ఆ సినిమా వచ్చి ఇప్పటికి సరిగ్గా నాలుగు దశాబ్దాలైంది. విడుదలైన రోజుల నుంచి ఇవాళ్టి వరకు దాని గురించి గొప్పగా చెప్పుకుంటూనే ఉన్నారు. తెలుగు చలనచిత్ర లోకానికి కౌబాయ్ కథలను పరిచయం చేసి, సంచలనం రేపిన ఆ చిత్రం - 'మోసగాళ్ళకు మోసగాడు'. ఆ రోజుల్లో ''ఏ తెలుగు నిర్మాతా సాహసించని లొకేషన్లలో, విశేష వ్యయ ప్రయాసలతో నిర్మించిన అపూర్వ చిత్రం''గా ఓ విశిష్ట స్థాయిని అందుకున్న ఈ ''తొలి తెలుగు కౌబాయ్ చిత్రం'' విడుదలై, ఈ ఆగస్టు 27 నాటికి సరిగ్గా నలభై ఏళ్ళయింది. తెలుగు తెరపై హాలీవుడ్ పోకడలకు తెర తీసి, ఒక తరం ప్రేక్షకులను ఉర్రూతలూగించి, వివిధ భాషల్లోకి అనువాదమైన ఈ సూపర్‌హిట్ చిత్రం జ్ఞాపకాల స్వారీకి స్వాగతం...
ఒకే రకమైన జానపదాలు, పౌరాణిక చిత్రాలతో జనానికి విసుగెత్తుతున్న కాలం అది. ఎన్టీఆర్, ఏయన్నార్‌లు తారలుగా స్థిరపడిపోయి చాలా కాలం అవడంతో, యువతరానికి చెందిన నవ తారలకు అవకాశాలు తెరుచుకున్న సమయం. కృష్ణ, శోభన్‌బాబు లాంటి నటులు ఆ అవకాశాలను అందుకోవాలని తపిస్తున్న తరుణం. ఆ పరిస్థితుల్లో ఇంగ్లీషు, హిందీ చిత్రాల స్ఫూర్తితో తెలుగు సినిమా సైతం క్రైమ్, యాక్షన్ తరహా చిత్రాల వైపు క్రమంగా మొగ్గింది. అలాంటి కొత్త కథల అన్వేషణలో తెలుగు మసాలాతో వండి, వడ్డించిన పాశ్చాత్య తరహా కౌబాయ్ వంటకం - 'మోసగాళ్ళకు మోసగాడు' (సంక్షిప్తంగా 'మో.మో').
కౌబాయ్ కథే ఎందుకు?
తెలుగు సినీ లోకానికి అప్పటికి కొత్తగా అనిపించే ఈ సాహస గాథను హీరో కృష్ణ అసలు ఎందుకు ఎంచుకున్నారు? దాని వెనుక కూడా నాటకీయత, సాహసం ఉన్నాయి. 1960ల ద్వితీయార్ధంలో సినిమాల్లోకి వచ్చిన కృష్ణ వరుసగా సినిమాలు చేస్తూ, 1970 నాటికి 40కి పైగా సినిమాలు చేశారు. కానీ, నటుడి నుంచి తార స్థాయికి తనకు పదోన్నతి కల్పించే చిత్రాలు చేయలేకపోతున్నాననే అసంతృప్తి ఆయనలో కలిగింది. ఆ అసంతృప్తి నుంచే సొంత చిత్ర నిర్మాణ సంస్థ, సొంత సినిమాల నిర్మాణమనే ఆలోచనలకు బీజం పడింది. అనుకున్నదే తడవుగా పెద్దమ్మాయి పేరు మీద 'శ్రీపద్మాలయా మూవీస్' సంస్థను నెలకొల్పారు. ఆ పతాకంపై తొలి సొంత చిత్రంగా తానే హీరోగా 'అగ్ని పరీక్ష' (1970) నిర్మించారు. కానీ, అది ఫ్లాపైంది. హీరోగా కృష్ణ ఆశించిన ఫలితమూ దక్కలేదు.
దాంతో, స్వీయ చిత్ర నిర్మాణ సంస్థలో పెద్ద హిట్ సాధించాలనీ, ఇటు నిర్మాతగా, అటు హీరోగా పేరు తెచ్చుకోవాలనీ సహజంగానే కృష్ణలో పట్టుదల పెరిగింది. అలాంటి విజయం సాధించాలంటే, ఓ కొత్త తరహా సినిమా తీయాలని భావించారు. సరైన కథ కోసం వెతుకులాట మొదలైంది. అదే సమయంలో 'మెకన్నాస్ గోల్డ్' లాంటి హాలీవుడ్ కౌబాయ్ చిత్రాలు మద్రాసులో సంచలనం రేపుతున్నాయి. కృష్ణ మనసులో తళుక్కున ఆలోచన మెరిసింది. అలాంటి కౌబాయ్ కథే తెలుగులో తీస్తే? అలా 'మెకన్నాస్ గోల్డ్', 'గుడ్, బ్యాడ్, అగ్లీ', 'ఫ్యూ డాలర్స్ మోర్' తదితర హాలీవుడ్ చిత్రాలను కలిపి, తెలుగులో కొత్త వంటకం తీయాలనే నిర్ణయానికి వచ్చారు. ఆ పాశ్చాత్య కథలు, సంఘటనలను పక్కాగా తెలుగు వాతావరణానికి తగ్గట్లు వండి, వడ్డించే బాధ్యతను రచయిత ఆరుద్రకు అప్పగించారు. అదిగో అలా తయారైన కథే - 'మోసగాళ్ళకు మోసగాడు'.
ఊళ్ళూ, పేర్లూ మాత్రం తెలుగు వాతావరణానికి తగ్గట్లు మార్చి, పాత్రల రూపురేఖలు, వస్త్రాలంకరణ మాత్రం ఇంగ్లీషు కౌబాయ్ సినిమాల శైలిలోనే ఉండేలా చూశారు. ఇంగ్లీషు చిత్రాల స్ఫూర్తితోనే తెలుగులో స్క్రీన్‌ప్లే సిద్ధం చేసుకున్నారు. కృష్ణతో 'టక్కరి దొంగ - చక్కని చుక్క' (1969) తదితర చిత్రాలు రూపొందించిన కె.ఎస్.ఆర్. దాస్ రౌడీ రాణి' (1970) చిత్ర విజయంతో మంచి జోరు మీదున్నారు. దాంతో, యువకుడు దాస్‌ను ఈ యాక్షన్ చిత్రానికి డైరెక్టర్‌గా ఎంచుకున్నారు.
సాహస గాథకు సాహసోపేత చిత్రీకరణ
ఒక్క ముక్కలో చెప్పాలంటే, ప్రేమికులైన హీరో హీరోయిన్లు తమ తండ్రులను చంపినవారిపై ఎలా పగ సాధించుకున్నారనేది ఈ చిత్ర కథ. హంతకులెవరో కనిపెట్టి, వారిని వెంటాడి, వేటాడే ఈ క్రైమ్ ఫార్ములాకు అమూల్యమైన నిధి కోసం అన్వేషణ, దాన్ని శోధించి సాధించడం, ప్రజల పరం చేయడం ఆసక్తికరమైన పైపూత! ఎడారుల్లో ఒంటెల మీద ప్రయాణం, గుర్రాల మీద ఛేజింగులు, పేలే తుపాకులు, కాలే ఇళ్ళు, దుర్గమమైన ప్రాంతాల్లో ప్రయాణాలు, సరసాలు, సరదాలు, వినోదాలతో ఊపిరి సలపనివ్వని ఉత్కంఠతో, చకచకా సాగిపోయే కథా కథనం 'మో.మో'ను అప్పట్లో ప్రత్యేకంగా నిలిపాయి. ఈ సాహస గాథను సెల్యులాయిడ్‌పై చిత్రీకరించిన తీరు కూడా నిజంగా సాహస గాథే.
అప్పట్లో హీరో కృష్ణ సినిమాలను మూడు, నాలుగు లక్షల బడ్జెట్‌లో తీసేవారు. కానీ ఈ చిత్రానికి అంతకు రెట్టింపు మొత్తాన్ని ఖర్చు చేశారు. ''భారతదేశంలోనే తొలి కౌబాయ్ మా 'మోసగాళ్ళకు మోసగాడు'. ఆ సినిమాను సిమ్లా, రాజస్థాన్‌లోని బికనీర్, మద్రాసు, పాండిచ్చేరిలలో తీశాం. ఎడారి దృశ్యాలను రాజస్థాన్‌లోని కోటా అనే చోట చాలా శ్రమపడి చిత్రీకరించాం'' అని కథానాయకుడు కృష్ణప్రసాద్ పాత్రను పోషించిన హీరో కృష్ణ చెప్పుకొచ్చారు. కథానాయిక రాధగా నటించిన విజయనిర్మల సైతం తన కెరీర్‌లో ఎంతో కష్టపడి నటించిన సినిమా 'మో.మో' అని చెప్పారు. ''ఈ సినిమా కోసం హీరోయిన్‌గా ఎన్నడూ అలవాటు లేని ఫైట్లు, గుర్రపుస్వారీ చేయాల్సి వచ్చింది. ఈ సినిమా కోసం నేను, కృష్ణ గారు, నాగభూషణం గారు రోజూ మద్రాసులోని మెరీనా సముద్రతీరంలో గుర్రపు స్వారీ సాధన చేసేవాళ్ళం'' అని విజయనిర్మల చెప్పారు.
''ఆ చిత్ర నిర్మాణం కోసం కృష్ణ ఎంతో శ్రమపడ్డారు. యూనిట్ సభ్యులందరినీ రైళ్ళలో ఢిల్లీకి తీసుకువెళ్ళి, అక్కడ గదులు బుక్ చేసి ఉంచి, అక్కడ నుంచి సిమ్లాకు తీసుకువెళ్ళారు'' అని కృష్ణ కెరీర్ తొలి రోజుల నుంచి ఆయనతో సాన్నిహిత్యం ఉన్న సీనియర్ సినీ జర్నలిస్టు మోహన్ కుమార్ చెప్పారు. హీరో కృష్ణ నిర్మించిన చిత్రాలకు కొద్దికాలం పాటు నిర్మాణ వ్యవహారాలను పర్యవేక్షించిన అనుభవం కూడా ఆయనకు ఉంది. సత్యనారాయణ, ప్రభాకరరెడ్డి, జ్యోతిలక్ష్మి తదితర ప్రముఖ నటీనటులెందరో ఈ చిత్రంలో నటించారు. రాజస్థాన్‌లోని థార్ ఎడారిలో మనుషులు తిరగని, మంచినీళ్ళు కూడా దొరకని చోట ప్రాణాలకు తెగించి, ఈ చిత్ర షూటింగ్ చేశారు. బికనీర్ కోటలో, సట్లెజ్ నదీ తీరంలోని తట్టాపానీ ప్రాంతంలో చిత్రీకరణ జరిపారు. ''మో.మో. ఓపెనింగ్ షాటే ఎంతో థ్రిల్లింగ్‌గా ఉంటుంది. వి.ఎస్.ఆర్. స్వామి కెమేరా పనితనం తెలియాలంటే, 'మో.మో' చూడాల్సిందే!'' అని మోహన్ కుమార్ అన్నారు.
విలన్లు ఎడారిలో వదిలేసి వెళ్ళినప్పుడు, తాగడానికి నీళ్ళయినా లేక ఎండలో మాడిపోయి హీరోకు ముఖమంతా పొక్కులు వచ్చినట్లు చూపించే సన్నివేశం ఈ చిత్రంలో ఉంది. సరైన మేకప్ సామగ్రి దొరకని సమయంలో కృష్ణ వ్యక్తిగత మేకప్‌మ్యాన్ సి. మాధవరావుకు చటుక్కున ఓ ఆలోచన వచ్చింది. దగ్గరలోనే బఠాణీలు దొరికితే తెప్పించారు. ఆ బఠాణీల పైన పొరలా ఉండే, తొక్కు తీయించారు. ఆ తొక్కులను హీరో కృష్ణ ముఖంపై అంటించారు. అంతే! సన్నివేశానికి కావాల్సిన ముఖంపై పొక్కుల ఎఫెక్ట్ వచ్చింది. సాంకేతిక నిపుణులు చూపిన అలాంటి సమయస్ఫూర్తి, 'గుడ్, బ్యాడ్, అగ్లీ' చిత్రంలోని 'అగ్లీ' పాత్ర స్ఫూర్తితో మలచిన నక్కజిత్తుల నాగన్న (పాత్రధారి విలక్షణ నటుడు నాగభూషణం) పాత్రచిత్రణ, ఫైట్ మాస్టర్లు మాధవన్, రాఘవులు చేసిన సాహసాల లాంటివి ఇవాళ్టికీ ఓ పెద్ద గాథ.
తప్పిన అంచనాలు! తప్పని గురి!!
అయితే, ఈ చిత్ర షూటింగ్ జరుగుతున్నప్పుడు నిరుత్సాహపరిచినవారూ లేకపోలేదు. ప్రముఖ నిర్మాత - దర్శకుడు, చిత్ర పరిశ్రమలో హీరో కృష్ణకు మొదటి నుంచీ శ్రేయోభిలాషీ అయిన చక్రపాణి ఒకసారి షూటింగ్ జరుగుతుండగా వచ్చారు. సెట్‌లోని కౌబాయ్ వాతావరణం, నటీనటుల గెటప్‌లు చూసి, ఆయన పెదవి విరిచారు. మన తెలుగు వాతావరణానికి దూరంగా ఉండే ఈ గెటప్పులనూ, సెటప్పులనూ సామాన్య ప్రేక్షక జనం మెచ్చరని తన అంచనా అడక్కుండానే చెప్పేశారు. కానీ, అప్పటికే సగానికి పైగా సినిమా షూటింగ్ అయిపోయింది. దాంతో, హీరో కృష్ణ బృందం ఆ అభిప్రాయాలను పక్కనపెట్టి, ముందుకు సాగారు. మొదట ఈ చిత్రానికి 'అదృష్ట రేఖ' అని పేరు పెడదామనుకున్నా, చివరకు 'మోసగాళ్ళకు మోసగాడు' అనే మాస్ టైటిల్‌నే ఎంచుకున్నారు.
తీరా షూటింగ్ పూర్తయి, తొలి కాపీ వచ్చాక కూడా ప్రివ్యూలు చూసినవారెవరూ, ఈ సినిమాపై సరైన అంచనా చెప్పలేకపోయారు. కానీ, హీరో ఎన్టీఆర్ మాత్రం 'బాగుంది బ్రదర్! నిజంగా విభిన్నమైన మాస్ సినిమా తీశారు. అయితే, ఈ సినిమాలో ఆడవాళ్ళకు నచ్చే అంశాలు మిస్సయ్యారు. కాబట్టి, వాళ్ళు పెద్దగా చూడరు. ఫస్ట్ రిలీజ్ కన్నా, రీ-రిలీజుల్లో మరింత డబ్బు వస్తుంది. సంచలనం రేపుతుంది' అన్నారు. సరిగ్గా ఆయన అన్నట్లే అయింది. 1971 ఆగస్టు 27 శుక్రవారం నాడు బెంగుళూరుతో సహా తెలుగు నాట సుమారు 27 కేంద్రాల్లో, ''దాదాపు 35 ప్రింట్లతో'' 'మోసగాళ్ళకు మోసగాడు' విడుదలైంది. చివరకు, ''ఎన్టీఆర్ చెప్పినట్లే అయింది. మహిళాదరణ దక్కలేదు కానీ, సినిమా సంచలనాత్మక విజయం సాధించింది'' అని హీరో కృష్ణ అప్పటి సంగతులను గుర్తు చేసుకున్నారు.
సక్సెస్‌కు సహకరించిన అంశాలు
తెలుగులో అంతకు మునుపెన్నడూ రాని సాహస గాథా చిత్రమైన 'ఈ కొత్త తరహా సినిమా తెలుగు తెరకు శోభాయమానమైన అమూల్య కానుక' అని అధికశాతం మంది అభిప్రాయపడ్డారు. ఇంకా బ్లాక్ అండ్ వైట్ చిత్రాలే రాజ్యమేలుతున్న ఆ రోజుల్లో పూర్తిగా ''ఈస్ట్‌మన్ కలర్‌లో నిర్మించిన ఈ చిత్రంలో కథ కన్నా, కథా గమనం కన్నా కమనీయమైన దృశ్యాలు ప్రేక్షకులను విశేషంగా'' ఆకర్షించాయి. ''ఒక చక్కని ఆంగ్ల చిత్రం చూస్తున్నట్లు'' అనిపించింది.
ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇది దర్శకుడు, ఛాయాగ్రహణ దర్శకుల చిత్రం. ఈ చిత్రానికి వన్నె తెచ్చింది, ప్రాణం పోసింది - ముఖ్యంగా వి.ఎస్.ఆర్. స్వామి సినిమాటోగ్రఫీ. అప్పుడప్పుడే వాడుకలోకి వస్తున్న రంగుల ఫిలిమ్‌ను ప్రకృతి రామణీయతను చూపేందుకు సద్వినియోగం చేసుకున్నారు. కెమేరా కోణాలను వి.ఎస్.ఆర్. స్వామి ఎంత వేగంగా మారుస్తూ వెళ్ళారో, సన్నివేశ పరంపరను కె.ఎస్.ఆర్. దాస్ అంతే వేగంగా నడిపిస్తూ వెళ్ళారు. ఫలితంగా చిత్రంలోని లోటుపాట్లు చటుక్కున ఎవరికీ తట్టలేదు.
ఈ చిత్రకథకు సందర్భశుద్ధి కల్పించడానికి ఆరుద్ర ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ, అవి లోపరహితం కాలేకపోయాయి. ఈ సినిమాలో చూపినట్లు చిత్ర కథ జరిగే కర్నూలు సబాలో ఎడారులుండవు. గుంటూరు సర్కార్‌లో మంచుకొండలూ ఉండవు. అయినా, ఆ ఊపులో ఈ అనౌచిత్యం గురించి ప్రేక్షకులు ఎవరూ ఆలోచించ లేదు. ''దర్శకుడు కె.ఎస్.ఆర్. దాస్ ఎన్నో ప్రయోగాలు చేశారు. ఎప్పటికప్పుడు కొత్త కొత్త కెమేరా కదలికలు వాడాలని ఆయన ప్రయత్నిస్తుంటారు. 'మోసగాళ్ళకు మోసగాడు'లో ప్రధానంగా 8 ఆకారంలో కనిపించే కెమేరా కదలిక ఆయన సృష్టించినదే!'' అని కృష్ణ, ఈ వ్యాసకర్తకు వెల్లడించారు.
ఇక, సంగీతం, ప్రధానంగా నేపథ్య సంగీతాన్ని చిత్ర వాతావరణానికి అనుకూలంగా, కొత్త తరహాలో ఉంటూ జనాన్ని బాగా హుషారు పరిచేలా ఆదినారాయణరావు సమకూర్చారు. 'కోరినది దరి చేరినది...' అనే యుగళగీతం ఆకట్టుకుంది. డైరెక్టర్, సినిమాటోగ్రాఫర్ల కృషి ఫలించడానికి కోటగిరి గోపాలరావు కూర్పు కూడా బాగా తోడ్పడింది. విచిత్రం ఏమిటంటే, అప్పటి దాకా నాయిక, ప్రధాన పాత్రలకే పరిమితమైన శాస్త్రీయ నర్తకి, నటి రాజసులోచనతో ఈ చిత్రంలో ఓ శృంగార నృత్యం చేయించడం! 'సిగ్గేలా మగాడికీ.. పగ్గాలా వయారికీ...' అనే ఆ పాటలో రాజసులోచన నృత్యం ఆనాటి ప్రమాణాల్లోనే ఆంగ్ల చిత్రాల స్థాయిని అందుకుంది.
సరికొత్త చరిత్రకు శ్రీకారం
హీరోగా కృష్ణకు 60వ సినిమాగా విడుదలైన 'మోసగాళ్ళకు మోసగాడు' చిత్రం విమర్శలు, లోపాలకు అతీతంగా విజయవంతమైంది. 'పద్మాలయా' పతాకానికి తొలి విజయం అందించడమే కాక, తొలి తెలుగు కౌబాయ్ సినిమాగా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. కృష్ణ ఈ చిత్రంతో స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు. అంతకు పదింతల పేరు నిర్మాతగా సంపాదించుకున్నారు. ''కేవలం 7 లక్షల రూపాయల బడ్జెట్‌లో 28 రోజుల్లో ఆ చిత్రాన్ని నిర్మించాం. తొలి రిలీజ్‌లోనే దాదాపు రూ. 32 లక్షలు వసూలు చేసింది. స్టార్ ఇమేజ్ కోసం సొంత బ్యానర్‌ను పెట్టిన నా లక్ష్యం నెరవేరింది. వెరసి 'మోసగాళ్ళకు మోసగాడు' ఓ ట్రెండ్ సెట్టర్ అయింది'' అని కృష్ణ అన్నారు.
ఆ సినిమాతో కృష్ణ ఎంత బిజీ అయ్యారంటే, మరో 12 చిత్రాలు విడుదలయ్యాక కానీ, ఆయన మళ్ళీ సొంత సినిమాను ప్రారంభించలేనంత బిజీ!
ఈ సక్సెస్‌ఫుల్ సినిమా సహజంగానే ఇతర భాషల్లోకి డబ్ అయింది. తమిళంలో 'మోసక్కారనుక్కు మోసక్కారన్'గా, హిందీలో 'గన్‌ఫైటర్ జానీ' పేరుతో, ఇంగ్లీషులో 'ది ట్రెజర్ హంట్'గా అనువాదమైంది. ''తమిళంలో వంద రోజులాడింది. హిందీలో వంద రోజులు ఆడలేదు కానీ, బాగా వసూళ్ళు సాధించింది'' అని కృష్ణ చెప్పారు. గమ్మత్తేమిటంటే, హాలీవుడ్ చిత్రాల స్ఫూర్తితో అటు నుంచి ఇటు వచ్చిన ఈ చిత్ర కథ, మళ్ళీ ఇటు నుంచి అటు ఇంగ్లీషులోకి అనువాదమై, అక్కడి ప్రేక్షకుల్ని అలరించడం! ''ఇంగ్లీషు డబ్బింగ్ రూపం గల్ఫ్ దేశాలు, సింగపూర్, కౌలాలంపూర్, టర్కీ, ఆఫ్రికన్ దేశాలన్నిటిలో కలిపి దాదాపు 80 దేశాల్లో విడుదలైంది'' అని కృష్ణ తెలిపారు.
సినిమా విడుదలైన తొలి రోజుల్లో ప్రచారంలో పేర్కొన్నట్లుగానే ఈ చిత్రం ''తెలుగు చలనచిత్ర చరిత్రలో నూతనాధ్యాయం ప్రారంభించిన చిత్రం''గా నిలిచింది. ఆ పైన మరెన్నో కౌబాయ్ చిత్రాలు తెలుగులో రావడానికీ, కృష్ణ కూడా మరిన్ని కౌబాయ్ వేషాలు వేయడానికీ తోడ్పడింది. 'మోసగాళ్ళకు మోసగాడే' ప్రేరణగా దాదాపు 15 కౌబాయ్ చిత్రాల్లో కృష్ణ నటించారు. అయితే, ఆ తదుపరి చిత్రాలేవీ తొలి విజయాన్ని మరిపించలేక పోయాయి.
సాక్షాత్తూ కృష్ణకు నట వారసుడైన యువ హీరో మహేష్‌బాబుతో కూడా మళ్ళీ అదే రకమైన కథతో పదేళ్ళ క్రితం భారీ వ్యయంతో 'టక్కరి దొంగ' (2002) చిత్రం నిర్మితమైంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో, హాలీవుడ్ కౌబాయ్ ల అసలు సిసలు లొకేషన్లలో ఆ సినిమా తీశారు. హీరో కృష్ణ కూడా ఆ సినిమా శుభం కార్డు పడే సమయంలో ఒక్క క్షణం తెరపై మెరిశారు. కానీ, అవేవీ ఆ సినిమాకు విజయం అందించలేకపోయాయి. ఏమైనా, ఇవాళ్టికీ తెలుగులో కౌబాయ్ హీరో అంటే కృష్ణే! కౌబాయ్ సినిమా అంటే - 'మోసగాళ్ళకు మోసగాడే'!