జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Saturday, June 25, 2016

కట్ చేస్తే ... ‘గుండె కోత’ అంటున్న సినీ పరిశ్రమ


కట్ చేస్తే ... ‘గుండె కోత’ అంటున్న సినీ పరిశ్రమ













హృదయం... అన్నీ కావాలంటుంది!
మైండ్... ‘అదెలా కుదురుతుంది’ అంటుంది!

‘సహజంగా ఉంటే చాలు... సహస్రకోటి భావాలకు వ్యక్తీకరణ ఉంటుంది’
అని హృదయం అనుకుంటే...
‘సహజంగా ఉండడానికి మనమేమన్నా పశువులమా, మృగాలమా? 

సహజం నాట్ ఎలౌడ్ ఇన్ సమాజం’ అని మైండ్ అంటుంది.
మనిషికున్న అమూల్యమైన హక్కు - ‘భావవ్యక్తీకరణ స్వేచ్ఛ’.
అలాంటి స్వేచ్ఛను వికసింపజేయాలన్నది... హృదయం ఆశ!
భావప్రకటనకు కూడా హద్దులు ఉండాలన్నది మైండ్ మాట!
హృదయంతో తీస్తున్న సినిమాలను... 

మైండ్‌తో కోస్తున్న సెన్సార్‌బోర్డ్ వైఖరికి 
హిందీ సినిమా ‘ఉడ్‌తా పంజాబ్’ వివాదం తాజా ఉదాహరణ.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

‘‘ఇది నాకూ, అక్కడ (సెన్సార్ బోర్డ్‌లో) అధికారంలో కూర్చొని, కొద్దిమంది గొప్పవాళ్ళ చేతిలోని రాజ్యంలా వ్యవహరిస్తున్న ఒక నిరంకుశుడికీ మధ్య జరుగు తున్న పోరు. ఇదంతా చూస్తుంటే, నేను ఏ ఉత్తర కొరియాలోనో ఉన్నట్లుంది.’’
‘ఉడ్తా పంజాబ్’ చిత్ర సహ నిర్మాత, ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్

ఒక సృజనశీలి కడుపు చించుకొని వచ్చిన ఆవేశం ఇది. భావవ్యక్తీకరణ స్వేచ్ఛకు పడుతున్న సంకెళ్ళపై సమాజంలోని అనేక మంది సినీ కళాకా రుల ఆక్రందనకు అద్దం ఇది. అవును. సమాజానికి దర్పణం పట్టాల్సిన సినిమాలో, సృజనాత్మక భావ వ్యక్తీకరణకు వేదిక అయిన సినిమాలో... మన చుట్టూ కళ్ళెదురుగా జరుగుతున్నది చూపిస్తే తప్పు అంటే ఆవేదన, ఆవేశం కాక ఏమొస్తాయి? ఇవాళ భారతీయ సినీ ప్రపంచమంతా హిందీ సినిమా ‘ఉడ్తా పంజాబ్’ (కొత్త హుషారుతో ఎగసిపడుతున్న పంజాబ్ అని స్థూలంగా అర్థం) గురించి ఆసక్తిగా మాట్లాడుకుంటోంది అందుకే! ఈ నెల 17న రిలీజ్ కావాల్సిన ఈ హిందీ సినిమా పంజాబ్‌లో పెచ్చ రిల్లిన డ్రగ్‌‌స ఉపద్రవంపై తీసిన సమకాలీన సినిమా. అయితే, అలా తీయ డమే ఇప్పుడు ఇబ్బందిగా తయారైంది. కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ పరిధిలోని సెన్సార్ బోర్‌‌డ దర్శక, నిర్మాతలకు చుక్కలు చూపడం మొదలుపెట్టింది.

 దాంతో, దేశంలో ఫిల్మ్ సర్టిఫికేషన్ సైతం రాజకీయ ఒత్తిళ్ళకు అతీతం కాదని మరోసారి ఆరోపణలు వెల్లువెత్తాయి. నిజానికి, 2015లో పగ్గాలు చేపట్టిన ప్రముఖ నిర్మాత పహ్లాజ్ నిహలానీ సారథ్యంలోని సెన్సార్‌బోర్‌‌డపై విమర్శలు రావడం ఇది తొలిసారేమీ కాదు. ఆధునిక జీవితంలో సర్వసాధారణమై పోయిన కొన్ని తిట్లని సైతం సినిమాలో అనుమతించేది లేదంటూ బోర్‌‌డ గత ఏడాది ఒక జాబితానే సిద్ధం చేసింది. ఫలానా సినిమా ఏ వయస్సువాళ్ళు  చూడచ్చో నిర్దేశిస్తూ, సర్టిఫికెట్ జారీ చేయడమే బాధ్యతగా ఉండాల్సిన సెన్సార్ బోర్‌‌డ ‘నైతిక పోలీసింగ్’ చేయసాగింది.

సెన్సార్‌వ్యవస్థపై బాగా విమర్శలు రావడంతో కొన్ని నెలల క్రితం దర్శకుడు శ్యావ్‌ుబెనెగల్ సారథ్యంలో ఒక సిఫార్సుల సంఘాన్ని కేంద్రం వేసింది. సినిమాల్ని కట్ చేసి పారేయడం కాక, 12 ఏళ్ళు పైబడిన వాళ్ళకీ, పెద్దలకీ మాత్రమే అంటూ రకరకాల వర్గీకరణ చేయాల్సిందిగా ఆ సంఘం సిఫార్సులూ చేసింది. భావప్రకటన స్వేచ్ఛను గౌరవిస్తామన్న ప్రభుత్వం ఆ సిఫార్సుల్ని పట్టించుకొన్న పాపాన లేదు. ఇవాళ ‘ఉడ్తా పంజాబ్’పై కత్తెర వేటు దానికి తాజా ఉదాహరణ.

సామాజిక ఉపద్రవమైన డ్రగ్‌‌స గురించి సినిమాల్లో ప్రస్తావిస్తే తప్పే మిటని అనురాగ్ వాదన. ఆయన మాటల్లో చెప్పాలంటే, ‘‘ఉడ్తా పంజాబ్ ఒక నిజాయతీ సినీ ప్రయత్నం. ఈ సిన్మాను వ్యతిరేకి స్తున్న పార్టీలు, వ్యక్తులు డ్రగ్స్‌ను ప్రోత్సహిస్తున్నట్లే లెక్క!’’ వాస్తవ పరిస్థితులపై అందరి దృష్టీ పడేలా చేసి, జనాన్ని జాగృతం చేసే ప్రయత్నాలకు కత్తెర అడ్డం పెడితే తప్పెవరిది? తీసినవాళ్ళదా? కట్ చేసిన వాళ్ళదా?
..........................................

మీ పిల్లలు డ్రగ్స్ బారినపడ్డారా?
ఇవాళ హైదరాబాద్, చెన్నై సహా దేశంలోని అనేక నగరాల్లో, కార్పొరేట్ స్కూళ్లు, కాలేజీల్లో, యూనివర్సిటీల్లో మత్తుపదార్థాల వినియోగం విచ్చలవిడిగా జరుగుతు న్నట్లు ఆరోపణలున్నాయి. యుక్తవయస్సులోని వారు తెలిసీ తెలియక ఈ ఉచ్చులో ఇరుక్కుంటున్నారు. అలా ఇరుక్కున్నవారి లక్షణాలు ఎలా ఉంటాయంటే...

 కళ్ళు ఎర్రబారి ఉంటాయి. కనుపాప సాధారణం కన్నా మరీ చిన్నది, లేదా పెద్దది అయిపోతుంది  ముక్కుతో పీల్చే కొకైన్ లాంటి డ్రగ్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ముక్కు వెంట తరచూ రక్తం కారుతుంటుంది  తిండి, నిద్ర అలవాట్లు మారిపోతాయి. అకస్మాత్తుగా బరువు పెరగడమో, తగ్గడమో జరుగుతుంది  శ్వాసలోనూ, ఒంటి నుంచి, దుస్తుల నుంచి అసాధారణ వాసనలు వస్తాయి  కాళ్ళూ చేతులు వణకడం, మాట నత్తిగా రావడం, మనిషిలో కుదురు లేకపోవడం కనిపిస్తాయి క్లాసులు తరచూ ఎగ్గొడుతుంటారు.

 ఆటపాటలు, హాబీల మీద ఆసక్తి పోతుంది  వినే సంగీతం, వేసుకొనే దుస్తులు, గదిలోని పోస్టర్లపై డ్రగ్స్, మద్యం అలవాట్లను ప్రతిబింబిస్తుంటాయి  చటుక్కున మూడ్స్ మారిపోతుంటాయి. తరచూ తగాదాలకు దిగుతుంటారు. ఎవరితోనూ కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడరు. గది తలుపులు ఎప్పుడూ బిడాయించుకొని, ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతుంటారు.   ఇలాంటి లక్షణాలు పిల్లల్లో కనిపిస్తే వెంటనే జాగ్రత్త పడాలి.

.............................................

సెన్సార్‌తో సమస్యేంటి? ఏం తీసేయమంటోంది?
పంజాబ్‌లో కేవలం మరో 9 నెలల్లో రాష్ట్ర శాసనసభ ఎన్నికలున్నాయి. ఈ నేపథ్యంలో పంజాబ్‌లోని డ్రగ్స్ ఉపద్రవంపై అభిషేక్ చౌబే దర్శకత్వంలో రూపొందిన ‘ఉడ్తా పంజాబ్’ అధికారపక్షానికి ఇబ్బందికరమైంది. సినిమా గనక అలాగే రిలీజైతే తమకు కష్టమని అధికార ‘శిరోమణి అకాలీదళ్’ (కేంద్రంలో గద్దెపై ఉన్న నేషనల్ డెమోక్రాటిక్ ఎలయన్స్‌లో భాగస్వామ్యపక్షం) సహజంగానే భావించింది.

మొదట 40... ఇప్పుడు 89 కట్స్!
నిజానికి, మొదట ఈ సినిమాను సెన్సార్‌కు పంపినప్పుడు ‘కేంద్ర చలనచిత్ర ధ్రువీకరణ సంస్థ’ (సి.బి.ఎఫ్.సి. జనం భాషలో ‘సెన్సార్ బోర్డ్’) 40 కట్స్ చేయా లంది. సినిమాలోని భాష, డ్రగ్స్ వినియోగ దృశ్యాలపై ఈ కట్స్ ఇచ్చింది. నిర్మాతలు దీనిపై అప్పీలు చేసుకున్నారు. కట్స్ లేకుండా, ‘ఏ’ సర్టిఫికెట్ ఇస్తారని ఆశించారు. కానీ, సినిమా చూసిన ‘రివైజింగ్ కమిటీ’ (ఆర్.సి) ఏకంగా సినిమా పేరులో ఉన్న ‘పంజాబ్’ అనే పదాన్నే తొలగించమంది. మొత్తం 89 కట్స్ చేయాలంది. పంజాబ్ రాష్ట్రం పేరు, రాజకీయాలు, ఎన్నికల ప్రస్తావన ఎక్కడ వచ్చినా తొలగించాలంది.

 ‘వాస్తవికతను చూపించడం’ సెన్సార్ బోర్డ్ చైర్మన్ పహ్లాజ్ నిహలానీకి నచ్చినట్లు లేదు. దాంతో, అసలు ఈ సినిమా కథ అంతా ఏ రాష్ట్రంలోనూ జరిగినట్లు కాకుండా, ఎక్కడో కల్పిత ప్రాంతంలో జరిగినట్లు చూపమని బోర్డ్ చెప్పినట్లు వార్తలు వచ్చాయి. అయితే, బోర్డ్ వర్గాలు ఆ వార్తల్ని ఖండిస్తున్నాయి. రాజకీయాలతో సంబంధం లేదంటూ, ‘‘మేము కేవలం సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వకుండా ఆపాం. కావాలంటే, నిర్మాతలు ‘ఫిల్మ్ సర్టిఫికేషన్ అప్పిలేట్ ట్రిబ్యునల్’ (ఎఫ్.సి.ఎ.టి)ని ఆశ్రయించవచ్చు’’ అంటున్నాయి.
........................................................

సినీ వివాదాలు... నిషేధాలు...
మూకీల కాలం నుంచి మన భారతీయ సినిమాకు సెన్సార్ కష్టాలు కొత్తేమీ కాదు. మతం, రాజకీయాలు, సెక్స్ లాంటి అంశాల కారణంగా సినిమాల్లో భావప్రకటన స్వేచ్ఛకు చాలా సార్లు సంకెళ్ళు పడ్డాయి. తెలుగునాట  పెద్ద ఎన్టీఆర్ ‘బొబ్బిలి పులి’, ‘శ్రీమద్వి రాట్ వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర’, కృష్ణ ‘అంతం కాదిది ఆరంభం’ సహా పలు చిత్రాలు సెన్సార్ చిక్కులు ఎదుర్కొన్నాయి. విప్లవ చిత్రాల మాదాల రంగారావు ‘విప్లవ శంఖం’, ‘ప్రజాశక్తి’, ‘ఎర్రమట్టి’ లాంటి చిత్రాల రిలీజ్ కోసం సెన్సార్‌బోర్డ్‌తో, ప్రభుత్వంతో పోరాటాలు, నిరాహార దీక్షలు చేయాల్సొచ్చింది. గత 4 దశాబ్దాల్లో వచ్చిన వివాదాల్లో కొన్ని...

1972 ‘సిద్ధార్థ’: 
పంపిణీ నుంచి నిషేధించిన తొలి చిత్రం. నటి సిమీ గరేవాల్ నగ్న సన్నివేశం కారణం. చివరకు 1996లో టీవీలో రిలీజ్ చేశారు.

1975 ‘ఆంధీ’: 
ఇందిరా గాంధీతో పోలికలున్నాయంటూ ‘ఎమర్జెన్సీ’ సమయంలో నిషేధించారు. తర్వాత గద్దె నెక్కిన జనతాపార్టీ ప్రభుత్వం రిలీజ్‌కు అనుమతించింది.

1978 ‘కిస్సా కుర్సీ కా’:
 ‘ఎమర్జెన్సీ’లో సంజయ్ గాంధీ అనుసరించిన విధానాలపై రాజకీయ వ్యంగ్య చిత్రం. సినిమా మాస్టర్ ప్రింట్‌నూ, కాపీలనూ సెన్సార్ బోర్డు నుంచి తీసుకెళ్ళి, కాల్చేశారు. తర్వాత కొంతకాలానికి సినిమా రిలీజైంది.

1994 ‘బ్యాండిట్ క్వీన్’: 
ఈ సినిమా వాస్తవానికి దగ్గరగా లేదంటూ మాజీ బందిపోటు రాణి ఫూలన్‌దేవి వాదన. ఢిల్లీ హైకోర్టు తాత్కాలిక నిషేధం.

1996 ‘ఫైర్’:
 హిందూ కుటుంబంలోని ఆడవారి మధ్య స్వలింగ సంపర్కం గురించి చూపారు. దర్శకురాలు దీపా మెహతాను చంపుతామంటూ బెదిరింపులొచ్చాయి. దాంతో, సెన్సార్ బోర్డ్ తలొగ్గింది. తర్వాత కట్స్ ఏమీ లేకుండానే రిలీజ్.

1996 ‘కామసూత్ర... ఎ టేల్ ఆఫ్ లవ్’:
 మీరా నాయర్ తీసిన సినిమా. దృశ్యాలు మరీ ‘బాహాటంగా’ ఉన్నా యని వాదన. అన్నీ బాగా తగ్గించేసిన వెర్షన్ రిలీజ్.

2003 ‘పాంచ్’ : 
1976 -77 ప్రాంతంలో జరిగిన జోషీ - అభ్యంకర్ వరుస హత్యలపై అనురాగ్ కశ్యప్ తీసిన సినిమా. సెన్సార్‌బోర్డ్ చాలా కట్స్‌తో అనుమతించింది.

2004 ‘బ్లాక్ ఫ్రైడే’: 
1993 నాటి బొంబాయి పేలుళ్ళపై తీసిన సినిమా. ప్రభావం చూపుతుందంటూ, తీర్పు వచ్చేదాకా రిలీజ్ ఆపేశారు. ఆనక 2007లో రిలీజ్.

2005 ‘పర్జానియా’: 
గుజరాత్ అల్లర్లపై సినిమా. నేషనల్‌అవార్డ్ వచ్చింది. గుజరాత్‌లో నిషేధించారు.

2005 ‘వాటర్’: 
వారణాసిలోని వితంతువుల అవస్థపై దీపా మెహతా తీసిన సినిమా. ఛాందసవాదుల విధ్వంసంతో శ్రీలంకలో సిన్మా తీశారు. 2007లో ఇండియాలో రీరిలీజ్.

2013 ‘మద్రాస్ కేఫ్’: 
రాజీవ్ గాంధీ హత్య, శ్రీలంక అంతర్యుద్ధంలో భారత జోక్యం చుట్టూ తిరిగే సినిమా. తమిళనాట ప్రదర్శించనివ్వలేదు.

2015 ‘ఎం.ఎస్.జి - ది మెసెంజర్ ఆఫ్ గాడ్’: 
పంజాబ్‌లోని ‘దేరా సచ్చా సౌదా’ అధినేత గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌ను దేవుడిగా అభివర్ణిస్తూ, ప్రచారం చేసిన సినిమా. పలు సిక్కు వర్గాలు సినిమాను నిషేధించాలని ఆందోళన చేశాయి. 2015 జనవరిలో సెన్సార్ బోర్డ్ సర్టిఫికెట్ ఇవ్వలేదు. తరువాత కొంతకాలానికి కట్స్‌తో ఇచ్చింది.
.........................................................

‘‘ఈ ‘ఉడ్తా పంజాబ్’ సినిమాను నిషేధించే బదులు పంజాబ్ ప్రభుత్వం ‘ఉడ్తా’ (ఎగసిపడుతున్న) డ్రగ్స్‌ను నిషేధించాలి. అది చేతకాకపోతే, వాళ్ళు తమను తాము నిషేధించుకోవాలి!’’
- రామ్‌గోపాల్ వర్మ, ప్రముఖ సినీ దర్శక - నిర్మాత

‘‘ఈ దేశంలో అత్యంత విలువైన ఆస్తి అయిన భావ ప్రకటన స్వేచ్ఛ గొంతు నులిమేస్తూ, దేశ పురోగతి గురించి ఎంత డబ్బా కొట్టుకొన్నా అది అర్థం లేని  పని.’’- మహేశ్‌భట్, ప్రముఖ సినీ దర్శక - నిర్మాత

‘‘నా ఈ పోరాటానికి దూరంగా ఉండాల్సిందిగా కాంగ్రెస్, ఆప్, ఇతర రాజకీయ పార్టీలను అభ్యర్థిస్తున్నా. ఇది కేవలం నా హక్కులకూ, సెన్సార్‌షిప్‌కూ మధ్య జరుగుతున్న పోరాటం. ... మిగిలినవాళ్ళు వారు పోరాటాలు వారు చేసుకోండి. నా పోరాటానికి ఎలాంటి రాజకీయ రంగులూ  పులమద్దు.’’
అనురాగ్ కశ్యప్, ‘ఉడ్తా పంజాబ్’ సహ-నిర్మాత, ప్రముఖ దర్శక - రచయిత

‘‘సెన్సార్ బోర్డ్ పనిలో కేంద్ర ప్రభుత్వం ఎన్నడూ జోక్యం చేసుకోదు. నా మీద ఎలాంటి రాజకీయ ఒత్తిడీ లేదు. సినిమా పూర్తిగా చూస్తే కానీ, మేము ‘పంజాబ్’ అనే పదం ఎందుకు తొలగించ మన్నామో మీకు అర్థం కాదు. ...అనురాగ్ కశ్యప్‌కు భావప్రకటన స్వేచ్ఛ ఉంది కాబట్టి, ఆయన ‘ఉత్తర కొరియా’ అనీ, మరొకటనీ ఏమైనా అనగలుగుతున్నారు. ‘ఆమ్ ఆద్మీ పార్టీ’ (ఆప్) నుంచి ఆయన డబ్బులు తీసుకున్నట్లు నేను విన్నాను. కేవలం పబ్లిసిటీ కోసమే వాళ్ళు ఇదంతా చేస్తున్నారు.’’
- పహ్లాజ్ నిహలానీ, కేంద్ర సెన్సార్ బోర్డ్ చైర్మన్ - ప్రముఖ నిర్మాత
.......................................

0 వ్యాఖ్యలు: