జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Thursday, October 17, 2013

‘‘తెలుగు సినిమా ఇంకా ఎంతో వెనుకబడే ఉంది!’’ - దర్శకుడు గౌతమ్‌ ఘోష్‌తో ప్రత్యేక ఇంటర్వ్యూ

- నా ఓటు ‘లంచ్‌ బాక్స్‌’కే! మెజారిటీ నిర్ణయం గుజరాతీ చిత్రానికి!
 - వందేళ్ళలో మనం కనిపెట్టిన టెక్నాలజీ ఏంటి?
 - అంతర్జాతీయ విపణిలో విస్తరణలోనూ మన సినిమా వెనుకే!

(దర్శకుడు గౌతమ్‌ ఘోష్‌తో ‘ప్రజాశక్తి’ ప్రత్యేక ఇంటర్వ్యూ) 


ఆయన బెంగాలీ. కానీ, ఆయన తొలి చిత్రం ` తెలుగు సినిమా. తొలి చిత్రంతోనే అందరి దృష్టినీ ఆకర్షించిన ఆ దర్శకుడు అటుపైన జాతీయ, అంతర్జాతీయ సినీ వేదికపై తన సత్తా చాటారు. జాతీయ స్థాయిలో ఉత్తమ సినీ దర్శకుడైన ఆయన మన ‘మా భూమి’ చిత్ర ఫేమ్‌ గౌతమ్‌ ఘోష్‌. విదేశీ చలనచిత్ర విభాగంలో ఆస్కార్‌ అవార్డుకు తుది భారతీయ ఎంట్రీగా తాజాగా గుజరాతీ చిత్రం ‘ది గుడ్‌ రోడ్‌’ను ఎంపిక చేసిన జ్యూరీకి ఆయనే చైర్మన్‌. హిందీ చిత్రం ‘లంచ్‌ బాక్స్‌’ బదులు ఆ సినిమా ఎంపిక వివాదాలకి దారి తీసింది. తాజాగా చెన్నైలో నూరేళ్ళ భారతీయ సినిమా ఉత్సవాలకు వచ్చి, రాష్ట్రపతి నుంచి భారతీయ సినీ ప్రముఖుల్లో ఒకరిగా సత్కారం అందుకున్న గౌతమ్‌ ఘోష్‌తో ‘ప్రజాశక్తి’ జరిపిన ప్రత్యేక భేటీ...

ప్రశ్న: తెలుగు సినిమా ప్రమాణాలు బాగా లేవని మీరు చేసిన కామెంట్‌పై వివరణ ఇస్తారా?

జవాబు: చూడండి. తాజాగా ఆస్కార్‌లో విదేశీ చలనచిత్ర విభాగంలో భారతీయ ఎంట్రీని ఎంపిక చేసిన జ్యూరీకి నేను అధ్యక్షఁణ్ణి. సినిమాల స్క్రీనింగ్‌లో వచ్చిన వివిధ భాషా చిత్రాలను ఇతర సభ్యులతో కలసి చూశాను. అలా తెలుగు ఎంట్రీలను కూడా చూడడం జరిగింది. అప్పుడు నాకు కలిగిన అభిప్రాయాన్నే చెప్పాను. 

ప్రశ్న: ఇతర భాషా చిత్రాలను కూడా చూసి ఉంటారు కదా! కానీ, తెలుగు మీదే...

జవాబు: (సగంలోనే అందుకుంటూ...) అవును మిగిలిన భాషలవీ చూశాను. అయితే దురదృష్టవశాత్తూ, తెలుగులో వచ్చిన ఎంట్రీలు మలయాళ, తమిళ, మరాఠీ, గుజరాతీ చిత్రాలతో ఏ మాత్రం పోటీపడేలా లేవు. నిజానికి, తెలుగన్నా, ఆ భాషా చిత్రాలన్నా నా మనసులో ప్రత్యేక స్థానం, అమితమైన సానుభూతి ఉన్నాయి. నా తొలి సినిమాయే తెలుగు సినిమా కదా! ఎంట్రీలుగా వచ్చిన తెలుగు చిత్రాలను చూస్తే, కొన్ని మటుకు సాంకేతికంగా బాగున్నాయి. ఎంచుకున్న ఇతివృత్తాలూ బాగానే ఉన్నాయి. కానీ, వాటిని తెరపై చూపించిన విధానం ఇంకా ఎంతో మెరుగుపడాలి. ఇతర దక్షిణాది భాషా చిత్రాలతో పోలిస్తే, తెలుగు సినిమాలు చాలా వెనుకబడి ఉన్నాయని చెప్పడానికి విచారిస్తున్నాను.

ప్రశ్న: తెలుగులో ‘మిథునం’ లాంటి కొన్ని సినిమాలు మీరు చూసి ఉంటారు కదా! 

జవాబు: అదే చెబుతున్నా. కొన్ని ఇతివృత్తాలు బాగున్నాయి. అందమైన కథలను తెరపై చెప్పే ప్రయత్నం చేశారు. కొంతమంది ఆ చిత్రాన్ని ఇష్టపడ్డారు కూడా! కానీ, ఇతర భాషా చిత్రాలతో పోలిస్తే, వాటికి దీటుగా ఈ చిత్రాల ప్రమాణాలు లేవు. వాటితో పోటీలో ఇవి పై స్థాయికి చేరలేదు. తమిళం నుంచి కమలహాసన్‌ ‘విశ్వరూపం’, మలయాళం నుంచి ‘సెల్యులాయిడ్‌’, గుజరాతీ నుంచి ‘ది గుడ్‌ రోడ్‌’, హిందీ నుంచి ‘లంచ్‌ బాక్స్‌’ ఇలా  చాలానే చూశాం. ‘విశ్వరూపం’, ‘సెల్యులాయిడ్‌’ లాంటివి బాగున్నా, తుది దశకు చేరలేకపోయాయి.

ప్రశ్న: తెలుగు, తదితర భాషా చిత్రాలను మీరు రెగ్యులర్‌గా చూస్తుంటారా?

జవాబు: దురదృష్టవశాత్తూ, కలకత్తాలో ఇవి విడుదల కావు. అందుకని అన్నీ రెగ్యులర్‌గా చూడడం కుద రదు. కాకపోతే, ఇండియన్‌ పనోరమా, ఇతర చలనచిత్రోత్సవాలకు వచ్చినప్పుడు చూడడం జరుగుతోంది. కాబట్టి, ఆ యా ప్రాంతీయ భాషా ఫిల్మ్‌ ఛాంబర్లు తమ ప్రాంతం నుంచి ఎంతో మంచి చిత్రాలను, నిష్పక్షపాతంగా ఎంపిక చేసి, వాటినే ఎంట్రీలుగా పంపాలి. అయితే, ఆస్కార్‌తో సహా అనేక వాటికి ఇక్కడకు ఎంట్రీలుగా రాని మంచి చిత్రాలు కూడా కొన్ని ఉండి ఉండవచ్చు.

ప్రశ్న: మరి, అలాంటి సినిమాలను మిస్సయ్యే అవకాశం ఉంది కదా!

జవాబు: అందుకనే, నేను, దర్శకుడు అదూర్‌ గోపాలకృష్ణన్‌, ఇంకా కొందరం ఇప్పటికే కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు అభ్యర్థన పెట్టాం. 1980లు, ’90లలో దూరదర్శన్‌లో ఆదివారం మధ్యాహ్నవేళల్లో ఒక్కో వారం ఒక్కో భాషలోని ఉత్తమ చిత్రాలను ప్రసారం చేసేవారు. ఆ పద్ధతిని మళ్ళీ ప్రవేశపెట్టాలని కోరాం. అందుకు అంగీకరించారు. అది త్వరలోనే మళ్ళీ మొదలవుతోంది. 


ప్రశ్న: అందరూ ‘లంచ్‌ బాక్స్‌’ మీద ఆశలు పెట్టుకుంటే, అది ఎంపిక కాలేదే!

జవాబు: ‘లంచ్‌ బాక్స్‌’ నాకు ఎంతో నచ్చింది. నేనైతే అదే అనుకున్నాను. ‘ది గుడ్‌ రోడ్‌’ కూడా నాకు నచ్చింది. ఇక, శ్రీదేవి నటించిన ‘ఇంగ్లిష్‌ - వింగ్లిష్‌’, బెంగాలీ చిత్రం ‘శబ్ద్‌’ లాంటివి కూడా పోటీ పడ్డాయి. తుది దశలో ‘లంచ్‌ బాక్స్‌’, ‘ది గుడ్‌ రోడ్‌’లు పోటీలో నిలిచాయి. చివరకు ‘ది గుడ్‌ రోడ్‌’ను జ్యూరీ ఎంపిక చేసింది. నేను వ్యక్తిగతంగా ‘లంచ్‌ బాక్స్‌’ వైపు మొగ్గినా, జ్యూరీ అంటే నేనొక్కణ్ణే కాదు కదా! మరో 15 మంది సభ్యులున్నారు. చివరకు మెజారిటీ అభిప్రాయం మేరకు నిర్ణయం జరుగుతుంది. ఇదీ అలానే జరిగింది. ఏమైనా, ‘లంచ్‌ బాక్స్‌’ ఓ విలక్షణమైన చిత్రం. 

ప్రశ్న: ఆస్కార్‌ బరిలో రేపు ‘లంచ్‌ బాక్స్‌’తో పోలిస్తే, ‘ది గుడ్‌ రోడ్‌’కు ఉన్న ప్రతికూలతలు ఏంటి?


జవాబు: ‘లంచ్‌ బాక్స్‌’ గనక ఎంట్రీగా వెళ్ళి ఉంటే బాగుండేదని నా వ్యక్తిగత అభిప్రాయం. ఎందుకంటే, ఇప్పటికే అనేక అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో ఆ సినిమాకు ఎన్నో ప్రశంసలు దక్కాయి. అలాగే, ‘సోనీ పిక్చర్స్‌ క్లాసిక్స్‌’ లాంటి అంతర్జాతీయ ఫిల్మ్‌ డిస్ట్రిబ్యూటర్‌, మంచి తారాగణం దానికి ఉంది. కాబట్టి, ఆస్కార్‌ జ్యూరీకి సులభంగా నచ్చజెప్పవచ్చు. ఎవరికీ తమ సినిమా గురించి పెద్దగా తెలియదు కాబట్టి, ‘ది గుడ్‌ రోడ్‌’ చిత్ర నిర్మాతలు అంతర్జాతీయంగా అందరి దృష్టీ తమపై పడేలా చేసుకొనేందుకు చాలా శ్రమపడాల్సి ఉంటుంది. రాణ్‌ ఆఫ్‌ కచ్‌లోని వ్యక్తుల జీవితాలు, బాల్యంలోనే వేశ్యా వృత్తి లాంటి భారతీయ అంశాలెన్నో ఉన్న ఈ సినిమా కూడా ఎంతో బాగుంది. ‘లంచ్‌బాక్స్‌’ తరువాత ఎంట్రీల్లో ఇది రెండో ఉత్తమ చిత్రమని నా అభిప్రాయం. భావోద్వేగభరితమైన అంశాలెన్నో ఉన్నా, ఆస్కార్‌ బరిలో విజేతగా నిలవాలంటే సినిమాను మార్కెట్‌ చేసుకోవడం కూడా చాలా అవసరం. పైగా, జ్ఞాన్‌ కొరీ తీసిన ఈ చిత్రం మన దేశంలో రెండే వారాలు ఆడిందన్న సంగతి మర్చిపోకూడదు. ఏమైనా, మనది ఎంతో పెద్ద సినీ పరిశ్రమ కాబట్టి, థాయిలాండ్‌, శ్రీలంక, కొరియా లాంటి దేశాల లాగా మనమూ ఒకే ఎంట్రీ పంపితే ఎలా? ఆస్కార్‌ లాంటి అవార్డులకు మనం మరిన్ని ఎంట్రీలు పంపేందుకు ‘ఫిల్మ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా’ (ఎఫ్‌.ఎఫ్‌.ఐ) కృషి చేసి, ఒప్పించాలి. ఒక్క సినిమానే పంపాలనే సరికి, ‘లంచ్‌ బాక్స్‌’ లాంటి మంచి చిత్రాలు ఆఖరు నిమిషంలో మిస్సయ్యే అవకాశం ఉంది. 

ప్రశ్న: కానీ, ఇంత పెద్ద భారతీయ సినిమా పరిస్థితి అంతర్జాతీయ విపణిలో ఏమిటంటారు?

జవాబు: ఇవాళ మన భారతీయ సినిమాలు దేశ, విదేశాలకు విస్తరించాయి. ముందుగా హిందీ సినిమాలు, ఆ తరువాత తమిళ, తెలుగు చిత్రాలు ఇప్పటికీ విదేశాల్లో మంచి మార్కెట్‌ను సొంతం చేసుకున్నాయి. అయితే, ఇతర ప్రాంతీయ భాషా చిత్రాలు మాత్రం ఇంకా అందులో వెనుకబడే ఉన్నాయి. అవి కూడా ఆ బాట పట్టాలి. ముఖ్యంగా, బెంగాలీ సినిమాలు తమ మార్కెట్‌ పరిధిని ఇంకా విస్తరించుకోవాల్సి ఉంది. ఆ మధ్య 2010లో నేను ‘మన్‌ ఔర్‌ మానుష్‌’ అనే చిత్రాన్ని సహ భాగస్వామ్యంలో తీశా. అలాంటివి ఇంకా రావాల్సి ఉంది. 

ప్రశ్న: నూరేళ్ళ పండుగ జరుపుకొంటున్న మన సినిమా మార్కెట్‌ సరే! నాణ్యత మాటేమిటి?

జవాబు: సంఖ్యా పరంగా చూస్తే, ఇవాళ భారతీయ సినిమా రంగం అత్యధిక సంఖ్యలో సినిమాలు తీస్తోంది. అయితే, రాశి ఉన్నా, వాసి మాత్రం అంతంత మాత్రమే. మన కన్నా అతి చిన్న సినీ పరిశ్రమ అయినా, ఇరాన్‌ సినీ పరిశ్రమలో మన సినిమాల కన్నా, ఎంతో మంచి సినిమాలు వస్తున్నాయి. ఈ విషయంలో మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. 

ప్రశ్న: కానీ, టెక్నాలజీ పరంగా మనం ముందుకు పోయినట్లున్నాం! 

జవాబు: (కాస్త ఆవేదనగా...) మనం రకరకాల విదేశీ టెక్నాలజీలను బాగా వాడుకుంటున్నాం. సినిమాలు తీస్తున్నాం. కానీ, ఈ వంద ఏళ్ళలో, ఇంత పెద్ద సినీ పరిశ్రమగా మన వంతుగా టెక్నాలజీకి కొత్తగా అందించినది ఏమిటి చెప్పండి! కెమేరాలో కానీ, సౌండ్‌ టెక్నాలజీలో కానీ మనం ఏదైనా ఒక్క కొత్త పరిజ్ఞానం కనిపెట్టామా! లేదే! వాళ్ళెవరో కనిపెట్టినవి వాడుకుంటున్నాం. స్వతంత్రంగా మనం కనిపెట్టినవి ఏమీ లేవు. ఇది చాలా విచారకరం. ఇప్పటికైనా, మనం ఆ కృషి చేయాలి. 

ప్రశ్న: మనం ఇన్ని సినిమాలు తీస్తున్నాం. కానీ, వాటిని జాగ్రత్తగా పరిరక్షించుకుంటున్నామా? ఈ నూరు వసంతాల వేళ అయినా ఏదైనా చేయాలి కదా!

జవాబు: అవును. మన దగ్గర సినిమాలు, వాటి నెగటివ్‌ల పరిరక్షణ మీద బొత్తిగా శ్రద్ధ లేదు. ఇన్ని భాషలు, ప్రాంతాల్లో ఏటా కొన్ని వందల చిత్రాలు తీస్తుంటే, ఒకే ఒక్క నేషనల్‌ ఫిల్మ్‌ ఆర్కైవ్స్‌ ఎలా సరిపోతుంది! ఇప్పటికే మన విలువైన చిత్రాల నెగటివ్‌లు ఎన్నో నాశనమైపోయాయి. మరెన్నో ఆఖరు దశకు చేరుకున్నాయి. ఇప్పటికైనా, నిద్ర మేల్కొని, వాటిని కాపాడాలి. ఇందు కోసం ప్రతి రాష్ట్రంలో ఒక ఫిల్మ్‌ ఆర్కైవ్‌ పెట్టాలి. ఆ యా భాషల చిత్రాలను అక్కడ పరిరక్షించాలి. డిజిటల్‌ పద్ధతిలో పాత చిత్రాలను పునరుద్ధరించడం కూడా పెద్దయెత్తున చేయాలి. నా సినిమాలను రెంటినీ ఇప్పటికే డిజిటల్‌ రిస్టొరేషన్‌ చేశారు. ‘మా భూమి’ చిత్రాన్ని కూడా నిర్మాత, దర్శకుడు బి. నరసింగరావు డిజిటల్‌గా పునరుద్ధరించే పనిలో ఉన్నారు. అయితే, దీనికి ఎంతో కృషి చేయాలి. ప్రస్తుతం జరుగుతున్న ప్రయత్నాలు సరిపోవు. ఆ పని చేయకపోతే, మన మూకీ చిత్రాల కాపీల లాగే, మన అపారమైన సినీ సంస్కృతి, వారసత్వం భావితరాలకు అందకుండా కాలగర్భంలో కలిసిపోయే ప్రమాదం ఉంది.  

ప్రశ్న: ఆఖరుగా, తెలుగు సినీ దర్శక, నిర్మాతలకు మీరిచ్చే సలహా?

జవాబు: తెలుగు సినీ రూపకర్తలు ఇప్పటికైనా మూసధోరణిలో నుంచి బయటకు రావాలి. మెరుగైన నాణ్యతతో కూడిన సినిమాలను అందించడానికి కృషి చేయాలి. తెలుగు ప్రాంతానికీ, భాషకూ ఎంతో గొప్ప సంస్కృతి, సంప్రదాయం ఉన్నాయి. వాటిని ఆసరాగా తీసుకొని, మెరుగైన ఇతివృత్తాలతో, మెరుగైన చిత్రీకరణతో ముందుకు రావాలి. 

- చెన్నై నుంచి రెంటాల జయదేవ

(Published in 'Praja Sakti' daily, 26 Sept 2013, Thursday, Page No.8)
...........................................................

1 వ్యాఖ్యలు: