జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Tuesday, April 8, 2014

'వందకోట్ల`దిశగా తెలుగు సినిమా (2013వ సంవత్సరంలో తెలుగు చిత్ర పరిశ్రమ)  (2013 ఇయర్ రివ్యూ)
  మరో రెండు రోజుల్లో ఈ 2013వ సంవత్సరం సెలవు తీసుకుంటోంది. ముగిసిపోతున్న ఈ ఏడాది తెలుగు సినిమాకు సంబంధించినంత వరకు ఎన్నెన్నో ఘటనలకు 'మౌన ప్రేక్షకురాలు'గా నిలిచింది. గడచిన కొన్నేళ్ళ కన్నా భిన్నంగా ఈ ఏడాది ఎన్నో చిత్ర విచిత్రాలు తొలిసారిగా జరిగాయి. సినిమా విడుదల కాక ముందే పైరసీ సీడీలు మార్కెట్లోకి వచ్చేయడం తమిళనాట కొన్నేళ్ళ క్రితమే జరిగినా, ఆ జాడ్యం ఈ ఏడాది తొలిసారిగా తెలుగుకూ పాకింది. పెద్ద హీరోల చిత్రాల రిలీజులు సైతం పదే పదే వాయిదా పడ్డాయి. అదే అదనుగా ఇటీవలి సంవత్సరాల్లో ఎన్నడూ లేనంతగా చిన్న సినిమాలు పెద్ద సంఖ్యలో చకచకా విడుదలయ్యాయి. సరుకున్న సినిమాలు చిన్నవైనా, జనం బ్రహ్మరథం పట్టారు. మరోపక్క, తొలిసారిగా దాదాపు వంద కోట్ల వసూళ్ళ స్థాయికి తెలుగు సినిమా ఎదిగింది. విదేశాల్లో తెలుగు సినిమా కలెక్షన్లు మునుపెన్నడూ లేనట్లు మిలియన్‌ (పది లక్షల) డాలర్ల స్థాయికి పెరిగాయి. మునుపటి తరం పెద్ద హీరోలందరూ క్రమంగా తెర మరుగవుతున్న సూచనలు గోచరించాయి. లఘు చిత్రాలు తీసి, యూ-ట్యూబ్‌లో పెట్టిన యువతరం దర్శకులు పలువురు వాటిని చూపెట్టి, వెండితెర అవకాశాలు అందుకొన్నారు. కొత్త దర్శకులు కొంతలో కొంత కొత్తగా వెళ్ళి, సమకాలీన ప్రేమ, ఆకర్షణ, పెళ్ళికి ముందే లైంగిక సంబంధాల లాంటి ఆధునిక కాలపు పోకడల్ని సినిమాల్లో చూపెట్టారు. ఇలా... తెలుగు చిత్రసీమలో ఎన్నెన్నో మలుపులు! ఈ మలుపుల్లో గెలుపులూ...! పరిశ్రమకు ఎన్నో చెరుపులూ....! 
 డబ్బింగ్‌ కన్నా స్ట్రెయిటే మిన్న!
   ఈ ఏడాది మొత్తం 179 దాకా తెలుగు చిత్రాలు, 92 దాకా అనువాద చిత్రాలు విడుదలైనట్లు సినీ పరిశీలకుల లెక్క. అయితే, ఇన్ని సినిమాల్లో సరైన విజయం సాధించి, నిర్మాణ, పంపిణీ, ప్రదర్శక శాఖలు మూడింటికీ లాభాలు తెచ్చినవి మాత్రం తక్కువే. ఫ్లాపైన చిత్రాల దర్శక, నిర్మాతలు భోరున బయటే విలపిస్తే, కొన్ని చిత్రాలు సూపర్‌ హిట్టయినా ఆ చిత్రానికి పనిచేసినవారు ఆంతరంగికంగా వాపోతున్నారు. సినిమా రిలీజుకు ముందే టేబుల్‌ ప్రాఫిట్‌ వచ్చినా, మునుపటి చిత్రాల తాలూకు అప్పులన్నీ తీర్చడానికే ఆ డబ్బులు నిర్మాతలకు సరిపోని వైనాలూ ఉన్నాయి. ఎవరెవరి మాట సాయంతో, మధ్యవర్తిత్వం సాయంతో తీరా సినిమా రిలీజై, సూపర్‌ హిట్టయినా కనీసం పారితోషికాలైనా ఇప్పటికీ నిర్మాతల నుంచి పూర్తిగా అందుకోక, టెక్నీషియన్లు చాలామంది బాధపడుతున్నారంటే అతిశయోక్తి కాదు. 

వెరసి, ఎప్పటిలానే ఈసారి కూడా కేవలం 8 నుంచి 10 శాతం సినిమాలే సక్సెస్‌ అయ్యాయి. ''ఈ ఏటి తెలుగు చిత్రాల్లో కేవలం ఓ డజనుకు పైగా సినిమాలకు మాత్రమే పాజిటివ్‌ ఫలితాలు వచ్చాయి. అందులోనూ ఆరేడు సినిమాలు యావరేజ్‌లే. మిగిలిన అయిదారు మాత్రమే నిఖార్సయిన హిట్లు. ఈ కొద్ది సినిమాలు మినహా మిగతావన్నీ నష్టాలు మిగిల్చినవే'' అని 'తెలంగాణ ఫిల్మ్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌' పెద్ద తలకాయల్లో ఒకరైన ప్రముఖ సినీ ఎగ్జిబిటర్‌ విజయేందర్‌ రెడ్డి, 'ప్రజాశక్తి'తో మాట్లాడుతూ అన్నారు. ''తెలుగు చిత్ర పరిశ్రమలో ఏటా రూ. 1200 కోట్లు ఖర్చు చేస్తున్నాం. అయితే, అందులో 800 నుంచి 900 కోట్లు కూడా వెనక్కి రావడం లేదు. మిగతా మూడొందల కోట్లు నష్టమే'' అని ఆయన వివరించారు. ఈ ఏటి పరిస్థితి కూడా అదే! 

దానికి తోడు రాష్ట్రంలోని ఉద్యమాల ఉధృతి కూడా సినిమాపై బాగానే ప్రభావం చూపింది. ముఖ్యంగా, రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ, తెలంగాణ మినహా ఇతర రాష్ట్రమంతటా నెలల కొద్దీ సాగిన ఆర్టీసీ సమ్మె, బంద్‌ల దెబ్బ గట్టిగా తగిలింది. చాలా కేంద్రాల్లో సినిమా హాళ్ళలో ప్రదర్శనలకు తాళం పడింది. చాలాచోట్ల నాలుగు ఆటలూ ఆగిపోతే, కొన్నిచోట్ల సాయంకాలపు షోలు అంతంత మాత్రంగా నడిచాయి. ఇవన్నీ కలసి రిలీజ్‌లను వాయిదా వేయించాయి. పరోక్షంగా తెలంగాణలోనూ ఈ ఉద్యమాల సెగ తగిలింది. ''దాదాపు రెండు నెలల పైచిలుకు కొత్త సినిమాలు లేక, వసూళ్ళు రాక, మేము జీతాలు కూడా ఇచ్చే పరిస్థితి లేకపోయింది'' అని తెలంగాణలోని ఓ ఎగ్జిబిటర్‌ కమ్‌ డిస్ట్రిబ్యూటర్‌ 'ప్రజాశక్తి'తో ఆ సంగతులను తలుచుకున్నారు. 

వివాద నామ సంవత్సరం
సినిమా రిలీజవగానే వెంటపడే పైరసీ భూతం ఈసారి చిత్ర యూనిట్లలోని 'ఇంటి దొంగలు', వారి వెనుక ఉన్న 'పెద్ద మనుషుల' పుణ్యమా అని ఏకంగా రిలీజ్‌కు ముందే కోరలు సాచింది. జూలైలో రావాల్సిన 'అత్తారింటికి దారేది' చిత్రం వాయిదా పడి, రిలీజ్‌ డేట్‌ కోసం రెండున్నర నెలలుగా నిరీక్షిస్తూ ఉండగానే, ఎడిటింగ్‌ రూమ్‌లోని 'ఇంటి దొంగ' వల్ల ఉన్నట్టుండి ఇంటర్వెల్‌ దాకా సినిమా ఇంటర్నెట్‌లో వచ్చేసింది. రోడ్డు మీద పాతికా పరకకు పైరసీ సీడీలు పప్పుబెల్లాలుగా అమ్ముడయ్యాయి. దాంతో, హడావిడిగా సినిమాను హాళ్ళలో విడుదల చేసేయాల్సి వచ్చింది. పైరసీ దెబ్బతో వచ్చిన ప్రచారం, డిజిటల్‌ ప్రింట్‌ క్వాలిటీ సినిమాను పైరసీలో చూసిన జనం కూడా హాళ్ళలో చూడడానికి మొగ్గు చూపడం కలిసొచ్చి, హాళ్ళన్నీ క్రిక్కిరిశాయి. అఖండ విజయం దక్కింది. మునుపటి 'గబ్బర్‌ సింగ్‌' తరువాత ఈసారి మరో కొత్త బాక్సాఫీస్‌ రికార్డు హీరో పవన్‌ కల్యాణ్‌ పేర దక్కింది. 'పైరసీ వ్యవహారంలో తెర వెనుక ఉన్న అసలు పెద్దల తాట తీస్తా'నంటూ అభిమానుల ఎదుట ఆయన చూపిన ఆవేశం మరో సంచలనమైంది. 

పిన్నితో హీరోయిన్‌ అంజలి వ్యక్తిగత వివాదం, కొద్దిరోజులు ఆమె కనిపించకుండాపోవడం వార్తల్లోకెక్కాయి. ఇక, రామ్‌గోపాల్‌ వర్మ 'సత్య-2' సెన్సార్‌ జాప్యం, మంచు విష్ణువర్ధన్‌బాబు 'దూసుకెళ్తా' చిత్రం ప్రచార చిత్రానికి దక్కిన 'ఎ' సర్టిఫికెట్‌ లాంటివీ వివాదాలయ్యాయి. 'మధుమతి'లో వేశ్య పాత్ర పోషించిన బుల్లితెర నటి ఉదయభాను ఆ చిత్ర ప్రచారానికి సహకరించ లేదని దర్శక, నిర్మాతలు వీధికెక్కారు. తీరా రిలీజు ముందేమో సినిమా తనకు చూపలేదంటూ పోలీసులను ఆశ్రయించి సినిమా చూసిన ఉదయభాను, రిలీజు రోజున మీడియా ముందుకు వచ్చి, తనకు చెప్పిన కథొకటి తీసిన సినిమా వేరొకటి అని ఆరోపించారు. ప్రచార చిత్రాల్లో తన బొమ్మలను 'మార్ఫింగ్‌' చేశారని విరుచుకుపడి, కొన్ని సినీ వెబ్‌సైట్ల పైనా కేసులు పెట్టారు. ఈ ప్రచార హంగామా సాగుతుండగానే, సినిమా మాత్రం ఇంటిదారి పట్టేసింది. 
కాగా, బ్రాహ్మణ వర్గాన్ని కించపరచారంటూ కేసుల దాకా వెళ్ళిన రెండేళ్ళ క్రితం నాటి 'దేనికైనా రెఢ' ఆ విషయంలో కోర్టులో ఊరట పొందింది. కానీ, కేంద్రప్రభుత్వమిచ్చే ఉన్నత పౌర పురస్కారాల్లో ఒకటైన 'పద్మశ్రీ'ని వాణిజ్యపరంగా సినిమా టైటిల్స్‌లోనూ దుర్వినియోగం చేస్తున్నారంటూ హైకోర్టు ఆగ్రహించడంతో ఇప్పుడు నిర్మాత - నటుడు మోహన్‌బాబు, నటుడు బ్రహ్మానందం ఇరుకునపడ్డారు. 

బాక్సాఫీస్‌ వాకిట్లో కలెక్షన్లు కొట్టు!
పెరిగిన టికెట్‌ రేట్ల వల్ల అయితేనేం, ఉన్న చిత్రాల్లో ఓసారైనా చూడవచ్చులెమ్మన్న ప్రేక్షకుల ఉదారత వల్లనైతేనేం సక్సెస్‌ఫుల్‌ సినిమాలకు వసూళ్ళ స్థాయి ఈ ఏడాది బాగానే పెరిగింది. నాలుగైదు సినిమాల వసూళ్ళు రూ. 50 కోట్ల మార్కు వైపు పరుగులు తీశాయి. ఇక, పవన్‌ కల్యాణ్‌ - త్రివిక్రమ్‌ల మాయాజాలం 'అత్తారింటికి దారేది' ఏకంగా తొలి వంద కోట్ల వసూళ్ళ సినిమాగా నిలిచే స్థాయికి వెళ్ళింది. అయితే, ఆఖరి కొద్ది దూరంలో ఆగిపోయింది. తెలుగు సినీ చరిత్రలో అత్యధిక వసూళ్ళు రాబట్టిన చిత్రంగా మాత్రం కొత్త రికార్డు సృష్టించింది. 

'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు', 'అత్తారింటికి దారేది', ప్రభాస్‌ 'మిర్చి' (దర్శకుడిగా మారిన రచయిత కొరటాల శివ) లాంటివి నాటకీయమైన కుటుంబ కథలకు జనాదరణ ఉన్నట్లు నిరూపించాయి. మరోపక్క రొటీన్‌ మాస్‌ కథలను ఈసారి ప్రేక్షకులు అంతగా ఆదరించలేదు. కానీ, హీరో ఇమేజ్‌, రిలీజ్‌ టైమ్‌ కలిసొచ్చినప్పుడు అలాంటి చిత్రాలకూ (రామ్‌చరణ్‌ తేజ్‌ 'నాయక్‌', చిన్న ఎన్టీయార్‌ 'బాద్‌షా') వసూళ్ళు కట్టబెట్టారు. జీవితంలో కరవైన కాసింత వినోదం కనీసం వెండితెర మీదైనా పలకరిస్తే చాలని రవితేజ 'బలుపు' లాంటి వాటినీ లాభాల బాట పట్టించారు. రవితేజ ఫ్లాపుల పరంపరకు కాస్త విరామం ఇచ్చారు. తమిళ 'వేటై ్ట'కి రీమేకైన 'తడాఖా'తో నాగచైతన్య విజయం సాధించారు. 

పాఠం నేర్పే పరాజయాలు
చాలా కాలం తరువాత మళ్ళీ నేరుగా తెలుగులో 3డి చిత్రాలు ఈ ఏడాది వచ్చాయి. కానీ, కథలో, కథనంలో సరుకు లేని 'అల్లరి' నరేశ్‌ 'యాక్షన్‌' చిత్రానికి కానీ, హీరో కల్యాణరామ్‌ కష్టపడి తీసిన 'ఓం' చిత్రానికి కానీ ఈ 3డి పరిజ్ఞానమేదీ ఉపయోగపడలేదు. ప్రేక్షకాదరణ కరవై, కనీసం ఖర్చులు కూడా రాని పరిస్థితి వచ్చింది. ఇక, నాగార్జున ('గ్రీకు వీరుడు', 'భారు'), వెంకటేశ్‌ ('షాడో', 'మసాలా'), జూనియర్‌ ఎన్టీయార్‌ ('రామయ్యా వస్తావయ్యా') లాంటి పలువురు పెద్ద హీరోల సినిమాలు కూడా ఘోరంగా ఫ్లాపయ్యాయి. ఎప్పుడూ వరుసగా రిలీజులతో బిజీగా ఉండే 'అల్లరి' నరేశ్‌ ఈసారి విజయాలు అందుకోకపోవడం ఆలోచింపజేసే విషయం. ఇక, కొందరు హీరోల చిత్రాలు ఈ ఏడాది కాలంలో వెండితెరపై కనిపించనే లేదు. 

బాలకృష్ణ నటించిన కొత్త సినిమా ఏదీ ఈ ఏడాది విడుదలకు నోచుకోకపోవడం విచిత్రం. దాదాపు మూడు దశాబ్దాల కెరీర్‌లో ఇలా జరగడం ఆయనకు ఇదే తొలిసారి. మరో పక్క సీనియర్‌ హీరో వెంకటేశ్‌ క్రమంగా సోలో హీరో అన్న ఇమేజ్‌ను వదిలించుకోవడం మొదలుపెట్టింది ఈ ఏడాదే! 'సీతమ్మ వాకిట్లో...', 'మసాలా' లాంటి చిత్రాలలతో మల్టీస్టారర్ల వైపు రూటు మార్చారు. సినిమా పూర్తయి, నెలలు గడిచేస్తున్నా, ఆర్థిక ఇబ్బందులతో రిలీజుకు నోచుకోని చిత్రాల్లో కె. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన 'ఇంటింటా అన్నమయ్య', కృష్ణవంశీ రూపొందించిన 'పైసా' లాంటివి ఉండడం మింగుడుపడని చేదు నిజం! పాత అమితాబ్‌ 'జంజీర్‌'ను కొత్తగా చూపెడుతూ, బాలీవుడ్‌లో హంగామాగా రంగప్రవేశం చేయాలనుకున్న హీరో రామ్‌చరణ్‌ తేజ్‌ ప్రయత్నం ఫలించనే లేదు. ఆ సినిమా తెలుగు రూపం 'తుఫాన్‌' సైతం వసూళ్ళ వాన కురిపించకుండానే, తొలిరోజే బాక్సాఫీస్‌ తీరం దాటిపోయింది.

కలిసొచ్చిన కాలం... నడిచొచ్చిన చిత్రాలు, దర్శకులు
అయితే, ఉద్యమాల నేపథ్యంలో పెద్ద చిత్రాల వాయిదా చిన్న సినిమాలకు బాగా కలిసొచ్చింది. ఎన్నడూ లేని రీతిలో వారానికి ఆరేడు చిన్న సినిమాలు వచ్చిన సందర్భాలు ఈ ఏడాదిలో అనేకం. ప్రేక్షకుల మాటెలా ఉన్నా, కనీసం హాలు దాకా సినిమానైనా తీసుకురాగలిగామన్న సంతోషం చాలామంది దర్శక, నిర్మాతలకు మిగిలింది. మరో విశేషం ఏమిటంటే, సరుకున్న చిన్న సినిమాలు కొన్ని పెద్ద చిత్రాల హంగామా మధ్య కూడా తమ సత్తా చాటడం! 
గడచిన కొన్నేళ్ళలో ఎప్పుడూ లేని రీతిలో ఈసారి చిన్న సినిమాలు కూడా పెద్ద విజయాలు నమోదు చేసుకున్నాయి. పైగా, ఇవన్నీ కొత్త దర్శకులు తీసినవి కావడం మరీ విశేషం. నిఖిల్‌ - స్వాతి నటించిన క్రైమ్‌ థ్రిల్లర్‌ 'స్వామి రారా!' (నూతన దర్శకుడు సుధీర్‌ వర్మ), మహేశ్‌బాబు బావ సుధీర్‌బాబు హీరోగా వచ్చిన 'ప్రేమ కథా చిత్రమ్‌' (దర్శకుడిగా మారిన కెమేరామన్‌ ప్రభాకరరెడ్డి), నితిన్‌ 'గుండె జారి గల్లంతయ్యిందే!' (విజరుకుమార్‌ కొండా), సందీప్‌ కిషన్‌ హీరోగా 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌' (మేర్లపాక గాంధీ) లాంటి సినిమాలు ఆ కోవలోవే! 

ఇక, మేర్లపాక గాంధీతో పాటు పవన్‌ సాదినేని ('ప్రేమ.. ఇష్క్‌.. కాదల్‌'), విరించి వర్మ (ఈ వారం వచ్చిన 'ఉయ్యాలా జంపాలా') లాంటి వారందరూ లఘు చిత్రాలు తీసి, వాటిని 'యూ - ట్యూబ్‌'లో పెట్టి, అవే 'విజిటింగ్‌ కార్డు'లుగా, ఆనక వెండితెరకు ప్రమోట్‌ అయినవారే! ఇలా షార్ట్‌ ఫిల్మ్‌ డైరెక్టర్లు సినిమా దర్శకులుగా అవకాశాలు అందుకోవడం ఈ ఏడాది తెలుగులో మొదలైన ఓ కొత్త ట్రెండ్‌. 

మరోపక్క, పెళ్ళికి ముందే సహజీవనమనే కత్తి మీద సాము లాంటి కథాంశంతో ఇంద్రగంటి మోహనకృష్ణ తెరకెక్కించిన 'అంతకు ముందు.. ఆ తరువాత..', ఆడపిల్ల ప్రేమ - పెళ్ళిలోని మరో కోణాన్ని చూపిన 'మల్లెల తీరంలో సిరిమల్లె పువ్వు' (కొత్త దర్శకుడు జి.వి. రామరాజు), జనజీవన స్రవంతిలో కలుద్దామనుకొన్న నక్సలైట్ల కోణం నుంచి రాజ్యవ్యవస్థతో ఉండే చిక్కులను చూపెట్టిన 'దళం' (రామ్‌గోపాల్‌ వర్మ శిష్యుడు, కొత్త దర్శకుడు ఎం. జీవన్‌) లాంటి కొన్ని మంచి ప్రయత్నాలు ఈ ఏడాది జరిగాయి. చిన్న చిత్రాల థియేటర్ల సమస్య, రాష్ట్రంలోని అనిశ్చిత పరిస్థితుల లాంటివి వాణిజ్య విజయానికి అడ్డం పడినా, విమర్శకుల ప్రశంసలనైతే పుష్కలంగా అందుకున్నాయి. ఇక, మునుపటి పెద్ద దర్శకుల్లో పలువురు తెరపైకి రాకపోవడమో, వచ్చినా పరాజయాలే మూటకట్టుకోవడమో (పూరీ జగన్నాథ్‌ 'ఇద్దరమ్మాయిలతో..', తేజ '1000 అబద్ధాలు') జరిగింది.

'సం'గీతం - కొత్త నీటి జలపాతం
సంగీత దర్శకుల విషయానికి వస్తే, ఈ ఏడాది 'అత్తారింటికి దారేది'తో పాటు మరికొన్ని చిత్రాల హిట్‌ గీతాలతో దేవిశ్రీ ప్రసాద్‌ హల్‌చల్‌ చేశారు. గడచిన రెండు మూడేళ్ళలో తారాజువ్వలా దూసుకొచ్చిన తమన్‌ జోరు ఈసారి అంతగా కనబడలేదు. ఇక, మణిశర్మ, కీరవాణి లాంటి నిన్న మొన్నటి స్టార్‌ మ్యూజిక్‌ డైరెక్టర్ల పేర్లు అడపా దడపానే వినిపించాయి. చక్రి, ఆర్పీ పట్నాయక్‌లు కానీ, అప్పుడప్పుడొచ్చి హిట్లు అందించే మిక్కీ జె. మేయర్‌ ('సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' మినహాయింపు) కానీ వినపడింది తక్కువే.
అలాగే, బాణీలకు ఒకరు, నేపథ్య సంగీతానికి మరొకరు అనే ధోరణి కూడా ఎక్కువగానే కనిపిస్తోంది. నిన్నటి అనంత్‌ శ్రీరామ్‌ తరువాత ఇవాళ్టి గీత రచయితల్లో నవ యువకుడు శ్రీమణి ('జులాయి' పాటలు) లాంటి కొందరు ప్రచారంలోకి వచ్చారు. ఇక, ఈ ఏటి మేటి హిట్‌ పాటలంటే, 'ఆరడుగుల బుల్లెట్టు...' లాంటివి గుర్తుకొస్తాయి. 

పేర్లు గుర్తుండేటంత ప్రభావం చూపకపోయినా, అన్ని రంగాల్లో లాగానే సినీ సంగీతంలోనూ ఈ ఏడాది కొత్త ముఖాలు పెరిగాయనే చెప్పుకోవాలి. గాయనీ గాయకుల సంగతీ అంతే! కెమేరా, ఎడిటింగ్‌ విభాగాల్లోనూ చిన్న చిత్రాలతో పాటు కొత్త నీరు వచ్చింది. బ్రహ్మానందం లాంటి స్టార్‌ కమెడియన్లు ఇప్పటికీ తమ హవా కొనసాగిస్తున్నా, అందుబాటులో ఉండే కొత్త కమెడియన్ల కోసం పరిశ్రమ అన్వేషణ ఈ ఏడాది ఫలితాలిచ్చింది. 'తాగుబోతు' రమేశ్‌, ధన్‌రాజ్‌, తాజాగా సప్తగిరి ('వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌'), దామరాజు కిరీటి ('సెకండ్‌ హ్యాండ్‌') లాంటి కొందరు పాపులారిటీ తెచ్చుకున్నారు. నిన్న మొన్న దాకా బాక్సాఫీస్‌ వద్ద సందడి చేసిన స్టార్‌ హీరోయిన్ల స్థానంలో ఈ ఏడాది శ్రుతీహాసన్‌, సమంత, అమలాపాల్‌, అంజలి లాంటి నవ తరం తారలు కలకలం రేపారు. 

అనువాదాలు అంతంతే!
ఈ ఏడు అనువాద చిత్రాలు బాగానే వచ్చినా, వాటిలో ఆడినవి మాత్రం కొన్నే. గమ్మత్తేమిటంటే, డబ్బింగ్‌లకు దాదాపు రెట్టింపు సంఖ్యలో స్ట్రెయిట్‌ చిత్రాలు రావడం.
ఏడాది మొదట్లో తమిళనాట పెను వివాదం రేపిన కమలహాసన్‌ సొంత చిత్రం 'విశ్వరూపం', ఆసక్తికరంగా సాగిన 'పిజ్జా', తమిళ హీరో సూర్య నటించిన 'సింగం-2' లాంటి కొన్నే ప్రేక్షకాదరణ పొందాయి. విజరు 'అన్న', అజిత్‌ 'ఆట ఆరంభం', కార్తి 'బిరియాని' లాంటివి ఆకర్షించలేకపోయాయి. సెల్వ రాఘవన్‌ దర్శకత్వంలో అనుష్క, ఆర్య నటించిన భారీ గ్రాఫిక్స్‌ చిత్రం 'వర్ణ' నిర్మాణానికీ, రిలీజుకూ ఏళ్ళూ పూళ్ళూ పట్టింది కానీ, డబ్బాలు వెనక్కి పంపడానికి మాత్రం ప్రేక్షకులు ఏ మాత్రం ఆలస్యం చేయలేదు. ఇక, అనువాదాలుగా వచ్చిన బాలీవుడ్‌ భారీ చిత్రాలైన హృతిక్‌ రోషన్‌ 'క్రిష్‌-3', అమీర్‌ఖాన్‌ యాంటీ హీరోగా నటించిన 'ధూమ్‌-3'లు తెలుగులోనూ మంచి వసూళ్ళే రాబట్టాయి. 

మొత్తం మీద ఈ ఏడాది కొసరు తెలుగు చిత్రాల కన్నా అసలు తెలుగు చిత్రాలే ఎక్కువగా రావడం, ఆదరణ పొందడం, చిన్న చిత్రాల జోరు పెరగడం విశేషం. మునుపే అందుబాటులోకి వచ్చిన 5డి కెమేరా లాంటి పరిజ్ఞానాలు ఈ ఏడాది మరింత విస్తరించి, తక్కువ ఖర్చుతో డిజిటల్‌గా సినిమా తీసేందుకు ఉత్సాహం పెంచాయి. అలాగే, తళుకుబెళుకుల సినీ లోకంలో సక్సెస్‌ పరిమితమే అయినా, దర్శకత్వ, నిర్మాణ, నట, సాంకేతిక విభాగాల్లో కొత్త నీరు రావడం పెరుగుతోంది. ఈ ధోరణి రానున్న 2014లోనూ కొనసాగే సూచనలున్నాయి. మరి, ఇవన్నీ తెలుగు సినిమా మరో అడుగు ముందుకు వేయడానికి తోడ్పడితే అంతకన్నా ఏం కావాలి! ఎంతైనా, ఈ ఏటి అత్యంత పాపులర్‌ డైలాగ్‌ ధోరణిలో చెప్పాలంటే, ''...లాస్ట్‌ పంచ్‌ మనదైతే దాని కిక్కే వేరప్పా!'' కాదంటారా?
-   రెంటాల జయదేవ
(Published in 'Praja Sakti' daily, 29th Dec 2013, Sunday Supplement, Pg 9 to 11)
.....................................................

0 వ్యాఖ్యలు: