పత్రికా రచనా రంగంలో రెండు దశాబ్దాలకు పైగా
పనిచేస్తున్న డాక్టర్ రెంటాల జయదేవను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకమైన ‘నంది’ అవార్డుకు ఎంపిక
చేసింది. 2011వ సంవత్సరానికి గాను ‘ఉత్తమ సినీ విమర్శుడి’గా నంది పురస్కారాన్ని ఆయనకు ప్రకటించింది. ఇప్పటికి
ఇరవయ్యేళ్ళుగా రెంటాల జయదేవ సినీ పత్రికా రచనలో ప్రత్యేక కృషి చేస్తున్నారు. ఆయన
సినిమా సమీక్షలు, ప్రత్యేక వార్తా కథనాలు, విశ్లేషణలు, ప్రముఖులతో ఆసక్తికరమైన
ఇంటర్వ్యూలు పాఠకులతో పాటు సినీ పరిశ్రమవారినీ ఆకట్టుకుంటున్నాయి.
తొలి పూర్తి తెలుగు టాకీ ‘భక్త ప్రహ్లాద’ సరైన విడుదల తేదీని
జయదేవ ఇటీవలే తన పరిశోధనలో వెలికితీశారు. తెలుగు సినిమా జన్మదినోత్సవం విషయంలో
కొన్నేళ్ళుగా ప్రచారంలో ఉన్న తప్పును ఆయన సాక్ష్యాధారాలు చూపి, సరిదిద్దారు. ‘ఈనాడు’ పత్రిక సంపాదక మండలిలో
గురుతర బాధ్యతలు నిర్వహించిన జయదేవ ప్రస్తుతం ‘ఇండియా టుడే’ తెలుగు వారపత్రిక సంపాదక వర్గంలో పనిచేస్తున్నారు. ప్రముఖ
కవి,శతాధిక గ్రంథకర్త, సీనియర్ పాత్రికేయులు, సినీ రచయిత కీర్తిశేషులు రెంటాల
గోపాలకృష్ణ ఆఖరి కుమారుడైన జయదేవ తండ్రిగారి నుంచి ఇటు పుస్తక రచననూ, అటు పత్రికా
రచననూ వారసత్వంగా పుణికిపుచ్చుకున్నారు.
‘‘ఇప్పటికి ఇరవై ఏళ్ళకు పైగా పత్రికా రచనలో, ముఖ్యంగా సినీ
పరిశ్రమపై చేస్తున్న కృషికి ఇది ఓ గుర్తింపుగా భావిస్తున్నా. గత ఏడాది నేను రాసిన
వ్యాసాలను పరిశీలించి, ప్రతిభా వ్యుత్పత్తులను గమనించి, ‘ఉత్తమ తెలుగు సినీ
విమర్శకుడి’గా
నన్ను ఎంపిక చేసిన అవార్డుల సెలక్షన్ కమిటీకి ప్రత్యేక కృతజ్ఞతలు’’ అని అవార్డుకు ఎంపికైన
జయదేవ అన్నారు.
( 2012 అక్టోబర్ 17వ తేదీ బుధవారం నాటి ‘వార్త’ దినపత్రిక సినిమా పేజీ
‘తెర’లో ప్రచురితం)
2 వ్యాఖ్యలు:
అభినందనలు
@ Narayanaswamy! mii abhinandanalaku krithagnathalu. Deepavali Subhakankshalu.
Post a Comment