు. ఎప్పుడూ వివక్ష లేదు, ఏమీ లేదు. అలాంటి అనుభవాలు నాకెప్పుడూ ఎదురు కాలేదు. అసలు అలాంటి ధోరణి ఉంటే నన్నెలా ఆదరించేవారు! నేనెలా ఇంత పైకొచ్చేవాణ్ణి!!
- రెంటాల జయదేవ

(Published in 'sakshi'  daily, 27th July 2014, Sunday)
...............................................