జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Wednesday, August 27, 2014

దీపావళికి 180 కోట్ల శంకర్ ‘మనోహరుడు’

 దక్షిణ భారతీయ సినీ చరిత్రలో ఓ సంచలనానికి ఈ దీపావళి తెర తీయనుంది. తొలిసారిగా ఓ దక్షిణ భారతీయ భాషా సినిమా చైనాలో విడుదల కానుంది. సాంకేతికంగా, కథాపరంగా ప్రేక్షకులను సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తే చిత్రాలను రూపొందించే దర్శకుడు శంకర్, విక్రమ్ హీరోగా రూపొందిస్తున్న తాజా తమిళ చిత్రం ‘ఐ’ (తెలుగులో ‘మనోహరుడు’) ఈ దీపావళికి చైనాలో ఏకంగా 15 వేల థియేటర్లలో విడుదల కానుంది. సినిమాలపై, థియేటర్లపై ప్రభుత్వ నియంత్రణ ఉండే చైనాలో విడుదలవుతున్న తొలి దక్షిణ భారతీయ భాషా చిత్రంగా ‘ఐ’ చరిత్రకెక్కనుంది. గతంలో విక్రమ్‌తో ‘అన్నియన్’ (తెలుగులో ‘అపరిచితుడు’), కమలహాసన్‌తో ‘దశావతారం’ చిత్రాలను నిర్మించిన ‘ఆస్కార్ ఫిలిమ్స్’ అధినేత వి. రవిచంద్రన్ ఈ విషయం ఆదివారం నాడు వెల్లడించారు. తెలుగు పత్రికా విలేకరులతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన ఈ చిత్రం గురించి తొలిసారిగా అనేక ఆసక్తికరమైన విషయాలను ఈ విధంగా వెల్లడించారు.

 12 గంటలు మేకప్... రిఫ్రిజిరేటర్‌లో విక్రమ్

 ఇప్పటికి రెండున్నరేళ్ళకు పైగా నిర్మాణంలో ఉన్న ఈ భారీ బడ్జెట్ చిత్రానికి దాదాపు రూ. 180 కోట్లు ఖర్చయింది.  ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. దాదాపు సగానికి పైగా ఏ.ఆర్. రెహమాన్ (సంగీతం), పి.సి. శ్రీరామ్ (ఛాయాగ్రహణం), ఆంటోనీ (ఎడిటింగ్), పీటర్ హెయిన్స్ (ఫైట్స్) లాంటి ప్రతిభావంతులు ఈ ‘ఐ’ చిత్ర రూపకల్పనలో కీలక భూమికలు పోషిస్తున్నారు. మేకప్, విజువల్ ఎఫెక్ట్స్ లాంటి విభాగాలకు విదేశీ నిపుణులు సేవలందిస్తున్నారు. ‘‘ఈ సినిమా కోసం హీరో విక్రమ్ పడిన శ్రమ, చూపిన అంకితభావం మాటల్లో చెప్పలేనిది. ఒక స్పెషల్ గెటప్ కోసం ఆయనకు మేకప్ చేయడానికే దాదాపు 12 గంటలు పట్టేది. అయినా, ఆయన ఓపిగ్గా ఉండేవారు. మేకప్ వేసిన తరువాత పూర్తి ఏ.సి.లోనే ఆయన ఉండాల్సి వచ్చేది. అందు కోసం దాదాపు పది అడుగుల ఎత్తున్న ఒక రిఫ్రిజిరేటర్ లాంటిది నిర్మించాం. ఈ గెటప్ కోసం ప్రత్యేకంగా ఆయన 125 కిలోల స్థాయికి బరువు పెరిగారు. తెరపై ఆ దృశ్యాలను చూస్తున్నప్పుడు ప్రేక్షకులు థ్రిల్‌కు గురి అవుతారు’’ అని రవిచంద్రన్ తెలిపారు.

  మూడెకరాల సెట్... పాటకు 40 రోజులు...

 ఈ సినిమాకు సంబంధించిన ఓ ప్రత్యేక ట్రైలర్‌నూ, ఒక పాటనూ ఆయన విలేకరుల కోసం ప్రత్యేకంగా ముందుగా చూపించారు. హీరో నీళ్ళపై నడిచే ఆశ్చర్యకరమైన దృశ్యాలున్న ఈ సినిమా పాటలు, ఫైట్ల కోసం శంకర్ డబ్బునూ, కాలాన్నీ లెక్కచేయలేదట. ఒక విచిత్రమైన ఘట్టంలో, అపూర్వమైన గెటప్‌తో హీరో వచ్చే ఒక సిట్యుయేషనల్ సాంగ్ కోసం ఏకంగా మూడెకరాల్లో ఒక సెట్ వేసి, 40 రోజుల పాటు చిత్రీకరణ జరిపారు. అలాగే, చైనాలో తీసిన ఒక సైకిల్ ఫైట్‌కు కూడా దాదాపు 40 రోజులు కష్టపడ్డారు. ‘‘ఈ సినిమా మీద నాకున్న నమ్మకం అపారం. ప్రతి ఘట్టం తెరపై చూడగానే ‘అయ్’ అని సంభ్రమాశ్చర్యాలకు గురయ్యేలా ఉంటుంది. అందుకే సినిమాకు ‘ఐ’ అని పేరు పెట్టాం’’ అని ఆయన చెప్పారు. చైనా నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో కథానాయికగా అమీ జాక్సన్ నటిస్తున్నారు.

  భారతీయ ‘జేమ్స్ కామెరూన్’

 ‘‘దీన్ని కేవలం సాంఘిక చిత్రమనో, యాక్షన్ సినిమా అనో, ప్రేమ కథా చిత్రమనో, థ్రిల్లర్ అనో - ఒక గాటన కట్టి చెప్పలేం. రేపు ఈ చిత్రం చూసినప్పుడు నా మాటల్లో నిజం అందరికీ తెలుస్తుంది’’ అని రవిచంద్రన్ పేర్కొన్నారు. ‘‘దాదాపు 285 రోజుల పైగా షూటింగ్ జరుపుకొన్న ఈ సినిమా మునుపటి ‘అపరిచితుడు’ కన్నా వంద రెట్లు గొప్పగా ఉంటుంది. ఎన్నో విశేషాలతో, ప్రాణం పెట్టి తీసిన ఈ సాంకేతిక అద్భుతం చూశాక శంకర్‌ను ‘భారతీయ జేమ్స్ కామెరూన్ (ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు)’ అనాలని అనిపిస్తుంది. ఈ సినిమా ఇలా రావడం ఆ తిరుమల వెంకటేశ్వరుడి కృప. నన్నడిగితే ఈ భారీ చిత్రానికి నేను కాదు... ఆయనే నిర్మాత’’ అని వ్యాఖ్యానించారు.


   హైదరాబాద్‌కు జాకీ చాన్... చెన్నైకి ఆర్నాల్డ్ ష్వార్జ్‌నెగర్!

 ‘‘సంగీత దర్శకుడు ఏ.ఆర్. రెహమాన్ ప్రస్తుతం రీ-రికార్డింగ్ జరుపుతున్నారు. సినిమాలో మొత్తం అయిదు పాటలున్నాయి. సెప్టెంబర్ 15న ఆడియో విడుదల చేస్తున్నాం’’ అని రవిచంద్రన్ తెలిపారు. విశేషం ఏమిటంటే, ఈ చిత్రం తెలుగు ఆడియో రిలీజ్‌కు తన చిరకాల పరిచయస్థుడైన యాక్షన్ హీరో జాకీచాన్‌ను హైదరాబాద్‌కు రప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. చెన్నైలో జరిపే తమిళ ఆడియో రిలీజ్‌కు హాలీవుడ్ స్టార్ ఆర్నాల్డ్ ష్వార్జ్‌నెగర్‌ను ఆహ్వానిస్తున్నారు. ‘‘చెన్నైలో భారీ వేదికపై ఆడియో రిలీజ్ జరపాలని ప్రయత్నిస్తున్నాం. అన్ని వివరాలూ మరో రెండు, మూడు రోజుల్లో ఖరారు కానున్నాయి’’ అని రవిచంద్రన్ ‘సాక్షి’కి చెప్పారు.

  భారీ ఎత్తున విడుదల

 తమిళంలో తయారైన ఈ టెక్నికల్ వండర్‌ను ఇంగ్లీష్, హిందీ, మలయాళాల్లో అను వదించి భారత్‌లో విడుదల చేస్తున్నారు. అలాగే, చైనీస్ డబ్బింగ్ వెర్షన్‌ను చైనా, తైవాన్‌లలోనూ ‘ఐ’ పేరుతోనే దీపావళికి అక్టోబర్ 22న రిలీజ్ చేయనున్నారు. ఒక్క భారత్‌లోనే అన్ని భాషల్లో కలిపి 4 వేల పైచిలుకు హాళ్ళలో విడుదలకు సన్నాహాలు సాగుతున్నాయి. ‘‘తెలుగులో ‘మనోహరుడు’గా వస్తున్న ఈ చిత్ర డబ్బింగ్ దాదాపు పూర్తయింది. శ్రీరామకృష్ణ సంభాషణలు, రామజోగయ్యశాస్త్రి, తదితరులు పాటలు అందిస్తున్నారు’’ అని రవిచంద్రన్ చెప్పారు. మీడియా ముందుకెన్నడూ రాని రవిచంద్రన్ తొలిసారి ఈ చిత్రం గురించి పలు విషయాలు పంచుకోవడం గమనార్హం.


.................................

Tuesday, August 26, 2014

బలమూ, బలహీనత - రెండూ మాతృకే! (సినిమా రివ్యూ - నీ జతగా.. నేనుండాలి)

 ..................................
 చిత్రం- నీ జతగా.. నేనుండాలి, తారాగణం - సచిన్ జోషీ, నజియా (తొలి పరిచయం), రావు రమేశ్, శశాంక్, కథ, స్క్రీన్‌ప్లే - షగుఫ్తా రఫీఖ్, మాటలు - మధుసూదన్, సంగీతం - జీత్ గంగూలీ, మిథున్, అంకిత్ - అంకుర్, పాటలు - చంద్రబోస్, కొరియోగ్రఫీ - సీజర్, విద్యాసాగర్, కళ - ఎం. కిరణ్‌కుమార్, ఎడిటింగ్ - ఎం.ఆర్. వర్మ, సినిమాటోగ్రఫీ - ఎ. వసంత్, నిర్మాత - బండ్ల గణేశ్, దర్శకత్వం - జయ రవీంద్ర
 ...................................

 ఒక సినిమా విజయవంతమైతే, ఆ మూల కథను మరో భాషలో వెండి తెర మీదకు తేవడం మామూలే! అయితే, అన్ని కథలూ అలా రీమేక్‌లకు ఒదగవు. కొన్ని కథలను మాతృకలో చూసిన తరువాత మళ్ళీ మరో భాషలో తీయడం, తీసినా చూసి ఆనందించడం, మాతృక స్థాయిలో ఆస్వాదించడం కష్టం. ఎందుకంటే, తెర మీద ఒకసారి జరిగిన ఇంద్రజాలాన్ని మరోసారి అదే స్థాయిలో, అంతే మోతాదులో పునఃసృష్టించడం చివరకు ఆ తొలి సృష్టికర్తకైనా అత్యంత కష్టం. యువతరం ప్రేక్షకులనూ, ప్రేమికులనూ ఏడాది క్రితం ఉర్రూతలూపిన హిందీ చిత్రం ‘ఆషికీ -2’ ఇప్పుడు ‘నీ జతగా నేనుండాలి..’ అంటూ తెలుగులోకి వస్తున్నప్పుడు ఆ కష్టాన్నే దర్శక - నిర్మాతలు ఎదుర్కొన్నారు.

 కథ ఏమిటంటే... 

 రాఘవ్ జయరామ్ అలియాస్ ఆర్.జె (సచిన్ జోషీ) ఓ ప్రముఖ పాప్ గాయకుడు, గీతరచయిత. ఒకప్పుడు ఎన్నో అవార్డులందుకొని, అభిమానుల్ని సంపాదించిన ఈ యువ సంగీత సంచలనం డ్రగ్స్, మద్యం మత్తులో పడి కెరీర్‌లో కిందకు జారిపోతాడు. అలాంటి సందర్భంలో అనుకోకుండా మట్టిలో మాణిక్యంలా ప్రతిభావంతురాలైన ఒక గాయని గాయత్రీ నందన (నజియా హుస్సేన్) ఎదురవుతుంది. ఆమెను తీర్చిదిద్ది, భవిష్యత్ సంగీత సంచలనంగా తీర్చిదిద్దాలని అనుకుంటాడు. ఆ క్రమంలో విజయం కూడా సాధిస్తాడు. వారిద్దరూ ప్రేమలో పడతారు. కలసి జీవనం కూడా సాగిస్తుంటారు. కెరీర్‌లో పైపైకి వచ్చిన తార ఒకరు, నిరుటి వెలుగులు పోయి కాంతి విహీనమైన గాయకుడు మరొకరు - వీరిద్దరి మధ్య జీవితం ఏ మలుపులు తిరిగి, ఎటు వెళ్ళిందన్నది మిగతా కథ.

 ఎలా నటించారంటే...


  సినిమా ముగిసిపోవడానికి ముందొచ్చే చివరి సీన్ మినహా మిగతాదంతా హిందీ ‘ఆషికీ-2’కు ఇది జిరాక్స్. ఈ కథకు కీలకం కథానాయక పాత్ర. కొన్నేళ్ళ క్రితమే ప్రేమ కథా చిత్రాల ద్వారా సుపరిచితుడైన సచిన్ జోషీ ఆ పాత్ర పోషిస్తూ, ఈసారి కూడా తన తొలి చిత్రపు స్థాయిలోనే కనిపించారు. మనసుకు నచ్చిన కథను ఎంతో వ్యయప్రయాసలతో తెలుగులోకి తెచ్చేందుకు శ్రమించిన ఆయన తన నటన, రూపురేఖలపై కూడా అందులో కొంత శ్రమ పెట్టాల్సింది. కథానాయికగా తెలుగు తెరకు తొలి పరిచయమైన నజియా హుస్సేన్ ఒకటి రెండు సన్నివేశాల్లో తప్ప, మిగిలినచోట్ల మెప్పించలేకపోయారు. ప్రేక్షకులు పదే పదే ‘ఆషికీ-2’ హీరో హీరోయిన్లు ఆదిత్యారాయ్ కపూర్, శ్రద్ధాకపూర్‌లతో పోల్చిచూడడం తెలియని మరో ఇబ్బంది. మ్యూజిక్ కంపెనీలో కీలక బాధ్యుడు శ్రవణ్‌గా రావు రమేశ్, హీరో మేనేజర్ విక్రమ్‌గా శశాంక్ తదితరులు పాత్రల పరిధి మేరకు నటించారు.

 ఎలా ఉందంటే...

  ‘సక్సెస్‌ను అంత ఈజీగా తీసుకోకు. ఒక్కసారి వదిలేస్తే, మళ్ళీ అది మన దగ్గరకు రాదు’ (హీరోయిన్‌తో హీరో), ‘కోపం నాలుగు రోజులే ఉంటుంది. కానీ, కోపంలో తీసుకున్న డెసిషన్ జీవితాంతం బాధపెడుతుంది’ (హీరోయిన్‌తో శశాంక్) - ఇలా సినిమాలో కొన్నిచోట్ల వచ్చే డైలాగులు హిందీ మాతృకలో లాగానే ఒక్క క్షణం ఆగి, ఆలోచింపజేస్తాయి. ఈ సినిమాకు ప్రధానబలం కూడా హిందీలో జనం నోట నానిన బాణీలే. చంద్రబోస్ మాటలు కూర్చిన పాటల్లో ‘ప్రాణమా...నా ప్రాణమా’ అంటూ సాగే ‘నువ్వే నాతో లేకుంటే ఇక నేనే నాతో లేను కదా... నాకే నువ్వు తోడుంటే నా ప్రాణంతో పనిలేదు కదా...’ అన్న రచన విరహ ప్రేమికుల విషాద గీతికగా కొన్నాళ్ళ పాటు వెంటాడుతుంది. ‘ఆనందం ఉరకలు వేస్తే గానం.. ఆవేదన మనసును మూస్తే మౌనం’ పాట శ్రేయా ఘోషల్ గొంతులో మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది.


  ఓ నవతరం బాలీవుడ్ గాయకుడి జీవితానికీ, నిజజీవిత ఘటనలకూ పోలికలున్న కథ ఇది. అయితే, కథానేపథ్యం, స్టేజ్ షోలు, ఆల్బమ్‌లతో కథ జరిగే వాతావరణం రీత్యా ప్రధానంగా ఇది నగర ప్రేక్షకులను ఉద్దేశించినది. ఓ పిరికివాడి ప్రేమకథగా ఈ చిత్రంలో హీరో పాత్ర తెగ తాగుడుతో ఈ రెండుంబావు గంటల సినిమాలో ప్రతి రీలూ మందు వాసన కొడుతుంది. ఇక, లైటింగ్ వగైరా గమనించినా, కొన్ని చోట్ల మరీ మక్కికి మక్కిగా అనిపించిన డైలాగులు - సన్నివేశాలు చూసినా, తెరపై నటనలోని లోపాలను వీలైనంతగా మరిపించేందుకు డబ్బింగ్ ఆర్టిస్టులు పడ్డ అతి కష్టాన్ని గుర్తించినా... పొరపాటున హిందీ సినిమా తెలుగులో చూస్తున్నామా అనుకుంటాం. ఒకరకంగా అదే చేసి ఉన్నా, బాగుండేదేమో అని కూడా అత్యాశకు పోతాం. లోకేషన్ల ఎంపిక, ప్రతి ఫ్రేమ్‌నూ రిచ్‌గా చూపడం బాగుంది కానీ, ఆఖరుకది అలంకరణ ఎక్కువున్న బొమ్మ స్థాయికే సినిమాను పరిమితం చేసింది. పాత్రలు, వాటి మానసిక సంఘర్షణను బలంగా చిత్రించి, ప్రాణం పోయాలన్నది దర్శకుడు (‘బంపర్ ఆఫర్’, ‘దిల్లున్నోడు’ చిత్రాల ఫేమ్ జయ రవీంద్ర), పాత్రధారులు మర్చిపోవడంతో, అసలైన జీవకళ లోపించింది.

అలాగే, సినిమా మొదట్లోనే హీరో మేనేజర్ పాత్ర గోవాను చిన్న ఊరుగా ప్రస్తావించడం, హీరోయిన్ తల్లి ప్రతి వారం లాటరీ టికెట్లు కొంటుందనడం (తెలుగునాట లాటరీలు పోయి చాలా ఏళ్ళయింది) లాంటి లోపాలూ ఉన్నాయి. హీరో పాత్రకున్న బాధ, సమస్య ఏమిటో, మత్తులోనే ఎందుకు మునిగి తేలుతున్నాడో కాస్తంత డైలాగుల రూపంలోనైనా చెప్పిస్తే సగటు ప్రేక్షకులకు బాగుండేది. కథానాయక పాత్రలోని ఆ లోపం వల్ల కథతో, పాత్రలతో సహప్రయాణం కొంత ఇబ్బంది అనిపిస్తుంది. తమకు సంబంధం లేని అంశాలేవో తెర మీద జరుగుతున్న భావన కలుగుతుంది. మాతృకలోని పాత్రలు, సన్నివేశాల మధ్య తీవ్రత ఆ స్థాయిలో తెలుగు తెరపైకి తర్జుమా కాలేదని అర్థమవుతుంది. వెరసి, మునుపే హిందీ మాతృకను చూసేసినవారు, చూడనివారు కూడా ఈ తెలుగు వెర్షన్ చూడగానే, ‘ఆషికీ-2’ చూడాలనుకుంటారు. ఒక రీమేక్ సినిమా (కథ)కు ఇంతకు మించి గీటురాయి వేరే ఏముంటుంది?

- రెంటాల జయదేవ

 ........................................
 బలాలు
 1. హిందీలో జనం నోట నానిన బాణీలు 2. చంద్రబోస్ పాటల్లో రెండు, మూడు 3. వెంటాడే విలక్షణ హిందీ గాయనీ గాయకుల గళాలు 4. ప్రతి ఫ్రేమ్‌లో రిచ్‌నెస్‌ను చూపిన బాలీవుడ్ తరహా ఛాయాగ్రహణం
 .........................................
 బలహీనతలు
 1. హీరో, హీరోయిన్లు 2. పాత్రధారుల నుంచి సమతూకంలో నటనను రాబట్టలేని దర్శకత్వం 3. డబ్బింగ్ సినిమా చూస్తున్నామేమో అనిపిస్తూ, హిందీ మాతృకకు జిరాక్స్‌లా చిత్రీకరణ కనిపించడం 4. మాతృకలోని కథ, పాత్రధారుల మధ్య తీవ్రత ఇక్కడకు తర్జుమా కాకపోవడం.
 ........................................................

(Published in 'Sakshi' daily, 23rd Aug 2014, Saturday)
................................................................

Monday, August 25, 2014

తెలిసిన కథ... తీగసా...గే కథనం! - ‘సికిందర్’

 తారాగణం: సూర్య, సమంత, కెమేరా: సంతోష్ శివన్, సంగీతం: యువన్ శంకర్‌రాజా, మాటలు: శశాంక్ వెన్నెలకంటి, నిర్మాతలు: లగడపాటి శిరీషా శ్రీధర్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: లింగుస్వామి

 సంతోష్ శివన్ (ఛాయాగ్రహణం), రాజీవన్ (కళాదర్శకత్వం), యువన్ శంకర్‌రాజా (సంగీతం), ఆంథోనీ (కూర్పు), లింగుస్వామి (దర్శకత్వం) - ఈ పేర్లన్నీ దక్షిణాది భారతీయ సినీ రంగంలోని అగ్ర శ్రేణి సాంకేతిక నిపుణులవని ప్రత్యేకించి చెప్పనక్కర లేదు. మరి, ఇంత మంది పనిచేసిన సినిమా ఎలా ఉండాలి? ఆ ఆశలు, అంచనాలతోనే ‘సికిందర్’ (తమిళ మాతృక ‘అంజాన్’)కు వెళితే తీవ్ర నిరాశకు గురవుతాం. అనేక పాత సినిమాల పోలికలున్న ఈ పాత తరహా చిత్రాన్ని ఇంత మంది మహామహులు కలసి వడ్డించిన వట్టి పాత చింతకాయ పచ్చడిగా ఫీలవుతాం.

 కథ ఏమిటంటే...

 వైజాగ్ నుంచి ముంబయ్‌కి వచ్చిన కృష్ణ (సూర్య) తన అన్న రాజూ భాయ్ (సూర్య) కోసం అన్వేషిస్తుంటాడు. ఆ క్రమంలో అన్నయ్యతో పరిచయమున్న మాఫియా వాళ్ళను కలుస్తాడు. అసలీ రాజూ భాయ్ ఎవరన్నది ఫ్లాష్‌బ్యాక్. మిత్రుడు చందు (విద్యుత్ జమాల్)తో కలసి ముంబయ్‌లో మాఫియా వ్యవహారాలు నడిపిన వ్యక్తి - రాజూ భాయ్. అలాంటి రాజూ భాయ్ అనుకోకుండా మరో మాఫియా నేత ఇమ్రాన్ (మనోజ్ బాజ్‌పాయ్)తో తలపడాల్సి వస్తుంది. అప్పుడేమైంది? ఆ కథ ఆచూకీ కనుక్కుంటూ వచ్చిన కృష్ణ ఏం చేశాడన్నది మిగతా సినిమా.

 ఎలా నటించారంటే... 

 రాజూ భాయ్‌గా, చేతికర్ర సాయంతో కుంటుతూ నడిచే కృష్ణగా సూర్య భిన్నమైన హెయిర్‌స్టయిల్‌తో చూడడానికి బాగున్నారు. పాత్రకున్న పరిధిలో నటించడానికి ప్రయత్నించారు. చాలా రోజుల తరువాత తమిళంలో పెద్ద సినిమాతో పాగా వేయడానికి ప్రయత్నిస్తున్న సమంత ఈసారి అందాలు ఆరబోయడానికి కూడా వెనుకాడలేదు. బికినీడ్రెస్‌లోనూ ప్రేక్షకులకు కనువిందు చేశారు. విలన్లుగా మనోజ్ బాజ్‌పాయ్‌తో సహా సుపరిచిత ముఖాలు కొన్ని ఉన్నా, అవేవీ బలంగా ముద్ర వేసే పాత్రలు కావు. ఆ పాత్రలకు కథలో, కథనంలో కావాల్సినంత ప్రాముఖ్యమూ ఇవ్వలేదు.

 ఎలా ఉందంటే...

 మాఫియా నేపథ్యంలో స్నేహం, ద్రోహం అనే రెండు ప్రధానాం శాల చుట్టూ తిరిగే ఈ చిత్ర కథలో చాలా లోపాలే ఉన్నాయి. వైజాగ్ నుంచి హీరో వచ్చాడంటూ కథ మొదలవుతుంది. తెర మీద మాత్రం కన్యాకుమారి అని టైటిల్ చూపిస్తుంటారు. అలాగే, హీరోయిన్ పెద్ద పోలీస్ కమిషనర్ కూతురంటారు. పిల్లకు పెళ్ళి చేయాలని తాపత్రయపడే ఆ తండ్రి ఉన్నట్టుండి ఆమె ఎక్కడికో వెళ్లినా పట్టించుకోడు. ఇక, సంగీత విద్వాంసుడిగా బ్రహ్మానందం వేసిన కొద్ది క్షణాల పాత్రను మన శాస్త్రీయ సంగీతాన్ని అవహేళన చేసేలా చూపడం కళాప్రియులెవరూ సహించలేని విషయం. సినిమాలో కెమేరా, యాక్షన్ లాంటివి వేటికవి బాగున్నా, అన్నీ కలసి సమన్వయంతో పని చేయలేకపోవడం లోపమైంది. కోట్ల ఖర్చుతో దృశ్యాలు స్టయిలిష్‌గా తోచినా, విషయం తక్కువైన విజువల్ డ్రామాగా కనిపిస్తుంది. పైగా, దర్శకుడు తాను అనుకున్న ఆలోచన అనుకున్నట్లు రాసుకొని, రాసిందల్లా తీసేసి, సినిమాగా వదిలారా అనిపిస్తుంది. తీసుకున్న ప్రేమకథలో కానీ, ప్రతీకార గాథలో కానీ బలమైన ప్రాతిపదికలు, కొనసాగింపులు లేకపోవడం ఈ సినిమాకు మరో పెద్ద మైనస్.

 కొసమెరుపు:  

మూడు గంటల (కొద్ది నిమిషాలు తక్కువ) సినిమా అంతా చూశాక, ‘సికిందర్’ అనే టైటిల్ ఎందుకు పెట్టారా అని ఆలోచిస్తూ బయటకు రావడం ప్రేక్షకుల వంతు అవుతుంది.

 బలాలు:  స్టయిలిష్‌గా ఉన్న చిత్రీకరణ  కెమేరా పనితనం, యాక్షన్ దృశ్యాలు  సమంత అందాలు ఆరబోత  కొన్ని పాటల రచన, చిత్రీకరణ

 బలహీనతలు:  పాత చింతకాయపచ్చడి కథ  ఫస్టాఫ్ అయ్యేసరికే జరగబోయే సెకండాఫ్ కథ కూడా ప్రేక్షకుడికి అర్థమై పోవడం  నీరసమైన స్క్రీన్‌ప్లే  పదును తగ్గిన ఎడిటింగ్  బలహీనమైన విలన్ పాత్రచిత్రణ  వినోదం శూన్యం.

 - రెంటాల జయదేవ

(Published in 'Sakshi' daily, 16th Aug 2014, Saturday)
...................................

Wednesday, August 20, 2014

ఇదో బలహీన ప్రేమకథాచిత్రమ్ ( సినిమా రివ్యూ: ‘లవర్‌‌స’ )


ఇదో బలహీన  ప్రేమకథాచిత్రమ్
తారాగణం: సుమంత్ అశ్విన్, నందిత,
కెమేరా: మల్హర్ భట్ జోషీ, సంగీతం: జె.బి,
నిర్మాతలు: సూర్యదేవర నాగ వంశీ, బి.మహేంద్ర బాబు,
దర్శకత్వం: హరినాథ్, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు: మారుతి

కొన్ని కథలు వినడానికి బాగుంటాయి... మరికొన్ని చూడడానికి బాగుంటాయి. వినడానికి బాగున్నవన్నీ తెరపై చూసేందుకు సరిపడక పోవచ్చు. పదే పదే ఒక అబ్బాయి ప్రేమను భగ్నం చేసే అమ్మాయి. చివరకు ఆ అమ్మాయి, అబ్బాయే ప్రేమలో పడితే? వినడానికి బాగున్న ఈ ఇతివృత్తానికి మారుతి మార్కు వెండితెర రూపం - ‘లవర్‌‌స’.

కథ ఏమిటంటే... సిద్ధు (సుమంత్ అశ్విన్) ఇంటర్ చదువుతున్న రోజుల నుంచి ఒకరి తరువాత మరొకరుగా గీత (తేజస్వి), సౌమ్య అనే ఇద్దరు అమ్మాయిలతో ప్రేమలో పడతాడు. కానీ, ఆ అమ్మాయిలకు ఫ్రెండ్ అయిన చిత్ర  (‘ప్రేమకథా చిత్రవ్‌ు’ ఫేవ్‌ు నందిత) ‘అది నిజమైన ప్రేమ కాదు... ప్రేమ పేరిట ఉబుసుపోక కాలక్షేప (ఫ్లర్టింగ్)’మంటూ, ఆ ప్రేమల్ని చెడగొడుతుంది. తీరా ఇంజినీరింగ్ చదువుకొంటున్న రోజుల్లో ఆ చిత్రనే అనుకోకుండా హీరో ప్రేమిస్తాడు. ఆ విషయం తెలిశాక ఏమైంది, వాళ్ళ ప్రేమ ఫలించిందా అన్నది మిగతా సినిమా.

ఎలా నటించారంటే... 

హీరో సుమంత్ అశ్విన్ హుషారుగా నటించాడు, నర్తించాడు. కెమేరా లుక్స్ మీద, ఎంచుకొనే కథల మీద ఈ యువ నటుడు మరింత శ్రద్ధ పెట్టాలి. నందిత ఫరవాలేదనిపిస్తారు. మారుతి చిత్రాల్లో తరచూ కనిపించే సాయి పంపన హీరో ఫ్రెండ్‌గా మాటల హడావిడి చేశారు. సెకండాఫ్ లోని సప్తగిరి ఎపిసోడే ఈ బలహీనమైన కథ, కథనాల్లో కాస్త రిలీఫ్.

ఎలా ఉందంటే...

 సినిమా మొదలైనప్పుడు కాస్త ఆసక్తిగా అనిపించినా, చర్చి ఫాదర్ (ఎమ్మెస్ నారాయణ)తో హీరో తన మొదటి ప్రేమకథ చెప్పి, రెండో కథ మొదలుపెట్టేటప్పటికే ఆసక్తి పోతుంది. పాత్రల పరిచయం, అసలు హీరోయిన్‌తో హీరో ప్రేమ మొదలవడం - ఈ కొద్దిపాటి కథనే ఫస్టాఫ్ అంతా నడిపారు. ఇక, వారిద్దరి మధ్య ప్రేమను ఎలా ముందుకు నడపాలన్న దానిపై దర్శక, రచయితలకు కూడా ఒక స్పష్టత లేదు. దాంతో, ప్రధాన కథకు సంబంధం లేని పాత్రలను తెచ్చి, వాటి ద్వారా కామెడీ చేయిస్తూ, కథను ముగింపు దగ్గరకు తీసుకురావాలని విఫలయత్నం చేశారు. కానీ, దురదృష్టవశాత్తూ ప్రేక్షకులప్పటికే డిస్‌కనెక్ట్ అయిపోతారు.

మారుతి సినిమాలన్నిటి లాగానే దీనిలోనూ అక్కడక్కడ ఆడియో కట్‌లను దాటుకొని వచ్చిన ద్వంద్వార్థపు డైలాగులు వినిపిస్తాయి. ఒకటీ అరా చోట్ల డైలాగులు సమకాలీన యువతరం ఆలోచనల్ని ప్రతిఫలిస్తూ, హాలులో జనాన్ని నవ్విస్తాయి. కెమేరా వర్‌‌క, సంగీతం లాంటి అక్కడక్కడ ఫరవాలేదనిపించినా, పాత్రధారులకు టచప్ కూడా చేయకుండా తీసిన కొన్ని దృశ్యాలు, సాగదీత కథనం మధ్య వాటికి గ్రహణం పట్టేసింది.

కథను ఎలా ముగించాలో తెలియక కేవలం సెకండాఫ్‌లో పిచ్చివాడు గజిని  పాత్రలో సప్తగిరితో వచ్చే కామెడీతోనే సినిమాను నడిపేయాలనుకోవడం దర్శక, రచయితల పొరపాటు. వెరసి, హాలులోకి వెళ్ళిన కాసేటికే కథ గ్రహించేసిన జనం పూర్తిగా రెండు గంటల పది నిమిషాల సినిమా బోర్ అనుకోకుండా చూడగలగడం కష్టం. అందుకే, హాల్లోంచి బయటకొస్తూ ఒక స్టూడెంట్ అన్నట్లు, ఈ ‘లవర్‌‌స’ - ప్రేక్షకుల చెవిలో దర్శక, నిర్మాతలు పెట్టిన ఫ్లవర్‌‌స.

బలాలు:
హీరో హుషారు నటన
లౌడ్‌గా అనిపించినా, కాసేపు నవ్వించే సప్తగిరి కామెడీ
ఒకటి రెండు పాటలు

బలహీనతలు: 
* సున్నా కథ
మైనస్ కథనం
కథలోని పాత్రలను ప్రవేశపెట్టి, వాటి మధ్య అనుబంధం తెలియజేయడానికే ఫస్టాఫ్ అయిపోవడం  ఫస్టాఫ్ కన్నా సెకండాఫ్‌లో కథ,
కథనం.. మరీ పిల్లలాట లాగా ఉండడం
దర్శకత్వం

-  రెంటాల జయదేవ


.........................................................

Monday, August 18, 2014

మా అమ్మాయి కోసం ఓ ప్రేమకథ రాశా..! - హీరో అర్జున్.

మా అమ్మాయి కోసం ఓ ప్రేమకథ రాశా..!
 దాదాపు మూడున్నర దశాబ్దాలుగా సినీరంగంలో ఉన్న హీరో - అర్జున్. జన్మతః కన్నడిగుడైనా, మాతృభాషతో పాటు తెలుగు, తమిళాల్లో ఎంతో ఆదరణ సంపాదించిన యాక్షన్ హీరో ఆయన. ప్రస్తుతం ‘జైహింద్ 2’ చిత్రంతో నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా బహుపాత్ర పోషణ చేస్తున్న అర్జున్ పుట్టినరోజు నేడు. ఆయనతో ‘సాక్షి’ ప్రత్యేక సంభాషణ...

  అర్జున్ గారూ! ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు?
 ఫస్ట్ క్లాస్. స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న ‘జైహింద్-2’ పోస్ట్ ప్రొడక్షన్‌తో బిజీ.

  ‘జైహింద్-2’ అంటే, ‘జైహింద్’ కథకు సీక్వెలా?
 లేదండీ! ఇది ఆ కథకు సీక్వెల్ కాదు. నా హీరో పాత్ర మినహా మిగతా పాత్రలు, కథ కొత్తవే. ఒక సామాన్యుడి దృష్టిలో విద్యావ్యవస్థ ఎలా ఉంది, దానిలోని లోటుపాట్లేమిటి అన్న కథాంశంతో సినిమా నడుస్తుంది. భారీ తారాగణంతో దీన్ని ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్‌గా చేస్తున్నా.

  మొత్తానికి, చాలా శ్రమిస్తున్నట్లునారు?

 అవునండీ ఇది చాలా పెద్ద ప్రాజెక్ట్ కదా! పైగా, కథ, స్క్రీన్‌ప్లే, నిర్మాణం, దర్శకత్వ బాధ్యతలన్నీ నావే. పెపైచ్చు, తెలుగు, తమిళ, కన్నడ భాషలు మూడింటిలో ఏకకాలంలో చేస్తుండడంతో ఎక్కువగానే శ్రమించాల్సి వచ్చింది. సెప్టెంబర్‌లో రిలీజ్.

  త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తున్న సినిమాలో విలన్‌గా నటిస్తున్నారట!
 (పెద్దగా నవ్వుతూ...) అప్పుడే మీ మీడియా దాకా వచ్చేసిందా? ఆ ప్రతిపాదన ఇంకా చర్చల్లోనే ఉంది. దర్శకుడితో మాట్లాడుతున్నా. ఆయనను కలవాలి. కథ వినాలి. అప్పుడు కదా... నటించేది!

  ఆ మధ్య మణిరత్నం ‘కడలి’లో విలన్‌గా చేశారు!
 అవును. అది పవర్‌ఫుల్ పాత్ర. అందుకే చేశా. దానికి నాకు చాలా అవార్డులే వచ్చాయి. కథ నచ్చి, మంచి దర్శకుడు, నిర్మాత అయితే ఎలాంటి పాత్ర చేయడానికైనా నేను రెడీ. నటుడన్నవాడు ఉన్నది... మంచి పాత్రలు పోషించడానికే కదా!

 ఇన్నేళ్ళుగా నటిస్తున్నా... శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకుంటున్నారు. ఈ అందం, ఆరోగ్యాల రహస్యం?
 (నవ్వేస్తూ...) కన్నడ చిత్రం ‘సింహద మరి సైన్య’ (1981) నా తొలి సినిమా. నటుడిగా నాకిది 34వ ఏడు. నటీనటులకు ఎవరికైనా సరే, వాళ్ళ ఫిజిక్, లుక్ చాలా ముఖ్యం. వాళ్ళ పెట్టుబడి అది. కాబట్టి, షూటింగ్ ఉన్నా, లేకపోయినా శరీర దారుఢ్యాన్ని కాపాడుకోవాలి. ముందుగా, మనం మన శరీరాన్ని ప్రేమించాలి. వ్యాయామం అనేది నిత్య జీవితంలో భాగం అయిపోవాలి. నేను చేసేది అదే. కరాటేలో బ్లాక్‌బెల్ట్ సాధించిన నేను ఇప్పటికీ రిఫ్లెక్స్‌ల కోసం కరాటే సాధన చేస్తుంటా.

  తెలుగులో నేరుగా చేసి, చాలా రోజులైనట్లుంది...
 తెలుగువాళ్ళు నన్ను తమ సొంత బిడ్డలా ఆదరించారు. నేను ఎప్పుడు నేరు తెలుగు సినిమా చేసినా ఆదరించారు. అప్పట్లో ‘మా పల్లెలో గోపాలుడు’ లాంటివే కాక ఆ మధ్య ‘హనుమాన్ జంక్షన్’, ‘పుట్టింటికి రా చెల్లీ’ లాంటి మంచి సినిమాలు ఘన విజయం సాధించాయి. ‘శ్రీఆంజనేయం’ కూడా నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది. మంచి పాత్రలొస్తే, తెలుగులో నటిస్తా.

  కానీ ఈ మధ్య సొంత చిత్రాలకే ప్రాధాన్యమిస్తున్నారు.

 అది నిజమే. బయట చిత్రాలు ఎక్కువ చేయడం లేదు. వాటి మీద ఆసక్తి పోయింది. ఇన్నేళ్ళు, ఇన్ని సినిమాలు చేశాక, ఇప్పుడిక నటుడిగా సంతృప్తినిచ్చే పాత్రల కోసం చూస్తున్నా. అసాధారణ పాత్రలే చేయాలనిపిస్తోంది. అందుకే, సొంత చిత్రాల్లో ఎక్కువ కనిపిస్తున్నా.

  మీ పెద్దమ్మాయి ఐశ్వర్యను కూడా నటిని చేశారు కదా!
 అవును. ఆమె నటించిన తొలి చిత్రం ‘పట్టత్తు యానై’ సరైన రీతిలో ప్రమోషన్ జరగక అనుకున్నంతగా ఆడ లేదు. అందుకే, ఇప్పుడు బయట చాలా అవకాశాలు వచ్చినా, అంగీకరించలేదు. ఆమెను ప్రేక్షకులకు దగ్గర చేసేందుకు ఒక యాక్షన్ ప్రధాన ప్రేమకథ రాశా. పూర్తిగా విదేశాల్లో చిత్రీకరించే ఈ కథకు తగిన హీరో కోసం ఎదురుచూస్తున్నా. ‘జైహింద్ 2’ రిలీజైన వెంటనే హిందీ, తెలుగు భాషల్లో ఈ సొంత చిత్రాన్ని నా దర్శకత్వంలో ప్రారంభిస్తున్నా. ఇక, మా రెండో అమ్మాయి అంజన ప్రస్తుతం సింగపూర్‌లో ఫ్యాషన్ కోర్సు చదువుతోంది. 

  మీరు చేపట్టిన భారీ ఆంజనేయ ఆలయ నిర్మాణం ఎంతదాకా వచ్చింది?
 ఇప్పటికి 75 శాతం పూర్తి అయింది. మిగిలినది ఈ ఏడాదే చేయాలని చూస్తున్నాం. అంతా ఆంజనేయ అనుగ్రహం.
   - రెంటాల జయదేవ

............................................

 

Wednesday, August 13, 2014

భయం లేదు... హాయిగా నవ్వుకోండి! ( సినిమా రివ్యూ: గీతాంజలి)

  దెయ్యాలు కేవలం భయపెట్టడమే కాదు... వినోదం కూడా పంచుతాయి. అందుకు ఇటీవల వస్తున్న హార్రర్ - కామెడీ చిత్రాలే ఉదాహరణ. ఆ మధ్య వచ్చిన డబ్బింగ్ చిత్రం ‘కాంచన’, నేరు తెలుగు చిత్రం ‘ప్రేమకథా చిత్రమ్’ తరువాత మళ్ళీ ఇప్పుడు ‘గీతాంజలి’ పాత్రలకు కలిగే భయం ఆధారంగా వచ్చే ఉత్కంఠనూ, వినోదాన్ని ఆశ్రయించి, అల్లుకున్న కథ. 
 ....................................
 చిత్రం - గీతాంజలి, తారాగణం - అంజలి, శ్రీనివాసరెడ్డి, రావు రమేశ్, ‘సత్యం’ రాజేశ్, ‘షకలక’ శంకర్, హర్షవర్ధన్ రాణే, సంగీతం - ప్రవీణ్ లక్కరాజు, కెమేరా - సాయి శ్రీరామ్, కథా విస్తరణ -స్క్రీన్‌ప్లే - మాటలు - కోన వెంకట్, నిర్మాత - ఎం.వి.వి. సత్యనారాయణ, కథ - దర్శకత్వం - రాజకిరణ్
 ...................................
 కథ ఏమిటంటే...
  సినిమా దర్శకుడు కావాలని నందిగామ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన యువకుడు శ్రీనివాస్ (శ్రీనివాసరెడ్డి). ఓ ఫ్లాట్‌లో అనుమానాస్పదంగా మరణించిన ఓ అమ్మాయి తాలూకు దెయ్యం తిరుగుతుంటుందంటూ సినిమా తీయాలనుకున్న ఓ వ్యాపారవేత్త (రావు రమేశ్)కు ఓ హార్రర్ స్క్రిప్టు వినిపిస్తుంటాడు.చిత్రం ఏమిటంటే, ఆ స్క్రిప్టు నిజజీవిత కథ. ఇంతకీ ఆ ఇల్లేమిటి? ఆ అమ్మాయెవరు? ఆ ఇంట్లో అసలేం జరుగుతోంది? లాంటి ఎన్నో అంశాలతో సినిమా ఆఖరుదాకా ఆసక్తిగా నడుస్తుంది. 
 ఎలా ఉందంటే...
  రచయిత కోన వెంకట్ నిర్మాణ భాగస్వామి అయిన ఈ చిత్రం ఆసక్తికరమైన ఘట్టంతో మొదలై, పోనూపోనూ ఉత్కంఠ పెంచుతూ ముందుకు సాగుతుంది. ప్రథమార్ధం ముగిసేసరికి, తరువాత ఏం జరుగుతుందనే ఆసక్తి, అప్పటి దాకా చూసినదాని మీద సంతృప్తితో ఉంటారు పేక్షకులు. ఇక, ద్వితీయార్ధం మొదలయ్యాక... ప్రథమార్ధంలో జవాబు తెలియని చిక్కుముడులుగా మిగిలిన ఒక్కో అంశాన్నీ వివరణనిస్తూ, దర్శక, రచయితలు కథను ముందుకు నడిపారు. ఆ క్రమంలో మధ్యకొచ్చేసరికి గమనం కొద్దిగా మందగించినట్లు అనిపించినా, చివరలో మళ్ళీ వేగమందుకొంది. 
 ఎలా నటించారంటే... 
  ఈ చిత్రంలో ప్రధాన పాత్రధారిణి అంజలి తెరపై ఒక్కోసారి ఒక్కోరకంగా ఉన్నా చూడడానికి అందంగానే ఉన్నారు. కథ ఆ పాత్ర చుట్టూ తిరిగినప్పటికీ, సన్నివేశాల్లో ఆమె అభినయ అవకాశం ఉన్నవి కొద్దే. ఆమె చేసిందీ అంతే. ఇంతకాలం కమెడియన్‌గానే తెలిసిన శ్రీనివాసరెడ్డిలోని మరో కోణాన్ని ఈ చిత్రం చూపెట్టింది. కొన్నిచోట్ల నటుడు రాజేంద్రప్రసాద్ ఛాయలు తొంగిచూసినా, మొత్తం మీద ఆయనలో ఉన్న ప్రతిభకూ, తద్వారా కెరీర్‌కూ ఇది చిరస్మరణీయమైనదవుతుంది. ఇటీవల బాగా గుర్తింపు వచ్చిన సప్తగిరితో పాటు ఈ సినిమా ‘షకలక’ శంకర్, ‘సత్యం’ ఫేమ్ రాజేశ్‌లకు మరిన్ని అవకాశాలు తెస్తుంది. నటనలో స్పాంటేనిటీ, మాటలో మాండలికం జోరు కొనసాగిస్తే, శంకర్ క్రమంగా తెరపై స్థిరపడినట్లే! చాలాకాలం తర్వాత దక్కిన భిన్నమైన పాత్రను రావు రమేశ్ సమర్థంగా పోషించారు. సినిమా మొదట్లో అలీ, మధ్యలో ‘వెన్నెల’ కిశోర్ మెరిస్తే, కేక్ మీద ఐసింగ్ లాంటిది - సెకండాఫ్‌లో బ్రహ్మానందం పోషించిన సైకియాట్రిస్ట్ సైతాన్‌రాజ్ పాత్ర. 

 సమష్టి సాంకేతిక కృషి 
  అన్ని సాంకేతిక విభాగాల పనితనం కూడా ఈ సినిమాకు బాగా కలిసొచ్చింది. సాయి శ్రీరామ్ ఛాయాగ్రహణం కథలోని ఉత్కంఠనూ, పాత్రల భయాన్నీ భిన్నమైన కోణాల్లో తెరపై చూపెట్టింది. ఇలాంటి కథలకు కీలకమైన సౌండ్ ఎఫెక్ట్‌లు, రీ-రికార్డింగ్ ఆ బాధ్యతను నెరవేర్చాయి. ప్రవీణ్ లక్కరాజు సంగీతం, ఆయన బాణీలో ‘కాఫీ పాట’ వినడానికే కాదు, చూడడానికీ బాగుంది. ద్వితీయార్ధంలో అంజలి, హర్షవర్ధన్ రాణేలపై వచ్చే ‘నా మనసును తాకే వేకువ జాబిలివో..’ మళ్ళీ మళ్ళీ వినాలనిపించే మెలొడీ. కోన వెంకట్ డైలాగులు, వాటిలోని విసుర్లు హాలులో పేలతాయి. 
  స్కిప్టులో చిన్న చిన్న లోపాలు లేకపోలేదు. వాటి గురించి మాట్లాడుకోవాలంటే, దెయ్యం (?) రోజూ ఆ టైమ్‌కే వచ్చి, చటుక్కున ఎలా మాయమవుతుందో తెలియదు. ఇక, సప్తగిరి ఎపిసోడ్ ఏదో ఒక రీజనింగ్ ఇవ్వడం కోసమే పెట్టినట్లు అనుకోవాలి. అలాగే, అనుమానాస్పద మరణం విషయంలో వాచ్‌మన్ కూడా ఎందుకు నోరు విప్పనట్లు? చివరలో జైలు నుంచి విడుదల కూడా సినిమాటిక్ కన్వీనియన్సే తప్ప, లాజికల్‌గా అదెలా సాధ్యమైందని అడగలేం. అయితే, అప్పటికే రెండు గంటలకు పైగా వినోదంలో మునిగి, విసుగనిపించకుండా తెరపై కథతో, పాత్రలతో ప్రయాణం చేసిన ప్రేక్షకుడు ఈ లోటుపాట్లేవీ పట్టించుకొనే స్థితిలో ఉండడు. పాత్రలనే తప్ప, తనను భయపెట్టకపోయినప్పటికీ, నవ్వించే ఈ హార్రర్ కామెడీ అనుభవం చాలా కాలానికి దక్కిన వెండితెర విందుగా పరిగణిస్తాడు. ఇటీవల వచ్చిన చిత్రాలన్నిటితో పోలిస్తే, వినోదంలోనూ, వసూళ్ళలోనూ ‘గీతాంజలి’కి అది పెద్ద బలం. వెరసి, ఈ ఏడాది తెలుగు సినీ పరిశ్రమకు దక్కిన మరో విజయఫలం. 
-  రెంటాల జయదేవ
.....................................................................
 బలాలు - 1. స్క్రీన్‌ప్లే, డైలాగులు 2. ఆద్యంతం ఉన్న వినోదం 3. సాంకేతిక విభాగాల పనితీరు 4. చిన్న పాత్రల మొదలు పెద్ద పాత్రల దాకా అన్నీ నటుల ప్రతిభతో పండడం  
 బలహీనతలు - 1. ద్వితీయార్ధంలో, ముఖ్యంగా క్లైమాక్స్‌లో లాజిక్ మిస్సవడం 2. పేరుకు హార్రర్ కథాంశమైనా, పాత్రలనే తప్ప ప్రేక్షకుల్ని భయపెట్టకపోవడం 
 ...........................................
 (Published in 'Sakshi' daily, 10th Aug 2014, Sunday)
.......................................................

Monday, August 11, 2014

''మహేశ్ బాబు అంటే.. దర్శకులకు పండగే!'' - దర్శకుడు శ్రీను వైట్ల

మహేశ్ అంటే.. దర్శకులకు పండగే!


తెలుగుతెరపై తిరుగులేని విజయాలు అందించిన హీరో మహేశ్‌బాబు అయితే, ఎంటర్‌టైనింగ్ సినిమాలతో అందరినీ ఆకట్టుకొని పైసా వసూల్ సినిమాలకు చిరునామాగా మారిన దర్శకుడు శ్రీను వైట్ల. వారిద్దరి కాంబినేషన్‌కు సహజంగానే క్రేజ్. సినిమాల పరంగానే కాదు... వ్యక్తిగతంగా కూడా వారిద్దరూ అత్యంత సన్నిహితులు. ఇవాళ హీరో మహేశ్‌బాబు పుట్టిన రోజు సందర్భంగా, ఆయన కెరీర్‌లోని బ్లాక్‌బస్టర్ హిట్లలో ఒకటైన ‘దూకుడు’ దర్శకుడు శ్రీను వైట్లను ‘సాక్షి’ పలకరించింది. ప్రస్తుతం మహేశ్‌బాబును పవర్‌ఫుల్ పోలీసాఫీసర్‌గా ‘ఆగడు’లో చూపేందుకు సిద్ధమవుతూ, ఆ చిత్ర షూటింగ్‌లో యమ బిజీగా ఉన్న శ్రీను ఈ తరం సూపర్‌స్టార్ గురించి పంచుకున్న ముచ్చట్లు... ‘సాక్షి’ పాఠకులకు ప్రత్యేకం.

మహేశ్‌బాబు నటనను నేను చాలా కాలంగా గమనిస్తూ ఉన్నా, అతనితో వ్యక్తిగతంగా నాకు పరిచయమైంది మాత్రం 2010లో ‘దూకుడు’ తీస్తున్నప్పుడే! అంతకు ముందు కొన్ని సందర్భాల్లో కలిసినా, మా మధ్య పరిచయం ఏర్పడింది ఆ సినిమా కథ చెబుతున్నప్పుడు. ఆ కథను తెరకెక్కించడం మొదలుపెట్టిన దగ్గర నుంచి మా పరిచయం అలా అలా రోజు రోజుకూ పెరుగుతూ వచ్చింది. నా లక్షణాలు ఆయనకూ, ఆయన లక్షణాలూ నాకూ బాగా నచ్చడంతో మా ప్రయాణం ఎంతో స్నేహపూర్వకంగా సాగుతోంది. ఇప్పుడు ‘ఆగడు’ చేస్తున్నప్పుడు కూడా నా మీద అతను పెట్టుకొన్న నమ్మకం నేను మర్చిపోలేను. గడచిన నాలుగేళ్ళుగా, అతనితో నాది అద్భుతమైన జర్నీ.

నా కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ ‘దూకుడు’. అలాగే, మహేశ్ కెరీర్‌లో కూడా అది ఓ పెద్ద హిట్. మహేశ్‌లో నాకు నచ్చే అద్భుతమైన గుణం ఏమిటంటే, అతను ఏ రోజుకు ఆ రోజు మనిషిగా, నటుడిగా ఎదుగుతూనే ఉంటాడు. తనను తాను మెరుగుపరుచుకుంటూనే ఉంటాడు నేను ‘దూకుడు’ చేసిన రోజులతో పోలిస్తే ఇప్పుడు ‘ఆగడు’ చేస్తున్న నాటికి ఈ నాలుగేళ్ళలో అతను నటుడిగా మరింత పదునెక్కాడు. ఒక వ్యక్తిగా కూడా అతను సూపర్బ్ హ్యూమన్ బీయింగ్. అతను పిల్లలతో గడిపే తీరు ముచ్చటేస్తుంది. పైగా, చాలా మంది నటీనటులు మూడ్‌ను బట్టి సెట్‌లో వ్యవహరిస్తుంటారు, నటిస్తుంటారు. కానీ, నేను చేసిన ఈ రెండు చిత్రాల సమయంలో మహేశ్ తనకు మూడ్ బాగోలేదని అనడం నేనెప్పుడూ వినలేదు, చూడలేదు. సెట్స్ మీద ఎప్పుడూ నవ్వుతూ, ఆనందంగా ఉంటాడు. అది ఒక అద్భుతమైన వరం. నన్నడిగితే, అందుకే అతను అంత అందంగా కనిపిస్తాడు. అందమంతా ఆ నవ్వులోనే ఉంది. అసలే అందగాడు. దానికి ఈ నవ్వు తోడై, మరింత అందంగా కనిపిస్తుంటాడు.http://img.sakshi.net/images/cms/2014-08/51407522139_Unknown.jpg

గమ్మత్తేమిటంటే, కామెడీని కూడా మహేశ్ అద్భుతంగా పలికించగలడు. ‘దూకుడు’లో అతను చాలా చక్కటి కామెడీ పలికించాడు. అయితే,‘దూకుడు’లో మహేశ్‌ను నేను కొంత వరకే చూపించగలిగాననుకుంటా. రాబోయే ‘ఆగడు’లో అతను పూర్తిగా ఓపెన్ అప్ అవడం చూస్తారు. ఇటు ఎంటర్‌టైన్‌మెంట్‌లో, అటు యాక్షన్ పార్ట్‌లో, ఒకటని కాదు - అన్నిట్లో అతని విశ్వరూపం చూస్తారు. మహేశ్ అభినయం మరింత బాగుండనుంది.

మహేశ్‌లో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే, నటుడిగా అతను ‘డెరైక్టర్స్ డిలైట్’ అని చెప్పాలి. అలాంటి నటుడితో పని చేయడం ఏ దర్శకుడికైనా పండగే! నటుడిగా దర్శకుడికి పూర్తిగా లొంగిపోతాడు. డెరైక్టర్‌ను ఎంతో గౌరవంగా చూస్తాడు. పాత్రకు తగినట్లు ఏది కావాలో అది ఇస్తాడు. చిన్న డెరైక్టరా, పెద్ద డెరైక్టరా అని చూడడు. అందరితోనూ ఒకేలా ప్రవర్తిస్తాడు. అందరినీ ఒకేలా సంబోధిస్తాడు. ఆఖరుకు తను అవకాశమిచ్చిన దర్శకుడినైనా సరే ‘సార్... సార్’ అనే పిలుస్తాడు. అలాంటి అరుదైన మనస్తత్త్వం ఉన్న హీరో అతను. దర్శకుడిగా కాక, ఒక ప్రేక్షకుడిగా చెప్పాలంటే, మహేశ్‌లో ఎమోషన్ అద్భుతంగా పలుకుతుంది. యాక్షన్ సీన్లు బాగా చేస్తాడు. కామెడీ టైమింగ్ చాలా బాగుంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే, అతను ఒక సమగ్రమైన నటుడు.

దర్శకుడిగానే కాక, వ్యక్తిగతంగా కూడా నేనివాళ మహేశ్‌కూ, అతని కుటుంబానికి ఎంతో సన్నిహితుణ్ణి కావడం నా అదృష్టంగా భావిస్తుంటాను. మా ఇద్దరి మధ్య ఇంత స్నేహం, సాన్నిహిత్యం రావడానికి కారణం - మా ఇద్దరికీ ఉన్న నిర్మొహమాటం. ఏదైనా సరే అతను చాలా ఓపెన్‌గా మాట్లాడతాడు. నేను కూడా అంతే. ఏదన్నా అనిపిస్తే చెప్పేస్తాను. దాచను. ఆ లక్షణమే మా ఇద్దరినీ దగ్గర చేసిందని అనుకుంటాను. అలాగే, మా ఇద్దరికీ ఉమ్మడిగా ఉన్న లక్షణం - సెన్సాఫ్ హ్యూమర్. నేను బాగా నవ్వుతాను, నవ్విస్తాను. అది నాకు బాగా ఇష్టం. అతను కూడా అద్భుతంగా నవ్విస్తాడు. నేను తెర మీద నవ్విస్తుంటే, అతను బయట కూడా నవ్విస్తాడు. ఎలాంటి సందర్భంలోనైనా సరే అతను నవ్వు ముఖంతోనే ఉంటాడు. సెట్‌లో మహేశ్ ఉంటే చాలు.. ఆ ఉత్సాహమే వేరు. సెట్‌లో అతను లేని వర్క్ ఏదైనా జరుగుతూ ఉంటే, ‘అరే... మహేశ్ ఉంటే బాగుండేదే’ అనిపిస్తుంటుంది.

మహేశ్ మంచి చదువరి. పుస్తకాలు బాగా చదువుతుంటాడు. ప్రస్తుతం ‘ఆగడు’ చిత్రీకరణ దాదాపు చివరకు వచ్చేసింది. రామోజీ ఫిల్మ్ సిటీలో ఇప్పుడు తీరిక లేకుండా పతాక సన్నివేశాలు చేస్తున్నాం. దీని తరువాత విదేశాల్లో మరో రెండు పాటలు చిత్రీకరించనున్నాం. ఈ నెలాఖరులో పాటలు విడుదల చేస్తాం. సెప్టెంబర్‌లో సినిమా రిలీజ్. చివరిగా ఒక్క మాట! నేను మహేశ్‌బాబును ఎలా చూడాలనుకుంటున్నానో, అలా ‘ఆగడు’లో చూపించాను. సెప్టెంబర్‌లో సినిమా చూశాక, ఆ సంగతి మీరూ ఒప్పుకుంటారు. మా చిత్ర హీరో మహేశ్‌బాబుకు అభిమానులు, ‘సాక్షి’  పాఠకులందరి పక్షాన  నా జన్మదిన శుభాకాంక్షలు.

నేడు మహేశ్‌బాబు పుట్టినరోజు

(Published in 'Sakshi' daily, 9th Aug 2014, Saturday)
.............................................

Sunday, August 10, 2014

అడవుల్లో... అడ్డంకుల్ని అధిగమించి... హీరో బాలకృష్ణ

అడవుల్లో... అడ్డంకుల్ని అధిగమించి...
 ఇటీవల దక్కిన ‘లెజెండ్’ ఘన విజయంతో ఊపు మీదున్న హీరో నందమూరి బాలకృష్ణ రెట్టించిన ఉత్సాహంతో తన తాజా చిత్రం షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ఎస్.ఎల్.వి. సినిమా పతాకంపై సత్యదేవ దర్శకత్వంలో ఈ చిత్రం నిర్మాణమవుతోంది. ఇటీవలే ఈ సినిమా చిత్రీకరణ తూర్పుగోదావరి జిల్లాలోని రంపచోడవరం, మారేడుమిల్లి తదితర ఏజెన్సీ ప్రాంతాలలో దిగ్విజయంగా జరిగింది. ‘‘నిజానికి, ఏజెన్సీలో భారీ వర్షాలు కురిసి, ఈ చిత్ర షూటింగ్‌కు అంతరాయం తలెత్తింది. 7 రోజులనుకున్న షెడ్యూల్ 13 రోజుల దాకా విస్తరించింది.

  అయినప్పటికీ, కష్టనష్టాలకు వెరవకుండా ముందుకెళ్ళి, ముందుగా అనుకున్న సన్నివేశాలను అనుకున్నట్లుగా చిత్రీకరించి, ఈ షెడ్యూల్‌ను దిగ్విజయంగా పూర్తి చేశాం’’ అని నిర్మాత రుద్రపాటి రమణారావు ‘సాక్షి’కి చెప్పారు. ఎత్తై భారీ వృక్షాల మధ్య, అటవీ ప్రాంతంలో జరిగిన ఈ షెడ్యూల్‌లో కొన్ని పోరాట దృశ్యాలనూ, కథానుగుణంగా కొన్ని టాకీ సన్నివేశాలనూ చిత్రీకరించారు. ఈ ఏజెన్సీ షెడ్యూల్‌లో హీరో బాలకృష్ణ, హీరోయిన్ త్రిషతో పాటు చలపతిరావు, గీత, చిత్రలేఖ, శ్రావణ్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. ‘‘దాదాపు 30 మంది ఫైటర్లతో ప్రధాన పోరాట సన్నివేశాలు తీశాం.

 వర్షాలు అడ్డంకి సృష్టించినప్పటికీ వెనుదిరిగి రాకుండా, ఓ కొత్త నిర్మాత ఇలా హైదరాబాద్ నుంచి తీసుకువెళ్ళిన 250 మంది యూనిట్‌తో అక్కడే బస చేసి, అనుకున్న రీతిలో మొత్తం షూటింగ్ పూర్తి చేయడం అరుదైన విషయం’’ అని ఫైట్ మాస్టర్లు రామ్-లక్ష్మణ్ చెప్పారు. రాజమండ్రికి దాదాపు 90 కిలోమీటర్ల దూరంలో, సెల్‌ఫోన్ సిగ్నల్స్ కూడా అందని లొకేషన్‌లో ప్రకృతి పరిసరాల మధ్య తీసిన సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని దర్శక, నిర్మాతలు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.

  వెంకట ప్రసాద్ ఛాయాగ్రహణం, రవీందర్ కళాదర్శకత్వం నిర్వహిస్తున్న ఈ చిత్రానికి ఇంకా పేరు నిర్ణయించాల్సి ఉంది. ‘‘రేపటి నుంచి కొత్త షెడ్యూల్ ప్రారంభిస్తున్నాం. హైదరాబాద్‌లోని ఔటర్ రింగ్‌రోడ్, తదితరప్రాంతాల్లో పది రోజుల పాటు కొన్ని ప్రధాన పోరాట సన్నివేశాలు చిత్రీకరించనున్నాం’’ అని కార్యనిర్వాహక నిర్మాత కొమ్మినేని వెంకటేశ్వరరావు తెలిపారు.

.................................

Saturday, August 9, 2014

ఇది కుర్రగాలి పటం (సినిమా రివ్యూ - గాలిపటం)

పెళ్ళి చేసుకున్నంత మాత్రాన ప్రేమ లేనప్పటికీ, ఆ వైవాహిక బంధాన్ని కొనసాగించాలా? లేక ప్రేమను వెతుక్కుంటూ ఆ బంధాన్ని తెంచుకొని ముందుకు సాగిపోవాలా? ఇది ఎవరి వ్యక్తిగత అభిప్రాయాలు, అభిరుచిని బట్టి దీనికి సమాధానాలు వేర్వేరుగా ఉండవచ్చు. ఆధునికత, అవకాశాలు పెరిగి, ఆలోచన తీరు మారిన సమకాలీన సమాజంలో ఇది చర్చనీయాంశం కూడా! దీన్ని ఇతివృత్తంగా తీసుకొని అల్లుకొన్న కథా చిత్రం - ‘గాలిపటం’.

...............................
 చిత్రం - గాలిపటం, తారాగణం - ఆది, ఎరికా ఫెర్నాండెజ్, క్రిస్టినా అఖీవా, రాహుల్ రవీంద్రన్, పాటలు - సీతారామశాస్త్రి, భాస్కరభట్ల, సంగీతం - భీమ్స్ సెసిరోలియో, కెమేరా - బుజ్జి కె., ఎడిటింగ్ - రాంబాబు మేడికొండ, కథ - స్క్రీన్‌ప్లే - మాటలు - సంపత్ నంది, నిర్మాతలు - సంపత్ నంది, కిరణ్ ముప్పవరపు, విజయ్‌కుమార్ వట్టికూటి, దర్శకత్వం - నవీన్ గాంధీ
 ................................


  కథ ఏమిటంటే...

  కార్తిక్ (ఆది) ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. స్వాతి (ఎరికా ఫెర్నాండెజ్) కూడా అదే సంస్థలో పనిచేస్తున్న మరో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని. పైకి ఎంతో బాగున్నట్లుగా, ‘మేడ్ ఫర్ ఈచ్ అదర్’గా కనిపిస్తూ, ‘బెస్ట్ కపుల్ ఆఫ్ ది ఇయర్’గా ఎంపికైనప్పటికీ, వారిద్దరి మధ్య తగాదాలు తక్కువేమీ కాదు. చివరకు ఓ చిరు తగాదా పెద్దదై, వారిద్దరూ తమ మాజీ ప్రేమ కథలనూ, ప్రేమికులనూ గుర్తుచేసుకుంటారు.

  ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళితే... కార్తి, గతంలో పరిణతి అలియాస్ పారు (క్రిసినా అఖీవా)ను ప్రేమిస్తాడు. మరోపక్క స్వాతి కాలేజీ రోజుల్లో తనను గాఢంగా ప్రేమించి, తాను కాదనడంతో విదేశాలకు వెళ్ళిపోయిన ఆరవ్ రెడ్డి (‘అందాల రాక్షసి’ ఫేమ్ రాహుల్ రవీంద్రన్) గురించి ఆలోచిస్తుంది. ఆ పాత ప్రేమలు గుర్తొచ్చాక ఈ పెళ్ళి ఏమైందన్నది మిగతా కథ. భార్యను మోసం చేస్తూ, సహోద్యోగినితోనే సంబంధం పెట్టుకున్న హీరోయిన్ బావ (భరత్‌రెడ్డి)ది సినిమాలో వచ్చే ఉపకథ.

  ఎలా ఉందంటే...

  గతంలో వరుణ్‌సందేశ్ ‘ఏమైంది ఈ వేళ’ (2010), రామ్‌చరణ్ ‘రచ్చ’ (2012) చిత్ర దర్శకుడిగా పేరు తెచ్చుకున్న దర్శకుడు సంపత్ నంది మరో ఇద్దరితో కలసి ఈ చిత్ర నిర్మాణ బాధ్యతలు పంచుకొని, నిర్మాతగా కూడా మారారు. కథ, కథనం, మాటలు కూడా ఆయనవే. ఈ తరం దంపతులు ఎదుర్కొంటున్న ఒక సమస్యను కథగా ఎంచుకోవడంలో, దాన్ని ప్రథమార్ధంలో చెప్పిన తీరులో సమకాలీనత ప్రతిఫలించింది. కానీ, ఆ తరువాత ద్వితీయార్ధానికి వచ్చి, అసలు చర్చ మొదలయ్యేసరికి క్రమంగా పట్టు సడలింది. సాధారణ సినీ ఫార్ములా చిత్రాలకు భిన్నమైన ముగింపు అనుకొన్నప్పుడు, దానికి దారి తీసిన ఘట్టాలను కూడా మరికొంత బలంగా అల్లుకొని ఉంటే, కన్విన్సింగ్‌గా ఉండేదనిపిస్తుంది.

  నటనలో మరింత రాటుతేలాల్సిన యువ హీరో ఆది హుషారుగా నర్తించాడు. కథానాయికలిద్దరూ ఫరవా లేదనిపిస్తారు. కథలో వినోదం కోసం హీరో రూమ్మేట్లు, సర్వర్‌బాయ్ (సప్తగిరి) లాంటి చాలా పాత్రలనే సినిమాలో ఉంచారు. ప్రథమార్ధంలో వాళ్ళ సంభాషణలు, చేష్టలు కొన్నిచోట్ల అతిగా అనిపించినా, కుర్రకారును నవ్విస్తాయి. ‘‘అమ్మాయిలు ఆర్టీసీ బస్సు లాంటివాళ్ళు... ఒకటిపోతే ఒకటి వస్తాయి’’ (హీరో), ‘‘మీ మగాళ్ళు ఆటో లాంటివాళ్ళు... ఒకటి పిలిస్తే పది వస్తాయి’’(హీరోయిన్) లాంటి కొన్ని పంచ్ డైలాగులు హాలులో బాగా పేలతాయి. కానీ వచ్చిన చిక్కేమిటంటే, అన్ని పాత్రలూ పంచ్‌లు మాట్లాడడానికే మాట్లాడుతున్నట్లు ఒకే రకమైన టెంపోతో డైలాగులుండడం! దాంతో, ఒక డైలాగ్‌ను విని ఆనందించి, ఆస్వాదించే లోగానే మరో డైలాగ్ మీదకొచ్చి పడిపోతుంటుంది.

చాలాభాగం సగటు తెలుగు సినిమాల్లో లాగానే ఫ్లాష్‌బ్యాక్ చెప్పేది హీరో పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి అయినా, అందులో హీరోయిన్ కథ కూడా వచ్చేస్తూ ఉంటుంది. అదెలాగని అడగకూడదు... అంతే లెమ్మని సరిపెట్టుకోవాలి. భర్తతో తన సంసారాన్ని చక్కదిద్దుకోవడానికి హీరోయిన్ అక్క పాత్ర సర్దుకుపోతుంది (తెరపై ఎఫెక్టివ్‌గా ఉన్న ఘట్టాల్లో అది ఒకటి) కానీ, తీరా క్లైమాక్స్‌లో చెల్లెలిని మాత్రం సర్దుకోవద్దని చెబుతుంది. ఇక, బామ్మలతో తాగించడం, పిల్లాడితో మరీ అతిగా మాట్లాడించడం, బాత్రూమ్‌లో నుంచి మూలుగుల లాంటి వాటిని సగటు ప్రేక్షకులు ఎంతవరకు జీర్ణించుకుంటారో చెప్పలేం. అవి ప్రేక్షకుల స్థాయిని తక్కువగా అంచనా వేసి, సినిమా స్థాయిని తగ్గించేవే తప్ప, పెంచేవి కావు.

  కెమేరా, సంగీతం లాంటివి కథకు తగినట్లుగానే ఉన్నాయి. అద్నాన్ సామీ గొంతులో వచ్చే ‘ఏం హుషారు..’ పాట వెరైటీగా వినిపిస్తుంది. అయితే, ఒకటి రెండు చోట్ల పాటలు కథాగమనానికి అడ్డు పడ్డాయి. ద్వితీయార్ధంలో వచ్చే ‘జబర్దస్త్’ రిహార్సల్ సీన్ కాలక్షేపానికే తప్ప, కథలోని ప్రధానాంశంపై చర్చను తరువాతి దశకు తీసుకువెళ్ళేవిగా అనిపించవు. స్క్రిప్టు దశలో కాకపోయినా, కనీసం చిత్రీకరణ తరువాతైనా వాటిని ఎడిటింగ్ చేస్తే, బిగువుగా ఉండేది. ఏతావతా, హిందీ చిత్రం ‘షాదీ కే సైడ్ ఎఫెక్ట్స్’ ప్రేరణ ప్రారంభంలోనే కనిపించే ఈ చిత్రంలో ఎంచుకున్న కథకు తగ్గట్లే తొలి గంటంబావులోనే అయిదు ప్రణయ ఘట్టాలున్నాయి. సెన్సార్ వారి ఆడియో, వీడియో కట్‌లతో ‘ఏ’ సర్టిఫికెట్ అందుకున్న ఈ రెండుబావు గంటల చిత్రం ఎంచుకున్న కథ రీత్యా కుటుంబాలకు సంబంధించినదైనా, ఆస్వాదించేది కుర్రకారే అనిపిస్తుంది. ద్వితీయార్ధంలోని కథనలోపాలు లేకుండా ఉంటే ఈ ‘గాలిపటం’ మరింత బాగా ఎగిరేదనిపిస్తుంది.

 - రెంటాల జయదేవ

 బలాలు - 1. ఎంచుకున్న కథాంశం 2. ఆధునిక సమాజంలో కొన్ని వర్గాల్లో జరుగుతున్నవి ధైర్యంగా చూపడం 3. గుర్తుండిపోయే కొన్ని డైలాగులు

 బలహీనతలు - 1. కన్విన్సింగ్‌గా లేని కథనం 2. రాసుకున్న సన్నివేశాలపై అమిత ప్రేమ మింగేసిన ఎడిటింగ్ 3. రచయిత ప్రభావం మితి మీరి, పాత్రలన్నీ ఒకేలా మాట్లాడేయడం 4. కుటుంబ ప్రేక్షకుల్ని ఇబ్బంది పెట్టే ఘట్టాలు
 ...........................................

(Published in 'Sakshi' daily, 9th Aug 2014, Saturday)
................................................

ప్రేక్షకుల వేలు విడవని నటుడు - ‘సుత్తివేలు’

ప్రేక్షకుల వేలు విడవని నటుడు
సందర్భం: ‘సుత్తివేలు’ జయంతి

ఒక పాత్ర, ఒక మేనరిజమ్ ద్వారా ఒక నటుడి పేరే మారిపోవడం, చరిత్రలో ఆ పేరుతోనే మిగిలిపోవడం చాలా చిత్రమైన విషయం. సినీ చరిత్రలో అలాంటి అదృష్టం దక్కిన అరుదైన కొందరు నటుల్లో సుత్తివేలు ఒకరు. కురుమద్దాలి లక్ష్మీ నరసింహారావు అనే అసలు పేరుతో ఆయన తెలిసింది చాలా కొద్దిమందికే. ‘వేలెడంత లేవు? ఏమిటీ అల్లరి?’ అంటూ చిన్నప్పుడు చుట్టుపక్కలవాళ్ళు పిలవడంతో ‘వేలు’ అనే ముద్దుపేరుతోనే ప్రసిద్ధుడైన బక్కపల్చటి మనిషి ఆయన. అయితే, ఆకారానికి ఆంగికాభినయ ప్రతిభ తోడై, దర్శక - రచయిత జంధ్యాల ‘నాలుగు స్థంభాలాట’లోని పాపులర్ ఊతపదం ‘సుత్తి’తో ఆయన క్రమంగా ‘సుత్తి’వేలుగా జనంలో స్థిరపడ్డారు. తోటి నటుడు ‘సుత్తి’ వీరభద్రరావుతో కలసి ‘సుత్తి’ జంటగా 1980 - ‘90లలో సినీసీమను కొన్నేళ్ళు ఏలారు.

కృష్ణాజిల్లా చల్లపల్లి దగ్గరలోని భోగిరెడ్డిపల్లెలో 1947 ఆగస్టు 7న పుట్టిన సుత్తివేలు నటనలో అంత సద్యస్ఫూర్తి, సహజత్వం పలకడానికి కారణం - రంగస్థల అనుభవమే. చదువుకొనే రోజుల నుంచి వేసిన నాటకాలు ఆయనకు పేరు తెచ్చాయి. చిన్నతనమంతా మచిలీపట్నంలో గడిపిన ఆయన నాటకాల దెబ్బకు చదువు అటకెక్కి, ఎలాగోలా మెట్రిక్ అయిందనిపించి, హైదరాబాద్, బాపట్ల సహా ఎన్నోచోట్ల ఎన్నెన్నో చిరుద్యోగాల తరువాత ఆఖరుకు విశాఖపట్నం ‘నావల్ డాక్ యార్డ్’లో స్టోర్ కీపర్‌గా తేలారు. ‘మనిషి నూతిలో పడితే’ నాటకంలోని అభినయ ప్రతిభ దర్శకుడు జంధ్యాల ద్వారా తొలి సినీ అవకాశమూ ఇప్పించింది. అలా ‘ముద్దమందారం’గా మొదలైన ప్రస్థానం ‘నాలుగు స్థంభాలాట’ నాటి ‘సుత్తి’తో జోరందుకుంది.

కొన్ని పదుల చిత్రాల్లో ‘సుత్తి’ జంట ప్రేక్షకుల్ని నవ్వుల్లో ముంచెత్తితే, మరెన్నో చిత్రాల్లో వేలు - నటి శ్రీలక్ష్మి కాంబినేషన్ సూపర్‌హిట్టయింది. ‘‘అనుక్షణం వీరభద్రరావు వెన్నంటి ఉంటూ, పరిశీలించడం ద్వారా ఎంతో నేర్చుకున్నా’’ అని వేలే అంగీకరించారు. వీరభద్రరావు అందించిన సలహాలు, సూచనలు తనకెంతో ఉపకరించాయని అప్పట్లోనే చెప్పిన వేలు, తమ కాంబినేషన్ సన్నివేశాలు పండడం కోసం ఇద్దరం కలిసే డబ్బింగ్ చెప్పేవాళ్ళమని వెల్లడించారు. అప్పట్లో ‘నాలుగుస్థంభాలాట’లోని వారి డైలాగులు క్యాసెట్‌గా వచ్చి, బాగా అమ్ముడయ్యాయి.

కానీ, వేలును హాస్యానికే పరిమితం చేసి చూడడం ఆయనలోని నటుణ్ణి అవమానించడమే అవుతుంది. కావాలంటే, ‘ప్రతిఘటన’లోని పిచ్చివాడైన కానిస్టేబుల్ పాత్ర చూడండి. ‘వందేమాతరం’లోని ఉత్తమ సహాయ నటుడిగా నంది అవార్డును అందించిన పాత్రను గమనించండి. 1980లలో జనాన్ని ఆలోచనల్లోకి నెట్టిన ‘ఈ పిల్లకు పెళ్ళవుతుందా?’, ‘ఈ చదువులు మాకొద్దు’ లాంటి సినిమాలు ఏ టీవీలోనో వస్తే ఇంకొక్కసారి పరిశీలించండి. ‘కలికాలం’లో మధ్యతరగతి తాతయ్య పాత్రను పరికించండి. ‘ఒసేయ్ రాములమ్మ’లో రాములమ్మ తండ్రి పాత్రను మరోసారి చూడండి. క్యారెక్టర్ నటుడిగా ఆయనలోని వైవిధ్యం అర్థమవుతుంది. కరుణరసాన్ని కూడా కంటి చూపులతోనే ఆయన ఎలా పలికించేవాడో అనుభవంలోకి వస్తుంది.


గుండె గదుల్లో వేదాంతం, ఒకింత విషాదం, జీవిత విచారం గూడుకట్టుకున్నవారే హాస్యాన్ని అలవోకగా పలికించగలరనడానికి సుత్తివేలు మరో ఉదాహరణ. వీరభద్రరావు మరణం (1988), ఆ తరువాత జంధ్యాల జోరు తగ్గడం, చిత్ర పరిశ్రమ మద్రాసు నుంచి హైదరాబాద్‌కు మారడంతో క్రమంగా వెనుకబడ్డ వేలు ఆ తరువాత మునుపటి ప్రాభవాన్ని సంపాదించడానికి చాలానే కష్టపడ్డారు. కానీ, మళ్ళీ ఆ వెలుగు రాలేదు. తొలి రోజుల్లో దూరదర్శన్‌లో ‘ఆనందోబ్రహ్మ’లో వెలిగిన వేలు చరమాంకంలో భార్య, ముగ్గురమ్మాయిలు, ఒక అబ్బాయితో సంసారాన్ని ఈదడం కోసం టీవీ సీరియల్స్‌ను ఆశ్రయించారు.

2012 సెప్టెంబర్ 16న తన 66వ ఏట కన్నుమూసే దాకా పాత్రల కోసం ఆయన జీవన పోరాటం ఆగలేదు. ఆంగ్ల రచయిత షేక్‌స్పియర్ అంటే అభిమానం, మద్రాసులో ఆంతరంగికులతో ఏ సాయంత్రమో కలిసినప్పుడు రాగయుక్తంగా పద్యాలు, పాటల గానం, ఆగని ఛలోక్తుల జడివానతో సందర్భాన్ని రసభరితం చేయడం వేలు ప్రత్యేకత. ఇవాళ్టికీ ‘రెండు జెళ్ళ సీత’, ‘శ్రీవారికి ప్రేమలేఖ’, ‘ఆనందభైరవి’, ‘రెండు రెళ్ళు ఆరు’, ‘సీతారామ కల్యాణం’, ‘చంటబ్బాయ్’ లాంటి సినిమాలు చూస్తే, తెలుగు తెరను ఆయన చిరస్మరణీయం చేసిన ఘట్టాలెన్నో కనిపిస్తాయి. ఆ సన్నివేశాల్లో ఇవాళ్టికీ ఆయన ప్రేక్షకుల వేలు విడవని అభినయ చిరంజీవే!

(Published in 'Sakshi' daily, 7th Aug 2014, Thursday)
............................................

Wednesday, August 6, 2014

కాస్త... ముందుకు! మరికాస్త... వెనక్కు!! (సినిమా రివ్యూ: ‘రన్ రాజా రన్’)

తారాగణం: శర్వానంద్, శీరత్ కపూర్, ఎడిటింగ్: మధు, నిర్మాతలు: ప్రమోద్ ఉప్పలపాటి, వంశీకృష్ణారెడ్డి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సుజీత్
..........................................................
కొత్త దర్శకులు, కొత్త తరం కథకులు వస్తున్నప్పుడు వెండితెర కొత్తగా వెలుగులీనే అవకాశం ఉంటుందని చిన్న ఆశ ఉంటుంది. వాళ్ళ సినిమా వస్తోందంటే, కొత్తదనం కోరుకొనేవారికి ఎదురుచూపులుంటాయి. లఘు చిత్రాల ద్వారా మొదలుపెట్టి ఫీచర్ ఫిల్మ్‌కు ఎదిగిన దర్శకుడు సుజీత్ ‘రన్ రాజా రన్’ విషయంలోనూ అదే జరిగింది.

కథ ఏమిటంటే... రాజా (శర్వానంద్) ఓ కూరగాయల వ్యాపారి కొడుకు. నగర పోలీస్ కమిషనర్ దిలీప్ (సంపత్‌రాజ్) కూతురు ప్రియ (శీరత్ కపూర్)ను ప్రేమిస్తాడు. మరోపక్క నగరంలో వరుసగా జరుగుతున్న ప్రముఖుల కిడ్నాప్‌లు జరుగుతుంటాయి. ఆ కిడ్నాప్‌ల గుట్టు ఛేదించడానికి కమిషనర్ కుస్తీ పడుతుంటాడు. అతని కూతుర్ని ప్రేమించానంటూ వెళ్ళిన హీరోకు కమిషనర్ ఓ కిడ్నాప్ డ్రామా పని అప్పజెపుతాడు. హీరోయిన్‌నే కిడ్నాప్ చేస్తాడు హీరో. ఆ తరువాత కథేమిటన్నది రకరకాల ట్విస్టుల మధ్య సాగే సినిమా.

ఎక్కువగా వినోదాత్మక ఫక్కీలో నడపాలని దర్శకుడు బలవంతాన ప్రయత్నించిన ఈ సినిమాలో హీరో శర్వానంద్ చూడడానికి బాగున్నాడు. అయితే, కొన్నిచోట్ల హెయిర్‌స్టైల్‌లో, హావభావాల్లో తమిళ సూర్యను అనుసరించినట్లు అర్థమైపోతుంటుంది. ఇక, హీరోయిన్ శీరత్ కపూర్ కొత్తమ్మాయి. అభినయంతో పాటు అందమూ తక్కువే. అభినయం తక్కువైనా కథ రీత్యా అడివి శేషుది మరో ముఖ్యపాత్ర. కమిషనర్‌గా సంపత్‌రాజ్, హీరో తండ్రిగా వి. జయప్రకాశ్ అలవాటైన తమిళ ప్రాంతీయ సినీశైలిలో ఫరవాలేదనిపిస్తారు.


ఎలా ఉందంటే... తమిళ, తెలుగు ద్విభాషా చిత్రంగా విడుదల చేయాలనో ఏమో అక్కడి నటులనూ తీసుకున్నారు. వీలున్నప్పుడల్లా హాలులో రజనీకాంత్ నామస్మరణ వినిపిస్తుంది. తమిళ హీరో కార్తి తదితరుల పోస్టర్లూ కనిపిస్తాయి. తమిళ ఫక్కీ సినీ కథన ధోరణి సరేసరి. మది ఛాయాగ్రహణం, గిబ్రాన్ సంగీతం కొత్తగా అనిపిస్తాయి. ముఖ్యంగా పాటల చిత్రీకరణ బాగుంది. ఇప్పటికే పాపులరైన ‘అనగనగనగా అమ్మాయుందిరా’ పాట (రచన శ్రీమణి) చిత్రీకరణ, విలక్షణమైన గొంతు (గోల్డ్ దేవరాజ్)తో పాడించిన తీరు ఆకట్టుకుంటాయి. రామజోగయ్య రాసిన మెలోడీ ‘వద్దంటూనే’ గాయని చిన్మయి గొంతులో వినడానికీ, తెరపై చూడడానికీ బాగుంది. పాటల్లో గొంతులు కొత్తగా అనిపిస్తాయి. అక్కడక్కడ డైలాగ్‌‌స నవ్విస్తాయి.

కాస్త...కాలక్షేపం! చాలా... కాలహరణం! ప్రథమార్ధం కాలహరణంగా నడిచే సినిమా, సెకండాఫ్‌లో ఫక్తు కాలక్షేపంగా ఫరవాలేదనిపిస్తుంది. కానీ, చివరకొచ్చేసరికి ఆ భావన కూడా బలంగా నిలబడదు. దర్శకుడి అనుభవ రాహిత్యం వల్లనో, లేక అది వినోదమని భ్రమపడడం వల్లనో ఏమో, కథకు అక్కరలేని సన్నివేశాలు కూడా సినిమాలోకి తరచూ చొచ్చుకు వచ్చేస్తుంటాయి. వాటిని స్క్రిప్టు దశలో కాకపోయినా, ఎడిటింగ్ టేబుల్ మీదైనా కత్తిరించుకోవాల్సింది. పోలీసు కమిషనర్, మంత్రి, ఎమ్మెల్యే - ఇలా అందరూ బఫూన్ల లాగా వ్యవహరిస్తారు.

ప్రత్యర్థిని అడ్డుకొనేందుకు ఈ వీరశూరసేనులు చేసిందేమీ కనిపించదు. దాంతో, కథలో పాత్రల మధ్య ఆసక్తికరమైన సంఘర్షణ ఏదీ లేకుండా పోయింది. చిత్ర నిర్మాణ విలువలు గణనీయంగానే ఉన్న సినిమా ఇది. రొమాంటిక్ కథగా మొదలై సమాంతరంగా సస్పెన్స్‌ను కొనసాగించి, చివరకొచ్చేసరికి రొటీన్ పగ- ప్రతీకారాల వ్యవహారంగా తేల్చేయడంతో ఈ కథ ఓ పట్టాన సంతృప్తినివ్వదు. కూరగాయలమ్మే వాడి కొడుకు ఇంత ఆధునికంగా ఉన్నాడేమిటి, ఫలానా పాత్ర ఫలానాలా ప్రవర్తిస్తోందేమిటి లాంటి సందేహాలొస్తాయి. చివరలో వాటన్నిటికీ లాజిక్‌లు చెప్పడానికి దర్శకుడు ప్రయత్నించినా అప్పటికే ఆలస్యమైపోయింది. కొత్తదనం కోసం మరీ విపరీతమైన ట్విస్టులు పెట్టేస్తే ఇబ్బందేనని కథ, కథనం తేల్చేస్తాయి. వెరసి, బాగోగులు రెండూ ఉన్న ఈ చిత్రం జనాన్ని పరిగెత్తించేది ఎటువైపో?

బలాలు:  కథను వినూత్నంగా చెప్పాలన్న ప్రయత్నం  శర్వానంద్ నటన  కొత్తగా ధ్వనించే గిబ్రాన్ సంగీతం, గాయకుల గొంతు   మది కెమేరా పనితనం, పాటల చిత్రీకరణ

బలహీనతలు:  సాగదీత కథనశైలి  గందరగోళపెట్టే అతి ట్విస్టులు, ఆఖరికి రోలింగ్ టైటిల్స్‌లోనూ సా...గిన కథ  ఆఖరుకు పగ, ప్రతీకారాల కథగా మిగలడం  పాత్రలు ఎప్పుడుపడితే అప్పుడొచ్చి, వెళ్ళిపోతుండే సీన్లు  మొద్దుబారిన ఎడిటింగ్ కత్తెర  హీరోయిన్

 - రెంటాల జయదేవ

(Published in "Sakshi' daily, 2nd Aug 2014, Saturday)
......................................

Tuesday, August 5, 2014

మాయ ----- కొద్దిసేపే ‘మాయ’ (సినిమా రివ్యూ)

తారాగణం: హర్షవర్ధన్ రాణే, అవంతికా మిశ్రా, కెమేరా: బాల్‌రెడ్డి, నిర్మాతలు: ఎం.వి.కె. రెడ్డి, ‘మధుర’ శ్రీధర్, రచన,దర్శకత్వం: నీలకంఠ
......................................


విభిన్నమైన కథలు, వాటిని విచిత్రంగా నడిపిస్తూ తెరపై చూపే శైలి హాలీవుడ్ చిత్రాలకు అలవాటే. కానీ, అలాంటి దోవలో ప్రయాణించడం తెలుగు తెరపై అరుదు. అలాంటి అరుదైనయత్నం చేయడానికి సిద్ధపడినప్పుడు, ప్రేక్షకుడికి ఆశ్చర్యమో, ఆనందమో కలగాలి. అలాకాక, కేవలం ఇంగ్లీష్ చిత్రాల అనుసరణే వరకే ఆ ప్రయోగశీలతను పరిమితం చేస్తే, ఇబ్బంది. ఈ నేపథ్యంలో నుంచి ‘మాయ’ను చూడాలి.

కథలోకి వస్తే... జరగబోయేది ముందే తెలిస్తే..? అలాంటి దృష్టి ఎవరికైనా ఉంటే..? మేఘన (అవంతికా మిశ్రా)కు చిన్నప్పటి నుంచి అతీంద్రియ దృష్టి (ఎక్స్‌ట్రా సెన్సరీ పర్‌సెప్షన్ - ఇ.ఎస్.పి) ఉంటుంది. చిన్నప్పుడు ఓ దుర్ఘటనలో అమ్మ ప్రాణాలు కోల్పోనుందన్న సంగతి కూడా చిన్నప్పుడే తెలిసిన అమ్మాయి ఆమె. పెద్దయ్యాక ‘టీవీ 21’లో రిపోర్టర్‌గా సామాజిక అంశాలపై పోరాటం చేస్తుంటుంది. ఆమె జీవితంలోకి ఫ్యాషన్ డిజైనర్ సిద్ధార్థ వర్మ అలియాస్ సిద్ధూ (హర్షవర్ధన్ రాణే) ప్రవేశిస్తాడు. వారిద్దరి మధ్య ప్రేమ మొదలవుతుంది. ఇంతలో అతనికి కాబోయే భార్యనంటూ మేఘన చిన్నప్పటి ఫ్రెండ్ పూజ (సుష్మా రాజ్) ప్రవేశిస్తుంది. పూజ జీవితంలో జరగబోయే ఓ ఘటన మేఘన ఇ.ఎస్.పికి ముందే అందుతుంది. సిద్ధూకు ఓ భయంకరమైన గతం ఉందని తెలుస్తుంది. అప్పుడేమైందన్నది మిగతా కథ.

ఎలా చేశారంటే... కాస్తంత నెగటివ్ టచ్ ఉన్న పాత్రలకు ఇప్పుడిక హర్షవర్ధన్ రాణే కొత్త చిరునామాగా మారాడనుకోవచ్చు. ముగ్గురు కొత్త నాయికలూ చూడడానికైతే బాగానే ఉన్నారు. అంతకు మించి ఆశిస్తే కష్టం. సస్పెన్స్‌తో నిండిన ఈ థ్రిల్లర్‌కి సంగీతం, కెమేరా వర్క్, సౌండ్ ఎఫెక్ట్‌లు ప్రాణం పెట్టాయి. సందర్భోచిత గీతాలు కొన్ని పెట్టారు కానీ, అందులో ఒకటి రెండైతే నిడివినీ, ప్రేక్షకుల అసహనాన్నీ పెంచడానికే ఉపకరించాయి.

ఏ సీనుకు ఆ సీనే... ఆసక్తికరమైన ప్రారంభ దృశ్యంతో వెండితెరపై ‘మాయ’ మొదలవుతుంది. అక్కడ చిన్నారి మేఘన పాత్రధారితో చేయించిన అభినయం, సౌండ్ ఎఫెక్ట్‌లు బాగున్నాయి. అలా ఆసక్తికరమైన అనుభవం కోసం మొదలైన ప్రేక్షకుల జర్నీ కాసేపటికే ఇది ప్యాసింజర్ బండిలో ప్రయాణంగా మారుతుంది. అప్పుడే ప్రథమార్ధం అయిపోయిందా అనిపించే ఈ సినిమా ఆ తరువాత క్రమంగా గాడి తప్పుతుంది. ఆ తరువాత మళ్ళీ మునుపటి ‘మాయ’ కనిపించే ఘట్టాలు తక్కువే. దర్శక, రచయిత ఏ సీను రాసుకున్నప్పుడు ఆ సీనుకు తగ్గట్లు పాత్రలు ప్రవర్తిస్తూ ఉంటాయి.


సిద్ధూ పాత్ర లాంటివి పాజిటివ్, నెగటివ్‌లకు రెంటికీ కాకుండా పోయాయి. అప్పటి దాకా జరగబోయేది  తెలుస్తున్న నాయికకు ఉన్నట్టుండి, జరిగిపోయిన సంఘటన తెలియడమనేది నప్పని విషయం. కథ నడిపించడం కోసం దర్శక, రచయిత తనకు తాను కల్పించుకున్న ఓ వెసులుబాటు. అలాగే, ఎన్నో ఏళ్ళ క్రితం చిన్నప్పటి ఫ్రెండైన కథానాయికను పూజ పాత్ర చటుక్కున ఎలా గుర్తించేస్తుందని అడగకండి. ఇక, ద్వితీయార్ధంలో ఫ్యాషన్ షో ఎపిసోడ్ దగ్గర ‘ఢిల్లీ, రాత్రి వేళ...’ అంటూ వేసిన లొకేషన్ ఇండికేషన్ టైటిల్ మరింత గందరగోళం రేపింది.

కథ ఆ క్షణానికి జరుగుతున్నది ఢిల్లీలోనా, హైదరాబాద్‌లోనా అన్నది అర్థం కాదు. సిద్ధూ పాత్ర, పోలీసు అధికారి కలసి చివరలో వెతుకులాట, ‘చంపడం మినహా మరో మార్గం లేద’నుకోవడం లాంటి వాటికి కథలో సరైన భూమిక లేదు. చివరలో నాయిక పాత్ర ద్వారా వేరొకరి ద్వారా సస్పెన్స్ ముడిని విప్పించడం తృప్తినివ్వదు. వెరసి, మూడు ముఖ్య పాత్రలు, వారి వారి కోణాల నుంచి కథ నడవడమనే అంశం బాగుందనిపించినా, రెండు గంటల సినిమా చూశాక, అర్ధాకలితో బయటకొచ్చిన భావనే మిగులుతుంది.

బలాలు:  విలక్షణమైన కథాంశం.  సౌండ్ ఎఫెక్ట్‌లు  తెరపై సినిమాను రిచ్‌గా కనిపించేలా చూపిన నాణ్యమైన నిర్మాణం

బలహీనతలు:  అతి నిదా...నంగా సాగే చిత్ర కథనం  అందరూ కొత్త ముఖాలే కావడం  ఆకట్టుకోని హీరోయిన్ నటన  ఖంగాళీగా సాగే ద్వితీయార్ధం.

 - రెంటాల జయదేవ

(Published in 'Sakshi' daily, 2nd Aug 2014, Saturday)
.........................

Monday, August 4, 2014

పెళ్లంటే... దేవిశ్రీ ప్రసాద్ ‘ఆ.. ఊ..’ అంటాడు! - తండ్రి, సినీ రచయిత జి. సత్యమూర్తి

దేవిశ్రీ ప్రసాద్... దేవి... డీఎస్పీ... ఆప్యాయంగా ఒక్కొక్కరు ఒక్కొ రకంగా పిలిచే ఆయన... సమకాలీన సినీ సంగీత ప్రపంచంలో ఒక ఉత్తుంగ తరంగం. టీనేజ్‌లోనే సంగీత దర్శకుడై, ఈ పదిహేనేళ్ళలో తెలుగు, తమిళ, హిందీ చిత్రసీమలన్నిటిలో తనదైన ప్రత్యేక ముద్ర వేసిన ప్రతిభావంతుడు. ఎంత ఎదిగినా ఇప్పటికీ అమ్మానాన్న అంటే గౌరవం.తమ్ముడు, చెల్లెలంటే తరగని అనురాగం దేవిశ్రీ సొంతం. ఇవాళ ఈ సంగీత సంచలనం పుట్టినరోజు. ఈ సందర్భంగా ఇంట్లో ఆ మ్యూజిక్ మెజీషియన్ ప్రేమానురాగాల గురించి తండ్రి, సినీ రచయిత జి. సత్యమూర్తి మనోభావ సంచలనం...
 
మా అబ్బాయి దేవిశ్రీ ప్రసాద్‌కు చిన్నప్పటి నుంచి సంగీతమంటే బాగా ఆసక్తి. చిన్నప్పుడు ఇంట్లోనే గాజు గ్లాసులు అవి తీసుకొని వాటి మీద శబ్దాలు చేస్తూ, వాటిని క్యాసెట్ రికార్డర్‌లో రికార్డ్ చేసేవాడు. ఆ శబ్దాలన్నిటినీ కలిపి, వాడికి వాడే ట్యూన్లు సిద్ధం చేసుకొని, క్యాసెట్ ప్లేయర్‌లో పెట్టి వినిపించేవాడు. మా ఆవిడ శిరోమణి వాళ్ళ తాతగారు డాక్టర్ చిన వెంకన్న గాయకులు. అలాగే, మా అత్త గారు అంటే, దేవిశ్రీ వాళ్ళ అమ్మమ్మ దేవీ మీనాక్షి కూడా మంచి శాస్త్రీయ సంగీత గాయని. ఇక, మా నాన్న గారు డాక్టర్ సూర్యనారాయణ మంచి గిటార్ ప్లేయర్. నేను కూడా పాడేవాణ్ణి. గిటార్ వాయించేవాణ్ణి. రాయడం, స్వరాలు కూర్చడం లాంటివన్నీ చేసేవాణ్ణి. మాదేమో రామచంద్రాపురం దగ్గర వెదురుపాక. మా అత్తగారి ఊరు అమలాపురంలో ఇంటి దగ్గర ఎప్పుడూ ఆ రకమైన సంగీత వాతావరణమే. మా అత్త గారు, నేను అక్కాతమ్ముళ్ళ లాగా కూర్చొని పాటలు పాడుకొనే వాళ్ళం. మా రెండు వైపు కుటుంబాల నుంచి సంగీతం మా వాడికి వారసత్వంగా వచ్చిందనిపిస్తూ ఉంటుంది. మా అత్తగారి పేరులోని ‘దేవి’, మా మామ గారైన ప్రసాదరావు పేరులోని ‘ప్రసాద్ తీసుకొని, వాడికి ‘దేవిశ్రీ ప్రసాద్’ అని పేరు పెట్టా.

పది నెలల వయసులోనే పాట

గమ్మత్తై విషయం ఏమిటంటే, మా వాడికి పది నెలల వయసులోనే మాటలు వచ్చేశాయి. ఆశ్చర్యంగా అనిపించవచ్చు కానీ, మాటలే కాదు, పాటలు కూడా పాడేవాడు. అప్పట్లో ‘మన ఊరి పాండవులు’ సినిమా వచ్చింది. ఆ సినిమాలోని పాటలు పాడేవాడు. అలాగే, ఊళ్ళో గ్రామ్‌ఫోన్‌లో పాటలు విని, డ్యాన్సులు చేసేవాడు. సంగీతం మీద వాడి ఆసక్తి చూసి, వాడి ఉత్సాహాన్ని మేమెప్పుడూ కాదనలేదు.

చిన్నప్పటి నుంచే వాడికి సంగీత దర్శకుణ్ణి కావాలని కోరిక. ఆరో తరగతిలో ఉండగానే, పెద్దయ్యాక ఏమవుతావని స్కూల్లో అడిగితే, ‘మ్యూజిక్ డెరైక్టర్‌ని అవుతా’ అని చెప్పాడు. చిన్నప్పుడు మా పిల్లలు ముగ్గురూ (దేవిశ్రీ, సాగర్, పద్మిని) ఇంటి దగ్గరే ఒక ఆవిడ దగ్గర కర్ణాటక సంగీతంలో ప్రాథమిక పాఠాలు నేర్చుకున్నారు. అప్పట్లో ‘మాండొలిన్’ శ్రీనివాస్ గారు మా ఇంటికి దగ్గరలో ఉండేవారు. దేవిశ్రీ సంగీతాసక్తి చూసి, ఆయన దగ్గరకు మా ఆవిడ తీసుకువెళ్ళింది. దేవిశ్రీకి ఆయన మాండొలిన్ వాద్యం నేర్పారు. కీ-బోర్‌‌డలు, గిటార్‌తో సహా మిగతావన్నీ గురువులు లేకుండా వాడు సొంతంగా నేర్చుకున్నవే. మా వాడు మద్రాసులో హబీబుల్లా రోడ్‌లో వెంకట సుబ్బారావు స్కూలులో ప్లస్ 2 దాకా చదివాడు. ఆటలు, పాటలు - ఇలా అన్నింటిలో వాడు ముందుండేవాడు. పెయింటింగ్‌‌స ఎక్కువగా వేసేవాడు. ఎన్నో ప్రైజులొచ్చాయి. స్కూల్ పీపుల్స్ లీడర్ కూడా వాడే.

వాడు ఏది చేసినా కరెక్టే...

చిన్నప్పటి నుంచి వాడు ఏ విషయంలోనైనా సరే చాలా ఫోకస్డ్‌గా ఉండేవాడు. వాడికి నచ్చితేనే ఏదైనా చేస్తాడు. నచ్చకపోతే చేయడు. వాడు ఏం చేసినా, అది కరెక్ట్‌గా చేస్తాడని తల్లితండ్రులమైన మాకు తెలుసు.  అందుకే, వాడికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చాం. వాణ్ణి సొంతంగా నిర్ణయాలు తీసుకో నిచ్చాం. ఇంట్లో నా గది, వాడి గది పక్కపక్కనే. నిర్మాత ఎం.ఎస్. రాజు గారు మా ఇంటికి వచ్చినప్పుడు వాడి గదిలో నుంచి సంగీత వాద్యాల శబ్దాలు విని, వాడి దగ్గరకు వెళ్ళి ఒక సందర్భానికి ట్యూన్ అడిగారు. రెండు రోజుల్లో వాడిచ్చిన ట్యూన్ విని, ‘మీ అబ్బాయిని మ్యూజిక్ డెరైక్టర్‌ని చేస్తున్నా’ అన్నారు. దేవిశ్రీ అప్పుడే ప్లస్ 2 పరీక్షలయ్యాయి. తరువాత చదువు కోసం చూస్తుండగా, ఇది జరిగింది. ‘అంత చిన్నవాడికి అంతటి బాధ్యతా’ అని నేను అంటే, ‘మరేం ఫరవాలేద’ని రాజు గారు తొలి అవకాశమిచ్చారు. అలా వాడు ‘దేవి’ చిత్రంతో టీనేజ్‌లోనే సంగీత దర్శకుడై, సక్సెస్ సాధించాడు. ఇవాళ దేశమంతటా పేరు సంపాదించాడు.

మాటలను తిరగేసి రాయడం, తిరగేసి పలకడం లాంటి తమాషాలు చేసేవాడు. ‘కొత్తగా పదాలు సృష్టించాలిగా’ అనేవాడు. ఇప్పటికీ ఏదైనా పాట రాస్తే ముందుగా నాకే చూపిస్తాడు. అయితే, తాను రాశానని ముందుగా చెప్పడు. ‘ఇది వినండి’ అంటూ వినిపిస్తాడు. వాడి శైలి గ్రహించి, ‘ఇది నువ్వే రాశావు కదా’ అంటే, అప్పుడు అవునంటాడు.

వాడు ఇంత వాడవుతాడని మేమూ ఊహించలేదు. కానీ, ఇంత పేరొచ్చినా, ఇప్పటికీ ఇంట్లో అల్లరి చేస్తూ, అందరితో సరదాగా ఉంటాడు. సామాన్యుడిలా ప్రవర్తిస్తాడు. ఇంట్లో పనిచేసే వాళ్ళ దగ్గర నుంచి ఎవరినీ నొప్పించడు. బాధ పెట్టేలా మాట్లాడడు. ఇక, కుటుంబం పట్ల వాడికి ఉన్న ఆప్యాయత, అక్కర మాటల్లో చెప్పలేం. సొంతాని కంటూ ఏమీ చూసుకోడు. మాకు ఏదో చెయ్యాలనుకుంటుంటాడు. ఏదైనా సరే ముందుగా అమ్మానాన్నలమైన మాకే చెబుతాడు. అందరికీ చెప్పాలి, చెందాలి అనుకున్నప్పుడు, తమ్ముడు, చెల్లెలొచ్చేదాకా ఆగి, అప్పుడు పెదవి విప్పుతాడు.

అన్నీ సర్‌ప్రైజ్‌లే...
 
వాడు మాకు ఇచ్చిన కానుకలు అన్నీ ఇన్నీ కావు. ఏది చేసినా, అన్నీ సర్‌ప్రైజ్‌లే. గత ఏడాది మే 24న నా పుట్టిన రోజుకు సర్‌ప్రైజింగ్ గిఫ్ట్ ఇచ్చాడు. 23వ తేదీ అర్ధరాత్రి నాతో కేక్ కట్ చేయించి, కొత్త కారు ఇంట్లోకి తెచ్చాడు. చూస్తే, ఒక కొత్త ఇన్నోవా కొని, నాకు సౌకర్యంగా లోపల లాంజ్‌లాగా ఉండేలా దాన్ని ప్రత్యేకంగా డిజైన్ చేయించాడు. మొన్న మార్చి 12తో దేవిశ్రీ తొలి సినిమా విడుదలై 15 ఏళ్ళయింది. అప్పుడు నా కోసం మా అల్లుడైన ఆర్కిటెక్ట్ వివేక్‌తో ప్రత్యేకంగా మ్యూజికల్ సింబల్స్ డిజైన్ వేయించుకొని, సరిగ్గా అలాగే ఉండేలా నగల షాపుకు వెళ్ళి  బ్రేస్‌లెట్ చేయించాడు. నాకేమో అలాంటి సింబల్స్‌తోనే వజ్రాల గాజులు చేయించాడు. మా దగ్గర తప్ప ఎవరి దగ్గరా అలాంటివి ఉండకూడదని అలా ప్రత్యేకంగా డిజైన్ చేయించాడు. అలాంటి పనులు చేసి, మమ్మల్ని సంతోషపెడుతుం టాడు. ప్రతి విషయంలో దేవిశ్రీకి పక్కనే తమ్ముడు సాగర్ ఉండాల్సిందే. అలాగే, చెల్లెలు పద్మిని అంటే వాడికి ప్రాణం. దాని మాట వాడికి వేదవాక్కు. వాళ్ళ ముగ్గురూ ఒక జట్టు.

దేవిశ్రీ బావ లాగానే చెల్లెలు కూడా ఆర్కిటెక్టే. యూర ప్‌కు చెందిన ఒక సంస్థకు ఇండియాలో హెడ్ ఆఫ్ డిజైన్‌గా పనిచేస్తోంది. చిన్నప్పుడు దేవిశ్రీకి ఫోటోలు తీయడం, పాటల వీడియోలు చిత్రీకరించడమంటే మహా ఇష్టం. చెల్లెలికి పరీక్షలున్నా సరే వినకుండా, దానితో రకరకాల దుస్తులు వేయించి, ఫోటోలు తీసేవాడు. పిల్లలు ముగ్గురూ కలసి కూర్చొంటే, ఇవాళ్టికీ రోజూ సందడే. వాడికి ఎప్పుడూ ప్రత్యేకంగా పుట్టినరోజులు పండుగలా చేసుకోవడం పెద్దగా ఇష్టం ఉండదు. ‘విడిగా బర్‌‌తడే సెలబ్రేట్ చేసుకోవడం ఎందుకు? రోజూ అమ్మా నాన్న, పిల్లలం కలిసి నవ్వుకుంటూ, కబుర్లు చెప్పుకుంటూ ఉంటే, ఇంట్లో పండగేగా’ అని వాళ్ళ చెల్లెలితో అంటాడు.

తినడు... పడుకోడు...

సంగీత దర్శకుడిగా ఇంత పేరొచ్చినా, దేవిశ్రీ రిలాక్సవడు. వాడికి ఒకటే పనిపిచ్చి. ఇప్పటికీ రాత్రీ పగలూ కష్టపడతాడు. అది చూస్తుంటే, వాళ్ళ అమ్మకు చాలా కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా సరిగ్గా తిననే తినడు. నిద్రా తక్కువే. మేడ పైన ఉన్న స్టూడియోకు వెళ్ళి, చెల్లెలు పద్మిని బలవంతాన కిందకు తీసుకువస్తే, అప్పుడొస్తాడు. కష్టపడి ఏదైనా తినిపించడానికి వాళ్ళ అమ్మ రాత్రి చాలాసేపు మెలకువగానే ఉంటుంది. ‘వాడు పడుకొని, కంటి నిండా నిద్రపోయి ఎన్నేళ్ళయిందో’ అని బాధపడుతుంటుంది.

ఈ జూలై 5 నుంచి ఆగస్టు 9 దాకా దేవిశ్రీ, సాగర్‌లు అమెరికా, కెనడాల్లో సంగీత ప్రదర్శనలిస్తూ బిజీగా ఉన్నారు. ఈ పుట్టినరోజు నాడు దేవిశ్రీ న్యూజెర్సీలో ప్రోగ్రావ్‌ు చేస్తున్నాడు. అంతదూరంలో ఉన్నా ఇవాళ్టికీ రోజూ మాతో ఫోన్‌లో మాట్లాడతాడు. మా యోగక్షేమాలు కనుక్కుంటూ ఉంటాడు. అసలు తొలిసారిగా తానే సొంతంగా చేస్తున్న ఈ అమెరికా పర్యటనకు మా ఇద్దరినీ, చెల్లెలినీ, బావనూ కూడా తీసుకువెళ్లాలని అనుకున్నాడు. బలవంతపెట్టాడు కూడా. కానీ, వేరే పనులతో మేమే వద్దని చెప్పాం.

దేవిశ్రీకి పెళ్ళి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కానీ, వాడే వాయిదా వేస్తున్నాడు. ‘నువ్వు పెళ్ళి చేసుకోవడమే మాకు నువ్విచ్చే కానుక. మా సంతోషం కోసం ఇదెందుకు చేయవు’ అని అడుగుతుంటాం. ఆ మాట అడిగితే, ‘ఆ.., ఊ...’ అని మాట మార్చేస్తాడు. పెళ్ళి మాటెత్తవద్దంటాడు. ఆ ముచ్చట తీరితే, మాకు సంతోషంగా ఉంటుంది. ఏమైనా, అలాంటి పిల్లాడు మా బిడ్డగా పుట్టడం మా అదృష్టం. దేవుడిచ్చిన వరం.

సంభాషణ: రెంటాల జయదేవ

(Published in 'Sakshi' daily, 2nd Aug 2014, Saturday)
.....................................

Saturday, August 2, 2014

నా నలభై ఏడో ఏట చెంప ఛెళ్లుమనిపించారు! - నిర్మాత అల్లు అరవింద్

అల్లు రామలింగయ్య... ఆ పేరు తలచుకోగానే... ఎన్నో పాత్రలు... మరెన్నో సినిమాలు కళ్ళ ముందు గిర్రున రీళ్ళు తిరుగుతాయి. ఆ నాటి ‘మాయాబజార్’ నుంచి ఆ మధ్య వచ్చిన ‘జై’ దాకా...  అల్లు... తెలుగుతెరపై నవ్వుల విరిజల్లు. ‘ముత్యాల ముగ్గు’, ‘శంకరాభరణం’, ‘సప్తపది’... ఇలా ప్రతి సినిమాలో ఆయన పాత్ర ఓ కొలికిపూస. మరి, నిజజీవితంలో ఆయన ఎలా ఉండేవారు? పిల్లలతో ఎలా మెలిగేవారు? వారికి ఆయన నేర్పిన పాఠాలేమిటి? నటుడిగా ఆయన ఫిలాసఫీ ఏమిటి? ఇవాళ అల్లు రామలింగయ్య పదో వర్ధంతి సందర్భంగా... తండ్రిగా, నటుడిగా, హోమియో డాక్టర్‌గా... అంతకుమించి మంచి మనిషిగా అల్లులోని అనేక కోణాలపై ఆయన కుమారుడు, ప్రసిద్ధ నిర్మాత అల్లు అరవింద్ ఫోకస్ లైట్...
 
మా నాన్న అల్లు రామలింగయ్య గారు మన కళ్ళెదుట భౌతికంగా లేరన్న మాటే కానీ, ఇవాళ్టికీ కనీసం అయిదారు సార్లయినా తలుచుకోనిదే, ఏదో ఒక సందర్భంలో ఆయనను గుర్తు తెచ్చుకోనిదే నాకు రోజు గడవదు. నిజానికి ఆయన భౌతికంగా లేని ఈ పదేళ్ళలో నేను ఆయనను మిస్ అయిన క్షణం లేదు. ప్రతి విషయంలో ఆయన నా వెంటే ఉన్నారని నా భావన. అందుకే, ‘గీతా ఆర్ట్స్’ పతాకంపై మేము నిర్మిస్తున్న సినిమాలన్నిటికీ ఇప్పటికీ ‘అల్లు రామలింగయ్య సమర్పించు’ అని టైటిల్స్‌లో వేస్తుంటా.

జీవించడం నేర్పిన గురువు

నాకు వ్యక్తిగతంగా ఎవరూ గురువులు లేరు. కానీ, గురుపూర్ణిమ వచ్చిందంటే నేను ఇద్దరినే తలుచుకుంటూ ఉంటా. ఆ ఇద్దరూ ఎవరంటే - ఒకరు మా నాన్న గారు. రెండో వ్యక్తి - మా కుటుంబానికి సన్నిహితులు, సలహాదారైన నిర్మాత డి.వి.ఎస్. రాజు గారు. నా వ్యక్తిగత, సినిమా జీవితం మీద నాన్న గారు వేసిన ప్రభావం అంతటిది. నా దస్తూరీ ఇవాళ్టికీ చాలా బాగుంటుంది. దానికి కారణం మా నాన్న గారే! నా హ్యాండ్ రైటింగ్ బాగుండాలని తెలుగు, ఇంగ్లీషు కాపీ రైటింగ్ పుస్తకాలు తెచ్చి రోజూ నాలుగేసి పేజీల చొప్పున రాసి, చూపించమనేవారు. ఇలా ప్రతి చిన్న విషయంలో ఆయన గెడైన్‌‌స, ఇచ్చిన శిక్షణ నన్నివాళ ఇలా తీర్చిదిద్దాయి.

తండ్రిగా ఆయనది ఓ ప్రత్యేక పద్ధతి. ఆడపిల్లల పెంపకంలో సగటు మధ్యతరగతివాడిగా స్ట్రిక్ట్‌గా ఉండేవారు. అదే సమయంలో పిల్లలకు జీవితం నేర్పాలనే ఉద్దేశంతో పధ్నాలుగు, పదిహేనేళ్ళ వయసు వచ్చినప్పటి నుంచి నన్ను ఓ కొడుకులా కాకుండా, స్నేహితుడిలా చూశారు. పదహారేళ్ళ వయసు నుంచే నన్ను చివరకు ఆడిటర్ దగ్గరకు కూడా తీసుకువెళ్ళేవారు. అలాగే, కుటుంబ రాబడి, ఖర్చు, ఆదా, ఎక్కడ ఎలా మదుపు చేయాలనే విషయాల్లోనూ నన్ను ఇన్‌వాల్వ్ చేసేవారు. అప్పట్లో ‘అవేవీ తెలియక, ఇదేమిట్రా బాబూ.. మనకెందుకీ గొడవ’ అనుకొనేవాణ్ణి. కానీ, ఇవాళ మా కుటుంబంలో కానీ, చిరంజీవి గారి కుటుంబంలో కానీ ఎవరికీ పన్ను బకాయిలు, ట్యాక్స్ సమస్యలు ఏమీ లేకుండా ఉన్నాయంటే, ఆర్థిక అంశాలన్నీ జాగ్రత్తగా దగ్గరుండి చూసుకోగలుగుతున్నానంటే దానికి కారణం ఆ ట్రైనింగే! అలాగే, మా చెల్లెళ్ళ పెళ్ళి సంబంధాల దగ్గర నుంచి అన్ని విషయాలూ చిన్నవాడినైన నాతో ఆయన చర్చించేవారు. (నవ్వుతూ...) అలా చిన్నప్పుడే నాకు పెద్దరికం వచ్చేలా చేశారు. అందుకే, ఇవాళ్టికీ మా సిస్టర్స్‌కు నేను అన్నలా కాక, నాన్న గారి తరువాత నాన్న గారిలా కనబడుతుంటాను.  చిన్నప్పటి నుంచి ఆయన నన్ను కూర్చోబెట్టి ఎన్నో చెప్పేవారు. వస్తుతః లోలోపల నేను కొంత దూకుడు! అలాంటి నేనివాళ ఎప్పుడూ తొందరపడి మాట్లాడను. ఎవరి మీదా నోరు పారేసుకోను. అది కూడా నాన్న గారి చలవే. ‘పెదవి దాటిన మాట - తనకు రాజు. కానీ, పెదవి దాటని మాటకు తానే రాజు’ అని ఆయన ఎప్పుడూ చెబుతూ ఉండేవారు. నాన్న గారు చెప్పిన సామెత నా మీద ముద్ర వేసింది.

అరుదైన హస్తవాసి

మా నాన్నగారు వాళ్ళు అయిదుగురు అన్నదమ్ములు. వాళ్ళలో మూడో ఆయన మా నాన్న గారు. సినిమాల్లో వేషాల కోసం పాలకొల్లు నుంచి మద్రాసు వచ్చినప్పుడు ఆయన కష్టాలు పడిన తొలి రోజులు నాకు గుర్తే. సంపాదన లేక, సరిపోక ఊళ్ళోని మా పెదనాన్న గారి దగ్గర నుంచి డబ్బులు తెప్పించుకొని, ఇల్లు గడిపిన సంగతులు నాకు తెలుసు. నటుడిగా పేరు, డబ్బు సంపాదించినా ఆ రోజుల్ని ఆయన మర్చిపోలేదు. కమ్యూనిస్టు భావాలున్న ఆయనలో మానవత్వం ఎక్కువ. సినిమాల్లోకి రాక ముందు హోమియోపతి వైద్యం ఆయన వృత్తి. ఆయన హస్తవాసి మంచిదని ఎంతోమందికి నమ్మకం. సినిమాల్లో స్థిరపడ్డాక అందరికీ ఉచితంగా మందులిస్తూ, హాబీగా కొనసాగించారు. ఎన్టీఆర్‌కి ఫ్రాక్చరైతే, ఏయన్నార్ గారి కాలులో చిన్న ఇబ్బంది వస్తే నాన్న గారు హోమియో వైద్యం చేశారు. ఎన్టీయార్ గారి భార్య బసవ తారకం గారికి నాన్న గారు నమ్మకమైన ఫ్యామిలీ డాక్టర్. (నవ్వుతూ...) నన్ను కూడా హోమియోపతి నేర్చుకోమనేవారు. కానీ, అది నాకు ఎక్కలేదు. ఆయన సేకరించి, చదువుకొన్న ఎన్నో హోమియోపతి పుస్తకాలు మా ఇంట్లో ఉన్నాయి. ఆయన గుర్తుగా వాటిని భద్రంగా దాచాం.

ఆయన కోరిక తీరింది...         

మా ఇంట్లో మేము అయిదుగురం. మా అక్క నవభారతి. నేను, మా చెల్లెళ్ళు వసంతలక్ష్మి (డాక్టర్ వెంకటేశ్వరరావు గారి భార్య), సురేఖ (చిరంజీవి గారి భార్య), చనిపోయిన మా తమ్ముడు వెంకటేశ్. మా తమ్ముడిలో మంచి ఫీచర్లున్నాయని, వాణ్ణి సినీ నటుణ్ణి చేయాలని నాన్న గారికి ఉండేది. కానీ, అనుకోకుండా జరిగిన రైలు ప్రమాదంలో వాడు చనిపోయాడు. మా అబ్బాయి బన్నీ (అల్లు అర్జున్) స్టారవడంతో మా తమ్ముడు వెంకటేశ్‌కు రావాల్సినదంతా బన్నీకొచ్చిందనీ, నటుడిగా తన వారసత్వం కొనసాగాలన్న కోరిక తీరిందనీ సంతోషించారు.

వృత్తికి అడ్డు కాని వ్యక్తిగత విషాదం

మా తమ్ముడు చనిపోయినప్పుడు నాన్న గారు ఎంతో బాధపడ్డప్పటికీ, తన పర్సనల్ ఫిలాసఫీ ద్వారా దృఢంగా నిలబడ్డారు. వాడు చనిపోయిన నాలుగో రోజునో, అయిదో రోజునో ఆయనకు షూటింగ్ ఉంది. అది బాపు గారి సినిమా అనుకుంటా. షూటింగ్ క్యాన్సిల్ చేద్దామా అని వాళ్ళు అడిగారు. కానీ, అదేమీ వద్దని, మనసును రాయి చేసుకొని షూటింగ్‌కు వెళ్ళిపోయారు నాన్న గారు. అక్కడ సన్నివేశం కూడా విషాద సన్నివేశం. గ్లిజరిన్ ఇస్తామన్నారట. కానీ, నాన్న గారు అక్కర్లేదని, గ్లిజరిన్ లేకుండానే ఆ సన్నివేశంలో కన్నీళ్ళు పెట్టుకొని, ఆ సన్నివేశం పండించారు. వ్యక్తిగత విషాదాన్ని పక్కనపెట్టి, వృత్తి పట్ల నిబద్ధత చూపే ఆయన ‘దృఢ వ్యక్తిత్వాని’కి ఇదో ఉదాహరణ.

తీపి జ్ఞాపకం... తరగని ఆస్తి...     

వ్యక్తిగా ఆయనలో నచ్చే అతి గొప్ప విషయం ఏమిటంటే, ఆయన చాలా ప్రజాస్వామికంగా ఉండడం, అందరికీ స్వేచ్ఛనివ్వడం. అయితే, పట్టరాని కోపం వచ్చినప్పుడు ఒక్కోసారి ఒక తండ్రిగా నన్ను తిట్టేవారు, కొట్టేవారు కూడా! ఆయనతో నాకు ఓ చిత్రమైన తీపి జ్ఞాపకం ఉంది. ఆయన నన్ను ఆఖరు సారిగా కొట్టింది ఎప్పుడో తెలుసా? నా 47వ ఏట! ఒకరోజు నేను కారు నడుపుతుంటే, ఆయన పక్కన కూర్చొని ఉన్నారు. ఇంటి లోపలకు కారుతో అడుగు పెడుతున్నప్పుడు నేను అనుకోకుండా సడెన్ బ్రేక్ వేశాను. సీట్ బెల్టులు లేని ఆ రోజుల్లో ఆయన తల వెళ్ళి, ముందుకు కొట్టుకుంది. అంతే... ఒక్కసారిగా కోపం వచ్చి, ‘ఎవడ్రా నీకు డ్రైవింగ్ నేర్పింది’ అంటూ చెంప ఛెళ్ళుమనిపించారు. కొంపతీసి ఇది మా ఆవిడ కానీ చూసిందేమో అని టెన్షన్ పడ్డా. బాల్కనీ వైపు చూస్తే మా ఆవిడ కనపడలేదు. హమ్మయ్య చూడలేదనుకున్నా. తీరా, ఇంట్లోకి వెళ్ళాక ఎందుకు కొట్టారంటూ అడిగేసరికి గతుక్కుమన్నా. (నవ్వులు...) ఆ క్షణం కొద్దిగా ఇబ్బంది అనిపించినా, ఇప్పుడు తలుచుకుంటే అది మా నాన్న గారు నాకిచ్చిన అత్యంత తీపి జ్ఞాపకం అనిపిస్తుంటుంది. నాకు ఎంత వయసు వచ్చినా, ఎంత ఎత్తుకు ఎదిగినా నన్ను ఓ చిన్న పిల్లాడిగా, తండ్రి మీద గౌరవమున్న కొడుకుగానే చూసిన ఓ తండ్రి తాలూకు ప్రేమ, క్రమశిక్షణ అది.

నటుడిగా నాన్న గారు వెయ్యికి పైగా చిత్రాల్లో నటించారు. నాన్న గారికి ‘పద్మశ్రీ’ వచ్చినప్పుడు నేను ‘ప్రతిబంధ్’ షూటింగ్‌లో హైదరాబాద్‌లో ఉన్నా. విషయం తెలిసి, మద్రాసులో ఇంటికి ఫోన్ చేశా. కళ్ళలో నీళ్ళు తిరుగుతుండగా, ‘నాన్న గారూ! ఇన్నాళ్ళూ మీరు మాకిచ్చిన ఆస్తులైన ఇళ్ళు, పొలాలు, డబ్బు అమ్ముకోవచ్చు. కానీ, ఎప్పటికీ అమ్మలేని ఆస్తిగా ‘పద్మశ్రీ’ గౌరవాన్ని మాకు ఇచ్చారు’ అన్నాను. ఆ మాటకు ఆయన ఎంత ఆనందించారో!

చెరిగిపోని నవ్వు... చెదిరిపోని నువ్వు...

అప్పటికప్పుడు అక్కడికక్కడ ఛలోక్తులు విసరడం ఆయనకు అలవాటు. ఒకసారి ఆయన కాలికి చిన్న దెబ్బ తగిలి, బెణికింది. దానికి చిన్న బ్యాండేజ్ కట్టారు. ఆ రోజున నాతో పాటు మా ఇంటికి వచ్చిన నా ఫ్రెండ్ శ్రీనివాసరావు అది చూస్తూనే, ‘ఏమిటి సార్... ఆ కట్టు...’ అంటూ గావుకేక పెట్టాడు. అంతే. ‘ఏనుగు తొక్కిందిలే’ అన్నారు నాన్న గారు. (నవ్వులు) అదేమిటంటూ విస్తుపోవడం మా ఫ్రెండ్ వంతు అయింది. అప్పుడు మా నాన్న గారు, ‘నువ్వు అంతగా రియాక్ట్ అయినప్పుడు, ‘ఏదో కాలు కొద్దిగా బెణికిందిలే’ అని చెబితే డిజప్పాయింట్ అవుతావు.

అందుకని, ఏనుగు తొక్కిందని చెప్పా’ అని నవ్వించారు. అలాగే, చనిపోవడానికి ఆరు నెలల ముందు హైదరాబాద్ కె.బి.ఆర్. పార్క్‌కు వెళ్ళారాయన. అక్కడ ఆయన కూర్చొని ఉంటే, తెలిసినవాళ్ళు ఎదురై పలకరించి, ‘వాకింగ్‌కు వచ్చారా’ అని అడిగారు. దానికి నాన్న గారు ‘అవునండీ! కానీ, నేను పెద్దోణ్ణి. నడవలేను కదా! అందుకే, కుర్రాణ్ణి పెట్టా. వాడు నడుస్తున్నాడు’ అని చటుక్కున బదులిచ్చారు (నవ్వులు...)  సినిమాలు, నటన, ఇలాంటి ఛలోక్తులు చూసి చాలామంది ఆయన వట్టి హాస్యజీవి అనుకుంటారు.

కానీ, జీవితంలో ఆయన చాలా సీరియస్ మనిషి. ఫిలసాఫికల్ థింకర్. ఆయనకు వివేకానంద స్వామి, రామకృష్ణ పరమహంస అంటే మహా ఇష్టం. వాళ్ళ పుస్తకాలెన్నో ఆయన చదివేవారు. అలాగే, వేస్తున్న వేషం తనకు లొంగే వరకు నటుడిగా ఆయన తృప్తిపడేవారు కాదు. వేస్తున్నది కమెడియన్ పాత్ర అయినా సరే, పూర్తి కథ, సన్నివేశం పూర్వాపరాలు తెలుసుకొని, పాత్రను అవగాహన చేసుకొనేవారు. అలా పాత్రను మనసుకు ఎక్కించుకొనేవరకు దర్శకులనూ, కో-డెరైక్టర్‌నీ వివరాలు అడుగుతూనే ఉండేవారు. ఒక్కసారి ఆ పాత్రను లొంగదీసుకున్న తరువాత అద్భుతంగా నటించేవారు.

అందుకే, ఆయన నటన అంత సహజంగా ఉండేది. చిరంజీవి, రజనీకాంత్, అమితాబ్ - ఇలా ఏ భాషలో చూసినా హాస్యం పండించగలిగినవారే పెద్ద హీరోలయ్యారు. ఉన్నత స్థాయికి వెళ్ళారు. అందుకే, నా దృష్టిలో హీరోయిజమ్ అంటే హాస్యమే. అలాంటి హాస్యాన్ని ప్రాణానికి ప్రాణంగా భావించి, తెరపై నవ్వులు విరబూయించిన నాన్న గారి లాంటి వారందరూ నా దృష్టిలో చిరకాలం గుర్తుండే హీరోలు.  

సంభాషణ: రెంటాల జయదేవ

దర్శకులు కె.విశ్వనాథ్, బాపు అంటే నాన్న గారికి ఎంతో గౌరవం. దాసరి, రాఘవేంద్రరావులంటే మహా ఇష్టం. అలాంటి దర్శకుల చిత్రాల్లో నటించాలని ఆయన తపించేవారు. ముఖ్యంగా, విశ్వనాథ్, బాపుల చిత్రాల్లో తాను తప్పకుండా ఉండాలనుకొనేవారు. తనకు పాత్ర ఉండదేమోనని తెగ బెంగపడేవారు. వాళ్ళ సినిమాలంటే, ఇక పారితోషికం, ఇతర విషయాలేవీ పట్టించుకొనేవారు కూడా కాదు. చివరి దాకా అదే పాటించారు. అలాంటి పాత్రలెన్నో పోషించబట్టే, కన్నుమూసి ఇప్పటికి పదేళ్ళయినా ఆయన చిరంజీవిగా ప్రేక్షకుల హృదయాల్లో మిగిలారు.

(Published in 'Sakshi' daily, 31st July 2014, Thursday)
...............................