జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Sunday, April 20, 2014

‘ఇది నాకు కూడా ఓ సవాల్’ - నాగార్జున

 ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ గేమ్ షో ద్వారా  డ్రాయింగ్ రూమ్‌లో వీక్షకులను పలకరించనున్న నాగార్జున కార్యక్రమంలో భాగంగా విలేకరులు సంధించిన ప్రశ్నలకు చెప్పిన సమాధానాల్లో కొన్ని...

- ఇది నాకు కొత్త అవతారం. అయితే.. ‘కౌన్‌బనేగా కరోడ్‌పతి’ ద్వారా అమితాబ్ వేసిన ముద్ర చెరిగిపోయేది కాదు. ఆయన అంత కాకపోయినా... ఆయన దరిదాపులకు వెళ్లేలా ప్రయత్నం చేస్తా. ఈ కార్యక్రమం ఓ విధంగా నాకు కూడా సవాల్. దీన్ని చేయడం అంత తేలికైన విషయం కాదని ఒప్పుకున్న తర్వాత తెలిసింది. ప్రస్తుతం ప్రాక్టీస్‌లో ఉన్నా.
 
- ప్రముఖుల కన్నా... సామాన్యులకే ఈ కార్యక్రమం విషయంలో పెద్ద పీట వేయడం జరుగుతుంది. ఎస్‌ఎంఎస్‌ల ద్వారా మేం సూచించే టోల్ ఫ్రీ నంబర్‌ల ద్వారా, ఇంటర్‌నెట్ ద్వారా అభ్యర్థుల్ని ఎంపిక చేస్తాం. అడపాదడపా సెలబ్రిటీలు కూడా పాల్గొంటారు. అయితే... అదంతా చారిటీలో భాగం మాత్రమే.- ఈ కార్యక్రమం నాకు ప్లస్ అవుతుందా, నేను ఈ కార్యక్రమానికి ప్లస్ అవుతానా అంటే... అది పరస్పరం ఉపయోగకరం. చేసేవాణ్ణి, చూసేవాణ్ణి కూడా పూర్తిగా లీనం చేసుకునే కార్యక్రమం ఇది. దీని ద్వారా నా సొంత శైలిని సృష్టించుకోవడానికి ప్రయత్నిస్తా.

- నాన్నకు అమితాబ్ అంటే చాలా ఇష్టం. చాలా విషయాల్లో ఆయనను మెచ్చుకునేవారు. ఈ రోజు మన మధ్య లేకపోయినా... పై నుంచి నాన్న ఆశీస్సులు నాకు ఉంటాయి. టీవీలో ఈ గేమ్ షో ప్రసారం ఎప్పుడు మొదలవుతుందా అని నేను కూడా ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాను

(Published in 'Sakshi' daily, 19th April 2014, Saturday0
.......................................................

0 వ్యాఖ్యలు: