(చికాగో సభ లో స్వామి వివేకానంద)
ఎటుచూసినా అవినీతి, అక్రమాలు తాండవిస్తున్న ప్రస్తుత తరుణంలో నవ తరానికి స్ఫూర్తి ప్రదాతలు కరవయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా భారతీయ యువతరానికి కొన్ని దశాబ్దాలుగా నిరంతరం స్ఫూర్తినిస్తున్న మహోన్నతుడు - స్వామి వివేకానంద. మహాసమాధి చెంది నూరేళ్ళు దాటినా, ఆయన ఇప్పటికీ చెరగని ప్రేరణ నిస్తున్నారు. ఈ నిరంతర చైతన్య దీప్తి ప్రబోధాలను చదివినా, విన్నా సరికొత్త ప్రేరణ కలగడం తరతరాలుగా కొన్ని కోట్ల మందికి అనుభవైకవేద్యం. పరోక్షంగానే ఇంతటి ప్రభావం చూపుతున్న వివేకానందుణ్ణి ప్రత్యక్షంగా చూస్తే.... కనీసం ఆయన ధీర గంభీర ప్రబోధాన్ని ఆయన గొంతులోనే వింటే.... ఆ అనుభవాన్ని మాటల్లో చెప్పలేం.
స్వామి వివేకానంద స్వరం ఇటీవల ఇంటర్ నెట్లో మెయిల్స్ రూపంలో ప్రచారంలో ఉంది. 1893లో చికాగోలో జరిగిన ప్రపంచ సర్వమత సమ్మేళనంలో ....సోదర సోదరీమణులారా.... అంటూ స్వామీజీ చేసిన ప్రసంగం, ఆ సంబోధనతోనే సభికులందరూ ఆగకుండా కరతాళ ధ్వనులు చేయడం అందరికీ తెలిసిన విషయాలే. సరిగ్గా ఆ ప్రసంగమేనంటూ ఇప్పుడు మెయిల్సు వస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా రామకృష్ణ ఉద్యమానికి చెందిన భక్తులు, వివేకానంద భక్తులు ఈ మెయిల్స్ చూశారు. అందులో స్వామీజీ స్వరం విన్నారు. మరి, ఆ గొంతు స్వామి వివేకానందునిదేనా అన్నది ప్రశ్న.
దీని మీద ఇటీవల ఎంతో చర్చ జరిగింది. రామకృష్ణ - వివేకానంద భక్తులు ఒకరు దీని మీద ఏకంగా లోతైన పరిశోధనే జరిపారు. నిజానిజాల నిగ్గుతేల్చారు.
1893 సెప్టెంబరు 11న చికాగోలో విశ్వమత సమ్మేళనం జరిగింది. భారతదేశం నుంచి ఓ స్వతంత్ర ప్రతినిధిగా వివేకానంద దానికి హాజరయ్యారు. నిజానికి, అప్పుడు స్వామీజీ ఆ ప్రసంగం చేసే నాటికి ఇప్పటి లాగా ఆడియో రికార్డింగు వసతులు లేవు. రామకృష్ణ మఠం భక్తులైన బెంగుళూరుకు చెందిన ఎం.ఎస్. నంజుండయ్య అది గమనించి, ప్రస్తుతం నెట్ లో ప్రచారంలో ఉన్న ఆడియో క్లిప్పింగుల పూర్వాపరాల్ని లోతుగా పరిశీలించారు. అమెరికాలోని వాషింగ్టన్ డి.సి.లో ప్రపంచ బ్యాంకులో దాదాపు 16 ఏళ్ళు పనిచేసి, ఉన్నత హోదాలు నిర్వహించిన ఆయన, అసలు 1893లో స్వామీజీ రికార్డింగులు ఏమైనా జరిగాయా అని విచారించారు. చికాగోలోని వివేకానంద వేదాంత సొసైటీకి చెందిన స్వామి చిదానంద ఈ విషయంపై విచారణలు జరిపి, అలాంటివేమీ జరగలేదని నంజుండయ్యకు తెలిపారు. అటుపైన సెయింట్ లూయీస్ లోని వేదాంత సొసైటీకి చెందిన స్వామి చేతనానంద సైతం ఈ విషయంపై తదుపరి విచారణ జరిపారు. చికాగో హిస్టారికల్ సొసైటీ (ఆర్కైవ్స్ అండ్ మ్యాన్యుస్క్రిప్ట్స్)తోనూ, వారి సలహా మేరకు లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ తోనూ వివరాలు కనుక్కున్నారు. ఆ విచారణలో సైతం ఇలాంటి రికార్డింగులేవీ జరగలేదని తేలింది.
స్వామి వివేకానంద జరిపిన పాశ్చాత్య దేశాల సందర్శనలపై పరిశోధనలు జరిపిన మేరీ లూయిస్ బర్క్ సైతం ఈ అంశంపై దృష్టి సారించారు. 1994 జనవరిలో ఆమె బేలూరు మఠాన్ని సందర్శించారు. ప్రస్తుతం రామకృష్ణ మఠం - మిషన్ల ప్రధాన కార్యదర్శి అయిన స్వామి ప్రభానందజీతో భేటీ అయ్యారు. అప్పుడు ఆమె కూడా ఇదే విధమైన అభిప్రాయం వెలిబుచ్చారు. ఆ నిర్ణీత కాలం నాటి అమెరికా చరిత్రపై ప్రత్యేక కృషి జరిపిన మరో ఇద్దరు చరిత్రకారుల అభిప్రాయమే కాక, తన సొంత పరిశోధనల ప్రకారం కూడా విశ్వమత సభలో స్వామి వివేకానంద ఇచ్చిన ఉపన్యాసం రికార్డింగు జరగలేదని ఆమె వివరించారు.
అయితే, నంజుండయ్య అంతటితో సంతృప్తి పడలేదు. చికాగో హిస్టారికల్ సొసైటీకి చెందిన పరిశోధక విభాగంతోనూ, చికాగోలోని ఆర్ట్ ఇన్ స్టిట్యూట్ ఆర్కైవ్స్ తోనూ ఈ -మెయిల్ ద్వారా నేరుగా ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపారు. అలాంటి రికార్డులేవీ లేవని ఆ సంస్థలు తెలిపాయి. అసలు ఆ విశ్వ మత సమ్మేళన సమయంలో ఎలాంటి వాయిస్ రికార్డింగులూ జరగనేలేదని ఆర్ట్ ఇన్ స్టిట్యూట్ ఆర్కైవ్స్ తెగేసి చెప్పింది.
ఆ మాటకొస్తే అప్పట్లో అందుబాటులో ఉన్న రికార్డింగ్ సాంకేతిక పరిజ్ఞానం కూడా అంతంత మాత్రమే. 1893 నాటికి అమెరికాలో ఎవరి గొంతైనా రికార్డు చేయాలంటే, ఆ మనిషి మాట్లాడుతున్న మాటల తాలూకు ప్రకంపనాలను తిరిగే స్తూపాకారపు వాటి మీదే నమోదు చేసేవారు. తిరిగే ఆ సిలిండర్లు సైతం 2 నుంచి 3 నిమిషాల పాటే రికార్డు చేయగలిగేవి. కాబట్టి దీర్ఘమైన స్వామీజీ ప్రసంగాన్ని రికార్డు చేయగలిగే అవకాశమే లేదు.
మరో సంగతి ఏమిటంటే, అప్పట్లో స్టూడియోల్లో రికార్డు చేయడానికి సైతం ఎంతో అవస్థ పడాల్సి వచ్చేది. ఇక, స్టూడియోలో కాకుండా బయట రికార్డు చేయడమనేది కలలో కూడా కుదరని పని. వీటన్నిటి దృష్ట్యా వివేకానందుని ఉపన్యాసం రికార్డయ్యే అవకాశం లేదని నంజుండయ్య తేల్చారు.
ఇక, ఇప్పుడు నెట్లో వినిపిస్తున్న ఆడియోలో వివేకానంద స్వామి చికాగోలో చేసిన తొలి ప్రసంగమే కాక, ఇతర ప్రసంగాలు కూడా ఉన్నాయి. అవన్నీ కలసి చాలా నిమిషాలున్నాయి. అప్పట్లో అంతంత సేపు రికార్డు చేసే వీలే లేదు.
అంతేకాకుండా, ఆ రికార్డింగులో ఓ మహిళ, వివేకానంద స్వామిని సభకు పరిచయం చేస్తున్నట్లు వినిపిస్తోంది. నిజానికి, చికాగో సభలో స్వామీజీని సభకు పరిచయం చేసింది - డాక్టర్ బారోస్ అనే పురుషుడు. మద్రాసుకు చెందిన అలసింగ పెరుమాళ్ అనే భక్తుడికి 1893 నవంబరు 2న వివేకానందే స్వయంగా లేఖ రాస్తూ, బారోస్ తనను సభకు పరిచయం చేసిన సంగతి చెప్పారు. దీన్నిబట్టి కూడా నెట్లో ఉన్నది తప్పని తేలుతోంది.
అలాగే, స్వామి వివేకానంద, ...సోదర సోదరీమణులారా... అని సంబోధించినప్పుడు రెండు నిమిషాల పాటు సభాంగణం చప్పట్లతో దద్దరిల్లింది. కానీ, నెట్లో ప్రచారంలో ఉన్న ఆడియోలో ఆ హర్షధ్వానాలు కొద్ది సెకన్లే ఉన్నాయి. పైపెచ్చు, ఆ నాటి ఎడిసన్ సిలిండర్ రికార్డింగులను ఇన్నేళ్ళ తరువాత పునరుద్ధరించినా, అందులో కీచు కీచు శబ్దాలు వినిపిస్తాయి. ఒకవేళ ఆ శబ్దాన్ని తొలగించాలని ప్రయత్నిస్తే, రికార్డయిన మాట దెబ్బ తింటుంది. కానీ, నెట్లోని స్వరం ఈ శబ్దాలేమీ లేకుండా సుస్పష్టంగా ఉంది. వీటన్నిటిని బట్టి నెట్లో ప్రచారంలో ఉన్నది ప్రామాణికమైన రికార్డింగు కాదని తేలిపోతోంది.
వివేకానందుని వాణి అంటూ ఎవరిదో గొంతు వినిపించి, జనాన్ని మోసగించడానికి కొందరు చేసిన కుట్ర ఇది. దీన్నిబట్టి, కనిపించేది, వినిపించేదంతా నిజమని అనుకోకూడదని తేలుతోంది. నెట్లో చేసే మాయకు ఇది ఓ తాజా ఉదాహరణ. తస్మాత్ జాగ్రత్త.
4 వ్యాఖ్యలు:
Good info. Thanks for letting us know.
నేనూ మొదట్లో ఈ ఆడియో విని అలాగే బోల్తా పడ్డా..అంతటి మహనీయుడైన వ్యక్తి స్వరం విన్నందుకు నేను అదృష్టవంతుణ్ణి అనుకున్నా. తర్వాత తెలిసింది ఆ గొంతు స్వామివారిది కాదు అని. కానీ ఆ గొంతు ఎవరిదో కానీ సాధికారత ఉంది.
Gud information given...keep it up..
@ లక్ష్మీనారాయణ సునీల్ వైద్యభూషణ గారూ, థ్యాంక్యూ.
@ గణేశ్ గారూ, కృతజ్ఞతలు.
@ ఇనగంటి రవిచంద్ర గారూ, నమస్తే. చాలా మంది ఆ ఆడియో విని అది స్వామి వివేకానంద గొంతు అని భ్రమ పడుతున్నారన్న మాట నిజం. అందుకే, నాకు తెలిసిన సమాచారాన్ని అందరితో పంచుకొని, ఆ భ్రమ తొలగించడానికే ఈ టపా రాశాను. కృతజ్ఞతలు.
Post a Comment