జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Saturday, April 26, 2014

‘‘నా తప్పేమీ లేదు. ఈ వివాదం అతని పనే!’’ - ప్రకాశ్‌రాజ్



 ‘‘ఒక మనిషిని అసభ్యంగా తిట్టడం నా ప్రవృత్తి కాదు. ‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’ (మా) ఉంది. ఏ నిర్మాతలు, ఎవరైతే నా గురించి ఫిర్యాదు ఇచ్చారో, వాళ్లని పిలిపించండి. జరిగినది మొత్తం వాళ్ల ముందే నేను వివరిస్తాను. మొత్తం విన్న తర్వాత ఎవరు తప్పు చేశారో నిర్ణయించండి’’ నటుడు, దర్శక, నిర్మాత ప్రకాశ్‌రాజ్ వాదన ఇది. శుక్రవారం నాడు మధ్యాహ్నం ఆయన ప్రత్యేకంగా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి కొద్ది రోజులుగా తన మీద వినిపిస్తున్న వివాదాలకూ, మీడియాలో వస్తున్న వార్తలకూ వివరణనిచ్చారు. తాను ఏ తప్పూ చేయలేదని చెప్పుకొచ్చారు. మహేశ్‌బాబు హీరోగా రూపొందుతున్న ‘ఆగడు’ చిత్ర షూటింగ్ సందర్భంగా దర్శకత్వ శాఖలో సూర్య అనే ఓ కో-డెరైక్టర్‌ను ప్రచురించడానికి వీలు లేని భాషలో దూషించారంటూ ప్రకాశ్ రాజ్‌పై ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే.

ఈ వివాదంపై ‘తెలుగు చలనచిత్ర దర్శకుల సంఘా’నికి సదరు కో-డెరైక్టర్ నుంచి ఫిర్యాదు అందడం, దానిపై ప్రకాశ్‌రాజ్ నుంచి వివరణ కోరుతూ ‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’ (మా)కు సంఘం లేఖ రాయడం, పది రోజుల పైనే అయినా ప్రకాశ్‌రాజ్ వివరణ రాకపోవడంతో ఆయనను సినిమాల్లోకి తీసుకోవద్దంటూ దర్శకుల సంఘానికి చెందిన ఒకరిద్దరు తమ ఆంతరంగికులకు వ్యక్తిగతంగా ఎస్.ఎం.ఎస్.లు పెట్టడం, వ్యవహారం మీడియాకు పొక్కడం.... ఇలా కొద్ది రోజులుగా ఈ వ్యవహారం చినికి చినికి గాలివాన అయింది.

 శ్రీను వైట్లతో విభేదాలు నిజమే!


 ప్రకాశ్‌రాజ్ స్వీయ దర్శకత్వంలోని సొంత సినిమా ‘ఉలవచారు బిర్యానీ’కి కూడా చిక్కులు తప్పవని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రకాశ్‌రాజ్ ఇలా విలేకరుల ముందుకు వచ్చి మాట్లాడుతూ, ‘‘ఈ అన్నిటి వెనకా ఓ వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తిని బయటకు తీసుకువస్తా. ఆ వ్యక్తి తాను చేసిన తప్పును దాచుకోవడానికీ,  తాను తప్పించుకోవడానికీ, ముగ్గురు నలుగురితో రకరకాల ఫిర్యాదులు ఇప్పించాడు. పరిశ్రమలో ఒకరి మీద మరొకరికి అపార్థాలు ఏర్పడేలా చేశాడు. ఆ వ్యక్తి ఎవరో త్వరలోనే బయటికి వస్తుంది. ఆ తర్వాత నిజమేంటో తెలుస్తుంది. అప్పటివరకు దయచేసి సినిమాని ప్రేమించే, నన్ను ప్రేమించే ప్రేక్షకులు ఊహాగానాలు నమ్మకండి’’ అని అభ్యర్థించారు.     ‘‘ ‘మా’కు వచ్చిన ఫిర్యాదులను వారు నాకు పంపిస్తే, సమాధానం ఇచ్చాను. ‘మా’కూ, దర్శకుల సంఘానికీ మధ్య ఇంకా వ్యవహారం తేలలేదు కాబట్టి, నేను బహిరంగంగా నా అభిప్రాయాన్ని తెలియజేయలేదు. కానీ, అది ఆలస్యమవుతున్న నేపథ్యంలో ‘నిషేధం’ అంటూ రకరకాల గాలివార్తలు వస్తుండడంతో ఈ సమావేశం ఏర్పాటు చేశా’’ అని ఆయన చెప్పారు.

 అయితే, తనకూ, ‘ఆగడు’ చిత్ర దర్శకుడు శ్రీను వైట్లకూ మధ్య కథాపరంగా సృజనాత్మక అంశాల్లో ‘‘కొన్ని అభిప్రాయభేదాలు వచ్చాయి’’ అని ఆయన ఒప్పుకున్నారు. ‘‘ఒకరినొకరు మాట అనుకున్నాం. కానీ, దాన్ని వక్రీకరించి ఫిర్యాదు చేశారు’’ అని ఆయన చెప్పుకొచ్చారు. ‘‘ఇప్పుడు మీరు నన్ను చెంప మీద కొడితే, నేను వెంటనే కొట్టాను. నేను కొట్టానని ఫిర్యాదు చేసినప్పుడు, ఎందుకు కొట్టానో సంబంధిత వ్యక్తులు అడగాలి కదా. నన్ను నమ్మండి. నేను ఏ తప్పూ చేయలేదు.  ‘మా’ మీద నాకు నమ్మకం ఉంది. నాకు న్యాయం జరుగుతుంది’’ అని అన్నారు.

 నా వివరణ కూడా వినాలిగా!


 ‘ఆగడు’ షూటింగ్‌లో ప్రకాశ్‌రాజ్ ఓ రోజు పాల్గొని, ఆ తర్వాత గైర్హాజరయ్యారనీ, దాంతో ఆయన స్థానంలో దర్శక - నిర్మాతలు సోనూ సూద్‌ను తీసుకున్నారనీ తెలిసిందే. ప్రకాశ్‌రాజ్ దానికి కూడా వివరణనిస్తూ, ‘‘ ‘ఆగడు’ సినిమా నేను అంగీకరించిన విషయం నిజమే. మొదటి రోజు షూటింగ్‌లో పాల్గొని, నా మీద తీసిన అన్ని సన్నివేశాల్లో నటించాను. ఆ తర్వాత కొన్ని అభిప్రాయభేదాల కారణంగా నన్ను కాదనుకొని వేరే నటుణ్ణి తీసుకున్నారు. ఏ నటుడైనా తనకు కావాల్సినట్లుగా నటించకపోతే ఏ దర్శకుడికైనా వేరే నటుణ్ణి ఎంచుకునే స్వేచ్ఛ ఉంది. అది నేను ఒప్పుకుంటాను. కానీ, అంతటితో ఆగకుండా దర్శకుల సంఘానికి ఫిర్యాదు చేయడం, నా మీద చర్య తీసుకోవాలని అనుకోవడం బాధాకరం’’అన్నారు. ‘‘ఇరవై ముప్ఫయేళ్లుగా పరిశ్రమలో ఉంటున్నాను కాబట్టి, ఒక  ఫిర్యాదు వచ్చినప్పుడు నా అభిప్రాయం తెలుసుకోవాల్సిన అవసరం సదరు అసోసియేషన్‌కి ఉంటుంది. తప్పొప్పులను చెప్పుకునే హక్కు నాకుంటుంది. నా వివరణ కూడా విన్న తర్వాత ఎవరు తప్పో, ఎవరు కరెక్టో నిర్ణయించుకోవాలి. కానీ, చాలా ఆవేశంగా ఇచ్చిన ఓ ఫిర్యాదుని నమ్మి, నాకు సహాయ నిరాకరణ చేయాలని ఎస్‌ఎమ్‌ఎస్‌లు పంపించడం బాధ కలిగించింది’’ అని గతంలో కూడా అనేక వివాదాలకు కేంద్రబిందువైన ప్రకాశ్‌రాజ్ అభిప్రాయపడ్డారు.


 మీద విసిరిన రాళ్ళతో ఇళ్ళు కట్టేస్తా!

 ‘‘ఈ రోజు నేను మీ ముందు ఉన్నానంటే నా చదువో, అవగాహనో, ప్రతిభో కారణం కాదు. ఇలా చెప్పడానికి నేనే మాత్రం సిగ్గుపడటంలేదు. దర్శకులు, రచయితలు, నిర్మాతలే కారణం. నేను సినిమా కన్నా పెద్దవాణ్ణి కాదు. నా వివరణ తెలుసుకోకుండా ‘వీడు కచ్చితంగా తప్పు చేసి ఉంటాడని’ అని నమ్మడం మాత్రం బాధగా ఉంది’’ అన్న ప్రకాశ్‌రాజ్ ‘‘ముక్కుసూటిగా మాట్లాడటంవల్ల ఇబ్బందులపాలయ్యాను. నేను చూసినన్ని నిషేధాలు ఎవరూ చూసి ఉండరు.  నా ఇంటి పేరు వివాదం’’ అని నవ్వేశారు. ‘‘నన్ను రాళ్లతో కొట్టకు... పట్టుకుని ఇళ్లు కట్టేస్తా! నన్ను కాల్చేయాలని నిప్పు పెట్టకు... ఇంటికి దీపం చేసుకుంటా! నన్ను ఇండస్ట్రీ నుంచి తరిమేయాలనుకోకు... నేను చేరాల్సిన చోటుకు త్వరగా చేరిపోతా! దయచేసి చెబుతున్నా నన్ను చంపాలని విషం పెట్టకు... మింగి, నీలకంఠుణ్ణి అయిపోతా!’’ అంటూ కవితాత్మక ధోరణిని ప్రదర్శించారు.  

‘‘ఫిర్యాదు ఇచ్చినవారి వివరణ, నా వివరణ విన్న తర్వాత ఎవరిది తప్పు అనేది కమిటీ నిర్ణయిస్తుంది.  కొంత విరామం తర్వాత ‘ఉలవచారు బిర్యానీ’ అనే సినిమాకి దర్శకత్వం వహిస్తున్నా. ఆ సినిమా తాలూకు పనులను ఎంతో ప్రశాంతంగా చేసుకుంటున్నా. ఈ సమయంలో ఇలా వివాదం రావడం నన్ను డిస్ట్రబ్ చేస్తోంది. కొన్నిరోజులు ఓపిక పట్టండి. నిజమేంటో బయటికొస్తుంది’’ అని ముక్తాయించిన ప్రకాశ్ రాజ్ ఈ వివాదానికి కారణమైన వ్యక్తి పేరును వెల్లడించడానికి సుముఖత చూపలేదు. ఈ నెల 28న వివిధ సంఘాల ప్రతినిధులతో కూడిన ‘సమన్వయ సంఘం’ సమావేశంలో ఈ వివాదం తేలనుంది.కాగా, మీడియా ముందు తాను చెప్పదలుచుకున్నదేదో చెప్పేసిన ప్రకాశ్‌రాజ్ విలేకరులు అడిగే ప్రశ్నలకు మాత్రం అవకాశమివ్వకుండా గబగబా వెళ్లిపోవడం విచిత్రం

..........................

‘‘ప్రకాశ్‌రాజ్ అనుచిత వ్యాఖ్యల విషయమై కోడెరైక్టర్ సూర్య రెండు వారాల క్రితం దర్శకుల సంఘానికి ఫిర్యాదు చేశారు. దీనిపై వివరణ కోరమని మేం నటీనటుల సంఘానికి లేఖ రాశాం. నిన్ననే ‘మా’ నుంచి ప్రతిస్పందన వచ్చింది. ఈ నెల 28న జరిగే కోఆర్డినేషన్ మీటింగ్‌లో ఇరువురి వాదనల విన్నాక నిర్ణయం వెలువడుతుంది. అంతేకానీ మేం ప్రకాశ్‌రాజ్‌పై నిషేధం విధించాల్సిందిగా అడిగామనడం అబద్ధం. నిషేధం మా పని కాదు. పరిశ్రమ అంతా కలిసి తీసుకోవాల్సిన నిర్ణయం అది’’.

 - వీరశంకర్, దర్శకుల సంఘం అధ్యక్షులు

.....................

(Published in 'Sakshi' daily, 26th April 2014, Sat)

0 వ్యాఖ్యలు: