జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Thursday, September 26, 2013

ఆస్కార్‌ దాకా వెళ్ళే సత్తా 'లంచ్‌ బాక్స్‌'ది!

ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా పలు చలనచిత్రోత్సవాల్లో అవార్డులు, ప్రశంసలు అందుకున్న హిందీ చిత్రం 'లంచ్‌ బాక్స్‌' గురువారం నుంచి భారతీయ ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటుందని ప్రముఖ దర్శక - నిర్మాత కరణ్‌ జోహార్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. ఉత్తమ విదేశీ చిత్ర విభాగంలో భారతీయ ఎంట్రీగా ఈ సినిమా నిలిచే అవకాశం ఉందనీ, అదే గనక జరిగి, ఆస్కార్‌ కమిటీ ముందుకు తుది అయిదు చిత్రాల్లో ఒకటిగా నిలిస్తే, అవార్డు వచ్చే అవకాశాలూ లేకపోలేదని ఆయన అభిప్రాయపడ్డారు. అక్కడ దాకా వెళితే, ఆస్కార్‌ వేదికపై చిత్ర ప్రచారం కోసం తాము శాయశక్తులా కృషి చేస్తామని చెప్పారు.
'లంచ్‌బాక్స్‌' చిత్ర ప్రచారంలో భాగంగా హైదరాబాద్‌ సెంట్రల్‌లోని పి.వి.ఆర్‌. మల్టీప్లెక్స్‌లో విలేఖరులను ఉద్దేశించి మాట్లాడుతూ, కరణ్‌ జోహార్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. గురువారం నాడు హైదరాబాద్‌లో పర్యటించిన ఆ చిత్ర యూనిట్‌తో పాటు, చిత్ర సమర్పకుల్లో ఒకరైన ఆయన కూడా భాగ్యనగరానికి వచ్చారు. 'లంచ్‌ బాక్స్‌' చిత్ర కథానాయకుడు ఇర్ఫాన్‌ ఖాన్‌, కథానాయిక నిమ్రత్‌ కౌర్‌, దర్శకుడు రితేశ్‌ బాత్రా, చిత్ర నిర్మాతల్లో ఒకరైన గునీత్‌ మోంగా, యు టి.వి.కి చెందిన సిద్ధార్థ్‌ రారు కపూర్‌లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
నిజానికి, ఈ సినిమా పూర్తయిపోయిన తరువాత, కాపీ చూసి ఈ చిత్రానికి సమర్పకులలో ఒకరిగా చిత్ర ప్రచారంలో భాగం పంచుకున్నట్లు కరణ్‌ జోహార్‌ తెలిపారు. ''ఇలాంటి సినిమాలకు చిత్రీకరణ కన్నా, విడుదల, ప్రచారం లాంటి వాటిలో వ్యూహాత్మకంగా ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. అందుకే, మేమందరం ఈ చిత్రానికి వెన్నుదన్నుగా నిలిచాం'' అని ఆయన అన్నారు. అవార్డుల కోసం కాక, పాత్రపోషణ ద్వారా లభించే ఉద్విగత కోసమే తాను సినిమాలు చేస్తుంటానని గతంలో జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడిగా నిలిచిన ఇర్ఫాన్‌ ఖాన్‌ తెలిపారు.
''ఈ చిత్రం కోసం ముంబలోని లోకల్‌ ట్రైన్లతో సహా అనేక రియల్‌ లొకేషన్లలో చిత్రీకరణ జరిపాం. అయినా, ఎటువంటి ఇబ్బందీ లేకుండా చిత్రీకరణ జరపగలిగాం'' అని 'లంచ్‌ బాక్స్‌'తో సినీ దర్శకుడిగా తొలి ప్రయత్నం చేసిన రితేశ్‌ బాత్రా అన్నారు. కాగా, ఈ సినిమా ద్వారా వెండితెరకు పరిచయమైన నిమ్రత్‌ కౌర్‌ మాట్లాడుతూ, ''ఇందులో ప్రధాన పాత్ర పోషించే అవకాశం రావడం నా అదృష్టం. దీన్ని కేవలం ఓ సినిమా అవకాశంగా చూడడం లేదు. ఈ చిత్రం నా జీవితాన్ని మార్చింది'' అని పేర్కొన్నారు. త్వరలోనే నటుడిగా వెండితెరపైకి వస్తున్న కరణ్‌ జోహార్‌ భాషా, ప్రాంతీయ భేదాలు లేకుండా అన్ని సినిమాల్లో నటించాలని అనుకుంటున్నట్లు తెలిపారు. రామ్‌చరణ్‌తో 'అగ్నిపథ్‌' చిత్రాన్ని రీమేక్‌ చేయాలనుకున్నా, అలాంటి పగ - ప్రతీకారం కథలు చాలా వచ్చాయని భావించి, ఆ ఆలోచనను విరమించుకున్నట్లు తెలిపారు.
కాగా,'యు' టి.వి. సిద్ధార్థ్‌ రారు కపూర్‌ 'ప్రజాశక్తి'తో మాట్లాడుతూ, ఇప్పటికే తమిళ చిత్రాల నిర్మాణంలో భాగస్వామ్యం వహిస్తున్న 'యు' టి.వి. త్వరలోనే ఓ తెలుగు సినిమా తీయనున్నట్లు చెప్పారు. ఆ సన్నాహాలు జోరుగా సాగుతున్నాయన్నారు. దాదాపు గంటకు పైగా జరిగిన ఈ కార్యక్రమంలో కరణ్‌ జోహార్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలవగా, ఆయనతో, ఇర్ఫాన్‌ ఖాన్‌తో ఫోటోలు దిగేందుకు మీడియా ప్రతినిధులు సైతం పోటీలు పడడం విశేషం.
.........................................................

0 వ్యాఖ్యలు: