జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Wednesday, August 28, 2013

తెలుగు నాట మహిళా దర్శకులకు మార్గం చూపిన 'చండీరాణి'

బహుముఖ ప్రజ్ఞాశాలి భానుమతి
తెలుగు సినీ రంగానికి సంబంధించినంత వరకు నటి భానుమతిది ఓ ప్రత్యేక అధ్యాయం. సినీ ప్రముఖులు చిత్తజల్లు పుల్లయ్య దర్శకత్వంలోని 'వర విక్రయము' (1939)లో కాళింది పాత్రతో వెండితెరపైకి వచ్చిన ఆమె తరువాతి కాలంలో కేవలం నటనకే పరిమితం కాలేదు. గాయనిగా, సంగీత దర్శకురాలిగా, నిర్మాతగా, దర్శకురాలిగా, స్టూడియో అధినేత్రిగా బహు పాత్రపోషణ చేశారు. బహుముఖీనమైన ప్రజ్ఞను ప్రదర్శించారు. తెలుగు సినీ రంగంలో దర్శకత్వ బాధ్యతలు చేపట్టిన తొలి మహిళగా ఘనత సాధించారు. ఓ మహిళ దర్శకత్వంలో వచ్చిన తొలి తెలుగు చిత్రమైన 'చండీరాణి' 1953 ఆగస్టు 28న విడుదలైంది. అంటే, ఆ చిత్రం వచ్చి, ఇవాళ్టికి సరిగ్గా 60 ఏళ్ళయింది. తెలుగు తెరపై మహిళా దర్శకుల శకం ఆరంభమై, ఇవాళ్టితో ఆరు పదుల పండుగ పూర్తవుతున్న వేళ...ఆ చిత్ర విశేషాలు...

ఏమంత ఇష్టం లేకుండానే సినీ రంగానికి వచ్చి, నటిగా ప్రస్థానం ప్రారంభించిన చరిత్ర భానుమతిది. నటనలో వేళ్ళూనుకుంటున్న రోజుల్లోనే 'కృష్ణ ప్రేమ' (1943) తదితర చిత్రాలకు దర్శకత్వ శాఖలో పనిచేస్తున్న పి.ఎస్‌. రామకృష్ణతో ప్రేమలో పడ్డారు. వివాహబంధంతో ఒక్కటైన ఆ జంట తరువాత 'భరణీ' పతాకంపై స్వీయ చిత్ర నిర్మాణానికీ దిగింది. 'లైలా మజ్ను' లాంటి హిట్లూ, 'ప్రేమ' లాంటి ఫ్లాపులూ తీసింది. అప్పటికే, తెలుగు, తమిళాల్లో భానుమతి స్టార్‌ హీరోయిన్‌. ఈ పరిస్థితుల్లో అనుకోకుండా ఆమె దర్శకురాలయ్యారు.
అనుకోని దర్శకత్వంతో అరుదైన రికార్డు
'ప్రేమ' చిత్రం విడుదలైన రోజుల్లో భార్యాభర్తలిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా, ప్రస్తావవశాత్తూ రామకృష్ణ ఓ జానపద కథను భానుమతికి వినిపించారు. ఆ కథ ఆమెకు నచ్చింది. వెంటనే, ఆ కథను వెండితెర కెక్కించేందుకు దర్శకత్వ బాధ్యత కూడా చేపట్టమంటూ భార్యను ప్రోత్సహించారు రామకృష్ణ. వెంట ఉండి, పని మొత్తాన్నీ తాను పర్యవేక్షిస్తానంటూ హామీ కూడా ఇచ్చారు. ఆ జానపథ కథే వెండితెర మీద 'చండీరాణి'గా వచ్చింది. తీరా ఈ సినిమా తీసే సమయానికి బయటి చిత్ర నిర్మాణ సంస్థకు 'బ్రతుకు తెరువు' సినిమా దర్శకత్వం వహిస్తూ, రామకృష్ణ బిజీగా ఉన్నారు.

దాంతో, భర్త పర్యవేక్షణ లేకుండానే భానుమతి బాధ్యతలన్నీ భుజానికెత్తుకొని, ఆ ఇతివృత్తాన్ని సినిమా కథగా విస్తరించుకొని, ఎన్టీయార్‌ను కథానాయకుడిగా ఎంచుకొని, చండీరాణిగా, చంపగా తాను రెండు పాత్రలు పోషిస్తూనే, దర్శకురాలిగా అవతరించారు. ఆ సినిమా ఎడిటింగ్‌ బాధ్యతలు మాత్రం ఆయన నిర్వహించారు.
ఏకంగా తెలుగు, తమిళ, హిందీ భాషలు మూడింటిలో ఈ చిత్రం రూపొందింది. అంతేకాక, మూడు భాషల్లోనూ ఒకే రోజున (1953 ఆగస్టు 28న), దేశవ్యాప్తంగా విడుదలైంది. అది అప్పటికీ, ఇప్పటికీ చెరిగిపోని ఓ అరుదైన ఘనత. అలా 'చండీ రాణి'తో ఏకకాలంలో మూడు భాషల్లో ఓ సినిమాకు దర్శకత్వం వహిస్తూ, ఆ మూడు వెర్షన్లలోనూ ద్విపాత్రాభినయం చేస్తూ, కథను తానే రాసుకొని, స్వరరచనకు పర్యవేక్షకురాలిగా వహించిన తొలి మహిళగా భానుమతి రికార్డు సృష్టించారు. అది ఇప్పటికీ చెరిగిపోని రికార్డు.
కలిసొచ్చిన హిందీ వెర్షన్‌
అసలు మొదట్లో 'చండీరాణి' చిత్రాన్ని కేవలం తెలుగు, తమిళాల్లో తీయాలనుకున్నారు. అప్పటికే, తెలుగు, తమిళాల్లో జెమినీ వారు హీరో ఎం.కె.రాధా ద్విపాత్రాభినయంతో 'అపూర్వ సహౌదరులు' (1950) చిత్రం తీశారు. అలెగ్జాండర్‌ డ్యూమాస్‌ ప్రసిద్ధ నవల 'కార్సికన్‌ బ్రదర్స్‌', దాని ఆధారంగా వచ్చిన హాలీవుడ్‌ చిత్రం స్ఫూర్తితో ఆ సినిమా వచ్చింది. అది విజయవంతమైంది. ఆ సినిమాను వారే హిందీలో 'నిశాన్‌'గా రీమేక్‌ చేసి, అక్కడా విజయం సాధించారు. ఆ నేపథ్యంలో హీరో బదులు హీరోయిన్‌ డ్యుయల్‌ రోల్‌ అయితే, ఎలా ఉంటుందన్న ఆలోచన ప్రభావం 'చండీ రాణి' ఇతివృత్తానికి బీజం అనుకోవచ్చు.'నిశాన్‌' ప్రేరణతోనో ఏమో వ్యాపార రీత్యా కూడా బాగుంటుందని 'చండీరాణి' హిందీ వెర్షన్‌ను కూడా తీశారు. 
తారాగణంలో ఒకటి, రెండు మార్పులు చేసినప్పటికీ, హీరో మాత్రం తెలుగు, తమిళ, హిందీ రూపాలు మూడింటిలోనూ ఎన్టీయారే! అప్పటికే, 'పాతాళ భైరవి' హిందీ రూపం (1952)లోనూ నటించిన అనుభవం ఎన్టీయార్‌కు ఉంది. అయితే, హిందీ వెర్షన్‌లో ఎన్టీయార్‌ బదులు ఓ హిందీ తారను పెట్టాలని మొదట్లో భావించారట. కానీ, చివరకు ఆ ఆలోచన మానుకున్నారట! హాస్యనటుడు రేలంగి బదులు హిందీ వెర్షన్‌లో మాత్రం అక్కడి పాపులర్‌ కమెడియన్‌ ఆఘాను నటింపజేశారు.
విశేషం ఏమిటంటే, మద్రాసులో సొంత స్టూడియో కట్టుకోవాలని భానుమతి, రామకృష్ణలు భావించినా, అప్పటికి ఆ కల నెరవేర్చుకోలేకపోయారు. ఈ 'చండీరాణి' హిందీ వెర్షన్‌కు పంపిణీదారుల నుంచి వచ్చిన అడ్వాన్సు మొత్తం పుణ్యమా అని, వారు కోడంబాకమ్‌ ప్రాంతంలో 'భరణీ స్టూడియో' నిర్మాణాన్ని పూర్తి చేసుకోగలిగారు.
అందరి కృషితో అలరించిన కథనం
రాజు గారికి పుట్టిన కవల కూతుళ్ళు చిన్నప్పుడే సేనాధిపతి ద్రోహంతో విడిపోవడం... ఒకరు అడవుల్లో ధైర్యశాలిగా, మరొకరు రాజ్యంలో సుకుమారంగా పెరగడం... సేనాధిపతి చేతిలో మరణించిన మంత్రిగారి కుమారుడు తన తండ్రికి జరిగిన ద్రోహానికి కక్ష తీర్చుకోవాలని అనుకోవడం... విడిపోయిన కవల సోదరీమణులిద్దరూ కలిసి, అందుకు సహకరించడం... ఆఖరుకు విలన్‌ను హతమార్చడం, కవలల్లో ధైర్యశాలి చనిపోవడం, మిగిలిన హీరోయిన్‌కూ, హీరోకూ వివాహం - ఇదీ టూకీగా 'చండీరాణి' ఇతివృత్తం. 
కథగా చూస్తే, 'చండీరాణి'లో కొత్తదనం ఏమీ లేదు. అయితే, ఆ కథను తెరపై చెప్పిన రీతిలో నవ్యత ఉంది. చండీరాణిగా హీరోయిన్‌ కత్తి యుద్ధాలు చేయడం, పులితో పోరాటం, కవల సోదరీమణులు ఒకరి స్థానంలోకి మరొకరు వెళ్ళడం లాంటివన్నీ అప్పట్లో ప్రేక్షకులను అలరించాయి.
'చండీరాణి'లో భానుమతి, ఎన్టీయార్
'పాతాళ భైరవి' (1951) హిట్‌ తరువాత తారాపథంలో దూసుకుపోతున్న ఎన్టీయార్‌ తన అందం, అభినయం, అలవాటైన జానపద ఆహార్యంతో ఆకట్టుకున్నారు. కవలలైన చండిగా, చంపగా నటించిన భానుమతి ఎక్కువ భాగం దృశ్యాల్లో కనిపించాలి కాబట్టి, ఆమె కెమేరా ముందు నటనతో బిజీగా ఉన్నప్పుడల్లా, దర్శకత్వంలో ఆమెకు అసోసియేట్‌ అయిన పి.వి. రామారావు (తరువాతి రోజుల్లో ఏయన్నార్‌ నటించిన 'భక్త జయదేవ' దర్శకుడు) చిత్రీకరణ బాధ్యత అంతా నిర్వహించారట! సముద్రాల రాఘవాచార్య మాటలు, పాటలు రాశారు. 
సినిమా సగంలో ఉండగానే సంగీత దర్శకుడు సి.ఆర్‌. సుబ్బురామన్‌ మరణించడంతో, స్వతహాగా గాయని అయిన భానుమతి పర్యవేక్షణలో సుబ్బురామన్‌ సహాయకుడు ఎమ్మెస్‌ విశ్వనాథన్‌ బాణీలు కట్టారు. ఆ బాణీల్లో 'ఓ తారకా...ఓ జాబిలీ..' పాట చిరకాలంగా జనంలో నిలిచింది. భానుమతి పాడిన సోలో పాటలు సరే సరి! 
ఇక, కళా దర్శకుడు ఏ.కె. శేఖర్‌, ఈ చిత్రంతో ఛాయాగ్రాహకుడిగా రంగప్రవేశం చేసిన పి.ఎస్‌. సెల్వరాజ్‌ తదితరుల పనితనం సినిమాకు అండగా నిలిచింది. 'చండీరాణి' కొన్ని చోట్ల విజయవంతంగానూ, మరికొన్ని చోట్ల ఓ మోస్తరుగానూ ఆడింది. అయితేనేం, నిర్మాతలకు మాత్రం లాభాలే తెెచ్చిపెట్టింది. తెలుగు దర్శక, నిర్మాతలు ఏకకాలంలో తీసిన తొలి త్రిభాషా చిత్రంగా చరిత్రలో నిలిచింది.
ఆమె బాటలో ఆ తరువాతెందరో...
హిందీ 'పాతాళభైరవి', 'చండీరాణి' తరువాత ఎన్టీయార్‌ తన కెరీర్‌ మొత్తంలో మరో రెండు హిందీ చిత్రాల్లోనే నటించారు. ఒకటి - తమిళ రూపం 'వేలైక్కారి', తెలుగులో ఎన్టీయార్‌ 'సంతోషం' (1955 డిసెంబర్‌ 22) చిత్రాలకు రీమేకైన 'నయా ఆద్మీ' (1956 ఏప్రిల్‌ 6). మరొకటి - ఎన్టీయార్‌ రాజకీయాల్లోకి వచ్చాక, కెరీర్‌ చివరలో తీసిన పౌరాణిక చిత్రం 'బ్రహ్మర్షి' (1992 - తెలుగులో 'బ్రహ్మర్షి విశ్వామిత్ర'). 
'చండీరాణి'తో అనుకోకుండా దర్శకురాలైన భానుమతి ఆ తరువాతి కాలంలో 'అంతా మన మంచికే!', 'విచిత్ర వివాహం', 'అమ్మాయి పెళ్ళి', 'మనవడి కోసం', 'రచయిత్రి', 'అసాధ్యురాలు' తదితర చిత్రాలకు నిర్దేశకత్వం వహించారు. అందరూ బాల నటీనటులతో, 'భక్త ధ్రువ - మార్కండేయ' అనే ప్రయోగం చేశారు. కథ, స్క్రీన్‌ప్లే, మాటలతో పాటు కళా దర్శకత్వ, ఎడిటింగ్‌ శాఖలను పర్యవేక్షించి, సంగీతంలో ఎస్‌. రాజేశ్వరరావుకు సహకరించి, స్వీయ దర్శకత్వంలో ఆ ప్రయోగం చేయడం ఆమె సాహసానికి నిదర్శనం. 
వందకు పైగా చిత్రాల్లో నటించి, ఎన్నింటినో నిర్మించి, 'పద్మభూషణ్‌' పురస్కారం స్థాయికి ఎదిగిన భానుమతి సినీ రంగంలో, అందులోనూ దర్శకత్వ శాఖలో చూపిన బాట ఆ పైన మహిళలు మెగాఫోన్‌ పట్టుకొనేందుకు ప్రేరణనిచ్చింది. సావిత్రి నుంచి విజయనిర్మల తరం మీదుగా జీవిత, ఇవాళ్టి బి. జయ, నందినీ రెడ్డి దాకా ఎంతోమంది ఆమె బాటలో వచ్చారు. పురుషాధిక్య సినీ రంగంలోనూ స్త్రీలు విజయాలు సాధించగలరని చేతల్లో చూపారు. ఆరు దశాబ్దాల క్రితం ఆ ధోరణికి తెలుగులో నాంది పలికిన చిత్రంగా 'చండీరాణి' ఎప్పటికీ గుర్తుండి పోతుంది.
- రెంటాల జయదేవ
............................................................................

0 వ్యాఖ్యలు: