జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Thursday, July 21, 2016

ఆలోచింపజేసే ‘బ్రాహ్మణ’ చర్చ



కన్నడ హీరో ఉపేంద్రకు తెలుగునాట ఓ ప్రత్యేక క్రేజు, ఉంది. ‘దండు పాళ్యం’ ద్వారా అందరి దృష్టినీ ఆకర్షించిన దర్శకుడు శ్రీని వాస్‌రాజు కాంబినేషన్‌లో ఈ ‘ఉప్పి దాదా’ తాజా సినిమా ‘బ్రాహ్మణ’. ఏణ్ణర్ధం క్రితం కన్నడంలో వచ్చిన ‘శివమ్’కు ఇది అనువాదం.

కన్నడనాట వివాదం: నిజానికి, కన్నడంలో ఈ సినిమాకు మొదట అనుకున్న పేరు - ‘హరహర మహా దేవ’. ఆ తరువాత పెట్టినపేరు - ‘బసవణ్ణ’. కానీ, ఆ టైటిల్ తమ ధార్మిక విశ్వాసాలకు భంగం కలిగిస్తోందంటూ కర్ణాటకలోని లింగాయత్‌లు ఆందోళన చేశారు. అసెంబ్లీలో చర్చ వచ్చి, టైటిల్ మార్చాలంటూ ముఖ్యమంత్రి అభ్యర్థిం చారు. ఈ ఒత్తిడికి తలొగ్గి, దర్శకుడు ‘బ్రాహ్మణ’ అని పేరు పెట్టారు. కానీ, ఫిల్మ్ చాంబర్ దానికీ ఒప్పుకోలేదు. ఎట్టకేలకు ‘శివమ్’గా రిలీజ్ చేశారు.

కథ ఏమిటంటే...
ఏడో శతాబ్దం నుంచి ఇప్పటి దాకా భారత్‌పైన ముష్క రుల దాడులు అందరికీ తెలిసినవే. చిన్నదైన సినిమా పరిధి చాలని ఈ పెద్ద అంశాన్ని అంతర్లీన నేపథ్యంగా తీసుకొని, మాఫియా కథాంశాన్ని కలిపి, ఈ కథ అల్లుకున్నారు. ఒక పురాతన శివాలయం. దండయాత్రీకుల బారి నుంచి ఆ గుడిని కాపాడిన పూర్వీకుల నుంచి అర్చకత్వం హీరో తండ్రికి వస్తుంది. తండ్రి మరణంతో హీరో అనివార్యంగా అర్చకుడౌతాడు. మంత్రి ముఠా ఇచ్చిన సుపారీతో హీరోను చంపడానికి మాఫియా ముఠా వస్తుంది. హీరో అసలెవరన్నది ఫ్లాష్‌బ్యాక్. ఏమైందన్నది మిగతా కథ. సెన్సార్ కత్తెర పోటు!

విదేశాల్లో చిత్రీకరణలతో నిర్మాణ విలువలున్న ఈ సినిమాలో కథ, కథనమే అటూ ఇటూ అనిపిస్తాయి. గోమాంస భక్షణ, బీఫ్ ఫెస్టివల్, ఆలయాల్ని ధ్వంసం చేసి వాటిపై వెలసిన పరమత మందిరాల లాంటి వివాదాల్ని సినిమాలో ప్రస్తావించారు. కన్నడంలో సెన్సార్ ఒత్తిడి వల్ల 25 కట్స్‌తో చాలా సినిమానే కోతకు గురైంది. అవి చాలదన్నట్లు, మళ్ళీ తెలుగులో డబ్బింగ్ అవుతున్నప్పుడు మరికొన్ని కట్స్ పడ్డాయి. బసవన్న, అలెక్స్, అర్చకుడు - ఇలా విభిన్న కోణాలున్న పాత్రతో బరువు అంతా ఉపేంద్రపైనే. భారత్‌పై దాడికి తెగబడే మాఫియా నేత అమానుల్లా ఖాన్‌గా రవిశంకర్ (సాయికుమార్ సోదరుడు) చేశారు. ఫైట్స్, గాలిలోకి ఎగిరి హీరో చేసే విన్యాసాలు, డైలాగులు, హీరోయిన్ రాగిణి ఐటంసాంగ్, ఫస్టాఫ్‌లో కామెడీకని వచ్చే లవ్ ట్రాక్ లాంటివన్నీ మాస్‌కు నచ్చుతాయని నమ్మాలి. దర్శక, హీరోల ఇమేజ్ అందుకు శ్రీరామరక్ష కావాలి!

- రెంటాల జయదేవ

(Published in 'Sakshi' daily, 2016 July 9th, Saturday)
...............................

0 వ్యాఖ్యలు: