అభినయ ప్రదర్శనతో పని లేకుండా అవయవ ప్రదర్శనదే ప్రాధాన్యమైన ప్రస్తుత సినిమా ప్రపంచంలో గుర్తుండే కథానాయికల పేర్లు, ముఖాలు అతి తక్కువ. కానీ, రెండు దశాబ్దాల క్రితం పరిస్థితి అలాంటిది కాదు. పాత్రను బట్టి అభినయానికీ, అందానికీ సమయోచిత ప్రాధాన్యం కల్పించే నాయికలు కనిపించేవారు. ఆ తరం నాయికల్లో సుజాత ఒకరు. ఆమె చూపిన అభినయం ఇవాళ్టికీ ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయింది. అందుకే, ఏప్రిల్ 6వ తేదీన చెన్నైలో సుజాత అకాల మరణ వార్త తెలియగానే చాలా మందికి మనసు చివుక్కుమంది. అందచందాల ప్రదర్శనతో కాక అభినయంతోనూ, ఆత్మ విశ్వాసం నిండిన పాత్రలతోనూ అభిమానులను సంపాదించుకున్న ఓ మంచి నటి దూరమైనందుకు తెలుగు, తమిళ, మలయాళ సినీ ప్రియులు బాధపడ్డారు.
చారడేసి కళ్ళు, ముచ్చటైన ముఖం, తీర్చిదిద్దినట్లుండే శరీరం, హుందాతనం నిండిన అలంకరణ, వస్త్రధారణలతో సుజాత ఎవరికి వారికి తమ ఇంట్లో అమ్మాయిలా అనిపించేవారు. నిజానికి, సుజాత మలయాళ అమ్మాయి. వాళ్ళ సొంత ఊరు కేరళలోని ఎర్నాకుళం జిల్లాలోని మరదు. కానీ, తండ్రి ఉద్యోగ రీత్యా శ్రీలంకలో స్థిరపడ్డారు. సుజాత పుట్టింది, పెరిగింది - శ్రీలంకలోని గాలే ప్రాంతంలో. 1952 డిసెంబర్ 10న ఆమె జన్మించారు. ఎనిమిదిమంది తోబుట్టువుల్లో సుజాత ఒకరు. ఆమెకు ముగ్గురు అన్నయ్యలు, ముగ్గురు తమ్ముళ్ళు, ఒక చెల్లెలు.
రంగస్థలి నుంచి రంగుల లోకంలోకి...సుజాత ఇంగ్లీషు బాగా మాట్లాడేవారు. కానీ, అసలు ఆమె పెద్దగా చదువుకోలేదనీ, కనీసం పదో తరగతి దాకా అయినా బడికి పోలేదనీ తెలిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. సినిమాల్లో ఆమె ప్రవేశం కూడా గమ్మత్తుగా జరిగింది. 1966లో తండ్రి రిటైరయ్యాక, సుజాతకు 13 ఏళ్ళ వయస్సులో వాళ్ళ కుటుంబం మళ్ళీ కేరళకు వచ్చేసింది. అప్పట్లో 'సినిమా మాసియా' అని మలయాళంలో ఓ మాసపత్రిక వచ్చేది. ''మా పక్కింటి అంకుల్ వాళ్ళ కుటుంబంతో నేను స్నేహంగా ఉండేదాన్ని. ఆయన నా ఫోటోను ఆ పత్రికకు పంపారు. పత్రికలో నా ఫోటో రావడంతో, తమ నాటకాల్లో నటించాల్సిందిగా చాలా మంది అడిగేవారు. మా అన్నయ్యకు నాటకాలన్నా, సినిమాలన్నా ఇష్టం. అన్నయ్య ప్రోద్బలం వల్ల నటించడం మొదలుపెట్టాను'' అని సుజాత ఒక సందర్భంలో చెప్పారు. అలా ఆమె రంగస్థల కళాకారిణిగా అడుగులు వేశారు. మలయాళ మేకప్‌మన్ జోస్ ప్రకాశ్ సాయంతో 'పోలీస్ స్టేషన్' అనే మలయాళ నాటకంతో ఆమె రంగస్థలం మీదకు వచ్చారు. అలా నాటకాలు వేస్తుండగానే సినీ నిర్మాతల దృష్టిలో పడ్డారు.
పదిహేనో ఏట 1967లో సుజాత సినీ జీవితం మొదలైంది. మలయాళ చిత్రం 'తబస్విని' ఆమె తొలి చిత్రం. ఆ తరువాత తమిళంలో, ఆ పైన తెలుగులో ఆమెకు అవకాశాలు వచ్చాయి. ప్రముఖ దర్శకుడు కె. బాలచందర్ దర్శకత్వంలో 'అవళ్ ఒరు తొడర్ కదై' చిత్రం ద్వారా 1974లో సుజాత తమిళ చిత్ర పరిశ్రమలో ప్రవేశించారు (ఇదే చిత్రం తెలుగులో 1976లో 'అంతులేని కథ'గా జయప్రదతో రీమేకైంది). కుటుంబ బాధ్యతలను మోసే పట్టణప్రాంత ఉద్యోగిని పాత్రను సుజాత పోషించిన తీరు అప్పట్లో ఓ సంచలనమైంది. ఆ చిత్ర ఘనవిజయంతో సుజాతకు ఎన్నో సినిమా అవకాశాలు వచ్చాయి. శివాజీ గణేశన్, శివకుమార్, రజనీకాంత్, కమలహాసన్, విజయకుమార్ తదితర ప్రముఖ తమిళ హీరోల సరసన నాయిక పాత్రలను ఆమె ధరించారు. 'అవళ్ ఒరు తొడర్ కదై', 'విధి' లాంటి తమిళ చిత్రాల్లో విప్లవాత్మక ధోరణిలోని పాత్రలు పోషించిన ఈ అభినేత్రి కుటుంబ కథా చిత్రాల్లోని బరువైన పాత్రలను పోషించడంలోనూ అంతకు మించి పేరు సంపాదించారు. తమిళంలో ఆమె నటించిన 'సెందమిళ్ పాట్టు', 'అవళ్ ఒరువాళా' తదితర చిత్రాలు అందుకు నిదర్శనం.
సుజాతది ప్రేమ వివాహం. 1977 ప్రాంతంలో తమిళ చిత్రాల్లో తీరిక లేకుండా నటిస్తున్న సుజాత చెన్నైలో తాము అద్దెకున్న ఇంటివాళ్ళ అబ్బాయి జయకర్ హెన్రీని ప్రేమించారు. ఆ ప్రేమే, పెద్దల అభ్యంతరాలను కూడా లెక్కచేయకుండా పెళ్ళికి దారి తీసింది. తరువాత అమెరికా వెళ్ళినా, అక్కడి అలవాట్లు, సంప్రదాయాలు నచ్చని సుజాత కాన్పు కోసం భారతదేశానికి వచ్చి, భర్తతో కలసి ఇక్కడే ఉండిపోయారు.
తెలుగులో పండిన 'గోరింటాకు'తెలుగులో తొలి చిత్రం 'గోరింటాకు' (1979)తోనే ఆమె తెలుగు చిత్రసీమలో బలమైన ముద్ర వేశారు. 'యువచిత్ర' పతాకంపై దాసరి నారాయణరావు దర్శకత్వంలో నిర్మాత కె. మురారి నిర్మించిన ఆ చిత్రంలో హీరో శోభన్‌బాబు సరసన ఆమె పోషించిన పాత్ర ఇవాళ్టికీ సినీ ప్రియులకు మరపురానిదే. ''అప్పట్లో 'గోరింటాకు' చిత్రంలో కొత్త కథానాయిక కోసం వెతుకుతున్నాం. అప్పుడు బాలచందర్ గారి సాయంతో సుజాతను హీరోయిన్‌గా ఎంపిక చేశా. షూటింగ్ సమయంలో ఆమె నటన చూసి ఎంతో ఆశ్చర్యపోయాను. ఆ చిత్రంలో 'కొమ్మ కొమ్మకో సన్నాయి...', 'ఎలా ఎలా దాచావు అలవి కాని అనురాగం...' లాంటి పాటల్లో ఆమె నటన చాలా సహజంగా ఉంటుంది'' అని అప్పటి సంగతులను మురారి గుర్తు చేసుకున్నారు. అలాగే, 'సంధ్య' (1980) లాంటి తెలుగు చిత్రాల్లో సుజాత పోషించిన త్యాగమయమైన పాత్రలు అప్పటికీ, ఇప్పటికీ మనస్సును చెమరింపజేస్తాయి.
గమ్మత్తేమిటంటే - 'గోరింటాకు' అవకాశం వచ్చినప్పుడు సుజాత ముందు ఒప్పుకోలేదట! తెలుగు తెలియదు కాబట్టి, తెలియని భాషలో డైలాగులు చెప్పేటప్పుడు అందరూ నవ్వితే అవమానకరం కాబట్టి, నటించనని ఆమె చెప్పారు. కానీ, 'గోరింటాకు' చిత్ర రచయిత్రి కె. రామలక్ష్మీ ఆరుద్ర వదలకుండా, తాను దగ్గరుండి ప్రతిదీ నేర్పుతాననే సరికి, బలవంతం మీద సుజాత ఒప్పుకున్నారు. 'గోరింటాకు' చిత్రంలో ఏడుస్తూ ఓ పెద్ద డైలాగు చెప్పడానికి 16 టేకులు తిన్న సుజాత ఆ తరువాత పట్టుబట్టి తెలుగు నేర్చుకున్నారు. మొదట్లో సరిత, ఆ తరువాత ఇతరులు డబ్బింగ్ చెప్పినా, అటు పైన తెలుగు మీద పట్టు సంపాదించి, సొంతంగా సంభాషణలు చెప్పుకున్నారు. వృత్తి పట్ల అంకితభావం ఉన్న సుజాత తొలి రోజుల్లో సైతం ''పెద్ద స్టార్ హీరోయిన్‌ని అనే గర్వం కానీ, ఆడంబరం కానీ మచ్చుకైనా చూపించేవారు కాదు. అలాంటి మంచి మనిషి, గొప్ప నటి'' అని హీరో కమలహాసన్ సైతం ఇటీవల అన్నారు.
పెద్ద వయసు పాత్రల్లోనూ ప్రతిభావిష్కరణవిచిత్రంగా - కథానాయిక పాత్రలు వేసిన రోజుల నుంచి కూడా సుజాత గ్లామర్ పాత్రలు ధరించింది చాలా తక్కువ. తెలుగులో ఎన్టీఆర్ ('సర్కస్ రాముడు' - 1980), ఏయన్నార్ ('గురుశిష్యులు' - 1981), శోభన్‌బాబు ('గోరింటాకు' - 1979), కృష్ణంరాజు ('బెబ్బులి' -1980) లాంటి అప్పటి అగ్ర హీరోల సరసన నటించినప్పుడు కూడా ఆమె పాత్రల్లో హుందాతనమే ఎక్కువ. చిరంజీవితో 'ప్రేమతరంగాలు' (1980)లో నటించిన సుజాత 1980ల చివరినాటి కల్లా ఆమె పెద్ద వయసు పాత్రలు పోషించడం మొదలుపెట్టేశారు. అక్కినేనితో 'బహుదూరపు బాటసారి' (1983), 'జస్టిస్ చక్రవర్తి' లాంటి చిత్రాల్లో ఆమె పోషించిన పెద్ద తరహా పాత్రలు సైతం ప్రేక్షకుల్లో ఓ ఇమేజ్‌ను నిలిపాయి. అలాగే, గతంలో తాను హీరోయిన్‌గా నటించిన రజనీకాంత్, కమలసహాసన్‌లకు తల్లిగానూ సుజాత నటించారు. అందుకు రజనీకాంత్ 'బాషా' చిత్రమే ఈ మధ్య కాలపు ఉదాహరణ. 'ఏడంతస్తుల మేడ' (1980) తన చిత్రాల్లో తనకు బాగా నచ్చిన తెలుగు సినిమా అని చెప్పిన సుజాతకు 'పసుపు - పారాణి' (1980), 'సుజాత' (1980), 'సంధ్య' (1980), 'గుప్పెడు మనసు' (1979), 'వంశ గౌరవం' లాంటి చిత్రాలు ఆమెతో పాటు జనానికీ నచ్చాయి.
మధ్యతరగతి ఇల్లాలిగా, కుటుంబం బరువంతా మోసే వనితగా మంచితనం, త్యాగం నిండిన పాత్రలకు ఆమె ప్రతీకగా నిలిచారు. 'సీతాదేవి' చిత్రంలో వికలాంగురాలిగా ఆమె చక్కటి నటన ప్రదర్శించారు. ''భావోద్వేగ నటనకు సుజాత పెట్టింది పేరు. కెమేరా ముందు మాత్రమే అభినయించడం గొప్ప కాదు. డబ్బింగ్ సమయంలోనూ వాచికంలో ఆమె అంతే భావోద్వేగాలను పలికిస్తారు. అప్పట్లో తమిళనాట ఇళయరాజా సంగీతం ఉంటే సినిమాలు హిట్టయ్యేవి. అలాగే, సుజాత నటించినా చాలు, ఆ చిత్రాలు బ్లాక్‌బస్టర్లే!'' అని సుజాతతో 12 చిత్రాల్లో కలసి నటించిన తమిళనాట ప్రముఖ సీనియర్ నటుడు శివకుమార్ చెప్పారు.
పెద్ద వయస్సు పాత్రలకు మళ్ళాక, 1990లలో ఆమె 'సూత్రధారులు', 'చంటి', 'సూరిగాడు' లాంటి పలు చిత్రాల్లో నటించారు. 'చంటి' చిత్రంలో హీరో వెంకటేశ్ తల్లిగా ఆమె పాత్ర ఒక కోణంలో సాగితే, 'పెళ్ళి' చిత్రంలో కోడలి బాగు కోసం కొడుకుకు విషమిచ్చే తల్లి పాత్ర మరో కోణంలో నడుస్తుంది. రెంటినీ ఆమె సమర్థంగా పోషించారు. 'పెళ్ళి' చిత్రంలోని పాత్రకు ఉత్తమ సహాయ నటిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి నంది అవార్డు అందుకున్నారు. ఇటీవల 'శ్రీరామదాసు'లో భద్రాచల సీతారామ విగ్రహాలను సంరక్షించే భక్తురాలు దమ్మక్క పాత్రలో జీవించారు. తమిళంలో 'వరలారు', తెలుగులో 'వెంగమాంబ' ఆమె చివరి చిత్రాలు.
పుట్టుక రీత్యా మలయాళీ అయినా, సుజాత తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో దాదాపు 300 దాకా చిత్రాల్లో నటించారు. సెట్స్‌లో ఎవరితోనూ మాట్లాడకుండా, ముభావంగా ఉండడం మొదటి నుంచీ సుజాతకు అలవాటు. దాంతో, సుజాతకు పొగరెక్కువ అని ప్రచారం చేసినవాళ్ళూ ఉన్నారు. ''హంగామా లేకుండా అభినయం ద్వారా ఆకట్టుకొనే నటి సుజాత. పెళ్ళయిన తరువాత ఆమె ఎక్కువగా కుటుంబం మీద శ్రద్ధ చూపెడుతూ వచ్చారు. సెట్స్‌లో కూడా తన పనిలో తాను మునిగిపోయేవారు. గడచిన కొన్నేళ్ళుగా ఆమె సినీ పరిశ్రమకూ, బహిరంగ కార్యక్రమాలకూ దూరంగా కాలం గడుపుతూ వచ్చారు'' అని వెండితెరపై సుజాత తొలి చిత్రంలో ఆమెతో కలసి నటించిన తమిళ - తెలుగు సినీ నటుడు విజయకుమార్ చెప్పారు.
ఆఖరి రోజుల్లో బాధించిన అనారోగ్యంగడచిన కొన్నేళ్ళుగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. మూత్రపిండాలు దెబ్బతినడంతో ఆమె క్రమం తప్పకుండా డయాలసిస్ చేయించుకుంటున్నారు. అది అలా ఉండగా, హృద్రోగం కూడా తలెత్తడంతో, మార్చి నెలలో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆమెకు పేస్‌మేకర్‌ను ఏర్పాటుచేస్తూ, శస్త్రచికిత్స చేసినట్లు అభిజ్ఞవర్గాలు తెలిపాయి. ఆ శస్త్రచికిత్స నుంచి పూర్తిగా కోలుకోక ముందే గుండెపోటుతో సుజాత హఠాన్మరణం పాలయ్యారు. సుజాత, వ్యాపారవేత్త జయకర్ హెన్రీ దంపతులకు ఓ అబ్బాయి (సజీత్), ఓ అమ్మాయి (దివ్య).
ఇన్నేళ్ళుగా సినిమా రంగంలో ఉన్నా, ప్రచార ఆర్భాటాలకు దూరంగా, తన కన్నా తాను పోషించిన పాత్రలతోనే జనానికి సన్నిహితంగా మెలగడం సుజాతలోని విశిష్ట లక్షణం. 1970లు, '80లలో అభినయ ప్రధానమైన నాయిక పాత్రలు పోషించాలంటే, దర్శక, నిర్మాతలు అనివార్యంగా ఆమెనే ఎంచుకొనేవారు. నిజానికి, దర్శకుడు బాలచందర్ తీసుకువచ్చిన ఈ వజ్రం తమిళ, తెలుగు సినిమాల్లోకి వచ్చేనాటికి సినిమా హీరోయిన్లంటే టీనేజ్ అమ్మాయిలనే భావమే ఎక్కువ. అయిదు పదులు మీద పడిన అగ్ర హీరోలకు సైతం కుర్ర హీరోయిన్లే కథానాయికలు. వాళ్ళతో పోలిస్తే, వయస్సులోనూ, పరిణతిలోనూ పెద్దదైన సుజాత నాయికగా నిలదొక్కుకోవడం ఇవాళ వెనక్కి తిరిగి చూస్తే ఆశ్చర్యకరమే.
అందంలో, అభినయంలో హుందాతనం'గోరింటాకు' చిత్రం షూటింగ్ సమయానికే బిడ్డ తల్లి అయిన ఆమె, పసివాణ్ణి వెంట వేసుకొని షూటింగ్‌కు వచ్చేవారు. నాయిక పాత్రల నుంచి తల్లి పాత్రలకు మారినా, ఎబ్బెట్టుగా తోచకుండా, అభినయంతో పాత్రకు నిండుదనం చేకూర్చడం సుజాతలోని ప్రత్యేకత. అందమైన ముఖం, ఎడమ వైపు బుగ్గ మీద అందమైన చిన్న పుట్టుమచ్చ, ఒంటికి సరిగ్గా అతికినట్లు కుట్టించుకున్న జాకెట్ల, సాదాగా ఉన్నా చక్కటి కేశాలంకరణ, గంజి పెట్టినట్లు బిగుతుగా ఉండే కాటన్ చీర, అందుకు తగ్గ అలంకరణతో సుజాత ఎప్పుడూ హుందాగా కనిపించేవారు. ''ఎప్పుడూ ఆమె ముఖంలో చిరునవ్వే కనిపించేది. అలసట కనపడేది కాదు. ఆమె పరాయి భాషకు చెందిన అమ్మాయి అయినా, తెలుగు చిత్రాలతో తెలుగు ఆడపడుచుగానే గుర్తింపు పొందారు'' అని బాలచందర్ 'గుప్పెడు మనసు'తో సహా పలు చిత్రాల్లో సుజాతతో కలసి నటించిన శరత్‌బాబు పేర్కొన్నారు.
దక్షిణాది భాషా చిత్రాల్లో ప్రముఖ నటిగా పేరు తెచ్చుకున్న సుజాత ఎంత పెద్ద హీరోతో నటించినా, వాళ్ళకు దీటుగా అభినయిస్తూ, కొన్నిసార్లు వాళ్ళ కన్నా ఎక్కువ మార్కులు తానే సంపాదించేవారు. హీరోలదే రాజ్యమైన చిత్ర పరిశ్రమలో వివిధ భాషల్లో హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలకూ, వాటి బాక్సాఫీస్ విజయానికీ ఈ అభినేత్రి చాలా కాలం మూలస్తంభంగా నిలిచారు. అప్పట్లో నటించిన చిత్రాల్లో అధిక భాగం బలమైన ఇతివృత్తం, బిగువైన కథనాలతో కూడుకున్నవి కావడం కూడా ఆమెకు సానుకూల అంశమైంది. అలాగే, అతిగా భావావేశాల ప్రదర్శనే వెండితెరపై రాజ్యమేలుతున్న రోజుల్లో ఆమె సున్నితమైన హావభావాలతో, అండర్ ప్లే ద్వారా పాత్రను ప్రేక్షకుల మనస్సుల్లోకి జొప్పించేవారు. నాట్యం నేర్చుకోకపోయినా, ఆమె తన వెడల్పాటి కళ్ళతో సులభంగా నవరసాలూ పండించేవారు. అందుకే, ''నా చిత్రాల్లో నటించిన హీరోయిన్లందరిలోకీ చాలా చక్కటి నటి - సుజాత'' అని చెప్పే నిర్మాత మురారి అన్నట్లు, ''సావిత్రి లాంటి నటనా చాతుర్యం ఉన్న మనిషి సుజాత. అభినయ ప్రధానమైన పాత్రలకు చిరునామా అయిన ఆమె మరణం నిజంగా విషాదం.''
3 వ్యాఖ్యలు:
'గోరింటాకు' చిత్ర రచయిత్రి కె. రామలక్ష్మీ ఆరుద్ర---ఈ విషయమై కోర్టుకేసులు అవీజరగటం రచయిత్రి ఈవిడ కాదని తీర్పుచెప్పటం లాంటి గొడవలేవో ఉన్నాయి కదండి?
Dear Rajendra Kumar Devarapalli garu, Namaste. GORINTAKU chitraaniki cinema titles lo Katha ku credit Ramalakshmi garike iccharata. Adi Aaavida raasina 'RAAVUDU' (read as RAMUDU) katha adhaaramgaa thisinatlu darsaka niramatalu chepparu. Kaani adi Ranganaayakamma gari navala 'IDENAA NYAAYAM' (anukuntaa) lo ni itivrittaaniki copy ani court lo case jarigindi. Ex-party decree miida Ranganayakamma gariki aa 1979 rojullone Rs. 75000 vacchindata! Idi Gorintaaku katha venuka katha.
మొట్ట మొదటగా, ఈ నవల పేరు, "ఇదేనా న్యాయం" కాదు. అసలు పేరు, "ఇదే నా న్యాయం". ఈ తేడా, జాగ్రత్తగా గమనించాలి. కోర్టు, తెలుగు "గోరింటాకు" సినిమాకే కాకుండా, హిందీ "గోరింటాకు" సినిమా నిర్మించినందుకు కూడా, రంగనాయకమ్మ గారికి నష్ట పరిహారం ఇప్పించింది. ఈ కేసులో, రామలక్ష్మీ ఆరుద్ర, సాక్ష్యం చెబుతూ, "'ఇదే నా న్యాయం' పుస్తకం తాను చదవలేదని" చెప్పారు. కానీ, ఆ పుస్తకం గురించి ఆవిడ ఒక ఇంటర్వ్యూలో రాయడం కోర్టు వారి దృష్టికి తీసుకు వచ్చే సరికి, వారు రామలక్ష్మి చెప్పింది అబద్ధమని తేల్చారు.
Post a Comment