జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Thursday, October 10, 2013

అనారోగ్యానికి బలైన 'బలశాలి' - శ్రీహరి


ఫైటర్‌గా చిన్న చిన్న వేషాలు వేస్తూ, సినీ జీవితాన్ని ప్రారంభించిన నటుడు శ్రీహరి క్రమంగా హీరో స్థాయికి ఎదిగారు. ఆ తర్వాత కొన్నాళ్ళకు క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా కెరీర్‌ను మలుచుకొని, వివిధ రకాల పాత్రల పోషణకు చిరునామాగా నిలిచారు. అలాంటి విభిన్నమైన పాత్రపోషణలో ఎక్కువ పారితోషికం కూడా అందుకున్నారు. 1964 ఆగస్టు 15న శ్రీహరి జన్మించారు. జిమ్నాస్టిక్స్‌ నేర్చుకున్నారు. జాతీయ జిమ్నాస్టిక్స్‌ పోటీల్లో పాల్గొన్న అనుభవం ఆయనకు ఉంది. అలాగే, ఉత్తమ జిమ్నాస్ట్‌గా కూడా బహుమతులు అందుకున్నారు. మొదటి నుంచి శారీరక దృఢత్వం మీద ఆయన ప్రధానంగా దృష్టి పెడుతుండేవారు. బాడీ బిల్డింగ్‌ చేసేవారు. బాడీ బిల్డర్‌గా కూడా పలు పోటీల్లో పాల్గొన్నారు. 

అందరితో స్నేహం
ఆ అనుభవంతో అలవోకగా ఫైట్స్‌ చేసేవారు. అదే తొలినాళ్ళలో ఆయన సినిమా కెరియర్‌కు ఉపయోగపడింది. హీరోగా మారిన తరువాత కూడా సహజంగా పోరాటాలు చేసే నటుడిగా పేరు తెచ్చింది. కృష్ణంరాజు హీరోగా రూపొందించిన 'బ్రహ్మనాయుడు' చిత్రంలో ఓ చిన్న పాత్ర ద్వారా దర్శకుడు దాసరి నారాయణరావు ఆయన సినీ రంగప్రవేశానికి తోడ్పడ్డారు. ఆ తరువాత కూడా దాసరి, ఆయన శిష్యులైన కోడి రామకృష్ణ తదితరులు నటుడిగా శ్రీహరిని ఎంతో ప్రోత్సహించేవారు. దాసరిని ఎప్పుడూ ''మా గురువు గారు'' అని ఆత్మీయంగా పేర్కొంటూ ఉండేవారు. మద్రాసు వెళ్ళి వేషాల కోసం కష్టపడిన రోజుల నుంచి ఇవాళ ఇంత ఉన్నత స్థితికి చేరే దాకా ఎంతోమందితో శ్రీహరి స్నేహసంబంధాలను పంచుకున్నారు. 'అన్నా' అని అందరినీ ఆత్మీయంగా పలకరిస్తూ, ప్రతి ఒక్కరితో ప్రత్యేక అనుబంధాన్ని పెంచుకున్నారు. 

అందలమెక్కించిన స్వయంకృషి
తాతలు, తండ్రులు పేరు చెప్పుకొని సినీరంగంలోకి వచ్చి, స్థిరపడే పలువురికి భిన్నమైన కెరీర్‌ శ్రీహరిది. ఎవరికీ వారసుడు కాని శ్రీహరి, 'గాడ్‌ ఫాదర్‌'లు ఎవరూ లేకుండానే స్వయంకృషితో ప్రస్తుత స్థాయికి చేరుకోవడం చెప్పుకోదగ్గ విశేషం. విలన్‌గా, హీరోగా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా చేసిన ఆయన దాదాపు 90కి పైగా చిత్రాల్లో నటించారు. హీరోగా తొలి సినిమా అయిన 'పోలీస్‌' చిత్రం శ్రీహరి కెరీర్‌ను కొత్త బాట పట్టించింది. ఇవాళ్టి ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్‌ను 'సాంబయ్య' సినిమాతో నిర్మాతను చేసిన ఘనత కూడా శ్రీహరిదే! పలువురు కొత్తవారికి దర్శకులుగా తొలి అవకాశాలు ఇచ్చింది శ్రీహరే! సాయి బాలాజీ, దేవీ ప్రసాద్‌ లాంటి వారికి తొలి అవకాశాలు, వీరశంకర్‌ లాంటి వారికి మలి అవకాశాలు అందించారాయన. దర్శకుడు ఎన్‌. శంకర్‌ రూపొందించిన 'ఒకటే జననం... ఒకటే మరణం...' లాంటి పాపులర్‌ పాట ఉన్న 'భద్రాచలం' శ్రీహరి కెరీర్‌లో ఓ మైలురాయి. 

హీరోగా ఆరేడేళ్ళు ఓ వెలుగు వెలిగి, దాదాపు పాతిక పైగా చిత్రాల్లో కథానాయక పాత్రలు పోషించారు. ఆపైన 'నువ్వొస్తావంటే నేనొద్దంటానా' చిత్రం ద్వారా క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా కెరీర్‌లో మరో కొత్త మలుపు తీసుకున్నారు. క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా 'బృందావనం, డాన్‌ శీను, ఢ' వంటి చిత్రాల్లో మంచి పేరు తెచ్చుకున్నాడు. నటుడిగా ఆయన శైలి ప్రత్యేకమైంది. డైలాగ్‌ డెలివరీలో ఆయనది ప్రత్యేకమైన తీరు. వ్యక్తిగతంగా చిరంజీవి కుటుంబానికి ఆప్తుల్లో ఒకరైన శ్రీహరి 'మగధీర' చిత్రంలో రామ్‌చరణ్‌తో కలసి నటించారు. అందులో పోషించిన షేర్‌ఖాన్‌ పాత్ర ఆయన కెరీర్‌లో మరో మైలురాయి. ఆ చిత్ర ఘన విజయం తాజా హిందీ 'జంజీర్‌'కు తెలుగు రూపమైన 'తుఫాన్‌'లోనూ షేర్‌ఖాన్‌గా నటించే అవకాశం ఇచ్చింది. పాత్రకు తగ్గ హీరోయిజంతో పాటు ఇటు హాస్యం, అటు విలనీ కూడా పండించగల కొద్దిమంది ఇటీవలి నటుల్లో ఆయన ఒకరు. తమిళంలో 'మాప్పిళై', హిందీలో చిరంజీవి నటించిన 'ప్రతిబంధ్‌' లాంటి ఇతర భాషా చిత్రాల్లోనూ ఆయన నటించారు. 2010లో 'భైరవ' చిత్రంలో ఆయన పెద్ద కుమారుడు సైతం నటించాడం విశేషం. 

సెట్స్‌పైనే ఇంకా సినిమాలు
తెలుగు చలన చిత్రరంగంలో ఆయనది ప్రత్యేక శైలి. ఆయన వాచికం, అభినయం, ఆహార్యం భిన్నంగా ఉండేవి. సాగర్‌ దర్శకత్వంలో వచ్చిన 'రామసక్కనోడు' చిత్రానికి ఉత్తమ విలన్‌గా శ్రీహరి అవార్డును అందుకున్నారు. అలాగే, నిర్మాత ఎం.ఎస్‌. రాజు తీసిన 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా..' చిత్రం ద్వారా 2005లో ఉత్తమ సహాయ నటుడిగా రాష్ట్ర ప్రభుత్వ నంది అవార్డును దక్కించుకున్నారు. సినీ నర్తకి, నటి 'డిస్కో' శాంతిని ఆయన ప్రేమ వివాహం చేసుకున్నారు. ప్రకాష్‌రాజ్‌ ఆయనకు తోడల్లుడు. ఆయన హీరోగా నటించిన తొలి చిత్రం 'పోలీస్‌' కాగా, ఇటీవలే విడుదలైన చివరి చిత్రం 'పోలీస్‌ గేమ్‌' కావడం విశేషం. ప్రస్తుతం ఆయన నటించిన, నటిస్తున్న 'టీ సమోసా బిస్కెట్‌', 'శివకేశవ్‌' వంటి దాదాపు 12 సినిమాలు సెట్స్‌పై ఉన్నాయి. కొన్ని చిత్రాల్లో ఆయన పాత్రపోషణ ఇంకా పూర్తి కానేలేదు. ఆ చిత్రాల పరిస్థితి కొంత ఇబ్బందుల్లో పడే ప్రమాదం ఉంది. 

చిన్న నిర్మాతలకు పెద్ద దిక్కు
నటుడిగా ఏ పాత్రను తీసుకున్నా అందులో ఒదిగిపోవడం శ్రీహరి ప్రత్యేకత. పోలీస్‌ అంటే ఇలానే ఉండాలనిపించేలా 'పోలీస్‌' చిత్రంలో నటించిన ఆయన తరువాత అలాంటి పాత్రలు అనేకం పోషించారు. చిన్న పాత్రల నుంచి ఒక్కోమెట్టు ఎక్కుతూ కథానాయకుడిగా విజయవంతమైన చిత్రాలు చేస్తూనే, మరోవైపు క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా 'మగధీర' వంటి పాత్రలు పోషించిన నటుడు శ్రీహరి. చిన్న నిర్మాతలకు పెద్ద దిక్కుగా నిలిచిన ఘనత శ్రీహరిది. గతంలో హిందీ చిత్రాల్లో చేసినా, అపూర్వ లాఖియా దర్శకత్వంలో 'తుఫాన్‌'లో రామ్‌చరణ్‌తో కలసి పనిచేయడంతో ఇటీవల ఆయనకు క్రేజ్‌ మరికొంత పెరిగింది. ''ఆ చిత్రం షూటింగ్‌ చేస్తుండగానే, బాలీవుడ్‌ దర్శకులు తనను హిందీ చిత్రాలకు వచ్చేయమని పలుసార్లు అడిగారు. అయితే నటుడిగానే మానేద్దామనుకుంటున్న తరుణంలో వారు నన్ను అలా అడగడం థ్రిల్‌గా అనిపించింది. తీరా, నేను చేయననేసరికి వారు ఆశ్చర్యపోయారు'' అని ఆ మధ్య కూడా శ్రీహరి చెప్పుకొచ్చారు.

ఎన్నికల్లో పోటీకి సన్నాహాలు
మొదటి నుంచి తమ కుటుంబం వారు కాంగ్రెస్‌ పార్టీ అభిమానులే అని చెప్పే శ్రీహరి, రానున్న ఎన్నికల్లో కుకట్‌పల్లి ప్రాంతం నుంచి కాంగ్రెస్‌ టికెట్‌పై రాష్ట్ర శాసనసభకు పోటీ చేయాలని భావించారు. అలాగే ప్రస్తుత రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై కూడా ఆ మధ్య ఆయన స్పందించారు. రెండు రాష్ట్రాలు విడిపోయినప్పుడు చూద్దాం అంటూనే... ''సినిమాకు ఇబ్బంది ఏమీలేదు. నాయకులు మారవచ్చుకానీ కళాకారుడు ఎక్కడున్నా ఒక్కటే. కళల్ని ఏ దేశం, ఏ రాష్ట్రం పోషిస్తుందో అది సుభిక్షంగా ఉంటుంది. ఇది శ్రీకృష్ణదేవరాయల కాలం నుంచి చరిత్ర చెబుతున్న సత్యమే. కళలను అశ్రద్ధ చేసిన చోటు బీడు భూములుగా మారిన దాఖలాలూ ఉన్నాయి. నేను సినిమా కోసమే బతుకుతాను. తెలంగాణలో ఇప్పటికే ఎన్‌.శంకర్‌ ఆధ్వర్యంలో ఫిలింఛాంబర్‌ అనేది వస్తుందంటున్నారు. వస్తే మంచి చేసేవారికి సపోర్ట్‌గా నిలుస్తాను. ఏది ఏమైనా ఒకరిని మెప్పిస్తే... మరొకరికి నొప్పించాలి. అందుకే వివాదాల జోలికి పోను. మంచి పనులు ఎక్కడైనా చేస్తునే ఉంటాం'' అని ఆయన అన్నారు.

శ్రీహరి భార్య 'డిస్కో' శాంతి కూడా గతంలో నటి. ఆయనకు ఇద్దరు కుమారులు. నాలుగునెలల వయసులోనే కుమార్తె అక్షర చనిపోవడంతో, ఆమె స్మృతి చిహ్నంగా అక్షర ఫౌండేషన్‌ను స్థాపించి, పలు సామాజిక సేవా కార్యక్రమాలను ఆయన నిర్వహిస్తూవచ్చారు. సాధారణంగా శ్రీహరి పుట్టినరోజు నాడు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి, ముఖ్యంగా తెలంగాణాలోని వివిధ గ్రామాల నుంచి ఎక్కువగా అభిమానులు వచ్చేవారు. చనిపోయిన కుమార్తె పేరు మీద మేడ్చల్‌కు సమీపంలోని నాలుగు గ్రామాల్లో ఆయన సేవా కార్యక్రమాలు చేపట్టడం, ఫ్లోరైడ్‌ సమస్యతో బాధపడుతున్న గ్రామాలకు రక్షిత మంచినీటి సరఫరా కేంద్రాలను నెలకొల్పడంతో వారంతా వచ్చి ఆయనను ఆశీర్వదించేవారు. 

పరిశ్రమ పట్ల శ్రీహరి స్పష్టమైన అవగాహనతో ఉండేవారు. ''మనం ఇండస్ర్టీకి ఎందుకు వచ్చాం బాబూ? అంటూ పెద్దలు అడిగేవారు. వారి మాటలు తూచ తప్పకుండా పాటించాను. సినిమాటోగ్రాఫర్‌ వి.ఎస్‌.ఆర్‌. స్వామి ఎప్పుడూ చెబుతుండేవారు.. చిన్న వేషం వచ్చినా వదలొద్దు. అది చేస్తే .. అక్కడ నీకొక చిన్న కుటుంబం ఏర్పడుతుంది. వారికి దగ్గరవుతావు. ఎవరెక్కడ మన గురించి చెబుతారో తెలీదు. లైట్‌బారు కూడా.. మన గురించి వేరే షూటింగ్‌లో మంచిగా చెప్పవచ్చు అనేవారు. ఆ పద్ధతే నేను పాటించాను'' అని శ్రీహరి చెబుతుండేవారు. అలాంటి ఎన్నో కుటుంబాలను ఏర్పరచుకున్న ఆయన ఆకస్మిక మరణంతో తెలుగు పరిశ్రమకు మంచి నటుణ్ణే కాక, మంచి మనిషిని కోల్పోయింది. ఆ లోటు ఎలా తీరేను!

(ప్రజాశక్తి దినపత్రిక, 10 అక్టోబర్ 2013, గురువారం, పేజీ నం. 8లో ప్రచురితం)
.............................................

0 వ్యాఖ్యలు: