జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Friday, August 13, 2010

మహా బోరు శీను!

రవితేజ సినిమా అంటే కాసేపు కాలక్షేపం గ్యారెంటీ అనుకొనే జనం చాలా మందే ఉన్నారు. అలా తెగే టికెట్ల మినిమమ్ గ్యారెంటీ చూసుకొనే - నిర్మాతలు రవితేజతో సినిమాకు ఉత్సాహం చూపిస్తుంటారు. బాల్కనీ నుంచి నేల దాకా ప్రతి తరగతి ప్రేక్షకుడిలోనూ అంతర్గతంగా ఉండే మాస్ లక్షణాన్ని ఆధారంగా చేసుకొనే రవితేజ చిత్రాల కథలల్లుతుంటారు. అందుకే, ‘ఏ’ నుంచి ‘సి’ దాకా అన్ని సెంటర్లలో రవితేజ చిత్రాలకు కనబడని క్రేజు.

అల్లరి చిల్లరిగా తిరిగే జులాయి తరహా కుర్రాడి పాత్రచిత్రణ రవితేజ బాడీ లాంగ్వేజ్ కు సరిపోతూ వచ్చింది. అందుకే, ఆయన సినిమాలన్నీ ఆ పద్ధతిలోనే సాగుతున్నాయి. అయితే, ఎల్లకాలమూ అదే మంత్రం పనిచేస్తుందని అనుకోవడానికి వీలు లేదు. దానికి తగిన కథ, కథనం లేకపోతే, ఆ పాచిక పారదు. అలాంటి పారని పాచికకు ఉదాహరణ - తాజా ‘డాన్ శీను.’

ఈ సినిమా ఓ పెద్ద కథ. మలుపు మీద మలుపుతో ఓ దశ దాటాక ప్రేక్షకుడికి చీకాకు తెప్పించే సుదీర్ఘమైన కథ. స్థూలంగా ఏమిటంటే - డాక్టరో, యాక్టరో కావాలనుకొనే వాళ్ళకు భిన్నమైన వాడు శీను. ‘డాన్’ కావాలన్నది చిన్నప్పటి నుంచి శీను ఆశ, ఆశయం. అమితాబ్ బచ్చన్ కు వీరాభిమాని అయిన శీను పెద్దయ్యాక నగరానికి వస్తాడు. నగరంలోని ఇద్దరు పెద్ద ముఠా నాయకులైన మాచిరాజు (శాయాజీ శిందే), నర్సింగ్ (శ్రీహరి)లలో ఎవరో ఒకరి దృష్టిని ఆకర్షించి, వాళ్ళలో ఏదో ఒక గ్రూపులో చేరాలనుకుంటాడు. ఆ క్రమంలో మాచిరాజు దగ్గర చేరతాడు.

విరోధి అయిన నర్సింగ్ ను దెబ్బతీయడానికి శీనూని జర్మనీకి పంపిస్తాడు మాచిరాజు. జర్మనీలో ఉన్న నర్సింగ్ చెల్లెల్ని శీనుతో ప్రేమలో పడేయించి, ఆ రకంగా నర్సింగ్ ను దెబ్బ తీయాలన్నది మాచిరాజు ప్లాను. అలా అక్కడ జర్మనీలో దీప్తి (శ్రియ)ను ప్రేమలో పడేయడానికి హీరో చేసే నానారకాల చేష్టలతో ఫస్టాఫ్ కాస్తంత వినోదాత్మకంగా గడిచిపోతుంది. తీరా, ఆమెతో అతను తిరిగొచ్చేసరికి ఆమె జర్మనీలోనే ఉండి చదువుకుంటున్న మాచిరాజు చెల్లెలని తెలుస్తుంది. అక్కడికి ఇంటర్వెల్.

ఆ తరువాత నుంచి కథ బోలెడన్ని మలుపులు తిరుగుతుంది. అటు మాచిరాజుతోనూ, ఇటు నర్సింగ్ తోనూ దోస్తీగా ఉంటూ, హీరో వారిని బోల్తా కొట్టిస్తుంటాడు. దుబాయ్ లో ఉండే బడా పారిశ్రామికవేత్త దుగ్గల్ (మహేశ్ మంజ్రేకర్), అతని విలన్ కొడుకుల కథ మరొకటి సమాంతరంగా నడుస్తుంటుంది. ఇంతకీ అసలు ఈ మాచిరాజు, నర్సింగ్ ల దగ్గరకు హీరో ఎందుకు వచ్చాడన్నది మరో బ్లాక్ అండ్ వైట్ సినిమా కష్టాల ఫ్లాష్ బ్యాక్. చివరకు దుగ్గల్ వగైరా విలన్లపై హీరో చేసే క్లైమాక్స్ ఫైటుతో కథ కంచికి... మనం ఇళ్ళకి...

టామ్ అండ్ జెర్రీ కార్టూన్ పాత్రల తరహాలో ఒకరిని మరొకరు వెంటాడి, వినోదభరితంగా కష్టపెట్టే పాత్రచిత్రణ హిట్టయింది కదా అని ప్రతిసారీ ఆ దోవే తొక్కితే కష్టమే. గతంలో ఇదే రవితేజతో ‘కిక్’ సినిమా తీసిన ఆర్.ఆర్. మూవీ మేకర్స్ అధినేత అయిన నిర్మాత వెంకట్ అనుకోకుండా ఆదరణకు నోచుకున్న ఆ సినిమాను ప్రాతిపదికగా చేసుకొని, రెండోసారి ఈ గందరగోళ కథను తెరకెక్కించారు. కోన వెంకట్ రచన చేసిన ఈ సినిమాలో ‘ఢీ’, ‘రెఢీ’ లాంటి ఆయన గత చిత్రాలు సహా అనేక ఇతర సినిమాల ఛాయలు ఇట్టే తెలిసిపోతుంటాయి. డాన్ సొంత చెల్లెల్ని అతనికి తెలియకుండా ప్రేమలో పెట్టడం లాంటివి అక్కడ చూసేసినవే.

ఇలాంటి పాత్రలు, రవితేజ వాటిని పోషించే తీరు ఇప్పటికి కొన్ని పదులసార్లు తెరపైకి వచ్చేసినవే. నిజజీవితంలో కూడా అమితాబ్ వీరాభిమాని అయిన రవితేజ ఆ తరహా స్టెప్పులు వేస్తున్నప్పుడు ఒడ్డూ పొడుగుతో అమితాబ్ ను గుర్తుకు తెస్తారు. ఈ సినిమా నుంచి ‘మాస్ రాజా’ అంటూ కొత్త పట్టంతో కనిపించిన రవితేజ ఆ మాట నిలబెట్టుకోవాలంటే, కథల ఎంపికలో కొంత శ్రద్ధ వహించక తప్పదు. మొనాటనీని బ్రేక్ చేయకా తప్పదు.

చాలా రోజుల తరువాత తెలుగు తెరపై మెరిసిన శ్రియ - అందంలో, ఆకర్షణలో పాత మెరుపును కోల్పోయారు. జానా బెత్తెడు దుస్తుల్లో, పెట్టుడు అందాలతో ఎంత ఒళ్ళు ఊపినా లాభం లేకపోయింది. తెరపై రవితేజనే కాదు, తెర ముందున్న ప్రేక్షకుల్ని కూడా ఇంప్రెస్ చేయడానికి శ్రియ చిన్న చిన్న చెడ్డీలతో, ఊపుకొంటూ డ్యాన్సులు చేశారు. అయినా సరే, కొన్నిచోట్ల శ్రియ కన్నా రెండో హీరోయిన్ అంజనా సుఖానీ (శ్రీహరి చెల్లెలు పాత్రధారిణి) మెరుగని ఫీలైతే, అందులో ప్రేక్షకుల తప్పేమీ లేదు. హాస్యం కోసం అబద్ధపు గుడ్డివాడు పిత్రేగా వేణుమాధవ్, సినిమా చివరలో వచ్చే అప్ డేట్ల విశ్వాస్ గా బ్రహ్మానందం పాత్రలను సృష్టించారు. ఇలా సినిమా నిండా జనమైతే ఉన్నారు కానీ, జనం మెచ్చే పాత్రలు, పాత్రపోషణలు కనిపించవు.

హీరోయిజాన్ని పెంచి చూపే తాపత్రయంలో నుంచి వచ్చిన ‘‘...ఒంటి పేరు శీను, ఇంటి పేరు డాను, అమితాబ్ బచ్చన్ కు చాలా పెద్ద ఫ్యాను...’’ లాంటి డైలాగులు కొన్నిచోట్ల మాస్ తో ఈలలు వేయించవచ్చు. అలాగే, ‘‘....ఉచ్చ పోసే ప్రతోడూ మొగోడు కాదు. ఉచ్చ పోయించెటోడు మగోడు...’’ (హీరో గురించి శ్రీహరి) లాంటి అనర్ఘ రత్నాలు కూడా విని తరించవచ్చు. అలీ, రవితేజల మాటల్లో, చేష్టల్లో కావాల్సినంత ద్వంద్వార్థాలు పలికించారు. ఇదే వినోదం అనుకుంటే, మన వాళ్ళ అభిరుచికి సిగ్గుపడాలి.

పాటల్లోని మాటలు కూడా (దీన్ని సాహిత్యం అంటే మహాపాపం) ఇందుకేమీ తీసిపోలేదు. ‘‘....అందమేమో ఇస్తరాకు, మడత చూస్తే మామిడాకు, తడిమి చూస్తే తామరాకు... లంగరేసి లాగమాకు.....’’ అనేది నాయికా నాయకుల మధ్య ప్రణయగీతం. మరో పాటలో ‘‘....బలుపుగాడు...., ....ప్రేమంటే పెంట....’’ లాంటి మాటలు వినిపిస్తాయి. ఇదీ నేటి తెలుగు సినిమా పాట. మణిశర్మ సంగీతంలో గుర్తుండే బాణీ కానీ, పాట కానీ ఒక్కటైనా ఉంటే ఒట్టు.

విదేశీ అందాలను చూపడంలో సమీర్ రెడ్డి ఛాయాగ్రహణం ఓ.కె. సినిమా చివరలో వచ్చే ‘‘....రాజ రాజా రవి తేజా తేజా...’’ పాటకు వేసిన సెట్టు, వాడిన కాస్ట్యూములు ఆకట్టుకుంటాయి. దర్శకుడు గోపీచంద్ మలినేనికి ఇదే తొలి చిత్రం. గతంలో ఇ.వి.వి. సత్యనారాయణ, శీను వైట్ల లాంటి పలువురి దగ్గర పనిచేసిన ఈయన పది కథలతో ఒక కథను వండే పని మానేసి, తనదైన శైలి కోసం ప్రయత్నించడం ఆయనకూ, ప్రేక్షకులకూ కూడా మంచిది.

వెరసి సుదీర్ఘంగా సాగిన భావన కలిగించే డాన్ శీను ఫస్టాఫ్ వరకు కొంత ఫరవాలేదనిపించినా, సెకండాఫ్ మాత్రం పరమ బోర్. ‘‘.....ఇంకా ‘తెర’ వాలదేమి...ఈ చీకటి విడిపోదేమీ....’’ అనుకుంటూ అసహనంగా సినిమా చూడాల్సి వస్తుంది. రవితేజ తరహా జులాయి పాత్రల చిత్రీకరణలోని వినోదాన్ని ఆస్వాదించేవారు సైతం ఈ చిత్రంలోని లెక్కలేనన్ని అనవసర మలుపుల గందరగోళాన్ని ఏ మేరకు భరించగలరో అనుమానమే.

3 వ్యాఖ్యలు: