జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Monday, September 2, 2013

నేటి రాజకీయాలకు దర్పణం - 'సత్యాగ్రహ' (సినిమా సమీక్ష)


చుట్టూ ఉన్న సమాజంలో జరుగుతున్న అంశాలను, అందులోనూ రాజకీయాలను తీసుకొని, వాటిని సినీ కథలుగా మలచడం, సమర్థంగా తెరకెక్కించడం దర్శకుడు ప్రకాశ్‌ ఝా శైలి. 'గంగాజల్‌', 'అపహరణ్‌', ఆ మధ్య వచ్చిన 'ఆరక్షణ్‌', 'రాజ్‌నీతి' అలాంటివే. సామాజికంగా ప్రభుత్వం కల్పించే రిజర్వేషన్లపై 'ఆరక్షణ్‌' తీస్తే, వారసత్వ రాజకీయాలు, వాటిలోని తెర వెనుక సంగతులపై 'రాజ్‌నీతి' రూపొందించారు. అదే పంథాలో అవినీతి కి  వ్యతిరేకంగా 2011 చివరలో దేశం దృష్టిని ఆకర్షించిన అన్నా హజారే ఉద్యమ గాథను
తనదైన కెమేరా కన్నుతో చిత్రీకరించి, 'సత్యాగ్రహ'గా అందించారు.
..........................................
చిత్రం - సత్యాగ్రహ, తారాగణం - అమితాబ్ బచ్చన్, అజయ్ దేవ్ గణ్, కరీనా కపూర్ ఖాన్, మనోజ్ బాజ్ పాయ్, అర్జున్ రామ్ పాల్, స్క్రి ప్ట్ - ప్రకాశ్ ఝా, అంజుమ్ రాజ్ బలి, పాటలు - ప్రసూన్ జోషీ, దర్శకత్వం - ప్రకాశ్ ఝా
..........................................
'సత్యాగ్రహ' చిత్రంలో జనాందోళనకు నాయకత్వం వహిస్తున్న ఓ రిటైర్డ్‌  స్కూల్ ప్రిన్స్ పాల్ (అమితాబ్‌ బచ్చన్‌), జర్నలిస్టులతో మాట్లాడుతూ, ''ప్రభుత్వానికి మా కమిటీ ఓ ఆదేశం ఇవ్వాలని నిర్ణయించుకుంది?'' అంటారు. ''ఆదేశమా?'' అని ఓ జర్నలిస్టు ఆశ్చర్యంగా అడుగుతాడు. ''అవును! ప్రజాస్వామ్యంలో తమకు సేవ చేసేందుకని ప్రజలే ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు. కాబట్టి, ఇక్కడ ప్రజలే ప్రభువులు. ప్రజలతో ఎన్నుకోబడిన ప్రభుత్వాలు 'సేవకులు' అవుతారు. ఎక్కడైనా, ప్రభువులు ఆదేశాలే ఇస్తారు'' అని ఆ సత్యాగ్రహ నేత గంభీరంగా చెబుతాడు. 'సత్యాగ్రహ' చిత్రంలోని ఓ కీలక ఘట్టంలో వచ్చే సంభాషణ ఇది.
ప్రజాస్వామ్య మూల సూత్రాన్నీ, 'జన్‌ లోక్‌పాల్‌' బిల్లుతో సహా వివిధ అంశాలపై అన్నా హజారే చేసిన ఆందోళననూ స్ఫురణకు తేవడానికి ఇంతకన్నా వేరే ఉదాహరణ ఏం కావాలి? నిజానికి, ప్రజలే ప్రభువులైన మన ప్రజాస్వామ్యంలో ఇప్పటికీ ప్రభుత్వాలు, రాజకీయ నేతలు సొంత లాభమే తప్ప, ప్రజల బాగోగుల్ని పట్టించుకోని దు:స్థితి. ఎటు చూసినా పెరిగిపోతున్న అవినీతి, బంధుప్రీతి. ఈ పరిస్థితిని ఎండగడుతూ, ప్రభుత్వంలోని వారు ప్రజలకు జవాబుదారీగా ఉండాలనే సూత్రాన్ని నిండు తెరపై, డాల్బీ డిజిటల్‌ సౌండ్‌లో గుర్తు చేస్తుందీ చిత్రం.
అంబికాపూర్‌ జిల్లాలో ఓ రిటైర్డ్‌ స్కూల్‌ ప్రిన్సిపాల్‌ ద్వారకా ఆనంద్‌ అలియాస్‌ దాదూజీ (అమితాబ్‌ బచ్చన్‌). తండ్రి ఆదర్శాలను ఒంటబట్టించుకొని, గోల్డ్‌ మెడలిస్టయినా, దేశాభివృద్ధి కోసం స్వదేశంలోనే ఇంజనీర్‌గా పనిచేస్తుంటాడు అతని కొడుకు. అవసరాన్ని బట్టి అడ్డదోవలు తొక్కిమరీ, వేలాది కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకుంటాడు ఆ అబ్బాయి మిత్రుడు మానవ్‌ రాఘవేంద్ర (అజరు దేవ్‌గణ్‌). దాదూజీ కుమారుడి ఆకస్మిక మరణంతో సర్కారు రూ. 25 లక్షల పరిహారం ప్రకటిస్తుంది. ఆ డబ్బుతో ఊరికి ఉపకారం చేయాలనుకున్న దాదూజీ కుటుంబానికి అధికారుల పెత్తనం అడ్డుపడుతుంది.
ఆ క్రమంలో దాదూజీ తనతో పాటు సమాజంలో ఇలా ప్రభుత్వం నుంచి సాయం అందని వారందరి పక్షాన పోరాటానికి దిగుతాడు. అందుకు మానవ్‌, టీవీ చానల్‌ రిపోర్టర్‌ (కరీనా కపూర్‌ ఖాన్‌), స్థానిక గూండా (అర్జున్‌ రామ్‌పాల్‌) తదితరులు సహకరిస్తారు. ఆ పోరాటం 'జన సత్యాగ్రహం'గా ఎలా మారింది, అది ఎక్కడికి దారి తీసింది లాంటివన్నీ మిగతా సినిమా.

సమాజంలోని పరిస్థితుల పట్ల ఉన్న ఆవేదననూ, ఆవేశాన్నీ ప్రకాశ్‌ ఝా మరోసారి బలంగా వినిపించారీ 'సత్యాగ్రహ'లో! ప్రస్తుత రాజకీయ వాతావరణం మారాలంటే, చుట్టూ ఉన్న పరిస్థితుల్ని నిందిస్తూ కూర్చోకుండా, రాజకీయాల్లోనే చేరి, వాటిని మార్చేందుకు ప్రయత్నించాలన్న సందేశమిస్తారు. అన్నా హజారే, ఆయన గ్రామమైన రాలే గావ్‌ సిద్ధీ, ఆయనకు అండగా నిలిచిన నిజజీవిత ప్రముఖులను అందరినీ గుర్తుకు తెస్తూనే, సినిమాటిక్‌ స్వేచ్ఛ తీసుకొని ఈ స్క్రిప్టును అంజుమ్‌ రాజ్‌బలి, ఝాలు బాగా అల్లుకున్నారు.
స్టార్‌ హీరో దశ నుంచి కథలోని కీలక పాత్రల దశకు ఎంతో సమర్థంగా పరిణామం చెందిన అమితాబ్‌ బచ్చన్‌ ఇందులో గౌరవనీయుడైన జన సత్యాగ్రహ నేత పాత్రను అద్భుతంగా పండించారు. కొన్ని సందర్భాల్లో చిన్న చిన్న ముఖకవళికలతోనే ఎన్నో మాటల అర్థాన్ని బట్వాడా చేశారు. 'ఆరక్షణ్' మినహా ఇటీవలి ప్రకాశ్‌ ఝా చిత్రాలన్నిటిలో ఆస్థాన నటుడైన అజయ్ దేవ్‌గణ్‌ తమది హిట్‌ కాంబినేషన్‌ అని మరోసారి ఋజువు చేశారు. 'సింగం', 'బోల్‌ బచ్చన్‌' లాంటి వంద కోట్ల చిత్రాల హీరో అయిన అజయ్ తన హీరోయిజమ్‌ తక్కువగా ఉండే ఈ చిత్రంలోని పాత్రను ఎంచుకోవడం, దాన్ని పండించేందుకు కృషి చేయడం బాగుంది. మన తెలుగు తారలు అనుసరించాల్సిన మార్గానికి ఆదర్శంగా నిలిచింది.
రాష్ట్ర హోమ్‌ మంత్రి బలరామ్‌ సింగ్‌గా అరుపులు, కేకలు లేకుండా, తేనె పూసిన కత్తి లాంటి రాజకీయ విలనీని ప్రదర్శించిన మనోజ్‌ బాజ్‌పాయ్ ని చూస్తే ముచ్చటేస్తుంది. పెద్ద హీరోయిన్‌గా పేరున్న కరిష్మా కపూర్‌ సైతం నిడివి, పరిధి తక్కువున్న ఓ టీవీ చానల్‌ రిపోర్టర్‌ పాత్రలో ఆనందంగా నటించారు, ఆహ్లాదంగా కనిపించారు.
ఈ సినిమాలో లోపాలు లేవా అంటే బ్రహ్మాండంగా ఉన్నాయి. కథకు అక్కర లేని అజరు, కరీనాలా రొమాంటిక్‌ పాట మొదలు టైటిల్స్‌లో నతాషా నర్తించిన ప్రత్యేక నృత్యగీతం దాకా వాణిజ్య మసాలాలూ దట్టించారు. కొన్ని సందర్భాల్లో అనవసరమైన మెలోడ్రామాను ఆశ్రయించారు. ఆందోళన కోసం జనం ఒక్కటిగా చేరిన కొన్ని చోట్ల సందర్భానికి కావాల్సిన భారీతనాన్ని సృష్టించలేకనూ పోయారు. ఆస్తులన్నీ వదలుకొని వచ్చి, అజరు దేవ్‌గణ్‌ జనం ముందు మాట్లాడే ఘట్టం లాంటివి మరింత ఎఫెక్టివ్‌గా తీర్చిదిద్దాల్సింది. అయితే, సినిమా ఇతివృత్తం, దాన్ని వీలైనంత నిజాయతీగా చూపే ప్రయత్నం చూశాక, ఇవన్నీ పెద్ద అసంతృప్తులు అనిపించవు.
డిజిటల్‌ కెమేరాలో తీసినా, అది ఏ మాత్రం లోటుగా కనిపించని సినిమా ఇది. వీలైనంత వరకు సహజమైన వెలుతురులో, అవసరమైన చోట విడిగా లైటింగ్‌ చేసినా, అదీ ఆర్టిస్టిక్‌గానే ఉండేలా, సహజ వాతావరణాన్ని సృష్టించుకుంటూ దృశ్యాలను కెమేరాలో బంధించడం చెప్పుకోదగ్గ విశేషం. నలుగురైదుగురు సంగీత దర్శకులున్న ఈ చిత్రంలో పాటలు ఇంకొద్దిగా బాగుంటే, సినిమా వాణిజ్య విజయానికి తోడ్పడేవని అనిపిస్తుంది.
ఏమైనా, ఇతివృత్తం ఎంపిక మొదలు నిర్మాణం, పోస్ట్‌ ప్రొడక్షన్‌లలో పనితనం చూపిన నట, సాంకేతిక నిపుణుల కృషిగా 'సత్యాగ్రహ' బాగుంటుంది. సమకాలీన సామాజిక ఇతివృత్తాన్ని, అందులోనూ రాజకీయ అంశాలను వట్టి డాక్యుమెంటరీ అనిపించకుండా, ఎలా వెండితెర కథగా అందించవచ్చో, అలరించవచ్చో తెలుసుకోవడానికి ఇలాంటి సినిమాలు ఉదాహరణ. సామాజిక - రాజకీయ కథలను తెరపై చూసి, కళ్ళెదురుగా జరిగిన సంఘటనలు, వచ్చిన వార్తలతో బేరీజు వేసుకోదలిస్తే, 'సత్యాగ్రహ' రెండున్నర గంటల వెండితెర సింహావలోకనం.
- రెంటాల జయదేవ
................................................................... 

0 వ్యాఖ్యలు: