జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Tuesday, September 3, 2013

మద్రాసు, మాలతితో నా మైత్రీ సుగంధం - రచయిత్రి కె. రామలక్ష్మీ ఆరుద్ర

మరి గీర కూడా సమాన పరిధిలో పెరిగిందనుకుంటా. ఆ స్కూలు అలాంటిది. భాష క్లాసులో తప్పించి 'మన' భాష మాట్లాడితే ఫైను! అక్కడ గేమ్స్‌ హైలైట్‌. బాస్కెట్‌బాల్‌, త్రోబాల్‌ లాంటి వాటికి ఛాంపియన్‌. అక్కడ బాగా రాటుతేలాను. పోటీల్లో ఇతర స్కూళ్లను మన్ను కరిపించడం మజాగా ఉండేది.

నా మిత్ర బృందం కూడా రకరకాలు. ఆ స్కూల్లో ఆంగ్లో ఇండియన్స్‌, మళయాళీలు ఎక్కువ. తమిళులు ఎక్కువే. కానీ ఆరోజుల్లో వాళ్లు చాలా సౌమ్యంగా ఉండేవాళ్లు. ఓ ఆంగ్లో ఇండియన్‌, ఇద్దరు మళయాళీలు, నేను గ్యాంగుగా తిరిగేవాళ్లం. 
ఆ రోజుల్లో మూర్‌ మార్కెట్‌ వెనకగా ప్రతి ఏటా ఒక ఎగ్జిబిషన్‌ పెట్టేవారు. అసలు మూర్‌ మార్కెట్లో తిరగడమే ఒక ఫ్యాషన్‌. పాత పుస్తకాల షాపులు కోకొల్లలు. గంటలు ఇట్టే గడిచిపోతాయి. మా టీచర్లు కోపం వస్తే 'కాస్త మూర్‌ మార్కెట్‌లో బ్రెయిన్‌ దొరుకుతుందేమో! ఈ మాటు చూసుకోండి' అని తిట్టడం ఆనవాయితీ. 
అలా ఆ ఎగ్జిబిషన్‌ను చూడడానికి మేం నలుగురం బయలుదేరి, తిరిగి తిరిగి ఒక పుస్తకాల షాపు కనిపిస్తే ఆగాము. అమ్మకానికి షాపులో చాలా మంచి పుస్తకాలున్నాయి గాని మా కుర్రకారు చదివే రొమాన్సులు కనబడలేదు. కొట్లో ఓ యువకుడు, ఒక యువతి ఉన్నారు. వారు చాలా సరదాగా 'ఇది చూడండి... అది చూడండి' అని పుస్తకాల పరిచయం కూడా చేశారు. కానీ మాకు కావలసినవేం లేవని కదలబోతుంటే 'ఇదిగో కొత్తగా వచ్చింది - డి.ఎఫ్‌ కారకా పుస్తకం - 'ఐ హ్యావ్‌ షెడ్‌ మై టియర్స్‌'. బాగుంది' అని ఆ అమ్మాయి చూపించింది. అప్పటికే మేం కొనే రకం కాదని ఆయన గ్రహించి వెళ్లి కూర్చున్నాడు. 
మాలో ఒకతె 'ఉయ్ డునాట్‌ వాంట్‌ టు షెడ్‌ అవర్‌ టియర్స్‌ ఆన్‌ దట్‌' అంది. నవ్వుకుంటూ నడవబోయాం. 
ఇంతలో 'ఏయ్ రావుడూ ఇలా రా' అని పిలిచాడు ఆ పక్కనే ఉన్న ఇంకొకాయన. 'మాలతీ! ఇదెవరో తెలుసా! నాకు మరదలు అవుతుంది' అని పరిచయం చేశాడు. నేను హల్లో అన్నాను 
అతను గో.రా శాస్త్రి. జర్నలిస్టు, మంచి రచయిత. మా పిన్ని అల్లుడు. 'దీనికి ఇంకా ఏ భాషా పూర్తిగా రాదు' అని నన్ను వేళాకోళం చేశాడు.
అదీ మాలతీ చందూరుతో నా తొలి పరిచయం! 
ఆ తర్వాత చాలా రోజులు నాకు గొప్ప పరిచయాలు లేవు... చదివి కాలేజీలో చేరాక.. పందిరి మల్లికార్జునరావుగారి అమ్మాయి శాంతాబారు నాకు సీనియర్‌ అయింది. అలా మల్లికార్జునరావుగారు, మెల్లిగా రేడియోలో ఆచంట జానకీరామ్‌ గారు పరిచయం. 
వారి ద్వారా విద్యార్థిగా ఉన్నప్పుడే ఆడిషన్‌ చేసి, రేడియో నాటకాలు చదివేదాన్ని. అక్కడ కృష్ణశాస్త్రిగారు, భాస్కరభట్ల, శ్రీవాత్సవ, జనమంచి రామకృష్ణ లాంటి లబ్ధప్రతిష్ఠులు కలిశారు. వీరంతా మాలతికీ, చందూరుకీ కూడా మంచి పరిచయస్థులు. అలా నాకు అంతగా తెలుగు రాయడం రాకపోయినా తెలుగు రచయితల పరిచయాలు కలిగాయి. 
నన్ను కాలేజీలో చూసిన ఖాసా సుబ్బారావు గారు జర్నలిజంలోకి తీసుకువచ్చారు. ఫలితాలు వచ్చేదాకా ఆయన దగ్గరకు వెళ్లలేదు. క్లాసు రాకుంటే సిగ్గు అని. ఆ గ్యాప్‌లో వి.ఎన్‌. శర్మగారు, ఎల్‌ఎన్‌ శర్మ గారు పరిచయం అయ్యారు. ఊరికే ఉండకుండా మైలాపూర్‌లోని వాళ్ల 'చిల్డ్రన్స్‌ గార్డెన్‌' స్కూల్లో సాయంత్రం టైంలో కథల క్లాసులు, డ్రాయింగ్‌ క్లాసులు తీసుకొనేదాన్ని. 
అదిగో అక్కడే మాలతి సోదరి శారదాంబ పరిచయం. ఈమె క్రమశిక్షణకి పేరైన టీచర్‌.
కాలం పోనుపోనూ నా పిల్లలందరూ ఈ స్కూలు విద్యార్థులే - స్వేచ్ఛగా, స్వచ్ఛంగా, వికసించిన పువ్వులే అయ్యారు. శారదాంబ చాలా చక్కని టీచరే కాదు, పిల్లలకు మంచి అలవాట్లే కాదు, ప్రవర్తన రావడానికి కారణభూతురాలు. నా పిల్లలెప్పుడూ 'శారదాంబా టీచర్‌ చూస్తే బాబోరు' అనుకుంటారు. పజిల్స్‌, ఇతరత్రా ఉపయుక్తమైన మెదడుకు మేతగా పనికివచ్చే ఎన్నో లక్షణాలు ఆవిడ గారి ధర్మమే. నా పిల్లలే ఇవాళ పిల్లల తల్లులైనా ఆమె మాటలు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. అది నాకు గర్వకారణం. 
నేను అడపాదడపా మాలతిని కలుస్తూనే ఉండేదాన్ని. కానీ జర్నలిస్టుగా రూపాంతరం చెంది చిన్న చిన్న ఫీచర్లు, కథలూ కాకరకాయలు రాయడం మొదలుపెట్టాక కాస్త ఓపెన్‌గా జర్నలిస్టు - రచయితగా బయట ప్రపంచంలో తిరగడం మొదలు పెట్టాకే మాలతి కుటుంబంతో చనువు బాగా పెరిగింది. ఆమె అప్పటికే లబ్ధప్రతిష్ఠురాలు. చందూర్‌ ఆమెకు నీడలా ఉండి ఆమె ఎదుగుదలకు ఎనలేని అండగా నిలబడి ఆమెను ఉన్నతస్థాయి కాలమిస్టుగా తీర్చిదిద్దారు. 
నేను చాలా రకాల ఫీచర్లు రాశాను. కానీ నా ఓర్పు, కుతూహలం దేనిలోనైనా రెండు మూడేళ్లకు మించి సాగదు! అదో పెద్ద జబ్బు. మాలతి అన్నేళ్లు ' ప్రమదావనం' కొనసాగించింది. కానీ నేను ఓ పదేళ్లలో 'నడుస్తున్న చరిత్ర', 'నారీ దృక్పథం', 'గృహిణిగా మహిళ', 'ప్రశ్నావళి'... వగైరా వగైరా ఎన్నో శీర్షికలు విజయవంతంగా రాశాను. ఏడాది, రెండేళ్లు రాసి ముగించాను. నాకు విసుగులాంటిది వచ్చేస్తుంది! అది తప్పే. కానీ నా తత్వం అది. 
ఈ విషయంలో మాలతి ఎప్పుడూ నన్ను చాలా కోప్పడుతూ వచ్చేది. 'అంత పట్టుదల లేకపోతే ఎలా రామలక్ష్మీ?...' ఏదైనా.. సాగిస్తూ ఉంటేనే కదా జనంలో నిలిచేది...' అనేది. కానీ నా అసహనం ఆమెకు బాగా తెలుసు. 
మాలతి ద్వారా నేను చాలా నేర్చుకున్నాను. స్నేహం వేరు, వృత్తి వేరు. మేం స్నేహితులుగా, కుటుంబ మిత్రులుగా ఎన్ని దశాబ్దాలుగానో కొనసాగగలిగాం. వృత్తి అంటారా? అది అభిరుచిని బట్టి మారిపోతూ ఉంటుంది.
 నా జర్నలిస్టు మిత్రులే కాదు.. మామూలు వాళ్లు కూడా.. నాకూ, మాలతికీ పోటీ అనుకునేవారు. స్నేహం లేదనుకునేవారు. కానీ అంతరాంతరాళాల్లో అందరికీ తెలుసు - మేం ఒక్కటేనని! 
నేనూ, ఆరుద్రా పెళ్లి చేసుకోవడానికి ముందు మద్రాసులో ఏ రాక్సీ థియేటర్‌లోనో సినిమా చూసి కాలక్షేపానికి అలా ఎదురు రోడ్డులో నడిచేవాళ్లం. అది 49, మూకద్దాల్‌ వీధి. పరశువాక్కమ్‌. అది చందూర్ల ఇల్లు. చాలామంది సాహితీవేత్తలకు చలివేంద్రం. శారదాంబ పెట్టింది తింటూ గొప్ప సాహితీ సంభాషణలు జరిగేవి. వ్యంగ్యం, హాస్యం, అపర సీరియస్‌ చర్చలు ధారాళంగా జరిగేవి. అక్కడే నాకు చాలామంది పరిచయం. అవి సాహిత్యం గుబాళించిన సాయంత్రాలు... 
నాకు తరువాత గోరా శాస్త్రి చెప్పారు - మాలతికీ, చందూరుకీ అక్కడే దండలు మార్చి వివాహం చేశారు - పందిరి మల్లికార్జునరావు గారు, ఆచంట జానకీరామ్‌గారు. ఒకరు -గొప్ప సాహిత్య పోషకులైతే, ఇంకొకరు - సాహిత్యాన్నీ, దానితోపాటు ఆయా రచయిత్రులనీ కూడా ఆరాధించేవారు. మల్లెల కాలంలో దోసిట మల్లెపూలు పెట్టుకుని చక్కా వచ్చి ఎంతో ఆరాధనతో మన దోసిట పోసేవారు. 'ఇదేంటి మాలతీ' అంటే, 'అదో సాహిత్యసేవ!' అంటూ లైట్‌గా తోసిపారేసేది. నిజంగా సాహిత్యానికి నిండు సభే కాదు... అనువైన, అరమరికలు లేని చోటు మాలతి ఇల్లు. 
మద్రాసులోనే నా జీవితం అంతా గడిచినా నాకు మిత్రులు, మనసు పంచుకోదగిన వాళ్లు మాలతి, చందూర్లు! సాహిత్య యుద్ధాలు చేయడానికి వెనుకంజ వేయనక్కరలేని సహృదయ సాహితీవేంద్రం మాలతి ఇల్లు. 
నేనూ, మాలతీ ఏకీభవించని విషయాలే ఎక్కువ. కారణం మా తత్త్వం. ఆమెది ఓర్పు! మాటలతో, అదీ మంచి మాటలతో మనుషుల్లో మార్పు తేవచ్చుననే నమ్మకం. వయసూ, కాలం ఆగని పరిస్థితిలో ఆడవాళ్లు సర్దుకుపోతూ ఉంటే సమస్య సాల్వ్‌ అవుతుందన్న తత్వం ఆమెది. నిజానికిది నాకు నచ్చదు. ఎన్నాళ్లు? ఎన్నేళ్లు? 'జీవితంలో ఇప్పుడు ఎదుర్కొంటున్న సమస్యలకు ఎన్నేళ్లు నీతులు చెబితే సరిపడుతుంది! సర్వం ఉడిగిపోయే దాకా ఎదురుచూడ్డంలో ఏముంది? అప్పుడు ఇద్దరికీ అవసరం లేని సఖ్యత ఎందుకు? అనేది నా దృక్పథం. 
సమస్యకు సర్జరీ అవసరం అయితే చెయ్యాలి. ఎన్నాళ్లు రోగానికి టానిక్కులు ఇచ్చి నయం చేస్తాం? అని నేను నమ్ముతాను. కాలంతో పరుగెత్తి, సమస్యల కొమ్ములు విరిచి పట్టుకుని జీవితం మార్గానపడే దారి చూడ్డం అవసరం అని నమ్మే నేను ఎప్పుడూ మాలతితో వాదించేదాన్ని... కానీ, ఆమె ఓర్పు మంత్రం మానలేదు. 
అందుకే మా గురించి బెజవాడ గోపాలరెడ్డిగారు ఒకసారి అన్నారు. ''మాలతి గంభీరమైన సాఫీ ప్రవాహం. కె. రామలక్ష్మిది రాళ్ల మీద నుంచి, రప్పల మీద నుంచి, కొండ చెరియల మీద నుంచి ఉరికి, ప్రవహించే సెలయేరు...! సమస్యను బట్టి మార్గం నిర్ణయంచాలన్నది రామలక్ష్మి దారి. సమస్య ఎంత జటిలమైనా ఒకప్పుడు కాలం పరిష్కరిస్తుందన్న దారి మాలతిది'' అని చాలాసార్లు మమ్మల్నిద్దరినీ బేరీజు వేశారు. 
ఏమైనా, ఇవాళ మద్రాసు పట్టణం పూర్తిగా చూస్తుండగానే మారిపోయింది. అక్కడ నెమ్మదిగా తెలుగు జర్నలిస్టులు తగ్గారు. పత్రికా ప్రతినిధులే న్యూస్‌ కవరేజీ కోసం ఉంటున్నారు. ఒకప్పుడు మద్రాసు తెలుగుదనానికి కేంద్రంగా ఉండేది. పనగల్‌ పార్కు దగ్గర గడ్డి మీద కూర్చున్న మహానుభావులు ఎందరెందరో! వారి చుట్టూ చేరి సంభాషణలను ఆస్వాదించే కుర్రకారు రచయితలు ఎందరో ఉండేవారు. నిజానికి ఈనాటి రావూరి భరద్వాజ దాకా లోకమెరిగిన మేధావులు ఎందరెందరో అక్కడివారే. 'ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ', ఇతర వార్తా పత్రికలకు కేంద్రం అదే. సాయంత్రం మెరీనా బీచ్‌లో కూర్చున్నా చుట్టూ తెలుగువారే. ఇప్పుడు మెరీనా బీచ్‌ కూడా పూర్తిగా తమిళ వాసనే. టి.నగర్‌ సినిమావాళ్లకి, ట్రిప్లికేన్‌ పండితులకి, వడపళని సినిమా జనానికి కేంద్రాలుగా ఉంటూ, నగరం కళకళలాడుతూ ఉండేది. ఇప్పుడలా లేదంటున్నారు. నిజమే! మనకీ తెలుగు పోయిందే అన్న బెంగ లేని రోజులు ఇవి!
మాలతి అంటూ ఉండేది - 'చెన్నపట్నం బోసి' అని! 
నిజమే - ఇవాళ నీ మరణంతో నిజంగానే చెన్నపట్నం బోసిపోయింది. కళ తప్పింది. 
మాలతీ చందూర్‌ లేని మద్రాసును నేను ఊహించుకోలేను. పూర్వం యాత్రికులు, విద్యార్థులు, సిటీ చూడవచ్చినవాళ్లు - ఎన్‌.టి.ఆర్‌. ఇల్లు, మెరీనా బీచ్‌, మాలతీ చందూర్‌ ఇల్లు.... ఇలా చూడవలసిన స్థలాలు నిర్ణయించుకుని, చూసి, ఆనందించేవారు. రచయితలు, సాహితీ సంస్థల ప్రతినిధులు, ఎవరు వచ్చినా మాలతి ఇంటి హాల్ట్‌ తప్పదు. 
నా జీవితంలో ఇంత సుదీర్ఘమైన అనుబంధం ఎవరితోనూ లేదు. ఇక ఉండదు కూడా అ నిపిస్తోంది. ఎందుకంటే ఈ రోజుల్లో అవసరార్థపు స్నేహాలే ఎక్కువ. 'ఏకీభావన ఉంటేనే మిత్రులు. విభేదించే వారితో మనకేం పని' అనేవాళ్లే ఎక్కువ. అందుకే ఒక మిత్రురాలు - కష్టంలో, సుఖంలో, అభిప్రాయ భేదాలతో, ఏకాభిప్రాయంతో పని లేని స్నేహం సాధ్యం కాదు. 
అందుకే 'స్నేహం... స్నేహం కోసం' అనే దృక్పథం ఉన్న చిరకాల మిత్రురాలు పోయిందంటే ఆ లోటు భర్తీ చేయలేనిదని నాకు తెలుసు. 
డియర్‌ ఫ్రెండ్‌.. గుడ్‌బై...
- కె. రామలక్ష్మీ ఆరుద్ర
040 - 24162885 
.....................................................................

0 వ్యాఖ్యలు: