తారాగణం: సూర్య, సమంత, కెమేరా: సంతోష్ శివన్, సంగీతం: యువన్ శంకర్‌రాజా, మాటలు: శశాంక్ వెన్నెలకంటి, నిర్మాతలు: లగడపాటి శిరీషా శ్రీధర్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: లింగుస్వామి
సంతోష్ శివన్ (ఛాయాగ్రహణం), రాజీవన్ (కళాదర్శకత్వం), యువన్ శంకర్‌రాజా (సంగీతం), ఆంథోనీ (కూర్పు), లింగుస్వామి (దర్శకత్వం) - ఈ పేర్లన్నీ దక్షిణాది భారతీయ సినీ రంగంలోని అగ్ర శ్రేణి సాంకేతిక నిపుణులవని ప్రత్యేకించి చెప్పనక్కర లేదు. మరి, ఇంత మంది పనిచేసిన సినిమా ఎలా ఉండాలి? ఆ ఆశలు, అంచనాలతోనే ‘సికిందర్’ (తమిళ మాతృక ‘అంజాన్’)కు వెళితే తీవ్ర నిరాశకు గురవుతాం. అనేక పాత సినిమాల పోలికలున్న ఈ పాత తరహా చిత్రాన్ని ఇంత మంది మహామహులు కలసి వడ్డించిన వట్టి పాత చింతకాయ పచ్చడిగా ఫీలవుతాం.
కథ ఏమిటంటే...
వైజాగ్ నుంచి ముంబయ్‌కి వచ్చిన కృష్ణ (సూర్య) తన అన్న రాజూ భాయ్ (సూర్య) కోసం అన్వేషిస్తుంటాడు. ఆ క్రమంలో అన్నయ్యతో పరిచయమున్న మాఫియా వాళ్ళను కలుస్తాడు. అసలీ రాజూ భాయ్ ఎవరన్నది ఫ్లాష్‌బ్యాక్. మిత్రుడు చందు (విద్యుత్ జమాల్)తో కలసి ముంబయ్‌లో మాఫియా వ్యవహారాలు నడిపిన వ్యక్తి - రాజూ భాయ్. అలాంటి రాజూ భాయ్ అనుకోకుండా మరో మాఫియా నేత ఇమ్రాన్ (మనోజ్ బాజ్‌పాయ్)తో తలపడాల్సి వస్తుంది. అప్పుడేమైంది? ఆ కథ ఆచూకీ కనుక్కుంటూ వచ్చిన కృష్ణ ఏం చేశాడన్నది మిగతా సినిమా.
ఎలా నటించారంటే...
రాజూ భాయ్‌గా, చేతికర్ర సాయంతో కుంటుతూ నడిచే కృష్ణగా సూర్య భిన్నమైన హెయిర్‌స్టయిల్‌తో చూడడానికి బాగున్నారు. పాత్రకున్న పరిధిలో నటించడానికి ప్రయత్నించారు. చాలా రోజుల తరువాత తమిళంలో పెద్ద సినిమాతో పాగా వేయడానికి ప్రయత్నిస్తున్న సమంత ఈసారి అందాలు ఆరబోయడానికి కూడా వెనుకాడలేదు. బికినీడ్రెస్‌లోనూ ప్రేక్షకులకు కనువిందు చేశారు. విలన్లుగా మనోజ్ బాజ్‌పాయ్‌తో సహా సుపరిచిత ముఖాలు కొన్ని ఉన్నా, అవేవీ బలంగా ముద్ర వేసే పాత్రలు కావు. ఆ పాత్రలకు కథలో, కథనంలో కావాల్సినంత ప్రాముఖ్యమూ ఇవ్వలేదు.
ఎలా ఉందంటే...
మాఫియా నేపథ్యంలో స్నేహం, ద్రోహం అనే రెండు ప్రధానాం శాల చుట్టూ తిరిగే ఈ చిత్ర కథలో చాలా లోపాలే ఉన్నాయి. వైజాగ్ నుంచి హీరో వచ్చాడంటూ కథ మొదలవుతుంది. తెర మీద మాత్రం కన్యాకుమారి అని టైటిల్ చూపిస్తుంటారు. అలాగే, హీరోయిన్ పెద్ద పోలీస్ కమిషనర్ కూతురంటారు. పిల్లకు పెళ్ళి చేయాలని తాపత్రయపడే ఆ తండ్రి ఉన్నట్టుండి ఆమె ఎక్కడికో వెళ్లినా పట్టించుకోడు. ఇక, సంగీత విద్వాంసుడిగా బ్రహ్మానందం వేసిన కొద్ది క్షణాల పాత్రను మన శాస్త్రీయ సంగీతాన్ని అవహేళన చేసేలా చూపడం కళాప్రియులెవరూ సహించలేని విషయం. సినిమాలో కెమేరా, యాక్షన్ లాంటివి వేటికవి బాగున్నా, అన్నీ కలసి సమన్వయంతో పని చేయలేకపోవడం లోపమైంది. కోట్ల ఖర్చుతో దృశ్యాలు స్టయిలిష్‌గా తోచినా, విషయం తక్కువైన విజువల్ డ్రామాగా కనిపిస్తుంది. పైగా, దర్శకుడు తాను అనుకున్న ఆలోచన అనుకున్నట్లు రాసుకొని, రాసిందల్లా తీసేసి, సినిమాగా వదిలారా అనిపిస్తుంది. తీసుకున్న ప్రేమకథలో కానీ, ప్రతీకార గాథలో కానీ బలమైన ప్రాతిపదికలు, కొనసాగింపులు లేకపోవడం ఈ సినిమాకు మరో పెద్ద మైనస్.
కొసమెరుపు:
మూడు గంటల (కొద్ది నిమిషాలు తక్కువ) సినిమా అంతా చూశాక, ‘సికిందర్’ అనే టైటిల్ ఎందుకు పెట్టారా అని ఆలోచిస్తూ బయటకు రావడం ప్రేక్షకుల వంతు అవుతుంది.
బలాలు: స్టయిలిష్‌గా ఉన్న చిత్రీకరణ కెమేరా పనితనం, యాక్షన్ దృశ్యాలు సమంత అందాలు ఆరబోత కొన్ని పాటల రచన, చిత్రీకరణ
బలహీనతలు: పాత చింతకాయపచ్చడి కథ ఫస్టాఫ్ అయ్యేసరికే జరగబోయే సెకండాఫ్ కథ కూడా ప్రేక్షకుడికి అర్థమై పోవడం నీరసమైన స్క్రీన్‌ప్లే పదును తగ్గిన ఎడిటింగ్ బలహీనమైన విలన్ పాత్రచిత్రణ వినోదం శూన్యం.
- రెంటాల జయదేవ
(Published in 'Sakshi' daily, 16th Aug 2014, Saturday)
...................................
తోడుకునేవాళ్లకి తోడుకున్నంత
5 years ago
0 వ్యాఖ్యలు:
Post a Comment