జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Thursday, October 3, 2013

వైవిధ్యం కరవైన తెలుగు సినీ వేడుక - అంతా అవకతవక ఖంగాళీయే

-విసుగెత్తించిన..తెలుగు వేడుకలు
-సుదీర్ఘ అనుబంధమున్నవారికి.. దక్కని ప్రాధాన్య0

చెన్నైలో జరుగున్న నూరేళ్ళ భారతీయ సినిమా ఉత్సవాల్లో భాగంగా రెండో రోజైన ఆదివారం సాయంత్రం తెలుగు సినీ పరిశ్రమ వేడుకలు జరిగాయి. నటుడు సాయి కుమార్‌, నటి రోజా వ్యాఖ్యాతలుగా వ్యవహరించిన తెలుగు సినిమా సాంస్కృతిక కార్యక్రమాల్లో వైవిధ్యం కానీ, తెలుగు సినిమా విశిష్టత కానీ కనపడనే లేదు. బాలాదిత్య, అర్చన లాంటి చిన్న స్థాయి నటీనటులు, ఊరూ పేరూ తెలియని ఔత్సాహిక కళాకారులే రికార్డింగ్‌ డ్యాన్సులతో కార్యక్రమాలు అయ్యాయంటే, అయ్యాయని అనిపించారు. 
జనానికి సభకు హాజరైన ఒకరిద్దరు పెద్ద హీరోలు, హీరోయిన్లు, ఆఖరి నిమిషంలో వచ్చిన బ్రహ్మానందం లాంటి వారెవరూ సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనకపోవడం విచిత్రం. ఈ వేడుకల విషయంలో తెలుగు సినీ పరిశ్రమలోని అనైక్యతకూ, నిర్వాహకుల ప్లానింగ్‌ లోపానికీ ఇది నిలువెత్తు నిదర్శనమైంది. హీరోయిన్ల పాపులర్‌ పాటలతో ఒకటి, ఏయన్నార్‌, ఎన్టీయార్‌ పాటలతో మరో రెండు నృత్య కదంబాలు సాగాయి. నిర్మాత - ఈ తెలుగు వేడుకల ఛీఫ్‌ కన్వీనర్‌ అయిన కె.ఎస్‌. రామారావు సారథ్యంలో, దర్శకుడు వి.ఎన్‌. ఆదిత్య పర్యవేక్షణలో ప్రధానంగా జరిగిన ఈ కార్యక్రమాలు సినిమా వాళ్ళ హాజరు తక్కువ కారణంగా, 'సరిగమపదని', ఢిల్లీకి చెందిన 'ఎం.జె. ఫైవ్‌' లాంటి బయటి డ్యాన్స్‌ పార్టీల్లోని ఔత్సాహికులతోనే నడిచాయి.
పెద్దయెత్తున చేసే ఇలాంటి కార్యక్రమాల్లో లోటుపాట్లు, తప్పులు ఉండడం సహజం కానీ, ఆద్యంతం వాటితోనే తూతూ మంత్రంగా అయ్యాయని అనిపించడం ఈ తెలుగు సినీ వేడుకల ప్రత్యేకత. ఓ వరుస, పద్ధతి లేకుండా 'ఎందరో మహానుభావులు' అంటూ వేసిన ఆడియో- విజువల్‌ ప్రదర్శన గతించిన తెలుగు సినీ పెద్దలను స్మరించుకోవడానికి బదులు ఎందరినో విస్మరించింది. ఇక, ఒక పాట వేస్తూ మరో పాట సినిమా కథానాయిక విజువల్‌ చూపడం లాంటి తప్పులకైతే లెక్కే లేదు. 
దాదాపుగా ఆరేడు నెలలుగా ఈ కార్యక్రమం కోసం ఏర్పాట్లు జరుగుతున్నప్పటికీ, సౌతిండియన్‌ ఫిల్మ్‌ ఛాంబర్‌ అధ్యక్షుడు చిల్లర కల్యాణ్‌ మాత్రం ''హడావిడిగా చేయడం, తొందర వల్ల ఈ పెద్ద కార్యక్రమంలో చిన్న చిన్న పొరపాట్లు జరిగాయి'' అంటూ సాకులు చెప్పుకొచ్చారు. ''ఈ వేడుకలన్నిటి ఆర్గనైజింగ్‌ కమిటీ ఛైర్మన్‌గా, సౌతిండియన్‌ ఫిల్మ్‌ ఛాంబర్‌ అధ్యక్షుడిగా ఆ తప్పులు నావే! అందరి పక్షాన నన్ను క్షమించాలి'' అని ముందరి కాళ్ళకు బంధం వేయబోయారు. ముగిసిపోయిన తమిళ, కన్నడ సినిమా షోల కన్నా తెలుగు వేడుకలే అద్భుతంగా జరుగుతున్నాయంటూ తనకు తానే భుజం తట్టుకున్నారు.
ఇవి తెలుగు సినిమా వేడుకలే అయినా, తెలుగు చిత్రసీమతో సుదీర్ఘ భాగస్వామ్యమున్న ఏయన్నార్‌ కానీ, సీనియర్‌ హీరో కృష్ణ, గిన్నిస్‌ బుక్‌కు ఎక్కిన నటి - దర్శకురాలు విజయనిర్మల లాంటి వారెవరూ కనిపించనేలేదు. మన మధ్య ఉన్న అలాంటి సీనియర్‌ సినిమా వ్యక్తులను తప్పకుండా ఈ కార్యక్రమాలకు రప్పించేందుకు నిర్వాహకులు చేసిన ప్రయత్నాలేమిటో ఎవరికీ తెలియవు. 
ఆఖరు నిమిషం దాకా పాసులు ఎవరికీ అందకపోవడం, సాయంత్రం కార్యక్రమం అంటే అంతకు మూడు, నాలుగు గంటల ముందుగా మాత్రమే మూడు పెద్ద అట్టపెట్టెల్లో ఆహ్వానాలు ఫిల్మ్‌ ఛాంబర్‌కు చేరడంతో కనీసం స్థానిక సినీ ప్రముఖులకైనా ఆహ్వానాలు అందించేందుకు వీలు లేకుండా పోయిందని సాక్షాత్తూ ఫిల్మ్‌ ఛాంబర్‌ వర్గాలే 'ప్రజాశక్తి'తో ఆంతరంగికంగా వాపోయాయి.
కాగా, తమిళ, మలయాళ పరిశ్రమలు ఒక్కొక్కటీ వివిధ రంగాల్లో ఎన్నో దశాబ్దాలుగా సేవ చేస్తున్న 50 మంది సీనియర్‌ సినీ పెద్దలను మాత్రమే ప్రత్యేకంగా ఎంపిక చేసుకొని మరీ సన్మానిస్తే, తెలుగు సన్మానాల జాబితాకు అంతం లేదు. సభకు రావడం పాపం! దాదాపుగా అక్కడకు వచ్చిన ప్రతి ఒక్కరికీ సన్మానం చేశారంటే అతిశయోక్తి కాదు. ఎవరూ రారనుకున్న సమయంలో కొందరినైనా ఎలాగోలా రప్పించినందుకు గాను, వారి రాకే మహాభాగ్యంగా వచ్చిన ప్రతి ఒక్కరినీ సన్మానించడానికి నిర్వాహకులు తంటాలు పడ్డారు. 
ఈ దెబ్బతో సీనియర్ల మాటెలా ఉన్నా, ఆహ్వానం మన్నించి వచ్చినందుకు సినీ రంగంలో నిన్న గాక మొన్న కళ్ళు తెరిచిన వారికీ తాయిలంగా బయోస్కోప్‌ బొమ్మ, నూరేళ్ళ సినిమా లోగో శాలువా దక్కాయి. చివరకు సాయంత్రం ఆరు గంటలకు మొదలై, టీవీ షో విక్రయం కోసం దాదాపు ఆరు గంటల పాటు సాగిన ఈ తెలుగు సినీ పరిశ్రమ వేడుకలు ఓ ప్రహసనంగా ముగిశాయి. 
తొమ్మిదిన్నర, పది గంటలకే సామాన్య జనమంతా దాదాపుగా వెళ్ళిపోయారు. సభాంగణం దాదాపు ఖాళీ అయినా, సన్మానం అందుకోవడం కోసం కూర్చున్న కొద్దిమంది, నిర్వాహక సిబ్బంది ముందే కార్యక్రమాలు సా.....గిపోయాయి.
- చెన్నై నుంచి రెంటాల జయదేవ
(ప్రజాశక్తి దినపత్రిక, 24 సెప్టెంబర్ 2013, మంగళవారం, పేజీ నం. 8)
..................................................

0 వ్యాఖ్యలు: