జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Sunday, September 15, 2013

దక్షిణాది సినిమా... పుట్టింట్లో పండుగ


మూకీల రోజుల నుంచి కూడా స్టూడియోలు తదితర చిత్ర నిర్మాణ వసతులతో మద్రాసు నగరంలో సినీ సంస్కృతి వెల్లివిరిసింది. ఆ తరువాత 1931లో భారతీయ టాకీ చిత్రాల నిర్మాణం మొదలైన తరువాత క్రమంగా వసతులు మరింత పెరిగాయి. ఆధునిక సినీ సాంకేతికత కూడా బొంబాయి తరువాత మద్రాసుకే దిగుమతి అవడం రానురానూ ఎక్కువైంది. దాంతో, తమిళ, తెలుగు, మలయాళ, కన్నడ భాషా సినీ పరిశ్రమలకు సుదీర్ఘ కాలం మద్రాసే రాజధాని. తరువాతి కాలంలో ఆ యా భాషా సినీ పరిశ్రమలు ఆ యా రాష్ట్రాల రాజధానులకు తరలివెళ్ళినా, ఇప్పటికీ దక్షిణ భారత చలనచిత్ర రంగానికి మద్రాసే మకుటం లేని మహారాజు! 
ఈ నేపథ్యంలోనే భారతీయ సినిమా శత జయంతి పండుగ సందర్భంగా దక్షిణాది సినీ పరిశ్రమలు నాలుగూ కలసి మద్రాసులో పెద్దయెత్తున వేడుకలు జరుపుతున్నాయి. ఈ నెల 21 నుంచి 24 దాకా నాలుగు రోజుల పాటు కార్యక్రమాలు జరుగుతాయి. దక్షిణ భారత చలనచిత్ర వాణిజ్య మండలి (ఎస్‌.ఐ.ఎఫ్‌.సి.సి) ఆధ్వర్యంలో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, కర్నాటక, కేరళ రాష్ట్రాల ఫిల్మ్‌ చాంబర్లు నాలుగూ, వాటి అనుబంధ సంస్థలూ కలసి, సమన్వయంతో చెన్నపట్నంలోని జవహర్‌లాల్‌ నెహ్రూ ఇండోర్‌ స్టేడియమ్‌లో ఈ వేడుకలు జరపడం విశేషం.
''నాలుగు వేర్వేరు భాషా సినీ పరిశ్రమలు కలసి ఒక్కచోట ఇంత పెద్దయెత్తున వేడుకలు జరుపుకోవడం భారతీయ సినీ చరిత్రలో ఇదే ప్రథమం. తమిళనాడు ముఖ్యమంత్రి, ఒకప్పుడు స్వయానా సినీ నటి అయిన జయలలిత సంపూర్ణ సహాయ, సహకారాల వల్లే ఇది సాధ్యమవుతోంది'' అని ఎస్‌.ఐ.ఎఫ్‌.సి.సి. అధ్యక్ష బాధ్యతలను నిర్వహిస్తున్న ప్రముఖ తెలుగు సినీ నిర్మాత సి. కల్యాణ్‌ చెప్పారు. ఈ ఉత్సవ నిర్వాహక కమిటీకి ఆయనే చైర్మన్‌. 
జయలలిత చేతుల మీదుగా 21వ తేదీ శనివారం సాయంత్రం 5.30 గంటలకు తమిళ సినీ ప్రముఖులు పాల్గొనే తమిళ కార్యక్రమంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. 22వ తేదీ ఉదయం కన్నడ ప్రముఖులతో కన్నడ సినీ కార్యక్రమం, సాయంత్రం తెలుగు సినీ కార్యక్రమం, 23వ తేదీ ఉదయం మలయాళ సినీ కార్యక్రమం జరుగుతాయి. ఇక, అత్యంత భారీగా 24న తుది ఘట్టం వేడుకలు జరగనున్నాయి. ఈ చివరి రోజు వేడుకలకు భారత రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ముఖ్య అతిథిగా హాజవుతున్నారు. అలాగే, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, కేరళ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అమితాబ్‌ బచ్చన్‌తో సహా పలువురు ఉత్తరాది సినీ ప్రముఖులు రానున్నారు. 
ఈ వేడుకలు, ఆటపాటల ప్రాక్టీస్‌ నిమిత్తం వారం రోజుల పాటు దక్షిణాది సినీ రంగంలో షూటింగ్‌, తదితర కార్యక్రమాలన్నిటికీ సెలవు ప్రకటించడం విశేషం. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత స్వయంగా శ్రద్ధ తీసుకొని, కార్యక్రమాల రూపకల్పనలో కూడా సలహాలు, సూచనలిస్తుండడంతో ఈ ఉత్సవాలకు ఆర్థికంగా, హార్దికంగా ఇక కొదవేముంటుంది!
....................................................

0 వ్యాఖ్యలు: