- భారతీయ సినిమాలో మద్రాస్‌కు ప్రత్యేక స్థానం
- తెలుగు సినిమా పయనం ఇక్కడ్నుంచే
- మొన్నటివరకూ దక్షిణాది సినిమాకు ఇదే రాజధాని
భారతీయ సినిమా శతవసంతాలు పూర్తి చేసుకున్న సందర్భమిది. మన దేశంలోకి సినీ ప్రదర్శనలు అంతకు ముందే వచ్చినా, మనవాళ్ళూ సొంతంగా కొన్ని న్యూస్‌రీళ్ళు, లఘు చిత్రాలు తీసినా, తొలి స్వదేశీ ఫీచర్‌ఫిల్మ్ జనం ముందుకు వచ్చింది మాత్రం 1913లో! అలా కథకథనాత్మక చిత్రాలు రావడంతో, సినిమా పరిశ్రమగా రూపం తీసుకుందంటూ దాన్ని భారతీయ సినిమా జన్మదినంగా పరిగణిస్తూ వచ్చారు. అలా ఈ ఏడాదితో భారతీయ సినిమాకు నూరు వసంతాలు నిండాయి. ఈ సందర్భంగా చెన్నైలో ఇవాళ్టి నుంచి సెప్టెంబర్ 24 దాకా నాలుగు రోజుల పాటు దక్షిణ భారత చిత్ర పరిశ్రమలు నాలుగూ కలసి, ఉత్సవాలు జరుపుకొంటున్నాయి. మరి, ఈ ఉత్సవాలను చెన్నైలో ఎందుకు జరుపుతున్నట్లని ఎవరికైనా సందేహం రావచ్చు. ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే, ఆ సందేహాలను నివృత్తి చేసే సమాధానాలు దొరుకుతాయి. నూటపదహారేళ్ళ క్రితం దక్షిణ భారతదేశంలో తొలిసారిగా సినిమా కాలుమోపింది మద్రాసు (ఇప్పటి చెన్నై)లోనే. బ్రిటీషు పాలనా కాలంలోని మద్రాసు ప్రెసిడెన్సీ (ఉమ్మడి మద్రాసు రాష్ట్రం)లో తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళ భాషా ప్రాంతాలు కూడా కలగలిసి ఉండేవి. అక్కడి నుంచి టాకీలు వచ్చాక, స్వతంత్ర భారతావనిలోనూ ప్రాంతీయ భాషలన్నిటికీ సినీ రాజధానిగా చాలాకాలం పాటు వెలిగిన వైనం దాకా మద్రాసు పురవీధులెన్నో మన సినీ చరిత్రలోని కథలెన్నో చెబుతాయి. వాటిల్లో కొన్ని...
దక్షిణాదిలో తొలి ప్రదర్శన మద్రాసులోనే!
భారతదేశంలో లూమియర్ల సినిమాటోగ్రాఫ్ కాలుమోపిన అయిదు నెలలకే మద్రాసుకు కూడా చలనచిత్ర ప్రదర్శనలు వచ్చేశాయి. ఇప్పటి దాకా అందరూ చెబుతున్నట్లు 1897లో కాక, 1896 డిసెంబర్‌లోనే చెన్నపురికి సినిమా వచ్చినట్లు ఇటీవలి సినీ పరిశోధనల్లో వెల్లడైంది. పైపెచ్చు, ఆ ప్రదర్శనలు ఎవరో అమెరికన్ వచ్చి జరిపినవి కాక, నగరంలో నివసిస్తూ, అక్కడే పని చేస్తున్న స్టీఫెన్సన్ అనే వ్యక్తి నిర్వహించినవి కావడం మరో విశేషం. మద్రాసులోని విక్టోరియా పబ్లిక్ హాలులో సినిమాటోగ్రాఫ్‌తో ఫిల్ములు ప్రదర్శించారు. ఈ విక్టోరియా పబ్లిక్ హాలు చెన్నై సెంట్రల్ రైల్వేస్టేషన్‌కూ, ప్రస్తుత నగరపాలక సంస్థ కార్యాలయమైన రిప్పన్ బిల్డింగ్‌కూ మధ్య ఇప్పటికీ ఉంది. సరిగ్గా 116 ఏళ్ళ తరువాత ఇప్పుడు భారతీయ సినిమా ఉత్సవాలు జరుగుతున్నది కూడా అదే హాలుకు దగ్గరలోనే నడక దూరంలో ఉన్న నెహ్రూ ఇండోర్ స్టేడియమ్‌లో కావడం గమనార్హం.
![]() |
చెన్నైలోని సెంట్రల్ రైల్వేస్టేషన్ పక్కనే ఇప్పటికీ ఉన్న విక్టోరియా పబ్లిక్ హాలు |
తొలి టూరింగ్ సినిమా
ఏమైనా, కొత్త పరిశోధనల ప్రకారం చూస్తే - ఇప్పటి దాకా పుస్తకాల్లో పేర్కొంటున్నదాని కన్నా ఏడాది ముందే మద్రాసులో తొలి చిత్ర ప్రదర్శనలు జరిగాయనీ, భారతదేశమంతటా చిత్ర ప్రదర్శనలు వ్యాపించడంలో మద్రాసు కీలకపాత్ర పోషించిందనీ అర్థమవుతోంది. ఆ తరువాత కూడా ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఎంతో మంది ఫిల్ములను ప్రదర్శించేవారు. అలా ఫిల్ముల ప్రదర్శన వాణిజ్యపరంగా విజయవంతం అవుతుండడం చూసి, మరికొందరికి ఉత్సాహం కలిగింది. తిరుచ్చికి చెందిన రైల్వే ఉద్యోగి అయిన సామికన్ను విన్సెంట్ అనే ఆయన 'ఎడిసన్స్ సినిమాటోగ్రాఫ్'ను సంచార సినిమాహాలుగా 1905లో నెలకొల్పారు. అలా ఆయన సినిమా ఎగ్జిబిటరైన తొలి తమిళుడయ్యారు.
తొలి శాశ్వత థియేటర్ల శ్రేణి
ఇక, మద్రాసులో స్థిరపడ్డ తెలుగువాడూ, బందరు బిడ్డ అయిన రఘుపతి వెంకయ్య నాయుడు ఆ తరువాత 1909 ప్రాంతంలో టూరింగ్ సినిమాను నెలకొల్పారు. ఆ సంచార సినిమాతో భారతదేశం నలుమూలల్లోనే కాక, బర్మా, సిలోన్‌లలో కూడా ప్రదర్శనలిచ్చారు. ఆ పైన మద్రాసుకు తిరిగొచ్చి, 'గెయిటీ' (1914) పేరిట శాశ్వత సినిమా హాలు నిర్మించారు. మౌంట్ రోడ్డు సమీపంలో కూవమ్ నదికి పక్కనే బ్లాకర్స్ రోడ్డులో కట్టిన ఆ సినిమా హాలు మద్రాసులో ఓ భారతీయుడి యాజమాన్యంలో నిర్మాణమైన తొలి శాశ్వత సినిమా థియేటర్. ఆ తరువాత మన ఈ తెలుగు సినీ పితామహుడు వెంకయ్యే మద్రాసులో మరో రెండు థియేటర్లు (మింట్ స్ట్రీట్‌లో 1916లో 'క్రౌన్', పురసవాక్కమ్ ప్రాంతంలో 1917లో 'గ్లోబ్') కట్టారు. దక్షిణ భారతదేశంలో తొలి గొలుసుకట్టు థియేటర్ల శ్రేణి ఇదే! ఆ మూడు థియేటర్లతో ఆ ఘనత మన తెలుగువాడికి దక్కింది.
మన మూకీలకు పురిటిగడ్డ మద్రాసే!
భారతదేశంలోనే తొలి సినిమాటోగ్రాఫ్ ప్రదర్శనలు 1896 జూలై 7న బొంబాయిలో జరిగితే, ఆ తరువాత అయిదు నెలలకల్లా మద్రాసుకు సినిమా వచ్చేసింది. అలాగే, వాణిజ్యరీతిలో చలనచిత్రాల నిర్మాణం కూడా మనదేశంలో ముందుగా బొంబాయిలో మొదలైంది. సరిగ్గా నూరేళ్ళ క్రితం దాదాసాహెబ్ ఫాల్కే తీసిన 'రాజా హరిశ్చంద్ర' (1913)తో సినిమా రూపకల్పన పరిశ్రమ శ్రీకారం చుట్టుకుంది. ఆ తొలి భారతీయ మూకీ ఫీచర్‌ఫిల్మ్, ఆ తరువాత బొంబాయిలో ఆవిష్కృతమైన సినీ విజయగాథలను ఎందరికో స్ఫూర్తినిచ్చాయి. ఆ స్ఫూర్తితోనే వెంటనే దక్షిణ భారతదేశంలో తొలిసారిగా మద్రాసులో చిత్ర నిర్మాణం మొదలైంది. దక్షిణ భారత సినీ పరిశ్రమకు శ్రీకారం చుట్టిన ఆ తొలి సినిమా - 'కీచక వధమ్' (1916). దాన్ని రూపొందించింది - ఆటోమొబైల్ విడి భాగాల వ్యాపారస్థుడైన మద్రాసు వాసి ఆర్.నటరాజ ముదలియార్.
మద్రాసులోని మౌంట్ రోడ్డులో థౌజండ్ లైట్స్ ప్రాంతంలో ఆయన ఆటోమొబైల్ విడిభాగాల కార్యాలయం ఉండేది. సినిమా మీద ప్రేమతో ఆయన పూనా వెళ్ళి, స్టీవార్ట్ స్మిత్ అనే ఓ బ్రిటీషు కెమేరామన్ దగ్గర శిక్షణ పొందారు. ఆ పైన మద్రాసుకు తిరిగొచ్చి, మరో మిత్రుడితో కలసి 1916లో ఇండియన్ ఫిల్మ్ కంపెనీ అనే చిత్ర నిర్మాణ సంస్థను నెలకొల్పారు. ఆ సంస్థ పక్షానే తొలి దక్షిణ భారతీయ మూకీ చిత్రం 'కీచక వధమ్' తీశారు.
తెలుగు వారి తొలి స్టూడియో అక్కడే!
దక్షిణాదిలో తొలి ఫిల్మ్ స్టూడియో కూడా మద్రాసులోనే ఏర్పాటైంది. 'కీచక వధమ్' షూటింగ్ కోసం నటరాజ ముదలియార్ మద్రాసులోని కీల్పాక్ ప్రాంతంలో మిల్లర్స్ రోడ్డులోని ఓ భవంతిలో దక్షిణ భారతదేశపు తొలి ఫిల్మ్ స్టూడియో ఏర్పాటు చేశారు. అలాగే, చిత్రీకరణ జరిపిన ఫిల్మును ప్రాసెస్ చేయడం కోసం వాతావరణ కారణాల రీత్యా బెంగుళూరులో ప్రాసెసింగ్ లేబొరేటరీ పెట్టారు. చిత్ర నిర్మాణ సంస్థ పెట్టిన 35 రోజుల్లో 'కీచక వధమ్'ను రూపొందించారు.
ఆ తరువాత రఘుపతి వెంకయ్య, సినిమా రూపకల్పనపై ఇంగ్లండ్‌లో శిక్షణ పొంది వచ్చిన ఆయన కుమారుడు రఘుపతి సూర్య ప్రకాశ్‌లు నటరాజ ముదలియార్ నడిచిన బాటను అనుసరించారు. విదేశాల నుంచి వచ్చిన రఘుపతి ప్రకాశ్ రమారమి 1921లో తన తండ్రి రఘుపతి వెంకయ్య అండదండలతో, మద్రాసులోని పరశువాక్కమ్ ప్రాంతంలో గ్లోబ్ థియేటర్ వెనుక 'స్టార్ ఆఫ్ ది ఈస్ట్' పేరిట ఓ స్టూడియోనూ, 'స్టార్ ఆఫ్ ది ఈస్ట్ ఫిలిమ్స్' పేరిట చిత్ర నిర్మాణ సంస్థనూ నెలకొల్పారు. స్టూడియోలో ఫిల్మ్ లేబొరేటరీ సౌకర్యం కూడా ఏర్పాటు చేసుకున్నారు. అలా మన తెలుగువాళ్ళు కట్టిన తొలి స్టూడియో, చిత్ర నిర్మాణ సంస్థ కూడా మద్రాసులోనే వచ్చాయన్న మాట!
తగినంత సూర్యరశ్మి లోపలకు వచ్చేలా గాజు పలకల పై కప్పుతో కూడిన ఆ స్టూడియో అప్పట్లో 'గ్లాస్ స్టూడియో'గా జనసామాన్యంలో ప్రసిద్ధమైంది. మూకీ చిత్రం 'భీష్మ ప్రతిజ్ఞ'తో ప్రకాశ్ అక్కడ చిత్ర నిర్మాణం మొదలుపెట్టారు. తెలుగువారు తీసిన తొలి మూకీ ఫీచర్‌ఫిల్మ్ అదే! పెగ్గీ కాస్టెల్లో, బన్నీ ఆస్టెన్‌లు ప్రధాన తారాగణం నటించిన ఈ 8 వేల అడుగుల చిత్రం ఘన విజయం సాధించింది. ఈ చిత్ర ప్రదర్శన వ్యవధి 134 నిమిషాలట !ఈ చిత్ర విజయం ఇచ్చిన ప్రోత్సాహంతో, ఆయన పలు మూగ చిత్రాలను రూపొందించారు.
తొలి మహిళా సౌండ్ రికార్డిస్ట్
అలాగే, ఏ. నారాయణన్, టి.హెచ్. హఫ్టన్, ఆర్. పద్మనాభన్ లాంటి పలువురు మద్రాసు నుంచే మూకీ చిత్రాలు తీశారు. ఏ. నారాయణన్ 1929 ఆగస్టులో నెలకొల్పిన 'జనరల్ పిక్చర్స్ కార్పొరేషన్' సంస్థ అధిక సంఖ్యలో మూకీలు తీసింది. భారీ డిస్ట్రిబ్యూషన్, ఎగ్జిబిషన్ వ్యవస్థలను ఏర్పాటుచేసుకున్న తొలి దక్షిణాది సంస్థ ఇదే. తరువాతి కాలంలో ఉన్నత స్థాయికి ఎదిగిన పలువురు దక్షిణాది సినీ ప్రముఖులకు ఈ సంస్థ ఓ సినీ విద్యాలయంగా విలసిల్లిందంటే అతిశయోక్తి కాదు.
నారాయణన్ భార్య కమల ఆయన చిత్రాలకు సౌండ్ రికార్డిస్ట్‌గా పనిచేసేవారు. భారతదేశంలో తొలి మహిళా ఫిల్మ్ టెక్నీషియన్‌గా పేరు తెచ్చుకున్నారు.
దక్షిణాదిలో తొలి టాకీ స్టూడియో, చిత్రం
అయితే, హాలీవుడ్ చిత్రాలు, బ్రిటీషు సినిమాలు, ఉత్తర భారతదేశపు చిత్రాల నుంచి ఎదురవుతూ వచ్చిన పెను సవాళ్ళను దక్షిణాదిలోని సైలెంట్ ఫిల్మ్ స్టూడియోలు దీటుగా ఎదుర్కోలేకపోయాయి. దాంతో, 1927 ప్రాంతం నుంచి కొంత కష్టాలను ఎదుర్కొంటూ వచ్చిన ఈ స్టూడియోలు, చిత్ర నిర్మాణ సంస్థలు ఒక్కటొక్కటిగా మూతబడుతూ వచ్చాయి. మరోపక్క 1931 నాటికి మద్రాసుకు కూడా టాకీలు వచ్చేశాయి. తొలి పూర్తి నిడివి భారతీయ టాకీ చిత్రం 'ఆలమ్ ఆరా' విడుదల (1931 మార్చి 14)తో, దక్షిణాది భాషల్లోనూ టాకీల నిర్మాణానికి బీజం పడింది. తమిళ - తెలుగు భాషలు రెండూ తెరపై వినిపిస్తూ, తొలి దక్షిణ భారతీయ భాషా టాకీ చిత్రమైన 'కాళిదాస్' (1931 అక్టోబర్ 31) జనం ముందుకొచ్చింది. ఆపైన తొలి పూర్తి తెలుగు టాకీగా 'భక్త ప్రహ్లాద' (1932 ఫిబ్రవరి 6) వచ్చింది.
టాకీల తొలినాళ్ళలో అందుకు తగిన సౌకర్యాలున్న స్టూడియోలేవీ మద్రాసులో లేకపోవడంతో, ఈ దక్షిణాది భాషా టాకీలు కూడా కొన్నేళ్ళ పాటు బొంబాయి, కలకత్తాల్లోనే తయారయ్యాయి. ఆ పరిస్థితుల్లో 1934లో ఏ.నారాయణనే మద్రాసులోని తొలి సౌండ్ స్టూడియో 'శ్రీనివాసా టోన్' నెలకొల్పారు. యావత్ దక్షిణ భారతదేశంలోనే తొలి టాకీ స్టూడియో అదే!
మద్రాసులోని వేపేరి ప్రాంతంలో లాడర్స్ గేట్ దగ్గర (పూనమల్లి హైరోడ్డులో నెహ్రూ పార్కుకు దాదాపు ఎదురుగా) ఈ స్టూడియో ఉండేది. ఈ స్టూడియో టాకీ చిత్రాల నిర్మాణానికి అనువుగా రూపొందినది కావడంతో, దాన్ని 'సౌండ్ సిటీ' అని అప్పట్లో జనం పిలుస్తుండేవారు. ఆ సంస్థ ముందుగా 'శ్రీనివాస కల్యాణం' అనే ఓ తమిళ చిత్రాన్ని మద్రాసులోనే నిర్మించింది. మద్రాసులో తయారైన తొలి తమిళ టాకీ అదే! ఆ మాటకొస్తే, భాషల మాట పక్కనబెట్టి చూసినా, యావత్ దక్షిణ భారతావనిలో తయారైన తొలి టాకీ చిత్రమూ అదే! ఆ తరువాత పన్నెండు నెలల్లోనే ఏకంగా 36 టాకీలు మద్రాసులో తయారయ్యాయి. ఆ రకంగా దక్షిణాది సినిమా ప్రభంజనం మొదలైంది.
తెలుగు వారి తొలి స్టూడియో, టాకీ
సరిగ్గా 1934లోనే జూలై నెలలో తెలుగు వారి పెట్టుబడి భాగస్వామ్యంతో 'వేల్ పిక్చర్స్ స్టూడియో' ఏర్పాటైంది. మద్రాసులోని తేనాంపేట ప్రాంతంలో ఎల్డామ్స్ రోడ్ దగ్గర ప్రస్తుత వీనస్ కాలనీ (ఒకప్పుడు వీనస్ స్టూడియో)కి దగ్గరలో పిరవాపురం రాజా వారికి 'డన్‌మోర్ హౌస్' అనే పెద్ద బంగళా ఉండేది. బందరుకు చెందిన వ్యాపారవేత్త, సినీ ఎగ్జిబిటర్ పి.వి. దాసు అది తీసుకొని, దానిలో 'వేల్ పిక్చర్స్' పేరున సినిమా చిత్రీకరణలకు అనువైన స్టూడియోను నెలకొల్పారు. ప్రత్యేకించి లైట్లు లేకుండా సూర్యరశ్మి ఆధారంగానే షూటింగులు జరుపుతూ, 'శ్రీనివాస సినీటోన్' నడిచేది.
అయితే, అందుకు పూర్తి భిన్నంగా, 'శ్రీనివాస సినీటోన్' కన్నా ఎంతో ఉత్తమంగా, నాణ్యమైన సాంకేతిక వసతులతో 'వేల్ పిక్చర్స్ స్టూడియో' ఏర్పాటైంది. వేల్ పిక్చర్స్ స్టూడియో నిర్మాణం, నిర్వహణలకు పి.వి.దాసు ఎంతో శ్రమించారు. 'వేల్ పిక్చర్స్' కంపెనీ వారు విశేషంగా పరిశ్రమించి, వ్యయానికి లెక్క చేయకుండా, ఉత్తమమైన చిత్రాలను తయారుచేయాలనే లక్ష్యంతో పాటుపడ్డారు. పైగా, వాళ్ళు స్టూడియో నిర్మించుకున్న 'డన్‌మోర్ హౌస్' అన్ని విధాల వాళ్ళ ఉద్యమానికి అనుకూలమైంది. స్టూడియో కోసం ఆధునిక యంత్ర సామగ్రిని చాలా వరకు తెప్పించారు. అజంతా, ఎల్లోరా చిత్తరువుల సంప్రదాయాలను అనుసరించి, వస్తు వాహనాలను విరివిగా తయారు చేయించారు. ఆంధ్రదేశంలోనూ, అరవ దేశంలోనూ ఉండే శిల్పులు, వడ్రంగుల్లో ప్రవీణులైన కొందరిని రప్పించి, స్టూడియోకు అవసరమైన సంబారాన్ని అంతా అమర్చుకున్నారు.
దక్షిణాది తయారీ తొలి తెలుగు టాకీ 'సీతా కల్యాణము'
'వేల్ పిక్చర్స్' వారి తొలి చిత్రం - తెలుగు సినిమా 'సీతా కల్యాణము' (1934). వారి స్టూడియోలో ప్రథమంగా నిర్మించినది కూడా ఈ చిత్రమే! ఆ రకంగా మద్రాసులో తెలుగు చలనచిత్ర నిర్మాణానికి శ్రీకారం చుట్టింది - పి.వి. దాసు. అప్పటి దాకా ఉత్తర భారతదేశంలోని నగరాల్లో రూపొందుతున్న తెలుగు చిత్రాలకు భిన్నంగా, దక్షిణ భారతదేశంలోనే తయారైన తొలి తెలుగు చిత్రంగా 'సీతా కల్యాణము' చరిత్ర సృష్టించింది. అటుపైన మద్రాసులోని అడయార్‌లో 'మీనాక్షీ సినీటోన్' అంటే మరో స్టూడియో వచ్చింది. 1937 నాటి కల్లా మద్రాస్ ప్రెసిడెన్సీలో దాదాపు రూ. 17 కోట్ల మొత్తం సినిమా పరిశ్రమలో పెట్టుబడి అయింది. స్టూడియోలు కూడా మద్రాసులో 9, కోయంబత్తూరులో రెండు, సేలమ్‌లో ఒకటి నడవసాగాయి. మౌలిక వసతులు, సాంకేతిక నిపుణులు, పరిజ్ఞానం విరివిగా అందుబాటులో ఉండడం వల్ల ఖర్చు తక్కువవుతుంది కాబట్టి, క్రమంగా కన్నడ, మలయాళ చిత్రాల నిర్మాణం కూడా మద్రాసులో స్థిరపడింది.
అలా దక్షిణాది సినీ రంగాలన్నిటికీ మద్రాసు తిరుగులేని కేంద్రంగా నిలిచింది. తరువాతి క్రమంలో కన్నడ, మలయాళ, తెలుగు చిత్రసీమలు వాటి వాటి స్వరాష్ట్రాలకు తరలిపోయాయి. అయితే, ఇవాళ్టికీ సంగీతం, కెమేరా, నృత్య విభాగాలతో సహా పలు అంశాల్లో నిష్ణాతులైన సాంకేతిక నిపుణుల కోసం అందరికీ మద్రాసే శరణ్యమవుతోంది. భారతీయ సినిమా తొలినాళ్ళ నుంచి ఉన్న అవినాభావ సంబంధం కారణంగా ఇవాళ నూరేళ్ళ సినీ ఉత్సవం మద్రాసులో జరగడం ఎంతో సమంజసం! కాదంటారా?
- చెన్నై నుంచి రెంటాల జయదేవ
................................................
0 వ్యాఖ్యలు:
Post a Comment