జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Tuesday, January 28, 2014

కాంతి నింపిన 'మిణుగురులు' (సినిమా రివ్యూ)

(This review was telecasted in 10tv)
     
  టాలీవుడ్ లో ఈమధ్య కాలంలో వాస్తవిక, సామాజిక అంశాల నేపథ్యంలో వచ్చిన చిత్రాలు చాలా తక్కువ. అడపాదడపా ఒకటి అరా వచ్చినా అవి వాస్తవికతకు దూరంగా ఉండడంతో ప్రేక్షకులకు కనెక్ట్ అవడంలో విఫలమవుతున్నాయి. దీనికి తోడు కథలో దమ్ము లేకపోవడంతో ఇలాంటి సినిమాలు ఆదరణకు గురవడం లేదు. ఈ నేపథ్యంలో అయోధ్యకుమార్ సామాజిక స్ఫృహ కలిగిన చిత్రంగా, హాస్టళ్ విద్యార్థులు పడుతున్న ఇబ్బందులను, సమస్యలను ప్రధానంగా తీసుకొని 'మిణగురులు' అనే చిత్రాన్ని తెరకెక్కించాడు. ఎన్నో అంత‌ర్జాతీయ చ‌ల‌న చిత్రోత్స‌వాల్లో అవార్డ్స్ అందుకుని రిలీజ్ కు ముందే హైప్ క్రియేట్ చేసిన ఈ సినిమా ఈ శుక్రవారం మన ముందుకు వచ్చింది. అశిష్ విద్యార్థి, సుహాసిని ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ అంథ విద్యార్థుల సమస్యలను కరెక్ట్ గా చూపించగలిగిందా..? లేదా..? అనేది చూద్దాం.

కథ విషయానికి వస్తే..
     
సంక్షేమ హాస్టళ్లలో అరకొర సౌకర్యాల మధ్య బతుకీడుస్తున్న అంధ విద్యార్థుల జీవితం చుట్టూ అల్లుకున్న కథే 'మిణుగురులు'.. దర్శకుడు కావాలనుకునే రాజు (దీపక్ సరోజ్) ప్రమాదవశాత్తు జరిగిన ఓ ప్రమాదంలో గాయపడి అంధుడిగా మారతాడు. తాగుడుకు బానిసైన అతని తండ్రి... రాజుని బ్లైండ్ హాస్టల్ లో చేర్చుతాడు. ఆ హాస్టల్ వార్డెన్ నారాయణ(ఆశిష్ విద్యార్థి) తన స్వార్థం కోసం ప్రభుత్వ నిధులను తనే వాడుకుంటూ.. అంధ విద్యార్థులను ఆకలికి మాడ్చుతుంటాడు. ఇదేంటని అడిగిన విద్యార్థులను చితకబాదుతాడు. చివరకు హాస్టల్ లోని ఓ విద్యార్థినిని ఓ కామాంధుడికి అమ్మే ప్రయత్నం చేస్తాడు. దీంతో ఎలాగైన వార్డెన్ ఆకృత్యాలను బయట పెట్టాలనుకుంటాడు రాజు. దీనికి గాను రాజు చేసిన ప్రయత్నాలేంటి..? నారాయణ చేసే ఆకృత్యాలు బయటపడ్డాయా..? అంధకారంలో ఇబ్బందులు పడుతున్న అంధ విద్యార్థుల్లో కాంతిని నింపిందా..? అనేది మిగతా కథ.


విశ్లేషణ:..
     
ప్రభుత్వ నిర్లక్ష్యం, వ్యవస్థలోని లోపాలు, అవినీతి...వికలాంగులకు శాపంగా మారుతున్నాయి. నరకాన్ని తలపించే సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో అంధ విద్యార్థులు పడుతున్న అవస్థలను కళ్లకు కట్టింది 'మిణుగురులు' సినిమా. ప్రభుత్వం ఇస్తున్న నిధులను అవినీతి పరులైన అధికారులు తమ స్వార్థానికి వాడుకుంటూ... ప్రపంచాన్ని చూడలేని పిల్లల జీవితాలతో ఆడుకుంటున్నారు. ఈ అంశాలను కథగా ఎంచుకుని మిణుగురులు సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు అయోధ్య కుమార్. నిజాయతీతో సినిమాను తెరకెక్కించి చలన చిత్రానికి వినోదానికి మించిన సార్థకత చేకూర్చాడు.

    మిణుగురులు సినిమా క్రెడిట్ అంతా తెరకెక్కించిన దర్శకుడికే చెందుతుంది. హాస్టళ్లలో అంధ విద్యార్థుల బాధలను బాగా అధ్యయనం చేసిన దర్శకుడు సినిమాను రూపొందించడంలో సక్సెస్ అయ్యాడు. వాళ్ల సమస్యలను సినిమా స్క్రీన్ ప్లేలో పర్ ఫెక్ట్ గా చూపగలిగాడు. ప్రతి సన్నివేశం ఒకదానితో ఒకటి లింక్ ఉండడమే కాకుండా సినిమా అంతా సహజంగా ఉంటుంది. అంధుల కష్టాలు ఎలా ఉంటాయో కళ్లకు కట్టినట్లు చూపిండంతో సినిమాను చూసిన ప్రేక్షకులు చివరకు కన్నీరు పెడుతూ బయటకు వస్తారు. అయితే సినిమాలో కొన్ని మైనస్ లు ఉన్నా.. వాస్తవికతకు దగ్గరగా ఉండడంతో అవి పెద్దగా కనిపించవు.

    ఆశిష్ విద్యార్థి కెరీర్ లో బెస్ట్ ఫర్మార్మెన్స్ ఇది. కలెక్టర్ పాత్రలో సుహాసినీ కనిపించిన కొంత సేపైనా...పాత్రకు నిండుదనం తెచ్చింది. రాజు పాత్రలో దీపక్ సరోజ్ ఆకట్టుకున్నాడు. మిగతా అంధ విద్యార్థుల నటన, ఫిల్మ్ మేకింగ్ అంతా అత్యంత సహజంగా ఉన్నాయి. జోస్య భట్ల సంగీతం, రీరికార్డింగ్ సినిమాపై ఆసక్తిని పెంచింది. అయితే దీనిలో నటించిన అంధ విద్యార్థులందరూ.. నిజ జీవితంలో కూడా అంధ విద్యార్థులే. అయితే అందరి ప్రశంసలు అందుకునే ఇలాంటి సినిమాలు.. చివరకు ఆర్థికంగా నష్టాలపాలు అయ్యే ప్రమాదం పొంచి ఉండటమే తెలుగు చిత్ర పరిశ్రమలో అసలైన విషాధం.

    నిజ జీవితంలో ఎంతో మంది అంధ విద్యార్థులు తమ హాస్టళ్లలో అనేక సమస్యలు ఎదుర్కొంటూ అంధకారంతో చదువులనుకొనసాగిస్తుంటారు. వారిలో.. దర్శకుడు ఆయోద్య కుమార్ ఈ చిత్రం ద్వారా వెలుగులు నింపే ప్రయత్నం చేశాడని చెప్పవచ్చు.

గమనిక: వాస్తవికతతో, సామాజిక దృక్పథంతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని రేటింగ్ నుంచి మినహాయిస్తున్నాము.
....................................

0 వ్యాఖ్యలు: