జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Thursday, August 22, 2013

తెలుగు ప్రమదల హృదయ నేత్రి - మాలతీ చందూర్

'జగతి' పత్రిక సంపాదకులుగా ఎన్‌.ఆర్‌.చందూర్‌, రచయిత్రిగా మాలతీ చందూర్‌ మద్రాసు మహానగరంలో తెలుగు సాహిత్యం, సంస్కృతి, సామాజిక జీవితానికి దీపస్తంభాలుగా సుదీర్ఘకాలం వెలిగారు. చెన్నపట్నంలో తెలుగు సాహితీ సంస్థలకూ, సామాజిక ప్రముఖులకూ పెద్ద దిక్కుగా నిలిచారు. సంతానం లేని ఈ దంపతులు రచనలే తమ సంతానంగా, సాహితీ ప్రియులే బంధువులుగా గడిపారు. 


సాహితీ వ్యాసంగానికి పునాది

1930లో కృష్ణాజిల్లా నూజివీడులో మాలతి జన్మించారు. తల్లితండ్రులైన జ్ఞానాంబ, వెంకటేశ్వర్ల ఆరుగురు సంతానంలో ఆమె చివరి వ్యక్తి. ఆమెకు ముగ్గురు అన్నయ్యలు, ఇద్దరు అక్కలు. సోదరులందరూ మరణించగా, పెద్దక్క సీతాబాయి హైదరాబాద్ లో నివసిస్తున్నారు. మద్రాసులో ఉపాధ్యాయురాలిగా పనిచేసిన రెండో అక్క శారదాంబ దీర్ఘకాలంగా అక్కడే మాలతీ చందూర్ దంపతులతోనే ఉంటున్నారు. తోడబుట్టిన వారందరికీ చిన్నదైన మాలతి అంటే ఎంతో ప్రేమ, అనురాగం.


బాల్యమంతా ఎక్కువభాగం నూజివీడులోనే గడిపిన మాలతి ఎనిమిదో తరగతి వరకు అక్కడే ఎస్.ఆర్.ఆర్. ప్రాథమిక పాఠశాలలో చదివారు. ఆ తరువాత మేనమామ అయిన ఎన్‌.ఆర్‌. చందూర్‌ ఇంట్లో ఏలూరులో ఉండి, అక్కడ వల్లూరి సెయింట్ థెరెస్సా పాఠశాలలో ఇంగ్లీషు మీడియమ్ లో చదువుకున్నారు. తరువాతి కాలంలో మేనమామనే వివాహం చేసుకున్నారు. చదువు పూర్తికాకుండానే పెళ్ళవడం వల్ల మాలతి ప్రైవేటుగా ఎస్.ఎస్.ఎల్.సి. పూర్తి చేశారు.

NR Chandur and Malathi Chandur
స్వతహాగా కథా రచయిత, 'కథావీధి' తదితర పత్రికలను నడిపిన చందూర్‌ సాహచర్యంలో మాలతి సాహితీ వ్యాసంగం వికసించి, విస్తరించింది. అక్కడే ఆనాటి సాహితీ దిగ్గజాలను ఎందరినో దగ్గర నుంచి ఆమె చూశారు. 1947లో మద్రాసుకు వచ్చిన ఈ జంట అప్పటి నుంచి ఆ నగరాన్నే తమ స్థిర నివాసంగా చేసుకున్నారు. 

మొదట పరశువాక్కమ్ ప్రాంతంలోని ముక్కద్దాల్ వీధిలో అద్దె ఇంట్లో గడిపిన ఈ దంపతులు 1960ల నుంచి చెన్నైలోని మైలాపూర్‌ ప్రాంతంలో కచ్చేరీ రోడ్డులో తెలుగు సాహితీ వాతావరణానికి చిరునామాగా నిలిచారు. వారి స్వగృహం బెజవాడ గోపాలరెడ్డి, వావిలాల గోపాలకృష్ణయ్య, శ్రీశ్రీ, ఆరుద్ర, సి. నారాయణ రెడ్డి తదితర రాజకీయ, సాహితీ ప్రముఖులెందరికో ఆటపట్టుగా వెలిగింది. మాలతీ చందూర్‌ అక్కయ్య, గతంలో ఉపాధ్యాయురాలైన శారదాంబ ఇప్పటి దాకా ఆ ఇంటికి పెద్ద దిక్కుగా అందరికీ తలలో నాలుకగా మెలిగారు.

రచనలే లోకం!
భర్త చందూర్‌ను ఎప్పుడూ ''మామయ్య''గానే సంబోధించే మాలతి పల్లెటూరిలో పెరిగిన తనను ఓ వ్యక్తిగా, ఇంత పెద్ద రచయిత్రిగా తీర్చిదిద్దడంలో ఆయన పాత్ర ఎంతో ఉందని బాహాటంగా చెబుతుండేవారు. ఆమె చదువుకున్నది ఎస్‌.ఎస్‌.ఎల్‌.సి. దాకానే అయినా, సమాజాన్నీ, జీవితాన్నీ ఆమె కాచివడపోశారు. 

'చంపకం - చెదపురుగులు' (1955 సెప్టెంబర్ లో ప్రథమ ముద్రణ) లాంటి ఆమె తొలినాళ్ళ నవలలు అప్పట్లో ఎంతో ప్రాచుర్యం పొందాయి. 'శతాబ్ది సూరీడు', 'కాంచన మృగం', 'మనసులో మనసు', 'ఏమిటీ జీవితాలు', 'మధుర స్మృతులు', 'శిశిరవసంతం', 'ఆలోచించు', 'భూమిపుత్రితదితర పాతిక పైగా నవలలు ఆమె రచించారు. పలు ఆంగ్ల రచనలను తెలుగులోకి అనువదించారు.


భారత స్వాతంత్య్ర సమర కాలంలో జరిగిన ప్రసిద్ధ చీరాల - పేరాల ఉద్యమ నేపథ్యంతో 'వనిత' మాసపత్రికలో ఆమె రాసిన 'హృదయ నేత్రి' నవలకు 1990వ దశకం తొలి రోజుల్లో కలకత్తాలోని 'భారతీయ భాషా పరిషత్‌' వారి ప్రతిష్ఠాత్మక జాతీయ అవార్డు వరించింది. కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు లభించింది. ఆ తరువాత ఈ నవలను శ్రీమతి శాంతాదత్ గారు “ఇదయ విళిగళ్” అన్న పేరుతో తమిళంలో అనువదించారు.


రచనా జీవితంతో తీరిక లేక, ఎప్పుడూ వంటింటికి దూరంగానే జీవితం గడిపిన మాలతీ చందూర్‌ రాసిన 'వంటలు - పిండి వంటలు' రచన తెలుగునాట ఇవాళ్టికీ ఎంతో ప్రసిద్ధం. పదే పదే పలు ముద్రణలు పొంది, వేల ప్రతులు అమ్ముడైంది. ''మా పెద్దవాళ్ళ నుంచి నేర్చుకున్న వాటితో పాటు ఎప్పటికప్పుడు కొత్త వంటలను తెలుసుకొని రాశాను'' అని ఆమె చెబుతూ ఉండేవారు. 

తెలుగుతో పాటు ఆంగ్లం, తమిళాల్లో చక్కగా మాట్లాడే మాలతి కొన్ని ప్రసిద్ధ తమిళ రచనలను 'సాహిత్య అకాడెమీ' తదితరుల కోసం తెలుగులోకి అనువదించారు. తమిళ రచయిత డి. జయకాంతన్ గారి నవలను కొన్ని సమయాలల్లో కొంత మంది మనుషులు”, ఎన్. పార్థసారధి గారి నవలను సమాజం కోరల్లో”, శివశంకరి గారి నవలను ఓ మనిషి కథ పేరిట తెలుగు పాఠకులకు ఆమె అందించారు. అలాగే, మాలతీ చందూర్ తెలుగు రచనలు అనేకం తమిళ, కన్నడ భాషల్లోకి అనువాదమయ్యాయి.


మధ్యతరగతి జీవితానికి మల్లెపందిరి:
తెలుగులో చలం, విశ్వనాథ సత్యనారాయణ, ఇంగ్లీషులో సోమర్ సెట్ మామ్ తనకు ఇష్టమైన రచయితలని చెప్పే మాలతీ చందూర్ వాస్తవానికి దగ్గరగా రచనలు చేసేవారు. వాటిలో మధ్యతరగతి జీవితాన్నికళ్ళకు కట్టించే ప్రయత్నం చేశారు. మధ్యతరగతి కుటుంబాలలోని మానవ సంబంధాలు, ఒడుదొడుకులు ఆమె రచనల్లో ప్రధాన పాత్ర వహిస్తాయి. చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే, స్త్రీ పాత్రలను వట్టి బేలలుగా ఆమె చిత్రించరు. ఆమె కథల్లోని స్త్రీ పాత్రలు ఆత్మ గౌరవంతో సమస్యలను ఎదుర్కొంటాయి. 

మద్రాసు రేడియోలో ప్రసంగాలతో ఆమె తన సాహితీ వ్యాసంగం మొదలు పెట్టారు. 1950 ప్రాంతంలో 'ఆనందవాణి' వారపత్రికలో ప్రచురితమైన 'రవ్వల దుద్దులు' ఆమె రాసిన మొదటి కథ. 1953 ఆగస్టులో ప్రచురితమైన 'పాప' కథానిక, ఇంకా 'లజ్ కార్నర్', 'నీరజ' తదితర రచనలన్నీ ప్రముఖ సాహిత్య మాసపత్రిక 'భారతి'లో వచ్చాయి. దాదాపు 150కి పైగా కథలు ఆమె రాశారు. దాదాపు 66 ఏళ్ళుగా మద్రాసు మహానగరంలో ఉన్న ఆమె సహజంగానే తన కథలలో ఎక్కువగా చెన్నపట్టణాన్ని నేపథ్యంగా తీసుకొన్నారు. 

పాఠకులకు సుదీర్ఘ 'కాలమ్‌' ఇష్టురాలు:
ఇప్పటికి దాదాపు 6 దశాబ్దాల కాలంగా పాఠకులతో ప్రశ్నలు, జవాబులు శీర్షికను విజయవంతంగా నడుపుతూ వస్తూ, తెలుగు కాలమిస్టుల చరిత్రలో మాలతీ చందూర్‌ ఓ అరుదైన ఘనత సాధించారు. ప్రముఖ సంపాదకుడు నార్ల వెంకటేశ్వరరావు 1950లలో 'ఆంధ్రప్రభ' వారపత్రికలో 'ప్రమదావనం' పేరిట స్త్రీల కోసం ప్రత్యేకంగా మాలతీ చందూర్‌తో కాలమ్‌ ప్రారంభించారు.
వంటలు, కుట్లు - అల్లికల సామాన్య విషయాల మొదలు సామాజిక, రాజకీయ, కుటుంబ వ్యవహారాల దాకా మహిళలకు సూచనలు, సలహాలిస్తూ మాలతీ చందూర్‌ నడిపిన ఆ శీర్షిక కొన్ని తరాల వారికి ప్రీతిపాత్రమైంది. ఎంతోమందిని ప్రభావితం చేసింది. ఒక రకంగా తెలుగు నాట 'ఎగొనీ ఆంట్‌' తరహా కాలమ్స్‌కు ఆమె 'ప్రమదావనం' ఒరవడి పెట్టింది.
ఆ పత్రిక చేతులు మారే ముందు నూతన సహస్రాబ్ది తొలిరోజుల దాకా ఆ కాలమ్‌ అందులో కొనసాగింది. ఆ తరువాత నుంచి ఇప్పటి దాకా అదే కాలమ్‌ 'నన్ను అడగండి' అనే కొత్త పేరు, రూపంతో 'స్వాతి' సపరివారపత్రికలో వారం వారం అలరిస్తూ వస్తోంది. పాఠకులు ఏ చిన్న ప్రశ్న అడిగినా, సమగ్రమైన సమాచారంతో వ్యాఖ్యానభరితంగా ఆమె ఇచ్చే జవాబులు ఎంతో పాపులర్‌. మాలతీ చందూర్‌ మాటలతో జీవితాలను సరిదిద్దుకున్నామనీ, ఇవాళ్టికీ తమ మనుమరాళ్ళ సమస్యలకూ ఆమెనే సలహాలు అడుగుతున్నామనీ చెప్పేవారు ఎంతోమంది!


'Swathi' Editor Vemuri Balaram with Malathi on Jan11th 2013 at Chennai
అలాగే, 'స్వాతి' మాసపత్రిక ప్రారంభ రోజుల నుంచి ఇప్పటి దాకా మూడు దశాబ్దాల పైచిలుకుగా 'పాత కెరటాలు' పేరిట మరో పాపులర్‌ శీర్షికను ఆమె నిర్వహిస్తున్నారు. అందులో ప్రతి నెలా ప్రపంచ ప్రసిద్ధ ఆంగ్ల నవలలను పరిచయం చేస్తూ వస్తున్నారు. 

ఆ నవలా పరిచయాల కోసం ఎప్పటికప్పుడు కొత్త పుస్తకాలు తెప్పించుకొని, వాటిని క్షుణ్ణంగా చదివి, ఆ పుస్తకసారాన్ని కొద్ది పేజీల్లో సాకల్యంగా పరిచయం చేయడానికి ఆమె తీసుకొనే శ్రమ ప్రత్యక్షంగా చూసినవారికి తెలుసు. ''తెలుసుకున్న విషయాలను నలుగురికీ తెలియజేయాలనీ, ఓ పుస్తకం బాగుంటే దాన్ని ఇతరులకు పరిచయం చేయాలనీ జిజ్ఞాస నాలో ఎక్కువ. అలా తెలుగు వారికి 400కు పైగా ఇంగ్లీషు నవలల్ని పరిచయం చేశా'' అని ఆమె ఓ సందర్భంలో చెప్పారు. 

ఆ నవలా పరిచయాలు 2002 ప్రాంతంలో 'పాత కెరటాలు' శీర్షికనే పుస్తక రూపంలోకి వచ్చాయి. కాగా, ఆ తరువాత 2008 - 2010 నాటికి 'నవలా మంజరి' శీర్షికన ఆరు భాగాలుగా కొత్త పేరుతో తిరిగి ప్రచురితమయ్యాయి.


చివరి వరకు అదే కృషి
'పుస్తక పఠనం, సజ్జన సాంగత్యం'తో చందూర్‌ దంపతులు వయస్సు మీద పడినా దాన్ని లెక్క చేయకుండా, చివరి వరకు సాహిత్య, సామాజిక కృషిలో గడిపారు. దుర్గాబారు దేశ్‌ముఖ్‌ స్థాపించిన 'ఆంధ్ర మహిళా సభ' నిర్వహణలో, అభివృద్ధిలో మొదటి నుంచి ఇప్పటి వరకు భాగస్వామ్యం వహించారు. ఆప్యాయమైన పలకరింత, తమను కలుసుకోవడానికి ఎక్కడెక్కడి నుంచో వచ్చే సాహితీ ప్రియులకు వారిచ్చే ఆతిథ్యం చాలామందికి అనుభవైకవేద్యం. 

1970లలో కేంద్ర సెన్సార్‌ బోర్డు సభ్యురాలిగా పని చేసిన ఆమెకు మద్రాసులో తెలుగు చిత్ర పరిశ్రమ వెలిగిన రోజుల్లోని ప్రముఖులందరూ సుపరిచితులే. ప్రముఖ తమిళ రచయిత్రి శివశంకరి తదితరులు ఆమెను ఎంతో గౌరవించేవారు.
తెలుగు నేలకు దూరంగా ఉన్నప్పటికీ, ఇక్కడి వారితో సమానంగా, కొన్ని సందర్భాల్లో ఎక్కువగా పేరు తెచ్చుకున్న రచయిత్రిగా మాలతీ చందూర్‌ కృషిని గుర్తించి, ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆమెకు గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది. ఆమె రచనలపై పలు విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలు జరగడం విశేషం.
చందూర్‌ మరణానంతరం మాలతి, కుటుంబ సభ్యులు ఆయన పేరు మీద 'ఎన్‌.ఆర్‌. చందూర్‌ - జగతి అవార్డు' పేరిట ఓ స్మారక పురస్కారాన్ని నెలకొల్పారు. ప్రతి ఏటా జనవరి 11న చందూర్‌ వర్ధంతి నాడు నిరాటంకంగా ఈ కార్యక్రమం కొనసాగేందుకు తాను మదుపు చేసిన సొమ్ము అంతా ఓ ట్రస్టు పేరిట మాలతి పెట్టారు. ప్రముఖ జర్నలిస్టు పాలగుమ్మి సాయినాథ్‌ (2012), 'ఆంధ్రజ్యోతి' ఢిల్లీ విలేకరి ఏ. కృష్ణారావు (2013)కు ఇప్పటి దాకా ఈ పురస్కారాలు ఇచ్చారు.


NR Chandur-Jagathi Award function on 11 Jan 2013 at Chennai
'మామయ్య' చందూర్ తన 'జగతి' పత్రికలో నిర్వహించిన పాపులర్ శీర్షిక 'డైరీ'లోని ప్రధాన అంశాలను గుదిగుచ్చి, ఈ ఏడాది జనవరిలో ఆయన వర్ధంతి నాటికి పుస్తకరూపంలో తెచ్చారు మాలతి. 'జగతి డైరీ' పేరిట కొన్ని వందల పేజీల్లో వచ్చిన ఈ పుస్తకానికి ఎడిటింగ్ వగైరా బాధ్యతలన్నీ ఆమే స్వయంగా చూసుకున్నారు. దాదాపు 50 ఏళ్ళ చెన్నపట్న తెలుగు సాహితీ, సాంస్కృతిక జీవితానికి దర్పణమైన ఆ డైరీని ప్రచురించడానికి ఆమె పడిన శ్రమ, తపన దగ్గరగా ఉన్న వాళ్ళకు తెలుసు. 
ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం 1950ల ప్రథమార్ధంలో అమరజీవి పొట్టి శ్రీరాములు ఆమరణ నిరాహార దీక్ష జరిపి, అసువులు బాసిన భవన సంరక్షణ, నిర్వహణ బాధ్యతల్లో కూడా మాలతీ చందూర్‌ దంపతులు అవిరళ కృషి చేశారు. 'అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్‌ సొసైటీ' సంస్థాపక సభ్యురాలైన ఆమె ప్రస్తుతం ఆ సంస్థకు అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్నారు.
చెన్నైలోని క్వీన్‌ మేరీస్‌ కళాశాల లాంటి ప్రసిద్ధ విద్యాసంస్థల్లో తెలుగు బోధనాంశాన్ని ఎత్తి వేసేందుకు తమిళనాడు ప్రభుత్వం ఆ మధ్య ప్రయత్నించినప్పుడు దాన్ని తీవ్రంగా వ్యతిరేకించి, ఉద్యమబాట పట్టారామె. సాహితీ ప్రియులైన యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌, కేంద్ర మంత్రి పురంధేశ్వరి తదితరులతో మాట్లాడి, 'తెలుగు ఎత్తివేత' నిర్ణయాన్ని వెనక్కు తీసుకొనేలా చేశారు. రాజా-లక్ష్మి ఫౌండేషన్‌ అవార్డుతో సహా ఎన్నో పురస్కారాలు, సన్మానాలతో పేరుప్రతిష్ఠలు వచ్చినా, చివరి వరకు ఎంతో నిరాడంబరంగా, సాదాసీదా మహిళ లాగా జీవించడం ఆమెలోని విశిష్టత.
- రెంటాల జయదేవ 

(ప్రజాశక్తి దినపత్రిక, 22 ఆగస్టు 2013, గురువారం, పేజీ నం. 4లో ప్రచురితం)
...................................................

1 వ్యాఖ్యలు:

Unknown said...

మాలతీచందూర్ జీవితం-సాహిత్యం పై సమగ్రంగా సన్నిహితంగా టపా వెలయించారు రెంటాల జయదేవ!వారి జవాబులను గుదిగుచ్చి ఒక పుస్తకం వేయాలని స్వాతి పత్రిక వారిని కోరుతున్నాను!బిరుడులకే బిరుదు అవార్డు లకే అవార్డు మాలతీచందూర్!