జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Friday, January 14, 2011

పండగకు ‘పరమ వీర చక్ర’కు వెళ్ళండి! పగలబడి నవ్వండి!!

(.. వినోదం కోసం పరమ వీర చక్ర - పార్ట్ 2)

ఆఫీసులో మంచి హడావిడిలో ఉండగా, నిన్న మధ్యాహ్నం ఓ మెసేజ్ వచ్చింది. ఊళ్ళోకి ‘పరమవీర చక్ర’ వచ్చిందనీ, ఈ ఒక్క రోజే ఫలానా హాలులో అనీ. ఆలసించిన ఆశాభంగం అన్న ఈ ఆకర్షణీయమైన ఆఫర్ చూసి, ఎప్పటిలానే సినిమా పిచ్చోళ్ళం టెంప్ట్ అయ్యాం. పోలో మంటూ రాత్రి పొద్దుపోయాక, సెకండ్ షోకి వెళ్ళాం.

కథ, కథనం

రాత్రి 10 గంటలు దాటాక సినిమా మొదలయ్యే వేళకే బాల్కనీ ఫుల్లు. టైటిల్స్ అవుతూనే ఓ చిన్న జర్క్. ఎప్పుడో చిన్నప్పుడు చూసిన ఎన్టీయార్ ‘బొబ్బిలిపులి’లో ఒకటి రెండు ఘట్టాలు తెరపై కనిపించేసరికి... ఒకటే అరుపులు, ఈలలు, గోల. అప్పటి ఎన్టీయార్ దృశ్యాలకు ఇప్పటి గర్భవతి జయసుధ దృశ్యాలకూ అతకని గ్రాఫిక్స్ తో కథ మొదలవుతుంది. (చిన్న ఎన్టీయార్ యమదొంగ, బృందావనం లాంటి సినిమాల్లో ఇప్పటికే ఇలాంటి సీన్లు చూసేసి, మిమిక్రీ వాళ్ళతో చెప్పించిన అతకని పెద్ద ఎన్టీయార్ కొత్త డైలాగులు చూసి, మనం ముక్కు చీదుకున్న సంగతి గుర్తుంది కదా. ఇప్పుడు ఆ గోరుచుట్టుపై ఇది రోకటి పోటు).

ఆ సీన్ అవగానే రావణబ్రహ్మ గెటప్ లో బాలయ్య ప్రత్యక్షం. నాటకాల ఫక్కీ సినిమా షూటింగ్ సీన్ తో కథ మొదలు. నిజ జీవితంలో ఓ పెద్ద సినిమా హీరో - చక్రధర్ (బాలకృష్ణ). ఇక, ఆ హీరో వేసే రావణబ్రహ్మ గెటప్, కార్మిక నాయకుడి గెటప్, కొమరం భీమ్ గెటప్ లలో సినిమా ఇంచ్ కూడా ముందుకు కదలకుండా ఓ ముప్పావు గంట గడిచిపోతుంది. సినిమాకు ఓ కథ చెప్పి, ఒప్పించడం కోసం ఓ ఆర్మీ ఆఫీసర్ జితేంద్ర (మురళీమోహన్) మాటి మాటికీ వస్తుంటాడు.

ఓ ఆర్మీ అధికారి కథ అది. ఆ పాత్ర స్వరూప స్వభావాలు మాత్రం చెప్పి, మిగిలిన కథను చెప్పడం కాదు, నేరుగా చూపిస్తానంటూ మన హీరోను హెలికాప్టర్ లో హిమాచల్ ప్రదేశ్ కు తీసుకువెళతారు. అక్కడ ఓ మంచు గుహలోకి తీసుకెళ్ళిన సైనిక అధికారులతో ...కథ అన్నారు, సినిమా అన్నారు. ఇక్కడకు తెచ్చారేమిటి... అంటూ హీరో చక్రధర్ అడుగుతాడు. సరిగ్గా అదే డైలాగులతో మనసులో మధనపడుతున్న ప్రేక్షకులకు ఎంతోసేపటిగా ఎదురుచూస్తున్న ఇంటర్వెల్ అప్పటికి లభిస్తుంది. బతుకు జీవుడా అంటూ కాసేపు బయటకెళ్ళి ఊపిరి పీల్చుకొనే వీలు కలుగుతుంది.

ఆ మంచుగుహలో మంచం మీద అచేతనంగా పడి ఉన్న సైనికాధికారి మేజర్ జయసింహ (మళ్ళీ బాలకృష్ణే) కనిపిస్తాడు. అచ్చం తనకు జిరాక్స్ కాపీలా ఉన్న అతణ్ణి చూసి, హీరో చక్రధర్ గతుక్కుమంటాడు. అప్పటి దాకా వాళ్ళు చెప్పిన ఆర్మీ అధికారి కథ సినిమా స్క్రిప్టు కాదనీ, నిజజీవిత గాథ అనీ తెలుసుకుంటాడు. ఆ ఆర్మీ అధికారి అలా అచేతనంగా పడి ఉన్నాడెందుకన్నది ఫ్లాష్ బ్యాక్. ఆ కథలో అంతర్భాగంగా సినీ హీరోను ఇక్కడకు ఎందుకు తెచ్చారన్నది ఓ ట్విస్టు. చివరకు ఆర్మీ అధికారి కర్తవ్యాన్ని హీరో ఎలా పూర్తి చేశాడు, ఏం చేశాడన్నది - మిగతా కథ. కొడుకు సినిమా హీరో కావడం ఏ మాత్రం ఇష్టం లేని తల్లి (జయసుధ), ఆమె మొదటి సీనులో పెద్ద ఎన్టీయార్ తో కనిపించిన దానికీ, సినిమా ఆఖరి సీనుకీ ముడిపెట్టడంతో దాదాపు మూడు గంటల తెరపై నాటకం ముగిసిపోతుంది.

హీరో చక్రధర్ ను గుడ్డిగా ప్రేమించే ఓ అభిమాని జ్యోతిక (షీలా). ఆమె అక్క హేమ (హేమ), మరదలి మీద కన్నేసే ఆమె సైంటిస్టు భర్త (బ్రహ్మానందం), రోబో చడ్డీ (ఆలీ)ల ట్రాక్ సినిమాతో సంబంధం లేకుండా స్క్రీన్ మీద మధ్య మధ్య వస్తూ పోతూ ఉంటుంది. సినిమాను 16 రీళ్ళ నిడివికి పెంచడానికీ, కాసేపు (అప)హాస్యానికే తప్ప ఈ సన్నివేశాల వల్ల పైసా ప్రయోజనం లేదు.

పులిని చూసి పెట్టుకున్న వాతలు...

అర్థం పర్థం లేని కథ, దానికి అంతకన్నా అవకతవక స్క్రీన్ ప్లే, పదే పదే అవే అరిగిపోయిన డైలాగుల కాలుష్యం - వెరసి ఈ సినిమా. సైనికాధికారి పాత్రలోనూ, ఇటు సినిమా హీరో పాత్రలోనూ బాలకృష్ణతో చాలా సందర్భాల్లో అనవసరపు అతి డైలాగులు చాలానే చెప్పించారు. చివరికొచ్చేసరికి సైనికాధికారుల కన్నా వీర విజృంభణతో ఓ సినిమా హీరో అందరినీ మట్టి కరిపించడం ఓ పెద్ద పజిల్.

ఈ సినిమాలో హీరో చక్రధర్ పాత్ర రకరకాల సినిమాల్లో నటించిందంటూ బాలకృష్ణకు ఇష్టమైన పౌరాణికాది గెటప్ లు వేయించారు. ఇందులో రావణబ్రహ్మగా నాటకాల తరహా గదతో బాలకృష్ణ చేసే నటన చూస్తే నవ్వాగదు. పెద్ద ఎన్టీయార్ తరహా పర్సనాలిటీ లేని బాలయ్య ఒంటి మీద అదుపు కోల్పోయి, పెద్ద పొట్ట, సన్న కాళ్లతో నడుస్తూ వస్తుంటే మంచి పాత్రలు సైతం పాత్రధారుల చేతుల్లో ఎలా ధ్వంసమవుతాయో తెలుసుకోవచ్చు. సీతారామ కల్యాణం చిత్రంలో రావణబ్రహ్మగా పెద్ద ఎన్టీయార్ చేసిన అభినయానికీ, దీనికీ హస్తిమశకాంతరం. పైగా ఎన్టీయార్ తన విశాలమైన శిరోభాగానికి తగ్గట్లు చేయించుకున్న కిరీటాన్ని చిన్న తల బాలయ్య పెట్టుకుంటూ ఉంటే, కిరీటం తెగ వదులుగా, తలకు మరీ పెద్దగా ఎబ్బెట్టుగా అనిపించింది. ఇక, మండోదరి పాత్రలో వేదను చూడలేం. సగం గ్రాంథికం, సగం వ్యావహారికంతో ఆ డైలాగులు సరేసరి. ఇదే ఇలా ఉంటే, బాపు దర్శకత్వంలో బాలకృష్ణ నటిస్తున్న రాబోయే ‘శ్రీరామరాజ్యం’ సినిమాను తలుచుకుంటేనే మనకు భయం పుడుతుంది.

జరుగుతున్న తెలంగాణ ఉద్యమాన్ని దృష్టిలో పెట్టుకొని, ఉద్యమకారులను మంచి చేసుకోవాలనే దురాలోచన / ధూరాలోచనతో బాలకృష్ణతో గిరిజన యోధుడు కొమరం భీమ్ గెటప్ కూడా వేయించారు. ఉన్నంతలో ఈ గెటప్ లోనే బాలకృష్ణ బాగున్నారు. అయితే, బాలకృష్ణతో ఈ గెటప్ తో అతిగా అభినయింపజేయడమే బాగా లేదు.

సినిమాలో నాయికలుగా కనిపించిన షీలా చేసిందేమీ లేదు - కనిపించినప్పుడల్లా హీరోను కామపు చూపులతో చూడడం తప్ప. ఇక, మరో హీరోయిన్ అమీషా పటేల్, విలన్ వేషంలో రజియా సుల్తానాగా వచ్చే నేహా ధూపియాలను చూస్తే మనం కనీసం పదేళ్ళ క్రితం సినిమా చూస్తున్నామో అన్న అనుమానం వస్తుంది. కనిపించకుండా పోయిన నాయికలను ఏరుకొని తెచ్చి, ఈ సినిమా చేయించిన దర్శక - నిర్మాతల ‘అభిరుచి’కి జోహార్లు.

మంత్రిగా నాగినీడు (గత ఏడాది రాజమౌళి ‘మర్యాద రామన్న’లో విలన్), ఆర్మీ ఆఫీసర్లుగా విజయకుమార్, మురళీమోహన్, కోవర్టుగా చరణ్ రాజ్ - ఇలా సినిమాలో తారాగణం చాలానే ఉంది. వాళ్ళు చేసిందీ, చేయగలిగిందీనే ఏమీ లేదు. సినిమాలో సినిమా హీరో కథను చూపడంతో, దర్శకులు కోడి రామకృష్ణ, బి. గోపాల్, సింగీతం శ్రీనివాసరావు, శ్రీను వైట్ల, బోయపాటి శ్రీను, నిర్మాతలు డి. రామానాయుడు, పరుచూరి కిరీటి, రచయిత జొన్నవిత్తుల వగైరాలందరూ వాళ్ళ వాళ్ళ నిజజీవిత పాత్రల్లోనే కనిపిస్తారు.

సిగ్గనిపించే సాంకేతిక పనితనం

సాంకేతిక విభాగాల వ్యవహారం కూడా నవ్వు తెప్పిస్తుంది. సినిమాలో దుర్వినియోగం చేసిన (ముఖ్యంగా పాటల చిత్రీకరణలో) లెన్సులను చూస్తే 2011 నాటి సినిమానా ఇది అనిపిస్తుంది. యాక్షన్ సన్నివేశాలూ అంతే. హీరో ఓ తలుపు లో నుంచి నడుచుకుంటూ వస్తుంటే చాలు, ఆ ధాటికే పక్కనే ఉన్న నాలుగు అద్దాల తలుపులలో నుంచి రౌడీలు ఎగిరి ఇటు పడుతుంటారు. హీరో ఒంటి చేత్తో వందల మందిని గిరగిరా తిప్పి అవతల పడేస్తుంటాడు. మేకప్ కూడా కొన్నిచోట్ల కృతకంగా ఉంది. బాంబు దాడిలో దెబ్బ తిన్న ఆర్మీ అధికారి గెటప్ లో బాలకృష్ణ ముఖాన్ని క్లోజప్ లో చూపించినప్పుడు, ...మేకప్ ఎవడ్రా... అంటూ అరుపులు వినిపించాయంటే, పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

ఈ సినిమాలో ఎంతోమందితో పాటలు రాయించుకున్నప్పటికీ, వారి పేర్లు వేస్తూనే, తాను కూడా పాటల వ్యవహారంలో చేతులు పెట్టి, కథ - మాటలు - పాటలు - స్క్రీన్ ప్లే - దర్శకత్వం అని దాసరి నారాయణరావు చెప్పుకున్నారు. సినిమాలో ఒక్క పాట కూడా గుర్తుండదు. మణిశర్మ బాణీలూ అంతే. పైగా, తన పాత హిట్ పాటలకు తనే కాపీ. మేజర్ బాలకృష్ణకూ, నేహా ధూపియాకూ మధ్య వచ్చే డ్రీమ్ సాంగ్ సాకీ వస్తుండగానే, ‘పోకిరి’లోని ‘ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే...’ అంటూ హాల్లో జనం ఘొల్లుమన్నారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం భావస్ఫోరకంగా పాడిన ఒకటి రెండు గీతాలు మాత్రం హాలులో వినడానికి బాగానే ఉన్నాయి.

ఈ సినిమా కోసం బాలకృష్ణను నానా కష్టపెట్టి రకరకాల స్టెప్పులు వేయించారు. కానీ, ఆ తరహా కీళ్ళవాతం స్టెప్పులతో హాలంతా ఒకటే గోల. డ్రెస్ సెన్స్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. హీరోకు అసహ్యంగా పెరిగిపోయిన కటి ప్రాంతాన్ని కప్పిపుచ్చడానికో ఏమో, ఓ డ్యూయట్లో ఏకంగా కోటు కూడా వేయించారు. అది చూస్తే సంక్రాంతి బుడబుక్కల వేషాలు గుర్తుకురావడం ఖాయం.

టెక్నాలజీ పెరిగిపోయి, డిజిటల్ ఇంటర్మీడియట్ లు, కలర్ కరెక్షన్ లూ వచ్చేసిన ఈ రోజుల్లో ఈ సినిమాలో సగం పైగా సన్నివేశాలు, దృశ్యాలు అలుక్కుపోయినట్లుగా, అస్పష్టంగా ఉన్నాయి. ఇక, రంగులన్నీ అలికేసినట్లుగా, ముదురు రంగులు తెర నిండుగా పరవడం ప్రేక్షకుడికి దెబ్బ మీద దెబ్బ.

హాలంతా సందడే సందడి

మా ఊళ్ళోని ఆ హాలులో ఒక్క రోజే ఈ సినిమా కావడంతో, బాల్కనీ అంతా జనంతో నిండిపోయింది. అయితే, సినిమా మొదలైన కాసేపటికే జనానికి విషయం అర్థమైపోయింది - తొందరపడి వచ్చి బాగా బుక్కయిపోయామని. ఇక, సినిమాలో వచ్చిన ప్రతి చెత్త సన్నివేశానికీ, డైలాగుకీ జనం హాయిగా అల్లరి చేస్తూ సినిమా చూశారు. గంట దాటే సరికి జనం భరించ లేక, ...ఒక్క బ్రేక్ ఇవ్వు బాసూ, మళ్ళీ వస్తాం... అని గేళి చేస్తూ, గోల సాగించారు. ఇంటర్వెల్ అని తెర మీద పడగానే, హాలులో... ఓ... అంటూ లాంగ్ బెల్ విన్న స్కూలు పిల్లల్లా అరిచారు. విభిన్నమైన నేపథ్యాలు, ఆలోచనలు, అభిరుచులున్న సమూహానికి ఏక కాల దృశ్య ప్రదర్శన రూపం - సినిమా అంటాం. కానీ, ఇంత ముక్త కంఠంతో జనమంతా ఏకాభిప్రాయంతో సినిమా చూసిన అనుభవం నాకు తొలిసారిగా పరమవీర చక్రలోనే కలిగింది. ప్రేక్షకులందరినీ ఒక్క తాటి మీదకు తెచ్చినందుకు ఈ చిత్ర దర్శకుణ్ణీ, హీరోనూ తప్పకుండా అభినందించాల్సిందే.

కొసమెరుపు --

అన్నట్లు ఈ సినిమాలో ‘‘నన్ను కొట్టినా చస్తావు, నేను కొట్టినా చస్తావు’’ అంటూ 15 పైగా టేకులు చెప్పే ఓ డైలాగు ఉంది. కాసేపు ఆ భాగోతం చూశాక, నాతో వచ్చిన నా సీనియర్ సహోద్యోగి ఒకాయన ఓ అద్భుతమైన డైలాగు కాయిన్ చేశారు. అది ఏమిటంటే , (బాలకృష్ణ తన సినిమాకు వచ్చిన ప్రేక్షకులతో...) ‘‘నేను సినిమా చేసినా చస్తావు, నువ్వు సినిమా చూసినా చస్తావు...’’

ఏమైనా, వీటన్నిటికి సిద్ధపడి, సినిమా చూడడం కోసం కాకుండా, సరదాగా మిత్రులతో కలసి కాలక్షేపంగా తెర మీద ఏదో చూస్తూ, కామెంట్లు చేసుకోవడానికైతే ఇటీవలి కాలంలో ఇంత మంచి సినిమా మరొకటి లేదు. అందుకే నా మాట మాత్రం ఒకటే -- పండగ అయిపోయి, సినిమా ఎత్తేసే లోగా ‘పరమ వీర చక్ర’ చూడండి. పగలబడి నవ్వుకోండి....

(బ్లాగు మిత్రులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు..)

21 వ్యాఖ్యలు:

Kalpana Rentala said...

నువ్వు ఇంత వివరంగా చెప్పాక కూడా ధైర్యం చేసి ఈ సినిమా కి ఎవరైనా వెళ్లాలా? వెళ్తారా? నేనైతే...నో వే..

Angry Bird said...

First two days Collections of ‘Parama Veera Chakra’ are as follows:
Yashoda- 19 Lakhs
NIMS- 23 Lakhs
KIMS- 23.4 lakhs
7 Hills- 25 Lakhs
APOLLO- 56 lakhs
Care- 58 lakhs
Lazarus- 62 Lakhs
Rajiv Arogya Sri- Nearly 3 Crores

* Courtesy - a hilarious rediff comment

శరత్ కాలమ్ said...

:))

Indian Minerva said...

ఈ రోజే ఈ సినిమాని చూసెయ్యాలని డిసైడైపోయాను. I mean ఇంకా బెంగుళూరులో ఆడుతూవుంటే.

Saahitya Abhimaani said...

మీరు వ్రాసిన సమీక్ష చాలా హాస్యంతో కూడి బాగున్నది. సినిమా ఎలా ఉన్నదో ఏమో కాని, మీరు వ్రాసినది బ్రహ్మానందంగా ఉన్నది, చదువుతూ ఎంజాయ్ చేసాము.

Srikanth said...

హహ. మస్త్ రాస్నావ్ భాయి. సినిమా సంగతేమో తెలీదు కాని మీరు రాసింది మాత్రం సూపరు.

May be you can consider sending this to navatarangam. Then this article can bring smiles on many more faces!

Su said...

Chala bagundi review. Chala navvukunnanu. Greatandhra lo deeniki 3 or 3.5 icharu. Bala Krishna adaragottadanta acting what a joke

జర్నో ముచ్చట్లు said...

సెబాసో జయదేవా...

ఆ సినిమా నువ్వు చెప్పినంత దరిద్రంగా ఉందో లేదో తెలీదు గానీ.. నీ రాత మాత్రం అద్భుతంగా ఉంది. బట్‌, నువ్వెంత బెదిరించినా సరే..నేను ఆ సినిమాను చూసి తీరతాను. వినోదాన్ని పొంది తీరతాను.. దట్సాల్..

విజయ్‌

Gowri Kirubanandan said...

జయదేవగారూ,
సమీక్ష చదువుతున్నంత సేపూ నవ్వు ఆపుకోలేక చచ్చాను.
ఈ సమీక్ష చదివిన తర్వాత మానవ మాత్రులు ఆ సినిమాని చూసే సాహసం చేస్తారా? చేయగలరా?

Saahitya Abhimaani said...

@Angry Bird

You are not angry but hilarious.

వేణూశ్రీకాంత్ said...

హ హ భలే రాసారు జయదేవ్ గారు పండగపూట హాయిగా నవ్వేసుకున్నాను :-)

సుజాత వేల్పూరి said...

ఈ బంపర్ ఆఫర్ ని నేను తిరస్కరిస్తున్నాను! ఎందుకంటే వచ్చేవారం దీన్ని జీ తెలుగు వాడు వేసేస్తాడుగా! ఆ మాత్రం దానికి టికెట్ డబ్బులెందుకు దండగ! ఆ హింసేదో ఇంట్లో పెట్టుకుంటే ఇష్టం లేకపోతే డబ్బు వృధా పోతుందన్న బాధ లేకుండా లేచెళ్ళిపోవచ్చు .

అసలు సినిమా కంటే మీ రివ్యూ కడుపుబ్బ నవ్వించింది. రావణ బ్రహ్మ వేషం ప్రొమోల్లో చూసే నవ్వాగలేదు. పైగా బాన పొట్ట, సన్న కాళ్ళు అవి విజువలైజ్ చేసి భయపెడుతుంటే ఇంకా చూసే ధైర్యం కూడానా!

‘నేను సినిమా చేసినా చస్తావు, నువ్వు సినిమా చూసినా చస్తావు...’’ ...కెవ్!

rangaraju said...

Rentala jayadev garu,

Balayya acting lo ati ani vrasaru.oka viewer ga adi mi opinion anukovacchu.Kani hero kati pradesam antoo yedo vaagaru.Oka film journalist vrayalsina basha kadidi.Ramcharan,Allu arjunla handsomeness gurunchi,Natana nayapaisa rakapoyina glamour to nettukostunna Nagarjuna gurunchi me reviews yekkada personal ga polede.Mi revieweraa leka sagatu Balayya hateraa..

Unknown said...

@ సుజాత గారూ, మీకు ఈ సమీక్ష నచ్చినందుకూ, మీ కామెంట్లకూ ధన్యవాదాలు. అయితే, టీవీలో వచ్చేవరకు ఆగి, డబ్బులు మిగుల్చుకుంటారన్న మాట. మరి ఆ మిగిలిన డబ్బుల్లో మాకు ఏదైనా వాటా ఇస్తారా... !!

@ శ్రీ గారూ, శంకర్ ఎస్ గారూ, కృష్ణ కిరణ్ గారూ, శివ గారూ, శరత్ కాలమ్ గారూ, యాంగ్రీ బర్డ్ గారూ, ఇండియన్ మినర్వా గారూ, శ్రీకాంత్ గారూ, గౌరీ కృపానందన్ గారూ... మీ వ్యాఖ్యలకు కృతజ్ఞతలు.

@ వేణూ శ్రీకాంత్ గారూ, పండగ పూట మీకు ఆనందం పంచగలిగినందుకు మహదానందం.

@ జర్నో ముచ్చట్లు విజయ్ కుమార్, నువ్వు ఎలాగైనా సరే ఆ సినిమా చూడదలచినందుకు భేష్. నీ ధైర్యానికి మెచ్చుకుంటున్నాను. నేను రివ్యూ రాసిన ఉద్దేశం అక్షరాలా నీ ద్వారా నెరవేరుతోందని ఆనందిస్తున్నాను. నీకు ధన్యవాదాలు. ఆల్ ది బెస్ట్.

Unknown said...

@ రంగరాజు గారూ, నమస్కారం. మీ వ్యాఖ్యకు వివరణగా ఓ టపా పెట్టాను. చూడండి. చివరిగా, కటి ప్రదేశం అనేది సభ్యమైన, సంస్కారవంతమైన మాటే. కానీ, దాని గురించి మీరు ‘వాగారు’ అంటూ రాయడం మీ సంస్కారానికి గీటురాయి. అది మీకు తెలియదని అనుకోను.

Anonymous said...

దాసరి ఆ మూసలోంచి బయటకు రాడు..బలయ్య బాబు మాత్రం ఏం చెయగలడు...ఆయన బాబయినా ఎం చేయగలడు...సినీ హీరో అంటూ నాలుగు పవర్ ఫుల్లు పాత్రల్లో చూపించేయడమన్నది ఏ కాలం నాటి ఐడియా??నాగయ్య కాలం నాటిది..మరి ఇప్పుడు ఎలా వర్కవుటు అవుద్దీ??నిజాయితీ గా మాట్లాడుకోవాలంటే ....... కొంత మంది హీరోల సినిమాలు ఏదో గజ్జి తో చూస్తారు గానీ మామూలుగా అలాంటి సినీమాలు మానవ మాత్రుడు చూడగలడా

chinni said...

deeni kosam rendu postulu avasarama..
neeku rayataniki emi dorikinattu ledu..

Kathi Mahesh Kumar said...

:) :) :)

Sujata M said...

Sujata garu .. TV lo choostara ? kevvvvv.....!

Jayadev garu, miku sankranti subhakankshalu.

రవి said...

ఈ సినిమాకు నేషనల్ అవార్డు వస్తుందని ఈ రోజు పేపర్లో దాసరి అన్నారు. బహుశా బెస్ట్ కమెడియన్ అవార్డు వస్తుందని మీ టపాతో నాకు అర్థమయింది.

sai krishna alapati said...

నేను మీ ఆర్టికల్స్ చాల చదివాను ..ఇండియా టుడే ,ఈనాడు లో ..మీరు Phd నీ తీసుకొన్నందుకు నా అభినందనలు ..
నాకు ఎందుకో మీరు బాల కృష్ణ కుటుంబానికి వ్యతిరేకమని పిస్తుంది ..బాగోని సినిమా బాలేదు అని రాయ వచ్చు ...కాని మీరు బృందావనం బాలేదు అని రాసి ఆరంజ్ బావుంది అని రాసారు .
రామ్ చరణ్ తేజ్ లో మీరు ఒక హీరో నీ చూడగలిగిన నప్పుడు మీరు బాల కృష్ణ నీ అంత గా ఎక్కిరించ అవసరం లేదు అని నా ఉద్దేశం ఇది ఏమి ఐన ...
ఆరంజ్ మీకు నచ్చింది జనాలకి నచ్చలేదు ..బృందావనం మీకు నచ్చలేదు జనాలకి నచ్చింది మీరు మిమ్మలిని ఒకసారి రివ్యూ చేసుకోవాలి ఏమో ..ఒక్కసారి ఆలోచించండి పెద్ద వారు ఇలా పక్షపాతం చూపించ వచ్చు అంటారా? ఇంకా మీ ఇష్టం ..