జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Sunday, January 12, 2014

అక్కినేనిపై అన్నీ వదంతులే!

-కుటుంబ వర్గాల ప్రకటన

  అగ్ర సినీనటుడు అక్కినేని నాగేశ్వరరావు ఆరోగ్యం విషమంగా ఉందంటూ వస్తున్న వార్తలు వట్టి వదంతులేననీ, అభిమానులెవరూ వాటిని నమ్మవద్దనీ ఆయన కుటుంబ సభ్యులు ప్రకటించారు. అక్కినేని కులాసాగానే ఉన్నారనీ, క్యాన్సర్‌ ఆపరేషన్‌ అయిన తరువాత కొద్దిగా నీరసంగా ఉన్నారే తప్ప మరేమీ లేదనీ ఆయన కుమారుడు, మరో సినీ హీరో నాగార్జున బుధవారం నాడు ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. రోజూ తాను దగ్గరుండి మరీ ఆయన యోగ క్షేమాలు చూసుకుంటున్నట్లు తెలిపారు. 

నిజానికి, తొలితరం తెలుగు హీరో ఏయన్నార్‌ ఆరోగ్యం విషమించిందంటూ మంగళవారం రాత్రి (January 7) బాగా పొద్దుపోయినప్పటి నుంచి వదంతులు వ్యాపించాయి. కొన్ని వెబ్‌సైట్లు ఆయన ఆరోగ్యం విషమించిందంటే, సినీ - టీవీ రంగానికి చెందిన ఇంకొందరు అత్యుత్సాహవంతులు ఏకంగా 'జరగరానిది జరిగిపోయింద'ంటూ ఫేస్‌బుక్‌లో అవాకులూ చెవాకులూ పెట్టేశారు. దీంతో, ఒక్కసారిగా సంచలనం చెలరేగి, ఈ కథనాల్లోని నిజానిజాలను తెలుసుకొనేందుకు బుధవారం (January 8) తెల్లవారుజాము వరకు పలువురు పత్రికా విలేఖరులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. అయితే, అవన్నీ వట్టి వదంతులేనని తేలింది. మరోపక్క బుధవారం ఉదయం పత్రికల్లోనూ ఈ వదంతుల వార్తలు రావడంతో, అభిమానుల్లో ఆందోళన పెరిగింది. ఈ పరిస్థితుల్లో అక్కినేని కుమారుడు నాగార్జున, మనుమలు సుమంత్‌, అఖిల్‌ కూడా సామాజిక సంబంధాల నెట్‌వర్క్‌ల ద్వారా వదంతులను ఖండిస్తూ, ప్రకటనలు చేశారు. అభిమానుల ఆశీర్వాదం వల్ల అక్కినేని ఆరోగ్యంగానే ఉన్నారని సుమంత్‌ పేర్కొన్నారు. 

తెలుగు సినీ పరిశ్రమలో వరుసగా సంభవిస్తున్న మరణాలు, మరోపక్క ఉదయకిరణ్‌ అనుమానాస్పద ఆత్మహత్యా ఘటనతో ఓ అగ్ర హీరో కుటుంబంపై జనాగ్రహం, ఉదరు కిరణ్‌ అంతిమయాత్రలో వినపడ్డ నినాదాల నేపథ్యంలో ఈ వదంతులు రావడం గమనార్హం. 

ఇది ఇలా ఉండగా, జీర్ణవ్యవస్థకు సంబంధించిన క్యాన్సర్‌ వ్యాధితో కొంతకాలంగా అక్కినేని బాధపడుతున్నారు. కుమారుడు నాగార్జున, మనుమడు నాగచైతన్యలతో కలసి తాను నటిస్తున్న 'మనం' చిత్రం సెట్స్‌లో గడచిన అక్టోబర్‌ 19న విలేఖరుల సమావేశం పెట్టి మరీ, ఆయన తన అనారోగ్యం విషయాన్ని స్వయంగా ప్రకటించారు. అయినా అభిమానుల ఆశీర్వాదంతో ముందుకు సాగుతానని ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా, అదే రోజున షూటింగ్‌లో అసౌకర్యానికి గురై, ఆసుపత్రిలో చేరడంతో అక్కినేనికి శస్త్రచికిత్స కూడా జరిగింది. శస్త్రచికిత్స తరువాత కొద్దిగా కోలుకున్న ఏయన్నార్‌ సినిమాలో మిగిలిన తన పాత్ర తాలూకు సన్నివేశాల షూటింగ్‌లో పాల్గొన్నారు. ఆరోగ్యం అంతగా సహకరించకపోవడంతో, ఇంటి వద్దే చేసిన ప్రత్యేక ఏర్పాట్లతో స్వయంగా డబ్బింగ్‌ కూడా చెప్పేశారు. అయితే, ఆయన ఆరోగ్యం గురించి అధికారిక సమాచారం పెద్దగా లేకపోవడంతో, ఊహాగానాలు రేగుతున్నాయి. 


నీరసించినా... టీవీ చూస్తూ...
అత్యంత విశ్వసనీయ వర్గాల నుంచి 'ప్రజాశక్తి' సేకరించిన సమాచారం మేరకు, 90 ఏళ్ళ ఏయన్నార్‌ శస్త్రచికిత్స, ఆ వెంటనే క్యాన్సర్‌కు చేస్తున్న కెమోథెరపీ లాంటి చికిత్సల వల్ల బాగా నీరసంగా ఉన్నారు. ఇంట్లోనే ఉంటున్న ఆయన బాగోగులు చూసేందుకు ప్రత్యేకంగా నర్సును కూడా పెట్టారు. బలహీనంగా, కళ్ళు తిరుగుతున్నట్లు అనిపిస్తుండడంతో చక్రాల కుర్చీని వాడుతున్నారు. ఎక్కువగా బెడ్‌ రెస్ట్‌ తీసుకుంటున్నారు. అయితే, అదే సమయంలో పాత సినిమాలు, టీవీలో కార్యక్రమాలు చూస్తూ వీలైనంత ఉల్లాసంగా సమయం గడిపేందుకు ప్రయత్నిస్తున్నారు. రెండు రోజుల క్రితం 'నమో వెంకటేశా' సినిమా కూడా చూస్తూ, ఆయన నవ్వుతూ గడిపారు.

 ''తాతయ్య ఎప్పటిలాగే ఉత్సాహంగా ఇంట్లోనే సినిమాలు చూస్తున్నారు. ఆయన అస్వస్థతకు గురి కాలేదు'' అంటూ అఖిల్‌ బుధవారం చేసిన ప్రకటన కూడా ఆ విషయాన్ని బలపరుస్తోంది. అయితే, నాగార్జునతో సహా కుటుంబ సభ్యులందరూ వీలైనంత సేపు అక్కినేనితో గడపడానికే ప్రయత్నిస్తున్నారు. ఖాళీ సమయమంతా ఆయనతోనే గడపడానికీ, మాటామంతీ జరపడానికీ నాగార్జున మొగ్గుచూపుతున్నారు. కాగా, ఏటా అక్కినేని కుటుంబం జనవరిలో జరిపే 'ఏయన్నార్‌ జాతీయ అవార్డు' ప్రకటన, కార్యక్రమం వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. ఏమైనా, ఈ నేపథ్యంలో వైద్య చికిత్సలు, కుటుంబ సభ్యుల నైతిక మద్దతుతో క్యాన్సర్‌ను జయించి, అక్కినేనిని మళ్ళీ జనంలోకి రావాలని అభిమానులు, సినీ ప్రియులు కోరుకుంటున్నారు.

(Published in PrajaSakti daily, 9th Jan 2014, Thursday, Page No.8)
............................................

0 వ్యాఖ్యలు: