- భారతీయ సినిమా శతాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ
- 41 మంది భారతీయ సినీ ప్రముఖులకు సత్కారం
- నాలుగు రోజుల సినీ సంబరాలకు తెర
- మళ్ళీ అదే ‘అమ్మ’ భజన
- అంతంత మాత్రపు తెలుగు సినీ కార్యక్రమాలు
చెన్నై నగరంలో భారీయెత్తున జరుగుతున్న భారతీయ సినిమా నూరు వసంతాల ఉత్సవాలు మంగళవారం నాడు రాత్రి ముగిశాయి. దక్షిణాది సినీ పరిశ్రమలు నాలుగూ కలసి గడచిన మూడు రోజులుగా జరుపుకొంటున్న ఈ ఉత్సవాలకు ముగింపు సభ, సాంస్కృతిక కార్యక్రమాలతో నాలుగో రోజున స్వస్తి వాచకం పలికారు. తమిళనాడు ప్రభుత్వం, దక్షిణ భారత చలనచిత్ర వాణిజ్య మండలి (ఎస్.ఐ.ఎఫ్.సి.సి) సంయుక్తంగా జరిపిన ఈ నాలుగు రోజుల ఉత్సవాల ముగింపు కార్యక్రమానికి భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ముఖ్య అతిథిగా వచ్చారు.
తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్య, కేరళ ముఖ్యమంత్రి ఊమెన్ చాండీ, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత, కర్నాటక రాష్ట్ర సమాచార మంత్రి సంతోష్ ఎస్. లాడ్‌లు ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ప్రసంగిస్తూ, సామాజిక పరిణామానికి తోడ్పడేలా, అందరిలో మంచి విలువలను పెంచి పోషించేలా సినిమాలు తీయడంపై దృష్టి నిలపాల్సిందిగా సినీ పరిశ్రమకు సూచించారు. ప్రజాదరణ ఉన్న శక్తిమంతమైన ఈ సినీ మాధ్యమాన్ని సరిగ్గా వినియోగించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆయన అన్నారు.
‘‘సినిమాలో ఓ పక్క వినోదానికీ, మరో పక్క సామాజిక బాధ్యతకూ ప్రాధాన్యమిస్తూ, సమతూకం పాటించాలి’’ అని ఆయన పేర్కొన్నారు. ‘‘ఇటీవల దేశంలో మహిళలపైన, పిల్లలపైన జరిగిన నేర సంఘటనలు అందరినీ కలచివేశాయి. అలాగే, దేశంలోని కొన్ని ప్రాంతాల్లో మత ఘర్షణలు చెలరేగాయి. ఇలా అంతకంతకూ విలువలు క్షీణించడాన్ని అరికట్టేందుకు తగిన మార్గాలను మనం అన్వేషించాలి’’ అని రాష్ట్రపతి పేర్కొన్నారు.
దేశానికి నైతిక విలువలను బోధించడంలో సినిమా కీలకమైన పాత్రను పోషించగలదనీ, పోషించాలనీ ఆయన అభిప్రాయపడ్డారు. అలాగే, పుణే, కోల్‌కతాల్లోని ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌ల గురించి, వాటి నుంచి ఎంతోమంది సినీ మేధావులు తయారు కావడం గురించి ప్రస్తావిస్తూ, ఆ సంస్థలను ‘‘జాతీయ ప్రాధాన్యమున్న సంస్థలు’’గా తీర్చిదిద్దేందుకు తగిన చర్యలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని ప్రణబ్ ముఖర్జీ అన్నారు. భారతీయ సినిమా సర్వతోముఖాభివృద్ధికి ఎల్.వి. ప్రసాద్, ఎం.జి.ఆర్, ఎన్టీయార్, ప్రేమ్ నజీర్, రాజ్‌కుమార్, నిర్మాతలు ఎస్.ఎస్. వాసన్, నాగిరెడ్డి లాంటి ఎందరో దక్షిణాది సినీ ప్రముఖులు కృషి చేశారని ప్రశంసించారు.
ముఖ్యమంత్రి జయలలిత ప్రసగిస్తూ, సినీ పరిశ్రమ పురోగతికి తమ ప్రభుత్వం తీసుకొంటున్న చర్యలను పేర్కొన్నారు. కేరళ సి.ఎం. ఊమెన్ చాండీ సైతం తమ ప్రభుత్వ సినీ అనుకూల విధానాలను ఏకరవు పెట్టారు. కేరళలోని ప్రకృతి అందాలను సినిమా చిత్రీకరణలకు ఉపయోగించుకోవాలంటూ సాదరంగా ఆహ్వానించారు. మలయాళ చిత్రసీమకు డెబ్భయి అయిదేళ్ళవుతున్న సందర్భంగా చలనచిత్రాలను భద్రపరిచే ఫిల్మ్ ఆర్కైవ్‌ను నెలకొల్పినట్లు చెప్పారు. తమిళ నాడు గవర్నర్ రోశయ్య, కర్నాటక మంత్రి సంతోష్‌లు కూడా ప్రసంగించారు. సౌతిండియన్ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు సి. కల్యాణ్ స్వాగతోపన్యాసం చేశారు. ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు విజయ్ ఖేమ్కా, ఛాంబర్ గౌరవ కార్యదర్శి రవి కొట్టాక్కర వేదికపై ఆసీనులయ్యారు.
- చెన్నై నుంచి రెంటాల జయదేవ
(Published in 'Praja Sakti' daily, 25 Sept 2013, Wednesday, Page No.8)
..................................................
తోడుకునేవాళ్లకి తోడుకున్నంత
5 years ago
0 వ్యాఖ్యలు:
Post a Comment