జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Tuesday, January 1, 2013

దక్షిణాది సినిమా రూపురేఖలు మార్చింది తెలుగువాడే - రెంటాల జయదేవ



అంబత్తూరు: దక్షిణాది సినిమా మొగ్గ తొడుగుతున్న రోజుల్లో దాని రూపు రేఖలను మార్చిన వ్యక్తి మన తెలుగువాడేనని ప్రముఖ పాత్రికేయులు, నంది అవార్డు గ్రహీత డాక్టర్ రెంటాల జయదేవ పేర్కొన్నారు. వేదవిజ్ఞాన వేదిక , ఆంధ్రా సాంఘిక , సాంస్కృతిక సంఘం (ఆస్కా) సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం తరతరాల తెలుగు కవిత ఉపన్యాస ధారావాహిక కార్యక్రమం జరిగింది. టీనగర్‌లోని ఆస్కా ప్రాంగణం కావేరీ హాలులో జరిగిన ఈ కార్యక్రమంలో రెంటాల జయదేవ 'తొలి తెలుగు సినీమాట-పాట-కవి' అనే అంశంపై ఉపన్యసించారు. చలనచిత్రం పుట్టుపూర్వోత్తరాలను వివరించడంతో పాటు, తెలుగు సినిమాకు అప్పటి జనాలు ఏ తీరున బ్రహ్మరథం పట్టేవారో సోదాహరణంగా వివరించారు.

తొలి భారతీయ చలనచత్రం 'ఆలం ఆరా' కాగా, తొలి తెలుగు చిత్రం కాళిదాస్ అని తెలిపారు. అందరూ అనుకునే విధంగా తొలి తెలుగు చిత్రం 'భక్త ప్రహ్లాద' కాదని ఈ సందర్భంగా ఆయన తేల్చి చెప్పారు. కాళిదాస్ చిత్రంలో నటించిన టీ పీ రాజలక్ష్మీ ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పారని ఆధారాలను చూపించారు. తొలి తమిళ, తెలుగు చిత్రంగా కాళిదాస్ తెరకెక్కిందని,అందులోని మూడు త్యాగరాజ కీర్తనలే తొలి తెలుగు సినిమా పాటగా చెప్పారు. 'ఎంతరానీ, తనకెంత పోనీ నీ చింత విడువజాల శ్రీరామ' అంటూ త్యాగరాజ కీర్తన తెలుగు సినిమా పాటగా మనకు వినపడిందని పేర్కొన్నారు. అయితే ఆ తరువాత వచ్చిన 'భక్త ప్రహ్లాద' చిత్రం సంపూర్ణ తెలుగు చిత్రమని తెలిపారు. అప్పట్లో తొలి టాకీ చిత్రాలకు సంబంధించిన రీళ్ల్ఱ బాక్సులకు జనాలు బ్రహ్మరథం పట్టేవారని పేర్కొన్నారు. తన పరిశోధనల్లో లభ్యమైన ఆధారాల మేరకు గులాబీ పూలతో రీలు బాక్సులకు స్వాగతం చెప్పేవారని వెల్లడించారు.

దక్షిణాదిన సినిమా మొగ్గతొడిగే సమయంలో దాని రూపురేఖలను ఇట్టే మార్చేసిన వ్యక్తి మన తెలుగువాడైన రఘుపతి వెంకయ్య నాయుడని తెలిపారు. అప్పట్లోనే ఆయన మద్రాసు మౌంట్ రోడ్‌లో తనదైన హవాను కొనసాగించినట్లు చరిత్ర చెబుతుందని పేర్కొన్నారు. తన కొడుకు చేత లండన్‌లో సినిమా పరిజ్ఞానానికి సంబంధించిన కోర్సులను చదివించి సినిమా తీసిన అంకిత భావం కలిగిన వ్యక్తి రఘుపతి వెంకయ్యనాయుడని అన్నారు. మూకీల కాలం నుంచి టాకీల కాలం వచ్చే వరకు సినిమా వెలుగులు అంతంత మాత్రంగానే ఉన్నప్పటికీ టాకీ ల తరువాత యావత్ సమాజాన్ని శాసించే స్థాయి సినిమాకు వచ్చేసిందని వివరించారు. ఆంధ్రదేశంలో బెజవాడలో మోతే మారుతీ థియేటర్‌లో తొలి తెలుగు చిత్రం ప్రదర్శింపబడిందని వెల్లడించారు. అప్పట్లో సినిమాకు సంబంధించి ఎలాంటి పబ్లిసిటీ ఉండేది కాదని, అయినా తెలుగు సిని మా పురుడు పోసుకున్న రోజుల నుంచి నేటి వరకు సినిమాకు ఉన్న ప్రభావం ఏ మాత్రం తగ్గలేదని హర్షం వ్యక్తం చేశారు.
1885 ప్రాంతంలో మహారాష్ట్రలో ప్రాణం పోసుకున్న గాజుస్లైడ్ ప్రదర్శనల దగ్గర నుంచి తోలు బొమ్మలాట, మూకీ, టాకీ, నేటి సినిమా వరకు పలు పరిశోధనలు చేసి సంగ్రహించిన వివరాలను రెంటాల జయదేవ ఆహూతుల ముందు సాక్షాత్కరించారు.

అంతకు ముందు భమిడిపాడి శ్రీకాంత్ ప్రార్థనాగీతంతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ చీరాల నుంచి ప్రత్యేకంగా విచ్చేసిన సాంబమూర్తి, ప్రసాద్‌లు ఉపన్యాసకుడిని చందనమాల, దుశ్శాలువతో సత్కరించారు. ప్రముఖ నిర్మాత కాట్రగడ్డమురారి కొత్త వస్త్రాలను అందజేశారు. నిన్నటి తరం నటుడు ఏచూరి చలపతి రావు రెంటాల జయదేవను ప్రత్యేకంగా సత్కరించారు. వేద విజ్ఞాన వేదిక అధ్యక్షుడు జెకే రెడ్డి ఉపన్యాసకుడి పరిచయ నివేదికను చదివి విన్పించారు. కార్యదర్శి కందనూరు మధు వ్యాఖ్యతగా వ్యవహరించారు. సాహితీ విమర్శకులు వీఏకే రంగారావు, ప్రముఖ కవి డాక్టర్ కాసల కాసలనాగభూషణం, సినీ గేయరచయిత వెన్నెలకంటి, డబ్బింగ్ కళాకారులు ఘంటసాల రత్నకుమార్, ఆస్కా మాజీ అధ్యక్షులు ఆదిశేషయ్య తదితర తెలుగు ప్రముఖులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నెల్లూరు నుంచి విచ్చేసిన ప్రత్యేక అతిథి ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ రిటైర్ట్ ఎగ్జిక్యూటివ్ అధికారి పెంచలరెడ్డిని నిర్వాహకులు సభకు పరిచయం చేశారు.

26th November 2012, Monday, Andhra Jyothy Telugu daily, Tamilnadu Edition

 (ఇది 'ఆంధ్రజ్యోతి' తెలుగు దినపత్రిక తమిళనాడు సంచికలో 26 నవంబర్ 2012, సోమవారం నాడు ప్రచురితమైన నా ప్రసంగ వార్త.) 

0 వ్యాఖ్యలు: