జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Saturday, August 9, 2014

ఇది కుర్రగాలి పటం (సినిమా రివ్యూ - గాలిపటం)

పెళ్ళి చేసుకున్నంత మాత్రాన ప్రేమ లేనప్పటికీ, ఆ వైవాహిక బంధాన్ని కొనసాగించాలా? లేక ప్రేమను వెతుక్కుంటూ ఆ బంధాన్ని తెంచుకొని ముందుకు సాగిపోవాలా? ఇది ఎవరి వ్యక్తిగత అభిప్రాయాలు, అభిరుచిని బట్టి దీనికి సమాధానాలు వేర్వేరుగా ఉండవచ్చు. ఆధునికత, అవకాశాలు పెరిగి, ఆలోచన తీరు మారిన సమకాలీన సమాజంలో ఇది చర్చనీయాంశం కూడా! దీన్ని ఇతివృత్తంగా తీసుకొని అల్లుకొన్న కథా చిత్రం - ‘గాలిపటం’.

...............................
 చిత్రం - గాలిపటం, తారాగణం - ఆది, ఎరికా ఫెర్నాండెజ్, క్రిస్టినా అఖీవా, రాహుల్ రవీంద్రన్, పాటలు - సీతారామశాస్త్రి, భాస్కరభట్ల, సంగీతం - భీమ్స్ సెసిరోలియో, కెమేరా - బుజ్జి కె., ఎడిటింగ్ - రాంబాబు మేడికొండ, కథ - స్క్రీన్‌ప్లే - మాటలు - సంపత్ నంది, నిర్మాతలు - సంపత్ నంది, కిరణ్ ముప్పవరపు, విజయ్‌కుమార్ వట్టికూటి, దర్శకత్వం - నవీన్ గాంధీ
 ................................


  కథ ఏమిటంటే...

  కార్తిక్ (ఆది) ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. స్వాతి (ఎరికా ఫెర్నాండెజ్) కూడా అదే సంస్థలో పనిచేస్తున్న మరో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని. పైకి ఎంతో బాగున్నట్లుగా, ‘మేడ్ ఫర్ ఈచ్ అదర్’గా కనిపిస్తూ, ‘బెస్ట్ కపుల్ ఆఫ్ ది ఇయర్’గా ఎంపికైనప్పటికీ, వారిద్దరి మధ్య తగాదాలు తక్కువేమీ కాదు. చివరకు ఓ చిరు తగాదా పెద్దదై, వారిద్దరూ తమ మాజీ ప్రేమ కథలనూ, ప్రేమికులనూ గుర్తుచేసుకుంటారు.

  ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళితే... కార్తి, గతంలో పరిణతి అలియాస్ పారు (క్రిసినా అఖీవా)ను ప్రేమిస్తాడు. మరోపక్క స్వాతి కాలేజీ రోజుల్లో తనను గాఢంగా ప్రేమించి, తాను కాదనడంతో విదేశాలకు వెళ్ళిపోయిన ఆరవ్ రెడ్డి (‘అందాల రాక్షసి’ ఫేమ్ రాహుల్ రవీంద్రన్) గురించి ఆలోచిస్తుంది. ఆ పాత ప్రేమలు గుర్తొచ్చాక ఈ పెళ్ళి ఏమైందన్నది మిగతా కథ. భార్యను మోసం చేస్తూ, సహోద్యోగినితోనే సంబంధం పెట్టుకున్న హీరోయిన్ బావ (భరత్‌రెడ్డి)ది సినిమాలో వచ్చే ఉపకథ.

  ఎలా ఉందంటే...

  గతంలో వరుణ్‌సందేశ్ ‘ఏమైంది ఈ వేళ’ (2010), రామ్‌చరణ్ ‘రచ్చ’ (2012) చిత్ర దర్శకుడిగా పేరు తెచ్చుకున్న దర్శకుడు సంపత్ నంది మరో ఇద్దరితో కలసి ఈ చిత్ర నిర్మాణ బాధ్యతలు పంచుకొని, నిర్మాతగా కూడా మారారు. కథ, కథనం, మాటలు కూడా ఆయనవే. ఈ తరం దంపతులు ఎదుర్కొంటున్న ఒక సమస్యను కథగా ఎంచుకోవడంలో, దాన్ని ప్రథమార్ధంలో చెప్పిన తీరులో సమకాలీనత ప్రతిఫలించింది. కానీ, ఆ తరువాత ద్వితీయార్ధానికి వచ్చి, అసలు చర్చ మొదలయ్యేసరికి క్రమంగా పట్టు సడలింది. సాధారణ సినీ ఫార్ములా చిత్రాలకు భిన్నమైన ముగింపు అనుకొన్నప్పుడు, దానికి దారి తీసిన ఘట్టాలను కూడా మరికొంత బలంగా అల్లుకొని ఉంటే, కన్విన్సింగ్‌గా ఉండేదనిపిస్తుంది.

  నటనలో మరింత రాటుతేలాల్సిన యువ హీరో ఆది హుషారుగా నర్తించాడు. కథానాయికలిద్దరూ ఫరవా లేదనిపిస్తారు. కథలో వినోదం కోసం హీరో రూమ్మేట్లు, సర్వర్‌బాయ్ (సప్తగిరి) లాంటి చాలా పాత్రలనే సినిమాలో ఉంచారు. ప్రథమార్ధంలో వాళ్ళ సంభాషణలు, చేష్టలు కొన్నిచోట్ల అతిగా అనిపించినా, కుర్రకారును నవ్విస్తాయి. ‘‘అమ్మాయిలు ఆర్టీసీ బస్సు లాంటివాళ్ళు... ఒకటిపోతే ఒకటి వస్తాయి’’ (హీరో), ‘‘మీ మగాళ్ళు ఆటో లాంటివాళ్ళు... ఒకటి పిలిస్తే పది వస్తాయి’’(హీరోయిన్) లాంటి కొన్ని పంచ్ డైలాగులు హాలులో బాగా పేలతాయి. కానీ వచ్చిన చిక్కేమిటంటే, అన్ని పాత్రలూ పంచ్‌లు మాట్లాడడానికే మాట్లాడుతున్నట్లు ఒకే రకమైన టెంపోతో డైలాగులుండడం! దాంతో, ఒక డైలాగ్‌ను విని ఆనందించి, ఆస్వాదించే లోగానే మరో డైలాగ్ మీదకొచ్చి పడిపోతుంటుంది.

చాలాభాగం సగటు తెలుగు సినిమాల్లో లాగానే ఫ్లాష్‌బ్యాక్ చెప్పేది హీరో పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి అయినా, అందులో హీరోయిన్ కథ కూడా వచ్చేస్తూ ఉంటుంది. అదెలాగని అడగకూడదు... అంతే లెమ్మని సరిపెట్టుకోవాలి. భర్తతో తన సంసారాన్ని చక్కదిద్దుకోవడానికి హీరోయిన్ అక్క పాత్ర సర్దుకుపోతుంది (తెరపై ఎఫెక్టివ్‌గా ఉన్న ఘట్టాల్లో అది ఒకటి) కానీ, తీరా క్లైమాక్స్‌లో చెల్లెలిని మాత్రం సర్దుకోవద్దని చెబుతుంది. ఇక, బామ్మలతో తాగించడం, పిల్లాడితో మరీ అతిగా మాట్లాడించడం, బాత్రూమ్‌లో నుంచి మూలుగుల లాంటి వాటిని సగటు ప్రేక్షకులు ఎంతవరకు జీర్ణించుకుంటారో చెప్పలేం. అవి ప్రేక్షకుల స్థాయిని తక్కువగా అంచనా వేసి, సినిమా స్థాయిని తగ్గించేవే తప్ప, పెంచేవి కావు.

  కెమేరా, సంగీతం లాంటివి కథకు తగినట్లుగానే ఉన్నాయి. అద్నాన్ సామీ గొంతులో వచ్చే ‘ఏం హుషారు..’ పాట వెరైటీగా వినిపిస్తుంది. అయితే, ఒకటి రెండు చోట్ల పాటలు కథాగమనానికి అడ్డు పడ్డాయి. ద్వితీయార్ధంలో వచ్చే ‘జబర్దస్త్’ రిహార్సల్ సీన్ కాలక్షేపానికే తప్ప, కథలోని ప్రధానాంశంపై చర్చను తరువాతి దశకు తీసుకువెళ్ళేవిగా అనిపించవు. స్క్రిప్టు దశలో కాకపోయినా, కనీసం చిత్రీకరణ తరువాతైనా వాటిని ఎడిటింగ్ చేస్తే, బిగువుగా ఉండేది. ఏతావతా, హిందీ చిత్రం ‘షాదీ కే సైడ్ ఎఫెక్ట్స్’ ప్రేరణ ప్రారంభంలోనే కనిపించే ఈ చిత్రంలో ఎంచుకున్న కథకు తగ్గట్లే తొలి గంటంబావులోనే అయిదు ప్రణయ ఘట్టాలున్నాయి. సెన్సార్ వారి ఆడియో, వీడియో కట్‌లతో ‘ఏ’ సర్టిఫికెట్ అందుకున్న ఈ రెండుబావు గంటల చిత్రం ఎంచుకున్న కథ రీత్యా కుటుంబాలకు సంబంధించినదైనా, ఆస్వాదించేది కుర్రకారే అనిపిస్తుంది. ద్వితీయార్ధంలోని కథనలోపాలు లేకుండా ఉంటే ఈ ‘గాలిపటం’ మరింత బాగా ఎగిరేదనిపిస్తుంది.

 - రెంటాల జయదేవ

 బలాలు - 1. ఎంచుకున్న కథాంశం 2. ఆధునిక సమాజంలో కొన్ని వర్గాల్లో జరుగుతున్నవి ధైర్యంగా చూపడం 3. గుర్తుండిపోయే కొన్ని డైలాగులు

 బలహీనతలు - 1. కన్విన్సింగ్‌గా లేని కథనం 2. రాసుకున్న సన్నివేశాలపై అమిత ప్రేమ మింగేసిన ఎడిటింగ్ 3. రచయిత ప్రభావం మితి మీరి, పాత్రలన్నీ ఒకేలా మాట్లాడేయడం 4. కుటుంబ ప్రేక్షకుల్ని ఇబ్బంది పెట్టే ఘట్టాలు
 ...........................................

(Published in 'Sakshi' daily, 9th Aug 2014, Saturday)
................................................

0 వ్యాఖ్యలు: