చెన్నైలో నూరేళ్ళ భారతీయ సినిమా ఉత్సవాల్లో భాగంగా తెలుగు సినిమా వేడుకలు జరిగిన తీరు చర్చ రేపుతూనే ఉంది. ఆ వేడుకల సందర్భంగా నిర్మాత, సౌతిండియన్ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు సి. కల్యాణ్ మాట్లాడిన మాటలు వివాదాస్పదమయ్యాయి.
తెలుగు సినిమా వేడుకలు జరిగిన సెప్టెంబర్ 22న ఆయన ప్రధానంగా రెండుసార్లు వేదిక మీది మైకు ముందుకు వచ్చి, వివరణ లాంటి ప్రకటనలు చేశారు. ‘ఎందరో మహాను భావులు...’ అంటూ చిరస్మరణీయ తెలుగు సినీ ప్రముఖుల ఆడియో - విజువల్ ప్రదర్శన జరగగానే ఆయన ఒకసారి మైకందుకొని, అందులో త్రిపురనేని మహారథి లాంటి కొందరు ప్రముఖుల గురించి చూపడం, చెప్పడం మిస్సయినందుకు మన్నించమని కోరారు. ‘‘హడావిడిగా చేయడం, తొందరలో చెప్పడం వల్ల తప్పులు జరిగాయి’’ ఆయన చెప్పారు. ‘‘ఉత్సవాల ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్‌గా, సౌతిండియన్ ఛాంబర్ అధ్యక్షఁడిగా ఆ తప్పులు నావే’’ అన బాధ్యత నెత్తికేసుకున్నారు.
ఇక, ఆర్. నారాయణమూర్తి ఉదంతం జరిగాక, మంత్రి డి.కె. అరుణ, హీరో బాలకృష్ణ ప్రసంగాలయ్యాక కల్యాణ్ మరోసారి ప్రసంగించారు. ఆ సందర్భంగా ఆయన, ‘‘కళాకారులారా! నిర్మాతలారా! పరిశ్రమలో వివిధ విభాగాల సభ్యులారా! ఇక్కడ ఒకరు లేకపోతే మరొకరం లేము. మనమందరం కలిసి ఉంటేనే అది సినిమా పరిశ్రమ. ఆ విషయాన్ని మనం గుర్తించాలి. ఒక అసిస్టెంట్ డైరెక్టర్‌గా జీవితం ప్రారంభించిన నేను ఇవాళ సౌతిండియన్ ఫిల్మ్ ఛాంబర్‌కు అధ్యక్షుడినయ్యాను. మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళు నన్ను ఇక్కడకు ఈ పదవికి పంపారు.... దక్షిణాది భాషా పరిశ్రమలు చేస్తున్న ఈ నూరేళ్ళ భారతీయ సినిమా పండుగను వేరేవాళ్ళయితే ఇక్కడ చేసేవారు కాదేమో! ...మధ్యలో తలెత్తిన ఇబ్బందులతో, ఒక వారం రోజుల పాటు తెలుగు సినిమా లేదనే నేను ఫీలయ్యాను. అవును... ఒక ఫ్యామిలీ అనగానే అందులో గొడవలు, ఇబ్బందులు, అభిప్రాయభేదాలు ఉంటాయి. కానీ, శుభకార్యం అనగానే అందరం కలిసి ఉంటామని , ఇవాళ తెలుగు సినీ పరిశ్రమ నిరూపించింది...’’ అన్నారు.
ఆ తరువాత కల్యాణ్ మళ్ళీ కొనసాగిస్తూ, ఆర్. నారాయణమూర్తి ఉదంతాన్ని అన్యాపదేశంగా ప్రస్తావించారు. ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. ‘‘అప్పుడప్పుడూ ఏ.సి.లోకి అలా చీడపురుగులు, దోమలు వస్తుంటాయి. వాటిన నలిపి చంపేస్తాం. ఏ.సి. బాగుంటే దోమలు ఏమీ చేయలేవు. అవే పడుకుంటాయి... చల్లగా జారుకుంటాయి’’ అన్నారు. వచ్చిన సినీ కళాకారులకు కృతజ్ఞతలు చెబుతూ, ‘‘మీరందరూ వచ్చినందుకు పాదాభివందనం. ఇక, కొందరు కళాకారులు రాకపోవడం వాళ్ళ బ్యాడ్‌లక్’’ అన్నారు. ‘‘మంచి ప్రయత్నానికి సహకరించండి. చెడ్డ ప్రయత్నాన్ని అడ్డుకోండి’’ అన పిలుపునిచ్చారు.
‘‘ఇవాళ హైదరాబాద్‌లో ఉన్నా, సినీ సీమలోని మనలో చాలామంది ఇక్కడే పేరు, డబ్బు, శక్తి సంపాదించుకున్నాం. అందుకే, నేను ఈ వేడుకలు చెన్నైలో పెట్టాను. దయచేసి మనకు పాలిటిక్స్ వద్దు. మనందరి ఒంట్లో ఉన్నది కళామతల్లి రక్తం. దయచేసి ఆ కళామతల్లిని రక్షించండి...’’ అని కల్యాణ్ వ్యాఖ్యానించారు. కల్యాణ్ చేసిన ఈ దోమలు, చీడపురుగుల వ్యాఖ్యే ఇప్పుడు పెను దుమారం రేపుతోంది.
(Published in 'PrajaSakti' daily, 25 Sept 2013, Wednesday, Page No.8)
..................................................
తోడుకునేవాళ్లకి తోడుకున్నంత
5 years ago
0 వ్యాఖ్యలు:
Post a Comment