జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Thursday, August 15, 2013

మానని గాయం... తీరని దుఃఖం... - భారతదేశ విభజన

వేర్వేరు మతాల ప్రాతిపదికన 1947లో 'రెండు దేశాల' ఆవిర్భావం జరిగింది. ఆ ఆవిర్భావ క్రమంలో కొన్ని పదుల లక్షల మంది తరతరాలుగా తమ పురిటిగడ్డ అయిన ప్రాంతాన్ని వదిలేసి, అనిశ్చితమైన, అగమ్యగోచరమైన ప్రాంతానికి శరణార్థులుగా వలస పోవాల్సి వచ్చింది. పశ్చిమ ప్రాతంలో దాదాపు కోటీ 12 లక్షల మంది, మరో మాటలో చెప్పాలంటే 78 శాతం మంది జనాభా అటు నుంచి ఇటూ, ఇటు నుంచి అటూ వలస వెళ్ళారు. వారిలో చాలామంది పంజాబ్‌ ప్రాంతానికి చెందినవారు. దాదాపు 53 లక్షల మంది ముస్లిమ్‌లు భారతదేశం నుంచి పాకిస్తాన్‌లోని పశ్చిమ పంజాబ్‌కు వెళ్ళి పోయారు. ఇక, పాకిస్తాన్‌ నుంచి 34 లక్షల మంది హిందువులు, సిక్కులేమో తూర్పు పంజాబ్‌కు వలస వెళ్ళారు.


''1947 శరత్కాలంలో భారత దేశానికి ఉత్తరాన పంజాబ్‌ ప్రాంతానికి నేను వెళ్ళాను. కొత్తగా పురుడు పోసు కున్న రెండు స్వతంత్ర దేశాలను కెమేరాలో బంధించడం మొదలుపెట్టేందుకని నేనక్కడికి చేరుకున్నాను. అప్పటికి, పెద్దయెత్తున ప్రజానీకం ఒక దేశం వైపు నుంచి మరో దేశం వైపునకు తరలిపోతోంది. భారత యూనియన్‌నూ, పాకిస్తాన్‌నూ కలిపే రోడ్లన్నీ రద్దీ వేళల్లో మన 'పులాస్కీ స్కై వే' (అమెరికాలోని బోస్టన్‌ రాష్ట్రంలో రద్దీగా ఉండే నాలుగు లేన్ల అతి పెద్ద బ్రిడ్జి), 'సన్‌సెట్‌ బోలెవార్డ్‌' (లాస్‌ ఏంజెల్స్‌లో హాలీవుడ్‌ ప్రముఖులతో నిండిన వీధి) ఉన్నట్లున్నాయి. అయితే, రెండు వైపులా వరుసగా సాగే మోటారు కార్లకు బదులు ఇక్కడ ఎడతెగకుండా ఎడ్ల బండ్లు, గాడిదల మీద ఎక్కిన మహిళలు, చిన్న పిల్లలనూ, వృద్ధులనూ తమ భుజాల కెత్తుకొని కాలినడకన సాగుతున్న పురుషులు కనిపించారు.
'' ...ఆ మార్గ మధ్యంలోనే ఎందరో తల్లులు తమ పిల్లలకు జన్మనిచ్చారు. మరెంతోమంది ప్రాణాలు కోల్పోయారు. కొందరు కలరాతో మరణిస్తే, మరికొందరు శత్రుత్వం వహించిన మతోన్మాద వర్గాల దాడుల్లో ప్రాణాలు పోగొట్టుకున్నారు. అయితే, వారిలో చాలామంది మాత్రం ఆ జన ప్రవాహంలో నడిచీ నడిచీ డస్సిపోయి, రహదారి పక్కన కూర్చుండి పోయారు. మరణించడానికి సిద్ధమై, సహనంతో నిరీక్షించసాగారు...
''ఇలా అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు - రెండు వైపులకూ భారీయెత్తున జనం వలస పోవడం చూస్తే, నాకు బైబిల్‌లోని వాతావరణం గుర్తొచ్చింది. పాత నిబంధనల గ్రంథంలో వచ్చే ఇజ్రాయల్‌ ప్రజల భారీ వలస నా స్ఫురణకు వచ్చింది. అయితే, భారతదేశ విభజనతో భారీయెత్తున వలస వెళ్ళిన ముస్లిమ్‌లు, సిక్కులు, హిందువులతో పోలిస్తే, ఇజ్రాయలీ వలస వారి సంఖ్య చిన్నబోతుంది. నేను ఫోటోలు తీస్తున్న సమయంలో... దాదాపు 50 లక్షల మంది ప్రజలు వలస పోతున్నారు. కాస్తంత దోవ దొరకగానే, వారిని అనుసరించడానికి మరికొన్ని పదుల లక్షల మంది నిరీక్షిస్తున్నారు. అత్యంత దయనీయమైన స్థితికి చేరిన ఈ లక్షల మందికి స్వాతంత్య్రం అందించిన అత్యంత కఠినమైన, క్రూరమైన తొలి ఫలం ఇదే!''
(ఈ భాగాలు ఫోటో జర్నలిస్ట్‌ మార్గరెట్‌ బూర్క్‌-వైట్‌ రచన
'హాఫ్‌వే టు ఫ్రీడమ్‌' నుంచి...) 
(Published in 'PrajaSakti' daily, 15th Aug 2013, Thursday, Page No.5)
..........................................................................

0 వ్యాఖ్యలు: