జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Friday, August 16, 2013

బాక్సాఫీస్‌ను దోచిన 'బందిపోటు' - ఎన్టీయార్, విఠలాచార్యల కాంబినేషన్ కు 50 ఏళ్ళు


వెండితెరపై అద్భుత రసాన్ని అమోఘంగా పండించిన దర్శకుడు ఒకరు. ఆబాలగోపాలాన్నీ తన నటనతో కట్టిపడేసిన స్టార్ హీరో మరొకరు. వీరిద్దరి కలయికలో వచ్చే సినిమా అంటే - సినీ పరిభాషలో క్రేజీ కాంబినేషనే. కమర్షియల్ గానూ కాసులు కురిపించిన అలాంటి కాంబినేషనైన దర్శకుడు బి. విఠలాచార్య - హీరో ఎన్టీయార్ల కలయికకు శ్రీకారం చుట్టిన చిత్రం -  'బందిపోటు'. రాచరిక వ్యవస్థలోని కుట్రలు, కుతంత్రాలకూ, ప్రజల పక్షాన వాటికి ఎదురొడ్డిన సామాన్య కథానాయకుడి వీరోచిత కార్యాలకూ ప్రతిరూపమైన ఈ చిత్రం అప్పట్లో కమర్షియల్ హిట్. పైగా, అలాంటి మరెన్నో చిత్రాలకు ఓ మూసగా నిలిచింది. విఠలాచార్య, ఎన్టీయార్ల కాంబినేషన్ లో ఆ తరువాత మరో 13 చిత్రాలకు అది ఆరంభం.
1963 ఆగస్టు 15న విడుదలైన 'బందిపోటు' సరిగ్గా ఇవాళ్టితో యాభై ఏళ్ళు పూర్తి చేసుకొంటోంది. ఈనాటి స్వర్ణ జయంతి వేళ ఆ కాంబినేషన్‌ సంగతులు కొన్ని...

బ్లాక్‌ అండ్‌ వైట్‌ యుగంలో మొదలై కలర్‌ చిత్రాల కాలం దాకా ఒకే విధమైన పంథా నమ్మి, ఆ రకమైన ఫార్ములాతోనే వరుస హిట్లు సాధించడమంటే సామాన్యమైన విషయం కాదు. బహుశా, తెలుగు చలనచిత్ర చరిత్రలో ఆ రకమైన అరుదైన విన్యాసం చేసి, చిరస్థాయిగా పేరు సంపాదించుకున్న దర్శకుడు ఎవరంటే, బి. విఠలాచార్య పేరే చెప్పుకోవాలి. అధికారం కోసం రాజ్యాల్లో సాగే కుట్రలు, కుతంత్రాలు, అందమైన రాజకుమారిని ఆపద నుంచి తప్పించే తోట రాముడు, అధికారం కోసం రాజుకు వెన్నుపోటు పొడిచే సేనాధిపతి, అందాల రాకుమారిని అమ్మవారికి బలి ఇవ్వాలనుకొనే మాంత్రికుడు, మాయలు, మంత్రాలు, అన్నిటినీ ఎదిరించి ఆఖరుకు ముసలి రాజును కాపాడే కథానాయకుడు - ఇవే రకం పాత్రలు, నేపథ్యాలతో పదుల కొద్దీ సినిమాలు తీసి, ప్రేక్షకులకు కాలక్షేపం, నిర్మాతలకు కాసుల నిక్షేపం అందించిన దర్శకుడిగా విఠలాచార్యది ఓ ప్రత్యేక అధ్యాయం.
తొలి కలయికలోనే...
స్వీయ దర్శకత్వంలో నిర్మించిన సాంఘిక చిత్రం 'కన్యాదానం' (1955)తో తెలుగులోకి కాలుమోపినా, సాంఘికాల కన్నా జానపదాలకే విఠలాచార్య క్రమంగా ప్రసిద్ధులయ్యారు. దేవుళ్ళు - దయ్యాలు - మంత్రాలు - తంత్రాల లాంటి జనబాహుళ్యంలోని నమ్మకాల ఆధారంగా తెలుగు తెరపై అద్భుత రసాన్ని పండించారు. సామాన్య ప్రేక్షకులను ఆనంద, ఆశ్చర్యాలలో ముంచెత్తి, వాణిజ్య విజయాలు అందుకున్నారు. అలాంటి దర్శకుడు, అప్పట్లో స్టార్‌ హీరో అయిన ఎన్టీయార్‌ల కాంబినేషన్‌లో సినిమా అంటే వ్యాపార వర్గాల్లో, మాస్‌లో ఎలాంటి క్రేజు ఉంటుందో చెప్పనక్కర లేదు. వారిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన తొలి చిత్రం - 'బందిపోటు'.
రాజలక్ష్మీ ప్రొడక్షన్స్‌ పతాకంపై సుందర్‌లాల్‌ నహతా - డూండీ నిర్మించిన చిత్రమిది. ఆ పతాకంపై అప్పటికే నాలుగైదు చిత్రాల్లో నటించిన ఎన్టీయార్‌ ఈ 'బందిపోటు' సినిమాలో నటించేందుకు వెంటనే అంగీకరించారు. అలా కుదిరిన ఈ దర్శక, హీరోల తొలి కాంబినేషన్‌ ఘన విజయం సాధించింది. ఆ తరువాత వారిద్దరి కలయికలో మరెన్నో చిత్రాలకు బాట వేసింది.
మాయా లేదు! మర్మం లేదు!!
గమ్మత్తు ఏమిటంటే, ఈ సినిమాలో విఠలాచార్య మార్కు మాయలు, మంత్రాలు ఉండవు. వినోదం అందించే విన్యాసాలు, వీరోచిత పోరాటాలే ఉంటాయి. అయినా సరే, అప్పట్లో ఈ సినిమా పెద్ద హిట్‌. రాజకుటుంబాల నేపథ్యంలోని జానపథ కథలను అప్పటికే విఠలాచార్య తెరకెక్కించారు. అయితే, ఈసారి రాచరిక వ్యవస్థలో జరిగే మోసాలు, కుట్రలు, కుతంత్రాలకు తోడు పెద్దలను కొట్టి పేదలకు పెట్టే రాబిన్‌హుడ్‌ తరహా కథానాయక పాత్రనూ, ఆ నేపథ్యాన్నీ జోడించి అల్లుకున్న కథ - 'బందిపోటు'. ఆ చిత్రానికి రచన చేసిన త్రిపురనేని మహారథి స్వతహాగా తనకున్న అభ్యుదయ, విప్లవ భావజాలానికి తగ్గట్లుగానే ఇందులో డైలాగులు రాశారు. ఆ రకమైన కథా సంవిధానం, సంభాషణలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. దానికి ఘంటసాల సంగీతం మరో పెద్ద అండ అయింది.
జనం నోట... అదే పాట
నహతా వారి 'రాజలక్ష్మి' సంస్థకు దాదాపు ఆస్థాన సంగీత దర్శకుడైన ఘంటసాల ఈ చిత్రానికి తన స్వరరచనలోని జిగి, బిగి ఏమిటో చూపించారు. పాటల ఆర్కెస్ట్రయిజేషన్‌లోనూ ప్రత్యేక ముద్ర వినిపించారు. ప్రేయసిని చూసి ప్రియుడు పాడే పాటల్లో 'బందిపోటు'లో ఎన్టీయార్‌, కృష్ణకుమారి జంట మీద వచ్చే 'వగలరాణివి నీవే... సొగసుకాడను నేనే!..' ఇవాళ్టికీ చిరస్మరణీయమే! చిలిపిదనం మేళవించిన ఈ హుషారైన పాటకు భిన్నంగా, మంద్రగతిలో శ్రావ్యంగా సాగే పాట 'ఊహలు గుసగుసలాడే... నా హృదయము ఊగిసలాడే...' అంటూ ఆరుద్ర రాసిన పాటలోని బీజియమ్‌లలో ఘంటసాల వాడిన వాద్య శబ్దాలు సున్నితమైన రీతిలో సన్నివేశానికి బలమిచ్చేవే! ఆ పాటలు, వాటికి నటీనటుల అభినయం, ''తొలిప్రేమలో బలముందిలే అది నీకు మునుపే తెలుసు...'' లాంటి భావాలతో కూడిన సాహిత్యం ప్రేక్షకులకు ఇప్పటికీ తీపి గుర్తులే!
కలర్‌లో క్లయిమాక్స్
తెలుగు నాట కలర్‌ సినిమాలంటే క్రేజు పెరుగుతున్న రోజులవి. తెలుగులో పూర్తి కలర్‌ చిత్రం 'లవకుశ' (1963) అప్పటికే విడుదలై, జన నీరాజనాలు అందుకుంటోంది. ఆ క్రమంలోనే 'బందిపోటు'లో కూడా పతాక సన్నివేశాలను మాత్రం 'ఈస్ట్‌మన్‌ కలర్‌'లో చిత్రీకరించారు. ఈ సినిమాకు అది కూడా ఓ ప్రత్యేక ఆకర్షణ అయింది. ఇక, రవికాంత్‌ ఛాయాగ్రహణం, కృష్ణారావు కళా దర్శకత్వం, ప్రకాష్‌ ఎడిటింగ్‌ కూడా చిత్రాన్ని జనాకర్షకం చేశాయి. విజయవాడ 'దుర్గాకళామందిరం'తో సహా మొత్తం 5 కేంద్రాల్లో ఈ సినిమా వంద రోజులు ఆడింది.
అంతకు ముందు 'పిచ్చి పుల్లయ్య', 'వినాయక చవితి' లాంటి చిత్రాల్లో కలసి నటించినప్పటికీ, ఎన్టీయార్‌, కృష్ణకుమారి కాంబినేషన్‌కు 'బందిపోటు' ఓ కొత్త స్థానం తెచ్చింది. ఆ దెబ్బతో దాదాపు ఆరేళ్ళ పాటు వారిద్దరూ హిట్‌ పెయిర్‌గా పలు చిత్రాల్లో పదే పదే తెరపై కనిపించారు.
కాసులు కురిపించిన కాంబినేషన్‌

తక్కువ పని దినాల్లోనే సినిమా పూర్తి చేసి, విజయాలు అందించే విఠలాచార్య శైలి నచ్చడంతో ఎన్టీయార్‌ ఆయనకు అప్పట్లో వరుసగా సినిమాలు చేశారు. బాక్సాఫీస్‌ హిట్‌ 'బందిపోటు' తరువాత 1974 జనవరిలో విడుదలైన 'పల్లెటూరి చిన్నోడు' దాకా కేవలం పదేళ్ళ చిల్లర కాలంలోనే వీరిద్దరి కలయికలో ఏకంగా 14 చిత్రాలు ('బందిపోటు'తో కలిపి) రావడం చెప్పుకోదగ్గ విశేషం. 'మంగమ్మ శపథం', 'పిడుగు రాముడు', 'చిక్కడు - దొరకడు', 'గండికోట రహస్యం', 'కదలడు - వదలడు', 'లక్ష్మీ కటాక్షం', 'ఆలీబాబా నలభై దొంగలు' వగైరా ఆ వరుసలోవే! ఈ పధ్నాలుగు చిత్రాల్లో మూడు విఠలాచార్య సొంత నిర్మాణాలే!
ఏతావతా, ఈ కాంబినేషన్‌లోని మొత్తం 14 సినిమాల్లో ఏకంగా 11 చిత్రాలు విశేష జనాదరణతో విజయవంతమైనవే! మిగిలిన మూడు చిత్రాలు ('విజయం మనదే', 'రాజకోట రహస్యం', సాంఘిక చిత్రం 'పల్లెటూరి చిన్నోడు') కూడా నిర్మాణంపై పెట్టిన పెట్టుబడిని వెనక్కి రాబట్టి, ఎంతో కొంత లాభాలు తేవడం గమనార్హం. పరిమితమైన వ్యయంతో చిత్ర నిర్మాణం సాగించే విఠలాచార్య శైలికీ, ఎన్టీయార్‌ ఇమేజ్‌కూ అది నిదర్శనం. ఈ 14 సినిమాలే కాక, విఠలాచార్య నిర్మాతగా నిలిచి, తన కుమారుడు బి.వి. శ్రీనివాస్‌ దర్శకత్వంలో తీసిన మరో రెండు చిత్రాలు 'అగ్గి వీరుడు', 'నిన్నే పెళ్ళాడతా' లోనూ ఎన్టీయారే హీరో!
రిపీట్‌ రన్‌లలోనూ కనక వర్షం
అప్పటి దాకా కాంతారావు లాంటి మధ్య శ్రేణి హీరోలతోనే సినిమాలు చేస్తూ వచ్చిన విఠలాచార్య, 'బందిపోటు', ఆ తరువాతి హిట్లతో పెద్ద స్థాయి దర్శకుడయ్యారు. మరో విశేషం ఏమిటంటే, ఎన్టీయార్‌ స్టార్‌ ఇమేజ్‌ కారణంగా 'బందిపోటు'తో సహా విఠలాచార్య - ఎన్టీయార్ల కాంబినేషన్‌ చిత్రాలన్నీ రిపీట్‌ రన్‌ వ్యాల్యూను పెంచుకున్నాయి. ఆ రిపీట్‌ రన్‌లలోనూ డిస్ట్రిబ్యూటర్లకు కాసుల పండించాయి.
అంతేకాక, తొలి రిలీజుల్లో హిట్టయిన వీరి చిత్రాలు ఆ తదుపరి విడుదలల్లో కూడా మళ్ళీ ఆ చిత్ర నిర్మాణ వ్యయాలకు సమానంగా వసూళ్ళు సాధించడం ఓ అరుదైన రికార్డు. ఈ విషయాన్ని ఆ చిత్రాల పంపిణీదారులు, ప్రదర్శకులు ఇప్పటికీ ప్రత్యేకంగా ప్రస్తావిస్తుంటారు.
'జురాసిక్‌ పార్క్‌' బలాదూర్‌!
మాస్‌ మెచ్చే ఇలాంటి చక్కటి కాలక్షేప చిత్రాలతో 'జానపద బ్రహ్మ'గా పేరు తెచ్చుకున్న విఠలాచార్య గొప్పతనం ఇటీవల కూడా తేటతెల్లమైంది. వాణిజ్య వివరాలలోకి వెళితే, రాక్షస బల్లుల నేపథ్యంలో నడిచే స్టీవెన్‌ స్పీల్‌బర్గ్‌ 'జురాసిక్‌ పార్క్‌' (1993) ప్రపంచవ్యాప్తంగా రికార్డులు బద్దలు కొట్టే రీతిలో వసూళ్ళు సాధించింది. కానీ, విచిత్రంగా ఒక్క తెలుగునాట మాత్రం ఆ సినిమాకు యావరేజ్‌ వసూళ్ళే దక్కాయన్నది చేదు నిజం. అదే 'జురాసిక్‌ పార్క్‌' కన్నా ఏడాది పై చిలుకు ముందే వచ్చిన మరో హాలీవుడ్‌ యాక్షన్‌ అద్భుతం జేమ్స్‌ కామెరాన్‌ 'టెర్మినేటర్‌-2' మాత్రం మిగతా ప్రాంతాల్లో 'జురాసిక్‌ పార్క్‌' వసూళ్ళలో సగం కూడా సంపాదించలేకపోయింది కానీ, తెలుగునాట మటుకు 'జురాసిక్‌ పార్క్‌'కు రెట్టింపు కలెక్షన్లు సాధించింది.
మరి ఈ రెండు హాలీవుడ్‌ హిట్లకూ తెలుగు ప్రేక్షకులు వేర్వేరు రకాలుగా స్పందించడానికి కారణం ఏమిటన్నది ఆసక్తికరమైన అంశమే! ఈ విచిత్ర ధోరణికి కారణం ఏమిటని లోతుగా విశ్లేషించిన బాక్సాఫీస్‌ పండితులు, ''సాంకేతికంగా ఏమంత పురోగతి సాధించని 1960లు, '70లలోనే విఠలాచార్య అలాంటి రాకాసి బల్లుల నేపథ్యాలతో తెలుగులో సినిమాలు తీశారు. అందుకే, 'జురాసిక్‌ పార్క్‌'లోని అద్భుత రసాన్ని ఇతర ప్రాంతాల ప్రేక్షకులంతగా మన ప్రేక్షకులు ఫీల్‌ కాలేదు'' అని సహేతుకంగా తేల్చారు.
ఏమైనా, స్పీల్‌బర్గ్‌, జేమ్స్‌ కామెరాన్‌ లాంటి దిగ్దర్శకుల కన్నా ఎన్నో ఏళ్ళ ముందే మనకు విఠలాచార్య లాంటి దర్శకుడు ఉండడం ఘనమైన విషయమే! ''విఠలాచార్య సెట్టింగులు'', ''విఠలాచార్య జిమ్మిక్కులు'' అంటూ జనం నోట ఇవాళ్టికీ నానుతూ, తన పేరే ఓ 'బ్రాండ్‌నేమ్‌'గా స్థిరపడిన దర్శకుడికీ, అతని సినిమాలు 2000వ సంవత్సర ప్రాంతం దాకా రిపీట్‌ రన్లు ఆడేందుకు కారణమైన ఎన్టీయార్‌ స్టార్‌ ఇమేజ్‌కూ తెలుగు సినిమా చరిత్రలోనూ, బాక్సాఫీస్‌ రికార్డుల్లోనూ చెరగని స్థానమనేది అందుకే! 
- రెంటాల జూనియర్‌

(Published in 'Praja Sakti' daily, 15th Aug 2013, Thursday, Page No. 10)
......................................................................

0 వ్యాఖ్యలు: