జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Sunday, September 29, 2013

ఆర్బాటంగా తమిళ సినీ షో!


నూరేళ్ళ భారతీయ సినిమా ఉత్సవాల సందర్భంగా తొలి రోజైన శనివారం నాడు సాయంత్రం తమిళ సినిమా వేడుకలు ఆర్భాటంగా జరిగాయి. అందులో భాగంగా ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో పలువురు పెద్ద, చిన్న తమిళ సినీ ప్రముఖులు ఉత్సాహంగా పాల్గొన్నారు. టాకీలు మొదలైనప్పటి నుంచి ఇటీవలి వరకు తమిళ చిత్రాల్లో వచ్చిన మార్పులను ప్రతిబింబించేలా దశాబ్దాల వారీగా, కొన్ని పాటలను ఎంచుకొని, వాటికి పలువురు సినీ నటీనటులు వేదికపై అభినయించారు.
ముఖ్యంగా, భారతీరాజా, బాలూ మహేంద్ర, మణిరత్నం తదితర సుప్రసిద్ధుల చిత్రాలతో తమిళ సినిమాకు స్వర్ణమయమైన దశాబ్దం అని చెప్పదగిన 1980 - '90వ దశకం గురించి దర్శకుడు ఎం. రాజా ('ఎడిటర్‌' మోహన్‌ కుమారుడు), అతని సోదరుడైన హీరో 'జయం' రవి, బృందం చేసిన ప్రదర్శన అర్థవంతంగా ఉంది. తమిళ సూపర్‌స్టార్లు కీర్తిశేషులు ఎం.జి. రామచంద్రన్‌, శివాజీ గణేశన్‌ల పాటలకు డ్యాన్సులు వేసినప్పుడు ఆహూతులు, ప్రేక్షకులు ఉత్సాహంగా స్పందించారు.
టాకీల తొలినాళ్ళలో తమిళ అగ్ర నటుడైన ఎం.కె. త్యాగరాయ భాగవతార్‌గా అభినయిస్తూ, కమెడియన్‌ వివేక్‌ హాస్యం పండించారు. స్టంట్‌ మెన్లు చేసిన ప్రత్యేక విన్యాసాలు, ఈ వేడుక కోసం వారు ప్రత్యేకంగా స్టంట్లు చేయగా, వాటిని చిత్రీకరించి, దర్శకుడు ఆర్‌.కె. సెల్వమణి చూపిన వీడియోలు కార్యక్రమంలో వినూత్నంగా నిలిచాయి. హీరో సూర్య, కార్తి, విశాల్‌, జీవా, 'రోజా పూలు' ఫేమ్‌ శ్రీకాంత్‌, భరత్‌ తమ నృత్యాలతో అలరించారు.
కమల్‌, రజనీల నుంచి నేర్చుకోవాల్సినవి...
దర్శకుడు లింగుస్వామితో హీరో సూర్య చేసిన టాక్‌ షో తరహా కార్యక్రమం ఆసక్తికరంగా సాగింది. అందులో 'సింగం'లోని ఓ పంచ్‌ డైలాగ్‌ను తమిళంతో పాటు తెలుగులో చెప్పి, సూర్య అలరించారు. అలాగే, తమిళ అగ్ర హీరోలు రజనీకాంత్‌, కమలహాసన్‌లను చూసి, వారి నుంచి తాను పొందిన స్ఫూర్తిని సైతం సూర్య గుర్తు చేసుకున్నారు. ''విజయాలు ఎన్ని వరించినా తలకెక్కని గర్వం, ఇంత స్థాయికి ఎదిగినా ఇప్పటికీ ఎక్కడా తప్పించుకోకుండా శ్రమపడే తత్త్వం వారిని చూసి నేర్చుకోవాలి'' అని సూర్య చెప్పినప్పుడు సభా ప్రాంగణం చప్పట్లతో నిండిపోయింది.

విక్రమ్‌, శరత్‌ కుమార్‌, అర్జున్‌, యువ హీరోలు సూర్య, కార్తి, ధనుష్‌, శింబు, యువ హీరోయిన్లు కార్తిక, హన్సిక, కాజల్‌ అగర్వాల్‌, పాత తరం నాయికలు - ఇలా అందరూ పాల్గొనడంతో తమిళ సినిమా కార్యక్రమాలు ఆర్భాటంగా సాగాయి. తమలో తమకు విభేదాలు ఎన్ని ఉన్నా, తమిళ దర్శక, నిర్మాతలు, సినీ ప్రముఖులు అధిక భాగం మంది ఈ వేడుకకు సమష్టిగా శ్రమించిన విధానం వేదికపై కార్యక్రమాల్లో కనిపించింది.

'అమ్మ' దారిలోకే అంతా...
అయితే, సినిమా తారలు అందరూ జయలలితను పొగడడంలో పోటాపోటీ పడడం కార్యక్రమం అంతటా కనిపించింది. సినిమా పండుగగా కాక, జయలలిత ప్రభుత్వ విజయోత్సవ సభగా మారిందన్న విమర్శలూ వచ్చాయి. సినీ పరిశ్రమకు ఏం కావాలో అది జయలలిత చేస్తారంటూ, ''పిల్లలకు ఏం కావాలో 'అమ్మ'కు తెలియదా?'' అని త్యాగరాయ భాగవతార్‌ వేషంలో ఉన్న కమెడియన్‌ వివేక్‌ చమత్కరించారు. ఇక, రాజకీయ ఆకాంక్షలను వెలిబుచ్చి, ఆ మధ్య 'తలైవా' (తెలుగులో 'అన్న'గా విడుదలైంది) రిలీజు సందర్భంగా అనేక చిక్కులను ఎదుర్కొన్న హీరో విజయ్ని సైతం మెడలు వంచి, తమ దారిలోకి తెచ్చుకోవడంలో జయలలిత, ఆమె ప్రభుత్వం ఈ వేడుకల్లో సక్సెసైంది.
ఎప్పుడూ ఇలాంటి ఫంక్షన్లకు దూరంగా ఉండే హీరో విజయ్ ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి హాజరై, జయలలితనూ, ఆమె ప్రభుత్వాన్ని వేదికపై ప్రశంసించారు. ''ఒక నటిగా జీవితం ప్రారంభించి, జీవితంలో ఎన్నో సవాళ్ళను ఎదుర్కొని, చివరకు ఒక రాష్ట్రాన్ని పాలించే అధినేత్రిగా ఎదగడం ఎంతో గొప్ప'' అని విజయ్ పొగడ్తల జల్లు కురిపించారు. గమ్మత్తేమిటంటే, సాంస్కృతిక కార్యక్రమాలు మొదలైన కాసేపటికే జయలలిత సభా ప్రాంగణం నుంచి వెళ్ళిపోయినా, వక్తలు మాత్రం ఆమెను పొగడడం మానకపోవడం! రాత్రి పది గంటలు అవుతున్నా కార్యక్రమాలు సుదీర్ఘంగా సాగుతుండడంతో, అధిక శాతం మంది జనం ఇంటిముఖం పట్టారు. 

- రెంటాల  జయదేవ 
.............................................

0 వ్యాఖ్యలు: