
సమన్వయంతో సమష్టిగా శ్రమించి చేసే సృజన - సినిమా. అందులో సమన్వయం లోపించినా, సమష్టి తత్త్వం లోపించినా వచ్చే ఫలితాలు వేరుగా ఉంటాయి. ఎంచుకున్న కథకు పాత్రధారుల వల్ల ప్రాధాన్యం పెరగాలే తప్ప, పాత్రధారులే ప్రధానమై అసలు కథ పక్కనపడిపోకూడదు. పైపెచ్చు, ఓ భాషలో హిట్టయింది కదా అని, ఆ విజయానికి దోహదమైన అంశాలేమిటో, ఆ పాత్ర పోషించిన నటుడి ఇమేజ్ ఏమిటో గుర్తించకుండా గుడ్డిగా రీమేక్ చేస్తే, ఏకు మేకవుతుంది. అందుకు తాజా ఉదాహరణ - మంచు మనోజ్ కుమార్ అన్నీ తానై చేసిన'పోటుగాడు'.
..............................................
..............................................
తారాగణం: మంచు మనోజ్‌కుమార్, పోసాని కృష్ణమురళి, సాక్షీ చౌధురి, అనుప్రియ, సిమ్రాన్ కౌర్ కుండీ, చంద్రమోహన్, మాటలు: శ్రీధర్ సీపాన, సంగీతం: అచ్చు, కెమేరా: శ్రీకాంత్, కూర్పు: ఎం.ఆర్. వర్మ, నిర్మాత: లగడపాటి శిరీష - శ్రీధర్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: పవన్ వడయార్
..............................................
కన్నడం నుంచి తెలుగులోకి వచ్చి హిట్టయిన 'గుండమ్మ కథ', 'అడవి రాముడు', 'శారద' లాంటి చిత్రాలను పరిశీలిస్తే, ఒక విషయం అర్థమవుతుంది. మూల కథను మన వాతావరణం, మన పాత్రలకు తగ్గట్లుగా మార్చుకోవడం, కథలో కొత్త ఉపకథలను కలుపుకోవడం లాంటివి చేసిన మన దర్శక, నిర్మాతల సృజనాత్మకత, నిర్ణయ సామర్థ్యం తెలుస్తుంది.
ఆ పద్ధతిని పాటించకుండా, హిట్‌కు కారణాలు, స్థానిక మార్పుల అవసరాలు లెక్కించకుండా తీసినప్పుడు ఇటీవలి ఎం.ఎస్. రాజు 'వాన', శివాజీ 'తాజ్ మహల్' లాంటి రీమేక్‌ల దాకా ఎన్నో ఫ్లాపయ్యాయి.
అది గ్రహించకుండా కోమల్ కుమార్ అనే ప్రముఖ కన్నడ కమెడియన్ హీరోగా, మన పాత కథలను రకరకాలుగా మార్చి అక్కడ వండుకున్న 'గోవిందాయ నమ:' చిత్రాన్ని ఇప్పుడు 'పోటుగాడు'గా రీమేక్ చేశారు.
ఆత్మహత్య చేసుకొనేందుకు వెళ్ళిన గోవిందు (మంచు మనోజ్ కుమార్)కు అక్కడ వెంకట రత్నం (పోసాని కృష్ణ మురళి) అనే మరో వ్యక్తి ఆత్మహత్యకు సిద్ధమవుతూ కనిపిస్తాడు. వెంకట రత్నం ఓ అమ్మాయి వల్ల ప్రేమలో మోసపోతే, గోవిందుది మరోరకం కథ.
ఆ కథ చెప్పడంతో ఫ్లాష్‌బ్యాక్ మొదలవుతుంది. కంటికి నదురుగా కనిపించిన అమ్మాయినల్లా ప్రేమించి, ధనవంతుణ్ణి అయిపోవాలనుకునే యువకుడు గోవిందు. అలా అతను వైదేహి (సిమ్రాన్ కౌర్ కుండీ), ముంతాజ్ (సాక్షీ చౌధురి), మరో విదేశీ వనిత స్టేసీ (రేచెల్)లను ప్రేమిస్తాడు. కానీ, ఆ ప్రేమలేవీ పెళ్ళి దాకా వెళ్ళవు. పెళ్ళి దాకా వెళ్ళక ముందే వేరు వేరు కారణాలతో వాళ్లను హీరో వదిలేస్తాడు. ఆ తరువాత అతని జీవితంలోకి అనుకోకుండా మేరీ (అనుప్రియ) వస్తుంది.
అప్పుడతని జీవితంలో వచ్చిన మార్పేమిటి? అది ఎక్కడకు దారి తీసింది? ఆత్మహత్య చేసుకోదలిచిన గోవిందు, వెంకట రత్నం చివరకు ఏమయ్యారన్నది మిగతా కథ.
రొమాంటిక్ కామెడీగా తీయాలనుకున్న ఈ చిత్రంలో యువతను ఆకర్షించడానికి ద్వంద్వార్థాలే శరణ్యమని భ్రమపడి, సీను సీనుకూ ఆ దోవ తొక్కారు. అవి నచ్చేవారికి కూడా ఓ దశ దాటాక సినిమాలో అసలు సరుకు లేకపోవడం అసహనం కలిగిస్తుంది. ఇక, తండ్రి మోహన్‌బాబు ఆంగికాన్నీ, వాచికాన్నీ అదే పనిగా అనుకరిస్తున్న హీరో మంచు మనోజ్ కుమార్ నిజానికి, సినీ రంగాల్లోని వివిధ శాఖల్లో ప్రజ్ఞ ఉన్నవాడే!
కానీ, వచ్చిన చిక్కేమిటంటే, అన్నింటిలోనూ ఏకకాలంలో ఆ తెలివి తేటలు చూపించి, ఆశ్చర్యపరచాలనుకుంటే, అఖండ విజయం సాధించాల నుకుంటే చిక్కులొస్తాయి.
'పోటుగాడు'లో సినిమా అంతా తన భుజాన వేసుకొని, తన ఎనర్జీనంతా తెరపై చూపిన మనోజ్ పాట రాశారు. పాడడంలో గొంతు కలిపారు. స్టంట్లు, థ్రిల్స్ బాధ్యత తానే వేసుకున్నారు. ఇన్నింటితో సహజంగా దర్శకత్వంలో తన చేయి వేసే ఉంటారు. దాంతో, ఫలితం తేడా వచ్చింది.
'పోటుగాడు'లో సినిమా అంతా తన భుజాన వేసుకొని, తన ఎనర్జీనంతా తెరపై చూపిన మనోజ్ పాట రాశారు. పాడడంలో గొంతు కలిపారు. స్టంట్లు, థ్రిల్స్ బాధ్యత తానే వేసుకున్నారు. ఇన్నింటితో సహజంగా దర్శకత్వంలో తన చేయి వేసే ఉంటారు. దాంతో, ఫలితం తేడా వచ్చింది.
డైలాగ్ డెలివరీలో, హావభావ ప్రకటనల్లో పట్టున్న అతి కొద్దిమంది నేటి యువ హీరోల్లో ఒకరైన మనోజ్ తన పంథా మార్చుకొని, దర్శకులనూ, వారి సృజనాత్మకతనూ నమ్మి, వారి చేతిలో మట్టిముద్దగా మారితే మంచిది. దర్శకుల చేతిలో నటుడిగా మారగలిగితే, అతను తన ప్రతిభకు తగ్గట్లుగా రాణించగలుగుతారు.
ఈ సినిమాలో నలుగురు హీరోయిన్లున్నా, ఎవరినీ గుర్తు పట్టనూలేము, పెట్టుకోనూ లేము. ఒకటే తరహా డైలాగ్ డెలివరీ, నటనతో పోసాని పూర్తిగా రొటీన్ తరహాలోకి జారిపోతున్న ఛాయలు ఈ సినిమాలో మరోసారి స్పష్టంగా కనిపిస్తాయి. అలీ, చంద్రమోహన్, కాశీ విశ్వనాథ్ లాంటి వాళ్ళు - సినిమాలో ఇలా వచ్చి అలా వెళ్ళే పాత్రల్లో తెరపై ఎదురవుతారు.
కన్నడ మూలంలో సూపర్‌హిట్టయిన 'ప్యార్‌గే ఆగబిట్టాయితే...' పాట తెలుగులోనూ అదే బాణీలో 'ప్యార్‌లో పడిపోయా మై(..'గా బ్లాక్ అండ్ వైట్‌లో మొదలై కలర్‌లోకి వస్తూ, వెరైటీతో ఆకట్టుకుంటుంది. అలాగే, ద్వితీయార్ధంలో వచ్చే 'దేవతా...ఓ దేవతా..' పాట, తమిళ హీరో శింబు పాడిన 'ఓ బుజ్జిపిల్ల, తెల్ల పిల్ల...' ఫరవాలేదనిపిస్తాయి.
అయితే, సందర్భశుద్ధి లేకుండా పాటలు వచ్చేస్తూ, విసిగిస్తాయి. నిర్మాణ విలువలు బాగున్న ఈ చిత్రంలో కెమేరా, ఇతర విభాగాలు కూడా తమ వంతు కర్తవ్యం నిర్వహించాయి. పాత మోహన్‌బాబు సినిమా ఫక్కీలో కొన్ని పంచ్ డైలాగులూ బాగానే ఉన్నాయి. కానీ, ఎక్కడికక్కడే తప్ప మొత్తం మీద చూసినప్పుడు సినిమాలో పట్టు లేకపోవడం ఇబ్బందికరంగా మారింది.
చిత్ర కథలో, కథనంలో లోపాలు బోలెడు. సినిమా అంతా ఒక్క హీరో చుట్టూరానే తిరుగుతుంటుంది. అతనికి కానీ, కథకు కానీ పక్కబలంగా నిలిచిన పాత్రలు లేవు. హీరో తాత నీలకంఠశాస్త్రిగా చంద్రమోహన్ ఒకటి, రెండు సీన్లకే పరిమితమయ్యారు. ఆ పాత్ర ప్రవర్తనకు జస్టిఫికేషన్ లేదు. అంతేకాకుండా, పుట్టగానే తల్లితండ్రుల్ని పోగొట్టుకున్న హీరోను పెంచి పెద్ద చేసిన ఆ తాత పాత్ర ఆ తరువాత ఏమైందో తెలియదు.
ఇక, కథానాయకుడేమో వరుసగా ఒకరు కాదు ఇద్దరు కాదు, ముగ్గురు అమ్మాయిలను ప్రేమించి, పెళ్ళాడకుండానే వదిలేస్తాడు. తీరా, నాలుగో అమ్మాయి వ్యవహారం తనకే ఎదురు తిరిగిందని తెలిసేసరికల్లా ఆత్మహత్య చేసుకోవాలనుకోవడం ఏమిటి?
ఇక, ఆ నాలుగో అమ్మాయి వల్ల తానెంతో మారిపోయానంటూ హీరో చెబుతాడు. డబ్బుకు ప్రాధాన్యమిస్తూ, గోపాలకృష్ణుడిలా ప్రేమలో మునిగి తేలే హీరో అంతగా మారిపోవడానికి కారణం అర్థం కాదు.
మొదటి ఇద్దరమ్మాయిలను తాను వదిలేయడానికి హీరో చెప్పిన వివరణలు వట్టి సాకులుగా కనిపిస్తాయి. మూడో అమ్మాయి విషయంలో అతను అసలు ఏ వివరణా చెప్పడు. నిర్దిష్టమైన ఏ లక్ష్యమూ లేని హీరో డబ్బు కోసమే ప్రేమ, పెళ్ళి లాంటి మాటలు మాట్లాడే పచ్చి అవకాశవాదిగా కనిపిస్తాడు. దాంతో, ఆ పాత్ర మీద ప్రేక్షకులకు ప్రేమ పుట్టదు.
ఇక, ఆ నాలుగో అమ్మాయి వల్ల తానెంతో మారిపోయానంటూ హీరో చెబుతాడు. డబ్బుకు ప్రాధాన్యమిస్తూ, గోపాలకృష్ణుడిలా ప్రేమలో మునిగి తేలే హీరో అంతగా మారిపోవడానికి కారణం అర్థం కాదు.
మొదటి ఇద్దరమ్మాయిలను తాను వదిలేయడానికి హీరో చెప్పిన వివరణలు వట్టి సాకులుగా కనిపిస్తాయి. మూడో అమ్మాయి విషయంలో అతను అసలు ఏ వివరణా చెప్పడు. నిర్దిష్టమైన ఏ లక్ష్యమూ లేని హీరో డబ్బు కోసమే ప్రేమ, పెళ్ళి లాంటి మాటలు మాట్లాడే పచ్చి అవకాశవాదిగా కనిపిస్తాడు. దాంతో, ఆ పాత్ర మీద ప్రేక్షకులకు ప్రేమ పుట్టదు.
సినిమాలోనే ఓ చోట పోసానితో డైలాగుల్లో చెప్పించినట్లు, ఈ సినిమా అంతా - ఘడియకో అమ్మాయితో హీరో ప్రేమ, ఆ వెనువెంటనే ఓ డ్యూయట్, తక్షణం కథలో ట్విస్టుతో ఆ జంట విడిపోవడం - ఇదీ వరుస. ఈ ఫార్ములాతో చివరి దాకా నడిపించి, ఆఖరు ట్విస్టును మాత్రం హీరో మీద సానుభూతి పెరిగేలా చూపించి, సినిమాకు శుభం కార్డు వేశారు.
సినిమా మొదలైన కాసేపటికే కథ నడిచే ఈ స్కీమ్ అర్థమైపోతుంది కాబట్టి, ప్రేక్షకుల్ని చివరి దాకా కూర్చోబెట్టడానికి చాలా కష్టపడ్డారు. కానీ, వాళ్ళకూ, ప్రేక్షకులకూ కూడా అది శ్రమే అయింది.
వెరసి, సినిమా ప్రథమార్ధం కాసేపు ద్వంద్వార్థ సంభాషణలు, తద్వారా సృష్టించిన వినోదంతో అలా అలా గడిచిపోతుంది. ఆసక్తికరమైన మలుపు దగ్గర ఇంటర్వెల్ అవుతుంది. కానీ, ద్వితీయార్ధానికి వచ్చేసరికి సినిమా గ్రాఫ్ ఠపీమని పడిపోతుంది. హీరోను మంచివాడిగా చూపేందుకు ఆఖరులో కన్విన్సింగ్‌గా అనిపించని హడావిడి క్లయిమాక్స్ తో సినిమా ముగిసిపోతుంది. అలా ఈ రెండుంబావు గంటల సినిమా అసంతృప్తికర అనుభవంగా మిగిలిపోతుంది.
కొసమెరుపు:
సినిమా చూసి వస్తుంటే, 'ఎలా ఉంద'ని అడిగినవాళ్ళకు ఉత్సాహవంతుడైన ఓ యువ ప్రేక్షకుడు చేసిన ఘాటైన కామెంట్ ఏమిటంటే, 'పోటుగాడు - వీడొట్టి తలపోటుగాడు!' భావప్రకటన హక్కున్న మన సమాజంలో ఈ ట్విట్టర్ తరం ప్రేక్షకుల్ని ఆపడం ఎవరికి సాధ్యం!
- రెంటాల జయదేవ
.........................................
1 వ్యాఖ్యలు:
పోటుగాడు తలపోటుగాడయినా,దుప్లికేటుగాడయినా ఆ కీర్తిగాని అపకీర్తి గాని దర్శకుడిఖాతాలోకే పోతాయి!అందరూ అన్నిట్లో కలుగజేసుకొని తమ వేళ్ళు పెట్టినట్లయితే సినిమా కలగూరగంపగా కలగాపులగంగా తయారవుతుంది!సినిమా దర్శకుడి మాధ్యమం!అది స్వకపోలకల్పన అయినా ,రీమేక్ అయినా ప్రతిసీనులోనూ దర్శకుడిదే తుది నిర్ణయం కావాలి!సినిమాలో అన్నీ సమపాళ్ళలో కుదిరి బాగా పండాలంటే దర్శకుడికి పూర్తి స్వేచ్చ ఇచ్చితీరాలి!రెంటాల జయదేవగారు నిజాయితీగా సినిమాను సమీక్షించారు!
Post a Comment