జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Thursday, July 21, 2016

గెలుపు కోసం... ఎన్నెన్నో మలుపులు


కొత్త సినిమా గురూ!
చిత్రం: ‘మలుపు’
తారాగణం: ఆది పినిశెట్టి, నిక్కీ గల్రానీ,మిథున్ చక్రవర్తి
కెమేరా: షణ్ముఖ సుందరం
సంగీతం: ప్రసన్ - ప్రవీణ్ - శ్యామ్
నిర్మాత: రవిరాజా పినిశెట్టి
రచన - దర్శకత్వం: సత్యప్రభాస్ పినిశెట్టి
 ....................................

కళ జీవితాన్ని అనుకరిస్తుందంటారు! నిజజీవిత కథలు వెండితెర కళగా తెర మీదకు రావడం ఎప్పుడూ ఉన్నదే. కాకపోతే, కొన్ని చిత్రమైన యథార్థ సంఘటనలు సినిమాటిక్‌గా తెరపై పలకరించినప్పుడు, అది నిజజీవిత ఘటనే అని తెలిసినప్పుడు ఒళ్ళు గగుర్పొడుస్తుంది. తాజా ‘మలుపు’ చిత్రం కూడా అలాంటిదే! నిజానికిది చెన్నైలో నలుగురు ఫ్రెండ్‌‌స మధ్య జరిగిన కథ. సినిమా కోసం తెలుగులో ఇది విశాఖపట్నంలో జరిగిందన్నట్లు చూపెట్టారు.
 
కథ ప్రకారం హాయిగా, మరో ముగ్గురు స్నేహితులతో కలసి జీవితాన్ని గడిపేసే కుర్రాడు ‘సగా’గా అందరూ పిలుచుకొనే సతీష్ గణపతి (ఆది పిని శెట్టి). అతని ఫ్రెండ్‌‌సలో ఒకడు పోలీస్ కమిషనర్ కొడుకు, మరొకడు పార్ల మెంట్ సభ్యుడి కొడుకు. ఈ ఫ్రెండ్‌‌స అంతా జీవితంలో మరికొన్నాళ్ళు కలిసి స్టూడెంట్స్ లైఫ్ ఎంజాయ్ చేయడం కోసం డిగ్రీ ఫైనలియర్ ఎగ్జావ్‌ు్స రాయ కుండా ఎగ్గొడతారు. హీరోకు అమ్మ (ప్రగతి), నాన్న, అక్క ఉంటారు. లాస్య (నిక్కీ గల్రానీ) అనే మోడరన్ ఏజ్ ఫాస్ట్ గర్‌‌లను హీరో ప్రేమిస్తాడు. ఆమెను రక్షించే క్రమంలో ఒక గొడవలోనూ ఇరుక్కుంటాడు. ఇంతలో అక్క పెళ్ళి పనులు హీరోకు అప్పగించి, అమ్మానాన్న ఊరెళతారు.
 
తీరా, వాళ్ళటెళ్ళగానే ఆ డిసెంబర్ 31వ తేదీ రాత్రి అనూహ్యమైన ఒక సంఘటన ఎదురవుతుంది. దిగ్భ్రాంతికి గురిచేస్తుంది. అక్కడ నుంచి అతని జీవితమే తలకిందులైపోతుంది. దాంతో ముంబయ్‌లోని నేర సామ్రాజ్యనేత ముదలియార్‌ను వెతుక్కుంటూ అతను బయలుదేరతాడు. ఇంతకీ, ఆ డిసెం బర్ 31 రాత్రి ఏం జరిగిందన్నది ఇంట్రెస్టింగ్ అంశం. దాని చుట్టూ ఈ కథ నడుస్తుంది. ఆ రోజేం జరిగింది? దానికీ, ముంబయ్ డాన్‌కీ లింకేంటి? జీవితంలో కుటుంబమా, స్నేహమా... ఏది ముఖ్యం? ఏదో ఒకటే ఎంచుకో వాల్సిన పరిస్థితి వస్తే ఏమవుతుంది? లాంటి ప్రశ్నలకు జవాబు మిగతా సినిమా. సస్పెన్‌‌స డ్రామాను నమ్ముకొన్న ఈ కథలో అవన్నీ తెరపై చూడాలి.  
 ‘పెదరాయుడు’, ‘చంటి’ లాంటి పలు సూపర్‌హిట్ చిత్రాలను రూపొందించిన దర్శకుడు రవిరాజా పినిశెట్టి నిర్మాత అవతారమెత్తి, తెలుగు, తమిళాల్లో నిర్మించిన సినిమా ఇది.

ఆయన పెద్ద కొడుకు సత్యప్రభాసే దీనికి దర్శకుడు కూడా! తేజ దర్శకత్వంలో ‘ఒక ‘వి’చిత్రమ్’ ద్వారా తెలుగులో పరిచయమైన హీరో ఆది పినిశెట్టి. ఆ తరువాత తెలుగులో కనిపించింది తక్కువన్న (‘గుండెల్లో గోదారి’) మాటే కానీ, తమిళంలో పేరున్న హీరో. ‘మృగమ్’, ‘ఈరమ్’ లాంటి తమిళ చిత్రాల ద్వారా తనకంటూ పేరు తెచ్చుకున్నారు. అల్లు అర్జున్ హీరోగా ఈ సమ్మర్‌కి రానున్న ‘సరైనోడు’లో విలన్‌గా కనిపించనున్న ఆదికి ఇది ఓ కీలకమైన పాత్ర. తెలుగు వాచికం స్పష్టంగా ఉన్న ఈ చెన్నై కుర్రాడి నటన, డ్యాన్సులు, ఫైట్లు మాస్ మెచ్చేవే.
 
నిక్కీ గల్రానీ పాత్రోచితంగా బాగున్నారు. హిందీ హిట్ ‘ఓ మై గాడ్’కు రీమేక్‌గా ఆ మధ్య తెలుగులో వచ్చిన ‘గోపాల... గోపాల’లో కనిపించిన ప్రసిద్ధ హిందీ నటుడు మిథున్ చక్రవర్తి ఓ కీలకపాత్రధారి. నిజానికి, ఆయన అంగీకరించిన తొలి దక్షిణ భారతీయ భాషా చిత్రం ఇదే. కాకపోతే, దీని తమిళ వెర్షన్ కన్నా ముందే తెలుగులో ‘గోపాల... గోపాల’ రిలీజైపోయింది. ముంబయ్‌లో సమాంతర ప్రభుత్వం నడిపే నేరసామ్రాజ్య నేత ముదలి యార్‌గా ఆయన బాగా చేశారు. చూడడానికి కూడా విభిన్నంగా ఉన్నారు. నాజర్, పశుపతి లాంటి సీజన్‌‌డ ఆర్టిస్ట్‌ల కంట్రోల్డ్ యాక్షన్ కూడా బాగుంది.
 
రచన, దర్శకత్వ విభాగాల్లో సత్యప్రభాస్ కొత్త తరానికి నచ్చే ట్విస్ట్‌లు, సస్పెన్‌‌సను నమ్ముకున్నారు. వర్తమానానికీ, గడచిపోయిన సంఘటనల ఫ్లాష్ బ్యాక్‌లకూ మధ్య తరచూ అటూ ఇటూ తిరిగే కథాకథన శైలిని బలంగా ఉప యోగించుకున్నారు. ఆసక్తికరంగా ఆరంభమయ్యే ఈ సినిమా కాసేపయ్యాక ఎక్కువగా ప్రేమకథ వైపు మొగ్గుతుంది. ఆ క్రమంలో వేగం తగ్గడం అర్థం చేసుకోవాలి. ఇంటర్వెల్‌కు కాస్తంత ముందు నుంచి కథలో వేగం, అదే ఊపులో ట్విస్టులు పెరుగుతాయి. సినిమా చివరకు వచ్చేసరికి కథ ఎన్నెన్నో ములుపులు తిరుగుతుంది. కొండొకచో అవి పరిమితి మించాయనిపించినా ఉత్కంఠ ఆశించే ప్రేక్షకులు ఫిర్యాదులు చేయరు.

నిజానికి, ఎనిమిది నెలల క్రితమే ఈ సినిమా తమిళంలో విడుదలైంది. అక్కడి టైటిల్ - ‘యాగవ రాయినుమ్ నా కాక్క’. ఇప్పుడు తెలుగులోకి వచ్చింది. చిత్ర నిర్మాత, దర్శ కుడు, హీరో - అందరూ తెలుగు వాళ్ళు కావడంతో ఆలస్యంగానైనా ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల ముందుకు రావడం ఆనందించదగ్గ విషయం. ఇలాంటి సినిమాలు తమిళ ప్రేక్షకులకు కొత్త కాకపోయినా, తెలుగు వారికి కొత్తగా అనిపించడం, ఇటీవలి రొటీన్ సినిమాలకు భిన్నంగా ఉండడం బాక్సాఫీస్ వద్ద గెలుపు విషయంలో ‘మలుపు’కు కలిసొచ్చే అంశాలు.

- రెంటాల జయదేవ

(Published in 'Sakshi' daily, 2016 Feb 20th)
......................................

0 వ్యాఖ్యలు: