జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Sunday, September 5, 2010

60 ఏళ్ళ సాహితీ సేద్యం, 200 పుస్తకాలు: ఓ బెజవాడ కవి - రచయిత జీవితం



(ఇవాళ ప్రముఖ కవి - రచయిత కీర్తిశేషులు రెంటాల గోపాలకృష్ణ గారి 90వ జయంతి. ఆ సందర్భంగా ఈ తరం సామాన్య శ్రోతలకు రెంటాలను స్థూలంగా పరిచయం చేయాలనే ఉద్దేశంతో, నిన్న సెప్టెంబర్ 4న ఆకాశవాణి మద్రాసు కేంద్రం 'రెంటాల జీవితం - రచనలు' పేరిట ప్రసంగం ప్రసారం చేసింది. ఆ ప్రసంగ వ్యాసం ఇది. జన్మనివ్వడమే కాక, సాహితీ సంస్కారాన్ని పంచి, పెంచిన ఆ అక్షర మూర్తికి అశ్రునివాళి అర్పిస్తూ....)

‘‘లోకంలో శోకించే పతితుల ప్రాణాలన్నీ / నా పాటల వృక్షంపై / పక్షులుగా విశ్రమించు’’ - అంటారు కవి - రచయిత రెంటాల. ఆధునిక తెలుగు సాహిత్యంలో, పత్రికా రంగంలో రెంటాల ( 1920 – 1995 ) పేరు విననివారు ఉండరు. కవిగా, నాటక కర్తగా, రచయితగా, విమర్శకుడిగా, జర్నలిస్టుగా, వక్తగా ఆయన లబ్ధ ప్రతిష్ఠులు. జనంలో ‘రెంటాల’గా ప్రసిద్ధులైన ఆయన పూర్తి పేరు - రెంటాల గోపాలకృష్ణ.

పుట్టుపూర్వోత్తరాలు


తెలుగునాట తొలితరం అభ్యుదయ కవితా వైతాళికులలో రెంటాల గోపాలకృష్ణ ఒకరు. ఆయన 1920వ సంవత్సరం సెప్టెంబర్ 5వ తేదీ, కృష్ణాష్టమి నాడు గుంటూరు జిల్లా పల్నాడు తాలూకా రెంటాల గ్రామంలో జన్మించారు. పాండిత్యం, ప్రతిభ గల కుటుంబం వారిది. చిన్నప్పటి నుంచీ రెంటాలలో సాహిత్య సృజనాభిలాష ఎక్కువ. వివిధ గ్రంథాలు, పురాణాలు, శాస్త్రాలను అధ్యయనం చేశారు. సమకాలీన సాహిత్య, సామాజిక, రాజకీయ ధోరణులకు ఆయన స్పందించేవారు.

నరసరావుపేట - నవ్యకళాపరిషత్ - నయాగరా

స్కూలు ఫైనల్ లో ఉండగానే 1936లో పదహేరేళ్ళ ప్రాయంలో 'రాజ్యశ్రీ’ అనే చారిత్రక నవలను రాశారు. మిత్రుల సాయంతో 1939లో ప్రచురించి, సంచలనం రేపారు. ఈ చారిత్రక నవలకు ప్రముఖ పండితులు, చరిత్ర శాస్త్ర అధ్యాపకులు శ్రీమారేమండ రామారావు ముందుమాట రాశారు. పాఠశాల ప్రాంగణంలో ఉండగానే రెంటాల ఛందస్సును క్షుణ్ణంగా నేర్చుకొని, వివిధ వృత్తాలు, గీతాలలో పద్యరచన చేశారు. 1937లో స్కూల్ ఫైనల్ వరకు నరసరావుపేటలోని మునిసిపల్ హైస్కూల్ లో చదువుకున్నారు. ఆనాడే ఏల్చూరి సుబ్రహ్మణ్యం, అనిసెట్టి సుబ్బారావు, బెల్లంకొండ రామదాసు, కుందుర్తి ఆంజనేయులు, గంగినేని వెంకటేశ్వరరావు లాంటి సాహితీ మిత్రుల సాహచర్యం రెంటాలకు సిద్ధించింది. ప్రముఖ కవి - ప్రధానోపాధ్యాయుడు శ్రీనాయని సుబ్బారావు శిష్యరికం అబ్బాయి. తరువాత గుంటూరులోని కళాశాలలో బి.ఏ. (తెలుగు సాహిత్యం) చదువుకున్నారు.

కళాశాలలో చదువుకుంటూనే ఈ సాహితీ మిత్రులంతా కలసి, నరసరావుపేటలో 'నవ్యకళాపరిషత్’ అనే కవిత్వ, సాహితీ చర్చ వేదికను ప్రారంభించారు. ఆ రోజుల్లోనే సాహితీ చర్చలు జరుపుతూ, నవ్యకవితా ధోరణికి నాంది పలికారు. 1943లో రెంటాల విజయవాడ వచ్చి స్థిరపడ్డారు. మార్క్సిజమ్ అధ్యయనం, శ్రీశ్రీతో సన్నిహితత్వం, అభ్యుదయ సాహిత్యోద్యమం - వీటితో ఆయన రచనల్లో నూతన దృష్టి మొదలైంది. 1943లో ఆంధ్ర అభ్యుదయ రచయితల ప్రథమ మహాసభ జరిగాక వెలువడిన తొలి అభ్యుదయ కావ్యం ‘నయాగరా’. అభ్యుదయ కవితా ఉద్యమానికి మేనిఫెస్టోగా చెప్పదగిన ‘నయాగరా' కవితా సంపుటి ప్రచురణలో రెంటాల సహాయకుడిగా పాలుపంచుకొన్నారు. ఏల్చూరి, కుందుర్తి, బెల్లంకొండలకు చేదోడువాదోడుగా ఉన్నారు. అలా ‘నయాగరా' కవి మిత్ర బృందంలో ముఖ్యుడిగా నిలిచారు. మిత్రులతో కలసి తొలినాళ్ళలోనే అభ్యుదయ రచయితల సంఘంలో చేరి, ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా కొనసాగారు.

అభ్యుదయ కవిగా 'సంఘర్షణ', 'సర్పయాగం'

1950లలోనే 'సంఘర్షణ', 'సర్పయాగం'మొదలైన స్వీయ కవితా సంపుటాలను రెంటాల వెలువరించారు. అభ్యుదయ కవిత్వానికీ, శ్రామిక జన ప్రబోధ సాహిత్యానికీ, ఆనాటి నిజామ్ వ్యతిరేక తెలంగాణా సాయుధ పోరాటానికీ ప్రతీకగా కవితా సృజన సాగించారు. "పగలేయి నిజాం కోట / ఎగరేయి ఎర్రబావుటా / విశ్వరూపం దాల్చి / విప్లవాణువు పేల్చి / విలయ నేత్రం కాల్చి / విషకిరీటం కూల్చి / పగలేయి నిజాం కోట / ఎగరేయి ఎర్రబావుటా...." అని నిరంకుశ నిజామ్ ప్రభువుపై కవితా ఖడ్గమెత్తారు. "అమ్మా! ఉమా! రుమా! హిరోషిమా! / విలపించకు, పలవించకు! / విలపిస్తూ, పలవిస్తూ / తపియించకు, శపియించకు! / రాబోయే యుగానికి / నీవేలే మొదటి రోజు! / రాబోయే రికార్డుకు నీదేలే మొదటి పేజీ!...." అంటూ రెండో ప్రపంచ యుద్ధ బీభత్సాన్ని వర్ణించారు. తీసుకున్న అంశం ఏదైనా రెంటాల తనదైన గొంతుకను వినిపించారు. శ్రీశ్రీ సైతం ఈ కవిత్వానికి ముగ్ధుడై, అభినందించారు. భారత పర్యటనకు వచ్చిన జపనీస్ శాంతి సంఘానికి శ్రీశ్రీ అప్పటికప్పుడు రెంటాల కవిత హిరోషిమాకు ఆంగ్లానువాదం చేసి, వినిపించారు. జపనీయులు సైతం రెంటాలను అభినందనలతో ముంచెత్తారు. రెంటాల రాసిన పలు కవితలను ప్రముఖ కవి ఆలూరి బైరాగి లాంటి వారు హిందీలోకి కూడా అనువదించారు.

అలాగే, 'కల్పన' కవితా సంపుటికి సంపాదకులలో ముఖ్యుడిగా రెంటాల వ్యవహరించారు. ఆ సంపుటి వెలుగు చూడడంలో అత్యంత కీలకపాత్ర పోషించారు. భావ కవిత్వం, నవ్య కవిత్వాలకు ముద్దుకృష్ణ 'వైతాళికులు' లాగా, అభ్యుదయ ప్రగతిశీలవాద కవిత్వానికి 'కల్పన' కవితా సంపుటి జయపతాకగా నిలిచింది. ఆనాటి ప్రముఖ అభ్యుదయ కవులందరి కవితల సంకలమైన'కల్పన'ను ఆనాటి ప్రభుత్వం నిషేధించింది.

పాత్రికేయ జీవితం

ఉదరపోషణార్థం ఉద్యోగం చేయడం తప్పనిసరైనా, సాహిత్యాభిలాష కారణంగా రైల్వే, తదితర ప్రభుత్వ ఉద్యోగాలను రెంటాల కాలదన్నారు. 1942 ప్రాంతంలో కొంతకాలం చల్లా జగన్నాథం గారి సంపాదకత్వంలోని 'దేశాభిమాని' పత్రికలో గుంటూరులో పనిచేశారు. చదలవాడ పిచ్చయ్య గారి సంపాదకత్వాన వెలువడిన 'నవభారతి' మాసపత్రికలో మరికొంతకాలం కర్తవ్యనిర్వహణ చేశారు. అనంతరం 1960 ప్రాంతంలో అవసరాల సూర్యారావు, బెల్లంకొండ రామదాసు లాంటి మిత్ర రచయితలతో కలసి నీలంరాజు వెంకట శేషయ్య గారి సంపాదకత్వంలో వెలువడుతున్న 'ఆంధ్రప్రభ' దినపత్రికలో ఉపసంపాదకత్వ బాధ్యతలు చేపట్టారు. ఆనాటి నుంచి దాదాపు మూడు దశాబ్దాల పాటు అదే సంస్థలో వివిధ స్థాయుల్లో ఉద్యోగ నిర్వహణ చేశారు. 'ఆంధ్రప్రభ' దినపత్రిక సంపాదక మండలి సభ్యుడిగా గురుతర బాధ్యతలు నిర్వహించారు.

పాత్రికేయ వృత్తిలో ఉంటూనే, 'పంచకల్యాణి - దొంగల రాణి', 'కథానాయకురాలు' లాంటి కొన్ని చలనచిత్రాలకు రెంటాల మాటలు, పాటలు సమకూర్చారు. 'ఆంధ్రప్రభ'దినపత్రికలో సినీ విశేషాల వారం వారీ అనుబంధం 'చిత్రప్రభ'కు నిరంతరాయంగా సంపాదకత్వ బాధ్యతలు నిర్వహించారు. కొత్త సినిమాలపై వారం వారం ఆయన రాసే సమీక్షలు పాఠకులకు ఆసక్తికరమయ్యాయి. సుప్రసిద్ధ సినీ విమర్శకుడిగా ఆయనకు పేరు తెచ్చాయి. సినీ - సాంస్కృతిక రాజధానిగా వెలిగిన విజయవాడలో అప్పట్లో జరిగే సినిమా సమావేశాలు, కార్యక్రమాల్లో గురుపీఠం రెంటాల గారిదే.

పత్రికా రచనలో భాగంగా ఆయన సాంస్కృతిక, జ్యోతిష, కళా రంగాలపై ఎన్నో వ్యాసాలు, సమీక్షలు రాశారు. ఆయన రాసిన సంపాదకీయాలు కూడా కోకొల్లలు. యాంత్రికంగా, గడియారం వంక చూసుకుంటూ మొక్కుబడిగా పనిచేసే చాలామంది జర్నలిస్టులకు రెంటాల భిన్నమైన వారు. నిబద్ధతతో, నిర్దేశిత పని గంటల సమయానికి అతీతంగా నిరంతరం శ్రమించేవారు. తనదైన శైలిలో దగ్గరుండి ఎడిషన్ వర్కును పూర్తి చేయించేవారు. జర్నలిస్టుగా రెంటాలకున్న ఆ విశిష్ట గుణం ఆ తరం పాత్రికేయులకు సుపరిచితం.

పత్రికా రచనను చేపట్టినప్పటికీ, రెంటాల తన సాహితీ సేద్యాన్ని ఏనాడూ ఆపలేదు. 'అభ్యుదయ', 'మాతృభూమి', 'సోవియట్ భూమి', 'ఆనందవాణి', 'విజయవాణి', 'విజయప్రభ', 'నగారా' లాంటి ఆనాటి ప్రముఖ పత్రికలలోనూ, 'ఆంధ్రప్రభ' సచిత్ర వారపత్రిక, 'ఆంధ్రజ్యోతి' దిన, వార పత్రికల్లోనూ, 'స్వాతి' వార, మాసపత్రికల్లోనూ, 'బాలజ్యోతి' పిల్లల మాసపత్రికలోనూ రెంటాల రచనలు, ధారావాహికలు అనేకం ప్రచురితమయ్యాయి.

(మిగతా భాగం మరికాసేపట్లో....)

5 వ్యాఖ్యలు:

కొత్త పాళీ said...

సంతోషం, నాన్నగారి రచనా జీవితం టూకీగానైనా ఇలా పరిచయం కావడం.

సత్యవతి said...

నా మొట్తమొదటి ఉద్యోగం ఆంధ్రప్రభలో అప్పుడక్కడ అజంతా గారు రెంటాల గారు బెల్లంకొండ రామదాసుగారు .. వాళ్ళందర్ని చూస్తే చచ్చే భయమెసేది వాళ్లకన్న నేను వయసులోనూ తక్కిన అన్ని అర్హతల్లోనూ చిన్న .కానీ అజంతా గారుతప్ప అంతా నన్ను చాలా అపురూపంగా చూసేవారు.ఎందుకంటే ఆ ఆఫిస్ ని అలంకరించిన ఒకే ఒక్క ఆడప్రాణిని ..రెంటాలగారి నిరాడంబరత్వం ఎప్పటికీ గుర్తుంటుంది

Unknown said...

@ కొత్త పాళీ గారూ, కృతజ్ఞతలు.
@ సత్యవతి గారూ, నమస్కారం. బ్లాగు ద్వారా మళ్ళీ మిమ్మల్ని కలిసినందుకు ఆనందంగా ఉంది. మీరూ బ్లాగ్ లోకంలోకి వచ్చారని చూసి, సంతోషించాను. మీ రచనా వ్యాసంగం ఎలా ఉంది. మీ మొట్టమొదటి ఉద్యోగం ఆంధ్రప్రభ దినపత్రికలో అన్న సంగతి నాకు ఇంతవరకూ తెలియదు.

మీరు గుర్తుచేసినట్లు అప్పట్లో ఆంధ్రప్రభ ఓ సాహితీ సంస్థానం. రెంటాల, బెల్లంకొండ రామదాసు, అవసరాల సూర్యారావు, అజంతా, జి. కృష్ణ లాంటి ప్రసిద్ధ కవులు, రచయితలు ఉండేవారు. వేటూరి సుందరరామమూర్తి వీళ్ళ తరువాత చేరి, వీళ్ళతో కలసి పనిచేసిన వ్యక్తి. ఈ కబుర్లన్నీ కొన్ని చెబుతుంటే విన్నవీ, మరికొన్ని కళ్ళారా చూసినవీను.

అప్పట్లో ఆడవాళ్ళు పత్రికా రంగంలో పనిచేయడం ఓ పెద్ద వింత. నైట్ డ్యూటీలు కూడా చేయడం మహా విప్లవం. 1970లలో ఆంధ్రప్రభలో పనిచేస్తున్నప్పుడే వేమన వసంతలక్ష్మి గారు అలా పట్టుదలగా, ధైర్యంగా, మగవాళ్ళకు ఆడవాళ్ళేమీ తీసిపోరన్న రీతిలో పనిచేయడం గురించి రెంటాల ఎన్నోసార్లు స్ఫూర్తిమంతంగా చెప్పడం నాకు చెరిగిపోని చిన్ననాటి జ్ఞాపకం. ఇప్పటికీ ఆమె లాంటి ఎందరో పత్రికా రచయితలంటే గౌరవం.

ఏమైనా, అప్పటి మహిళా పాత్రికేయురాలిగా మీ అనుభవాలు, జ్ఞాపకాలు దయచేసి చెప్పండి. వినాలని ఆసక్తిగా ఉంది. అలాగే, రెంటాల గురించి జ్ఞాపకాలు కూడా. ఇక్కడైనా, ఎక్కడైనా రాయండి. ఇది నా అభ్యర్థన.

మాలతి said...

రెంటాల గోపాలకృష్ణగారి పేరు వినడమే కానీ, వారి అమ్మాయి కల్పన నాకు మంచి స్నేహితురాలే కానీ ఆయన్ని గురించి ఇప్పుడే ఈమాత్రమయినా తెలిసింది. ఆయన రాసిన భాగవతం మాయింట్లో చూసి, అది మానాన్నగారు రాసిందే అని కల్పన అనేవరకూ నేను చూడనేలేదు ఆపేరు. ఎందుకంటే, మా అన్నయ్య అన్ని భాగవతాలూ, భవగద్గీతలూ పంపేడు. ఏమయనా, మీరు ఈపరిచయం రాసినందుకు ధన్యవాదాలు. - మాలతి

Unknown said...

@ మాలతి గారూ, నమస్కారం. ఆంధ్రదేశానికి అంత దూరంలో ఉండీ, మీరు అలుపెరక చేస్తున్న మీ సాహిత్య కృషితో పరిచయమున్నా, మీతో ఇలా పరిచయం కలగడం ఆనందం. రెంటాల గోపాలకృష్ణ గారు భౌతికంగా లేకపోయినా, అక్షరరూపంలో మీ లాంటి చదువరుల చేతుల్లో దేశవిదేశాల్లో చిరంజీవిగా నిలవడం ఆనందదాయకం.