దెయ్యాలు కేవలం భయపెట్టడమే కాదు... వినోదం కూడా పంచుతాయి. అందుకు ఇటీవల వస్తున్న హార్రర్ - కామెడీ చిత్రాలే ఉదాహరణ. ఆ మధ్య వచ్చిన డబ్బింగ్ చిత్రం ‘కాంచన’, నేరు తెలుగు చిత్రం ‘ప్రేమకథా చిత్రమ్’ తరువాత మళ్ళీ ఇప్పుడు ‘గీతాంజలి’ పాత్రలకు కలిగే భయం ఆధారంగా వచ్చే ఉత్కంఠనూ, వినోదాన్ని ఆశ్రయించి, అల్లుకున్న కథ.
....................................
చిత్రం - గీతాంజలి, తారాగణం - అంజలి, శ్రీనివాసరెడ్డి, రావు రమేశ్, ‘సత్యం’ రాజేశ్, ‘షకలక’ శంకర్, హర్షవర్ధన్ రాణే, సంగీతం - ప్రవీణ్ లక్కరాజు, కెమేరా - సాయి శ్రీరామ్, కథా విస్తరణ -స్క్రీన్‌ప్లే - మాటలు - కోన వెంకట్, నిర్మాత - ఎం.వి.వి. సత్యనారాయణ, కథ - దర్శకత్వం - రాజకిరణ్
...................................
కథ ఏమిటంటే...
సినిమా దర్శకుడు కావాలని నందిగామ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన యువకుడు శ్రీనివాస్ (శ్రీనివాసరెడ్డి). ఓ ఫ్లాట్‌లో అనుమానాస్పదంగా మరణించిన ఓ అమ్మాయి తాలూకు దెయ్యం తిరుగుతుంటుందంటూ సినిమా తీయాలనుకున్న ఓ వ్యాపారవేత్త (రావు రమేశ్)కు ఓ హార్రర్ స్క్రిప్టు వినిపిస్తుంటాడు.చిత్రం ఏమిటంటే, ఆ స్క్రిప్టు నిజజీవిత కథ. ఇంతకీ ఆ ఇల్లేమిటి? ఆ అమ్మాయెవరు? ఆ ఇంట్లో అసలేం జరుగుతోంది? లాంటి ఎన్నో అంశాలతో సినిమా ఆఖరుదాకా ఆసక్తిగా నడుస్తుంది.
ఎలా ఉందంటే...
రచయిత కోన వెంకట్ నిర్మాణ భాగస్వామి అయిన ఈ చిత్రం ఆసక్తికరమైన ఘట్టంతో మొదలై, పోనూపోనూ ఉత్కంఠ పెంచుతూ ముందుకు సాగుతుంది. ప్రథమార్ధం ముగిసేసరికి, తరువాత ఏం జరుగుతుందనే ఆసక్తి, అప్పటి దాకా చూసినదాని మీద సంతృప్తితో ఉంటారు పేక్షకులు. ఇక, ద్వితీయార్ధం మొదలయ్యాక... ప్రథమార్ధంలో జవాబు తెలియని చిక్కుముడులుగా మిగిలిన ఒక్కో అంశాన్నీ వివరణనిస్తూ, దర్శక, రచయితలు కథను ముందుకు నడిపారు. ఆ క్రమంలో మధ్యకొచ్చేసరికి గమనం కొద్దిగా మందగించినట్లు అనిపించినా, చివరలో మళ్ళీ వేగమందుకొంది.
ఎలా నటించారంటే...
ఈ చిత్రంలో ప్రధాన పాత్రధారిణి అంజలి తెరపై ఒక్కోసారి ఒక్కోరకంగా ఉన్నా చూడడానికి అందంగానే ఉన్నారు. కథ ఆ పాత్ర చుట్టూ తిరిగినప్పటికీ, సన్నివేశాల్లో ఆమె అభినయ అవకాశం ఉన్నవి కొద్దే. ఆమె చేసిందీ అంతే. ఇంతకాలం కమెడియన్‌గానే తెలిసిన శ్రీనివాసరెడ్డిలోని మరో కోణాన్ని ఈ చిత్రం చూపెట్టింది. కొన్నిచోట్ల నటుడు రాజేంద్రప్రసాద్ ఛాయలు తొంగిచూసినా, మొత్తం మీద ఆయనలో ఉన్న ప్రతిభకూ, తద్వారా కెరీర్‌కూ ఇది చిరస్మరణీయమైనదవుతుంది. ఇటీవల బాగా గుర్తింపు వచ్చిన సప్తగిరితో పాటు ఈ సినిమా ‘షకలక’ శంకర్, ‘సత్యం’ ఫేమ్ రాజేశ్‌లకు మరిన్ని అవకాశాలు తెస్తుంది. నటనలో స్పాంటేనిటీ, మాటలో మాండలికం జోరు కొనసాగిస్తే, శంకర్ క్రమంగా తెరపై స్థిరపడినట్లే! చాలాకాలం తర్వాత దక్కిన భిన్నమైన పాత్రను రావు రమేశ్ సమర్థంగా పోషించారు. సినిమా మొదట్లో అలీ, మధ్యలో ‘వెన్నెల’ కిశోర్ మెరిస్తే, కేక్ మీద ఐసింగ్ లాంటిది - సెకండాఫ్‌లో బ్రహ్మానందం పోషించిన సైకియాట్రిస్ట్ సైతాన్‌రాజ్ పాత్ర.
సమష్టి సాంకేతిక కృషి
అన్ని సాంకేతిక విభాగాల పనితనం కూడా ఈ సినిమాకు బాగా కలిసొచ్చింది. సాయి శ్రీరామ్ ఛాయాగ్రహణం కథలోని ఉత్కంఠనూ, పాత్రల భయాన్నీ భిన్నమైన కోణాల్లో తెరపై చూపెట్టింది. ఇలాంటి కథలకు కీలకమైన సౌండ్ ఎఫెక్ట్‌లు, రీ-రికార్డింగ్ ఆ బాధ్యతను నెరవేర్చాయి. ప్రవీణ్ లక్కరాజు సంగీతం, ఆయన బాణీలో ‘కాఫీ పాట’ వినడానికే కాదు, చూడడానికీ బాగుంది. ద్వితీయార్ధంలో అంజలి, హర్షవర్ధన్ రాణేలపై వచ్చే ‘నా మనసును తాకే వేకువ జాబిలివో..’ మళ్ళీ మళ్ళీ వినాలనిపించే మెలొడీ. కోన వెంకట్ డైలాగులు, వాటిలోని విసుర్లు హాలులో పేలతాయి.
స్కిప్టులో చిన్న చిన్న లోపాలు లేకపోలేదు. వాటి గురించి మాట్లాడుకోవాలంటే, దెయ్యం (?) రోజూ ఆ టైమ్‌కే వచ్చి, చటుక్కున ఎలా మాయమవుతుందో తెలియదు. ఇక, సప్తగిరి ఎపిసోడ్ ఏదో ఒక రీజనింగ్ ఇవ్వడం కోసమే పెట్టినట్లు అనుకోవాలి. అలాగే, అనుమానాస్పద మరణం విషయంలో వాచ్‌మన్ కూడా ఎందుకు నోరు విప్పనట్లు? చివరలో జైలు నుంచి విడుదల కూడా సినిమాటిక్ కన్వీనియన్సే తప్ప, లాజికల్‌గా అదెలా సాధ్యమైందని అడగలేం. అయితే, అప్పటికే రెండు గంటలకు పైగా వినోదంలో మునిగి, విసుగనిపించకుండా తెరపై కథతో, పాత్రలతో ప్రయాణం చేసిన ప్రేక్షకుడు ఈ లోటుపాట్లేవీ పట్టించుకొనే స్థితిలో ఉండడు. పాత్రలనే తప్ప, తనను భయపెట్టకపోయినప్పటికీ, నవ్వించే ఈ హార్రర్ కామెడీ అనుభవం చాలా కాలానికి దక్కిన వెండితెర విందుగా పరిగణిస్తాడు. ఇటీవల వచ్చిన చిత్రాలన్నిటితో పోలిస్తే, వినోదంలోనూ, వసూళ్ళలోనూ ‘గీతాంజలి’కి అది పెద్ద బలం. వెరసి, ఈ ఏడాది తెలుగు సినీ పరిశ్రమకు దక్కిన మరో విజయఫలం.
- రెంటాల జయదేవ
.....................................................................
బలాలు - 1. స్క్రీన్‌ప్లే, డైలాగులు 2. ఆద్యంతం ఉన్న వినోదం 3. సాంకేతిక విభాగాల పనితీరు 4. చిన్న పాత్రల మొదలు పెద్ద పాత్రల దాకా అన్నీ నటుల ప్రతిభతో పండడం
బలహీనతలు - 1. ద్వితీయార్ధంలో, ముఖ్యంగా క్లైమాక్స్‌లో లాజిక్ మిస్సవడం 2. పేరుకు హార్రర్ కథాంశమైనా, పాత్రలనే తప్ప ప్రేక్షకుల్ని భయపెట్టకపోవడం
...........................................
(Published in 'Sakshi' daily, 10th Aug 2014, Sunday)
.......................................................
నిష్పాక్షికత- అనేది ఎంతవరకు సాధ్యమో!
2 days ago
0 వ్యాఖ్యలు:
Post a Comment