జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Thursday, September 2, 2010

భలే మంచిరోజు: నాటి మేటి తారల ఈనాటి కలయిక





ఫోటో వివరాలు -
1. (అందరి కన్నా వెనక వరుసలో) ముఖేశ్, శంకర్, భానుచందర్, అంబిక, శోభన
2. (వెనక నుంచి 2వ వరుసలో) రాధిక, సుమలత, ...., కార్తీక్, ప్రభు, మోహన్, అంబరీశ్, రాధ, ప్రతాప్ పోతన్, లిస్సీ ప్రియదర్శన్, సురేశ్, సుహాసినీ మణిరత్నం
3. (వెనక నుంచి 3వ వరుసలో) అర్జున్, శరత్ కుమార్, మోహన్ లాల్, చిరంజీవి, వెంకటేశ్
4. (ముందు వరుసలో) ఖుష్బూ, పూర్ణిమా భాగ్యరాజ్, రమ్యకృష్ణ, రజనీకాంత్, నరేశ్


..............................................


చిన్నప్పుడు కలసి తిరిగిన వాళ్ళం, కలసి చదివిన వాళ్ళం, కలసి ఎదిగినవాళ్ళం, కొండొకచో కలహించుకున్న వాళ్ళం మళ్ళీ చాలా ఏళ్ళకు కలిస్తే..... ఎంత మధురమైన ఆలోచన. ఇలా పాత స్కూల్ మేట్లు, కాలేజ్ మేట్లు కలుసుకోవడం, ఆ పాత రోజులు గుర్తు చేసుకోవడం ఇటీవలి కాలంలో జరుగుతున్నాయి. అలాంటి గెట్ టుగెదర్ కార్యక్రమాల వార్తలు తరచూ వింటూనే ఉన్నాం. పేపర్లలో, టీవీల్లో చూస్తూనే ఉన్నాం.

సినిమా వాళ్ళు మాత్రం తక్కువ తిన్నారా. వాళ్ళు కూడా ఇప్పుడు అదే బాట పట్టారు. 1980లలో ప్రముఖ తారలుగా వెలిగినవాళ్ళలో చాలామంది మొన్న ఆగస్టు 29న మద్రాసులో కలుసుకున్నారు. నిజానికి, ఆ నటీనటులు ఇలా కలుసుకోవడం వరుసగా ఇది రెండో ఏడాది. వాళ్ళు తామందరి మధ్య ఉన్న స్నేహ సౌహార్దాలనూ, ఐకమత్యాన్నీ వెల్లడించుకోవడానికి దీన్ని ఓ సందర్భం చేసుకుంటున్నారు.

క్రితం ఏడాది లానే ఈ సారి ఈ రెండో సమావేశాన్ని కూడా నటి - దర్శకురాలు సుహాసినీ మణిరత్నం నిర్వహించారు. మరో నటి లిసీ ప్రియదర్శన్ ఆతిథ్యమిచ్చారు. విశేషం ఏమిటంటే, ఈ సారి మన తెలుగు హీరోలు చిరంజీవి, వెంకటేశ్ కూడా ఈ ఆత్మీయ కలయికలో భాగమయ్యారు. అలాగే, మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, తమిళ హీరో శరత్ కుమార్, తెలుగులోనూ తరచూ కనిపించే తమిళ -కన్నడ నటుడు అర్జున్ కూడా ఈ సారి వచ్చి కలిశారు. ఓ పక్క రెండో కూతురు సౌందర్య పెళ్ళి పనులతో హడావిడిగా ఉన్నా సరే, ఈ సారి కూడా రజనీకాంత్ ఈ మిత్రుల కలయికలో పాలుపంచుకోవడం విశేషం. అన్నట్లు ఏటేటా జరపాలనుకుంటున్న ఈ కలయికకు 'ఎవర్ గ్రీన్ ఎయిటీస్' అని పేరు పెట్టుకున్నారు.

రజనీకాంత్, చిరంజీవి, మోహన్ లాల్, వెంకటేశ్, అంబరీశ్, అర్జున్, శరత్ కుమార్, ప్రభు, కార్తీక్, మోహన్, ప్రతాప్ పోతన్, ముఖేశ్, శంకర్ లు పాల్గొన్నారు. మన భానుచందర్, ఇప్పుడు ఎక్కువగా టీవీ సీరియల్స్ లో వస్తున్న తెలుగు సినీ నటుడు సురేశ్, తండ్రి పాత్రలకు ఎదిగిన అప్పటి కామెడీ హీరో నరేశ్, తెలుగు కుర్రకారును ఆకట్టుకున్న రాధ, ఆమె అక్కయ్య అంబిక, రాధిక, సుహాసిని, సుమలత, శోభన, రమ్యకృష్ణ, ఖుష్బూ, రేవతి, పూర్ణిమా భాగ్యరాజ్, నదియా, లిస్సీ - ఇలా ఆ కలయికలో పాలుపంచుకొన్నవారందరూ మనకు బాగా తెలిసిన తారలే.

ఏటా ఇలా ఏటా ఒక రోజు కలసి, తమ పాత సంగతులన్నీ కలబోసుకోవాలని వాళ్ళు నిర్ణయించుకున్నారు. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక - ఇలా దక్షిణాది సినీ పరిశ్రమలకు చెందిన వారంతా ఓ చోట కలవడం విశేషమే. ఈ 1980ల బ్యాచ్ నటీనటులంతా ఇక నుంచి ఏటా ఒక్కో రాష్ట్రంలో కలుసుకోవాలని తీర్మానించుకున్నారు. అంతేకాకుండా, ఇలా సినీ నటులు మాత్రమే కలసి ఓ క్లబ్ లాగా ఏర్పడడం ప్రపంచంలోనే ఇదే మొదటిసారని (?) కూడా వీళ్ళు గొప్పగా చెబుతున్నారు.

ఆ మాట ఎలా ఉన్నా, వీళ్ళ కలయికను చూసిన తరువాత నా మటుకు నాకు మళ్ళీ విజయవాడ వెళ్ళాలనిపించింది. నా స్కూల్ మేట్లనూ, కాలేజ్ మేట్లనూ మరోసారి కలుసుకోవాలనిపించింది. ఇలాగే, ఏటా కలుసుకొనేలా ఓ ప్రణాళిక వేయాలనిపించింది. "ఆనాటి ఆ స్నేహమానంద గీతం... ఆ జ్ఞాపకాలన్ని మధురాతి మధురం...." అంటూ పాడుకోవాలనిపించింది. వృత్తి ఉద్యోగాల కోసం భౌగోళికంగా దూరమైన వాళ్ళం, ఒత్తిడిలో మునిగిపోయినవాళ్ళం మళ్ళీ దగ్గర కావడానికి ఇలాంటి కలయికలు తరచూ అవసరమే. కాదంటారా.

15 వ్యాఖ్యలు:

కృష్ణప్రియ said...

Nice..

dynamite said...

Nice :)

కొత్త పాళీ said...

ఒకప్పటి మా కలలరాణుల్ని ఇలా నలభయ్యాభైల పిప్పళ్ళబస్తాల్లా చూపి మా కలల్ని నిర్దాక్షిణ్యంగా భగ్నం చెయ్యడాన్ని తీవ్రంగా నిరసిస్తున్నాం అధ్యక్షా!

Unknown said...

కొత్త పాళీ గారూ!
నమస్తే. నాటి మేటి తారల ఈనాటి కలయిక మీద మీ అభిప్రాయం చదివాను. మీ బాటలోనే సమాధానం చిత్తగించండి.

అధ్యక్షా!
నిన్నటి తరం కలల రాణులు పిప్పళ్ళ బస్తాలుగా తయారవడంలో ఈ బ్లాగుకు ఏ మాత్రం సంబంధం లేదని మనవి చేస్తున్నాను. ఇది ఎవరూ కావాలని చేసిన తప్పు కాదనీ, ప్రకృతి సహజ పరిణామంలో ఏర్పడ్డ విపత్తనీ, కొండొకచో ఆ యా నటీనటుల స్వయంకృతాపరాధమనీ మీ ద్వారా సభకూ, గౌరవనీయులైన సభ్యుడికీ తెలియజేస్తున్నాను. ఎవరి కలలనూ భగ్నం చేయాలనే ఆలోచన కానీ, ఆశయం కానీ ఈ బ్లాగుకూ, బ్లాగర్ కూ లేదని మరోసారి మీ ద్వారా మనవి చేస్తున్నాను. ఏమైనా గౌరవనీయ సభ్యుల కలలకు అసౌకర్యం, అంతరాయం కలిగినందుకు విచారిస్తున్నాం. (స్మైలీ ఎలా ఇన్ సర్ట్ చేయాలో ఎవరైనా కాస్త చెబుదురూ! బొత్తిగా నాకు తెలిసి చావడం లేదు. ప్చ్....).

Unknown said...

@ కృష్ణప్రియ గారూ,
@ డైనమైట్ గారూ,

కృతజ్ఞతలు.

భావన said...

నైస్ బాగుంది అండి. కొత్తపాళి గారు అంతగా 80 లలో అభిమానించిన మెరుపుతీగ ఇప్పుడూ పిప్పళ్ళ బస్తా ఐన శాల్తి ఎవరబ్బా? అక్కడ వున్న బ్యాచ్ అంతా మొదటి నుంచి అదే మాదిరి కదా.. :-(

Unknown said...

@ భావన గారూ, నమస్తే. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలు. 1980లలో తెలుగుతెరపై అందరూ పిప్పళ్ళ బస్తాలేనా!? ... అబ్బా! ఒప్పుకోలేమండీ. మీ వాఖ్యా స్వాతంత్ర్యాన్ని గౌరవిస్తూనే, కొందరి కలల స్వాతంత్ర్యాన్ని మరింత గౌరవిస్తున్నాం. ఏమైనా, కొత్తపాళీ గారి వెండితెర మెరుపు తీగ ఎవరో తెలుసుకోవాలనే ఆసక్తిని మా అందరిలో కూడా పెంచేశారు. బాబ్బాబూ... ఈ టెన్షన్ తట్టుకోలేం కానీ, మీకు పుణ్యం ఉంటుంది. అదెవరో త్వరగా చెప్పిద్దురూ...

Kalpana Rentala said...

భావనా,

శోభన, సుహాసిని, సుమలత, రమ్యకృష్ణ వీళ్లంతా అప్పట్లో సన్నగానే వుండేవారు కదా! చూద్దాము వీళ్ళల్లో పాపం కొత్తపాళీ గారి కలల రాణి ఎవరో....

kalpana

చదువరి said...

భావన గారు, కల్పన గారూ: కొత్తపాళీ గారు ఒక్క రాణితో సరిపుచ్చలేదని మనవి చేస్తున్నాను.

ఈ ఫోటో చూడగానే ఎంచేతో ఠక్కున పంచతంత్రం సినిమా గుర్తుకొచ్చింది. చక్కటి ఫోటో పెట్టార్సార్!
---------------
లిస్సీ, రమ్యకృష్ణ ఇద్దరూ ఒకే సినిమాతో రంగప్రవేశం చేసినట్టు గుర్తు. ఆ సినిమాలో ఆమె పేరును లిజీ అని వేసారు. ఆమె ఆ తరవాత పెద్దగా సినిమాల్లో రాలేదు. (సుమన్ తో ఆత్మబంధువు అనే ఒక సినిమా వచ్చినట్టు గుర్తు) ఇన్నాళ్ళకు మళ్ళీ ఇలా. బావుంది!

జ్యోతి said...

కొత్తపాళీగారి కలలరాణులు మళయాలసుందరీమణులు అంబిక, రాధ అయ్యుండొచ్చు. నాకైతే వాళ్లిద్దరే పిప్పళ్ల బస్తాల్లా ఉన్నారు..:))

భావన said...

జయదేవ్ గారు,కల్పనమరీ అంత సన్నగా శోభన తప్ప ఎవరున్నారు అబ్బా. సుమలత ఇప్పటికి ఆ ఫొటో లో లావేమి లేదు గా. అవును శోభన ఎక్కడస్మీ ఆ చిత్ర రాజం లో? సుహాసిని కూడా మరి అంత లావేమి లేదు లే మొన్న వరుడు సినిమా లో చూసి కాస్త కుళ్ళుకుని కూడా చస్తే నేను. ;-)
ఇకరమ్య కృష్ణ ఆమె 80 లలో బానే లావు గా వుండేది ఆ తరువాత సన్నబడి మళ్ళీ ప్రాభవాన్ని పెంచి మళ్ళీ తగ్గేరు కదా.

చదువరి గారు లిజి ఎక్కడండీ అందులో,ఆత్మ బంధువు సినిమాలో అవును ఆమే. పాటలు బలే వుంటాయి ఆ సినిమా లో. (ఏదోఆగ్లచిత్ర రాజంకాపీ కదా ఆ సినిమా?)

జ్యోతి వూరుకోమ్మా అంబిక రాధ సన్నం ఏంటీ మరీ కామెడీ కాకపోతే.. ;-)

చదువరి said...

భావన గారూ,
వెనక వరసలో ఆ గుండతని పక్కన ఉన్నామె శోభనే కదండీ! సుహాసిని పక్కనున్నామె లిజీ.
..........

ఆ గుండు సురేష్ ఎవరా అని చాలా సేపు అర్థం కాలేదు.. మీనా ’అల్లరిపిల్ల’లో హీరోయే గదా! ఈడి తస్సాదియ్య.. ఏమైపోయాడు? అసలెక్కడా కనబడ్డంలేదెంచేతో! ఆ సినిమాలో చిన్నాగాడు, సురేషూ చక్కగా చేసారు. బాగుంది ఈ బ్యాచ్చి. మోహనులో మాత్రం పెద్దగా తేడా కనబడ్డంలేదు. ఆ సుమలత పక్కన థమ్సప్ ఎవరో తెలీడం లేదండీ.. రేవతా!?

చదువరి said...

రజనీకాంతు, వెంకటేషూ చాలా కెమెరా కాన్షస్ అనీ, ఫొటో కోసం కొంత కృతకంగా ఉంటారనీ అనుకుంటాను. ఈ ఫొటోలో వీళ్ళు అలాగే కనిపిస్తున్నారు. నరేషు, రమ్యకృష్ణ మాత్రం భేషజాలు లేకుండా చలాకీగా ఉంటారు, ఉన్నారు.

రాధ, అంబిక, రాధిక, పూర్ణిమా జయరామ్, ఖుష్బూ - ఈ బ్యాచ్చంతా బొద్దుగానే ఉండేవాళ్ళు లెండి.

జ్యోతి said...

సుమలత పక్కన ఉన్నది నదియా. కొన్ని తెలుగు సినిమాల్లో చేసింది కూడా..

కొత్త పాళీ said...

వామ్మో, నేను కాసేపు బయటికెళ్ళొచ్చేసరికి నా కలల సామ్రాజ్యం మీద ఇన్ని దాడులా!!!