జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Saturday, August 3, 2013

యూతంటారా? బూతంటారా? ( 'రొమాన్స్‌' సినిమా సమీక్ష )


వేగం పెరిగిన ఈ ఆధునిక యుగంలో యువతరం ఆలోచనల్లో, ప్రవర్తనలో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఆ మార్పులనూ, సమకాలీన సమాజాన్నీ ప్రతిబింబించడం ఏ సమాచార సాధనమైనా చేయాల్సిన పని. కానీ, దానిలోని మంచినీ, చెడునూ విశ్లేషించి, మంచి వైపు నడిపిస్తేనే - అర్థం, పరమార్థం. అలా చేయకపోతే, సమాజంలోని చెడునే గోరంతలు కొండంతలు చేసి, డబ్బులు సంపాదించుకొనే రీతిలో పబ్బం గడుపుకొన్నట్లు అవుతుంది. యువతరం కథా చిత్రంగా వచ్చిన 'రొమాన్స్‌' సినిమా ప్రయత్నించింది అదే!

తారాగణం: ప్రిన్స్‌, డింపుల్‌, మానస, సంగీతం: సాయి కార్తీక్‌, పాటలు: కాసర్ల శ్యామ్‌, కరుణాకర్‌, కెమేరా: జె. ప్రభాకరరెడ్డి, కూర్పు: ఎస్‌.బి. ఉద్ధవ్‌, సమర్పణ: మారుతి, నిర్మాతలు: జి. శ్రీనివాసరావు, ఎస్‌.కె.ఎన్‌, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: 'డార్లింగ్‌' స్వామి
గత ఏడాది చిన్న స్థాయిలో విడుదలై, పెద్ద విజయాలు సాధించిన 'ఈ రోజుల్లో...', 'బస్‌స్టాప్‌' చిత్రాలు, ఆ చిత్రాల రూపకర్త మారుతి అందరికీ గుర్తే! మారుతి స్వయంగా దర్శకత్వం వహించకపోయినా, సమర్పించిన ఈ ఏటి 'ప్రేమకథా చిత్రమ్‌' కూడా జనాదరణకు నోచుకున్నదే. ఆయన సమర్పణలో విడుదలైన సరికొత్త సినిమా కాబట్టి 'రొమాన్స్‌' మీద ఓ ఆసక్తి ఏర్పడింది. కానీ, 'ఎవ్రిబడీ నీడ్స్‌...' అనే ఉపశీర్షికతో వచ్చిన ఈ సినిమా యువతరం ఆలోచనలను చూపుతున్నామనే మిషతో ఓ మసాలా మలయాళ చిత్రంలా తయారైంది.
కథ : 
మునుపెన్నడూ బాయిఫ్రెండ్స్‌ కానీ, వారితో ప్రణయానుభవం కానీ లేని కన్నెపిల్లను తన ప్రేమికురాలిగా ఎంచుకోవాలన్నది ఇంజనీరింగ్‌ రెండో సంవత్సరం చదువుతున్న కృష్ణ (ప్రిన్స్‌) అభిప్రాయం. అందుకోసం అతను ఇద్దరు అమ్మాయిలను ఎంచుకొని, వారిని పరీక్షించి, వారిలో ఎవరు తాను అనుకున్న అంశాలకు తగ్గట్లుంటే వాళ్ళను ప్రేమించాలనే ఓ విచిత్రమైన పద్ధతిని ఎంచుకుంటాడు. ఆ క్రమంలో అతనికి లలిత (మానస) పరిచయమవుతుంది. మిత్రులిచ్చిన సలహాలతో 'టెస్టులు' పెడతాడు. ఆ పరిచయంలో తాను అనుకున్న లక్ష్మణరేఖను ఆమె దాటిందని హీరో అనుకుంటాడు. చివరకు, ఆమెతో లవ్‌ బ్రేకప్‌ అవుతుంది.
ఆ పైన చిన్నప్పుడే తల్లితండ్రులకు దూరమైన అనూరాధ (డింపుల్‌) అనే రెండో అమ్మాయికి హీరో దగ్గరవుతాడు. నిజాయతీగా అతణ్ణి ప్రేమించిన అనూరాధ, ఈ పరీక్షా క్రమానికి హర్ట్‌ అవుతుంది. హీరో చెబుతున్న ఈ స్వీయకథ ఇక్కడకు వచ్చేసరికి ఇంటర్వెల్‌. 'లక్ష్మణరేఖ' దాటని ఆ అమ్మాయే తనకు సరైన ప్రేమికురాలని గ్రహించిన హీరో లేడీస్‌ హాస్టల్‌కు వెళ్ళి మరీ ఆమెను తన వైపు ఎలా తిప్పుకున్నాడనేది మిగతా కథ. హీరోకు మొదట పరిచయమైన లలిత అసలు ఎవరు, ఆమె కథ ఏమిటన్నది మరో ట్విస్టు!
కథనం : 
తేజ దర్శకత్వంలో వచ్చిన 'నీకూ నాకూ డ్యాష్‌ డ్యాష్‌' చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైన యువ హీరో ప్రిన్స్‌. గతంలో 'బస్‌స్టాప్‌'లోనూ కథానాయక పాత్ర పోషించారు. ఒడ్డూ పొడుగూతో చూడడానికి బాగానే ఉండే ఈ హీరో అభినయించడానికి కూడా శతవిధాల శ్రమించారు. ఆ శ్రమ తెర మీద తెలిసిపోతుంటుంది. ఇక, కథానాయిక పాత్రల్లో అనూరాధగా డింపుల్‌ అనే కన్నడ అమ్మాయి, లలిత పాత్రలో మానస కనిపించారు. వీళ్ళ వల్ల తెర మీద పండిన సన్నివేశం కానీ, గుర్తుంచుకోదగ్గ అభినయం కానీ లేవు. ఆ తప్పు వాళ్ళ పాత్రచిత్రణను రూపొందించిన దర్శకుడిదే! చిత్ర ప్రథమార్ధంలో హీరో తన ల్యాప్‌టాప్‌లో చూస్తూ డైలాగులు చెప్పే సీన్‌, 'డబ్బులు, ఎనర్జీ వేస్ట్‌' అంటూ వచ్చే కాలేజీ సీనుల్లో తెర మీద బొమ్మ ఒక రకంగా, డైలాగులు వేరొక రకంగా ఉండడం లాంటి లోపాలూ ఈ సినిమాలో ఉన్నాయి.
ఎలా ఉందంటే...: 
పేరులో ఉన్నట్లుగానే ఈ సినిమా మొదటి నుంచి చివరి దాకా 'రొమాన్స్‌' అనేదే ప్రధానమైన ముడిసరుకు. ''అమ్మాయిలు కళ్ళను చూసి ప్రేమిస్తారు. కానీ, మీ అబ్బాయిలు మా... ఛీ...'' లాంటి డైలాగులు సినిమాలో చాలా ఉన్నాయి. ఇక, కథ మొదలైన దగ్గర నుంచి చివరి దాకా 'ఒకే యావ'తో కూడిన 'ఏ' సర్టిఫికెట్‌ దృశ్యాలతో తెర నింపేశారు. యువ సంగీత దర్శకుడు సాయి కార్తీక్‌ బాణీల్లో హాస్టల్‌లో వచ్చే 'రాధాకృష్ణుడే రైట్‌ ప్లేసుకొచ్చాడే...' పాట ఒకటీ బీట్‌ ప్రధానంగా ఆకట్టుకుంటుంది. దీనిలో కూడా సాహిత్యం సరిగ్గా వినపడితే, లేదా కష్టపడి వింటే 'అదిరే అందాల మిల్క్‌ షేకులిద్దామా...' లాంటి అభివ్యక్తీకరణలు దిగ్భ్రమ కలిగిస్తాయి. 'రొమాన్స్‌...' అంటూ బాబా సెహ్ గల్  పాడిన పాట నవతరం 'ప్రేమ'లోని ధోరణులను చెప్పడానికి ప్రయత్నించింది. ఇక, 'ఈరోజుల్లో', 'బస్‌స్టాప్‌'ల లాగానే దీనికీ కెమేరామన్‌ జె. ప్రభాకరరెడ్డి. ఆయన చిన్న '5డి' కెమేరాతో వెండితెరపై ఏ మాత్రం తేడా లేని రీతిలో దృశ్యాల్ని చిత్రీకరించడం అబ్బురపరుస్తుంది. 
రెండు గంటల 20 నిమిషాలకు పైగా నడిచే ఈ సినిమాకు దర్శక, రచయిత తీసుకున్న పాయింట్ అయితే, 'మగవాడి అనుమానానికి అంతు లేదు. ఆడదాని ప్రేమకు అంతు లేదు ' అని. కానీ, చివరకు వచ్చే సరికి హీరో, హీరోయిన్ పాత్రలు రెండూ కూడా అనుమానం అనే అంశం మీదే నడుస్తాయి. 
పైగా, ఇవాళ్టి కాలేజీ కుర్రకారంతా నానా రకాల తిరుగుళ్ళు, అలవాట్లతోనే కాలం గడిపేస్తున్నారన్నట్లు చూపించడం సమంజసమూ కాదు. సమాజానికి సమగ్రమైన ప్రతిఫలనమూ కాదు. పై పెచ్చు, తప్పుడు అభిప్రాయాన్ని ప్రచారం చేసి, ఇతరులనూ తప్పుదోవ పట్టిస్తుందంటే కాదనలేం. 
అన్నింటి కన్నా చిత్రం ఏమిటంటే,  'గుడ్ సినిమా గ్రూప్ ' అని పేరు పెట్టుకొని, ఇలాంటి సినిమా తీయడం. ఈ సినిమాలో చూపించిన దాంట్లో అసలు ఏది గుడ్, ఎవరికి గుడ్ అంటే సమాధానం దొరకదు. తక్కువ ఖర్చుతో సినిమా తీసి, ఎక్కువ లాభాలు గడించడం ఒక్కటే సినిమా లక్ష్యమనీ, అందుకు 50 - 60 సెన్సార్ కట్స్ తో నైనా సరే జనం ముందుకు తెచ్చే కథనూ, కథనాన్నీ ఎన్నుకుంటామనీ వాదించేవారికి మాత్రమే ఈ సినిమా పట్ల అభ్యంతరాలు ఉండవేమో. అలాంటి వర్గానికి ఈ   'రొమాన్స్ ' చిత్రం ఓ ఆదర్శంగా, తాజా బాక్సాఫీస్ ఫార్ములాగా కనిపిస్తుంది. మరిన్ని యూత్ (బూతు) సినిమాలకు బాట చూపిస్తుంది. సమాజానికీ, తెలుగు సినిమాకూ అంతకన్నా విషాదం ఏముంటుంది. 
కొసమెరుపు -
సినిమా చూసి బయటకు వచ్చేస్తూ ఉంటే, ఓ ప్రేక్షకుడు  'ప్రతి సీనూ బెడ్ రూమ్ సీన్ లాగానే ఉందే. ఎంత  'రొమాన్స్ ' అని టైటిల్ పెట్టినా, మరీ ఇలానా... ' అంటూ బుర్ర గోక్కుంటూ, గొణుక్కోవడం వినిపించింది. టైటిల్ కు అసలు సిసలు జస్టిఫికేషన్ అంటే ఇదేనేమో. 
- రెంటాల జయదేవ   
(ప్రజాశక్తి దినపత్రిక, 3 ఆగస్టు 2013, శనివారం, పేజీ నంబర్ 8లో ప్రచురితం)

http://www.10tv.in/news/Romance-Not-for-Ladies


............................................................................

3 వ్యాఖ్యలు: