జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Sunday, September 19, 2010

ఈ డిజిటల్ యుగంలో జర్నలిజం ఏమై పోతుంది?



(ఫోటో వివరం - ప్రసంగిస్తున్న 'ది గార్డియన్' ఎడిటర్ అలన్ రస్ బ్రిడ్జర్ ).............

ఈ డిజిటల్ యుగంలో జర్నలిజం ఏమై పోతుంది? ఈ ప్రశ్న చాలా ఆసక్తికరమైనదే. అందుకే, 'ది ఫ్యూచర్ ఆఫ్ జర్నలిజమ్ ఇన్ ది డిజిటల్ ఏజ్' అనే అంశంపై ఉపన్యాసమంటే నాకు సహజంగానే ఆసక్తి కలిగింది. పైగా, ఈ సెప్టెంబర్ 25తో 132 ఏళ్ళు పూర్తి చేసుకుంటున్న ఆంగ్ల దినపత్రిక ‘ది హిందూ’, వారి భాగస్వామ్యంలో నడుస్తున్న ‘ఏషియన్ కాలేజ్ ఆఫ్ జర్నలిజమ్’ సంయుక్తంగా ఈ ఉపన్యాసాన్ని ఏర్పాటుచేశాయి. ప్రపంచ ప్రసిద్ధ ఆంగ్ల పత్రికల్లో ఒకటైన ‘ది గార్డియన్’ సంపాదకుడు అలన్ రస్ బ్రిడ్జర్ ఉపన్యాసకుడు.

వారం రోజుల క్రితం ‘హిందూ’లో ఈ కార్యక్రమం గురించి ఓ చిన్న ప్రకటన చూసినప్పటి నుంచి ఎలాగో ఒకలా వీలు చేసుకొని వెళ్ళాలని అనుకుంటూ వచ్చా. తీరా పనుల్లో పడి ఆహ్వానపత్రం తెప్పించుకోవడం మర్చిపోయా. నిన్న 18వ తేదీ శనివారం సాయంత్రం కార్యక్రమం మరో గంటలో ఉందనగా - తెలిసిన మరో జర్నలిస్టు మిత్రుడికి హడావిడిగా ఫోన్ చేశా - ఇన్విటేషన్ కోసం. మద్రాసు ఎగ్మూరులోని ప్రసిద్ధ మ్యూజియమ్ థియేటర్లో సభ. గబగబా వెళ్ళా.

చాలా ఏళ్ళ తరువాత మళ్ళీ మ్యూజియమ్ థియేటర్ లోపల అడుగుపెట్టా. పాత కాలపు వాస్తు నిర్మాణరీతిలో వర్తులాకారంలో ఉండే ఆ భవనం, లోపల కూడా అదే పద్ధతిలో ఉండే సభాంగణం, గోడల మీద డిజైన్లు, వేదిక మీద పాతకాలపు నాటక, సినిమా శాలల్లో ఉండే లాంటి నస్యం పొడి రంగు సిల్కు తెర - మనకు తెలియకుండానే మనల్ని ఓ చిత్రమైన మానసిక స్థితిని కలిగిస్తాయి. నాదీ అదే పరిస్థితి. ఏషియన్ కాలేజ్ ఆఫ్ జర్నలిజమ్, అన్నా యూనివర్సిటీలకు చెందిన జర్నలిజమ్ విద్యార్థినీ విద్యార్థులతో, ఇతర ఆహ్వానితులతో సభారంభానికి ముందుగానే ఆడిటోరియమ్ దాదాపుగా నిండిపోయింది.

సరిగ్గా చెప్పిన టైముకి సాయంత్రం 5.30 గంటలకల్లా సభ మొదలైపోయింది. ‘హిందూ’ దినపత్రిక ఎడిటర్ - ఇన్ - ఛీఫ్ ఎన్. రామ్ వేదిక మీదకొచ్చి, వక్తను స్థూలంగా పరిచయం చేసి, వేదిక ఆయనకు అప్పగించి కిందకు దిగిపోయారు. 1995 నుంచి ‘ది గార్డియన్’కు ఎడిటర్ గా పనిచేస్తున్న అలన్ తన బ్రిటిష్ ఇంగ్లీషు యాసలో ఉపన్యసించడం మొదలుపెట్టారు. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ తో సాగిన ఆ అనర్గళ ప్రసంగాన్ని అలవాటు లేని ఆ యాసలో అర్థం చేసుకోవడానికి కొంచెం కష్టమనిపించినా, కాసేపయ్యే సరికి కొద్ది కొద్దిగా అలవాటవడం మొదలైంది.

‘డిజిటల్ యుగంలో జర్నలిజమ్ భవిష్యత్తు’ గురించి అలన్ రస్ బ్రిడ్జర్ గంటసేపు అనర్గళంగా మాట్లాడారు. అటు అభివృద్ధి చెందిన దేశాలలోని మీడియానూ, ఇటు అభివృద్ధి చెందుతున్న భారత్ లాంటి దేశాల్లోని మీడియానూ పోల్చి చూస్తూ, కొన్ని ఆసక్తికరమైన అంశాలు చెప్పుకొచ్చారు. 2004లో ‘ది గార్డియన్’ రూపురేఖలను సమూలంగా మార్చేసిన చరిత్ర అలన్ ది. ప్రపంచంలోని 10 అగ్రశ్రేణి వార్తా వెబ్ సైట్లలో ఒకటిగా ఆ పత్రికను ఆయన తీర్చిదిద్దారట. ఆ వెబ్ సైట్ కు 3 కోట్ల మంది పాఠకులన్నారట. వాక్ స్వాతంత్యం, భావ ప్రకటనా స్వేచ్ఛ విషయంలో తమ దేశంలో ఆయన విశేష కృషి చేస్తున్నారట.

సమాచార ప్రసారంలో వేగంగా ఆధునికతను తెచ్చిపెడుతున్న ఈ డిజిటల్ యుగంలో జర్నలిజమ్ లో కూడా ఆ ఆధునిక సాధనాలను ఉపకరణాలుగా చేసుకోక తప్పదని ఆయన స్పష్టం చేశారు. నిజానికి, 110 కోట్ల జనాభా దాటిన భారతదేశంలో ఇవాళ ఇంటర్నెట్ కేవలం 8 కోట్ల మందికే అందుబాటులో ఉంది. అంటే 7 శాతం మంది అన్న మాట. అదే చైనాలో అయితే, 40 కోట్ల మందికి నెట్ అందుబాటులో ఉందట. నెట్ వినియోగం తక్కువగా ఉన్నందు వల్ల భారత్ లో ఇప్పటికిప్పుడు కొత్త డిజిటల్ మీడియాతో ఇబ్బందులు లేవు.

కానీ, మొబైల్, 3జి వినియోగం లాంటివి వేగంగా పెరిగిపోతున్నందు వల్ల కొన్నేళ్ళలోనే భారత్ లోని సమాచార సాధనాలకు, ముఖ్యంగా పత్రికలకు డిజిటల్ మీడియా పెను సవాలుగా మారనుంది. అమెరికా, ఐరోపా లాంటి దేశాల్లో లాగా భారత్ లోని పత్రికలు కూడా పెద్ద కుదుపునకు లోనవడం ఖాయం. ‘‘అందుకు ఎంత సమయం పడుతున్నంది చెప్పలేం కానీ, అక్కడి లాంటి సవాళ్ళే ఇక్కడా రావడం తథ్యం’’ అని అలన్ స్పష్టం చేశారు. ‘ఎప్పుడో కదా అది మీద పడేది’ అని నిర్లక్ష్యంతో కూర్చోకుండా, చేతిలో ఉన్న ఈ సమయాన్ని సమర్థంగా వినియోగించుకొని, తగిన వ్యూహంతో జర్నలిజమ్ రంగంలోని వారు ముందుకు అడుగు వేయడం మంచిదని ఆయన సలహా ఇచ్చారు.

(మిగతా భాగం మరికాసేపట్లో...)

2 వ్యాఖ్యలు:

Anil Atluri said...

తెలుగులో ఏ పత్రికైనా కనీసం అనువాదాన్నైనా ప్రచురిస్తుందేమోనని వెయ్యికళ్ళతో ఎదురుచూసి, మనకి అవకాశం లేదులే అని అనుకున్నాను.
నేనే అనువదించి, బ్లాగ్ చేద్దామన్న ఉద్దేశం కూడ ఏర్పడింది.
కాని మీరు ఇప్పుడు చేసారు. చాలా సంతోషం. మద్రాసులో ఉండి ఉంటే తప్పక నేను వెళ్ళే వాడిని అ సభకి.
మిగతా భాగాలకోసం ఎదురు చూస్తుంటాను.
థాంక్స్!

Unknown said...

@ బల్లేపల్లి గారూ, కృతజ్ఞతలు.
@ అనిల్ గారూ, నమస్తే. ఇలాంటి వార్తలు ఎందుకనో మన పత్రికలు ప్రచురించవు. రోజూ మొదటి పేజీలో వేడి వేడిగా తమ ప్రత్యర్థి పార్టీలపైన విమర్శలు, కుంభకోణాల వార్తలు వేయడంతోనే మన భాషా పత్రికలకు తెల్లారిపోతోంది. ప్రముఖులు, పెద్దల వార్తలు కూడా లోకల్ మినీలు దాటి మెయిన్ ఎడిషన్లకు వెళ్ళవు. ఇదీ మన దౌర్భాగ్యం.