జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Thursday, April 3, 2014

నితిన్, పూరీల 'హార్ట్ ఎటాక్' ( సినిమా రివ్యూ)

'ఇష్క్', 'గుండెజారి గల్లంతయ్యిందే' చిత్రాల విజయాలతో హీరో నితిన్ జోష్ మీదున్నాడు. ఇక వరుస ఫ్లాప్ లతో దర్శకుడు పూరీ జగన్నాథ్ ఇబ్బంది పడుతున్నాడు. ఓ భారీ హిట్ కోసం చాలా రోజులుగా ఈగర్ గా వెయిట్ చేస్తున్నాడు. ఇలా వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన చిత్రం 'హార్ట్ ఎటాక్'. ఎన్నో అంచనాలతో రూపొందిన ఈ చిత్రం ఈ శుక్రవారం మన ముందుకు వచ్చింది. హ్యాట్రిక్ హిట్ కోసం నితిన్, మంచి సక్సెస్ కోసం పూరీ తహతహలాడుతున్న ఈ చిత్రంపై ప్రేక్షకులు భారీ అంచనాలే పెట్టుకున్నారు. మరి వారి అంచనాలను ఈ 'హార్ట్ ఎటాక్' రీచ్ అయ్యిందా..? నితిన్ కు హ్యాట్రిక్ హిట్ నిచ్చిందా..? అనేది చూద్దాం.

కథ విషయానికి వస్తే:..
   
ఇది ఒక అనాథ కథ. వరుణ్(నితిన్) చిన్నతనంలోనే తల్లిదండ్రులను పోగొట్టుకుంటాడు. వరుణ్ కి ప్రేమ, అనుబంధాలపై నమ్మకం ఉండదు. ట్రావెలర్ (హిప్పి)గా మారి ప్రపంచమంతా తిరుగుతుంటాడు. అలా తిరిగే క్రమంలో వరుణ్ కు స్పెయిన్ లో హయాతి(ఆదాశర్మ)ని చూసి మోజుపడతాడు. అతనికి కావాల్సింది తను కాదు, ఒక ముద్దని తెలుసుకొని హయాతి అతన్ని ఛీ కొడుతుంది. కానీ హయాతి ఫ్రెండ్ పెళ్ళి విషయంలో వరుణ్ హెల్ప్ చేస్తాడు. అతనిమీద ఇష్టం పెంచుకున్న హయాతి వరుణ్ అడిగింది ఇచ్చేందుకు రెడీ అవుతుంది. కానీ ఒక కండీషన్ తో.. అయితే అది తనను ప్రేమించమనో కాదు, పెళ్ళి చేసుకోమనో కాదు. మరి ఆ కండీషన్ ఏంటీ..? దానికి వరుణ్ ఒప్పుకుంటాడా..? అనేది మిగిలిన కథ.


విశ్లేషణ:..
   
హీరోయిజానికి కొత్త అర్ధాన్నిచ్చిన దర్శకుడు పూరీ జగన్నాథ్. అతని సినిమాలో హీరోలు పోకిరీలుగా ఉంటారు. ఇంకా చెప్పాలంటే హీరోలంటే ఇలాగే ఉండాలనే భావనను కల్పించాడు. ప్రేక్షకులు కూడా అలాగే ఫిక్స్ అయ్యారు.

   ఇందులో నితిన్ కూడా అలాగే ఉంటాడు. కాకపోతే ఈ సారి కొంత స్టైల్ ని యాడ్ చేశాడు. ఎవరి ప్రేమ వద్దని ప్రపంచమంతా తిరిగే యువకుడికి తనను కదిలించే ప్రేమ దొరికితే ఎలా రియాక్ట్ అవుతాడనేది ఆసక్తిగా చూపించాడు పూరీ. ఇలాంటి కథలు టాలీవుడ్ కు కొత్త కాకపోయినా పూరీ కథనం బోర్ కొట్టకుండా సాగింది. మనల్ని ప్రేమించిన వారి విలువ వారు దూరమైతే తెలుస్తుందంటారు. ఈ పాయింట్ చుట్టూ ఇప్పటికే ఇండియన్ భాషలన్నిటిలోనూ చాలా ప్రేమకథలు వచ్చాయి. వస్తున్నాయి. కానీ ఇలాంటి అలవాటైన కథను అలవాటు లేని సన్నివేశాలతో చెప్పించడంలో పూరీ సక్సెస్ అయ్యాడు. అమ్మాయిలు ఏం కోరుకుంటారో అనే విషయంలో పూరీ చూసే దృష్టికోణం చాలా మంది ఒప్పుకోరు కానీ ఎక్కువ మందిని ఆలోచింపచేసే విధంగా ఉంటుంది. అలాంటి మాటలు 'హార్ట్ ఎటాక్' లో చాలానే ఉంటాయి. అయితే ఫస్టాఫ్ లో బ్రహ్మానందం కూతురి ప్రేమకథను ఇంకాస్త కుదిస్తే బాగుండేది. 'చూపించండే', హీరోయిన్ ని 'వెనక్కుతిరుగు కాస్త చూడాలి' వంటి మాటలు అమ్మాయిలనుద్దేశించి వాడడం చాలా దారుణంగా ఉంటుంది. హీరో క్యారెక్టర్ లో వచ్చే చేంజ్ ని ఇంకాస్త స్ర్టాంగ్ గా చేసుంటే బాగుండేది.

   వద్దనుకొని వెళ్ళిన ప్రేమను తిరిగి కలుసుకొనే సన్నివేశంలో నితిన్ నటన చాలా బాగుంది. నితిన్ నటన, ఇమేజ్ ఈ మూవీ తో పెరుగుతాయని కచ్చితంగా చెప్పవచ్చు. ఇక హీరోయిన్ ఆదాశర్మ ఉన్నంతలో బాగానే నటించింది. నటనతో కూడా ఆకట్టుకుంది. తన పూరీ మార్క్ డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. 'తను నాకు దగ్గరగా ఉందని తెలుసు కానీ ఎంత దూరంగా ఉందో తెలియదు' వంటి మాటలు ఆకట్టుకుంటాయి. పాటలు, ఫైట్స్, సినిమాటోగ్రఫీ సినిమాకి రిచ్ లుక్ ని తెచ్చాయి. అనూప్ రూబెన్స్ పాటలతో పాటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాని నిలబెట్టింది. 'సెలవనో మరి ఏడవకే మనసా...' పాట హార్ట్ టచింగ్ గా ఉంటుంది. సినిమాలో కామెడీ లైటర్ వే లో సాగింది. అలీ, బ్రహ్మానందం పాత్రలు ఎంటర్ టైన్ చేస్తాయి.

ప్లస్ పాయిట్స్:.. నితిన్, ఆదాశర్మ, మాటలు, సినిమాటోగ్రఫీ, దర్శకత్వం.

మైనస్ పాయింట్స్:.. రోటీన్ కథ, అభ్యంతరకరమైన కొన్ని మాటలు , సెకండ్ హాఫ్ లో తగ్గిన వినోదం, క్లైమాక్స్, మ్యూజిక్.

మొత్తానికి యూత్ ని ఆకట్టుకునే సినిమాగా ఈ నితిన్, పూరీల 'హార్ట్ ఎటాక్' నిలుస్తుందని చెప్పవచ్చు. 

ఇక ఈ చిత్రానికి '10టివి' ఇచ్చే రేటింగ్-2/5.

(This review was telecasted in 10tv on 31st Jan 2014- Friday)
..........................................

0 వ్యాఖ్యలు: