జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Saturday, August 24, 2013

అసంబద్ధమైన కథాకథనం ('1000 అబద్ధాలు' సినిమా సమీక్ష)


పదమూడేళ్ళ క్రితం 'చిత్రం'(2000) తో మొదలుపెట్టి, వరుసగా ప్రేమ కథా చిత్రాలతో విజయాలు సాధిస్తూ, కొత్త సహస్రాబ్దిలో తెలుగు సినిమాను మలుపు తిప్పిన యువ దర్శకుడు తేజ. అయితే, సమష్టి కృషితో విజయాలు అందించిన ఆయన టీమ్‌లో ఒక్కొక్కరూ దూరమవడం, విజయాలు కరవవడం గడచిన కొన్నేళ్ళుగా ఆయనను బాధిస్తున్న అంశం. 'ఒక 'వి'చిత్రం', 'కేక', 'నీకూ నాకూ డ్యాష్‌ డ్యాష్‌' - ఇలా వరుస పరాజయాలతో సతమతమవుతున్న ఈ దర్శక - సినిమాటోగ్రాఫర్‌ సర్వశక్తులూ కూడగట్టుకొని చేసిన తాజా ప్రయత్నం - '1000 అబద్ధాలు'. అలవాటైన ప్రేమ కథల కోవ నుంచి కాస్తంత పక్కకు జరిగి, వినోదానికి పెద్ద పీట వేస్తూనే, ప్రేమ, పెళ్ళి అనే అంశాల చుట్టూ తిరిగే కథాంశాన్ని ఈసారి ఆయన ఎంచుకున్నారు. కానీ, ఈ తాజా ప్రయత్నం బాగుంటుందన్న ఆయన హామీ మాత్రం వెయ్యిన్నొకటవ అబద్ధంగా మిగిలింది.
...................................................................................................
చిత్రం - 1000 అబద్ధాలు, తారాగణం - సాయిరామ్ శంకర్, ఎస్తేర్, నరేశ్, హేమ, గౌతంరాజు, సంగీతం - రమణ గోగుల, ఛాయాగ్రహణం - రసూల్ ఎల్లోర్, నిర్మాత - పాలడుగు ప్రభాకర్, కథ, స్ర్కీన్ ప్లే, మాటలు, దర్శకత్వం - తేజ
..................................................................................................
కథానాయిక సత్య (ఎస్తేర్‌)ను పెళ్ళి చూపులు చూడడానికి అమెరికా నుంచి ఓ డాక్టర్‌ వస్తాడు. అతగాడు అన్యాయంగా మాదక ద్రవ్యాల కేసులో పోలీసులకు దొరుకుతాడు. ఈ పెళ్ళి చెడగొట్టింది సత్య (హీరో సాయిరామ్‌ శంకర్‌ పేరు కూడా సత్యానే!) అని కథానాయిక, ఆమె తల్లి (హేమ) తదితరులు అతని మీదకు వెళతారు. విడాకులు తీసుకున్నా సరే, కథానాయికే తన భార్య అంటూ, ఆమెను మరెవరికైనా ఇచ్చి పెళ్ళి చేస్తే ఊరకొనేది లేదంటూ కథానాయకుడు అంటాడు. అప్పటికే, హీరో, హీరోయిన్లకు పెళ్ళయి, విడాకులా అని ప్రేక్షకులు ఆశ్చర్యపడుతుండగా, ఆ ఫ్లాష్‌బ్యాక్‌ను లోకల్‌ ట్రైన్‌లో ప్రయాణికులకు హీరో చెప్పడంతో కథ మొదలవుతుంది.
వేరెవరితోనే నిశ్చితార్థం అయిపోయిన కథానాయికను ప్రేమిస్తాడు కథానాయకుడు. ఆమె ప్రేమను పొందడం కోసం నానా అబద్ధాలూ ఆడతాడు. చివరకు నిశ్చయమైన పెళ్ళిని కాదనుకొని, హీరోను పెళ్ళి చేసుకుంటుంది హీరోయిన్‌. తీరా ఓ సందర్భంలో అతను ఓ పథకం ప్రకారం ఎన్నో అబద్ధాలు ఆడి, తనను పెళ్ళి చేసుకున్నాడని తెలిసి, ఆమె మనసు విరిగిపోతుంది. విడాకులు తీసుకుంటుంది. తీరా, కొన్నాళ్ళకు తన స్నేహితురాలికి ఎదురైన సమస్యకు పరిష్కారం కోసం మళ్ళీ హీరోనే ఆశ్రయిస్తుంది. అప్పుడు హీరో ఏం చేశాడు, వారిద్దరూ మళ్ళీ ఒకటయ్యారా, లేదా లాంటి ఘట్టాలన్నీ మిగతా సినిమా.


తాము నిజంగా ప్రేమిస్తున్నది ఎవరిని, పెళ్ళి చేసుకోవాలని అనుకుంటున్నది ఎవరిని అన్న విషయంలో ఈ సినిమాలోని పాత్రలకు స్పష్టత ఉన్నట్లు తోచదు. అసలు ఈ కథా రచయిత అయిన దర్శకుడికైనా ఆ క్లారిటీ ఉందా అంటే అనుమానమే. ఈ కథలోని పాత్రల ప్రవర్తనలో ఉన్న గందరగోళం సహజంగానే సినిమా కథనంలోకి కూడా యథాశక్తి జొరబడింది. మొదట కాసేపు సినిమా ఆసక్తికరంగా అనిపించినా, ఫస్టాఫ్‌ సగమయ్యే సరికల్లా ఆ బిగి పోతుంది. సెకండాఫ్‌ వచ్చే సరికి మరీను! చివరి అరగంట సినిమా అయితే, ఏ క్షణం సినిమా అయిపోతుందా అని ప్రేక్షకుడు సహనంతో నిరీక్షించడమే!
మధ్యలో 'బంపర్‌ ఆఫర్‌' లాంటి విజయం లభించినా, కెరీర్‌ తొలి రోజుల్లో వచ్చిన '143' లాంటి సినిమాలప్పటి నటనా స్థాయినే ఇన్నేళ్ళ తరవాత కూడా హీరో సాయిరామ్‌ శంకర్‌ కొనసాగిస్తున్నారు. మరింకెన్నాళ్ళకు ఆయన తన హావభావ ప్రకటననూ, డైలాగ్‌ డెలివరీనీ మెరుగుపరుచుకుంటారో కాలమే జవాబు చెప్పాలి. బహుశా ఆయనకు కూడా తెలియకపోవచ్చు. గతంలో రీమాసేన్‌, రైమాసేన్‌, తదితరుల లాగానే ఈ చిత్రం ద్వారా నూతన నటి ఎస్తేర్‌ను తెలుగు తెర మీదకు తెచ్చారు - దర్శకుడు తేజ. క్లోజప్‌లో కన్నా మిడ్‌, లాంగ్‌షాట్‌లలోనే బాగుందనిపించే ఆమె నుంచి అభినయం ఆశించడానికేమీ లేదు. ఈ సినిమాలోని మరో ముఖ్యమైన పాత్ర - 'అయామ్‌ టవర్‌ స్టార్‌... ఫ్యాన్‌ ఆఫ్‌ పవర్‌ స్టార్‌' అనే పాత్రలో నాగబాబు విలక్షణంగా కనిపించారు. ఆయన తన రొటీన్‌ పాత్రలకు భిన్నమైన ఈ వేషంలో చక్కగా ఇమిడిపోవడమే కాక, కావాల్సినంత వినోదం పంచారు.
హీరో బామ్మగా పాత తరం నటి గీతాంజలి, హీరోయిన్‌ తల్లితండ్రులుగా హేమ, సీనియర్‌ నటుడు నరేశ్‌, పాన్‌డబ్బా నడిపేవాడి పాత్రలో 'సత్యం' రాజేశ్‌ మొదలైన గుర్తింపున్న నటీనటులు, హాస్య పాత్రధారులు సినిమాలో చాలామందే ఉన్నారు. కానీ, ఆ పాత్రలన్నీ కథలో భాగంగా వచ్చి వెళిపోతుంటాయి. 'కొను... ఏదైనా కొను' అంటూ రాజేశ్‌ మాత్రం మొదటి రెండు, మూడు సార్లు నవ్విస్తాడు. సీనియర్ నటుడు నరేశ్ కు ఎందుకనో వేరెవరి చేతో డబ్బింగ్ చెప్పించారు దర్శకుడు తేజ. సుపరిచిత నటుడు కావడంతో, ఆ డబ్బింగ్ వేరెవరిదో గొంతన్న సంగతి తెలిసిపోతూ, ప్రేక్షకులకు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది.
సాంకేతిక శాఖల్లో రసూల్‌ ఎల్లోర్‌ ఛాయాగ్రహణం బాగుంది. విజయాల కోసం ఎదురుచూస్తున్న సంగీత దర్శకుడు రమణ గోగుల చాలాకాలం తరువాత వినిపించిన బాణీలు కూడా సో...సో..! ఉన్నంతలో, ద్వితీయార్ధంలో వచ్చే మొదటి పాట 'కొంటె కొంటె చూపుల్తోనే...' ఎత్తుగడ, పల్లవి, మొదట కాసేపు బ్లాక్‌ అండ్‌ వైట్‌లో సాగిన విధానం కొంత బాగుందనిపిస్తుంది.
కథ, మాటల క్రెడిట్‌ కూడా తానే తీసుకున్న తేజ సినిమాలో అక్కడక్కడా సినిమా పరిశ్రమపై విసుర్లు విసిరారు. 'ప్రకాశ్‌రాజ్‌ కనిపించడం లేదా? అయితే, తెలుగు ఇండిస్టీకి మంచిది' (ఫిర్యాదు చేయడానికి వచ్చిన వారితో పోలీసు), 'నిన్నటి దాకా హాలీవుడ్‌ సినిమాలు ఆలోచించలేదా? ఇవాళ కొరియన్‌ సినిమాలు ఆలోచించలేదా? వాళ్ళేమో ఏడాదికి 20 సినిమాలే తీస్తున్నారు. మనమేమో వంద సినిమాలు తీయాలి. ఎక్కడ నుంచి వస్తాయి కొత్త కథలు?' (రైలులో ఓ అసిస్టెంట్‌ డైరెక్టర్‌) లాంటి చెణుకులు బాగున్నాయి. సెల్‌ఫోన్‌ వాడకాన్ని బట్టి ఆడవాళ్ళ మన:స్థితినీ, ఏ వయసులో ఎందుకు తాగుతారనే విశ్లేషణనూ చెప్పే ఇంటర్నెట్‌ జోక్‌ల ఫక్కీ డైలాగులు హాలులో కాసేపు నవ్విస్తాయి. పోలీసు ఇన్‌స్పెక్టర్‌గా పృథ్వీరాజ్‌, కెమేరాల ముందు అతని ప్రెస్‌ మీట్ల పిచ్చి కూడా కాస్తంత వినోదమే!
అయితే, సినిమాలో అక్కడక్కడా వచ్చే ఈ మెరుపులే తప్ప, మిగిలిన సన్నివేశాలు, సంఘటనలు, కామెడీ కూడా బలవంతాన తెచ్చిపెట్టినట్లు, కృత్రిమంగా అనిపిస్తాయి. ''మనం ఆడే అబద్ధాలు మన చుట్టూ ఉన్నవాళ్ళకు చిన్న చిన్న సంతోషాలిస్తే, అందులో తప్పేమీ లేదు'' అంటూ హీరోయిన్‌కు హీరో ఉపన్యాసం దంచుతూ, 'నువ్వూ అబద్ధాలు ఆడావం'టూ ఆమెకు ఏవేవో చెప్పే ఘట్టం ఓ ఫార్సు! ఏమైనా, పాత్రల ప్రవర్తనతో పాటు సన్నివేశాల కల్పనలో కూడా దర్శక, రచయిత అబద్ధాన్నే ఆశ్రయించడం ఈ సినిమా టైటిల్‌కు పెద్ద జస్టిఫికేషన్‌ అనుకోవాలి! అందుకే, ప్రేక్షకులు ఏ దశలోనూ కథలో లీనం కాలేకపోతారు. వెరసి, విజయం కోసం ఆవురావురుమంటున్న ఈ దర్శక, హీరో, సంగీత దర్శకుల ఆకలి ఈ సినిమాతో తీరుతుందని ఎవరైనా అంటే, అది మరో పచ్చి అబద్ధం!
- రెంటాల జయదేవ

(ప్రజాశక్తి దినపత్రిక, 18 ఆగస్టు 2013, ఆదివారం, పేజీ నం. 8లో ప్రచురితం)
.........................................................................


2 వ్యాఖ్యలు: