జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Wednesday, October 9, 2013

భారతీయ సినీ ప్రముఖులకు సత్కారం

- అయిపు లేని అక్కినేని, హాజరు కాని దాసరి!

- తేలిపోయిన  తెలుగు సినీ కార్యక్రమాలు 


చెన్నై నగరంలో భారీయెత్తున జరుగుతున్న భారతీయ సినిమా నూరు వసంతాల ఉత్సవాలు సెప్టెంబర్ 24వ తేదీ మంగళవారం నాడు రాత్రి ముగిశాయి. 

భారతీయ సినీ ప్రముఖులకు సత్కారం

ఈ ముగింపు ఉత్సవంలో భాగంగా భారతీయ సినిమాలో శిఖర సమానులైన వివిధ ప్రాంతాల, భాషా పరిశ్రమల ప్రముఖులను ప్రత్యేకంగా సత్కరించారు. తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ, మరాఠీ, బెంగాలీ, గుజరాతీ, పంజాబీ, ఒరియా, భోజ్‌పురీ, అస్సామీ ప్రాంతీయ భాషలకు చెందిన మొత్తం 41 మంది ప్రముఖులు రాష్ట్రపతి చేతుల మీదుగా స్వర్ణ పతకం అందుకున్నారు. అలా సత్కారం పొందిన వారిలో తెలుగు సినీ పరిశ్రమకు చెందిన నటి అంజలీదేవి, దర్శకులు కె. విశ్వనాథ్‌, బాపు, కె. రాఘవేంద్రరావులు ఉన్నారు. ఇక, మాజీ సినీ నటి అయిన జయలలిత సైతం సినీ రంగంలో చేసిన కృషికి గాను ఈ సత్కారాన్ని రాష్ట్రపతి నుంచి అందుకున్నారు. 
సత్కారాలు అందుకున్న ఇతర ప్రముఖుల్లో నటీమణులు శ్రీదేవి, రేఖ, నిర్మాత -  స్టూడియో అధినేత ‘ఏ.వి.ఎం’ శరవణన్‌, వైజయంతిమాల బాలి, దర్శకుడు కె. బాలచందర్‌ ఉన్నారు. ఇక, కన్నడ పరిశ్రమ నుంచి పార్వతమ్మా రాజ్‌కఁమార్‌ (86 చిత్రాల నిర్మాత ఆమె. కన్నడ సూపర్‌స్టార్‌ రాజ్‌కుమార్‌ సతీమణి), భారతీ విష్ణువర్ధన్‌, అంబరీశ్‌, ఎస్‌.వి. రాజేంద్రసింగ్‌ బాబు, ద్వారకేశ్‌, వి. రవిచంద్రన్‌, వీరణ్ణ, మలయాళ సినీ సీమ నుంచి మాధవన్‌ నాయర్‌ అలియాస్‌ మధు (80 ఏళ్ళు), అదూర్‌ గోపాలకృష్ణన్‌, హీరోలు మమ్ముట్టి, మోహన్‌లాల్‌ ఈ సత్కారం గ్రహించారు. అమితాబ్‌ బచ్చన్‌, కిరణ్‌ వి. శాంతారామ్‌, రమేశ్‌ సిప్పీ, బెంగాల్‌ నుంచి అపర్ణా సేన్‌, దర్శకుడు గౌతమ్‌ ఘోష్‌, భోజ్‌పురీ నటుడు మనోజ్‌ తివారీ కూడా ఉన్నారు. 



అయిపు లేని అక్కినేని, హాజరు కాని దాసరి!

చిత్రం ఏమిటంటే, మొత్తం 50 మందిని ఈ శతాబ్ది ఉత్సవాల్లో సత్కరించాలని ముందుగా అనుకున్నారు. అయితే, కొందరు గైర్హాజరు కావడంతో, 41 మందికే పరిమితం కావాల్సి వచ్చింది. నూరేళ్ళ భారతీయ సినిమాలో, 90 ఏళ్ళ జీవితం, 72 ఏళ్ళ సినీ నట జీవితమున్న అక్కినేని నాగేశ్వరరావు సోమవారం సాయంత్రం తన పుట్టిన రోజు వేడుకల కోసం హైదరాబాద్‌ నుంచి చెన్నై వచ్చి, కేక్‌ కట్‌ చేశారు. కానీ, తీరా మంగళవారం నాటి ఈ సత్కారానకి మాత్రం ఉండనే లేదు. నూరేళ్ళ భారతీయ సినిమా వేడుకల్లో ఒక్క రోజైనా అక్కినేని రాకపోవడం గమనార్హం. 

అలాగే, గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌కు ఎక్కిన దర్శకుడు దాసరి నారాయణరావు పేరును కూడా ముందుగా సత్కార గ్రహీతగా అనుకున్నా, కారణాలు ఏమైనా తీరా ఆయనా ఈ ఉత్సవాలకు రాలేదు. రారని ముందుగానే తెలియడంతో, ఇలాంటి వ్యక్తుల పేర్లేవీ వేదికపై ప్రకటించకుండా నిర్వాహకఁలు తెలివిగా మిన్నకుండిపోయారు. 

జనం మెచ్చని సభ

ఈ ఉత్సవాల సందర్భంగా ఫిల్మ్‌ ఛాంబర్‌ ప్రచురించిన ప్రత్యేక సంచికను రోశయ్య ఆవిష్కరించి, తొలి ప్రతిని రాష్ట్రపతికి అందజేశారు. భద్రతా కారణాల రీత్యా నిర్ణీత సమయాని కన్నా చాలా ముందే వచ్చి కూర్చోవాల్సి వచ్చిన ప్రేక్షక జనం సభ ముగియడానికి చాలా సేపటి ముందే అసహనంగా బయటకు వెళ్ళిపోవడం ప్రారంభించారు. రాష్ట్రపతి నిష్క్రమణ సమయానికే గ్యాలరీలు కొంత ఖాళీ అయిపోయాయి. రాష్ట్రపతికి వీడ్కోలు పలికిన తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆ తరువాత మరో గంటకు పైగా కూర్చొని, సాంస్కృతిక కార్యక్రమాలు వీక్షించారు. ఆమె కదలగానే, ఆమె అభిమానులు, పార్టీ కార్యకర్తలు, నేతలతో నిండిన సభా ప్రాంగణంలో దాదాపు సగానికి పైగా ఖాళీ అయిపోయింది. 

దానికి తోడు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా అంతంత మాత్రంగానే ఉండడంతో, ప్రేక్షకులు ఆసక్తిగా కూర్చొని చూసేందుకు ఇష్టపడలేదు. ప్రారంభంలో మలయాళీల సంస్కృతిని ప్రతిఫలిస్తూ ప్రదర్శించిన తాళబద్ధ వాద్య గోష్ఠి ‘చండక్కళి’ ఆకట్టుకుంది. సినీ హీరో ‘పద్మశ్రీ’ జయరామ్‌ స్వయంగా పాల్గొని, తన వాద్య విన్యాసం ద్వారా ఈ ప్రదర్శనను రక్తి కట్టించారు. అలాగే, ‘అయిగిరి నందిని..’ అన్న మహిషాసుర మర్దినీ స్తోత్రానికి నటి శోభన బృందం చేసిన నృత్యాభినయం ఆకట్టుకుంది. 

 ఫిల్మ్ చాంబర్ అధ్యక్షుడు సి. కల్యాణ్ లాంటి వారి ప్రసంగాలలోనే కాక, సాంస్కృతిక కార్యక్రమాల్లోనూ ‘అమ్మ’ భజనే ఎక్కువగా కనిపించింది. ఆరేడు పాటల పల్లవులతో కూడిన కదంబానికి ఎవరికీ పెద్దగా తెలియని కొందరు నర్తించగా, తెలుగు సాంస్కృతిక కార్యక్రమం తూతూ మంత్రంగా అయిందనిపించారు. మిగతా భాషల కార్యక్రమాలు కూడా మళ్ళీ ఎప్పటి లానే రికార్డింగ్‌ డ్యాన్సులు, రియాలిటీ డ్యాన్స్‌ షోల కాన్సెప్ట్‌లోనే నడిచాయి. 

గత మూడు రోజుల లాగానే ఈ రోజూ సభా ప్రాంగణంలో వేదికకు సుదూరంగా, పైన ఎక్కడో ఉన్న గ్యాలరీలకే మీడియాలో సింహభాగం పరిమితం కావాల్సి వచ్చింది. రాష్ట్రపతితో సహా ఇతరుల ప్రసంగాలు స్పష్టంగా వినపడక, వేదికపై జరుగుతున్నది కనపడక నానా అవస్థలు పడాల్సి వచ్చింది. బాలకృష్ణ, వెంకటేశ్‌, రామానాయుడు, రాజేంద్రప్రసాద్‌, రాజశేఖర్‌ లాంటి కొందరే తెలుగు తారలు ఈ సభకు హాజరయ్యారు. తమిళ నటులు రజనీకాంత్‌, కమలహాసన్‌, కవి వైరముత్తు, విజయ్‌, కార్తి, అజిత్‌ లాంటి కొందరు వచ్చారు. గ్లామర్‌ తారల జాడ కనపడలేదు. 

ఏతావతా, బ్రహ్మాండంగా ఉంటుందని ప్రచారం చేసిన ముగింపు కార్యక్రమాలు ప్రారంభ వేడుకల కన్నా మరీ తేలిపోయాయి. 


- చెన్నై నుంచి రెంటాల జయదేవ

(Published in 'Praja Sakti' daily, 25 Sept 2013, Wednesday, Page No.2)
........................................................

0 వ్యాఖ్యలు: