చిత్రం- నీ జతగా.. నేనుండాలి, తారాగణం - సచిన్ జోషీ, నజియా (తొలి పరిచయం), రావు రమేశ్, శశాంక్, కథ, స్క్రీన్‌ప్లే - షగుఫ్తా రఫీఖ్, మాటలు - మధుసూదన్, సంగీతం - జీత్ గంగూలీ, మిథున్, అంకిత్ - అంకుర్, పాటలు - చంద్రబోస్, కొరియోగ్రఫీ - సీజర్, విద్యాసాగర్, కళ - ఎం. కిరణ్‌కుమార్, ఎడిటింగ్ - ఎం.ఆర్. వర్మ, సినిమాటోగ్రఫీ - ఎ. వసంత్, నిర్మాత - బండ్ల గణేశ్, దర్శకత్వం - జయ రవీంద్ర
...................................
ఒక సినిమా విజయవంతమైతే, ఆ మూల కథను మరో భాషలో వెండి తెర మీదకు తేవడం మామూలే! అయితే, అన్ని కథలూ అలా రీమేక్‌లకు ఒదగవు. కొన్ని కథలను మాతృకలో చూసిన తరువాత మళ్ళీ మరో భాషలో తీయడం, తీసినా చూసి ఆనందించడం, మాతృక స్థాయిలో ఆస్వాదించడం కష్టం. ఎందుకంటే, తెర మీద ఒకసారి జరిగిన ఇంద్రజాలాన్ని మరోసారి అదే స్థాయిలో, అంతే మోతాదులో పునఃసృష్టించడం చివరకు ఆ తొలి సృష్టికర్తకైనా అత్యంత కష్టం. యువతరం ప్రేక్షకులనూ, ప్రేమికులనూ ఏడాది క్రితం ఉర్రూతలూపిన హిందీ చిత్రం ‘ఆషికీ -2’ ఇప్పుడు ‘నీ జతగా నేనుండాలి..’ అంటూ తెలుగులోకి వస్తున్నప్పుడు ఆ కష్టాన్నే దర్శక - నిర్మాతలు ఎదుర్కొన్నారు.
కథ ఏమిటంటే...
రాఘవ్ జయరామ్ అలియాస్ ఆర్.జె (సచిన్ జోషీ) ఓ ప్రముఖ పాప్ గాయకుడు, గీతరచయిత. ఒకప్పుడు ఎన్నో అవార్డులందుకొని, అభిమానుల్ని సంపాదించిన ఈ యువ సంగీత సంచలనం డ్రగ్స్, మద్యం మత్తులో పడి కెరీర్‌లో కిందకు జారిపోతాడు. అలాంటి సందర్భంలో అనుకోకుండా మట్టిలో మాణిక్యంలా ప్రతిభావంతురాలైన ఒక గాయని గాయత్రీ నందన (నజియా హుస్సేన్) ఎదురవుతుంది. ఆమెను తీర్చిదిద్ది, భవిష్యత్ సంగీత సంచలనంగా తీర్చిదిద్దాలని అనుకుంటాడు. ఆ క్రమంలో విజయం కూడా సాధిస్తాడు. వారిద్దరూ ప్రేమలో పడతారు. కలసి జీవనం కూడా సాగిస్తుంటారు. కెరీర్‌లో పైపైకి వచ్చిన తార ఒకరు, నిరుటి వెలుగులు పోయి కాంతి విహీనమైన గాయకుడు మరొకరు - వీరిద్దరి మధ్య జీవితం ఏ మలుపులు తిరిగి, ఎటు వెళ్ళిందన్నది మిగతా కథ.
ఎలా నటించారంటే...
సినిమా ముగిసిపోవడానికి ముందొచ్చే చివరి సీన్ మినహా మిగతాదంతా హిందీ ‘ఆషికీ-2’కు ఇది జిరాక్స్. ఈ కథకు కీలకం కథానాయక పాత్ర. కొన్నేళ్ళ క్రితమే ప్రేమ కథా చిత్రాల ద్వారా సుపరిచితుడైన సచిన్ జోషీ ఆ పాత్ర పోషిస్తూ, ఈసారి కూడా తన తొలి చిత్రపు స్థాయిలోనే కనిపించారు. మనసుకు నచ్చిన కథను ఎంతో వ్యయప్రయాసలతో తెలుగులోకి తెచ్చేందుకు శ్రమించిన ఆయన తన నటన, రూపురేఖలపై కూడా అందులో కొంత శ్రమ పెట్టాల్సింది. కథానాయికగా తెలుగు తెరకు తొలి పరిచయమైన నజియా హుస్సేన్ ఒకటి రెండు సన్నివేశాల్లో తప్ప, మిగిలినచోట్ల మెప్పించలేకపోయారు. ప్రేక్షకులు పదే పదే ‘ఆషికీ-2’ హీరో హీరోయిన్లు ఆదిత్యారాయ్ కపూర్, శ్రద్ధాకపూర్‌లతో పోల్చిచూడడం తెలియని మరో ఇబ్బంది. మ్యూజిక్ కంపెనీలో కీలక బాధ్యుడు శ్రవణ్‌గా రావు రమేశ్, హీరో మేనేజర్ విక్రమ్‌గా శశాంక్ తదితరులు పాత్రల పరిధి మేరకు నటించారు.
ఎలా ఉందంటే...
‘సక్సెస్‌ను అంత ఈజీగా తీసుకోకు. ఒక్కసారి వదిలేస్తే, మళ్ళీ అది మన దగ్గరకు రాదు’ (హీరోయిన్‌తో హీరో), ‘కోపం నాలుగు రోజులే ఉంటుంది. కానీ, కోపంలో తీసుకున్న డెసిషన్ జీవితాంతం బాధపెడుతుంది’ (హీరోయిన్‌తో శశాంక్) - ఇలా సినిమాలో కొన్నిచోట్ల వచ్చే డైలాగులు హిందీ మాతృకలో లాగానే ఒక్క క్షణం ఆగి, ఆలోచింపజేస్తాయి. ఈ సినిమాకు ప్రధానబలం కూడా హిందీలో జనం నోట నానిన బాణీలే. చంద్రబోస్ మాటలు కూర్చిన పాటల్లో ‘ప్రాణమా...నా ప్రాణమా’ అంటూ సాగే ‘నువ్వే నాతో లేకుంటే ఇక నేనే నాతో లేను కదా... నాకే నువ్వు తోడుంటే నా ప్రాణంతో పనిలేదు కదా...’ అన్న రచన విరహ ప్రేమికుల విషాద గీతికగా కొన్నాళ్ళ పాటు వెంటాడుతుంది. ‘ఆనందం ఉరకలు వేస్తే గానం.. ఆవేదన మనసును మూస్తే మౌనం’ పాట శ్రేయా ఘోషల్ గొంతులో మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది.
ఓ నవతరం బాలీవుడ్ గాయకుడి జీవితానికీ, నిజజీవిత ఘటనలకూ పోలికలున్న కథ ఇది. అయితే, కథానేపథ్యం, స్టేజ్ షోలు, ఆల్బమ్‌లతో కథ జరిగే వాతావరణం రీత్యా ప్రధానంగా ఇది నగర ప్రేక్షకులను ఉద్దేశించినది. ఓ పిరికివాడి ప్రేమకథగా ఈ చిత్రంలో హీరో పాత్ర తెగ తాగుడుతో ఈ రెండుంబావు గంటల సినిమాలో ప్రతి రీలూ మందు వాసన కొడుతుంది. ఇక, లైటింగ్ వగైరా గమనించినా, కొన్ని చోట్ల మరీ మక్కికి మక్కిగా అనిపించిన డైలాగులు - సన్నివేశాలు చూసినా, తెరపై నటనలోని లోపాలను వీలైనంతగా మరిపించేందుకు డబ్బింగ్ ఆర్టిస్టులు పడ్డ అతి కష్టాన్ని గుర్తించినా... పొరపాటున హిందీ సినిమా తెలుగులో చూస్తున్నామా అనుకుంటాం. ఒకరకంగా అదే చేసి ఉన్నా, బాగుండేదేమో అని కూడా అత్యాశకు పోతాం. లోకేషన్ల ఎంపిక, ప్రతి ఫ్రేమ్‌నూ రిచ్‌గా చూపడం బాగుంది కానీ, ఆఖరుకది అలంకరణ ఎక్కువున్న బొమ్మ స్థాయికే సినిమాను పరిమితం చేసింది. పాత్రలు, వాటి మానసిక సంఘర్షణను బలంగా చిత్రించి, ప్రాణం పోయాలన్నది దర్శకుడు (‘బంపర్ ఆఫర్’, ‘దిల్లున్నోడు’ చిత్రాల ఫేమ్ జయ రవీంద్ర), పాత్రధారులు మర్చిపోవడంతో, అసలైన జీవకళ లోపించింది.
అలాగే, సినిమా మొదట్లోనే హీరో మేనేజర్ పాత్ర గోవాను చిన్న ఊరుగా ప్రస్తావించడం, హీరోయిన్ తల్లి ప్రతి వారం లాటరీ టికెట్లు కొంటుందనడం (తెలుగునాట లాటరీలు పోయి చాలా ఏళ్ళయింది) లాంటి లోపాలూ ఉన్నాయి. హీరో పాత్రకున్న బాధ, సమస్య ఏమిటో, మత్తులోనే ఎందుకు మునిగి తేలుతున్నాడో కాస్తంత డైలాగుల రూపంలోనైనా చెప్పిస్తే సగటు ప్రేక్షకులకు బాగుండేది. కథానాయక పాత్రలోని ఆ లోపం వల్ల కథతో, పాత్రలతో సహప్రయాణం కొంత ఇబ్బంది అనిపిస్తుంది. తమకు సంబంధం లేని అంశాలేవో తెర మీద జరుగుతున్న భావన కలుగుతుంది. మాతృకలోని పాత్రలు, సన్నివేశాల మధ్య తీవ్రత ఆ స్థాయిలో తెలుగు తెరపైకి తర్జుమా కాలేదని అర్థమవుతుంది. వెరసి, మునుపే హిందీ మాతృకను చూసేసినవారు, చూడనివారు కూడా ఈ తెలుగు వెర్షన్ చూడగానే, ‘ఆషికీ-2’ చూడాలనుకుంటారు. ఒక రీమేక్ సినిమా (కథ)కు ఇంతకు మించి గీటురాయి వేరే ఏముంటుంది?
- రెంటాల జయదేవ
........................................
బలాలు
1. హిందీలో జనం నోట నానిన బాణీలు 2. చంద్రబోస్ పాటల్లో రెండు, మూడు 3. వెంటాడే విలక్షణ హిందీ గాయనీ గాయకుల గళాలు 4. ప్రతి ఫ్రేమ్‌లో రిచ్‌నెస్‌ను చూపిన బాలీవుడ్ తరహా ఛాయాగ్రహణం
.........................................
బలహీనతలు
1. హీరో, హీరోయిన్లు 2. పాత్రధారుల నుంచి సమతూకంలో నటనను రాబట్టలేని దర్శకత్వం 3. డబ్బింగ్ సినిమా చూస్తున్నామేమో అనిపిస్తూ, హిందీ మాతృకకు జిరాక్స్‌లా చిత్రీకరణ కనిపించడం 4. మాతృకలోని కథ, పాత్రధారుల మధ్య తీవ్రత ఇక్కడకు తర్జుమా కాకపోవడం.
........................................................
(Published in 'Sakshi' daily, 23rd Aug 2014, Saturday)
................................................................
0 వ్యాఖ్యలు:
Post a Comment